NTV Telugu Site icon

Top Headlines @9AM : టాప్ న్యూస్‌!

Top Headlines @ 9 Am

Top Headlines @ 9 Am

నేడు హర్యానాకు ఏపీ సీఎం, డిప్యూటీ సీఎంలు..
నేడు హర్యానా సీఎంగా నాయబ్ సింగ్ సైనీ ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబుతో పాటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా వెళ్తున్నారు. వీరు ఎన్డీయే కూటమిలో భాగమైనందున హర్యానాకు వెళ్తున్నారు. ఇక, ప్రమాణస్వీకారం తర్వాత ఎన్డీయే పక్ష నేతలతో జరిగే సమావేశంలో వీరు పాల్గొంటారు. కాగా, ఏపీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఎన్డీయే కూటమిలో చంద్రబాబు చేరారు. ఈ ఎన్నికల్లో జనసేన, బీజేపీ పార్టీలతో పొత్తు పెట్టుకొన్న టీడీపీ ఆంధ్రప్రదేశ్ లో పసుపు జెండా ఎగురవేశారు. మరోవైపు ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టిన తర్వాత నుంచి రాష్ట్ర అభివృద్ధి కొరకు వరుసగా ఢిల్లీ పర్యటనలు చేస్తున్నారు. ఇప్పటికే కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో చంద్రబాబు, బీహార్ సీఎం నితీష్ కుమార్ కీలక పాత్ర పోషించారు.

ముందస్తు బెయిల్ కోసం హైకోర్టులో పిటిషన్ వేసిన నందిగం సురేష్..
అమరావతి పరిధిలోని తుళ్లూరు మండలం వెలగపూడి గ్రామానికి చెందిన మరియమ్మ హత్య కేసులో తనకు రెగ్యులర్‌ బెయిలు మంజూరు చేయాలని కోరుతూ వైసీపీ మాజీ పార్లమెంట్ సభ్యులు నందిగం సురేష్‌ బుధవారం ఏపీ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. అయితే, ఈరోజు (గురువారం) ఈ వ్యాజ్యం ఉన్నత న్యాయస్థానంలో విచారణకు రాబోతుంది. కాగా, 2020 డిసెంబర్‌లో రెండు సామాజిక వర్గాల మధ్య గొడవలు జరిగడంతో.. ఒకరిపై మరొకరు రాళ్లు రువ్వుకున్న ఘటనలో మరియమ్మ అనే మహిళ మృతి చెందింది. ఆమె కుటుంబ సభ్యులు ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా అప్పట్లో తుళ్లూరు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయింది. అయితే, ఈ కేసులో మాజీ ఎంపీ నందిగం సురేష్‌ను 78వ నిందితుడిగా తుళ్లూరు పోలీసులు చేర్చారు. తనకు బెయిలు మంజూరు చేయాలని చేసిన వినతిని గుంటూరు కోర్టు తోసిపుచ్చింది. ఇక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టును సురేష్ ఆశ్రయించారు. ఈ కేసులో విచారణ పూర్తి అయ్యిందని, సాక్షులను బెదిరించే ఛాన్స్ లేదని పిటిషన్లో ఆయన వెల్లడించారు.

తీరం దాటిన దాటిన వాయుగుండం.. ఏపీలో భారీ వర్షాలు..
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో జిల్లాలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. తీరం దాటక ముందే వాయుగుండం బలహీనపడింది. ఇక, నెల్లూరు జిల్లా తడ సమీపంలో తీరం దాటిన దాటిన వాయుగుండం.. గడిచిన 6 గంటల్లో 22 కిలో మీటర్ల వేగంతో వాయుగుండం తీరం దాటింది. ప్రస్తుతం అల్పపీడనంగా వాయుగుండం బలహీన పడతుంది. ఇక, వాయుగుండం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో భారీ వానలు పడుతున్నాయి. అయితే, తుఫాను తీరం దాటడంతో అధికార యంత్రం అప్రమత్తమైంది. దీంతో సూళ్లూరుపేట, తడ, దొరవారిసత్రం, పెళ్లకూరు, నాయుడుపేట, గూడూరు, మనుబోలు మండలాల్లో జోరుగా వర్షం కురుస్తుంది. భారీగా వర్షాల ధాటికి వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. అయితే, గూడూరు సమీపంలోని పంబలేరు కు వరద ఉధృతి కొనసాగుతుంది. జలాశయాలు, చెరువులకు భారీగా వరద నీరు చేరుతుంది. సంగం బ్యారేజ్ వద్ద 12 గేట్లు, నెల్లూరు బ్యారేజ్ వద్ద రెండు గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు. గత 24 గంటల్లో జిల్లా వ్యాప్తంగా సగటున 9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అత్యధికంగా జలదంకిలో 18, కావలిలో 17, నెల్లూరులో 13, కొండాపురం, సీతారామపురంలలో 10 సెంటీమీటర్ల వర్షం పడింది.

కేటీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్వీ సమావేశం.. అనంతరం గ్రూప్ వన్ అభ్యర్థులతో మీట్..
తెలంగాణ భవన్ లో ఉదయం 10 గంటలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్వీ రాష్ట్రస్థాయి ప్రతినిధుల సమావేశం జరగనుంది. 10 నెలల కాంగ్రెస్ పాలనలో విద్య వ్యవస్థ పై చర్చించనున్నారు. విద్యా వ్యవస్థలో ప్రభుత్వ విధానాలపై భవిష్యత్తు కార్యాచరణ, బీఆర్ఎస్వీ సభ్యత్వాలపై ప్రతినిధుల బృందం కు కేటీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. ఈ సమావేశానికి బీఆర్‌ఎస్‌వీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లా కోఆర్డినేటర్లు, ప్రతి నియోజకవర్గం నుంచి 10 మంది విద్యార్థి ప్రతినిధులు హాజరుకానున్నారు. మాకు మీ మద్దతు కావాలని కేటీఆర్ ని కోరిన గ్రూప్స్ 1 అభ్యర్థుల అభ్యర్థన మేరకు వారిని కలుస్తానని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హామీ ఇచ్చారు. సోషల్ మీడియా మాధ్యమం ఎక్స్ వేదికగా గ్రూప్స్ అభ్యర్థులు కేటీఆర్ కి మెసేజ్ చేశారు. మమ్మల్ని మన్నించాలి, మీరు అశోక్ నగర్ రావాలి, మాకు మీ మద్దతు అవసరం ఉంది, అన్ని వ్యవస్థలు మాకు అన్యాయం చేస్తున్నాయి.

హైదరాబాద్‌లో మరోసారి ఐటీ దాడులు.. 30 చోట్ల తనిఖీలు ..
హైదరాబాద్‌లో ఐటీ దాడులు మరోసారి కలకలం రేపుతున్నాయి. తాజాగా నగరంలో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. ఏకకాలంలో 30 చోట్ల ఐటీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. గురువారం తెల్లవారుజాము నుంచి ఐటీ సోదాలు చేపట్టారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో ఐటీ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్‌, సంగారెడ్డి, జూబ్లీహిల్స్, రాయదుర్గం, చైతన్యపురి, మలక్‌పేట్‌, కొల్లూరు ప్రాంతాలలో ఏకకాలంలో సోదాలు కొనసాగిస్తున్నాయి. అన్విత బిల్డర్స్, ప్రాపర్టీస్ కార్యాలయాలు, మేనేజ్మెంట్ల ఇళ్లల్లో ఏకకాలంలో కొనసాగుతున్నాయి. చైతన్యపురి లోని గూగీ ప్రాపర్టీస్ కార్యాలయంలో సోదాలు చేపట్టారు. మలక్ పేట నియోజకవర్గానికి కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన షేక్ అక్బర్ ఇంటిలో సోదాలు చేస్తున్నారు. షేక్ అక్బర్ కు చెందిన గూగి ప్రాపర్టీస్ కార్యాలయాల్లో ఐటీ సోదాలు చేపట్టారు. అన్విత బిల్డర్స్ అధినేత బొప్పరాజు శ్రీనివాసు అచ్యుతరావు ఇంట్లో అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. విజయవాడకు చెందిన రియల్టర్ల పై ఐటీ సోదాలు చేస్తున్నారు. గుగి ప్రాపర్టీ చెందిన 15 చోట్ల ఐటీ సోదాలు నిర్వహిస్తున్నారు. దీనికోసం మొత్తం 40 టీములు రంగంలోకి దిగింది. ఇవాళ ఉదయమే దాడుల కోసం 40 టీములుగా ఏర్పడి సోదాలు చేపట్టారు.

నేడు హర్యానా సీఎంగా నాయబ్‌ సింగ్ సైనీ ప్రమాణస్వీకారం!
హర్యానాలో బీజేపీ ప్రభుత్వం మరి కొద్ది గంటల్లో కొలువు తీరనుంది. ముఖ్యమంత్రిగా నయాబ్ సింగ్ సైనీ గురువారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. పంచకులలోని సెక్టార్ 5 దసరా గ్రౌండ్‌లో మధ్యాహ్నం 12.30 గంటలకు ప్రమాణ స్వీకారోత్సవం జరగనుంది. ఈ వేడుకకు ప్రధాని నరేంద్ర మోడీ, రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ సీనియర్ నేతలు, ఎన్డీయే పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరు కానున్నారు. లక్ష మందికి పైగా పార్టీ కార్యకర్తలు హాజరయ్యే అవకాశం ఉంది. హర్యానాలో అక్టోబర్ 8న అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడి కాగా.. ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలను తలకిందులు చేస్తూ బీజేపీ హ్యాట్రిక్‌ కొట్టింది. 90 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ 48 సీట్లు గెలుచుకోగా.. కాంగ్రెస్‌ 37 సీట్లకే పరిమితమైంది. పార్టీని మరోసారి అధికారంలోకి తీసుకువచ్చిన నాయబ్‌ సింగ్ సైనీ వైపే అధిష్ఠానం మొగ్గు చూపింది. బుధవారం జరిగిన శాసనసభా పక్ష భేటీలో ఆయనను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మాజీ సీఎం మనోహర్‌లాల్‌ ఖట్టర్‌, సీనియర్‌ నేత అనిల్‌ విజ్‌లు సైనీ పేరును ప్రతిపాదించగా.. సభ్యులంతా ఏకగ్రీవంగా ఆమోదించారు. దీంతో హర్యానా సీఎంగా రెండోసారి సైనీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మనోహర్‌లాల్‌ ఖట్టర్‌ స్థానంలో సీఎంగా సైనీ ఈ ఏడాది మార్చిలో బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే.

భారత్- న్యూజిలాండ్ టెస్ట్ మ్యాచ్‌లో మార్పులు!
భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య మొదటి టెస్టుకు వరుణుడు అడ్డంకిగా నిలిచాడు. బెంగళూరులో భారీ వర్షం కురవడంతో తొలి రోజైన బుధవారం ఆట సాధ్యపడలేదు. కనీసం టాస్‌ వేయడానికి కూడా అవకాశం లేకపోయింది. గురువారం కూడా మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించే అవకాశాలు ఉన్నాయి. దాంతో ఈ రోజైనా ఆట మొదలవుతుందా? లేదా? అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆక్యూ వెదర్‌ రిపోర్ట్ ప్రకారం.. ప్రస్తుతం బెంగళూరులో వర్షం కురవడం లేదు. అయితే 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు చిరు జల్లులు పడతాయని పేర్కొంది. మధ్యాహ్నం 1 తర్వాత వర్షం తగ్గుముఖం పడుతుందని అంచనా వేసింది. వర్షం పడినా మైదానాన్ని సిద్ధం చేసేందుకు బెస్ట్ సబ్‌ ఎయిర్‌సిస్టమ్ ఉండడం ఊరట కలిగించే అంశం. చిన్నస్వామి స్టేడియంలో వర్షం ఆగాక గంటలో మైదానం ఆటకు సిద్ధంగా ఉంటుంది. ప్రస్తుతం ప్లేయర్స్ అందరూ చిన్నస్వామి స్టేడియంలో ప్రాక్టీస్ చేస్తున్నారు. ఈ టెస్ట్ మ్యాచ్‌లో స్వల్ప మార్పులు చోటుచేసుకున్నాయి. రెండో రోజు ఉదయం 8.45కే టాస్‌ వేసి.. 9.15కి ఆటను ఆరంభించాలని అంపైర్లు నిర్ణయించారు. రోజు మొత్తం మ్యాచ్‌ జరిగితే 98 ఓవర్ల ఆటను నిర్వహించనున్నారు. ఇందుకోసం సమయాల్లో మార్పులు చేసినట్లు అంపైర్లు ప్రకటించారు. తొలి సెషన్‌ 9.15 నుంచి 11.30 గంటల వరకు, రెండో సెషన్ 12.10 నుంచి మధ్యాహ్నం 2.25 గంటల వరకు, చివరి సెషన్ 2.45 గంటల నుంచి 4.45 గంటల వరకు జరుగుతుంది.

క్లాసెన్‌కు 23 కోట్లు.. హైదరాబాద్‌ రిటెన్షన్‌ లిస్ట్‌ ఇదే!
ఐపీఎల్‌ 2025 ముందు బీసీసీఐ మెగా వేలం నిర్వహించనున్న విషయం తెలిసిందే. వేలానికి సంబంధించి రిటెన్ష‌న్ రూల్స్‌ను ఇటీవల ఐపీఎల్ గ‌వ‌ర్నింగ్ కౌన్సిల్‌ ప్ర‌క‌టించింది. ఆరుగురి ఆటగాళ్లను రిటైన్ చేసుకునేందుకు ప్రాంచైజీలకు అవకాశం ఇచ్చింది. ఇందులో ఓ రైట్‌ టు మ్యాచ్‌ (ఆర్‌టీఎం) ఉంటుంది. రిటెన్షన్‌ లిస్ట్‌ సమర్పించేందుకు అక్టోబర్ 31 తుది గడువు. ఈ నేపథ్యంలో ఏ జట్టు ఎవరెవరిని రిటైన్ చేసుకుంటుంది?, ఎవరిని వదిలేస్తుంది? అనేది ఆసక్తికరంగా మారింది. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ (ఎస్ఆర్‌హెచ్) ప్రాంచైజీ రిటెన్షన్‌ చేసుకునే ఆటగాళ్ల జాబితాను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. దక్షిణాఫ్రికా హిట్టర్ హెన్రిచ్‌ క్లాసెన్‌ టాప్‌ రిటెన్షన్‌గా ఉన్నాడని తెలుస్తోంది. క్లాసెన్‌ కోసం ఎస్ఆర్‌హెచ్ ఏకంగా రూ.23 కోట్లు వెచ్చించనుందట. గత సీజన్‌లో క్లాసెన్‌ విధ్వంసం సృష్టించిన విషయం తెలిసిందే. సన్‌రైజర్స్‌ ఫైనల్ చేరడంలో కీలక పాత్ర పోషించాడు. ఇక కెప్టెన్‌ పాట్ కమిన్స్‌ను రూ.18 కోట్లకు రిటైన్‌ చేసుకుంటుందని తెలుస్తోంది. గత సీజన్‌లో కెప్టెన్‌గా కమిన్స్ ఆకట్టుకున్న విషయం తెలిసిందే. గత సీజన్‌లో కమిన్స్‌ను రూ.20.50 కోట్లకు కొనుగోలు చేసింది. ఐపీఎల్ 2024లో సంచలన ప్రదర్శన చేసిన యువ ఆటగాడు అభిషేక్ శర్మకు ఎస్ఆర్‌హెచ్ రూ.14 కోట్లు చెల్లించి రిటైన్‌ చేసుకుంటుందట. మెరుపు ఇనింగ్స్ ఆడిన ట్రావిస్ హెడ్‌ను, ఆల్‌రౌండర్‌ నితీశ్‌ కుమార్‌ రెడ్డిని కూడా సన్‌రైజర్స్‌ అట్టిపెట్టుకుంటుందని తెలుస్తోంది. ఈ ఐదుగురు కొనసాగింపు దాదాపు ఖరారు అయింది. ఎస్ఆర్‌హెచ్ ప్రాంచైజీకి మరో ఆటగాడిని కూడా అట్టిపెట్టుకునే అవకాశం ఉంది.

‘ఒరిజినల్ గ్యాంగ్ స్టర్’ షూట్ లో అడుగుపెట్టేది ఎప్పుడంటే..
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయాల కారణంగా సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చారు. గడచిన ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుపొంది, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ మధ్య సినిమాలకు బ్రేక్ ఇచ్చిన పవర్ స్టార్ మరో సారి మేకప్ వేసుకోబోతున్నారు. ఎన్నికల కారణంగా వాయిదా వేసిన సినిమాలను ఇప్పుడు పూర్తి చేసే ఆలోచనలో ఉన్నారు. అందులో భాగంగానే హరిహర వీరమల్లు, ఓజి (OG ),  ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాల షూటింగ్స్ లో పవర్ స్టార్ అడుగుటపెట్టబోతున్నాడు. వీటిలో హరిహర వీరమల్లు షూటింగ్  విజయవాడలో ఏర్పాటు చేసిన సెట్స్ లో ఇటీవల కొంత భాగం షూట్ చేశారు. కానీ పవర్ స్టార్ ఫ్యాన్స్ అందరి చూపు OG పైనే ఉంది. ఈ సినిమాను తిరిగి ఎప్పుడు స్టార్ట్ చేస్తాడా అని ఫ్యాన్స్ ఆశగా ఎదురుచూస్తున్నారు. సుజిత్ దర్శకత్వం వహిస్తున్నఈ సినిమాలో పవర్ స్టార్ గ్యాంగ్ స్టర్ గా కనిపించనున్నాడు. ఇప్పుడు ఈ చిత్రం నుండి ఆసక్తిక అప్ డేట్ తెలిసింది. OG షూటింగ్ మళ్ళి స్టార్ట్ అయింది, ప్రస్తుతం ఈ షూటింగ్ రామోజీ ఫిలింసిటీలో జరుగుతోంది. నైట్ సీన్స్ షూట్ చేస్తున్నాడు దర్శకుడు సుజీత్ . కానీ పవర్ స్టార్ లేని సీన్స్ మాత్రమే షూట్ చేస్తున్నారు. ఆయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరో రెండు లేదా మూడు రోజల తర్వాతఈ షూట్ లో జాయిన్ అవుతారని తెలుస్తోంది. అటు రాజకియాలు, ఇటు సినిమా షూటింగ్స్ రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ రియల్ పవర్ స్టార్ అనిపించుకున్నారు పవన్ కళ్యాణ్