NTV Telugu Site icon

Top Headlines @1PM: టాప్‌ న్యూస్‌

Ntv 1pm Headlines

Ntv 1pm Headlines

కామారెడ్డి మాస్టర్‌ ప్లాన్‌పై విచారణ 25కు వాయిదా

కామారెడ్డి మాస్టర్‌ ప్లాన్‌పై రైతులు వేసిన పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టులో ఈరోజు విచారణ జరిగింది. అయితే కామారెడ్డి మాస్టర్ ప్లాన్ పై స్టే ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. అదే సమయంలో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. కామారెడ్డి టౌన్ ప్లానింగ్ విషయంలో ఇప్పటికప్పుడు ఏమీకాదని హైకోర్టు పేర్కొంది. హైదరాబాద్, వరంగల్ మాస్టర్ ప్లాన్ ఏళ్ల తరబడి ఊగిసలాడుతూనే ఉంటుంది. అనుకున్నట్లు జరిగితే దేశం బాగుండేదని అభిప్రాయపడ్డారు. మరోవైపు కామారెడ్డి మాస్టర్‌ ప్లాన్‌పై అభ్యంతరాలు తీసుకుంటామని ఏజీ హైకోర్టుకు తెలిపారు. దీనికి సంబంధించిన తదుపరి విచారణను ఈ నెల 25కి వాయిదా వేసింది.

బాలింతలకు అస్వస్థత.. సిజేరియన్ చేసిన తర్వాత ఇన్ఫెక్షన్ తో అవస్థలు

జగిత్యాల జిల్లా కేంద్రంలోని మాతా శిశు కేంద్రంలో ఆరుగురు బాలింతలకు అస్వస్థత గురయ్యారు. సిజేరియన్ చేసిన తర్వాత ఇన్ఫెక్షన్ తో బాలింతలు అవస్థలు ఎదుర్కొన్నారు. వైద్య సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే బాలింతలు ఇబ్బందులు పడుతున్నారని బందువులు వాపోతున్నారు. బాలింతలనే కనికరం లేకుండా వైద్య సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆరోపించారు. సిజేరియన్‌ చేసిన ఇన్షెక్షన్‌ అయ్యిందని దానివల్లే బాలింతలు నరకయాతన పడుతున్నారని వాపోయారు. ఇలా ఒకరు, ఇద్దరు కాదని ఆరుగురు గర్భణీలకు ఇదే పరిస్థితి ఎదుర్కొంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మాతా శిశు కేంద్రంలో అన్ని ఏర్పాట్లు ఉన్నా వైద్యులు నిర్లక్ష్యం మాత్రం అడ్డుకట్ట వేసేందుకు అధికారులు ఎవరు లేరని అందుకే వైద్య సిబ్బంది తమ ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తుందని అవస్థకు గురవుతున్న గర్భణీకుటుంబ సభ్యులు మండిపడుతున్నారు. ప్రభుత్వం స్పందించి వైద్య సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు. మరి దీనిపై ప్రభుత్వం స్పందన ఎలా ఉండనుందనేది ఉత్కంఠంగా మారింది.

రేపు మహబూబాబాద్ జిల్లాకు కేసీఆర్

ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు చేతుల మీదుగా జనవరి నెలలో నూతనంగా మరో 3 సమీకృత జిల్లా కలెక్టరేట్లు ప్రారంభంకానున్నాయి. జనవరి 12వ తేదీన ఉదయం మహబూబాబాద్ జిల్లా నూతన కలెక్టరేట్ ను సీఎం ప్రారంభించనున్నారు. అదేరోజు మధ్యాహ్నం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నూతన కలెక్టర్ కార్యాలయాన్ని సీఎం ప్రారంభిస్తారు. సంక్రాంతి పండుగ తర్వాత జనవరి 18వ తేదీన ఖమ్మం జిల్లా నూతన సమీకృత జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు. ఈనేపథ్యంలో.. రేపు మహబూబాబాద్ జిల్లాకు ముఖ్యమంత్రి కేసీఆర్ వెళ్లనున్నారు.జిల్లా కేంద్రంలోని నూతన సమీకృత కలెక్టరేట్ భవన సముదాయం, భీఆర్ఎస్ జిల్లా కార్యాలయం ప్రారంభోత్సవం కార్యక్రమంలో పాల్గొననున్నారు. రేపు సీఎం పర్యటన నేపథ్యంలో.. అన్ని ఏర్పాట్లును అధికారులు సిద్ధం చేశారు.

తెలంగాణలో బీఆర్‌ఎస్‌, బీజేపీ, కాంగ్రెస్‌ హాట్‌ హాట్‌ భేటీలు

తెలంగాణలో రాజకీయం వేడెక్కింది. బీఆర్‌ఎస్‌, బీజేపీ, టి.కాంగ్రెస్‌ వరుస కార్యక్రమాలతో హాట్‌ హాట్‌ గా సమావేశాలు కొనసాగనున్నాయి. ఈనెల 18న ఖమ్మంలో సీఎం కేసీఆర్‌ భారీ సభకు ప్లాన్‌ చేస్తుంటే.. కాంగ్రెస్‌, బీజేపీకి చెందిన ఢిల్లీ దూతలు హైదరాబాద్‌ లో ల్యాండ్‌ అయ్యారు. రెండు రోజుల పాటు ఇక్కడే మకాం వేసి వరుస భేటీలతో బిజీ బిజీగా గడపనున్నారు. రాష్ట్ర కాంగ్రెస్‌ నేతలతో కొత్త ఇంఛార్జీ మాణిక్‌ రావు థాక్రే హైదరాబాద్‌ చేరుకున్నారు. నగరంలో అడుపెట్టడమే ఆలస్యం గాంధీ భవన్‌కు వెళ్లారు. కాంగ్రెస్‌ నేతల మధ్య వున్నగ్యాప్‌లను పోగొట్టేందుకు వరుస మీటింగ్‌ లు ఏర్పాటుచేశారు. ఇటు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్‌ బన్సల్‌ సైతం రెండు రోజుల తెలంగాణాలో పర్యటిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావాలనే లక్ష్యంతో కమలం పార్టీ 10వేల కార్నర్‌ మీటింగ్‌ లు నిర్వహించాలని నిర్ణయించుకుంది. అయితే ఈ మీటింగ్‌ లపై సమీక్షిస్తున్నారు సునీల్‌ బన్సల్‌. ఇందులో భాగంగా మల్కా్జ్‌ గిరి పార్లమెంట్‌ బీజేపీ నేతలతో సమావేశం అయ్యారు. మధ్యాహ్నం పార్లమెంట్‌ ఇన్‌చార్జీలు, కన్వీనర్లు, విస్తారకులతో సమావేశం కానున్నారు.

బీజేపీ ఎర్రబెల్లి ప్రదీప్‌రావు సెక్యూరిటీ తొలగింపు

మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తరహాలోనే మరో లీడర్‌కి షాకిచ్చింది తెలంగాణ ప్రభుత్వం. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సోదరులు బీజేపీ నాయకులు ఎర్రబెల్లి ప్రదీప్ రావు కు గన్ మెన్ తొలగించింది. ప్రదీప్‌రావుకు 2+2 సెక్యూరిటీ కల్పించింది ప్రభుత్వం.. బీఆర్ఎస్‌ను వీడి బీజేపీలో చేరిన ఎర్రబెల్లి ప్రదీప్‌రావుకు గన్‌మెన్లను తొలగించింది. అయితే.. ఏడేళ్లుగా నలుగురు గన్‌మెన్లు ప్రదీప్‌రావుకు భద్రత కల్పిస్తున్నారు. కాగా.. ఇప్పుడు ఆ నలుగురు గన్‌మెన్లను పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో రిపోర్ట్ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. అయితే గన్‌ మెన్ల తొలగింపుపై ప్రదీప్‌ రావు తెలంగాణ ప్రభుత్వంపై ఫైర్‌ అయ్యారు. బీజేపీలో చేరడంతో కక్షసాధింపు ధోరణితో గన్ మెన్ లను తొలగించారని ప్రదీప్ రావు ఆరోపించారు. గత ఏడేళ్ళుగా ఉన్న 2 ప్లస్ 2 గన్ మెన్ లను సడెన్ తొలగించడంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రాణహాని ఉంటేనే కదా గన్ మెన్ లను కెటాయించిందని ప్రశ్నించారు. ఎమ్మెల్యే.. నా అంతు చూస్తానని బెదిరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితులో గన్ మెన్ లను తొలగించడం ఎంతవరకు సమంజసం? అంటూ ప్రశ్నించారు. జరగకూడనిది జరిగితే అందుకు ప్రభుత్వం, స్థానిక ఎమ్మెల్యేనే బాధ్యత వహించాల్సి ఉంటుందని ఎర్రబెల్లి ప్రదీప్ రావు మండిపడ్డారు.

వచ్చే ఎన్నికల్లో కాపు అభ్యర్థి సీఎం కావడం ఖాయం

కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాజమండ్రిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 2024 ఎన్నికల్లో ఏపీ కాపు అభ్యర్థి సీఎం కావడం ఖాయమని స్పష్టం చేశారు. కాపు ముఖ్యమంత్రిని చేయడానికి కాంగ్రెస్ పార్టీ ముందు ఉంటుందని తెలిపారు. 175 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తుందని.. 100 స్థానాల్లో గెలుపు తథ్యమని జోస్యం చెప్పారు. దేశంలోనూ, రాష్ట్రంలోనూ కాంగ్రెస్ గెలుపు ఖాయమన్నారు. రోజు రోజుకు ప్రధాని మోదీ గ్రాఫ్ పడిపోతుందని చింతా మోహన్ ఆరోపించారు. ప్రజలు ప్రాంతీయ పార్టీలను నమ్మడం లేదన్నారు. రాష్ట్రానికి వైసీపీ, టీడీపీ తీరని ద్రోహం చేశాయన్నారు.

దేశవ్యాప్తంగా టాప్-10లో ఏపీ నుంచి మూడు పట్టణాలకు చోటు

దేశవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ మరోసారి సత్తా చాటింది. నివాసానికి సౌకర్యంగా ఉండే పట్టణాల్లో దేశవ్యాప్తంగా టాప్-10లో ఏపీలోని మూడు పట్టణాలు స్థానం సంపాదించాయి. ఈ జాబితాలో గుంటూరు ఆరో స్థానం, విజయవాడ 8వ స్థానం, విశాఖపట్నం 9వ స్థానం దక్కించుకున్నాయి. ఈ మేరకు కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల శాఖ సిటిజన్ పర్సెప్షన్ సర్వే నిర్వహించింది. దేశవ్యాప్తంగా పట్టణ ప్రజల అభిప్రాయాలను ఈ సర్వేలో భాగంగా తెలుసుకున్నారు. ఈ ర్యాంకుల్లో థానే, బెంగళూరు, భోపాల్ మొదటి మూడు స్థానాల్లో నిలిచాయి. అటు పింప్రి చించ్వాడ్, మిరా, నవీ ముంబై, కల్యాన్ డోంబివాలి టాప్ 10లో నిలిచిన మిగిలిన పట్టణాలు. గుంటూరు మెరుగైన ర్యాంకును సాధించేందుకు అక్కడి మున్సిపల్ అధికార యంత్రాంగం ముందు నుంచీ చేపట్టిన ప్రత్యేక చర్యలు సత్ఫలితాలను ఇచ్చాయి. ప్రజల్లో సర్వే పట్ల అవగాహన కల్పించి ఎక్కువ మంది పాల్గొనేలా చేశారు. మెరుగైన స్థానం వస్తే అభివృద్ధికి నిధులు వస్తాయనే ప్రణాళికతో అలా చేశారు.

బీజేపీ ద్వేషాన్ని పెంచుతోంది..

భారత్ జోడో యాత్రలో మరోసారి బీజేపీపై విమర్శలు గుప్పించారు కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ. బుధవారం ఉదయం ఆయన గురుద్వారా ఫతేగఢ్ సాహిబ్ వద్ద ప్రార్థనలు నిర్వహించారు. అక్కడే జరిగిన ర్యాలీలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. బీజేపీ ప్రజల మధ్య ద్వేషాన్ని పెంచుతోందని విమర్శించారు. అయితే భారతదేశం సోదరభావం, ఐక్యత, గౌరవంతో కూడిందని అందుకే యాత్ర విజయవంతం అయిందని ఆయన అన్నారు. భారత్ జోడో యాత్ర నుంచి తాను చాలా నేర్చుకున్నట్లు వెల్లడించారు. రైతులు, దుకాణదారులు, కార్మికులు, నిరుద్యోగ యువతతో మాట్లాడానని అన్నారు. యాత్రలో భాగంగా భారతదేశంలో అతిపెద్ద సమస్యలు అయిన ద్వేషం, హింస, నిరుద్యోగం, ద్రవ్యోల్భణం గురించి పోరాడామని రాహుల్ గాంధీ అన్నారు. ఈ యాత్ర ప్రసంగాలు చేయడానికి కాదని.. ప్రజలు చెప్పేది వినేందుకు అని తెలిపారు. ప్రస్తుతం భారత్ జోడో యాత్ర పంజాబ్ రాష్ట్రంలో సాగుతోంది. ఆ తరువాత యాత్రలో భాగంగా చివరిగా జమ్మూ కాశ్మీర్ లోకి ప్రవేశించనుంది. అంతకుముందు జనవరి 19న పఠాన్ కోట్ లో భారీ ర్యాలీ జరగనుంది.

ఎంజీ నుంచి సరికొత్త ఎలక్ట్రిక్ కార్లు

ప్రముఖ కార్ మేకర్ మోరిస్ గారేజ్(ఎంజీ) మోటార్స్ త్వరలో ఇండియాలో మూడు ఎలక్ట్రిక్ కార్ మోడళ్లను తీసుకురాబోతోంది. ఇప్పటికే ఎంజీ జెడ్ ఎస్ ఈవీ ఎలక్ట్రిక్ కారు ఇండియా వ్యాప్తంగా మంచి ఆదరణ పొందింది. రాబోయే ఐదేళ్లలో ప్రతీ ఏడాది కొత్త ఎలక్ట్రిక్ కార్ ను భారత మార్కెట్లోకి తీసుకురానుంది. ఎంజీ మోటార్ ఆటో ఎక్స్ పో 2023లో కొత్తగా మూడు ఎలక్ట్రిక్ కార్లను ప్రదర్శించింది. ఎంజీ4 ఎలక్ట్రిక్ హ్యాచ్ బ్యాక్ తో పాటు eHS హైబ్రీడ్ ఎస్ యూవీని, మిఫా 9 ఎలక్ట్రిక్ ఎంయూవీని ప్రదర్శించింది. ఎంజీ 4 ఎలక్ట్రిక్ హ్యాచ్ బ్యాక్ రెండు బ్యాటరీ ప్యాకులతో అందుబాటులోకి రానుంది. 51kWh, 64kWh బ్యాటరీ ప్యాక్ లను కలిగి ఉంటుంది. 51kWh వచ్చే వేరియంట్ లో 170 bhp సామర్థ్యం కలిగిన మోటార్ ఉంటుంది, 64kWh వేరియంట్ లో 203 bhp సామర్థ్యం కలిగిన మోటార్ ఉంటుంది. ఎంజీ4 రెండు డిస్ ప్లేలతో, 360-డిగ్రీ కెమెరా, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, వైర్‌లెస్ ఛార్జర్, ADAS ఫీచర్లతో వస్తుంది.

మూడో ప్రపంచ యుద్ధం ఉండదు

ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలన్ స్కీ మంగళవారం గోల్డెన్ గ్లోబ్ అవార్డు ప్రధానోత్సవంలో వర్చువల్ గా ప్రసంగించారు. రష్యాతో కొనసాగుతున్న యుద్ధంపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. మొదటి ప్రపంచ యుద్దంలో మిలియన్ల మంది, రెండో ప్రపంచ యుద్ధంలో పది లక్షల మంది ప్రాణాలు కోల్పోయారని..అయితే మూడో ప్రపంచ యుద్ధం ఉందని ఆయన అన్నారు. రష్యా దురాక్రమణను ఉక్రెయిన్ ఆపుతుందని అన్నారు. 1943లో గోల్డెన్ గ్లోబ్ అవార్డులను ప్రస్తావిస్తూ జెలన్ స్కీ ప్రసంగించారు. యుద్ధంలో ఎవరు గెలుస్తారనేది స్పష్టంగా ఉందని.. అయితే మరికొన్ని యుద్ధాలు, కన్నీళ్లు మిగిలి ఉన్నాయని అన్నారు. స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం, జీవించే హక్కు కోసం, ప్రేమించే హక్కు కోసం ఉక్రెయిన్ పోరాడుతోందని.. దీనికి మద్దతు ఇచ్చిన వారికి కృతజ్ఞతలు తెలిపారు.

గొప్ప కలని నిజం చేసి చూపించారు…

గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ ఈవెంట్ లో బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో ఆర్ ఆర్ ఆర్ సినిమాలోని నాటు నాటు సాంగ్ అవార్డ్ గెలుచుకోని కొత్త చరిత్ర సృష్టించింది. ఇప్పటివరకూ జరిగిన 79 గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ లో జరగనిది, ఈ 80వ ఈవెంట్ లో జరిగింది ఏంటంటే ఒక ఏషియన్ సినిమా బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో అవార్డ్ అందుకోవడం ఇదే మొదటిసారి. ఇప్పటివరకూ ఒక్క ఏషియన్ సినిమాల్లోని ఏ పాట కూడా బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో గోల్డెన్ గ్లోబ్ అవార్డుని గెలుచుకోలేదు అనే మాటని చెరిపేస్తూ ఆ స్థానంలోకి ఇప్పుడు నాటు నాటు సాంగ్ వచ్చి చేరింది. ఆర్ ఆర్ ఆర్ సినిమా ఆస్కార్ తెస్తుంది అనే ఆశలని మరింత పెంచింది ఈ గోల్డెన్ గ్లోబ్ అవార్డ్. మార్చ్ 12న నాటు నాటు సాంగ్ బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో కూడా అవార్డ్ ను సాదిస్తే ఇండియన్ సినిమా గ్లోరీ ప్రపంచవ్యాప్తంగా విస్తరించినట్లే.

వీరయ్య… సాంగ్ అదిరిందయ్యా

జనవరి 13న మాస్ మూలవిరాట్ అవతారంలో ఆడియన్స్ ముందుకి ‘వాల్తేరు వీరయ్య’గా రానున్నాడు మెగాస్టార్ చిరంజీవి. చిరులో మాస్ మాత్రమే కాదు క్లాస్ కూడా ఉంది అని చెప్తూ ‘వాల్తేరు వీరయ్య’ సినిమా నుంచి లాస్ట్ సాంగ్ బయటకి వచ్చింది. ‘నీకేమో అందం ఎక్కువ, నాకేమో తొందరెక్కువ’ అనే లైన్ తో క్యాచీగా సాగిన ఈ సాంగ్ వినడానికి చాలా బాగుంది. దేవి శ్రీప్రసాద్ ఇచ్చిన ట్యూన్, రామజోగయ్య శాస్త్రీ రాసిన లిరిక్స్, మికా సింగ్, గీత మాధురి వోకల్స్ ‘నీకేమో అందం ఎక్కువ, నాకేమో తొందరెక్కువ’ సాంగ్ కి పర్ఫెక్ట్ గా సెట్ అయ్యాయి. ఈరోజు ఉదయం 10:35 నిమిషాలకి విడుదలవ్వాల్సిన ఈ సాంగ్ కొంచెం డిలేతో 11:34 నిమిషాలకి బయటకి వచ్చింది. శేఖర్ మాస్టర్ ఖోరియోగ్రఫి చేసిన ఈ మెలోడి సాంగ్ లో చిరు వేసిన స్టెప్స్ చాలా గ్రేస్ ఫుల్ గా ఉన్నాయి. ఫ్రాన్స్ లోని బ్యూటిఫుల్ లోకేషన్స్ లో ఈ ‘నీకేమో అందం ఎక్కువ, నాకేమో తొందరెక్కువ’ సాంగ్ ని షూట్ చేశారు. మరి ఈ క్లాసు మాసు కలిపి మిక్స్ చేసిన సాంగ్ మెగా అభిమానులని థియేటర్స్ లో ఎంత ఇంప్రెస్ చేస్తుందో చూడాలి.
Telangana High Court: స్టే ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరణ.. విచారణ 25కు వాయిదా