Site icon NTV Telugu

చెదరని దశాబ్దాల స్నేహబంధం!

భారత్‌- రష్యా మధ్య అనుబంధం ఈనాటిది కాదు. గత ఏడు దశాబ్దాలుగా ఇరు దేశాలు కలిసి నడుస్తున్నాయి. అనేక రంగాలలో సహాయ సహకారాలు అందించుకుంటున్నాయి. ముఖ్యంగా రక్షణ రంగంలో మనకు రష్యా అండదండలు ఎనలేనివి. ప్రచ్ఛన్న యుద్ధం కాలంలో భారత్‌ తటస్థ వైకరి అవలంభించినప్పటికీ సోవియట్‌ యూనియన్‌తో సన్నిహితంగా ఉంది. అప్పట్లో ఇరు దేశాల మధ్య సంబంధాలు చాలా గొప్పగా ఉండేవి.

సోవియట్‌ విచ్ఛిన్నం తరువాత అమెరికా ఏకైక అగ్రరాజ్యంగా అవతరించింది. దాంతో పాటే ఏకదృవ ప్రంపంచం ఏర్పడింది. వరల్డ్‌ ఓ గ్లోబల్‌ విలేజ్‌గా మారింది. మార్కెట్‌ తలుపులు బార్లా తెరుచుకున్నాయి. ప్రపంచ భౌగోళిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితులలో గణనీయమైన మార్పులు చోటు చేసుకున్నాయి. దాంతో పాటే కొత్త సమస్యలు పుట్టుకొచ్చాయి. ఈ క్రమంలో భారత్‌ విదేశీ విధానం కొంత మేర మారక తప్పలేదు.

మారిన పరిస్థితులకు అనుగుణంగా ప్రపంచ దేశాలు తమ విధానాల నుంచి కొంచెం పక్కకు తప్పుకుంటున్నాయి. వ్యూహాత్మకంగా వ్యవహరించవలసిన అవసరం ఏర్పడింది. భారత్‌, రష్యాలు ఇందుకు మినహాయింపు కాదు. దాంతో, ఇరు దేశాల మైత్రీ బంధంలో కొంత దూరం ఏర్పడిన భావన ఏర్పడింది.

ఇటీవల కాలంలో చైనాతో రష్యా మధ్య సంబంధాలు బలపడ్డాయి. ఇదే సమయంలో భారత్‌కు అమెరికా దగ్గరైంది. ఇండో-–పసిఫిక్​ప్రాంతం విషయంలో అమెరికా బాటలో ఇండియా నడుస్తోందని రష్యా అనుకుంటోంది. అలాగే చైనా చెప్పినట్టు రష్యా నడుచుకుంటుందన్నది భారత్‌ అనుమానం. దాంతో రెండు దేశాల మధ్య కొంత గ్యాప్‌ ఏర్పడిందనిపించింది. ఐతే, పుతిన్‌ తాజా పర్యటనతో అన్ని అనుమానాలు తొలగిపోయాయి.

మరోవైపు , ఇరాన్ విషయంలో భారత్‌ వైకరి మారింది. గతంలో మన చముర అవసరాలలో 10 శాతం ఇరాన్‌ నుంచి దిగుమతి అయ్యేది. కానీ ఇప్పుడు అది ఆగిపోయింది. ఇది భారత్‌ తనకు తాను తీసుకున్న నిర్ణయం కాదు. అమెరికా ఒత్తిడికి తలొగ్గి అలా చేయాల్సి వచ్చింది. భారత్‌ దూరమైన తరువాత ఇరాన్‌కు రష్యా దగ్గరైంది. ఐతే, ఇరాన్‌ మాదిరిగా రష్యా విషయంలో అమెరికా ఒత్తిడికి భారత్‌ లొంగలేదు. రష్యా నుంచి కాకుండా తమ నుంచి రక్షణ పరికరాలు కొనాలని అగ్రరాజ్యం ఎంత ఒత్తిడి తెచ్చినా ఒప్పుకోలేదు. 2018లో ఇండియా -రష్యా మధ్య కుదిరిన ఎస్-400 ఎయిర్ డిఫెన్స్ మిస్సైల్​సిస్టం కొనుగోలు ఒప్పందానికే కట్టుబడి ఉంది.

కోవిడ్‌ వేళ పుతిన్ పూర్తిగా రష్యాకే పరిమితమయ్యారు. ఈ రెండేళ్లలో ఆయన రెండే రెండు సార్లు కాలు బయటపెట్టారు. మొదటిసారి, ఈ జూన్‌లో జెనీవాలో బైడన్‌తో జరిగిన శిఖరాగ్ర చర్చల్లో పాల్గొన్నారు. దాని తర్వాత ఇప్పుడు భారత్‌ పర్యటన. ఉభయ దేశాల మధ్య సత్సంబంధాలకు ఇది తాజా ఉదాహరణ. ప్రస్తుత పరిస్థితులో పుతిన్‌ భారత పర్యటనకు ఎంతో ప్రాధాన్యత ఏర్పడింది.

పుతిన్‌ పర్యటనలో భాగంగా ఉభయ దేశాల మధ్య అనేక ఒప్పందాలు కుదిరాయి. సైబర్‌ సెక్యూరిటీ నుంచి రైఫిల్స్ తయారీ వరకు మొత్తం 28 ఒప్పందాలపై ఇరు పక్షాలు సంతకాలు చేశాయి. పదేళ్ల పాటు కొనసాగే మిలటరీ సాంకేతిక సహకార ఒప్పందం వీటిలో కీలకమైంది. ఉత్తరప్రదేశ్‌లో ఏకే 203 అసల్ట్​ రైఫిల్స్​ తయారీకి కూడా ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందంలో భాగంగా ఆరు లక్షల రైఫిల్స్ తయారవుతాయి. ఇండియన్​ ఆర్మీకి రక్షణ విడి భాగాలు అందించేందుకు రష్యా అంగీకరించింది. పుతిన్​భారత్‌లో ఉన్నది కొన్ని గంటలే కావచ్చు, కానీ చర్చలు గొప్పగా ముగిసాయని చెప్పాలి. అందుకు ఈ ఒప్పందాలే ఉదాహరణ.

మరోవైపు, 1971 నాటి శాంతి సహకార ఒప్పందానికి ఏడాదితో 50 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ అర్థ శతాబ్ద కాలంలో ప్రపంచం ఎంత మారినా భారత్‌-రష్యా మైత్రీ బంధం మారలేదని పుతిన్‌ పర్యటన చెప్పకనే చెప్పింది!

Exit mobile version