Site icon NTV Telugu

Top Headlines @9AM: టాప్‌ న్యూస్‌!

Top Headlines @ 9 Am

Top Headlines @ 9 Am

నేడు పహల్గామ్ దాడిపై కేంద్రానికి ఎన్ఐఏ రిపోర్ట్..
జమ్మూ కాశ్మీర్ లో పహల్గాం ఉగ్రదాడిపై ఎన్‌ఐఏ ( జాతీయ దర్యాప్తు సంస్థ ) తన ప్రాథమిక నివేదికను ఈ రోజు ( మే 4న) కేంద్ర ప్రభుత్వానికి సమర్పించనుంది. డైరెక్టర్‌ జనరల్‌ సదానంద్‌ ప్రత్యక్ష పర్యవేక్షణలో నివేదిక రూపొందించారు. దాదాపు 150 మంది చెప్పిన సాక్ష్యాలు, దాడి జరిగిన తీరుపై త్రీడీలో పునః సృష్టి చేసిన దృశ్యాలు, సంఘటన ప్రదేశంలో దొరికిన ఆయుధాల సంబంధిత ఆధారాలు సహా పలు వివరాలతో కూడిన రిపోర్టును సిద్ధం చేశారు. ఇక, ఇప్పటికే 90 ఓవర్ గ్రౌండ్ వర్కర్లపై కేసులు నమోదు చేయగా.. సుమారు 3వేల మందిని ప్రశ్నించిన ఎన్ఐఏ.. 100కు పైగా ప్రాంతాల్లో బలగాల సోదాలు చేసింది. దీంతో పాటు పహల్గాంలోని బైసరన్‌కు వెళ్లి దర్యాప్తు పురోగతి గురించి స్వయంగా పర్యవేక్షించారు ఎన్‌ఐఏ డైరెక్టర్‌ జనరల్‌ సదానంద్.

నేడే నీట్-యూజీ.. పరీక్షలో మోసాలకు పాల్పడితే మూడేళ్ల పాటు నిషేధం..
మెడికల్ అడ్మిషన్ పరీక్ష అయిన నీట్-యూజీ కోసం విద్యార్థుల నిరీక్షణ ముగిసింది. నీట్-యూజీ పరీక్ష నేడు (ఆదివారం) మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు దేశవ్యాప్తంగా 550 నగరాల్లోని 5,500 కి పైగా కేంద్రాలలో జరుగనుంది. వీటిలో విదేశాల్లోని 14 పరీక్షా కేంద్రాలు కూడా ఉన్నాయి. గత సంవత్సరం పరీక్షలో అవకతవకలు జరిగాయని ఫిర్యాదులు అందిన తర్వాత, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) ఈసారి పరీక్షా కేంద్రాల సంఖ్యను పెంచింది. కానీ పరీక్షకు ముందే చీటింగ్ మాఫియా పేపర్ లీక్ గురించి పుకార్లను వ్యాప్తి చేస్తున్న తీరు, విద్యార్థులతో పాటు NTA ఏర్పాట్లకు పరీక్షగా మారింది. NTA తో పాటు, విద్యా మంత్రిత్వ శాఖ, హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ కూడా పరీక్షను ఎలాంటి అవాంతరాలు లేకుండా నిర్వహించడానికి పకడ్భందీ ఏర్పాట్లు చేశాయి. విద్యా మంత్రిత్వ శాఖకు సంబంధించిన వర్గాల సమాచారం ప్రకారం, ప్రతి పరీక్షా కేంద్రంలో మూడు అంచెల పర్యవేక్షణ ఏర్పాటు చేశారు. పరీక్షను జిల్లా, రాష్ట్ర, కేంద్ర స్థాయి నుంచి పర్యవేక్షిస్తారు. ఈసారి దాదాపు 23 లక్షల మంది విద్యార్థులు నీట్-యుజి పరీక్షకు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు.

ఏపీటీడీసీలోని కీలక ఉద్యోగి రాసలీలలు
విజయవాడలోని ఏపీటీడీసీ డివిజనల్‌ కార్యాలయంలోని కీలక విభాగంలో బాధ్యతలు నిర్వహిస్తున్న ఉద్యోగి రాసలీలలు బయటకు వచ్చాయి. అయితే, రోజూ రాత్రిపూట తన బైక్ పై ఓ మహిళను వెంటబెట్టుకుని ఆఫీస్ కి వచ్చేవారు. పర్యాటకాభివృద్ధి సంస్థ ఉద్యోగి కావటంతో సెక్యూరిటీ సిబ్బంది కూడా అభ్యంతరం చెప్పే అవకాశం లేదు. ఇక, ఆ ఎంప్లాయ్ బైక్‌ పార్కు చేసి ఆమెను లోపలికి తీసుకెళ్లి అర్థగంట తర్వాత బయటకు వచ్చి తిరిగి వెళ్లిపోయేవారు. దీంతో రోజూ ఆయన రాత్రి సమయంలోనే ఓ మహిళను తీసుకు వస్తుండటంతో ఈ విషయాన్ని ఏపీటీడీసీ అధికారుల దృష్టికి సెక్యూరిటీ సిబ్బంది తీసుకెళ్లారు. ఇక, అసలేం జరుగుతుందో తెలుసుకోవటానికి అధికారులు సీసీ ఫుటేజీని చూశారు. దీంతో, ఆ ఉద్యోగి అసలు బాగోతం బయటపడింది. కాగా, డివిజన్ కార్యాలయంలోనే సదరు ఉద్యోగి రాసలీలలు చేయడంతో ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. అలాగే, సదరు మహిళతో సన్నిహితంగా ఉన్న ఫొటో ఆయన వాట్సాప్‌ స్టేటస్‌లో పెట్టుకోవడంతో అతడి రాసలీలలను ఆయనే బయట పెట్టుకున్నట్టు అయింది. ప్రస్తుతం ఈ వ్యవహారంపై విచారణ కొనసాగుతుంది.

ఒంగోలులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి..
ప్రకాశం జిల్లాలోని ఒంగోలులోని కొప్పోలులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదివారం తెల్లవారుజామున ఒంగోలు మండలం కొప్పోలు సమీపంలో కారును వెనుక నుంచి లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఇక, సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన ప్రదేశానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. మరణించిన వారి మృతదేహాలను పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాగా, ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ కొనసాగిస్తున్నారు.

ఆస్ట్రేలియా ప్రధానిగా ఆంథోనీ అల్బనీస్
ఆస్ట్రేలియా సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాన మంత్రి ఆంథోనీ అల్బనీస్ విజయం సాధించారు. అధికార లేబర్ పార్టీ నాయకుడు 21 సంవత్సరాలలో వరుసగా రెండవసారి మూడేళ్ల పదవీకాలం గెలిచిన మొదటి ఆస్ట్రేలియా ప్రధానమంత్రి అయ్యాడు. కన్జర్వేటివ్ లిబరల్ పార్టీ నాయకుడు పీటర్ డట్టన్ తన డిక్సన్ స్థానాన్ని కూడా నిలుపుకోలేకపోయాడు. ఈ సీటును లేబర్ పార్టీ అభ్యర్థి గెలుచుకున్నారు. ఓటమిని అంగీకరిస్తూ, మేము బాగా రాణించలేదని అన్నారు. దీనికి నేను పూర్తి బాధ్యతను స్వీకరిస్తున్నాను అని పీటర్ డట్టన్ తెలిపారు. ఆస్ట్రేలియా ప్రధానమంత్రిగా ఆంథోనీ అల్బనీస్ అఖండ విజయం సాధించి తిరిగి ఎన్నికైనందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆయనకు అభినందనలు తెలిపారు. భారతదేశం-ఆస్ట్రేలియా సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింతగా బలోపేతం చేయడానికి కలిసి పనిచేయడానికి ఎదురుచూస్తున్నానని ఆయన అన్నారు. తన విజయం తర్వాత మద్దతుదారులను ఉద్దేశించి అల్బనీస్ ఇలా అన్నాడు.. ‘అమెరికా తరహా విభజన రాజకీయాలను అమలు చేయడానికి, ఆస్ట్రేలియన్లను ఒకరిపై ఒకరు పోటీ పెట్టడానికి ఇక్కడ ఒక ప్రయత్నాన్ని మనం చూశాము. అది ఆస్ట్రేలియన్ మార్గం కాదని నేను భావిస్తున్నాను అని అన్నారు.

హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్న మరో స్టార్ డైరెక్టర్..?
ప్రస్తుతం ఇండస్ట్రీతో సంబంధం లేకుండా మంచి క్రేజ్ సంపాదించుకున్న దర్శకులో లోకేష్ కనకరాజ్ ఒకరు. తక్కువ సినిమాలే తీసినప్పటికీ భారతీయ సినిమా పరిశ్రమలో గణనీయమైన ప్రభావం చూపారు. ఆయన సినిమాలు తమిళ సినిమాకు కొత్త ఒరవడిని తీసుకొచ్చాయి. ఆయన ఇప్పటి వరకు తెరకెక్కించిన ప్రతి ఒక మూవీ మానగరం, ఖైదీ, విక్రమ్, లియో, మాస్టర్.. వరుస పెట్టి ప్రతి ఒక్క చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించాయి. లోకేష్ తన సినిమాల్లో భారీ యాక్షన్, స్టైలిష్ విజువల్స్, బలమైన కథలను ఎంచుకుంటాడు అందుకే ఆయన చిత్రాలకు అంత డిమాండ్. ప్రజంట్ రజిని కాంత్ తో ‘కూలీ’ మూవీ తీస్తున్నాడు. అయితే, తాజాగా లోకేష్ కి సంబంధించి ఓ వార్త వైరల్ అవుతుంది. లోకేష్ కనకరాజ్ ఇప్పుడు హీరోగా మారుతున్నట్లు కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఆయన హీరోగా మారేందుకు రెడీ అవుతున్నాడట. అది కూడా తానే స్వీయ దర్శకత్వంలో ఓ సినిమాలో హీరోగా నటించబోతున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. వచ్చే ఏడాది ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కబోతుందట. దీని గురించి ఎలాంటి అధికారిక ప్రకటన రానప్పటికి ప్రజంట్ ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

సుభాస్కరన్ ప్రెజెంట్స్.. లైకా ప్రొడక్షన్స్ కేరాఫ్ డిజాస్టర్స్
లైకా ప్రొడక్షన్స్‌ అంటే ఫ్లాపులకు డిజాస్టర్స్‌కు బ్రాండ్‌ అంబాసిడర్ అయిపోయింది. ఏ హీరో నటించినా ఫ్లాప్‌ గ్యారెంటీ అనేట్టుగా మారిపోయింది. పొన్నియన్‌ సెల్వన్‌తో మంచి లాభాలు చూసిన లైకా ఆ తర్వాత డిజాస్టర్స్‌తో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటుంది. మూడేళ్లనుంచి లైకా నుంచి వస్తున్న సినిమాలన్నీ బాక్సాఫీస్‌ వద్ద చేతులెత్తేస్తున్నాయి. అజిత్‌ ఫ్యాన్స్‌ ఎన్నో ఆశలు పెట్టుకున్న ‘విదామయూర్చి’ వీకెండ్‌ సినిమాగా మిగిలిపోయింది. తెలుగులో పట్టుదల పేరుతో రిలీజై కోటి కూడా కలెక్ట్‌ చేయలేయలేదు. అజిత్‌కు తమిళంలో మాంచి ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ వున్నా  సరైన కథ ట్రీట్‌మెంట్ లేకపోవడంతో తమిళ తంబీలు రిజక్ట్ చేశారు. కూతురు ఐశ్వర్య డైరెక్షన్‌లో రజనీకాంత్‌ నటించిన ‘లాల్‌ సలాం’ లైకాను కోలుకోలేనంతగా దెబ్బ కొట్టింది. రజనీకాంత్‌తో తీసిన ‘వెట్టయాన్‌’కూడా  యావరేజ్ గా నిలిచింది. లైకా నుంచి ఏది వచ్చినా ఫ్లాప్‌ బాటే పట్టడం కోలీవుడ్‌ను కలవరపెడుతోంది. హిందీలో అక్షయ్‌కుమార్‌తో తీసిన రామ్‌సేతు బాక్సాఫీస్‌ వద్ద తేలిపోయింది. చంద్రముఖి సీక్వెల్ చంద్రముఖి2 మరో మరో ప్లాప్. ఇక భారతీయుడు 2 అయితే విమర్శలతోపాటు వందల కోట్లు నష్టాలతో ప్రొడక్షన్‌ హౌస్‌ను ముంచింది. ఇక లైకా ప్రొడక్షన్స్‌ను ఇక లూసిఫర్‌ సీక్వెలే రక్షిస్తుందనుకుంటే వివాదాలు చుట్టుముట్టాయి. హైప్‌ కారణంగా మంచి ఓపెనింగ్స్‌ వచ్చినా పృథ్వీరాజ్‌కు మాత్రం చెడ్డ పేరు తీసుకొచ్చింది. పెద్ద పెద్ద హీరోలతో క్రేజీ ప్రాజెక్ట్స్‌ తీసిన లైకా ప్రొడక్షన్స్‌ చేతిలో ప్రస్తుతం సందీప్‌ కిషన్‌ హీరోగా విజయ్ కొడుకు దర్శకత్వంలో సినిమాతో పాటు మరో సినిమా మాత్రమే ఉంది. ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న లైకాకు ఫండర్ దొరకాలి. అలాగే మంచి కథలతో బౌన్స్ బ్యాక్ అవ్వాలి. లేదంటే లైకా మరో ప్లాప్ బ్యానర్ గా దుకాణం సర్దేయాల్సి వస్తుంది.

Exit mobile version