NTV Telugu Site icon

Top Headlines @9AM : టాప్ న్యూస్‌!

9am News Head Lines

9am News Head Lines

నేడు ఏపీ కేబినెట్ కీలక భేటీ.. నూతన పారిశ్రామిక విధానంపై చర్చ
నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈరోజు ఉదయం 11 గంటలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో ముఖ్యమై నిర్ణయాలపై చర్చించే అవకాశం ఉంది. చెత్త పన్ను రద్దును కేబినెట్ ఆమోదించడంతో పాటు వరద ప్రాంతాల్లో రుణాల రీ షెడ్యూల్ విషయంపై కూడా మంత్రి వర్గంలో చర్చించి ఆమోదించనుంది. దీంతో పాటు ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగా ఐదేళ్లలో ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పన జరిగేలా కొత్త పారిశ్రామిక విధాన ప్రణాళికపై కేబినెట్ లో ప్రధానంగా చర్చించనున్నారు. ఇక, వివిధ రంగాల్లో పెట్టుబడులు ఆకర్షించేలా రూపొందించిన నూతన పాలసీపై ఏపీ మంత్రి వర్గ భేటీలో చర్చించనునున్నారు. మొత్తం పది శాఖల్లో కొత్త విధానాలను రెడీచేశారని.. సీఎం చంద్రబాబు వరుస సమీక్షలు నిర్వహించి పాలసీలు రూపొందించడంలో దిశానిర్దేశం చేశారని అధికారులు పేర్కొన్నారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానాన్ని రాష్ట్రంలో అమలులోకి తెచ్చేలా నూతన పాలసీ రూపకల్పనపై మంత్రి వర్గ సమావేశంలో చర్చించబోతున్నట్లు సమాచారం.

ఏపీలో నేటి నుంచి తెరుచుకోనున్న కొత్త మద్యం దుకాణాలు..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా నేటి నుంచి ప్రైవేట్ మద్యం దుకాణాలు తెరచుకొనున్నాయి. 26 జిల్లాల్లో 3, 396 మద్యం దుకాణాలను వ్యాపారులు ప్రారంభించనున్నారు. గత ఐదేళ్లుగా ఏపీలో ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచిన మద్యం దుకాణాలు నిన్నటితో మూసివేశారు. ప్రైవేట్ వ్యక్తులకు టెండర్ ఇవ్వటం ద్వారా 1800 కోట్ల రూపాయల ఆదాయం ప్రభుత్వానికి వచ్చింది. ఈ వైన్ షాప్స్ ఉదయం 10 నుంచి రాత్రి 10 గంటల వరకు పని చేయనున్నాయి. తిరుపతిలో 227 షాప్స్ అత్యధికంగా ఉండగా.. అల్లూరి జిల్లాలో 40 అత్యల్పంగా ఏర్పాటు అవుతున్నాయి. డిపోల నుంచి సరుకు తీసుకుని నేరుగా షాపులను ఓపెన్ చేయనున్నారు వ్యాపారులు.

ఏపీలో రెండు రోజుల పాటు భారీ వర్షాలు.. పలు జిల్లాలకు రెడ్ అలర్ట్
బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో రెండు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ తెలిపింది. నేడు (బుధవారం) ఏపీలోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవనున్నాయి. రేపు దక్షిణ కోస్తా, రాయలసీమలో కొన్ని చోట్ల అతిభారీ వర్షాలు పడనున్నాయని ఐఎండీ అంచనా వేస్తోంది. ఈ వాయుగుండం రేపు (గురువారం) తెల్లవారుజామున చెన్నైకి దగ్గరగా పుదుచ్చేరి, నెల్లూరు మధ్య తీరం దాటే ఛాన్స్ ఉంది. దీని ప్రభావంతో విస్తృతంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొనింది. దక్షిణకోస్తా, రాయలసీమలో పలు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని చెప్పుకొచ్చింది. కాగా, ఏపీలోని నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, కడప, ప్రకాశం జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే, భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో రెండు రోజుల పాటు విద్యా సంస్థలకు అధికారులు సెలవులు ప్రకటించారు.

నేడు ఢిల్లీ వెళ్లనున్న ముఖ్యమంత్రి.. మంత్రివర్గ విస్తరణ కోసమేనా?
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి నేడు ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు. ఇవాళ సాయంత్రం ఆయన ఢిల్లీ వెళ్లనున్నట్లు సమాచారం. మంత్రివర్గ విస్తరణపై కాంగ్రెస్ పార్టీ పెద్ద నేతలతో చర్చించేందుకు ఆయన ప్రధానంగా ఢిల్లీకి వెళుతున్నట్లు సమాచారం. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పది నెలలు గడుస్తున్నా ఆరు కేబినెట్ పదవులు ఖాళీగా ఉండడంతో ఆ విషయంపై సమీక్ష కోసం వెళ్లనున్నారు. ఇంకా రాష్ట్రంలోని చాలా జిల్లాలకు మంత్రులు లేరు. ఇందుకు సంబంధించి ఇప్పటికే కసరత్తులు పూర్తయినట్లు తెలిసింది. అయితే, మంత్రివర్గ విస్తరణపై చర్చించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లి మరోసారి ఢిల్లీలో కాంగ్రెస్ నేతలతో భేటీ కానున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. స్థానిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మంత్రివర్గ విస్తరణ అవసరమని రేవంత్ రెడ్డి ఢిల్లీ హైకమాండ్‌కు సూచించనున్నారు. ఇప్పటికే జాబితా ఖరారైనప్పటికీ.. దానికి అనుమతులు వచ్చేలా టూర్ కొనసాగుతుందని సమాచారం. మరోవైపు రేవంతరెడ్డి సచివాలయంలో నేటి నుంచి ప్రతి శాఖకు సంబంధించి సమీక్షలు చేపడుతున్నారు.

నేడే జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రిగా ఒమర్ అబ్దుల్లా ప్రమాణ స్వీకారం
నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్‌సి) ఉపాధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లా జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రిగా రెండోసారి నేడు (బుధవారం) ఉదయం 11:30 గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దీంతో ఆయన ఈ కేంద్ర పాలిత ప్రాంతానికి తొలి సీఎం కానున్నారు. శ్రీనగర్‌లోని షేర్-ఎ-కశ్మీర్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ సెంటర్‌లో ఈ కార్యక్రమం జరగనుంది. ఆయనతో పాటు తొమ్మిది మంది మంత్రులు ప్రమాణం చేసే అవకాశం ఉందని సమాచారం. ఇందులో భాగంగా కాంగ్రెస్‌ నేతలకు మంత్రి పదవి, డిప్యూటీ స్పీకర్‌ పదవి దక్కవచ్చు. మంత్రి పదవి కోసం రాష్ట్ర అధ్యక్షుడు తారిఖ్ హమీద్ కర్రా, ప్రధాన కార్యదర్శి గులాం అహ్మద్ మీర్ పేర్లు వినిపిస్తున్నాయి. అయితే, మీర్‌ను కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ నాయకుడిగా అక్టోబర్ 15న మాత్రమే కాంగ్రెస్ నియమించింది. కాబట్టి, ఆయనకు మంత్రి అయ్యే అవకాశాలు తక్కువ. ఇక నిజాముద్దీన్ భట్‌ను డిప్యూటీ స్పీకర్‌గా చేయవచ్చు. దీంతో పాటు స్వతంత్ర ఎమ్మెల్యేకు కూడా మంత్రి పదవి ఇవ్వొచ్చని సమాచారం.

చెన్నై సహా పలు ప్రాంతాల్లో భారీ వర్షం.. రైలు, రోడ్డు, విమానాలు, స్కూళ్లు, కాలేజీలు బంద్
భారీ వర్షాల కారణంగా తమిళనాడులో జనజీవనం అస్తవ్యస్తంగా ఉంది. రైలు, రోడ్డు, విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వాతావ‌ర‌ణ శాఖ ప్ర‌కారం ఇంకా వ‌ర్షాలు కురిసే అవ‌కాశం లేదు. ముందుజాగ్రత్త చర్యగా చెన్నై, చెంగల్‌పేట, తిరువలూరు, కాంచీపురం జిల్లాల్లో ఈరోజు ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, కళాశాలలు మూసి ఉంచాలని ఆదేశాలు జారీ చేశారు. చాలా చోట్ల రోడ్లు, నివాస ప్రాంతాలు మోకాళ్లలోతు నీటిలో ఉన్నాయి. ప్రతికూల వాతావరణం కారణంగా అనేక విమానాలు, రైళ్లు రద్దు చేయబడ్డాయి. రానున్న రెండు రోజుల పాటు రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. అల్పపీడనం అల్పపీడనంగా మారిందని, గురువారం ఉదయం చెన్నై తీరం దాటే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. వాతావరణ శాఖ హెచ్చరిక తరువాత, చెన్నై, చెంగల్‌పేట్, తిరువలూరు, కాంచీపురం జిల్లాల్లో ఈ రోజు అత్యవసర సేవలు కొనసాగుతాయి. ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, కళాశాలలు మూసివేయబడతాయి. పుదుచ్చేరిలో కూడా నేడు పాఠశాలలు, కళాశాలలకు సెలవు ప్రకటించారు. కర్నాటకలో కూడా రాజధాని బెంగళూరు సహా పలు చోట్ల భారీ వర్షాల కారణంగా జనజీవనం అస్తవ్యస్తమైంది. వర్షాలు తగ్గుముఖం పట్టకపోవడంతో ఈరోజు బెంగళూరు జిల్లాలో పాఠశాలలను మూసివేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.

24 గంటల్లో ఆరు విమానాలకు బాంబు బెదిరింపులు
ఒకదాని తర్వాత ఒకటిగా ఆరు విమానాలకు బెదిరింపులు రావడంతో గత 24 గంటల్లో దేశంలో కలకలం రేగుతోంది. బెదిరింపులకు గురైన ఆరు విమానాలు వేర్వేరు విమానాశ్రయాలు, వేర్వేరు మార్గాల్లో ఉన్నాయి. బెదిరింపుల కారణంగా ప్రయాణికులు కూడా తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చింది. బాంబు బెదిరింపు రావడంతో మొత్తం ఆరు విమానాలు మార్గమధ్యంలో ల్యాండ్ కావాల్సి వచ్చింది. వీటిలో ఒకటి కెనడాలో ల్యాండ్ కావాల్సి ఉంది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. భద్రతా తనిఖీల్లో ఈ విమానాల్లో ఏమీ కనిపించకపోవడం. దమ్మామ్ నుంచి లక్నో వెళ్లే ఇండిగో విమానానికి ఆరోజు చివరి బాంబు బెదిరింపు వచ్చింది. విమానంలో బాంబు బెదిరింపు రావడంతో జైపూర్ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. విమానం ల్యాండ్ అయిన వెంటనే భద్రతా సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. అన్ని భద్రతా ఏర్పాట్లు చేశారు. ప్రయాణికులందరినీ పరీక్షించారు. భద్రతా కారణాల దృష్ట్యా, జైపూర్ విమానాశ్రయంలో చాలా విమానాలు ల్యాండింగ్ మరియు టేకాఫ్ నిలిచిపోయాయి. విచారణలో విమానంలో ఏమీ దొరకలేదు.

నేడే భారత్‌, న్యూజిలాండ్‌ తొలి టెస్టు.. వాతావరణం, పిచ్ రిపోర్ట్ డీటెయిల్స్!
స్వదేశంలో మరో టెస్టు సిరీస్‌ లక్ష్యంగా భారత్ పోరుకు సిద్ధమైంది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో తొలి టెస్టు నేటి నుంచే ఆరంభం కానుంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో పటిష్టంగా కనిపిస్తోన్న భారత్‌ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. డబ్ల్యూటీసీ 2023-25 ఫైనల్లో చోటుపై కన్నేసిన రోహిత్ సేన.. సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది. మరోవైపు శ్రీలంక చేతిలో ఓడిన న్యూజిలాండ్‌.. జోరుమీదున్న టీమిండియాను ఏ మేరకు అడ్డుకుంటుందో చూడాలి. శుభ్‌మన్‌ గిల్, యశస్వి జైస్వాల్‌ మంచి ఫామ్‌లో ఉన్నారు. మరోవైపు రిషబ్ పంత్‌ పునరాగమనంలో ఆకట్టుకున్నాడు. లోకేష్ రాహుల్‌ కూడా పరుగులు చేస్తున్నాడు. సీనియర్‌ ఆటగాళ్లు రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీ ఫామ్ అందుకుంటే తిరుగుండదు. గిల్‌ మెడ పట్టేయడంతో అతడు ఆదుకుంటే.. సర్ఫరాజ్‌ ఖాన్‌ జట్టులోకి వస్తాడు. బౌలింగ్‌లో అశ్విన్, జడేజా, బుమ్రా, సిరాజ్‌ అదరగొడుతున్నారు. అదనపు స్పిన్నర్‌ను తీసుకోవాలా లేదా ఫాస్ట్‌ బౌలర్‌ను ఆడించాలా అన్నది నేడు తేలనుంది. ఈ టెస్టు మ్యాచ్‌కు వర్షం ముప్పు పొంచింది. మొదటి 2-3 రోజుల ఆటకు తీవ్ర అంతరాయం కలిగే అవకాశముంది. బెంగళూరులో భారీ వర్షం వల్ల మంగళవారం ఇరు జట్ల ప్రాక్టీస్‌ సెషన్‌ కూడా తుడిచిపెట్టుకుపోయింది. అయితే చిన్నస్వామి స్టేడియంలో డ్రైనేజ్‌ సౌకర్యం బాగుండడం సానుకూలాంశం. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో పిచ్‌ సీమర్లకు అనుకూలించే అవకాశముంది.

11 నిమిషాల సీన్‌ సింగిల్‌ టేక్‌లో చేశాం: వరుణ్‌
వరుణ్‌ ధావన్, సమంత జంటగా నటించిన యాక్షన్‌ థ్రిల్లింగ్‌ వెబ్‌సిరీస్‌ ‘సిటడెల్‌: హనీ- బన్నీ’. ఈ వెబ్‌సిరీస్‌కు రాజ్‌ అండ్‌ డీకే దర్శకత్వం వహించారు. అమెరికన్‌ సిరీస్‌ ‘సిటాడెల్‌’ ఇండియన్‌ వెర్షన్‌గా సిటాడెల్‌: హనీ బన్నీగా వస్తోంది. తాజాగా ముంబైలో లాంఛ్ ఈవెంట్​ నిర్వహించి.. సిటడెల్‌ ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ ఈవెంట్​లో ​సిరీస్​ కోసం తాను, సమంత ఎంతలా కష్టపడ్డారో వరుణ్ ధావన్ వివరించారు. వరుణ్ ధావన్ మాలాడుతూ… ‘సిటడెల్‌లో నేను, సమంత 11 నిమిషాల సన్నివేశాన్ని సింగిల్‌ టేక్‌లో చేశాం. ఎటువంటి కట్స్​ లేకుండా చేశాము. సిరీస్​ క్లైమాక్స్​లో ఈ సీన్ వస్తుంది. ఇది పక్కా ఇంటెన్స్​ యాక్షన్ సీక్వెన్స్​. ప్రేక్షకులు థ్రిల్ ఫిల్ అవుతారు. లాక్‌డౌన్‌ సమయంలో నిర్మాత ఆదిత్య చోప్రాను కలిశాను. ఆయన టైగర్‌ 3 సినిమా పనుల్లో ​ బిజీగా ఉన్నారు. యంగ్‌ హీరోస్​తో మీరు యాక్షన్‌ చిత్రాలను ఎందుకు చేయరు? అని అడిగా. బడ్జెట్‌ లెక్కలు ఉంటాయని ఆయన బదులిచ్చారు. సిటడెల్‌ కోసం నన్ను కలిసినప్పుడు బడ్జెట్‌ గురించే ముందుగా మాట్లాడాను. నాకు అవకాశం ఇచ్చిన రాజ్‌ అండ్​ డీకే, అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోకు ప్రత్యేక కృతజ్ఞతలు’ అని తెలిపారు.