NTV Telugu Site icon

హైదరాబాద్‌లో దీపావళి వేడుకల్లో అపశృతి.. ఆస్పత్రికి బాధితుల క్యూ..

దీపావళి పండుగ వచ్చిందంటే చాలు.. టపాసుల మోత మోగాల్సిందే.. చిన్నా, పెద్ద ఇలా ఇంటిల్లిపాది కలిసి పటాకులు కాల్చుతూ దీపావళిని సెలబ్రేట్‌ చేసుకుంటారు.. అయితే, అవి ప్రమాదాలు తెచ్చిపెట్టే సందర్భాలు అనేకం.. ముఖ్యంగా.. కంటి సమస్యలకు దారి తీస్తున్నాయి.. టపాసులు కాల్చే సమయంలో.. పలు జాగ్రత్తలు తీసుకోవాలని.. ముఖ్యంగా చిన్నపిల్లలు.. పెద్దల పర్యవేక్షణలో బాణాసంచా కాల్చితే మంచిదంటూ వైద్య నిపుణులు సూచిస్తున్నా.. నిర్లక్ష్యంగా టపాసులు కాల్చి ఇబ్బందులు పడుతూ.. ఆస్పత్రికి క్యూ కడుతున్నారు బాధితులు.. ఇక, హైదరాబాద్‌లో ఇప్పటి వరకు దాదాపు 50 కేసులు నమోదు అయినట్టుగా తెలుస్తోంది.

కంటి సమస్యలతో బాధపడుతూ.. మెహదీపట్నంలోని సరోజినీదేవి కంటి ఆస్పత్రికి క్యూకడుతున్నారు బాధితులు.. వీరిలో ఎక్కువ మంది చిన్నారులు ఉన్నారని చెబుతున్నారు వైద్యులు.. 32 మంది ఆస్పత్రికి రాగా.. ఇందులో స్వల్పంగా గాయాలైన 25 మందికి పైగా చికిత్స అందించి తిరిగి ఇంటికి పంపించామని వైద్యులు చెబుతున్నారు.. ఇదే సమయంలో తీవ్రంగా గాయపడినవారిని ఆస్పత్రిలో అడ్మిట్‌ చేసుకున్నట్టు వెల్లడించారు. వీరిలో ముగ్గురు చిన్నారులకు సర్జరీ చేశామని, ప్రస్తుతం వారిని అబ్జర్వేషన్‌లో ఉంచామంటున్న వైద్యులు.. బాణాసంచా కాల్చేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు..