మనం కొన్ని అంకెల్ని అంతగా ఇష్టపడం. అందులో ముఖ్యమయింది ఏడు. అందుకే గ్రామాల్లో ఆ పదం కూడా వాడరు. ధాన్యం బస్తాలైనా, ఏ వస్తువలైనా లెక్కించేటప్పుడు ఆ పదం పలకరు. ఆరునొకటి అంటారు. అదే సెంటిమెంట్ తూర్పుగోదావరి జిల్లాలోనూ వుంది. కోరుకొండ (మం) బుచ్చెంపేట పంచాయతీ ఏడో వార్డు ఎన్నికకు వింత పరిస్థితి నెలకొంది.
వరుసగా మూడోసారి వార్డులో పోటీకి ఎలాంటి నామినేషన్లు రాలేదు. ఏడో వార్డ్ కి మెంబర్ అయితే ప్రాణగండం ఉందంటూ సెంటిమెంట్ వుండడంతో అక్కడ పోటీచేయాలంటే వివిధ పార్టీలనేతలు జంకుతున్నారు. గతంలో వార్డులో పోటీ చేసి గెలుపొందిన ముగ్గురు మెంబర్లు అనారోగ్యంతో మృతి చెందడంతో ఈ సెంటిమెంట్ కి బలం చేకూరింది. ఏకగ్రీవంగా వార్డు మెంబర్ అయ్యే అవకాశం ఉన్నా ముందుకు రావడం లేదు వార్డులో ఓటర్లు.
ఈ ఏడాది ఫిబ్రవరి, మార్చ్ నెలల్లో రెండుసార్లు, తాజాగా మరోసారి వార్డు ఎన్నికకు ఏర్పాట్లు చేశారు అక్కడి అధికారులు. ఏకగ్రీవం అయ్యే అవకాశం ఉన్నా చావు సెంటిమెంట్ తో మరోసారి ఎవరూ ముందుకు రాలేదు. సాయంత్రం ఐదు గంటలకు ముగిసింది నామినేషన్ గడువు. కానీ ఒక్కటంటే ఒక్కటి కూడా నామినేషన్ వేయలేదు. మూడోసారి నిల్ నామినేషన్ అని నివేదిక సిద్ధం చేస్తున్నారు ఎన్నిక రిటర్నింగ్ అధికారి.
వార్డు మెంబర్ కి ప్రాణగండంపై అనేది అపోహ మాత్రమే అని గ్రామంలో పెద్దలు, విద్యావంతులకు విజ్ఞప్తి చేశారు అధికారులు. అయినా వారిలో మార్పు రాలేదు. సెంటిమెంట్ నే వారు నమ్ముతున్నారు. 2009, 2013, 2019 పంచాయతీ ఎన్నికల్లో ఏడో వార్డు మెంబర్లయిన వారు మృతిచెందారు. అనారోగ్యంతో మృతి చెందారు అప్పటి వార్డు సభ్యులు. బేలే సోమేశ్వర్రావు, కొమరా ఆదామ్ , ఎనుగంటి కొండలరావులు అనారోగ్యంతో కన్నుమూశారు. కానీ అక్కడ పొటీచేయడం ఎందుకు, ప్రాణాలు వదలడం ఎందుకని జనం అసలు బరిలోకే రావడం లేదు. దీంతో ఏడోవార్డు ఖాళీగానే వుండిపోతోంది.