(సెప్టెంబర్ 24న ‘ప్రేమమందిరం’కు 40 ఏళ్ళు)
నటసమ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు, దర్శకరత్న దాసరి నారాయణరావు కాంబినేషన్ లో అనేక చిత్రాలు వెలుగు చూశాయి. వాటిలో అన్నిటికన్నా మిన్నగా నిలచింది ‘ప్రేమాభిషేకం’. ఈ చిత్రం విడుదలైన 1981లోనే అక్కినేని, దాసరి కాంబినేషన్ లో రూపొందిన మరో చిత్రం ‘ప్రేమ మందిరం’. ఈ చిత్రాన్ని సురేశ్ ప్రొడక్షన్స్ అధినేత డి.రామానాయుడు నిర్మించడంతో ‘ప్రేమమందిరం’కు మొదటి నుంచీ ఓ స్పెషల్ క్రేజ్ నెలకొంది. అప్పటికే ‘ప్రేమాభిషేకం’ జైత్రయాత్ర కొనసాగుతోంది. అక్కినేని అభిమానుల ఆనందం అంబరమంటుతోంది. ఇక అచ్చివచ్చిన దర్శకుడు, నిర్మాత కాంబోలో ఏయన్నార్ సినిమా అంటే ఆనందం కలగకుండా ఉంటుందా? అక్కినేని నాగేశ్వరరావు ‘ప్రేమమందిరం’లో తండ్రీకొడుకులుగా ద్విపాత్రాభినయం చేశారు. 1981 సెప్టెంబర్ 24న ‘ప్రేమమందిరం’ చిత్రం విడుదలయింది.
ఎందుకు ఆ తేదీ!?
నటరత్న యన్టీఆర్ ‘రాముడు-భీముడు’తో సురేశ్ ప్రొడక్షన్స్ సంస్థ మొదలయింది. నటసమ్రాట్ ‘ప్రేమనగర్’తో ఈ సంస్థ రంగుల సినిమాలకు శ్రీకారంచుట్టుకుంది. ‘ప్రేమనగర్’కు ముందు రామానాయుడు చిత్రాలన్నీ బొటాబొటీగా ఆడాయి. దాంతో చిత్రసీమలో ఉండాలా వద్దా అనుకున్నారు. ఆ సమయంలో నవలాచిత్రంగా ‘ప్రేమనగర్’ నిర్మించారు. భారీగా నిర్మించిన ఈ చిత్రం ఘనవిజయం సాధించింది. దాంతో చిత్రసీమలోనే కొనసాగారు రామానాయుడు. అందువల్ల ‘ప్రేమనగర్’ విడుదలైన సెప్టెంబర్ 24వ తేదీ అంటే ఆయనకు ఎంతో అభిమానం. ఈ చిత్రం విడుదలైన పదేళ్ళకు అంటే 1981లో ఏయన్నార్, దాసరి కాంబినేషన్ లో ప్రేమమందిరం
నిర్మించి, అదే సెప్టెంబర్ 24వ తేదీ విడుదల చేశారు. కానీ, ప్రేమనగర్ మ్యాజిక్ జరగలేదు. ప్రేమమందిరం పరాజయాన్ని చవిచూసింది. మొదటి వారం వసూళ్ళలో మాత్రం ఆ యేడాది బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా నిలచిన ఏయన్నార్ ప్రేమాభిషేకం
కంటే ప్రేమ మందిరం
ఎక్కువ వసూలు చేసినట్టు పత్రికల్లో ప్రకటించుకున్నారు. ఏది ఏమైనా ‘ప్రేమమందిరం’ ఫ్లాప్ అని రామానాయుడు తరువాత అంగీకరించారు. మరి ఈ ‘ప్రేమమందిరం’ను ఎందుకు తలచుకోవాలయ్యా అంటే- ఏయన్నార్, దాసరి కాంబోకి ఆ యేడాది ఎంతటి క్రేజ్ ఉండేదో తెలుసుకోవడానికి. ‘ప్రేమాభిషేకం’, ‘ప్రేమమందిరం’ చిత్రాలలో వారిద్దరూ చూపించిన వైవిధ్యాన్ని గుర్తు చేసుకోవడానికి.
కథలోకి తొంగిచూస్తే… స్వరాజ్యం సిద్ధించడానికి ముందు మన దేశంలో ఉన్న జమీందారీ వ్యవస్థ కాలంలో కథ సాగుతుంది. జమీందార్ భూపతిరాజాకు తామేదో దైవాంశసంభూతులమనే నమ్మకం ఉంటుంది. పేదవారిని చాలా చులకనగా చూస్తూంటాడు. అతని కొడుకు సర్వారాయునికి తండ్రి మాట వేదవాక్కు. మరో కొడుకు విక్రమ్, ఓ పేదింటి అమ్మాయిని ప్రేమించి పెళ్ళిచేసుకున్నాడని తెలిసి అంతమొందిస్తాడు. సర్వారాయుని తనయుడు చిన్నబాబు ఎక్కడ చెడిపోతాడోనని తమ భవంతిలోనే పాఠాలు నేర్పిస్తారు. బయటి లోకాన్ని చూడాలన్న కోరికతో చిన్నబాబు ఇంట్లోంచి పారిపోతాడు. ఈ విషయాన్ని తండ్రికి తెలియకుండా సర్వారాయుడు దాచిపెడతాడు. బయటకు వెళ్ళిన చినబాబు ఓ వేశ్య కూతురును కలుసుకొని, ఆమెను ప్రేమిస్తాడు. ఈ విషయం తెలుసుకున్న జమీందార్ ఆంక్షలు విధిస్తాడు. దాంతో చినబాబు మద్యానికి బానిసవుతాడు. ఇది చూడలేక అతను ప్రేమించిన అమ్మాయినే పెళ్ళాడమని తండ్రి చెబుతాడు. చినబాబు ప్రేమించిన మధురను పెళ్ళాడతాడు. వారిద్దరినీ చంపేయమని జమీందార్ చెబుతాడు. వారిద్దరికీ పాలలో విషం కలిపి ఇచ్చానని సర్వారాయుడు తండ్రితో అంటాడు. కానీ, నిజానికి తన తండ్రికి విషమిస్తాడు, తరువాత తానూ తీసుకుంటాడు. చివరకు ప్రేమికులను ఆశీర్వదిస్తూ సర్వారాయుడు కన్నుమూస్తాడు.
జయప్రద, అంబిక, గుమ్మడి, సత్యనారాయణ, అల్లు రామలింగయ్య, సూర్యకాంతం, నిర్మలమ్మ, రాజసులోచన, రమాప్రభ, శ్రీధర్, నగేశ్, చలం, సారథి, జగ్గయ్య, గీత, రామానాయుడు నటించారు. ఈ చిత్రానికి
సి.నారాయణరెడ్డి, ఆరుద్ర, వేటూరి, దాసరి నారాయణరావు పాటలు రాశారు. కేవీ మహదేవన్ సంగీతం సమకూర్చారు. “ప్రేమ మందిరం…ఇదే ప్రేమమందిరం…”, “ఎక్కడో చూసినట్టు ఉన్నాదీ నాకు…”, “అమరం అమరం…”, “తొలిసారి పలికెను…” వంటి పాటలు అలరించాయి.
ఈ కథ అంతకు ముందు యన్టీఆర్ తో దాసరి రూపొందించిన ‘మనుషులంతా ఒక్కటే’ని గుర్తుకు తెస్తుంది. అలాగే ఏయన్నార్ ‘అంతస్తులు’నూ స్ఫురింపచేస్తుంది. ఏది ఏమైనా ‘ప్రేమమందిరం’ పరాజయం పాలయింది.