NTV Telugu Site icon

Top Headlines @9PM : టాప్ న్యూస్

Top Headlines @ 9 Pm

Top Headlines @ 9 Pm

ఇంకా దొరకని ఎంపీడీవో వెంకట రమణ ఆచూకీ.. కుటుంబ సభ్యులకు సీఎం ఫోన్
ఎంపీడీవో కుటుంబ సభ్యులను పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగ రాణి పరామర్శించారు.. ఈ సందర్భంగా చంద్రబాబుకి ఫోన్ చేసి వెంకటరమణ భార్యతో కలెక్టర్ మాట్లాడించారు. మిస్సైన నరసాపురం ఎంపీడీవో వెంకటరమణ కుటుంబ సభ్యులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఫోన్ లో పరామర్శించారు. కుటుంబ సభ్యులను సీఎం చంద్రబాబు ఓదార్చారు. ఘటనకు కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం హామీ ఇచ్చారు. వెంకటరమణ మిస్సింగ్ ఘటనపై సమగ్ర విచారణ చేస్తున్నామని చెప్పిన చంద్రబాబు.. ఈ విషయంపై ఇంట్లో ఏమన్నా చెప్పారా.. ఎప్పటి నుంచి ఇబ్బంది పడుతున్నారు అనే విషయాల్ని అడిగి సీఎం తెలుసుకున్నారు. కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని చంద్రబాబు తెలిపారు.

గ్రూపు రాజకీయాలు వద్దు.. అందరూ కలిసికట్టుగా పనిచేయాలి..!
జనసేన సభ్యత్వ నమోదులో మంత్రి నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో వ్యూహంతో ముందుకు వెళ్ళాలి.. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ లో మంచి విజయం సాధించాలి.. అన్ని డివిజన్స్ ఒకే ఆలోచనతో ముందుకు వెళ్లాలి.. నామినేటెడ్ పోస్టుల గురించి హడావిడి పెరిగింది.. కష్టపడి పని చేసిన వారి సమాచారం పవన్ కళ్యాణ్ కు ఉంది.. అంకితభావంతో పని చేసిన వారు రిజల్ట్ కోసం ఎదురు చూడాల్సిన అవసరం లేదు అని తెలిపారు. నిజాయతీగా పని చేసిన వారి గుర్తింపు ఉంటుంది.. తక్కువ సీట్లు అంటు అనేకమంది మాట్లాడారు.. ఈ రోజు భారతదేశంలోనే నెంబర్ వన్ గా ఉన్నాం.. మండలిలో కూడా మనం ఉన్నామని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదేండ్ల మనోహర్ వెల్లడించారు. ఇక, జనసేన పార్టీ అంచలంచెలుగా ముందుకు వెళ్తుంది అని నాదేండ్ల మనోహార్ తెలిపారు. విజయవాడలో మనకు జరిగిన నష్టాన్ని అధిగమిద్దాం.. పార్టీ బలోపేతం, కూటమి విజయం కోసం అందరూ నిలబడాలి.. గ్రూపు రాజకీయాలు వద్దు.. అందరూ కలిసికట్టుగా పనిచేయాలి అని పిలుపునిచ్చారు. గతంలో జన సైనికులపై దాడి చేసిన వారిని వీర మహిళలను అవమానించిన వారిని వదిలేది లేదు.. విజయవాడలో జనసేన పార్టీ బలోపేతం అవ్వాలి అని మంత్రి నాదేండ్ల మనోహర్ పిలుపునిచ్చారు.

ఏపీలో రేపటి నుంచి భారీ వర్షాలు.. ఆ జిల్లాలో పిడుగులు పడే ఛాన్స్..?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు ఉన్నాయని వాతావరణ శాఖ సూచించింది. వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా 2-3 రోజుల్లో మరింత బలపడి ఒడిశా తీరం వైపు కదిలే అవకాశం ఉంది అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. దీని ప్రభావంతో రేపు ప్రకాశం, నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పుకొచ్చింది. శ్రీకాకుళం, మన్యం, అల్లూరి, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నాయని పేర్కొనింది. ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచించింది. అలాగే విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వెల్లడించింది. ఇక, కర్నూలు, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.. వరద ప్రవహించే వాగులు, కాలువలను ప్రజలు దాటే ప్రయత్నం చేయరాదు అని అధికారులు సూచించారు. వర్షాలతో పాటు పిడుగులు పడే అవకాశం.. పొలాల్లో పని చేసే రైతులు, వ్యవసాయ కూలీలు, పశు- గొర్రెల కాపరులు చెట్లు క్రింద ఉండరాదు అని ప్రకటించింది. గురువారం సాయంత్రం 7 గంటల నాటికి ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో 137 మిల్లి మీటర్ల అధిక వర్షపాతం నమోదు అయిందని వెదర్ డిపార్ట్మెంట్ తెలిపింది. కొయ్యలగూడెంలో 111 మి.మీ, కోనసీమ జిల్లా మండపేటలో 96 మి. మీ, తూర్పు గోదావరి జిల్లా కడియంలో 92 మి. మీ, నిడదవోలులో 91 మి.మీ వర్షపాతం నమోదు అని సూచించింది. 18 ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదు కాగా.. 85 ప్రాంతాల్లో మోస్తారు వర్షాలు నమోదు అయినట్లు తెలిపింది.

పాస్ బుక్ ఆధారంగానే రుణమాఫీ..రేషన్ కార్డుకు సంబంధం లేదు..
పాస్ బుక్ ఆధారంగానే రుణమాఫీ చేస్తామని.. రేషన్ కార్డుకు సంబంధం లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. కుటుంబాన్ని నిర్ధరించేందుకే రేషన్‌ కార్డు అన్నారు. రుణాలు తీసుకున్న దాదాపు 6.36 లక్షల మందికి రేషన్‌ కార్డులు లేవని ఆయన తెలిపారు. అందుకే పాస్‌బుక్‌ ఆధారంగా రుణమాఫీ చేస్తున్నామని వెల్లడించారు. గురువారం సాయంత్రం సచివాలయంలో తొలివిడత రుణమాఫీ ప్రారంభించారు. మొదటి విడతలో భాగంగా రూ.1 లక్ష లోపు రైతుల ఖాతాల్లో నగదు జమ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 110 రైతు వేదికల్లోని రైతులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో సచివాలయం నుంచి ఆయన మాట్లాడారు. కాంగ్రెస్‌ మాట ఇస్తే తప్పే ప్రసక్తే లేదని.. కాంగ్రెస్ మాటే శిలాశాసనమని మరోసారి రుజువైందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. మొత్తం 11.50 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.6,098 కోట్ల నగదు జమ చేసినట్లు తెలిపారు. ఆర్థికశాఖ ఇప్పటికే బ్యాంకులకు నగదు జమ చేసింది. వరంగల్ జిల్లాకు చెందిన ఓ రైతుతో మాట్లాడారు. ఈ సందర్భంగా మరోసారి వరంగల్ జిల్లాలో రైతులతో సభ నిర్వహిద్దామా..? అని రైతును సీఎం అడిగారు. మీరు ఒప్పుకుంటే మరోసారి రాహుల్ గాంధీని కలిసి త్వరలో అయిదు లక్షల మంది రైతులతో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేద్దామని రేవంత్ రెడ్డి అన్నారు. గత ప్రభుత్వం రుణమాఫీ అమలు చేస్తామని ఐదేళ్లు కాలయాపన చేసిందని ముఖ్యమంత్రి అన్నారు. రుణమాఫీ పథకం సరిగా అమలు చేయలేదన్నారు. డిక్లరేషన్‌లో భాగంగా రైతులకు రుణమాఫీ చేస్తున్నామని వెల్లడించారు. హామీ మేరకు ఈ నెలా చివరి కల్లా నాటికి రూ.లక్షన్నర వరకు ఉన్న రైతు రుణాలను మాఫీ చేస్తామని మరోసారి గుర్తు చేశారు. గత ప్రభుత్వం రూ.7లక్షల కోట్లు అప్పులు చేసిందని.. దీనికి ప్రతి నెలా రూ.7వేల కోట్లు వడ్డీ చెల్లిస్తున్నామన్నారు. జీతాలు, పింఛన్ల కోసం రూ.5వేల కోట్లు కేటాయిస్తున్నామని పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చిన ఏడు నెలల్లోనే వివిధ పథకాల కోసం రూ.29 వేల కోట్లు ఖర్చు చేశామని వెల్లడించారు. ఇబ్బందులు ఉన్నా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని తెలిపారు. మొత్తం మూడు విడతల్లో రూ.31 వేల కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేస్తామని రైతులకు తీపి కబురు చెప్పారు. అనంతరం పలువురు రైతులకు చెక్కులు అందజేశారు. రాష్ట్ర వ్యాప్తంగా రుణమాఫీకి సంబంధించిన నమూనా చెక్కును విడుదల చేశారు.

రాజీనామాకు నేను సిద్ధం.. నువ్వు సిద్ధమా? రేవంత్ రెడ్డికి హరీష్ రావు సవాల్
సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు ఫైరయ్యారు. రుణమాఫీ చేస్తే తన పదవికి రాజీనామా చేస్తామన్నోళ్లు పారిపోతారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు సమాధానమిచ్చారు. ఈ మేరకు గురువారం పత్రికా ప్రకటన విడుదల చేశారు. “తెలంగాణ ఉద్యమ సమయంలో పదవికి రాజీనామా చేయకుండా వెన్నుచూపి పారిపోయావ్. కొడంగల్ లో ఓడిపోతే రాజకీయ సన్యాసం చేస్తానని ప్రకటించి, వెన్నుచూపి పారిపోవు. నిరంతరంగా పారిపోయిన చరిత్ర నీది, అనునిత్యం ప్రజల పక్షాన నిలిచిన చరిత్ర నాది. పదవుల కోసం మీరు పెదవులు మూసుకొని కూర్చుంటే, మంత్రి, ఎమ్మెల్యే పదవులను సైతం తృణ ప్రాయంగా భావించి రాజీనామా చేసిన చరిత్ర నాది. నాకు పదవులు కొత్త కాదు, రాజీనామాలు కొత్త కాదు. ప్రజలకు, రైతులకు, పేదలకు, అణగారిన వర్గాలకు నా వల్ల మంచి జరుగుతుందంటే నేను ఎన్నిసార్లు పదవులకు రాజీనామా చేయడానికైనా వెనుకాడను. మరోసారి చెబుతున్నా.. ఆగష్టు 15 వరకు రాష్ట్రంలోని రైతులందరికీ 2లక్షల రుణమాఫీ, ఆరు గ్యారెంటీలు ( అందులోని 13హామీలు) సంపూర్ణంగా అమలు చేసి చూపించు. నేను రాజీనామాకు సిద్ధం… చేయని పక్షంలో నువ్వు సిద్ధమా?” అని ప్రశ్నించారు. కాగా.. గురువారం సాయంత్రం తెలంగాణ ప్రభుత్వం మొదటి విడత రుణమాఫీ విడుదల చేసింది. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాజీ మంత్రి హరీష్ రావుపై పరోక్షంగా ఘాటువ్యాఖ్యలు చేశారు. ఇచ్చిన హామీ మేరకు రైతులకు ఏక కాలంలో రూ. 2 లక్షల రుణమాఫీ చేసి తీరుతున్నామన్నారు. ఆనాడు సవాల్ విసిరిన వారికి ఒకటే విజ్ఞప్తి.. మిమ్మల్ని రాజీనామా చేయమని కోరము. ఎందుకంటే మీరు ఎలాగు పారిపోతారు. కానీ ఇకనైనా కాంగ్రెస్ మాటిస్తే నిలబెట్టుకుంటుందని, రాజకీయ ప్రయోజనాల కోసం మీలాంటి మోసపూరిత మాటలు గాంధీ కుటుంబం చెప్పదని మీరు గుర్తు పెట్టుకోవాలన్నారు. ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఒకరేమో గుజరాత్ మోడల్ అని మరొకరు ఇంకేదో మోడల్ అంటున్నారు. కానీ ఈ దేశంలోని కోట్లాది మంది రైతులకు, రాజకీయ పార్టీలకు తెలంగాణ మోడల్ ఆదర్శంగా నిలవబోతున్నదన్నారు.

వరదల్లో చిక్కుకున్న 30 మంది..తక్షణమే రక్షణ చర్యలు చేపట్టాలని పొంగులేటి ఆదేశం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గంలోని పెద్దవాగు గేట్లు ఎత్తడంతో దిగువ భాగం లోతట్టు ప్రాంతాల్లో భారీగా వరద నీరు చేరిందని, ప్రజలకు ఎలాంటి నష్టం జరగకుండా తక్షణమే రక్షణ చర్యలు చేపట్టాలని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అధికారులను ఆదేశించారు. గురువారం ఆయన హైదరాబాద్ నుంచి భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్, ఎస్పీలకు స్వయంగా ఫోన్ చేసి అక్కడి పరిస్థితిపై పూర్తి వివరాలు తెలుసుకున్నారు. నీటిపారుదల శాఖ, ఇతర అధికారులు, యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి ఎక్కడా ఇబ్బంది తలెత్తకుండా నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. నారాయణపురం, ప్రమాదం తలెత్తే లోతట్టు ప్రాంతాల్లోని వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అన్నారు. ఆంధ్రా పరిధి కూడా ఉండడంతో అక్కడి ప్రభుత్వంతో కూడా మాట్లాడతానని, పెద్దవాగు వరద ఉధృతితో ఎక్కడా ప్రజలకు ఇబ్బంది తలెత్తకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. కాగా.. ఐదుగురు పశువుల కాపర్లు.. 20 మంది కూలీలు వేరువేరు చోట్ల వరదల్లో చిక్కుకున్నారు. బచ్చువారిగూడెం బ్రిడ్జి వద్ద పశువులను మేపేందుకు వెళ్లిన ఐదుగురు.. అకస్మాత్తుగా వాగు పొంగడంతో తప్పించుకునేందుకు సమీపంలోని వేపచెట్టు ఎక్కారు. ఉండే కొలది వరద ఉధృతి పెరగడంతో.. వారు చెట్టు దిగి కిందకు వచ్చే పరిస్థితి లేకుండా పోయింది. తాము వరదలో చిక్కుకున్నట్లు సెల్ ఫోన్ ద్వారా స్థానికులకు సమాచారం అందించారు. బిక్కు బిక్కుమంటూ రక్షణ చర్యలు కోసం వేచి చూస్తున్నామని.. చెట్టు పైన తమ పరిస్థితిని వీడియో తీసి పంపించారు. అదేవిధంగా నారాయణపురం వాగు వరద ఉదృతం అవడంతో.. 20 మంది కూలీలు కట్ట మైసమ్మ ఆలయంలో తలదాచుకున్నారు. ఆలయాన్ని వరద నీరు చుట్టుముట్టడంతో తమని రక్షించాలంటూ ఫోన్లు చేసి వేడుకుంటున్నారు. సమాచారం అందుకున్న అధికారులు సహాయక చేపట్టేందుకు సిద్ధమయ్యారు. ఈ ఘటనపై అప్రమత్తమైన స్థానిక ఎమ్మెల్యే జారె నారాయణపురం వాగులో చిక్కుకున్న కూలీలను బయటకు తీసుకొచ్చేందుకు రెస్క్యూ టీం ను ఘటన స్థలానికి పంపనున్నట్లు తెలిపారు. రక్షణ చర్యలో భాగంగా భద్రాచలం నుంచి బోటును రప్పించనున్నట్లు తెలిసింది.

నీట్‌పై విచారణ.. ఫలితాలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
నీట్ పేపర్ లీక్ వ్యవహారం దేశాన్ని కుదిపిస్తోంది. అన్ని రాష్ట్రాల్లో విద్యార్థులు, ఆయా పార్టీలు ఆందోళనలు, నిరసనలు చేపట్టారు. నీట్ పరీక్షను రద్దు చేయాలని డిమాండ్ చేస్తు్న్నారు. తాజాగా ఇదే వ్యవహారంపై గురువారం సుప్రీంకోర్టు విచారించింది. ఈ మేరకు న్యాయస్థానం కీలక ఆదేశాలు జారీ చేసింది. పరీక్ష కేంద్రం, నగరాల వారీగా వాటి ఫలితాలు ప్రకటించాలని ఎన్‌టీఏను ఆదేశించింది. ఈ నెల 20వ తేదీ మధ్యాహ్నం 12 గంటలలోపు వాటిని వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచాలని పేర్కొంది. ఇక ఈ కేసుకు సంబంధించిన తదుపరి విచారణ జులై 22న తిరిగి విచారిస్తామని ధర్మాసనం పేర్కొంది. పరీక్ష కేంద్రాల వారీగా ఫలితాలను వెల్లడించేటప్పుడు విద్యార్థుల వివరాలను కనిపించకుండా చూడాలని సూచించింది. నీట్‌-యూజీ పేపర్‌ లీకేజీ వ్యవహారంపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ నేతృత్వంలోని ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. విస్తృత స్థాయిలో పరీక్ష పవిత్రత దెబ్బతిన్నదని గుర్తిస్తేనే రీటెస్ట్‌కు ఆదేశించగలమని సందర్భంగా స్పష్టం చేసింది. ఈ సందర్భంగా వాదనలు కొనసాగాయి. ప్రాథమిక ఆధారాల ప్రకారం, ప్రశ్నపత్రం లీకేజీ కేవలం పాట్నా, హజారీబాగ్‌లకే పరిమితమైనట్లు కనిపిస్తోందని కోర్టు పేర్కొంది. అయితే గుజరాత్‌లో అలాంటిదేమీ జరగలేదని చెప్పలేమని అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో పేపర్‌ లీక్‌ కొన్ని కేంద్రాలకే పరిమితమైందా? లేదా ఇతర కేంద్రాలు, దేశవ్యాప్తంగా వ్యాపించిందా? అనే విషయాలు తెలిసేందుకు ఫలితాలకు సంబంధించిన పూర్తి సమాచారం అందుబాటులో ఉంచడం కీలకమని వ్యాఖ్యానించింది. అయితే విద్యార్థుల గోప్యత దృష్ట్యా వారి వివరాలు కనిపించకుండా ఉంచాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

టీ20 జట్టుకు కెప్టెన్‌గా సూర్యకుమార్‌.. వన్డే కెప్టెన్‌గా?
భారత క్రికెట్ జట్టు జూలై 27 నుంచి శ్రీలంక పర్యటనలో టీ20 సిరీస్, ఆపై వన్డే సిరీస్ ఆడాల్సి ఉంది. ఈ రెండు సిరీస్‌ లకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) తాజాగా జట్లను ప్రకటించింది. టీ20 సిరీస్‌ కు కొత్తగా సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్‌ గా వ్యవహరించనున్నాడు. గౌతమ్ గంభీర్ పదవీకాలం భారత శ్రీలంక పర్యటన నుండి మొదలు కానుంది. భారత జట్టు శ్రీలంక పర్యటన షెడ్యూల్‌ను ఒకసారి చూద్దాం. జూలై 27న తొలి టీ20 , తర్వాత రెండో టీ20 జూలై 28న జరగనుంది. దీని తర్వాత చివరి టీ20 మ్యాచ్ జూలై 30న జరగనుంది. టీ20 సిరీస్ మొత్తం పల్లెకెలె అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరగనుంది. అదే విధంగా ఆగస్టు 2, 4, 7 తేదీల్లో వన్డే సిరీస్‌ మ్యాచ్‌ లు జరగాల్సి ఉంది. ఈ మూడు వన్డే మ్యాచ్‌ లు కొలంబోలోని ఆర్. ప్రేమదాస అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరగనున్నాయి. వన్డే జట్టు : రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), రిషబ్ పంత్ (వికెట్ కీపర్), శ్రేయాస్ అయ్యర్, శివమ్ దూబే, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, వాషింగ్టన్ సుందర్, అర్ష్‌దీప్ సింగ్, ర్యాన్ పరాగ్, అక్షర్ పటేల్, ఖలీల్ అహ్మద్ మరియు హర్షిత్ రాణా. టి20 జట్టు : సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), శుభమన్ గిల్ (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, రింకు సింగ్, రియాన్ పరాగ్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), సంజు శాంసన్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, అర్ష్దీప్ సింగ్, ఖలీల్ అహ్మద్ మరియు మహ్మద్ సిరాజ్. ఈ పర్యటనతో భారత కోచ్‌ గా గంభీర్ పదవీకాలం ప్రారంభం కానుంది. టీ20 ప్రపంచకప్ 2024 వరకు ఈ పాత్రలో ఉన్న రాహుల్ ద్రవిడ్ స్థానంలో అతడు బరిలోకి దిగడం గమనార్హం . గంభీర్ తొలిసారిగా అంతర్జాతీయ స్థాయిలో కోచ్‌గా కనిపించబోతున్నాడు. ఇటీవల భారత జట్టు జింబాబ్వేలో పర్యటించగా అక్కడి జట్టుతో పాటు కోచ్‌ గా వీవీఎస్ లక్ష్మణ్ ఉన్నాడు.

డార్లింగ్ సినిమాలో మరో కుర్ర హీరో.. ఎవరంటే?
ప్రియదర్శి, నభా నటేష్ లీడ్ రోల్స్ లో నటిస్తున్న యూనిక్ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా ‘డార్లింగ్’ సినిమా రాబోతుంది. ఈ సినిమాకు అశ్విన్ రామ్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రైమ్‌ షో ఎంటర్‌టైన్‌మెట్‌ కె. నిరంజన్ రెడ్డి, శ్రీమతి చైతన్య నిర్మించిన ఈ చిత్రం ఎంటర్టైనింగ్ ప్రమోషనల్ కంటెంట్ తో హ్యుజ్ బజ్‌ని క్రియేట్ చేసింది. జూలై 19న ప్రపంచ వ్యాప్తంగా ” డార్లింగ్ ” విడుదల కానుంది. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా గురించి బాగానే వరాతలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఈ డార్లింగ్ సినిమాలో లేడీ అపరిచితుడి పాత్రలో నభా నటేష్ ఏకంగా ఐదారు పాత్రల్లో కనిపించబోతోంది. ఇకపోతే ఈ సినిమాకు ఒకరోజు ముందుగా ఈ సినిమా ప్రిమియర్స్ ప్రదర్శించారు. ఈ క్రమంలో ఈ సినిమాలో టాలీవుడ్ మరో యంగ్ హీరో కూడా నటించిన విషయం తాజాగా వెలుగు లోకి వచ్చింది. ఆ హీరో నటిస్తున్నట్టు ఇప్పటి వరకు రహస్యంగా ఉంచింది సినిమా యూనిట్. ఇకపోతే ఆ కుర్ర హీరో ఎవరో కాదు. ఈ మధ్యనే కంటెంట్ ఉన్న సినిమాలను చేస్తూ నిర్మాతలకు మినిమం గ్యారెంటీ ఇస్తున్న హీరో సుహాస్. ఇకపోతే ఈ సినిమాకు సంబంధించి బిజినెస్ వివరాలు చూస్తే.. థియేట్రికల్ రైట్స్ ని రూ. 7 కోట్లకు విక్రయించినట్లు సమాచారం. అంతేకాకుండా నాన్ థియేట్రికల్ రైట్స్ ని రూ. 8 కోట్లకు అమ్మారు. ఇలా సినిమాకు సంబంధించి రూ. 15 కోట్ల వ్యాపారం జరిగినట్లు తెలుస్తోంది. దింతో సినిమా నిర్మాతలకు మంచి లాభాలు దక్కాయని సినీ ట్రేడ్ వర్గాల్లో టాక్ వినపడుతోంది.