Site icon NTV Telugu

టీమిండియా భవిష్యత్ కెప్టెన్ ఎవరో తెలిసిపోయింది

ప్రస్తుతం యూఏఈ వేదికగా టీ20 ప్రపంచకప్ జరుగుతోంది. ఈ టోర్నీ తర్వాత టీ20లకు టీమిండియా కెప్టెన్సీ బాధ్యతల నుంచి విరాట్ కోహ్లీ తప్పుకోనున్నాడు. దీంతో కోహ్లీ తర్వాత భారతజట్టు పగ్గాలు చేపట్టేది ఎవరంటూ కొన్నిరోజులుగా చర్చ నడుస్తోంది. కొందరు రోహిత్ అని అంటుంటే.. మరికొందరు రాహుల్‌కు ఇస్తే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ చిక్కుముడికి సమాధానం దొరికేసింది. టీ20లకు భవిష్యత్ టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అని ఓ బీసీసీఐ అధికారి ఇన్‌సైడ్ స్పోర్ట్ అనే ఛానల్‌కు వెల్లడించారు.

రోహిత్ శర్మ ప్రస్తుతం టీమిండియాకు వైస్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడని.. కోహ్లీ తర్వాత పగ్గాలు చేపట్టబోయేది అతడేనని సదరు బీసీసీఐ అధికారి తెలిపారు. ఈ విషయంలో సీక్రెట్ ఏమీ లేదని స్పష్టం చేశారు. టీ20 ప్రపంచకప్ తర్వాత రోహిత్ ఈ బాధ్యతలు చేపడతాడని.. ఈ అంశంపై ప్రపంచకప్ ముగిసిన అనంతరం అధికారిక ప్రకటన వస్తుందని పేర్కొన్నారు. మొత్తానికి టీమిండియాను త్వరలో ఇద్దరు సారథులు నడిపించనున్నారు. టెస్టులకు, వన్డేలకు కోహ్లీ, టీ20లకు రోహిత్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నారు. కాగా ప్రస్తుతం టీ20 ప్రపంచకప్‌లో మాజీ కెప్టెన్ ధోనీ జట్టు మెంటార్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.

Exit mobile version