మహారాష్ట్రలో కరోనా మహమ్మారి మళ్లీ పంజా విసురుతోంది.. తాజాగా 10 మంది మంత్రులు, 20 మంది ఎమ్మెల్యేలకు కరోనా సోకడం కలకలం రేపుతోంది.. ఇటీవలే మహారాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు జరిగాయి.. ఇక, ఆ సమావేశాలు ముగిసిన తర్వాత వరుసగా మంత్రులు, ఎమ్మెల్యేలు, అసెంబ్లీ ఉద్యోగులు, సిబ్బందికి కరోనా పాజిటివ్‌గా తేలుతోంది.. అసెంబ్లీ శీతాకాల సమావేశాల అనంతరం వీరికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి అజిత్ పవార్ తెలిపారు. అయితే, నిన్నటితో పోలిస్తే.. రాష్ట్రంలో 50 శాతం కేసులు పెరిగినట్టు వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది.
Read Also: రాష్ట్రాలకు కేంద్రం కీలక సూచనలు.. ఈ లక్షణాలుంటే వెంటనే టెస్ట్..
ఇక, కోవిడ్ కట్టడికి మరిన్ని ఆంక్షలు విధించే అవకాశాలపై మీడియా పవార్‌ను ప్రశ్నించగా.. పెరుగుతున్న రోగుల సంఖ్యపై రాష్ట్ర ప్రభుత్వం నిఘా ఉంచిందన్నారు.. రోగుల సంఖ్య పెరుగుతూ ఉంటే, కఠినమైన ఆంక్షలు ఉంటాయి. కఠినమైన పరిమితిని నివారించడానికి ప్రతి ఒక్కరూ నిబంధనలను పాటించాలి అన్నారు. కాగా, 2021 చివరి 12 రోజుల్లో మహారాష్ట్రలో కొత్త రోజువారీ కరోనావైరస్ కేసులు పెరుగుతూ వస్తున్నాయి.. రాష్ట్ర ప్రభుత్వం, గురువారం రాత్రి జారీ చేసిన తాజా మార్గదర్శకాలలో, సమావేశాలకు 50కి మించి హాజరుకాకూడదని స్పష్టం చేసింది.. మరోవైపు.. ముంబైలో శుక్రవారం 5,631 కొత్త కోవిడ్ -19 కేసులు నమోదయ్యాయి, ఇది గురువారం కంటే దాదాపు 2,000 ఎక్కువ, ఇది సంవత్సరం చివరి రోజున నగరంలో 7,85,110కి చేరినట్టు అధికారులు తెలిపారు. గురువారం నమోదైన 3,671 కేసులతో పోలిస్తే ఇది 53 శాతం పెరిగినట్టు చెప్పవచ్చు.
