NTV Telugu Site icon

Top Headlines @9AM: టాప్‌ న్యూస్‌!

Top Headlines @ 9 Am

Top Headlines @ 9 Am

బెట్టింగ్ యాప్స్ వ్యవహారపై సిట్ ఏర్పాటు..
బెట్టింగ్ యాప్స్ వ్యవహారంపై తెలంగాణలో దర్యాప్తు వేగవంతమైంది. ఈ కేసును విచారించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటు చేయాలని డీజీపీ జితేందర్ ఆదేశాలు జారీ చేశారు. సిట్‌కు ఐజీ ఎం. రమేష్‌ను ప్రధాన అధికారిగా నియమించారు. ఈ బృందంలో ఎం. రమేష్‌తో పాటు ఎస్పీలు సింధు శర్మ, వెంకటలక్ష్మి, అదనపు ఎస్పీలు చంద్రకాంత్, శంకర్‌లు సభ్యులుగా ఉంటారు. ఇప్పటికే హైదరాబాద్ పంజాగుట్ట, సైబరాబాద్ మియాపూర్ పోలీస్‌స్టేషన్‌లలో బెట్టింగ్ యాప్స్‌పై రెండు కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల్లో టాలీవుడ్, బాలీవుడ్‌కు చెందిన 25 మంది ప్రముఖులు, యూట్యూబర్స్, టీవీ యాంకర్ల పేర్లు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. ప్రస్తుతం నమోదైన రెండు కేసులను ప్రత్యేక దర్యాప్తు బృందానికి బదిలీ చేస్తూ అధికారిక ఆదేశాలు జారీ అయ్యాయి. 90 రోజుల్లోగా పూర్తిస్థాయి నివేదిక అందించాలని డీజీపీ జితేందర్ సిట్ బృందాన్ని ఆదేశించారు. ఈ దర్యాప్తుతో బెట్టింగ్ యాప్స్ వెనుక ఉన్న అసలు నెట్‌వర్క్‌ను బయటకు తీసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు.. ఔరంగజేబ్ సమాధిని కూల్చి..
బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఔరంగజేబు సమాధిని కూల్చివేస్తామని, సముద్రంలో పడేస్తామని స్పష్టం చేశారు. తెలంగాణ హిందువులు అవసరమైతే మహారాష్ట్ర హిందువులకు మద్దతుగా వెళతారని పేర్కొన్నారు. ఆయన మాట్లాడుతూ మోడీ మేనిఫెస్టోలో దేశాన్ని హిందూ రాష్ట్రంగా మార్చే ప్రకటన ఉండాలని కోరారు. వచ్చే ఎన్నికలు కాశి, మథుర, హిందూ రాష్ట్ర భవిష్యత్తుపై ఆధారపడతాయని అభిప్రాయపడ్డారు. గత ఏడాది శ్రీరామనవమి శోభాయాత్రకు పోలీసులు అనుమతి నిరాకరించారని, ఎంఐఎం ఆదేశంతోనే అనుమతి రద్దు చేశారని ఆరోపించారు. ఈసారి అనుమతి కోసం దరఖాస్తు కూడా వేయలేదని తెలిపారు. అయోధ్యలో భవ్య రామమందిర నిర్మాణం పూర్తయిన తర్వాత, ఔరంగజేబు, బాబర్ వారసులు పరేషాన్ అవుతున్నారని వ్యాఖ్యానించారు. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.

దారుణం.. దైవ దర్శనానికి వచ్చిన యువతిపై 8 మంది సామూహిక అత్యాచారం..
నాగర్‌కర్నూల్ జిల్లా ఊరుకొండ మండలం ఊరుకొండపేటలో దారుణ ఘటన చోటుచేసుకుంది. శ్రీ ఆంజనేయ స్వామి ఆలయానికి బంధువులతో కలిసి వచ్చిన యువతిపై గుట్టల ప్రాంతంలోకి లాక్కెళ్లి 8 మంది యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఇదే సమయంలో, ఆమెతో వచ్చిన బంధువుపై కూడా దాడి చేశారు. ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఇప్పటికే ఆరుగురిని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. మిగిలిన ఇద్దరిని పట్టుకునేందుకు గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం రేపింది. గ్రామస్థులు నిందితులకు కఠిన శిక్ష విధించాలని డిమాండ్ చేస్తున్నారు.

మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి పోలీసుల నోటీసులు..
వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి పోలీసుల షాక్ ఇచ్చారు. అక్రమ మైనింగ్ కేసులో నోటీసులు ఇవ్వడానికి పోలీసులు ఆయన ఇంటికి వెళ్లగా కాకాణి అందుబాటులో లేరు. అయితే, కాకాణి ఇంటికి తాళం వేసి ఉండటంతో.. ఆయనకు, ఆయన పీఏకు కాల్ చేస్తే స్విచ్ఛాఫ్ అని రావడంతో పోలీసులు ఏం చేయాలో తెలియక ఇంటి గేట్ కు నోటీసులను అంటించారు పోలీసులు. అయితే, వివరాల్లోకి వెళితే.. క్వార్ట్జ్ అక్రమాలు, భారీ పేలుడు పదార్థాల వినియోగం, రవాణా ఆరోపణల నేపథ్యంలో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిపై ఇటీవల కేసు నమోదైంది. ఈ కేసులో ఆయనను ఈరోజు (మార్చ్ 31) విచారణ చేయాలని పోలీసులు నిర్ణయించారు. ఈ క్రమంలో నోటీసులు ఇచ్చేందుకు పోలీసులు ఆదివారం అతడి నివాసానికి వెళ్లాగా.. విషయం ముందుగానే తెలుసుకున్న కాకాణి ఇంటికి తాళాలు వేసి అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది.

రాంగ్ కాల్ ఛార్జ్ విలువ రూ . 4 కోట్లు..!
రాంగ్ కాల్ ద్వారా పరిచయమైన మహిళతో సాన్నిహిత్యం పెంచుకున్న తిరుపతి జిల్లా శ్రీకాళహస్తికి చెందిన బి అక్షయ్ కుమార్.. ఆమెతో తీసుకున్న వీడియోలను చూపించి బెదిరించి 4 కోట్ల రూపాయల నగదుతో పాటు 800 గ్రాముల బంగారు ఆభరణాలు కాజేశాడు. అప్పటికే, అతడి వేధింపులు ఎక్కువ కావడంతో బాధిత కుటుంబ సభ్యులు విశాఖలోని త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దీంతో నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. దీనికి సంబంధించిన వివరాలు.. శ్రీకాళహస్తికి చెందిన బి.అక్షయ్‌కు కరోనా సమయంలో పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఓ మహిళతో రాంగ్‌కాల్‌ ద్వారా పరిచయం ఏర్పడింది. తరువాత ఆమెకు కాల్ చేయగా స్పందించకపోవడంతో మెస్సెజ్ లు పంపడం స్టార్ట్ చేశాడు.. ఆ క్రమంలో ఆమె వ్యక్తిగత విషయాలు తెలుసుకున్నాడు.. తనతో స్నేహం చేయాలని.. లేకపోతే తన వద్ద వాయిస్‌ రికార్డులు.. నీ భర్తకు పంపిస్తానని ఆ మహిళను బెదిరించేవాడని పోలీసులు తెలిపారు.

ట్రంప్-పుతిన్ మధ్య చెడుతున్న సంబంధాలు..! కారణమిదేనా?
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్-రష్యా అధ్యక్షుడు పుతిన్ మధ్య సంబంధాలు దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. నిన్నామొన్నటి దాకా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీపై గరం గరంగా ఉన్న ట్రంప్.. ఇప్పుడు డైరెక్షన్ మారింది. తాజాగా పుతిన్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పుతిన్‌పై ట్రంప్ కోపం ప్రదర్శించారు. ఉక్రెయిన్‌లో జెలెన్‌స్కీ పదవి నుంచి తప్పుకుంటేనే.. శాంతి చర్చలు జరుపుతానంటూ ఇటీవల పుతిన్ చేసిన వ్యాఖ్యలు ట్రంప్‌నకు తీవ్ర కోపం తెప్పించాయి. ఉక్రెయిన్‌లో రక్తపాతాన్ని ఆపకపోతే రష్యాదే తప్పు అవుతుందన్నారు. ఒకవేళ రష్యా ఒప్పందం చేసుకోకపోతే భారీ స్థాయిలో చమురుపై సుంకాలు విధిస్తామని ట్రంప్ హెచ్చరించారు. తన కోపం గురించి పుతిన్‌కు తెలుసని.. ఇప్పటికీ పుతిన్‌తో మంచి సంబంధాలు ఉన్నాయన్నారు. ఉక్రెయిన్ విషయంలో పుతిన్ మంచి నిర్ణయాలు తీసుకుంటే.. తన కోపం తగ్గుతుందని.. లేదంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ట్రంప్ పేర్కొన్నారు.

రోజురోజుకూ రోహిత్‌ ఆట పడిపోతోంది.. ఏదో నెట్టుకొస్తున్నాడు అంతే!
టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ బ్యాటింగ్‌లో ఏదోలా నెట్టుకొస్తున్నాడని, హిట్‌మ్యాన్‌లో ఒకప్పటి ఫామ్‌ లేదని భారత మాజీ ఆటగాడు సంజయ్‌ మంజ్రేకర్‌ అన్నారు. 3-4 ఏళ్ల క్రితం నాటి రోహిత్‌ అయితే కాదని, రోజు రోజుకూ అతడి ఆట పడిపోతోందన్నారు. పరిస్థితులకు తగ్గట్లు మారకుండా.. ఇప్పటికీ తన సహజసిద్ధమైన బ్యాటింగ్‌ నైపుణ్యంపైనే ఆధారపడుతున్నాడని విమర్శించారు. రోహిత్ ఇప్పటికైనా కఠోర సాధన చేసి అత్యుత్తమంగా రాణించడంపై దృష్టి సారించాలని మంజ్రేకర్‌ సూచించారు. జియోస్టార్‌లో సంజయ్‌ మంజ్రేకర్‌ మాట్లాడుతూ… ‘ప్రస్తుతం రోహిత్‌ శర్మ కెరీర్‌లో చరమాంకంలో ఉన్నాడు. హిట్‌మ్యాన్‌లో ఒకప్పటి ఫామ్‌ లేదని కచ్చితంగా చెప్పొచ్చు. మూడు నాలుగేళ్ల క్రితం నాటి రోహిత్‌ అయితే కాదు. రోహిత్ ఆట రోజురోజుకూ పడిపోతోంది. అతడు బరిలో దిగిన ప్రతిసారీ సవాళ్లను ఎదుర్కొంటున్నాడు. పిచ్, పరిస్థితులకు తగ్గట్లు మారకుండా.. ఇప్పటికీ తన సహజ బ్యాటింగ్‌ నైపుణ్యంపైనే ఆధారపడుతున్నాడు. రోహిత్ ఇప్పటికైనా కఠోర సాధన చేసి అత్యుత్తమంగా రాణించడంపై దృష్టి సారించాలి.