(సెప్టెంబర్ 24తో ‘ప్రేమనగర్’కు 50 ఏళ్ళు పూర్తి)
నవలా నాయకునిగా జనం మదిలో నిలచిపోయిన నటసమ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు నటజీవితంలో మరపురాని నవలాచిత్రాలెన్నో! వాటిలో ప్రేమనగర్
స్థానం ప్రత్యేకం! సురేశ్ మూవీస్ పతాకంపై కె.ఎస్.ప్రకాశరావు దర్శకత్వంలో డి.రామానాయుడు ప్రేమనగర్
ను నిర్మించారు. ఆరికెపూడి (కోడూరి)కౌసల్యాదేవి రాసిన నవల ప్రేమనగర్
ఆధారంగానే ఈ చిత్రం తెరకెక్కింది. ప్రేమనగర్
ఘనవిజయంతో ఏయన్నార్ మరోమారు తన నవలానాయకుడు
అన్న టైటిల్ ను నిలుపుకున్నారు. 1971వ సంవత్సరం అక్కినేని నాగేశ్వరరావుకు భలేగా అచ్చివచ్చిన యేడాది అని చెప్పవచ్చు. ఆ సంవత్సరం జనవరిలో విడుదలైన దసరాబుల్లోడు
అనూహ్య విజయం సాధించి, ఏయన్నార్ కు తొలి స్వర్ణోత్సవ చిత్రాన్ని చూపించింది. ఆ యేడాది బ్లాక్ బస్టర్ గా నిలచింది. అదే సంవత్సరం సెప్టెంబర్ 24న విడుదలైన ప్రేమనగర్
సైతం విజయఢంకా మోగించింది. సురేశ్ సంస్థకు యన్టీఆర్ రాముడు-బీముడు
పునాది కాగా, ప్రేమనగర్
సంస్థను నిలిపిన చిత్రం అని నిర్మాత డి.రామానాయుడు పలుమార్లు చెప్పేవారు. ఈ చిత్ర విజయంతోనే రామానాయుడు చిత్రసీమలో నిర్మాతగా కొనసాగి, తరువాత శతాధిక చిత్ర నిర్మాతగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్
లో చోటు సంపాదించారు.
యన్టీఆర్… ఏయన్నార్ తో…
డి.రామానాయుడు 1963లో తన పెద్ద కొడుకు సురేశ్ బాబు పేరు మీద సురేశ్ ప్రొడక్షన్స్
నెలకొల్పి తొలి ప్రయత్నంగా యన్టీఆర్ తో రాముడు-భీముడు
నిర్మించారు. యన్టీఆర్ తొలిసారి ద్విపాత్రాభినయం చేసిన రాముడు- భీముడు
1964 మే 21న విడుదలై ఘనవిజయం సాధించింది. రిపీట్ రన్స్ లో సురేశ్ సంస్థను ఎన్నోసార్లు ఆదుకుంది. తరువాత కాంతారావుతో తీసిన ‘ప్రతిజ్ఞా పాలన’ అలరించింది. యన్టీఆర్ తో తీసిన ‘శ్రీకృష్ణతులాభారము’ మురిపించింది. కానీ, ‘స్త్రీ జన్మ, బొమ్మలు చెప్పిన కథ, పాపకోసం’ వంటి చిత్రాలు బొటాబొటిగా సాగాయి. ఏయన్నార్ తో నిర్మించిన ‘సిపాయి చిన్నయ్య’ ఆకట్టుకోలేకపోయింది. యన్టీఆర్ ద్విపాత్రాభినయంతో సురేశ్ ప్రొడక్షన్స్
ను ఆరంభించిన రామానాయుడు, ఏయన్నార్ డ్యుయల్ రోల్ లో సిపాయి చిన్నయ్య
ను సురేశ్ మూవీస్
పతాకంపై నిర్మించారు. అలా రామారావు, నాగేశ్వరరావుతో రామానాయుడు చిత్రబంధం నెలకొంది.
ఆదుకున్న ‘ప్రేమనగర్’…
కొన్నాళ్ళు రామానాయుడు నిర్మించిన చిత్రాలేవీ అంతగా కలసి రాలేదు. దాంతో చిత్రసీమలో ఉండాలా వద్దా అన్న సందిగ్ధంలో పడ్డారు నాయుడు. ఆ సమయంలో ప్రేమనగర్
నవల ప్రస్తావన వచ్చింది. దానిని చదివిన రామానాయుడుకు అందులో సినిమాకు కావలసిన అన్ని అంశాలూ పుష్కలంగా ఉన్నాయనిపించింది. ఈ విషయాన్ని తన స్త్రీ జన్మ
దర్శకులు కె.ఎస్.ప్రకాశరావుతో చర్చించారు. ఆయన కూడా సరేనని, అందులో ఏయన్నార్ ను నాయకునిగా, వాణిశ్రీని నాయికగా ఎంచుకున్నారు. ఈ ప్రేమనగర్ కూడా సురేశ్ మూవీస్ పతాకంపైనే తెరకెక్కింది. ఈ చిత్రం అనూహ్య విజయం సాధించడంతో రామానాయుడు ఇక సినిమా రంగంలోనే కొనసాగారు.
‘ప్రేమనగర్’లోకి వెళ్తే…
కళ్యాణ్ అనే జమీందార్ కొడుకు వ్యసనపరుడు. అతనికి తల్లి, అన్న ఉంటారు. లత అనే అమ్మాయి కళ్యాణ్ కు తొలుత విమానంలో ఎయిర్ హోస్టెస్ గా తారసపడుతుంది. తన కుటుంబ పరిస్థితుల కారణంగా కళ్యాణ్ వద్ద సెక్రటరీగా ఉద్యోగంలో చేరుతుంది లత. ఆమె తన బాస్ కళ్యాణ్ లోని దుర్గుణాలను దూరం చేస్తూ, సన్మార్గంవైపు నడిపిస్తుంది. అది కళ్యాణ్ అన్నకేశవ వర్మకు నచ్చదు. ఓ పథకం ప్రకారం లతపై నేరం మోపుతాడు కేశవ వర్మ. కళ్యాణ్ నమ్మకపోయినా, పొరపాటున ఆ పని ఎందుకు చేశావ్?
అంటూ ప్రశ్నిస్తాడు కళ్యాణ్. దాంతో అభిమానం దెబ్బ తిన్న లత అతని వద్ద పనిచేయడం మానుకుంటుంది. ఆమెను ప్రేమించి, ఆమె కోసం ప్రేమనగర్ నిర్మించిన కళ్యాణ్ పిచ్చివాడవుతాడు. ఆమెకు వేరే వ్యక్తితో పెళ్ళి జరుగుతోందని తెలిసి, వెళ్లి దీవిస్తాడు. విషం తాగి మరణించాలనుకుంటాడు. అయితే కళ్యాణ్ తల్లి వెళ్ళి లతను తీసుకు వస్తుంది. ఆమె రాకతోనూ, సమయానికి వైద్యులు కాపాడడం వల్ల కళ్యాణ్ బ్రతుకుతాడు. కథ సుఖాంతమవుతుంది.
మరికొన్ని విశేషాలు…
ప్రేమనగర్
కథ పాఠకులను ఎంతగానో అలరించింది. పైగా సురేశ్ సంస్థ భారీగా నిర్మించి, రంగుల్లో రూపొందించడం వల్ల ఆ నాటి ప్రేక్షకులు చిత్రాన్ని విశేషంగా ఆదరించారు. ఈ చిత్రానికి కథ ఎంత ప్రాణంపోసిందో, పాటలు కూడా అంతలా అలరించాయి. కేవీ మహదేవన్ సంగీతంలో ఆచార్య ఆత్రేయ రాసిన పాటలన్నీ జనాన్ని విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ చిత్రంలో చిన్నప్పటి సత్యనారాయణ పాత్రలో రామానాయుడు చిన్న కొడుకు వెంకటేశ్ నటించారు. ఇందులో చిత్తూరు నాగయ్య, యస్వీ రంగారావు, గుమ్మడి, శాంతకుమారి, పుష్పలత, యస్.వరలక్ష్మి, హేమలత, రాజబాబు, కేవీ చలం, రమాప్రభ, సూర్యకాంతం, ధూళిపాల, కాకరాల తదితరులు నటించారు. జ్యోతి లక్ష్మి ఓ ఐటమ్ సాంగ్ లోనూ, మరో ఐటమ్ లో లక్ష్మీ ఛాయ నర్తించారు.
పాటల సందడి…
ఈ చిత్రానికి మాటలు, పాటలు ఆచార్య ఆత్రేయ పలికించారు. ఇందులోని పాటలన్నీ ఎంతగానో అలరించాయి. దువ్వూరి రామిరెడ్డి రాసిన పానశాల
లోని అంతము లేని ఈ భువనమంతయు...
అనే పద్యాన్ని అనువైన చోట ఉపయోగించారు. నీ కోసం వెలసింది ప్రేమమందిరం...
, కడవెత్తు కొచ్చిందికన్నె పిల్లా...
, లే లే లే నా రాజా...
పాటలు యుగళగీతాలుగా రూపొందాయి. ఇక ఘంటసాల సోలోగా పాడిన తేట తేట తెలుగులా...
, మనసు గతి ఇంతే... మనిషి బతుకింతే...
, ఎవరి కోసం ఎవరి కోసం...
, నేను పుట్టాను... ఈ లోకం మెచ్చింది...
వంటివి ఎంతగానో ఆకట్టుకున్నాయి. పి.సుశీల గానం చేసిన ఎవరో రావాలి...నీ హృదయం పలికించాలి...
పాట కూడా అలరించింది. ఉంటే ఈ ఊళ్ళో ఉండు పోతే నీ దేశం పోరా...
పాట ఐటమ్ నంబర్ గా రూపొందింది.
ఐటమ్ సాంగ్స్ లోని పదాలు ఆ రోజుల్లో చాలా ఎబ్బెట్టుగా ఉన్నాయనే విమర్శలు వినిపించాయి. అయితే కథానుగుణంగా కళ్యాణ్ స్త్రీలోలుడు కాబట్టి, సందర్భం ప్రకారం అలాంటి పదాలు మాట్లాడేవారే వస్తారని సెన్సార్ వారికి వివరించారు. ఘంటసాల గళంలో జాలువారిన సోలో పాటల్లోని సాహిత్యం అభిమానులను ఎంతగానో అలరించింది. ఇప్పటికీ పాటలు పాడే సాధన చేసేవారు ఈ గీతాలను అభ్యసిస్తూ ఉండడం విశేషం.
ప్రేమనగర్
చిత్రం విడుదలైన సమయంలో ఆంధ్రప్రదేశ్ అంతటా భారీ వర్షాలు కురిశాయి. దాంతో రామానాయుడు డీలా పడ్డారు. అయితే కొన్ని ఏరియాల్లో వర్షాన్ని సైతం లెక్క చేయకుండా జనం సినిమాకు రావడం చూసి ఆయనకు నమ్మకం కుదిరింది. ఈ చిత్రం ఆ రోజుల్లో దాదాపు 50 లక్షల రూపాయలు సంపాదించింది. దసరాబుల్లోడు
తరువాత ఆ యేడాది టాప్ గ్రాసర్ గా ఈ చిత్రం నిలచింది. ఈ సినిమాలో వాణిశ్రీ కట్టిన చీరలు చూసేందుకే అప్పట్లో మహిళలు ఈ చిత్రాన్ని మళ్ళీ మళ్ళీ చూసేవారు. ఏయన్నార్ చిత్రాలకు రిపీట్ రన్ తక్కువే అన్నది అందరికీ తెలిసిన విషయమే. కానీ, ఈ చిత్రం రిపీట్ రన్స్ లోనూ మంచి ఆదరణ పొందింది. ఈ సినిమా ఘనవిజయంతో రామానాయుడు వైవిధ్యమైన చిత్రాలు నిర్మిస్తూ ముందుకు సాగారు. జీవనతరంగాలు, సెక్రటరీ, చక్రవాకం, అగ్నిపూలు
వంటి నవలాచిత్రాలనూ నిర్మించారు. తన సురేశ్ సంస్థను నిలిపిన చిత్రంగా ప్రేమనగర్
ను పదే పదే రామానాయుడు చెప్పుకొనేవారు.
ఇతర భాషల్లో…
రాముడు-భీముడు
చిత్రకథను తొలుత విజయాధినేతల్లోఒకరైన చక్రపాణి పనికి రాదు అని తోసిపుచ్చారు. దానినే రామానాయుడు సినిమాగా తీసి విజయం సాధించారు. ఆ తరువాత అదే విజయాధినేతలు నాగిరెడ్డి, చక్రపాణి రాముడు-భీముడు
ను తమిళ, హిందీ భాషల్లో నిర్మించి ఘనవిజయం చూశారు. అందువల్ల రామానాయుడు ప్రేమనగర్
చిత్రాన్ని ఎవరికీ అమ్మకుండా, తానే తమిళంలో శివాజీగణేశన్, వాణిశ్రీతో వసంత మాళిగై
పేరుతో కె.ఎస్. ప్రకాశరావు దర్శకత్వంలోనే నిర్మించారు. శివాజీగణేశన్ కెరీర్ లోనే బిగ్ హిట్ గా నిలచి, శివాజీ చిత్రాలలో అత్యధిక కేంద్రాలలో శతదినోత్సవం చూసిన చిత్రంగా వసంత మాళిగై
నిలచింది. ఇక ఇదే కథను హిందీలోనూ కె.ఎస్.ప్రకాశరావు దర్శకత్వంలోనే రాజేశ్ ఖన్నా, హేమామాలిని జంటగా ప్రేమ్ నగర్
పేరుతో రీమేక్ చేశారు నాయుడు. అక్కడా ఈ కథ అలరించింది. అలా మూడు భాషల్లోనూ కె.ఎస్.ప్రకాశరావు, డి.రామానాయుడు కాంబో ప్రేమనగర్
కథతో సక్సెస్ చూడడం విశేషం.