NTV Telugu Site icon

Top Headlines @9AM: టాప్ న్యూస్!

Top Headlines @ 9 Am

Top Headlines @ 9 Am

నేడు అచ్యుతాపురానికి సీఎం చంద్రబాబు..
అనకాపల్లి జిల్లా అచ్యుతాపురంలో ఫార్మా కంపెనీ ప్రమాదంలో ఇప్పటి వరకు మృతుల సంఖ్య 17 చేరింది. ఈ ప్రమాదంలో 35 మందికి గాయాలు అయ్యాయి. ఇక, గాయపడిన వారిని అనకాపల్లి, విశాఖపట్నంలోని పలు ప్రైవేట్ హాస్పిటల్స్ లో చికిత్స అందిస్తున్నారు. కాగా, ఫార్మా సెజ్ లోని ఎసైన్షియా అనే కంపెనీలో రియాక్టర్ పేలి మృతి చెందిన వారి కుటుంబాలను, ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న వారిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇవాళ పరామర్శించనున్నారు. అలాగే, ప్రమాదం జరిగిన సంఘటన ప్రాంతాన్ని కూడా పరిశీలించనున్నారు. అయితే, ఎసైన్షియా ఫార్మా కంపెనీ ప్రమాదానికి భద్రత వైఫల్యం కారణం అని పోలసులు అంటున్నారు. MTBE అనే గ్యాస్ లీకేజ్, సాల్వెంట్ తో కలవడం వల్ల ఈ ప్రమాదం సంభవించిందన్నారు. గ్యాస్ పేలుడు కారణంగా ప్రొడక్షన్ యూనిట్ గోడలు ధ్వంసం కాగా.. యాజమాన్యం బాధ్యతారాహిత్యం ప్రమాదానికి కారణం అని పేర్కొన్నారు. 381 మంది సిబ్బంది పరిశ్రమలో పని చేస్తున్నారు.

అచ్యుతాపురం ఎసైన్షియా ఫార్మా ప్రమాదంపై కేసు నమోదు..
అనకాపల్లి జిల్లాలోని అచ్యుతాపురంలోని ఫార్మా సెజ్ లో జరిగిన ప్రమాదంపై రాంబిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. ఎసైన్షియా ఫార్మా ప్రమాదంపై.. ఇప్పటికే అధికారులు విచారణ చేశారు. ఈ సందర్భంగా ఎసైన్షియా ఫార్మా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ యాజమాన్యంపై BNS 106 (1), 125(b),125(a) సెక్షన్ కింద కేసులు నమోదు చేశారు. అలాగే, నిర్లక్ష్యంతో మరణానికి కారణం, ప్రాణాలకు వ్యక్తిగత భద్రతకు భంగం వాటిల్లడం వంటి సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు పోలీసులు. ఇక, వేపర్ క్లౌడ్ ఎక్స్ ప్లోజన్ వల్ల పేలుడు జరిగింది అని ఫైర్ సర్వీస్ డీజీ నివేదిక ఆధారంగా హోం మంత్రి వంగలపూడి అనిత తెలిపింది. ఫార్మా కంపెనీ ప్రమాదానికి భద్రత వైఫల్యం కారణం.. MTBE అనే గ్యాస్ లీకేజ్, సాల్వెంట్ తో కలవడం వల్ల అగ్ని ప్రమాదం సంభవించింది అన్నారు. గ్యాస్ పేలుడు కారణంగా ప్రొడక్షన్ యూనిట్ గోడలు పూర్తిగా ధ్వంసం అయ్యాయి.. దీంతో 17 మంది మరణించాగా, 35 మంది చికిత్స పొందుతున్నారు అని ఆమె పేర్కొన్నారు.

నేడు ఢిల్లీకి సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి..
ఇవాళ సాయంత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లనున్నట్లు కాంగ్రెస్ పార్టీ వర్గాలు తెలిపాయి. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో ఆయన భేటీ కానున్నట్లు తెలుస్తోంది. నామినేటెడ్ పదవుల భర్తీ, పీసీసీ అధ్యక్షుడి ఎంపిక, మంత్రివర్గ విస్తరణ తదితర అంశాలపై సీఎం చర్చించే అవకాశం ఉంది. సచివాలయం ఎదుట ఏర్పాటు చేసిన రాజీవ్ గాంధీ విగ్రహావిష్కరణకు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను ముఖ్య అతిధులుగా రేవంత్ రెడ్డి ఆహ్వానించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా రూ. 2 లక్షల వరకు రైతుల రుణాలను మాఫీ చేసినందుకు గాను వరంగల్‌లో నిర్వహించనున్న రైతు అభినందన సభకు రాహుల్ గాంధీని ఆహ్వానించనున్నారు. కాంగ్రెస్ నేతల రాకను నిర్ధారించుకున్న తర్వాతే కార్యక్రమాల రూపకల్పన జరుగుతుందని సమాచారం. సీఎంతో పాటు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు కూడా హస్తినకు వెళ్లే అవకాశం ఉంది. ఏఐసీసీ పిలుపు మేరకు టీపీసీసీ ఆధ్వర్యంలో ఇవాళ ఉదయం 10 గంటలకు టీపీసీసీ అధ్యక్షులు, సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ ఎదుట గన్ పార్క్ నుంచి ఈడి కార్యాలయం వరకు భారీ ప్రదర్శన నిర్వహించనున్నారు. అక్కడి నుంచి ఈడి కార్యాలయం ముందు భారీ ధర్నా చేపట్టారు. సీఎం వెంట ఏఐసీసీ ఇంచార్జ్ దీపా దాస్ మున్షి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీ లు, ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు పాల్గొననున్నారు. ఆధాని మెగా కుంభకోణం పై విచారణ జరపాలని, సెబీ చైర్మన్ అక్రమాలపై జేపీసీ వేయాలి, సెబీ చైర్మన్ రాజీనామా చేయాలని, దోషులకు చట్టపరంగా శిక్షించాలనే డిమాండ్లతో ఈ ఆందోళన కొనసాగనుంది. అనంతరం ఇవాళ ఉదయం 11 గంటలకు ముఖ్యమంత్రి సెక్రెటేరియట్​ చేరుకుంటారు. ఉదయం 11.30 గంటలకు సీఎంవో అధికారులతో బ్రీఫింగ్​ పై చర్చించనున్నారు.

నేడు రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలు.. చేవెళ్లలో కేటీఆర్‌, ఆలేరులో హరీష్‌ రావు..
రైతు రుణమాఫీ కోసం బీఆర్‌ఎస్‌ నేడు రాష్ట్రవ్యాప్తంగా ధర్నా చేపట్టింది. ఎటువంటి ఆంక్షలు లేకుండా రైతులందరికీ రూ. 2 లక్షల రుణమాఫీ చేయాలనే డిమాండ్‌తో బీఆర్‌ఎస్‌ పార్టీ ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ధర్నా చేపట్టనున్నది. చేవెళ్లలో కేటీఆర్‌, ఆలేరులో హరీష్‌ ధర్నా చేపట్టనున్నారు. రాష్ట్ర రైతాంగానికి బాసటగా నిలిచేందుకు బీఆర్‌ఎస్‌ కార్యాచరణ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మేరకు పార్టీ శ్రేణులను బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ఆదేశాలతో వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ కార్యాచరణను రూపొందించారు. పార్టీని వీడిన ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాలు, కాంగ్రెస్‌ సర్కార్‌లో మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల కేడర్‌ను సమాయత్తపరిచి కార్యక్రమ విజయానికి కావలసిన ఏర్పాట్లు చేసింది. ఏ నియోజకవర్గాల్లో ఎవరి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించనున్నారో కేటీఆర్‌ బుధవారం పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ముఖ్యమంత్రి రూ. 2 లక్షల వరకు అందరికీ రుణమాఫీ అయ్యిందని చెబుతుంటే మంత్రులు మాత్రం ఇంకా రుణమాఫీ పూర్తికాలేదని చెబుతున్న వైనాన్ని రైతాంగానికి తెలిపేలా కార్యాచరణను పార్టీ సిద్ధం చేసింది. ఎన్నికలు కాగానే రుణమాఫీకి రూ.40 వేల కోట్ల అవసరమని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొని, మంత్రివర్గ సమావేశం రూ.31 వేల కోట్లకే అనుమతిచ్చారు. రుణమాఫీకి బడ్జెట్లో రూ.26వేల కోట్లకు ఆమోదం తెలిపి, కేవలం రూ.18వేల కోట్లు ఖర్చు చేసి రైతులను నిలువునా ముంచారని ప్రతీ రైతుకు తెలిసేలా ధర్నాలో ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని కేటీఆర్‌ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. క్షేత్రస్థాయిలో కనీసం 40శాతం మంది రైతులకు కూడా రుణమాఫీ లబ్ధిచేకూరలేదని సమాచారం ఉన్న నేపథ్యంలో బీఆర్‌ఎస్‌ ధర్నా పిలుపునకు రైతాంగం నుంచి విశేష స్పందన వస్తున్నది. అడ్డగోలు ఆంక్షలతో రైతులకు టోపీ పెట్టిన ప్రభుత్వ వైఖరిపై రైతులోకం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నది. ఈ నేపథ్యంలో నేడు గులాబీ దళం చేపట్టనున్న నిరసనలో పాల్గొనేందుకు రైతులు స్వచ్ఛందంగా తరలివస్తారని భావిస్తున్నారు.

జమ్మూకశ్మీర్ చేరుకున్న కాంగ్రెస్ అధినేత.. శ్రీనగర్‌లోని లాల్ చౌక్‌లో ఐస్‌క్రీం తిన్న రాహుల్
జమ్మూకశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికల తేదీలు ప్రకటించారు. కేంద్రపాలిత ప్రాంతంలో రాజకీయ వేడి కూడా రోజురోజుకు పెరుగుతోంది. కాగా, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ బుధవారం శ్రీనగర్ చేరుకున్నారు. నగరంలోని ఓ ఐస్‌క్రీం పార్లర్‌కు చేరుకున్నాడు. ఇక్కడ ఐస్ క్రీం తినడంతో పాటు ఓ ప్రముఖ రెస్టారెంట్ లో డిన్నర్ కూడా చేశారు. రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేతో కలిసి నగరంలోని గుప్కర్ ప్రాంతంలో ఉన్న లలిత్ హోటల్ నుంచి బయలుదేరారు. ఆ తర్వాత డిన్నర్ చేసేందుకు హోటల్ అహ్దూస్ చేరుకున్నాడు. నగరంలోని అత్యుత్తమ రెస్టారెంట్లలో ఇది ఒకటి. ఇది కాశ్మీరీ వాజ్వాన్‌కు ప్రసిద్ధి చెందింది. రాహుల్ గాంధీ శ్రీనగర్ పర్యటన దృష్ట్యా హోటల్ చుట్టూ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం రాహుల్ గాంధీ బుధవారం జమ్మూకశ్మీర్ చేరుకున్నారు. ఇక్కడికి వచ్చిన ఆయనకు కాంగ్రెస్ నేతలు ఘనస్వాగతం పలికారు. రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే కూడా ఈ పర్యటనలో నేషనల్ కాన్ఫరెన్స్‌తో పొత్తుకు సంబంధించిన అవకాశాలను అన్వేషించవచ్చు. గురువారం లోయలోని 10 జిల్లాల పార్టీ నేతలతో కాంగ్రెస్ నేతలిద్దరూ సమావేశం కానున్నారు. ఉదయం 10 గంటలకు ఈ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఆ తర్వాత మీడియాతో మాట్లాడవచ్చు.

రోహిత్‌కు సీటు ఇచ్చిన శ్రేయస్‌.. వీడియో వైరల్‌!
బుధవారం ముంబైలో వార్షిక సియట్ క్రికెట్ అవార్డులను భారత క్రికెట్ నిర్వహించింది. భారత మాజీ ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్‌కు ‘లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు’ దక్కింది. భారత కెప్టెన్ రోహిత్ శర్మ ‘అంతర్జాతీయ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్’ అవార్డును, మాజీ కెప్టెన్ విరాట్‌ కోహ్లీ ‘వన్డే బ్యాటర్ ఆఫ్ ద ఇయర్’ అవార్డును కైవసం చేసుకున్నారు. ఈ అవార్డుల ప్రధానోత్సవంలో భారత స్టార్‌ క్రికెటర్లందరూ పాల్గొన్నారు. తాజాగా ఈ ప్రోగ్రామ్‌కు సంబంధించి ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సియట్ అవార్డుల కార్యక్రమానికి టీమిండియా స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్‌ హాజరయ్యాడు. కాస్త ముందుగా వచ్చిన శ్రేయస్.. ముందువరుసలో ఉన్న సీట్‌లో కూర్చొన్నాడు. కాస్త ఆలస్యంగా వచ్చిన కెప్టెన్ రోహిత్ శర్మకు ముందు వరుసలో సీటు దొరకలేదు. రోహిత్ రావడాన్ని గమనించిన శ్రేయస్.. లేచి నిలబడి తన కుర్చీలో కూర్చోవాలని కోరతాడు. అందుకు రోహిత్‌ నవ్వుతూ.. శ్రేయస్‌నే అందులో కూర్చోబెడుతాడు. ఆపై వెనకాల మరొక సీట్‌లో హిట్‌మ్యాన్ కూర్చున్నాడు. రోహిత్ శర్మ తన సతీమణి రితిక పక్కన కూర్చొంటాడు. హిట్‌మ్యాన్‌కు కొద్దిగా ముందు ఉన్న ఛైర్‌లో శ్రేయస్ అయ్యర్ కూర్చొంటాడు. ఇందుకు సంబందించిన ఓ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. సీనియర్‌ పట్ల శ్రేయస్ చూపించిన గౌరవానికి నెటిజన్ల నుంచి ప్రశంసలు వచ్చాయి. లంక పర్యటన అనంతరం భారత క్రికెట్ జట్టుకు 42 రోజుల విరామంలో దక్కింది. సెప్టెంబరు 19 నుంచి బంగ్లాదేశ్‌తో జరిగే రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో పాల్గొననున్నారు. అంతకుముందు సెప్టెంబర్ 5న ప్రారంభమయ్యే దులీప్ ట్రోఫీలో కొందరు ప్లేయర్స్ ఆడనున్నారు.

శ్రీవారిని దర్శించుకున్న చిరంజీవి దంపతులు!
నేడు ‘మెగాస్టార్’ చిరంజీవి పుట్టినరోజు. ఈ సందర్భంగా తిరుమల శ్రీవారిని ఆయన దర్శించుకున్నారు. గురువారం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో సతీమణి సురేఖతో కలిసి స్వామివారి సేవలో పాల్గొన్నారు. టీటీడీ అధికారులు చిరంజీవివి స్వాగతం పలికి.. దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు వేదాశీర్వచనం చేసి.. స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. శ్రీవారిని దర్శించుకునేందుకు మెగాస్టార్ చిరంజీవి బుధవారం రాత్రే రోడ్డు మార్గంలో తిరుమలకు చేరుకున్నారు. మెగాస్టార్ దంపతులతో పాటు చిరు తల్లి అంజనా దేవి, కుమార్తె శ్రీజ, మనవరాలు ఉన్నారు. చిరుకు సంబందించిన ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. పుట్టినరోజు సందర్భంగా చిరుకు అభిమానులు విషెష్ తెలియజేస్తున్నారు. చిరంజీవి బర్త్ డే సందర్బంగా మెగాస్టార్ నటించిన ‘ఇంద్ర’, ‘శంకర్ దాదా ఎంబీబీఎస్’ చిత్రాలు విడుదల అయ్యాయి. థియేటర్స్ వద్ద ఫాన్స్ సందడి చేస్తున్నారు. ప్రస్తుతం వశిష్ఠ దర్శకత్వంలో చిరు ‘విశ్వంభర’ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో చిరంజీవి సరసన త్రిష, మీనాక్షి చౌదరి కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ రోజు ఉదయం 10 గంటలకు ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ ఇవ్వనున్నట్టు చిత్ర యూనిట్ ప్రకటించింది.

కల్కి ఆగమనం.. ఓటీటీలో చూసేయండిక!
ప్రభాస్ హీరోగా నటించిన కల్కి 2898 ఏడి సినిమా ఎంత పెద్ద హిట్ గా నిలిచిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతీ మూవీస్ బ్యానర్ మీద ఈ సినిమాని అత్యంత ప్రతిష్టాత్మకంగా అశ్విని దత్ నిర్మించారు. అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనే, పశుపతి, అన్న బెన్, శోభన వంటి వాళ్ళు ఇతర కీలక పాత్రలలో నటించిన ఈ సినిమా కొన్నాళ్ల క్రితం థియేటర్లలోకి వచ్చింది. మొదటి ఆట నుంచి సూపర్ పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా దాదాపు 1200 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది. ఇక ఎట్టకేలకు ఈ సినిమా ఓటీటీ ఎంట్రీ ఇచ్చింది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది. అలాగే హిందీ భాష మాత్రం నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. నిన్న అర్ధరాత్రి 12 గంటల సమయం నుంచి ఈ సినిమా ప్రేక్షకులకు అందుబాటులోకి వచ్చేసింది. సంతోష్ నారాయణ సంగీతం అందించిన ఈ సినిమాకి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ముఖ్యంగా నాగ అశ్విన్ ఆలోచనలను తెరమీద చూడటం ఆసక్తికరంగా ఉందని అందరూ చెబుతున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం ఎవరైనా థియేటర్లలో మిస్సయిన వారు ఉంటే ఓటీటీలో చూసేయండి. లేదా థియేటర్లలో చూసినవారు కూడా మరోసారి ఆ కల్కి వరల్డ్ ఎక్స్పీరియన్స్ చేసేందుకు మరోసారి చూసి చూసేయొచ్చు అంటూ సినిమా టీం తాజాగా ప్రకటించింది.