NTV Telugu Site icon

పాతికేళ్ళ క్రితం ఊపేసిన ‘ప్రేమదేశం’

25 Years Of Prema Desam Movie

25 Years Of Prema Desam Movie

(ఆగస్టు 23న ‘ప్రేమదేశం’కు 25 ఏళ్ళు పూర్తి)

ఇప్పటికీ ఎప్పటికీ ఎన్నటికీ ఆకర్షించే అంశమేది అంటే ‘ప్రేమ’ అనే చెప్పాలి. కాలం మారినా ప్రేమకథలకు సాహిత్యంలోనూ, సమాజంలోనూ, సినిమాల్లోనూ ఆదరణ ఉంటూనే ఉంది. ప్రముఖ తమిళ దర్శకుడు ఆ ఉద్దేశంతోనే కాబోలు తాను తెరకెక్కించిన అన్ని చిత్రాలనూ ప్రేమ చుట్టూ తిప్పాడు. టైటిల్స్ లోనూ ప్రేమనే జోడించాడు. ఆయన దర్శకత్వంలో ‘జెంటిల్ మేన్’ కె.టి.కుంజుమోన్ నిర్మించిన ‘కాదల్ దేశం’ చిత్రం తెలుగులో ‘ప్రేమదేశం’ పేరుతో విడుదలై విజయఢంకా మోగించింది. ఈ సినిమా అటు తమిళనాట, ఇటు తెలుగునేలపై నాటి యువతను ఓ ఊపు ఊపేసింది. ఇక ఎ.ఆర్.రహమాన్ స్వరకల్పనలో రూపొందిన పాటలు విశేషంగా అలరించాయి. అసలు టైటిల్ కార్డ్స్ సమయంలోనే వినిపించే నేపథ్య సంగీతం వింటూనే జనం కిర్రెక్కిపోయి ఊగిపోయారు. నాటి అందాల తార టబు మినహాయిస్తే, ఇందులో స్టార్స్ ఎవరూ లేరు. అయినా ‘ప్రేమదేశం’ యువతను విశేషంగా ఆకర్షించింది.

‘ప్రేమదేశం’ కథలోకి తొంగిచూస్తే – చెన్నైలోని సుప్రసిద్ధ కళాశాల పచ్చయప్ప, మరో ప్రఖ్యాత కళాశాల లయోలా మధ్య అన్నిటా పోటీ ఉంటుంది. కార్తిక్ ఓ అనాథ, పచ్చయప్ప కాలేజ్ లో చదువుతూ ఉంటాడు. అరుణ్ ధనవంతుల అబ్బాయి, లయోలా కాలేజ్ స్టూడెంట్. వీరిద్దరూ తొలిసారి దివ్య అనే అమ్మాయిని చూసి ప్రేమలో పడతారు. తరువాతి రోజుల్లో ఇద్దరూ మంచి మిత్రులవుతారు. కానీ, ఇద్దరూ ప్రేమిస్తున్నది ఒకే అమ్మాయినని తెలుసుకున్న తరువాత వారి మధ్య దూరం పెరుగుతుంది. దివ్యకు కూడా ఇద్దరూ మంచి మిత్రులు. చివరకు వారు తనను ప్రేమిస్తున్నారన్న సంగతి తెలుస్తుంది. ఏ ఒక్కరి ప్రేమను అంగీకరించినా, మరొకరు దూరం అవుతారు. దాంతో వారిద్దరి స్నేహాన్ని కోరుకుంటూ సాగాలని ఆశిస్తుంది. దాంతో కార్తిక్, అరుణ్ మధ్య మళ్ళీ స్నేహం నెలకొనడంతో సుఖాంతమవుతుంది.

ఈ చిత్రంలో దివ్యగా టబు, కార్తీక్ గా వినీత్, అరుణ్ గా అబ్బాస్ నటించారు. దివ్య తల్లిదండ్రులుగా శ్రీవిద్య, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కనిపించారు. వడివేలు, చిన్ని జయంత్, కెవిన్ కీలక పాత్రల్లో నటించగా, కె.టి.కుంజుమోన్ కాసేపు తెరపై తళుక్కుమన్నారు.

కథ రాసుకున్న సమయంలోనే కార్తిక్ గా వినీత్ ను ఎంచుకున్నాడు దర్శకుడు కదిర్. అరుణ్ పాత్ర కోసం గాలిస్తుండగా, ముంబయ్ నుండి హాలీ డే ట్రిప్ మీద బెంగళూరు వచ్చిన అబ్బాస్ కనిపించాడు. అతణ్ణి తన అరుణ్ పాత్ర కోసం అడిగాడు కదిర్. తమిళం తెలియక పోవడంతో అబ్బాస్, కదిర్ ఇచ్చిన ఆఫర్ ను వద్దనుకున్నాడు. అయితే కొద్దిరోజుల తరువాత నిర్మాత కె.టి.కుంజుమోన్ ఫోన్ చేసి, అబ్బాస్ ను మేకప్ టెస్ట్ కు రమన్నారు. అబ్బాస్ చూద్దామని వచ్చాడు. అరుణ్ పాత్రలో నటించేశాడు. అదే సమయంలో మణిరత్నం ‘ఇరువర్’తో టబు తమిళ సినీరంగంలో అడుగు పెట్టాలని వచ్చింది. ఆమెను తమ చిత్రంలో నాయికగా ఎంచుకున్నారు కదిర్. ‘ఇరువర్’ కంటే ముందు ‘ప్రేమదేశం’ జనం ముందు నిలచింది. ఇక ఈ సినిమాలో అబ్బాస్ పాత్రకు నటుడు విక్రమ్ తమిళంలో డబ్బింగ్ చెప్పారు. ఈ సినిమాకు ప్రముఖ దర్శకుడు ‘తొలిప్రేమ’ కరుణాకరన్ అసోసియేట్ గా పనిచేశారు. దర్శకుడు, ఛాయాగ్రాహకుడు కె.వి. ఆనంద్ ఈ సినిమాకు సినిమాటోగ్రాఫర్.

ఈ సినిమా తమిళంలో ‘కాదల్ దేశం’గా, తెలుగులో ‘ప్రేమదేశం’గా ఒకే రోజున విడుదల కావడం విశేషం. రెండు రాష్ట్రాల్లోనూ విశేషాదరణ చూరగొంది. ముక్కోణ ప్రేమకథా చిత్రాల్లో ఓ కొత్త ముగింపు చూపిన సినిమాగా ‘ప్రేమదేశం’ నిలచింది. తెలుగు వర్షన్ కు శ్రీరామకృష్ణ రచన చేయగా, భువనచంద్ర పాటలు పలికించారు. ఇందులోని “ముస్తాఫా ముస్తాఫా… డోన్ట్ వర్రీ ముస్తాఫా…” సాంగ్ ప్రతి ఫ్రెండ్షిప్ డేకి ఎక్కడో ఓ చోట వినిపిస్తూనే ఉంటుంది. “హలో డాక్టర్ హార్ట్ మిస్సాయే…”, “ఓ వెన్నెలా…”కనులు తెరచినా కన్నెపిల్లా… క..క..క..కాలేజీ స్టైలే…”, “ప్రేమా ప్రేమా… ప్రేమా… ” పాటలు విశేషంగా మురిపించాయి. సినిమాలో ప్రతీ పాటకు యువత లేచి చిందులు వేయడం ‘ప్రేమదేశం’ థియేటర్లలో కనిపించేది. ముఖ్యంగా ‘ముస్తాఫా…”, “హలో డాక్టర్..” పాటల సమయంలో అయితే ఆ చిందులు, ఊగిపోవడం మరింతగా ఉండేది. తెలుగులో ఈ చిత్రాన్ని జె.రామచంద్రరావు అనువదించారు. తెలుగునాట కూడా వసూళ్ళ వర్షం కురిపించింది ‘ప్రేమదేశం’.