NTV Telugu Site icon

55 ఏళ్ళ ‘అడుగుజాడలు’

(సెప్టెంబర్ 29న యన్టీఆర్ ‘అడుగుజాడలు’కు 55 ఏళ్ళు)

నటరత్న యన్టీఆర్, నటచక్రవర్తి యస్వీఆర్ డాక్టర్లుగా నటించిన చిత్రం ‘అడుగుజాడలు’. తాపీ చాణక్య దర్శకత్వంలో నవజ్యోతి ఫిలిమ్స్ పతాకంపై ఎమ్.సాంబశివరావు, జి.వందనం ‘అడుగుజాడలు’ నిర్మించారు. ఈ చిత్రంలో జమున నాయికగా నటించారు. 1966 సెప్టెంబర్ 29న ఈ సినిమా విడులయింది.

‘అడుగుజాడలు’ కథ విషయానికి వస్తే- డాక్టర్ కృష్ణ ఎంతో మేధావి. తన వైద్యంతోనూ, మంచితనంతోనూ దుర్మార్గులను సైతం సన్మార్గంలో నడిపిస్తూ ఉంటారు. పోలియోకు అప్పట్లో తగిన వైద్యం ఉండదు. దానిని డాక్టర్ కృష్ణ కనిపెట్టాలని ప్రయత్నిస్తాడు. ఆయన డైరీలో కొన్ని విషయాలు కోడ్ భాషలో నిక్షిప్తం చేస్తారు. ఓ సారి ఆయనకు ఊపిరితీసుకోలేనంత ఆయాసం వస్తుంది. ఆక్సిజన్ పెట్టాలనుకుంటారు. అదే సమయంలో ప్రమాదానికి గురయిన డాక్టర్ విజయ్ అనే యువకునికి ఆక్సిజన్ వినియోగిస్తారు. కృష్ణ మరణిస్తాడు. దాంతో అందరూ విజయ్ ని నేరస్థునిలా చూస్తూంటారు. డాక్టర్ కృష్ణ కూతురు పార్వతి మొదటి నుంచీ విజయ్ ను ద్వేషిస్తూనే ఉంటుంది. అయినా, తన వల్లే డాక్టర్ కృష్ణ మరణించాడని భావించి, ఆయన ఆసుపత్రిలో రోగులకు వైద్యం చేయాలనుకుంటాడు. చివరకు కోడ్ లాంగ్వేజీలో ఉన్న డాక్టర్ కృష్ణ పరిశోధనను డాక్టర్ విజయ్ డీ కోడ్ చేస్తాడు. ఆ విషయం పార్వతికి చెప్పాలని వస్తే, ఆమె అతణ్ణి చూడటానికి ఇష్టపడదు. అతనికి దూరంగా ఆమె వెళ్తూ ప్రమాదానికి గురవుతుంది. ఆమెకు చూపు పోతుంది. పార్వతికి విజయ్ సపర్యలు చేస్తూంటాడు. తానెవరో ఆమెకు తెలియనివ్వడు. శేఖర్ అనే పేరుతో ఆమెకు సేవ అందిస్తాడు. డాక్టర్ కృష్ణ డైరీని దొంగిలించి డాక్టర్ విజయ్ మందు తయారు చేశాడని మెడికల్ కౌన్సిల్ కు ఫిర్యాదు చేస్తుంది పార్వతి. కౌన్సిల్ విజయ్ ను డాక్టర్ వృత్తి నుండి తొలగిస్తుంది. చివరకు కృష్ణ డైరీలో ఉన్నది మానవత్వం గురించిన విషయాలేనని విజయ్ కోడ్ భాషను చదివి వినిపిస్తాడు. అంతకాలం తనకు సేవ చేసింది కూడా విజయ్ అని పార్వతి తెలుసుకుంటుంది. కౌన్సిల్ మళ్ళీ విజయ్ ని డాక్టర్ గా కొనసాగమని చెబుతుంది. విజయ్ కారణంగానే పార్వతికి కనుచూపు వస్తుంది. దాంతో కథ సుఖాంతమవుతుంది.

డాక్టర్ విజయ్ గా యన్టీఆర్, డాక్టర్ కృష్ణగా ఎస్వీఆర్, పార్వతిగా జమున నటించారు. ఈ చిత్రంలో రేలంగి, చిత్తూరు వి.నాగయ్య, ముక్కామల, మిక్కిలినేని, చలం, సురభి బాలసరస్వతి, రమాప్రభ ఇతర పాత్రల్లో కనిపించారు. ఈ చిత్రానికి మాస్టర్ వేణు సంగీతం సమకూర్చగా, కొసరాజు, శ్రీశ్రీ, ఆరుద్ర, సి.నారాయణ రెడ్డి పాటలు రాశారు. ఇందులోని “తూలీ తూలని తూరుపు గాలి…”, “మనసే మధుగీతమై…”, “అంత కోపమైతే…”, “భయము వదలేనులే…”, “మల్లెలు కురిసిన… చల్లని వేళలో… “, “మూగవోయిన హృదయవీణ…” పాటలు అలరించాయి.

‘అడుగుజాడలు’ చిత్రం మొదట్లో పెద్దగా ఆకట్టుకోలేకపోయినా, తరువాతి రోజుల్లో జనాన్ని అలరించింది. ఈ కథలోని ప్రధానాంశమైన నాయకుణ్ణి నాయిక కడదాకా ద్వేషించడం, ఆమెకు కళ్ళు పోవడానికి తాను కారణమయ్యానని హీరో సేవలు చేయడం అన్న అంశంతో తరువాతి కాలంలో ‘తుల్లాద మనమ్ తుల్లుమ్’ తమిళ చిత్రం రూపొందింది. అదే కథతో తెలుగులో ‘నువ్వువస్తావని’ తెరకెక్కి ఘనవిజయం సాధించింది.