NTV Telugu Site icon

Top Headlines @5PM: టాప్‌ న్యూస్‌!

Top Headlines @ 5 Pm New

Top Headlines @ 5 Pm New

కాసేపట్లో వైద్య పరీక్షల కోసం జీజీహెచ్కు వల్లభనేని వంశీ తరలింపు..
కృష్ణా జిల్లాలోని గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీని పోలీసులు అరెస్ట్ చేసి కృష్ణలంక పోలీస్స్టేషన్లో విచారణ చేస్తున్నారు. ఈ సందర్భంగా వంశీ స్టేట్మెంట్ ను పోలీసులు రికార్డు చేస్తున్నారు. కాసేపట్లో వైద్య పరీక్షల కోసం విజయవాడలోని జీజీహెచ్కు తరలించనున్నారు. వైద్య పరీక్షల అనంతరం ఎస్సీ, ఎస్టీ కోర్టులో అతడ్ని హాజరు పర్చనున్నారు. మరోవైపు, విశాఖపట్నం నుంచి విజయవాడలోని పటమట పోలీస్స్టేషన్కు సత్యవర్థన్ను పోలీసులు తీసుకొచ్చారు. సత్యవర్థన్ నుంచి వివరాలు సేకరిస్తున్నారు. అయితే, సత్య వర్ధన్ ను కిడ్నాప్ చేసి దాడి చేసి కేసు వెనక్కి తీసుకునేలా గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ చేశారని అతని సోదరుడు ముదునూరి కిరణ్ ఇచ్చిన ఫిర్యాదుపై వంశీపై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. వంశీని అరెస్ట్ విషయం తెలిసి కృష్ణలంక పోలీస్స్టేషన్ దగ్గరకు వచ్చిన ఆయన భార్య.. అతడ్ని కలిసేందుకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. దీంతో పోలీస్ స్టేషన్ బయటే ఆమె ఉండిపోయింది.

దెందులూరులో అబ్బయ్య చౌదరి వర్సెస్ చింతమనేని..
ఏలూరు జిల్లాలోని దెందులూరు నియోజక వర్గంలో రాజకీయం ఒక్కసారిగా హీటెక్కింది. మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి వర్సెస్ ప్రస్తుత టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. ఈ సందర్భంగా చింతమనేని మాట్లాడుతూ.. కొంతమంది పోయిన ఉనికిని కాపాడుకోవడానికి సంచలనం సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు. చట్టం ప్రకారం కూటమి ప్రభుత్వం పని చేస్తుంది.. కావాలని గొడవ చేస్తే చూస్తూ ఊరుకోనే పరిస్థితి లేదు అని వార్నింగ్ ఇచ్చారు. నేను బరస్ట్ అయిన మాట వాస్తవమే అని చింతమనేని ప్రభాకర్ తెలిపారు. ఇక, దెందులూరు మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి మాట్లాడుతూ.. దెందులూరు నియోజక వర్గంలో విధ్వంస పాలన కొనసాగుతుంది అన్నారు. వైసీపీ కార్యకర్తలు, నాయకులపై చింతమనేని ప్రభాకర్ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే నన్ను నా కుటుంబాన్ని అంత మొందించాలని కుట్ర జరుగుతున్నట్టుగా అనుమానం కలుగుతుంది అని పేర్కొన్నారు.

ఉత్తరాంధ్ర టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో 10 మంది అభ్యర్థులు..
ఉత్తరాంధ్ర టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో పది మంది అభ్యర్థులు ఉన్నారని విశాఖ పట్నం జిల్లా కలెక్టర్, రిటర్నింగ్ అధికారి హరేందిర ప్రసాద్ తెలిపారు. మొత్తం 20 మంది నామినేషన్లు దాఖలు చేయగా.. అందులో నాలుగు నామినేషన్లు తిరస్కరించాం.. 16 నామినేషన్లకు ఆమోదం తెలిపాం.. ఒక్కరు కూడా నామినేషన్ ను ఉపసంహరించుకోలేదని పేర్కొన్నారు. ఈ నెల 27వ తేదీన టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయని విశాఖ కలెక్టర్ హరేందిర చెప్పుకొచ్చారు. ఇక, మార్చ్ 3వ తేదీన టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ఉంటుందని విశాఖ జిల్లా కలెక్టర్, రిటర్నింగ్ అధికారి హరేందిర ప్రసాద్ చెప్పారు. ఉదయం 8 గంటలకు కౌటింగ్ ప్రారంభం అవుతుంది.. ఎన్నిక నిర్వహణ కోసం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశాం.. పటిష్టమైన భద్రత నడుమ ఎన్నికలు నిర్వహిస్తాం అన్నారు. సాధారణ ఎన్నికల మాదిరిగానే ఓటర్ స్లిప్స్ ఇస్తాం.. ఓటింగ్ సమయంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందస్తు చర్యలు చేపట్టినట్లు కలెక్టర్ తేల్చి చెప్పారు.

కాంగ్రెస్‌ హయాంలో దుర్భర స్థితిలో ప్రభుత్వ ఆస్పత్రులు.. మాజీ మంత్రి ఫైర్
మేడ్చల్ జిల్లాలోని దమ్మాయిగూడ మున్సిపాలిటీలో గల కీసర హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్ కు తాళం వేసే దుస్థితి వస్తే ప్రభుత్వం, వైద్యారోగ్య శాఖ ఏం చేస్తుందని? అని మాజీ మంత్రి హరీష్ రావు ప్రశ్నించారు. హైదరాబాద్ సహా నిజామాబాద్, ఆదిలాబాద్, మహబూబ్ నగర్ తదితర జిల్లాల్లో బస్తీ దవాఖానాల పని తీరు దుర్భరంగా ఉంది.. ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదని అడిగారు. పల్లె, బస్తీ దవాఖానాలు ప్రారంభించి ప్రజల సుస్తీని బీఆర్ఎస్ ప్రభుత్వం పోగొడితే, ఆ దవాఖానాలకే సుస్తీ పట్టించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. కేసీఆర్ పదేళ్లలో తెలంగాణ వైద్యారోగ్య రంగాన్ని దేశానికే రోల్ మోడల్ గా నిలిపితే, కాంగ్రెస్ ప్రభుత్వం ఆ ఖ్యాతిని దూరం చేస్తుందని మాజీ మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు.

మాజీ సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం.. ఈ నెల 19న..
బీఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈనెల 19 వ తేదీన బీఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర కార్యవర్గ విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ మేరకు పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ ను ఆదేశించారు. గూలాబీ బాస్ ఆదేశాల మేరకు.. ఈనెల 19వ తేదీన మధ్యాహ్నం1 గంట నుంచి తెలంగాణ భవన్ లో పార్టీ విస్త్రృత స్థాయి సమావేశం జరగనుంది. కేసీఆర్ అధ్యక్షతన పార్టీ రాష్ట్ర కార్యవర్గం, జిల్లా పార్టీ అధ్యక్షులు, ప్రస్తుత, మాజీ, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పోరేషన్ ఛైర్మన్లు, జిల్లా పరిషత్ ఛైర్మన్లు, డీసీసీబీ, డీసీఎంఎస్ అధ్యక్షులతో పాటు పార్టీ నియోజకవర్గ ఇన్‌ఛార్జిలు హాజరవుతారని తెలిపారు.

శభాష్ తెలంగాణ పోలీస్.. 5 కోట్ల దోపిడీ కేసును ఛేదించిన టీం..
హిమాయత్ నగర్ దోపిడీ కేసును తెలంగాణ పోలీసులు ఛేదించారు. తక్కువ సమయంలో కేసును ఛేదించి శభాష్ అనిపించారు. ఈ సందర్భంగా హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. దోపిడీ జరిగిన వెంటనే అన్ని డిపార్ట్మెంట్స్ అప్రమత్తమయ్యి నిందితులను పట్టుకోవడం జరిగిందని తెలిపారు.. మూడు కోట్ల రూపాయల సొత్తు దొంగిలించారని.. సొత్తు విలువ బహిరంగ మార్కెట్ విలువ అయిదు కోట్లు పైనే ఉంటుందన్నారు.. 11 తేదీన రోహిత్ కేడియా కూతురు వివాహం కోసం దుబాయ్ వెళ్లారని.. వీరి కుటుంబం ఆయిల్ బిజినెస్ చేస్తుంటారన్నారు.. ఉదయం వీరు కూతురు పెళ్ళికి దుబాయ్ వెళ్లారని చెప్పారు.. మొలహు ముఖ్య , సుశీల్ ముఖ్య , బసంతిలు ఈ చోరీ చేసినట్లు తెలిపారు. నిందితులు గతంలో మర్డర్ కేసులో ఉన్నట్లు వెల్లడించారు.. స్నేహలత అనే మహిళను హత్య చేసిన కేసులో కోటీ రూపాయలు దోచుకున్నట్లు తెలిపారు..

కాంగ్రెస్ ఎంపీ భార్యకు ‘‘పాకిస్తాన్’’ లింక్.. సీఎం సంచలన ఆరోపణలు..
అస్సాంకు చెందిన కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ భార్యపై ఆ రాష్ట్ర సీఎం హిమంత బిశ్వ సర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐతో సంబంధాలు ఉన్న ఒక సంస్థలో ఉద్యోగం చేస్తోందని హిమంత శర్మ ఆరోపించారు. ప్రత్యక్షంగా ఎవరి పేరు చెప్పకుండా బుధవారం నుంచి వరసగా ఎక్స్‌లో ట్వీట్స్‌తో విరుచుకుపడుతున్నారు. భారతదేశం అభ్యంతరం చెప్పినప్పటికీ 2015లో పాకిస్తాన్ హైకమిషనర్‌తో గౌరవ్ గొగోయ్ సమావేశం కావడాన్ని కూడా ఆయన విమర్శించారు. అయితే, ఈ ఆరోపణపై కాంగ్రెస్ ఎంపీ గొగోయ్ స్పందించారు. ఈ ఆరోపణలు నవ్వు తెప్పిస్తున్నాయని అన్నారు. 2026 అస్సాం ఎన్నికల ముందు తనపై తప్పుడు ప్రచారంగా అభివర్ణించారు. ఈ వివాదానికి కేంద్ర బిందువుగా ‘‘ఎలిజబెత్ కోల్బర్న్’’ ఉంది. 2013లో గొగోయ్ ఈమెను అమెరికాలో కలిసిన తర్వాత వీరిద్దరు వివాహం చేసుకున్నారు. లిజబెత్ 2011-2015 మధ్య క్లైమేట్ డెవలప్‌మెంట్ అండ్ నాలెడ్జ్ నెట్‌వర్క్ తో పనిచేశారు. దీనికి ఎక్కువగా పాకిస్తాన్‌తో సంబంధాలు ఉన్నాయి. ఆమె పాకిస్తాన్ ప్లానింగ్ కమిషన్ మాజీ సలహాదారు, ఐఎస్ఐతో సంబంధం ఉన్న అలీ తౌకీర్ షేక్ కింద పనిచేశారని బీజేపీ ఆరోపించింది.

బుల్లెట్ బండి నడిపినందుకు.. దళిత విద్యార్థి చేతులు నరికివేత..
పెరియార్ సిద్ధాంతం, కుల-మత రహిత సమాజం కోసం ప్రయత్నిస్తున్నామని చెప్పే తమిళనాడు రాష్ట్రంలో ఇటీవల కుల దురహంకారం, పరువు హత్యలు జరుగుతున్నాయి. తాజాగా, రాష్ట్రంలోని శివగంగై జిల్లాలోని మెలపిడావూర్ సమీపంలో దళిత విద్యార్థిపై అగ్రకులానికి చెందిన ముగ్గురు వ్యక్తులు దాడి చేసి, అతడి చేతులు నరికేశారు. ప్రభుత్వ కాలేజీలో థర్డ్ ఇయర్ చదువుతున్న బాధితుడు అయ్యసామి(20) బుధవారం రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌పై ఇంటికి వెళ్తుండగా దాడికి గురయ్యాడు. అయ్యసామి తల్లి ప్రకారం.. దాడి చేసిన వ్యక్తులు, దాడికి పాల్పడే ముందు కుల దూషణలు చేశారని చెప్పింది. దాడికి గురైన బాధితుడిని గ్రామస్తులు మధురై రాజాజీ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అక్కడే బాధితుడు చికిత్స పొందుతున్నాడు. ముగ్గురు నిందితులు వినోద్, ఆది ఈశ్వరర్, వల్లరసులను పోలీసులు అరెస్ట్ చేశారు.

చిరంజీవి మా పాలిట దేవదూతలా కనిపించారు.. ఊర్వశి ఎమోషనల్
ఊర్వశీ రౌతేలా మెగాస్టార్ చిరంజీవి మీద ప్రశంసల వర్షం కురిపించింది. ఊర్వశీ తల్లి మీను రౌతేలా ఈ మధ్య ఆస్పత్రి పాలైంది. ఆమె ఎడమ కాలిలో ఎముకలో ఇంట్రా ఆర్టిక్యూలర్‌ ఫ్రాక్చర్‌ కావడంతో ఊర్వశీ చిరంజీవిని సహాయం కోరిందట. చిరంజీవి హీరోగా నటించిన ‘వాల్తేరు వీరయ్య చిత్రంలో ‘వేర్‌ ఈజ్‌ ద పార్టీ బాసు’ సాంగ్‌లో కనిపించింది. ఆ పరిచయంతో చిరంజీవిని సహాయం అడిగితే చిరంజీవి కోల్‌కత్తా అపోలో ఆస్పత్రి బృందంతో మాట్లాడి మెరుగైన వైద్యం అందేలా చేశారట. ఈ క్రమంలో ఆమె మాట్లాడుతూ చిరంజీవి సేవా కార్యక్రమాల గురించి ఎంతో విన్నా, ‘వాల్తేరు వీరయ్య’ షూటింగ్‌లో ఆయన్ను ఎంతో గమనించా. ఆపద అన్నవారికి నేను చూస్తుండగానే ఎంతో సాయం అందించారు, అయితే ఆ సాయం నా వరకూ కూడా వచ్చింది. ఎంతో మొహమాటంగా అడిగా, నిర్భయంగా ఉండమని ధైర్యం చెప్పి, ఒక రక్షకుడిలా సమస్యకు సంబంధించిన అన్ని వివరాలు క్షుణ్ణంగా తెలుసుకున్నారు. వెంటనే కలకత్తాలోని అపోలో సిబ్బందితో మాట్లాడి మంచి వైద్యం అందేలా చేశారు. అంతేకాదు ‘మీ అమ్మకి ఏమీ కాదు. ఆరోగ్యంగా ఉంటారు’ అని ధైర్యం చెప్పారని పేర్కొంది. ఆ సమయంలో ఆయన మాటలు కొండంత ధైర్యానిచ్చి మా కుటుంబానికి శ్వాస నిచ్చిన నిజమైన హీరోలా కనిపించారు.

‘కోబలి’ పార్ట్-2 మరింత అలరిస్తుందట
రా అండ్ రస్టిక్ వెబ్ సిరీస్ ‘కోబలి’ ఫిబ్రవరి 4 నుండి డిస్నీ ప్లస్ హాట్ స్టార్లో 7 భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సిరీస్ కి అన్ని రాష్ట్రాల ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ లభించింది. ‘నింబస్ ఫిలిమ్స్’ ‘యు1 ప్రొడక్షన్స్’ ‘టి.ఎస్.ఆర్ మూవీ మేకర్స్’ సంస్థలపై జ్యోతి మెగావత్ రాథోడ్, రాజశేఖర్ రెడ్డి కామిరెడ్డి, తిరుపతి శ్రీనివాసరావు సంయుక్తంగా నిర్మించారు. ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్లో రూపొందిన ఈ సిరీస్లో రవి ప్రకాష్, రాకీ సింగ్ ప్రధాన పాత్రలు పోషించగా.. తరుణ్ రోహిత్, శ్రీతేజ్, శ్యామల, యోగి ఖత్రి, శ్రీ పవన్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. రేవంత్ లేవాక దర్శకత్వం వహించాచిన ఈ సిరీస్ కి నార్త్ నుండి కూడా మంచి ఆదరణ లభిస్తోందని మేకర్స్ తెలిపారు. ఈ క్రమంలో మేకర్స్ సక్సెస్ మీట్‌ను ఏర్పాటు చేశారు.