NTV Telugu Site icon

జయబాధురి ‘గుడ్డి’కి 50 ఏళ్ళు

(సెప్టెంబర్ 24తో ‘గుడ్డి’ సినిమాకు 50 ఏళ్ళు)

స్టార్ హీరోయిన్ గా, మహానటిగా పేరొంది, ప్రస్తుతం రాజ్యసభ సభ్యురాలుగా ఉన్న జయాబచ్చన్ కెరీర్ ను మలుపు తిప్పిన చిత్రం ‘గుడ్డి’. 1971 సెప్టెంబర్ 24న విడుదలయిన ‘గుడ్డి’ చిత్రంలో మేచో హీరో ధర్మేంద్ర వీరాభిమానిగా జయబాధురి నటించారు. ఇందులో ‘గుడ్డి’ టైటిల్ రోల్ లో జయబాధురి అలరించిన తీరు భలేగా ఆకట్టుకుంది. ఈ సినిమా నగరాలలో ఘనవిజయం సాధించింది. ఇతర చోట్ల ఏవరేజ్ గా, ఎబౌ ఏవరేజ్ గా సాగింది. అయితే యాభై ఏళ్ళ క్రితం ఈ చిత్రం చూసిన వారెవరూ ‘గుడ్డి’ పాత్రలో జయబాధురిని మరచిపోలేరు.

కథ విషయానికి వస్తే- కుసుమ్ స్కూల్ ఫైనల్ చదువుతూ హాయిగా తుళ్ళుతూ తేలుతూ ఉంటుంది. తండ్రి, అన్న, వదినతో కలసి ఉండే కుసుమ్ ను అందరూ ‘గుడ్డి’అని ముద్దుగా పిలుస్తుంటారు. ఆమె నాటి మేటి హీరో ధర్మేంద్రకు వీరాభిమాని. అతనితోనే లోకం అనుకుంటూ ఉంటుంది. ఆమె వదిన తమ్ముడు నవీన్ వచ్చి, గుడ్డిని ప్రేమిస్తున్నానంటాడు. అందుకు ఆమె తాను ధర్మేంద్రను ప్రేమిస్తున్నానని చెబుతుంది. అయోమయంలో పడ్డ నవీన్, ఈ విషయాన్ని తన మామకు చెబుతాడు. ఆ అంకుల్ ఓ మిత్రుని ద్వారా ధర్మేంద్రను కలుసుకొని, గుడ్డి విషయం చెబుతాడు. ధర్మేంద్ర, గుడ్డిని పిలిపించి, సినిమాకు, నిజజీవితానికి ఉన్న వ్యత్యాసం చెబుతాడు. తాను కూడా అందరిలాగే ఓ మామూలు మనిషినని, సినిమాల్లో ధైర్యంగా పోరాడే పాత్రల్లో నటిస్తుంటానని వివరిస్తాడు. దాంతో కల్పనకు, వాస్తవానికి ఉన్న తేడా తెలుసుకుంటుంది గుడ్డి. చివరకు తనను ప్రేమిస్తున్న నవీన్ కు ఓకే చెప్పడంతో కథ సుఖాంతమవుతుంది.

ప్రముఖ రచయిత, గీత రచయిత గుల్జార్ ‘గుడ్డి’ కథను అందించారు. ఈ చిత్రాన్ని హృషీకేశ్ ముఖర్జీ తనదైన శైలిలో తెరకెక్కించారు. ఈ చిత్రానికి వసంత్ దేశాయ్ సంగీతం ప్రాణం పోసింది. ఇందులోని పాటలను గుల్జార్ కలం పలికించింది. ఈ చిత్రంతోనే గాయని వాణీజయరామ్ కు మంచి పేరు లభించింది. ఆమె పాడిన మూడు పాటలూ జనాన్ని విశేషంగా అలరించాయి. ముఖ్యంగా “బోలే రే పపీహరా…” పాట ఈ నాటికీ అభిమానులను ఆకట్టుకుంటూనే ఉంది. “హరి బిన్ కైసే జీవూ…”, “హమ్ కో మన్ కీ శక్తీ దే…” పాటలు కూడా వాణీ జయరామ్ గళంలో జాలువారి మురిపించాయి.

‘గుడ్డి’ చిత్రానికి హృషీకేశ్ ముఖర్జీ నిర్మాత కూడా కావడం వల్ల ఆయన కోరిక మేరకు అశోక్ కుమార్, దిలీప్ కుమార్, రాజేశ్ ఖన్నా, ప్రాణ్, అమితాబ్ బచ్చన్, వినోద్ ఖన్నా, మాలా సిన్హా, బిశ్వజిత్, ఓమ్ ప్రకాశ్ వంటివారు గెస్ట్ అప్పియరెన్స్ ఇచ్చారు. ఈ నాటికీ ‘గుడ్డి’ అనగానే ఆ నాటి జయబాధురి అందాల అభినయం గుర్తుకు వస్తూనే ఉంటుంది.