NTV Telugu Site icon

Top Headlines @9AM: టాప్ న్యూస్!

Top Headlines @ 9 Am

Top Headlines @ 9 Am

నేడు తెలంగాణ టీడీపీ నేతలతో చంద్రబాబు భేటీ.. పార్టీ బలోపేతంపై చర్చ..!
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇవాళ ( ఆదివారం ) మరోసారి తెలంగాణలో పర్యటించనున్నారు. సీఎం హోదాలో ఇప్పటి వరకు హైదరాబాద్ కు రెండు సార్లు వచ్చిన ఆయన.. ఈరోజు తెలంగాణ టీడీపీ నేతలతో సమావేశం కాబోతున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు ఎన్టీఆర్ భవన్‌లో టీ టీడీపీ నేతలతో సమావేశం కానున్నారు. అధ్యక్ష పదవి, తెలంగాణలో తెలుగు దేశం పార్టీ బలోపేతం వంటి అంశాలపై నేతలతో చంద్రబాబు చర్చించనున్నారు. ఈరోజు టీడీపీ కొత్త అధ్యక్షుడిని చంద్రబాబు ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక, ఈ సమావేశానికి తెలంగాణ టీడీపీ ముఖ్య నేతలు హాజరతారని పార్టీ నేతలు చెప్పుకొచ్చారు. తెలంగాణలో టీడీపీని బలోపేతం చేసే దిశగా.. పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంపై కీలక ఆదేశాలను సీఎం చంద్రబాబు ఇవ్వనున్నారు.

ప్రారంభమైన మారథాన్.. పాల్గొననున్న సీఎం రేవంత్..!
హైదరాబాద్ రన్నర్స్ సొసైటీ ఆధ్వర్యంలో ఎన్ఎండీసీ హైదరాబాద్ మారథాన్ 2024 13వ ఎడిషన్ ఈరోజు (ఆదివారం) లాంఛనంగా స్టార్ట్ అయింది. నెక్లెస్ రోడ్ పీపుల్స్ ప్లాజా నుంచి గచ్చిబౌలి బాలయోగి స్టేడియం వరకు ఈ మారథాన్ కొనసాగనుంది. ఫుల్ మారథాన్‌ను జెండా ఊపి హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి ఆరంభించారు. మారథాన్‌లో వివిధ దేశాలకు చెందిన రన్నర్లు కూడా పాల్గొన్నారు. ప్రతి ఏడాది నిర్వహించే ఈ మారథాన్ ఫిట్‌నెస్ అవేర్‌నెస్ పెంచేందుకు దోహదం చేస్తోందని చెప్పుకొచ్చారు. దేశంలోనే అతిపెద్ద రెండో మారథాన్ గా ఇది నిలుస్తుందన్నారు. 60, 70 ఏళ్లలో వచ్చే వ్యాధులు ఇప్పటి నుంచే యువత ఎదుర్కొంటుందని సీపీ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. కరోనా వచ్చిన తర్వాత ఆరోగ్యంపై ప్రజలు ఎక్కువగా శ్రద్ధ చూపిస్తున్నారు.. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలంటే తప్పనిసరిగా వ్యాయామం చేయాలని రన్నర్స్ సొసైట్ సూచించింది. ఈ మారథాన్‌లో దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలకు చెందిన రన్నర్స్ కూడా పాల్గొన్నారు. అయితే, ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా హాజరు కాబోతున్నారు. ఈ మారథాన్ లో గెలిచిన రన్నర్స్ కు ఆయన చేతుల మీదుగా బహుమతులను అందించనున్నారు.

మణికొండలోని చిత్రపురి కాలనీ గుట్టు రట్టు చేసిన అధికారులు
మణికొండ చిత్రపూరి కాలనీ లో నిర్మించిన 225 విల్లాలకు నిర్మాణ అనుమతులు లేవంటూ మణికొండ మున్సిపల్ కమిషనర్ నోటీసులు అందజేశారు. G.O 658కు విరుద్దంగా 225 ROW హౌజ్ ల నిర్మాణాలు చేపట్టినట్లు గుర్తించారు. గత సొసైటీ పాలక వర్గం దొంగ చాటున నిర్మాణాలకు అనుమతులు పొందిందని తేల్చారు మున్సిపల్ అధికారులు. కేవలం G+1 అనుమతులు పొంది అక్రమంగా G+2 నిర్మాణాలు చేపట్టారు సదరు బిల్డర్స్. 15 రోజుల్లో నోటీసులకు రిప్లై ఇవ్వాలని సూచించారు మణికొండ మున్సిపల్ కమిషనర్. గత పాలక వర్గం తప్పుడు నిర్ణయం వల్ల చిత్రపూరి సొసైటీ కి సుమారు 50 కోట్ల రూపాయల మేర నష్టం వాటిల్లినట్టు తెలిపారు . చిత్రపురి లో జరిగిన అవకతవకల గుట్టురట్టు చేయాలంటూ ఫిర్యాదులు రావడంతో రంగంలోకి దిగారు మణికొండ మున్సిపల్ కమిషనర్. చిత్రపురిలో గోల్ మాల్ చిత్రాల లెక్క మరికొద్ది రోజుల్లో  తేలనుంది.

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 24 గంటల సమయం..
వీకెండ్ కావడంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. వైకుంఠం క్యూ కాంప్లేక్స్ లోని కంపార్టుమెంట్లలన్ని నిండిపోయి వెలుపల క్యూ లైనులో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్ లేని భక్తులకు సర్వ దర్శనానికి 24 గంటల సమయం పడుతుంది. ఇక, నిన్న శ్రీవారిని 79521 మంది భక్తులు దర్శించుకున్నారు. 40152 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండి ఆదాయం 3.87 కోట్ల రూపాయలు వచ్చింది. కాగా, స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా టీటీడీ తగిన ఏర్పాట్లు చేసింది. అయితే, తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలపై టీటీడీ ఈవో శ్యామలరావు సమీక్ష సమావేశం నిర్వహించారు. బ్రహ్మోత్సవాల సమయంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. అక్టోబరు 4 నుంచి 12వ తేదీ వరకు సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. గరుడ సేవ సందర్భంగా ఘాట్‌ రోడ్లలో రాకపోకలను నిలిపివేయనున్నాట్లు ప్రకటించారు. అన్ని విభాగాలకు చెందిన అధికారులు, జిల్లా యంత్రాంగంతో సమన్వయంతో ముందుకు వెళ్లాలని సూచించారు.

సంజయ్ రాయ్ బైక్ పై కోల్‌కతా పోలీస్.. దీనిపై సీబీఐ విచారణ
కోల్‌కతాలోని ఆర్‌జి కర్ రేప్ అండ్ మర్డర్ కేసులో నిందితుడైన సంజయ్ రాయ్‌కి సిబిఐ ఆదివారం లేదా సోమవారం పాలిగ్రాఫ్ పరీక్ష నిర్వహించనుంది. పాశవిక ఘటనకు సంబంధించి పలు ప్రశ్నలకు సరైన సమాధానాలు చెబుతున్నాడా లేదా అన్న కోణంలో దర్యాప్తు చేయనున్నారు. అంతకుముందు నిందితుడి బైక్‌ను కోల్‌కతాలోని సీజీవో కాంప్లెక్స్‌కు తీసుకొచ్చారు. ఘటన జరిగిన రోజు ఇదే బైక్‌పై ఆర్జీ ఆస్పత్రికి వచ్చాడు. ఇప్పుడు ఆ బైక్ సీబీఐ నిఘాలో ఉంది. ఆగస్టు 9న ఆర్‌జి కర్‌లోని సెమినార్ హాల్ నుండి బాధితురాలి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. 24 గంటల్లోనే పౌర వాలంటీర్‌ను అరెస్టు చేసిన పోలీసులు, అతను ఉపయోగించిన బైక్‌ను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఆ బైక్‌ను శనివారం సీబీఐకి అప్పగించారు. శనివారం బైక్‌ను ప్లాస్టిక్‌లో చుట్టి మటడోర్‌లోని సీజీవో కాంప్లెక్స్‌కు తీసుకొచ్చారు. బైక్ నంబర్ WB 01 A E 5021. చిరునామా 18 లాల్‌బజార్ స్ట్రీట్. నిందితుడు సంజయ్ రాయ్ పౌర వాలంటీర్ అయినప్పటికీ కోల్‌కతా పోలీస్‌లో రిజిస్టర్డ్ బైక్‌లో తిరిగేవాడు. కోల్‌కతా పోలీస్ పేరుతో పౌర వాలంటీర్ వాహనాన్ని ఎలా ఉపయోగించగలడనే ప్రశ్న తలెత్తుతుంది.

పని మనిషిని వీడియో కాల్‌లో బట్టలు విప్పమన్న ప్రజ్వల్.. ఛార్జిషీట్‌లో సిట్‌ వెల్లడి
జేడీఎస్ మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై అత్యాచారం, ఆయన తండ్రి, ఎమ్మెల్యే హెచ్‌డీ రేవణ్ణపై లైంగిక వేధింపుల కేసును విచారిస్తున్న సిట్ రెండు వేల పేజీల చార్జిషీట్‌ను దాఖలు చేసింది. దీని ప్రకారం ప్రజ్వల్ పని మనిషి కుమార్తెను వీడియో కాల్‌లో బట్టలు విప్పమని బలవంతం చేశాడు. అంతే కాకుండా ఫోన్‌లో ఆమె అసభ్యకరమైన ఫోటోలు తీయడం, సాక్ష్యాలను ధ్వంసం చేయడం వంటివి కూడా బయటపడ్డాయి.
ప్రజ్వల్‌పై నాలుగు కేసుల దర్యాప్తులో 150 మంది సాక్షుల వాంగ్మూలాలను సిట్ నమోదు చేసింది. ప్రజ్వల్‌పై కేసు వెలుగులోకి రాగానే వీడియోలు, ఫొటోలను ధ్వంసం చేసి విదేశాలకు పారిపోయాడని చార్జిషీట్‌లో పేర్కొన్నారు. అయితే ఎఫ్‌ఎస్‌ఎల్ ఒరిజినల్ రిపోర్టు ద్వారా దర్యాప్తు బృందం ఫొటోలు, వీడియోలను స్వాధీనం చేసుకుంది. ప్రజా ప్రతినిధుల ప్రత్యేక కోర్టులో దాఖలు చేసిన ఛార్జిషీట్‌లో ఆన్-సైట్ తనిఖీ, శాస్త్రీయ, మొబైల్, డిజిటల్, ఇతర సంబంధిత ఆధారాలు ఉన్నాయి. మాజీ ప్రధాని, జేడీఎస్‌ అధినేత హెచ్‌డీ దేవెగౌడ కుమారుడు, ఎమ్మెల్యే హెచ్‌డీ రేవణ్ణపై ఆయన ఇంట్లో పని చేసే ఓ ఇంటి పని మనిషి ఫిర్యాదు మేరకు తొలి కేసు నమోదైంది. బాధితురాలు ఎమ్మెల్యే భార్య భవాని బంధువు కూడా.. తనపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డారని ఆమె ఆరోపించింది. ప్రజ్వల్ ఇటీవల లోక్‌సభ ఎన్నికల్లో హాసన్ నుంచి ఎన్డీయే అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు.

పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్‌లో బాంబు పేలుడు… ముగ్గురు మృతి, 13 మందికి గాయాలు
పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్‌లోని పిషిన్ జిల్లాలో శనివారం జరిగిన పేలుడులో ఇద్దరు చిన్నారులు, ఒక మహిళ మృతి చెందగా, ఇద్దరు పోలీసులతో సహా 13 మంది గాయపడ్డారు. సుర్ఖబ్ చౌక్ సమీపంలోని ప్రధాన మార్కెట్‌లో ఈ ఘటన జరిగింది. ఖైబర్ పఖ్తుంఖ్వా, బలూచిస్థాన్‌లలో పోలీసు అధికారులు, పోస్టులపై నిరంతర దాడుల సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ముఖ్యంగా, నిషేధిత తెహ్రీక్-ఇ-తాలిబాన్ పాకిస్తాన్ (TTP) 2022లో ప్రభుత్వంతో కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి భద్రతా దళాలను లక్ష్యంగా చేసుకుంటుందని ప్రతిజ్ఞ చేసిన తర్వాత దాడులు పెరిగాయి. పిషిన్ సివిల్ హాస్పిటల్ మెడికల్ సూపరింటెండెంట్ వకిల్ షెరానీ తెలిపిన వివరాల ప్రకారం, పేలుడులో ఇద్దరు పిల్లలు చనిపోగా, 14 మంది మొదట గాయపడ్డారు. ఆసుపత్రి మేనేజింగ్ డైరెక్టర్ అర్బాబ్ కమ్రాన్ జాబితా ప్రకారం, గాయపడిన వారిలో 13 మందిని క్వెట్టా ట్రామా సెంటర్‌కు పంపారు. అక్కడ ఒక మహిళ మరణించింది. గాయపడిన ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది, ఇద్దరికి స్వల్ప గాయాలు, ముగ్గురు చికిత్స పొందుతున్నారు. ఇద్దరు బాధితులు ట్రామా సెంటర్ నుండి డిశ్చార్జ్ అయినట్లు జాబితా పేర్కొంది.

హరీష్ శంకర్ – రామ్ పోతినేని సినిమా ఉంటుందా.. ఉండదా..?
టాలీవుడ్ లో ఏ దర్శకుడికైనా, హీరోకైనా సరే హిట్టే కొలమానం.ఒకసారి ఫ్లాప్ పడిందా పట్టించుకునే నాథుడే ఉండడు. ఒకానొక సమయంలో ఇండస్ట్రీ హిట్స్ ఇచ్చిన శ్రీను వైట్ల. పూరి జగన్నాధ్ పరిస్థితులే ఇందుకు ఉదాహరణ. వీళ్ళ గురించి ఆహా ఓహో అని మైక్ ముందు స్టేట్మెంట్స్ఇస్తారు తప్ప ఒక్క స్టార్ హీరో కూడా సినిమా ఛాన్స్ ఇవ్వడు. సరే వీరి సంగతి కాసేపు పక్కన పెడితే లేటెస్ట్ హ్యూజ్ డిజాస్టర్ ఇచ్చిన దర్శకుడు పరిస్థితి ఇప్పుడు దాదాపు ఇదే టాక్ వినిపిస్తోంది. ఈ ఆగస్టు 15న హరీష్ శంకర్ దర్శకత్వం వహించిన మిస్టర్ బచ్చన్ రిలీజ్ అయింది. మొదటి ఆట నుండే మిశ్రమ స్పందన తెచ్చుకుంది ఈ సినిమా. మరి ముఖ్యంగా దర్శకత్వం పట్ల ప్రేక్షకులు పెదవివిరిచారు. పాత కాలం నాటి దర్శకత్వ ప్రతిభను హరీష్ శంకర్ కనబరిచాడని, ఈ సినిమా ఫెయిల్యూర్ క హరీష్ కారణమని తేల్చేసారు ఆడియన్స్. దీంతో ఈ దర్శకుడి నెక్ట్స్ సినిమాపై నీలినీడలు కమ్ముకున్నాయి. తన నెక్ట్స్ సినిమా ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేనితో చేస్తున్నానని ప్రకటించాడు. ఇటీవల డబుల్ ఇస్మార్ట్ తో రామ్ ఫ్లాప్ అందుకున్నాడు. అసలే భారీ డిజాస్టర్ ఇచ్చిన హరీష్ తో చేసేందుకు రామ్ రెడీ గా లేదని టాక్ వినిపిస్తుంది. వీరిద్దరి కలయికలో సినిమా లేనట్టే. అటు రామ్ ఫ్యాన్స్ కూడా ఈ దర్శకుడితో సినిమా వద్దనే కోరుకుంటున్నారు. ఇప్పటికైనా హరీష్ కథ, కథనాలపై దృష్టిపెడితే హిట్టు కొట్టి బౌన్స్ బ్యాక్ అయితే నాలుగు సినిమాలు వస్తాయ్ లేదంటే మిడ్ రేంజ్ హీరోలతో ఒకటి అరా సినిమాలు చేసుకుంటూ బండి లాగించడమే అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు.