(అక్టోబర్ 5న వాగ్దానం
కు 60 ఏళ్ళు)
తెలుగు నాట నవలానాయకునిగా జేజేలు అందుకున్నారు నటసమ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు. ఆరంభంలో బెంగాలీ నవలలతోనే అక్కినేని పలు విజయాలు చవిచూశారు. దేవదాసు
బెంగాలీ నవల ఆధారంగా రూపొందిన చిత్రంతోనే ఏయన్నార్ కు మహానటుడు అన్న ఇమేజ్ లభించింది. దాంతో వరుసగా కొన్ని బెంగాలీ నవలల ఆధారంగా తెరకెక్కిన చిత్రాలలో ఏయన్నార్ నటించారు. అవి సంతృప్తి కలిగించాయి. ఈ నేపథ్యంలో దేవదాసు
నవల రచయిత శరత్ బాబు రాసిన దత్త
నవల ఆధారంగా ప్రముఖ గీత రచయిత ఆచార్య ఆత్రేయ స్వీయ దర్శకత్వంలో వాగ్దానం
చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రాన్ని కవితాచిత్ర పతాకంపై కె.సత్యనారాయణ, డి. శ్రీరామమూర్తి నిర్మించారు. ఇందులో కృష్ణ కుమారి నాయికగా నటించారు. ఈ చిత్రం 1961 అక్టోబర్ 5న విడుదలయింది.
వాగ్దానం
కథ ఏమిటింటే- విశ్వనాథం, రంగనాథం, జగన్నాథం అనే ముగ్గురు చిన్ననాటి మిత్రులు ఉంటారు. వారిలో విశ్వనాథం జమీందార్. తమ ఊరి అభివృద్ధి గురించి తరచూ చర్చించుకుంటూ ఉంటారు. ఊళ్ళో ఓ ఆసుపత్రి ఉంటే బాగుంటుందని భావిస్తారు. విశ్వనాథం ఖర్చుతో జగన్నాథం కొడుకు సూర్యంను డాక్టర్ చదివించాలని భావిస్తారు. తనయుడు డాక్టర్ పూర్తి చేసి వస్తున్నాడన్న వార్త జగన్నాథమ్ కు తెలుస్తుంది. అయితే దురదృష్టవశాన జగన్నాథం మరణిస్తాడు. అది చూసి తట్టుకోలేక విశ్వనాథం కూడా కన్నుమూస్తాడు. దాంతో విశ్వనాథం కూతురు విజయ బాధ్యత రంగనాథం తీసుకుంటాడు. ఆమెకు మైనారిటీ తీరే వరకు ఆస్తిపై సర్వహక్కులూ ఆయనవే. ఎలాగైనా విజయను తన కొడుకు చంద్రంకు ఇచ్చి పెళ్ళి చేయాలనుకుంటాడు.
ఇచ్చిన మాట ప్రకారం సూర్యం వచ్చి ఊరిలో ఆసుపత్రి పెడతాడు. సూర్యం అంటే విజయకు సదభిప్రాయం కలుగుతోందని తెలిసి, ఎప్పటికప్పుడు అతనిపై నిందలు మోపుతూ ఉంటారు రంగనాథం, అతని కొడుకు. సూర్యం మంచితనం చూసి విజయ అతణ్ణి ప్రేమిస్తుంది. కానీ, సూర్యంకు ఆ ఉద్దేశం ఉండదు. ఎందుకంటే అతనికి రంగనాథం తన కొడుకు చంద్రం, విజయ ప్రేమించుకుంటున్నారని చెప్పి ఉంటాడు. సూర్యం ఊళ్ళో ఉంటే తమ ఆటలు సాగవని భావిస్తారు రంగనాథం, చంద్రం. దాంతో అతణ్ణి ఊరి నుండి వెళ్ళగొట్టే ప్రయత్నం చేస్తారు. ఆసుపత్రి ఖాళీ చేయమంటారు. సూర్యం వెళ్ళి విజయను అది ఆపమని చెబుతాడు. ఆమె అంగీకరించదు. దాంతో విజయ తండ్రి తనకు చదువుకొనే రోజుల్లోరాసిన ఉత్తరాలు చూపిస్తాడు. ఆ దస్తూరి తన తండ్రిదే అని తెలుసుకున్న విజయ ఉత్తరాలు చదివి, అసలు విషయం తెలుసుకొని కుమిలిపోతుంది. నిజం తెలియక నిందలు వేశానని బాధపడుతుంది. రంగనాథం అసలు స్వరూపం తెలుసుకున్నవిజయకు మైనారిటీ కూడా తీరివుండడంతో ఆస్తి మొత్తం సూర్యం పేరున రాసిస్తుంది. సూర్యం వద్దని వారిస్తాడు. ఆమె చావబోతుంది. కాపాడతాడు సూర్యం. చివరకు విజయ మేలు కోరే రామదాసు పంతులు ఓ చిన్ననాటకం ఆడి సూర్యం, విజయ పెళ్ళి జరిపిస్తాడు. దాంతో రంగనాథం, అతని కొడుకు చంద్రం నిప్పులు కక్కుతారు. ఊరి జనమంతా చీవాట్లు పెట్టడంతో అక్కడ నుండి వెళ్ళిపోతారు. అలా కథ సుఖాంతమవుతుంది.
ఈ చిత్రంలో సూర్యంగా ఏయన్నార్, విజయగా కృష్ణకుమారి నటించారు. మిగిలిన పాత్రల్లో నాగయ్య, గుమ్మడి, చలం, రేలంగి, పద్మనాభం, గిరిజ, సూర్యకాంతం, సురభి కమలాబాయ్ అభినయించారు. ఈ చిత్రానికి అనుకరణ ఆచార్య ఆత్రేయ, బొల్లిముంత శివరామకృష్ణ చేయగా, ఇందులోని శ్రీనగజా తనయం...
అంటూ మొదలయ్యే హరికథతో పాటు, కాశీపట్నం చూడరబాబూ...
అనే పాటను కూడా శ్రీశ్రీ రచించారు. తప్పట్లో తాళాలో...
పాటను నార్ల చిరంజీవి రాశారు. ఈ చిత్రం ద్వారానే దాశరథి తొలిసినిమా పాట వినిపించింది. ఇందులో నా కంటి పాపలో నిదుర పోరా...
పాటను దాశరథి కలం పలికించింది. మిగిలిన నాలుగు పాటలు ఆత్రేయ రాశారు. వాటిలో వన్నే చిన్నెలన్నీ ఉన్నచిన్నదానివే...
, బంగరు నావ...
, వెలుగు చూపవయా...`,
మా కిట్టయ్య పుట్టినదినం…పాటలు అలరించాయి. ఈ చిత్రానికి పెండ్యాల సంగీతం సమకూర్చారు. ఆచార్య ఆత్రేయ దర్శకత్వంలో రూపందిన ఏకైక చిత్రం `వాగ్దానం`. దాశరథి తొలిపాట వినిపించిన చిత్రమూ ఇదే. ఇక హరికథల్లో ఈ నాటికీ మేటిగానిలచిన
శ్రీనగజా తనయం…` పాట చోటు చేసుకోవడం మినహాయిస్తే, ఈ చిత్రానికి సంబంధించిన విశేషాలేమీ లేవు.
వాగ్దానం` బాక్సాఫీస్ వద్ద ఘోరపరాజయం చవిచూసింది.