రాష్ట్ర ప్రజలకు కృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు..
శ్రీ కృష్ణ జన్మాష్టమి పర్వదినం సందర్భంగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు కృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఆ శ్రీకృష్ణ భగవానుడు ఆశీస్సులు మీ కుటుంబాన్ని ఆనందంతో, ఆరోగ్యంతో, ఐశ్వర్యంతో ఆశీర్వదించాలని మనసారా కోరుకుంటున్నాను అని ఎక్స్ ( ట్విట్టర్ ) వేదికగా పోస్ట్ చేశారు. భగవత్ గీతలో జీవిత సారం చెప్పిన శ్రీకృష్ణ పరమాత్ముడిని నిత్యం మనం స్మరించుకోవడం అంటే మన కర్తవ్యాన్ని మనం గుర్తు చేసుకుని ముందుకు సాగడమే అని ఏపీ సీఎం పేర్కొన్నారు. ఏ విషయంలో అయినా మనకు స్ఫూర్తినిచ్చే శ్రీ కృష్ణ తత్వాన్ని సరిగ్గా అర్ధం చేసుకుంటే.. ప్రతి అంశంలో మనం విజయం సాధించవచ్చు అని అన్నారు. ఈ కృష్ణాష్టమి సందర్భంగా ఆ నీల మేఘశ్యాముని కృపా, కటాక్షం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంపై సదా ఉండాలని కోరుకుంటున్నాను అని సీఎం చంద్రబాబు నాయుడు చెప్పుకొచ్చారు.
నేటి నుంచి విశాఖలో ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ
నేటి నుంచి అగ్నివీర్ నియామక ప్రక్రియలో భాగంగా విశాఖపట్నం పోర్టు స్టేడియంలో భారీ ఆర్మీ ర్యాలీలు నిర్వహించనున్నారు. సెప్టెంబర్ 5వ తేదీ వరకూ జరిగే ఈ నియామక ప్రక్రియలో వివిధ రకాల పరీక్షలు పెట్టే అవకాశం ఉంది. పదో తరగతి ఉత్తీర్ణతతో అగ్నివీర్ జనరల్ డ్యూటీ, అగ్నివీర్ టెక్నికల్, అగ్నివీర్ ఆఫీస్ అసిస్టెంట్/స్టోర్ కీపర్ టెక్నికల్ పోస్టులతో పాటు 8వ తరగతి ఉత్తీర్ణతతో అగ్నివీర్ ట్రేడ్ మ్యాన్ పోస్టుల్ని భర్తీ చేయబోతున్నారు. పోర్టు స్టేడియానికి ఆదివారం అర్ధరాత్రి నుంచి అభ్యర్థులు భారీగా చేరుకుంటున్నారు. ఇక, ముందుగా రిజిస్టర్ చేసుకొని అడ్మిట్ కార్డులు తీసుకున్న వారికి మాత్రమే నియామక ప్రక్రియలో పాల్గొనేందుకు ఛాన్స్ కల్పించనున్నారు. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, కోనసీమ, కాకినాడ, ఏలూరు, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లా, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాలకు చెందిన యువకులు ఈ ర్యాలీలో పాల్గొనబోతున్నారు. అడ్మిట్ కార్డుల కోసం ఇండియన్ ఆర్మీ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసిన ప్రతి ఒక్క ధృవపత్రంతో అభ్యర్థులు హాజరవ్వాలని అధికారులు సూచించారు.
వేములవాడ రాజన్న ఆలయంలో ఏసీబీ తనిఖీలు..
వేములవాడ రాజన్న ఆలయంలో పలు శాఖలలో ఆలయ అధికారుల అవినీతి ఆరోపణ నేపథ్యంలో ఏసీబీ తనిఖీలు జరిగాయి. తాజాగా అంతర్గత బదిలీలు చేపట్టారు ఆలయ ఈవో వినోద్ రెడ్డి. ఈ నేపథ్యంలో 20 మంది ఆలయ అధికారుల అంతర్గత బదిలీలు జరిగాయి. ప్రధానంగా సరుకుల నిలువలలో వ్యత్యాసం రాగా గోదాం పర్యవేక్షకుడు నరసయ్యను బాధ్యతల నుంచి తప్పించారు. కళ్యాణ కట్ట లోను భక్తుల నుండి డబ్బులు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలతో విధులు నిర్వహిస్తున్న ఇద్దరు రికార్డ్ అసిస్టెంట్లు, ఒక పరిచారికను కూడా బాధ్యతలు నుంచి తొలగించారు. ముగ్గురు పర్యవేక్షకులతోపాటు 9 మంది సీనియర్ అసిస్టెంట్లు, ఇద్దరు జూనియర్ అసిస్టెంట్లు, 5 రికార్డ్ అసిస్టెంట్లు ఒక పరిచారికతో కలిపి 20 జారీచేసిన మంది ఉద్యోగులకు అంతర్గత బదిలీలు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసారు ఈవో వినోద్ రెడ్డి. ఇంకా ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
హైదరాబాద్ రాజేంద్రనగర్ లో డ్రగ్స్ కలకలం.. నైజీరియా లేడి కిలాడి అరెస్ట్..
మరోసారి హైదరాబాద్ లో డ్రగ్స్ కలకలం రేగింది. తాజాగా భారీ మొత్తంలో డ్రగ్స్ సీజ్ చేసారు రాజేంద్రనగర్ పోలీసులు. 50 గ్రాముల MDMA, 25 గ్రాముల కొకైన్ ను సీజ్ చేసారు పోలీసులు. నైజీరియా లేడి కిలాడి అరెస్ట్ చేయగా.. మరో నలుగురు పరారీలో ఉన్నారు. ఇక ఈ డ్రగ్స్ సరఫరా బెంగుళూరు నుండి హైదరాబాద్ కు జరుగుతోంది. అలా చేరుకున్న తర్వాత హైదరాబాద్ లో డ్రగ్స్ విక్రయిస్తున్నారు కేటుగాళ్లు. భార్య, భర్త తో పాటు మరో ముగ్గురు డ్రగ్స్ విక్రయిస్తున్నట్లు సమాచారం. గత కొంత కాలంగా కొనసాగుతోంది ఈ డ్రగ్స్ దందా. NDPS యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఈ కేసులో నైజీరియాకు చెందిన తంబ ఫైడెల్మా ను జైల్ కు తరలించారు అధికారులు. సన్ సిటీని అడ్డాగా చేసుకొని కొనసాగుతుంది ఈ డ్రగ్స్ దందా. బెంగుళూరు నుండి డ్రగ్స్ తీసుకొని వచ్చిన ఈ నైజీరియా లేడీ కిలాడి.. బండ్లగుడా సన్ సిటీ వద్ద డ్రగ్స్ విక్రయిస్తుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు పోలీసులు. ఈ డ్రగ్స్ దందాకు భార్య భర్తలు తెరలేపారు. గతంలో కూడా డ్రగ్స్ విక్రయిస్తూ భర్త పట్టుబడాడ్డు. బెంగుళూరుకు చెందిన మైటీ గాడ్ అనే డ్రగ్స్ సప్లయర్ వద్ద డ్రగ్స్ కొనుగోలు చేసినట్లుగా సమాచారం. గత కొంత కాలంగా వీరు మైటీ గాడ్ అనే డ్రగ్స్ సప్లయర్ వద్ద డ్రగ్స్ కొనుగోలు చేస్తున్నారు. బెంగుళూరు నుండి హైదరాబాద్ కు డ్రగ్స్ తీసుకొని వచ్చి ఇక్కడ విక్రయం చేస్తున్నారు.
జమ్మూలో పోటీకి 50మంది బీజేపీ అభ్యర్థులు ఖరారు.. మాజీ ఎమ్మెల్యేల టిక్కెట్లలో కోత
జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఆదివారం బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ కీలక సమావేశం జరిగింది. ప్రధాని మోడీ నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో జమ్మూ కాశ్మీర్‌లోని 50కి పైగా స్థానాలకు అభ్యర్థుల పేర్లను ఖరారు చేశారు. సమావేశంలో జమ్మూ ప్రాంతంలోని 43 సీట్లలో చాలా వరకు అభ్యర్థుల పేర్లను ఆమోదించారు. ఈ ఆదివారం జరిగిన సమావేశంలో జమ్మూ కాశ్మీర్‌లోని కొంతమంది పాత సిట్టింగ్ ఎమ్మెల్యేల టిక్కెట్లను రద్దు చేయాలని నిర్ణయించినట్లు వర్గాల సమాచారం. డీలిమిటేషన్ తర్వాత సీట్లు రద్దు చేయబడిన లేదా మార్చబడిన ఎమ్మెల్యేలు వీరిలో ఉన్నారు. అలాగే అసెంబ్లీ ఎన్నికల్లో కొందరు కొత్త ముఖాలను బరిలోకి దింపేందుకు బీజేపీ సమావేశంలో ఆమోదం లభించింది. జమ్మూకశ్మీర్‌లోని 90 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ 60 నుంచి 70 స్థానాల్లో పోటీ చేయాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. జమ్మూ ప్రాంతంలోని చాలా మంది పెద్ద ముఖాల టిక్కెట్లు రద్దు చేయబడ్డాయి. దీంతో పాటు ఏ రాజకీయ పార్టీతోనూ బీజేపీ పొత్తు పెట్టుకోదు. పోటీ చేయని స్థానాల్లో బలమైన స్వతంత్ర అభ్యర్థులకు మద్దతు ఇస్తుంది. జమ్మూకశ్మీర్‌లో అభ్యర్థుల తొలి జాబితాను బీజేపీ నేడు (సోమవారం) విడుదల చేయనుంది. ఈ జాబితా ఉదయం 10 గంటలకు విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ జాబితాలో తొలి దశ సీట్లకు అభ్యర్థుల పేర్లను ప్రకటిస్తారు. మిగిలిన దశల సీట్లపై తదుపరి సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు.
చైనాలో భారీ వర్షాలు… నార్త్ వెస్ట్రన్ ప్రావిన్స్‌లో వరద విధ్వంసం
ప్రస్తుతం చైనాలోని చాలా నగరాలు భారీ వర్షాలు, కొండచరియలు విరిగిపడటం వంటి ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొంటున్నాయి. శనివారం కురిసిన భారీ వర్షాల కారణంగా వాయువ్య ప్రావిన్స్‌లో వరదలు వచ్చాయి. వాయువ్య గన్సు ప్రావిన్స్, నింగ్జియా అటానమస్ రీజియన్‌లో అధిక వర్షం వరదలకు కారణమైందని ప్రభుత్వ ఛానెల్ నివేదించింది. గన్సు ప్రావిన్స్‌లోని జిన్‌చాంగ్ నగరంలో ప్రతికూల వాతావరణం కారణంగా ఇద్దరు వ్యక్తులు మరణించినట్లు నిర్ధారించింది. అలాగే నగరంలోని కొన్ని రోడ్లు జలమయమై ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. గత రెండు నెలల్లో చైనాలో వరదలు, కొండచరియలు విరిగిపడటంతో 150 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఈ సారి ఈ ప్రాంతంలో కుండపోత వర్షం కురిసింది. చైనాలోని గన్సు ప్రావిన్స్‌లో శనివారం ఉదయం నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఇక్కడ లోతట్టు ప్రాంతాల్లో నీటి ఎద్దడి నెలకొంది. గన్సు ప్రావిన్స్‌లోని స్థానిక అధికారులు మాట్లాడుతూ, డ్రెయినేజీ, ఉపశమనం కోసం వెంటనే రెస్క్యూ దళాలను పంపారు. అదే సమయంలో వరదల వల్ల జరిగిన నష్టాన్ని పక్కాగా అంచనా వేస్తున్నారు. స్థానిక అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, రాజధాని యిన్‌చువాన్‌లోని నింగ్‌జియాలో శనివారం ఉదయం నుండి భారీ వర్షాలు ప్రారంభమయ్యాయి. లోతట్టు ప్రాంతాలలో తీవ్రమైన వరదలు సంభవించాయి. యిన్చువాన్ చైనా నింగ్జియా హుయ్ అటానమస్ రీజియన్ రాజధాని, ఇది వాయువ్య ప్రావిన్స్‌లో ఉంది. ఈరోజుల్లో అది భారీ వరదల గుప్పిట్లో ఉంది.
నేటి నుంచే యుఎస్ ఓపెన్.. 25వ టైటిల్‌పై ‘రారాజు’ కన్ను!
ఈ సీజన్‌లో చివరి గ్రాండ్‌స్లామ్ టోర్నీ ‘యుఎస్ ఓపెన్’ నేడు ఆరంభం కానుంది. సోమవారం (ఆగష్టు 26) నుంచి మెయిన్ డ్రా మ్యాచ్‌లు జరగనున్నాయి. పురుషులు, మహిళల సింగిల్స్‌లో ఎంతోమంది స్టార్ ప్లేయర్లు ఉన్నా.. అందరి దృష్టి మాత్రం సెర్బియా యోధుడు, రికార్డుల రారాజు నొవాక్ జకోవిచ్‌పైనే ఉంది. జకో డిఫెండింగ్ ఛాంపియన్ టైటిల్ నిలబెట్టుకుంటాడా?, 25వ విజయంతో మార్గరెట్ కోర్ట్ (24)ను వెనక్కి నెడతాడా? అని ఫాన్స్ ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే అత్యధిక గ్రాండ్‌స్లామ్ టైటిళ్లు గెలిచిన పురుష టెన్నిస్ ఆటగాడిగా నొవాక్ జకోవిచ్ రికార్డు నెలకొల్పాడు. ఇటీవల ముగిసిన పారిస్ ఒలింపిక్స్ 2024లో గోల్డ్ మెడల్ గెలిచి.. తన సుదీర్ఘ స్వర్ణ కలను సాకారం చేసుకున్నాడు. జకో ఎన్నో విజయాలు, ఘనతలు సాధించాడు. ఇక అతడిని 25వ టైటిల్ ఘనత మాత్రమే ఊరిస్తోంది. ఇది సాధించి ఓవరాల్‌గా అత్యధిక గ్రాండ్‌స్లామ్ ట్రోఫీలు సొంతం చేసుకున్న టెన్నిస్ ప్లేయర్‌గా చరిత్ర సృష్టించాలని చూస్తున్నాడు. యుఎస్ ఓపెన్ 2024 తొలి రౌండ్లో 138వ ర్యాంకర్ అల్బాట్ (మోల్డోవా)తో జకోవిచ్ తలపడనున్నాడు. తొలి రౌండ్లో జకోవిచ్‌కు విజయం ఖాయం అయినా.. ఆపై కఠిన పరీక్ష తప్పకవపోవచ్చు. ఈ ఏడాది ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్ గెలిచిన స్పెయిన్ యువ ఆటగాడు అల్కరాస్ ప్రధాన పోటీదారుడిగా ఉన్నాడు. టాప్‌సీడ్ సినర్ (ఇటలీ) నుంచి కూడా జకోకు గట్టి పోటీ ఎదురయ్యే అవకాశం ఉంది. అలానే మెద్వెదెవ్, జ్వెరెవ్ కూడా రేసులో ఉన్నారు. ఈ ఏడాది ఒక్క గ్రాండ్‌స్లామ్ కూడా గెలవని జకో.. ఇప్పుడు ఫామ్ మీదుండడం కలిసొచ్చే అంశం. పారిస్ ఒలింపిక్స్‌లో అల్కరాస్‌ను ఓడించడంతో జకోవిచ్ ఆత్మవిశ్వాసం మరింత పెరిగింది.
మను బాకర్‌కు స్ఫూర్తినిచ్చిన క్రీడాకారులెవరో తెలుసా?.. మనోళ్లే ముగ్గురు!
పారిస్ ఒలింపిక్స్ 2024లో భారత స్టార్ షూటర్ మను బాకర్ అదరగొట్టిన విషయం తెలిసిందే. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత విభాగంలో కాంస్యం సాధించిన మను.. సరబ్‌జోత్ సింగ్‌తో కలిసి 10 మీటర్ల పిస్టల్ మిక్స్‌డ్ డబుల్స్‌లో మరో కాంస్య పతకం గెలిచింది. ఒకే ఒలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించిన మను.. ఎంతోమంది యువతకు స్ఫూర్తిగా నిలిచింది. అయితే తనకు స్ఫూర్తినిచ్చిన క్రీడాకారులు ఎవరో తాజాగా చెప్పింది. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, టీమిండియా మోస్ట్ సక్సెస్ ఫుల్ కెప్టెన్ ఎంఎస్ ధోనీ, భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీలను తాను ఎంతో ఇష్టపడతానని మను బాకర్ తెలిపింది. ‘క్రికెట్‌లో సచిన్ టెండూల్కర్, ఎంఎస్ ధోనీ, విరాట్ కోహ్లీని ఎంతో అభిమానిస్తా. వారితో మాట్లాడే అవకాశం దొరకడమే గొప్ప గౌరవంగా భావిస్తాను. దిగ్గజ స్ప్రింటర్ ఉసేన్ బోల్ట్ నా ఫేవరెట్ క్రీడాకారుల్లో ఒకరు. బోల్ట్‌ను ఎంతో ఆరాధిస్తాను. అతడి జీవిత చరిత్రను చాలాసార్లు చదివా. బోల్ట్ ఇంటర్వ్యూలు కూడా చాలా చూశాను’ అని మను తెలిపింది.
జాన్వీ కపూర్‌తో సినిమా.. హీరో నాని ఏమన్నారంటే?
‘నేచురల్ స్టార్’ నాని హీరోగా, వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కిన ‘సరిపోదా శనివారం’ సినిమా విడుదలకు సిద్దమైంది. ఆగష్టు 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా నాని ప్రస్తుతం వరుస ఇంటర్వ్యూలతో బిజీ బిజీగా ఉన్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన నాని.. తన తర్వాతి సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ నటించనుందన్న వార్తలపై స్పందించారు. మీ తర్వాతి సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా ఫిక్స్ అయిందట కదా?, నిజమేనా? అని అడగగా.. ‘నా తదుపరి సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా చేస్తుందనేది కేవలం రూమర్ మాత్రమే. బహుశా జాన్వీని తీసుకోవడం కోసం చర్చలు జరుగుతూ ఉండొచ్చు. సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. నేను కొన్ని రోజులుగా వరుస షూటింగ్‌లతో బిజీగా ఉన్నాను. కాబట్టి నా నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించి పూర్తి వివరాలు తెలియదు’ అని నాని సమాధానం ఇచ్చారు. శైలేష్ కొలను (హిట్ 3) లేదా సుజిత్ దర్శకత్వంలో నాని నటించనున్నారని తెలుస్తోంది. బాలీవుడ్‌లో స్టార్ అయిన జాన్వీ కపూర్.. టాలీవుడ్‌లోనూ వరుస అవకాశాలను సొంతం చేసుకుంటున్నారు. ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్ సరసన ‘దేవర’లో నటిస్తున్నారు. సెప్టెంబర్ 27న మొదటి పార్ట్ విడుదల కానుంది. బుచ్చిబాబు-రామ్ చరణ్ కాంబినేషన్‌లో రానున్న సినిమాలో కూడా జాన్వీ నటించనున్నారు. నాని సినిమాకు కూడా జాన్వీ గ్రీన్ సిగ్నల్ ఇస్తే.. తెలుగులో మూడో సినిమా అవుతుంది.
మా సినిమాకు వచ్చేవన్నీ లాభాలేనండి ‘ఆయ్’..
ఏస్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్, డైనమిక్ యంగ్ ప్రొడ్యూసర్ బన్నీ వాస్ కలయికలో GA2 పిక్చర్స్ కంటెంట్ ఓరియెంటెడ్ చిత్రాలను అందిస్తూ వస్తున్నారు. భలే భలే మగాడివోయ్, గీతా గోవిందం, టాక్సీవాలా, ప్రతిరోజూ పండగే, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ వంటి హిట్ చిత్రాలు ఈ బ్యానర్‌లో రూపొందాయి. GA2 పిక్చర్స్ బ్యానర్‌పై రూపొందిన తాజా చిత్రం ‘ఆయ్’. ఎనర్జిటిక్ హీరో నార్నే నితిన్, నయన్ సారిక జంటగా నటించారు. అంజి కె.మణిపుత్ర ఈ చిత్రంతో దర్శకుడిగా బాధ్యతలను నిర్వహించారు. టాలెంటెడ్ యంగ్ ప్రొడ్యూసర్స్ బన్నీ, విద్యా కొప్పినీడి ఈ ఫన్ ఎంటర్‌టైనర్‌ను నిర్మించారు. ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఆగస్ట్ 15న విడుదలైన ఆయ్ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లతో దుమ్ములేపుతోంది. మొదటి ఆట నుండే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా విడుదలై 10 రోజులైనా హౌస్ ఫుల్ బోర్డ్స్ పెడుతుంది. ఆయ్ మూవీకి వరల్డ్ వైడ్‌గా రూ. 3.25 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసుకుని రూ. 3.50 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ గా థియేటర్లలో అడుగుపెట్టిన ఆయ్ ఇప్పటి వరకు 12.26 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. దింతో ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా అల్ ఏరియాస్ బ్రేక్ ఈవెన్ సాధించి లాభాలు కురిపిస్తోంది. కంటెంట్ బాగుంతే చిన్న సినిమాలను టాలీవుడ్ ప్రేక్షకులు ఆదరిస్తారని మరోసారి ఆయ్ సినిమాతో ప్రూవ్ అయింది. దగ్గరలో భారీ బడ్జెట్ చిత్రాలు స్టార్ హీరోల సినిమాలు ఏవి లేకపోవడం ఆయ్ అడ్వాంటేజ్ అనే చెప్పాలి. మరి లాంగ్ రన్ లో ఈ చిత్రం ఏ మేరకు కలెక్షన్స్ రాబడుతుందో చూడాలి
