NTV Telugu Site icon

Top Headlines @9PM: టాప్‌ న్యూస్‌

Top Headlines

Top Headlines

ఏపీ కంటే తెలంగాణ చొరవ ఎక్కువ

విశాఖలో ముగిసిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ పై మాజీమంత్రి గంటా శ్రీనివాసరావు స్పందించారు. ఎంవోయూలను వాస్తవ రూపంలో తీసుకుని రావడమే ఇప్పుడు ప్రభుత్వం ముందున్న అసలు ఛాలెంజ్ అన్నారు గంటా. నేను 20 ప్రశ్నలతో ప్రభుత్వానికి లేఖ రాస్తే ప్రభుత్వం సమాధానం చెప్పలేకపోయింది. పెట్టుబడులను ఆకర్షించడంలో తెలంగాణ ప్రభుత్వం ఎక్కువ చొరవ చూపిస్తోందన్నారు. జగన్ బ్రాండ్ అనుకుంటే ఇంత కాలం పెట్టుబడిదారులు ఎందుకు రాష్ట్రం వైపు చూడలేదో చెప్పగలరా…..? అని గంటా ప్రశ్నించారు. టీడీపీ హయాంలో సమ్మిట్ జరిగినప్పుడు డైవర్ట్ చేసేందుకు జగన్మోహన్ రెడ్డి, ఆ పార్టీ ముఖ్య నాయకత్వం చేసిన ప్రయత్నాలు ప్రజలకు గుర్తున్నాయి. నాలుగేళ్లు పారిశ్రామిక అభివృద్ధిని వదిలేసి ఎన్నికల ముందు హడావిడి చెయ్యడం ప్రజల దృష్టిని మళ్లించే ఎత్తుగడలో భాగమే అని దుయ్యబట్టారు గంటా. టీడీపీ హయాంలో ప్రముఖ కంపెనీలు ఒప్పందాలు చేసుకుంటే ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. పరిశ్రమలు పొరుగు రాష్ట్రాలకు తరలిపోవడానికి వైసీపీ ప్రభుత్వ విధానాలే కారణం. ఒప్పందాలు చేసుకున్న చొరవ పరిశ్రమలను రాబట్టడంలో ప్రదర్శిస్తే స్వాగతిస్తాం అన్నారు గంటా.

వడాపావ్ కు అరుదైన గుర్తింపు

‘వడాపావ్’ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. ఇండియాలో స్ట్రీట్ ఫుడ్స్ లో చాలా ఫేమస్. ముంబై, మహారాష్ట్రలకు ఎక్కువగా గుర్తింపు పొందిన ఈ స్నాక్ నెమ్మనెమ్మదిగా ఇండియా మొత్తం విస్తరించింది. ప్రస్తుతం ప్రపంచంలోని ఫుడ్ లవర్స్ ను కూడా మెప్పిస్తోంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం వడాపావ్ అంతర్జాతీయ గుర్తింపును పొందింది. దీనికి అరుదైన గుర్తింపు లభించింది. ప్రపంచంలో అత్యుత్తమ శాండ్‌విచ్‌లలో ఒకటిగా నిలిచింది. ‘టేస్ట్ అట్లాస్’ ప్రపంచంలో అత్యుత్తమ శాండ్‌విచ్‌లతో ఓ జాబితా రూపొందించింది. దీంట్లో వడాపావ్ 13వ స్థానంలో నిలిచింది. టెస్ట్ అట్లాస్ తన అధికారిక ట్విట్టర్ హ్యాండిల్‌లో 50 విజేత శాండ్‌విచ్‌ల జాబితాను పోస్ట్ చేసింది. ఇది ప్రపంచంలోని 100 అత్యుత్తమ శాండ్‌విచ్‌ల జాబితాకు సంబంధించి లింక్ షేర్ చేసింది. ఈ జాబితాలో టర్కీకి చెందిన టోంబిక్ 1వ ర్యాంకుతో అగ్రస్థానంలో నిలిచింది. ఆ తరువాతి స్థానంలో క్యూబన్ శాండ్‌విచ్, అవకాడో టోస్ట్, ఫ్రెంచ్ డిప్ శాండ్‌విచ్ లు ఉన్నాయి.

అంతర్రాష్ట్ర గంజాయి ముఠా పట్టివేత

అంతర్రాష్ట్ర గంజాయి ముఠా గుట్టు రట్టు చేశారు చౌటుప్పల్ పోలీసులు. గంజాయిని అక్రమంగా తరలిస్తుండగా వారిని అరెస్ట్ చేశారు. వారి నుంచి సుమారు 400కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా రాచకొండ పోలీస్ కమిషనర్ డీఎస్ చౌహన్ మాట్లాడుతూ.. మాదక ద్రవ్యాల ఫై రాచకొండ కమిషనరేట్ పరిధిలో ప్రత్యేక డ్రైవ్ చేస్తున్నామన్నారు. పక్కా సమాచారంతో గంజాయి ముఠా ను అరెస్ట్ చేశామన్నారు. ఆంధ్ర, ఒడిశా సరిహద్దులో గంజాయి తీసుకుని మహారాష్ట్ర – కర్ణాటక మీదుగా తరలిస్తున్న గంజాయి ముఠాని గుర్తుంచామన్నారు. డీసీఎం వ్యాన్ లో లోపల ఎవ్వరూ గుర్తించకుండా గంజాయి తరలిస్తున్నారని తెలిపారు. మొత్తం ఈ కేసులో ఏడుగురు ఉన్నారని.. నలుగురు ను ఆరెస్ట్ చెయ్యగా మరో ముగ్గురు పరారీలో ఉన్నట్లు తెలిపారు. మొత్తం ఈ గంజాయి నెట్వర్క్ ను నిర్మూలించడానికి కృషి చేస్తున్నట్లు రాచకొండ పోలీస్ కమిషనర్ డీఎస్ చౌహన్ వివరించారు. విశాఖపట్నం నుంచి హైదరాబాద్‌కు గంజాయిని అక్రమంగా తరలిస్తున్న ఓ యువకుడిని నల్లగొండ జిల్లా పోలీసులు శుక్రవారం పట్టుకున్నారు. ఎస్పీ అపూర్వరావు వివరాల ప్రకారం.. నకిరేకల్‌కు చెందిన కొండ తేజ్‌కుమార్‌ వృత్తిరీత్యా ఆటో డ్రైవరు. ఇతడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండలం రాంచంద్రాపురంలో నివాసం ఉండేవాడు.

మామధ్య ఏం లేదు.. బాంబ్ పేల్చిన మహేశ్వర్రెడ్డి

కాంగ్రెస్ పార్టీలో పాదయాత్రల లొల్లి కొనసాగుతూనే ఉంది. రేవంత్ రెడ్డి, మహేశ్వర్ రెడ్డిలు పోటాపోటీగా పాదయాత్రలు నిర్వహిస్తూనే ఉన్నారు. ఈ విషయంపై తెలంగాణ కాంగ్రెస్‌లో మరోసారి పంచాయతీలు మొదలయ్యాయంటూ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే మహేశ్వర్ రెడ్డి స్పందించారు. తమ మధ్య గ్రూపులు లేవని.. పార్టీలో ఐక్యంగా ముందుకు వెళ్తామని ఆయన తెలిపారు. ఏఐసీసీ ఆదేశాలతోనే యాత్ర చేస్తున్నట్లు ఆయన తెలిపారు. అంతేకాకుండా అధిష్టానం ఆదేశాల మేరకే నేతలంతా పాదయాత్రలు చేస్తున్నారని మహేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. రేవంత్‌ది, తనది కాంగ్రెస్ యాత్రలేనని.. రెండూ హాత్ సే హాత్ జోడో యాత్రలేనని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ అంతా ఒకటే కుటుంబమని..పార్టీలో ఎలాంటి గ్రూపులు లేవన్నారు. సీనియర్లు వారి అనుకూలతను బట్టి యాత్రలకు హాజరవుతారని మహేశ్వర్ రెడ్డి తేల్చేశారు. తనకు పార్టీ అధిష్టానం ఇచ్చిన బాధ్యతను నెరవేరుస్తానన్నారు. అందరం కలిసి కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకొస్తామని ఆయన తెలిపారు. తెలంగాణలోని 119 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీకి బలమైన కేడర్, నేతలు వున్నారని మహేశ్వర్ రెడ్డి స్పష్టం చేశారు.

బీజేపీపై పోరాటానికి సిబల్ కొత్త వేదిక

ప్రముఖ న్యాయవాది, మాజీ కాంగ్రెస్ నేత, రాజ్యసభ సభ్యుడు కపిల్ సిబల్ బీజేపీపై పోరాటానికి సిద్ధం అయ్యారు. దీని కోసం కొత్త వేదిక ఏర్పాటు చేశారు. బీజేపీ ప్రభుత్వంలో జరుగుతున్న అన్యాయాలను ఎదుర్కొనేందుకు ‘ఇన్సాఫ్’ అనే వేదికను స్థాపిస్తున్నట్లు ప్రకటించారు. ప్రజల కోసం ‘ఇన్సాఫ్ కే సిపాహి’ పేరిట వెబ్ సైట్ తీసుకువస్తున్నట్లు తెలిపారు. ఈ వేదిక ద్వారా ప్రజల సమస్యలపై లాయర్లు పోరాటా చేస్తారని అన్నారు. దీనికి విపక్ష పార్టీల ముఖ్యమంత్రులు మద్దతు ఇవ్వాలని కోరారు. దేశంలో ఆర్ఎస్ఎస్ తన సిద్ధాంతాలను విస్తరిస్తోందని, దీని వల్ల ప్రజలకు అన్యాయం జరుగుతోందని ఆయన ఆరోపించారు. బీజేపీ ఎన్నికైన ఎనిమిది ప్రభుత్వాలను పడగొట్టిందని విమర్శించారు. పార్టీ ఫిరాయింపు దారులకు 10వ షెడ్యూల్ వరంగా మారిందని అన్నారు. రాజకీయ ఫిరాయింపులను అరికట్టడానికి ఉద్దేశించిన రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ ప్రస్తుత పాలనలో దుర్వినియోగం అవుతుందని అన్నారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలు లేకుండా సీబీఐ పనిచేయదని, ఈడీ ఎక్కడికైనా వెళ్లవచ్చని సిబల్ అన్నారు. మనం ప్రభుత్వం వర్సెస్ ప్రజలు అనే పరిస్థితిలో ఉన్నామని అన్నారు. మేము పౌరుల కోసం ప్రభుత్వాన్ని కోరుకుంటున్నామని అన్నారు. కర్ణాటకలో బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్యే కుమారుడు రూ. 6 కోట్లు లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడని, ఎమ్మెల్యే కుమారుడిపై ఇంకా ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు.

ఇప్పటంలో ఆందోళన విరమించిన జనసేన

ఇప్పటంలో టెన్షన్ వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఆందోళన విరమించారు జనసేన నేతలు. జనసేన పీఏసీ మెంబర్ బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. మచిలీపట్నం జనసేన సభ జరుగుతుండడంతోనే ఇప్పటంలో కూల్చి వేతలు చేపట్టారు. 1916లో అధికారులు సర్వే మ్యాప్ చూపిస్తున్నారు. ఎందుకు మ్యాప్ చేశారో అధికారులు చెప్పడం లేదు. అధికారులు ప్రభుత్వం చెప్పినట్లు చేయడం దుర్మార్గం. భవిష్యత్తులో ఇప్పటంలో ప్రజల ఆమోదంతోనే చేపడతామని హామీ ఇచ్చారు కాబట్టి విరమిస్తున్నాం అన్నారు. ఇప్పటంలో జేసీబీలతో వస్తే హైవేలను దిగ్భంధించాం. జేఏసీ నేత గాదె వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. ప్రభుత్వం కక్ష సాధింపు రాజకీయాలు చేస్తుంది. జగన్ ని ఎన్నుకున్నందుకు రాష్ట్రం తగలబడిపోతుంది. అధికారులు విజ్నత కోల్పోయి వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వం చెప్పినట్లు వేస్తే అధికారులు మూల్యం చెల్లించుకోక తప్పదు.మచిలీపట్నం సభను ఆపాలని అక్కడి వారిని బయపెట్టాలని చూస్తున్నారు.మేము జగన్ దారిలోకే వెళ్తాం.. రాబోయే రోజుల్లో ప్రభుత్వానికి చెమటలు పట్టిస్తాం.జనసేన నేత చిల్లపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. జగన్ రాబోయే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తు తీసేసి ప్రొక్లెయిన్ గుర్తు పెట్టుకోవాలని సలహా ఇచ్చారు. జగన్ కి రాబోయే రోజుల్లో గట్టి బుద్ధి చెబుతాం అన్నారు జనసేన నేతలు.

మాస్ ‘మీటర్’ పెంచుతున్న యంగ్ హీరో…

సరిగ్గా రెండు వారాల క్రితం వరకూ హ్యాట్రిక్ ఫ్లాప్స్ ఇచ్చిన హీరోగా ఉన్న కిరణ్ అబ్బవరం, ఫిబ్రవరి 18న వినరో భాగ్యము విష్ణు కథ సినిమాతో మంచి హిట్ కొట్టాడు. కొత్త కథ, కొత్త కథనం ఉన్న సినిమా చేసిన కిరణ్ అబ్బవరం మూడు వారాలైనా ఇప్పటికీ బీ, సీ సెంటర్స్ లో స్ట్రాంగ్ హోల్డ్ ని మైంటైన్ చేస్తున్నాడు. ఫస్ట్ గా సినిమాలని చేస్తున్న ఈ సీమ కుర్రాడు ఏప్రిల్ నెలలో మరోసారి ఆడియన్స్ ముందుకి రాబోతున్నాడు. ఏప్రిల్ 7న కిరణ్ అబ్బవరం ‘మీటర్’ సినిమాతో ఆడియన్స్ ముందుకి రాబోతున్నాడు. రమేష్ కాడురి దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ మరియు క్లాప్ ఎంటర్టైన్మెంట్స్  కలిసి నిర్మిస్తున్న ‘మీటర్’ సినిమాలో కిరణ్ అబ్బవరం మాస్ లుక్ లో కనిపించబోతున్నాడు. అతుల్య హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీలో కిరణ్ అబ్బవరం పోలిస్ ఆఫీసర్ రోల్ ప్లే చేస్తున్నాడు. ఇప్పటికే వదిలిన పోస్టర్స్ కి మంచి రెస్పాన్స్ వస్తుంది. లేటెస్ట్ గా ‘మీటర్’ సినిమా టీజర్ ని రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. మార్చ్ 7న సాయంత్రం 4:05 నిమిషాలకి మీటర్ టీజర్ ని విడుదల చెయ్యనున్నారు. ఫుల్ యాక్షన్ అండ్ ఎంటర్టైన్మెంట్ కి రెడీగా ఉండండి అంటూ మైత్రీ మూవీ మేకర్స్ ట్విట్టర్ హ్యాండిల్ నుంచి పోస్ట్ చేశారు. మరి సాయి కార్తీక్ మ్యుకిక్ ఇస్తున్న ఈ మూవీ కిరణ్ అబ్బవరం హిట్ లిస్టులో చేరుతోందో లేక ప్రేక్షకులని డిజప్పాయింట్ చేస్తుందో చూడాలి.

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్వీకరించిన నమ్రతా శిరోద్కర్

మార్చ్ 8న మహిళా దినోత్సవం సంధర్భంగా నమ్రత శిరోద్కర్ ఘట్టమనేని గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ని స్వీకరించి మొక్కలు నాటింది. బీఆర్ఎస్ ఎంపీ సంతోష్ కుమార్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో నమ్రతని పాల్గొనాలని కోరుతూ నామినేట్ చేశారు. ఈ ఛాలెంజ్ ని స్వీకరించిన నమ్రత… తనను గ్రీన్ ఇండియా చాలెంజ్‌కు నామినేట్ చేసినందుకు ఎంపీ సంతోష్ కుమార్‌ కి ధన్యవాదాలు తెలిపారు. మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలు అందరూ మొక్కలు నాటాలని కోరుతూ ఒక వీడియోను కూడా నమ్రత షేర్ చేసింది.