Site icon NTV Telugu

Top Headlines @9PM: టాప్‌ న్యూస్‌!

Top Headlines @ 9 Pm

Top Headlines @ 9 Pm

తెలంగాణతో గొడవ పడే అవసరం లేదు.. ఇచ్చిపుచ్చుకునే ధోరణి అవలంభిస్తాం
తెలంగాణ రాష్ట్రంతో గొడప పడే అవసరం లేదని ఏపీ సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. అలాగే, హైదరాబాద్ ను అభివృద్ధి చేసింది నేనే.. అమరావతిని కూడా హైదరాబాద్ స్థాయిలో అభివృధ్ధి చేసే బాధ్యత నాది అని పేర్కొన్నారు. ఇక, గోదావరి నీళ్లు వాళ్ళు వాడుకుంటారు, మనం వాడుకుంటాం.. ప్రధాని మోడీ కూడా నదుల అనుసంధానం చేయాలనుకుంటున్నారు అని గుర్తు చేశారు. వేదవతి ప్రాజెక్టు పూర్తి చేస్తాం.. హంద్రీనీవా నీరు చిత్తూరు వరకు వెళ్ళాలి.. ఇపుడు కుప్పం వరకు వెళ్తాయి.. వచ్చే ఏడాది చిత్తూరు వరకు తీసుకువెళ్తామన్నారు. 2021లో పొలవరాన్ని గోదావరిలో ముంచేశారు అని సీఎం చంద్రబాబు ఆరోపించారు. ఇక, ప్రజల ఆలోచనలు, కోరికలు ఎక్కువగా ఉన్నాయని సీఎం చంద్రబాబు తెలిపారు. గల్లా పెట్టె ఖాళీగా ఉంది.. ఇవన్నీ చేయడానికి సమయం కావాలి.. మళ్లీ భూతం వస్తే ఎలా అని భయపడుతున్నారు.. భూతాన్ని భూస్థాపితం చేసే బాధ్యత నాది.. కులం కూడు పెడుతుందా.. మతం ఒక విశ్వాసం అని చెప్పుకొచ్చారు. హిందువులు మల్లీకార్జున స్వామిని, ముస్లింలు ఖురాన్, క్రైస్థవులు యేసును ప్రార్ధిస్తారు అని పేర్కొన్నారు.

గతేడాది చంద్రబాబు, రేవంత్ రెడ్డి భేటీ.. విభజన సమస్యల పరిష్కారంపై కమిటీ ఎక్కడ..?
ఢిల్లీలో పోలవరం, బనకచర్ల ప్రాజెక్టులపై ఉభయ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చర్చిస్తారని చెప్పారు.. కొన్ని నిర్ణయాలు వస్తాయని అందరూ ఎదురు చూశారు.. ఈ సమావేశంలో అసలు ఏ ధమైన చర్చ జరగలేదు అని వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. సీఎంల సమావేశంలో బనకచర్లపై అసలు ప్రస్తావనే లేదు.. వాళ్ళ పత్రికల్లోనే ఏపీలో ఒక రకంగా, తెలంగాణలో మరో రకంగా వచ్చింది.. చంద్రబాబు ఇష్టాగోష్టిగా మాట్లాడి బయటకు వచ్చాక ఉభయ రాష్ట్రాలు నాకు సమానమే అని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు.. ఇరిగేషన్ మంత్రి రామానాయుడు కార్యాచరణకు రూట్ మ్యాప్ సిద్ధం చేస్తామన్నారు.. వాళ్ళ మాటలు వింటుంటే సీఎం చంద్రబాబు మోసపు మాటలు చెబుతున్నారు అనకతప్పదు.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత ఏడాది 7- 7- 24న ప్రగతి భవన్ లో సమావేశమయ్యారు.. విభజన సమస్యల పరిష్కారం కోసం భేటీ అయ్యామన్నారు.. త్వరలో కమిటీ వేసి తేల్చేస్తామన్నారు.. ఇప్పటికి ఏడాది దాటింది.. మీరు సాధించింది ఏంటి అని అంబటి రాంబాబు ప్రశ్నించారు.

ప్రజలను మోసం చేస్తున్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్
పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించిన మాజీ మంత్రి బొత్సా సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కలిసి రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నారు అని ఆరోపించారు. తాట తీస్తాం, తోలు తీస్తాం, మక్కెలు ఇరగగొడతాం అంటారు.. మీరు ఎవరి మక్కెలు ఇరగగొడతారు? అని ప్రశ్నించారు. మేము అంత ఖాళీగా కూర్చొన్నామా? అంత చేతకాని వాళ్లమా? మాకేం రాదా? అని బొత్సా ప్రశ్నించారు. ఇక, మేము ప్రజాస్వామ్యాన్ని నమ్మేవాళ్లం, చట్టం మీద గౌరవం ఉన్న వాళ్లం అని మాజీమంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. మీలాగ వచ్చి చట్టాలతో చీట్ చెయ్యాలని చూస్తే ఊరుకోం అని హెచ్చరించారు. రైతులు, మహిళలంటే గౌరవంతో ముందుకెళ్లేదే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అని ఆయన స్పష్టం చేశారు.

ఢిల్లీకి వెళ్లకుండా.. ఫామ్ హౌస్‌కి వెళ్ళాలా..? సీఎం రేవంత్‌రెడ్డి ఫైర్
ఢిల్లీ పర్యటనలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. ఢిల్లీకి వెళ్లడం నేరంగా మాట్లాడుతున్నారు.. కేంద్రానికి సంబంధించిన అంశాలపై కేంద్రంతోనే మాట్లాడాలన్నారు. ఢిల్లీకి వెళ్లకుండా ఎక్కడికి వెళ్లాలి.. ఫామ్ హౌస్ కి వెళ్ళాలా? అని ఫైర్ అయ్యారు. 33, 34 సార్లు ఢిల్లీకి వచ్చానని.. 48 సార్లు వచ్చానని మాట్లాడుతున్నారన్నారు. తన ప్రియారిటి రాష్ట్రమని.. వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ , వివాదాలను పరిష్కరించుకోవడం ముఖ్యమన్నారు. వ్యూహంతో పని చేస్తున్నామని.. గత ప్రభుత్వం సాధించనివి ఎన్నో.. తాను సాధించానన్నారు. ఢిల్లీలో కేంద్రం ఉన్నప్పుడు, ఇక్కడికి వచ్చే రాష్ట్రం కోసం మాట్లాడాలన్నారు. తాను ఎవరికైనా భయపడితే రేవంత్ రెడ్డిని కాదని ఫైర్ అయ్యారు.. రాష్ట్ర అవసరాల కోసం ఢిల్లీతోపాటు, అవసరమైతే రాష్ట్రాలకు కూడా వెళ్లాల్సి ఉంటుందన్నారు. త్వరలోనే మహారాష్ట్రకు వెళ్తామని.. నీటి ప్రాజెక్టులకు సంబంధించిన అంశాలపై అక్కడ మాట్లాడుతామన్నారు. “కేటీఆర్ సవాలు విసురుతున్నారు. డ్రగ్స్ విషయంలో టెస్టులకు రమ్మంటే నేను, విశ్వేశ్వర్ రెడ్డిలం గన్ పార్క్ కి వెళ్ళాం. కేటీఆర్ రాలేదు.. కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నారు. నేను ప్రతిపక్ష నేతతోనే మాట్లాడతాను. దుబాయిలో కేటీఆర్ మిత్రుడు కేదార్ డ్రగ్స్ తీసుకొని చనిపోయారు.

ఎన్ని చేసినా కేసీఆర్ స్థాయికి రాలేవు.. సీఎం రేవంత్‌రెడ్డిపై హరీష్ రావు ఘాటు వ్యాఖ్యలు..
ఈ రోజు చిట్ చాట్ లో సీఎం రేవంత్ రెడ్డి కేటీఆర్ పై చెత్త వాగుడు వాగారని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. నువ్వు గజినీవి.. నీ చుట్టూ ఉన్నది చెత్త బ్యాచ్ అని సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా చిట్‌చాట్ లో హరీష్ మాట్లాడారు. బనకచర్ల పై రేవంత్ రెడ్డి బాగోతం నగ్నంగా బయట పడిందన్నారు. ఆయన చీకటి బాగోతాన్ని కప్పి పుచ్చుకునేందుకు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని ఆరోపించారు. డ్రగ్స్ గంజాయి అని మోకాలుకు బోడగుండుకు ముడి పెడుతున్నారన్నారు. జై తెలంగాణ ఎందుకు అనడం లేదు అనే దానికి పార్టీకి ముడి పెడుతున్నారని చెప్పారు. మీ రాహుల్ గాంధీ, ఖర్గేలు కూడా జై తెలంగాణ అంటున్నారని తెలిపారు. నువ్వు ఎందుకు అనట్లేదని ప్రశ్నించారు. మీరు మీ చుట్టూ అంతా బ్యాగుల బ్యాచ్ ఉంటుందని.. పరిపాలన అంటే బ్యాగులు మోయడం కాదన్నారు. మీ పాలనలో రోజు ఒక పాఠశాలలో విద్యార్థి ఆసుపత్రుల పాలు అవుతున్నారని.. గ్రామాల్లో పట్టణాల్లో డీజిల్ డబ్బులు లేక పారిశుధ్యం పడకేసిందని ఆరోపించారు. రోజూ ప్రజలను కలుస్తాను అని చెప్పిన నువ్వు కలుస్తున్నవా? అని ప్రశ్నించారు.

ఆ కేసులో కేంద్ర మంత్రి బండి సంజయ్‌కి సిట్ నోటీసులు..
ఫోన్ ట్యాపింగ్ కేసులో ఈనెల24న విచారణకు రావాలని కోరుతూ కేంద్ర మంత్రి బండి సంజయ్ కి సిట్ నోటీసులు జారీ చేసింది. కేంద్ర మంత్రితోపాటు పీఆర్వో, పీఏలకూ సిట్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. హైదరాబాద్ లేక్ వ్యూ గెస్ట్ హౌజ్ లో స్టేట్ మెంట్ ఇచ్చేందుకు బండి సంజయ్ అంగీకరించారు. అదేరోజు పీఆర్వో మధు, పీఏ ప్రవీణ్ ల స్టేట్ మెంట్‌ను రికార్డ్ చేయనున్నారు. కొద్దిసేపటి క్రితం కేంద్ర మంత్రి నివాసానికి వచ్చిన సిట్ అధికారులు నోటీసులందించారు. కొద్దిరోజుల క్రితమే బండి సంజయ్ వ్యక్తిగత డ్రైవర్ రమేశ్ ను పిలిచి స్టేట్ మెంట్ రికార్డు చేశారు. కాగా.. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో వివిధ పార్టీలకు చెందిన ఫోన్లను గత ప్రభుత్వం ట్యాపింగ్ చేసిందనే ఆరోపణలు ఉన్నాయి. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన ముఖ్య నేతల ఫోన్లను ట్యాపింగ్ చేసినట్లు ఆరోపణలు రావడంతో సిట్ పలువురు నేతలను పిలిచి వాంగ్మూలం తీసుకుంటోంది. తాజా బండి సంజయ్ స్టేట్‌మెంట్‌ను కూడా రికార్టు చేయనుంది.

ఎన్నికల ముందు మరొక హత్య.. ఆస్పత్రిలో పేషెంట్ కాల్చివేత
అసెంబ్లీ ఎన్నికల ముందు బీహార్‌లో హత్యల పరంపర కొనసాగుతోంది. మొన్నటికి మొన్న బీజేపీ నేత, వ్యాపారవేత్త గోపాల్ ఖేమ్కా ఇంటి దగ్గరే హత్యకు గురయ్యారు. కారులో ఇంటికి చేరిన ఆయన్ను అతి సమీపం నుంచి తుపాకీతో కాల్చడంతో ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన నుంచి ఇంకా తేరుకోక ముందు తాజాగా గురువారం ఉదయం పట్టపగలు ఆస్పత్రిలో కరుడుగట్టిన ఒక నేరస్థుడ్ని ప్రత్యర్థి గ్యాంగ్ తుపాకులతో కాల్చి చంపింది. ఈ ఘటన రాష్ట్రాన్ని కుదిపేస్తోంది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నితీష్ ప్రభుత్వంలో ప్రజలకు భద్రత కరవైందని విపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి. చందన్ మిశ్రా.. కరుడుగట్టిన నేరస్థుడు. వైద్యం నిమిత్తం పెరోల్‌పై జైలు నుంచి బయటకు వచ్చాడు. పాట్నాలోని పరాస్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. గురువారం ప్రత్యర్థి వర్గానికి ఐదుగురు సభ్యులు కలిగిన ముఠా ఆస్పత్రిలోని చందన్ మిశ్రా ఉన్న గదిలోకి ప్రవేశించి తుపాకులతో విరుచుకుపడ్డారు. బుల్లెట్లు దూసుకెళ్లడంతో చందన్ మిశ్రా అక్కడికక్కడే చనిపోయాడు. ఇక తుపాకీ శబ్దాలకు రోగులు, బంధువులు హడలెత్తిపోయారు. అనంతరం దుండుగులు అక్కడ నుంచి పరారయ్యారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డ్ అయింది.

వ్లాదిమిర్ జెలెన్స్కీ కీలక నిర్ణయం.. ఉక్రెయిన్‌కు తొలి మహిళా ప్రధానమంత్రిగా స్విరిడెన్‌కో నియామకం..!
ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ దేశ రాజకీయాల్లో కీలక మార్పులకు శ్రీకారం చుట్టారు. ప్రస్తుతం ఆర్థిక మంత్రిగా ఉన్న యూలియా స్విరిడెన్‌కో (Yulia Svyrydenko)ను ఉక్రెయిన్ కొత్త ప్రధానమంత్రిగా గురువారం (జులై 17)న నియమించారు. 2022లో రష్యాతో జరిగిన యుద్ధం తర్వాత ఈ పదవిలోకి వచ్చిన తొలి వ్యక్తిగా ఆమె చరిత్ర సృష్టించారు. ఈ నియామకం ఉక్రెయిన్ ప్రభుత్వంలోని కీలక మార్పులలో ఓ భాగం. యుద్ధంతో అలసిపోయిన దేశ ప్రజల్లో నూతన ఉత్సాహం నింపేందుకు, స్థానికంగా ఆయుధ ఉత్పత్తిని పెంచేందుకు, ఇంకా క్యాబినెట్ మారుస్తునట్లు జెలెన్స్కీ ప్రకటించారు. అయితే దేశీయంగా ఈ మార్పులు పెద్దగా కొత్త దిశగా మారాయని భావించబడటం లేదు. ఎందుకంటే, అధ్యక్షుడు జెలెన్స్కీ ఇప్పటికీ యుద్ధంలో తన నమ్మకాన్ని నిలబెట్టుకున్న వ్యక్తులను మాత్రమే బాధ్యతలకు నియమిస్తున్నారు.

గుండెనొప్పి ఎప్పుడైనా రావొచ్చు.. ఈ ఒక్క ట్యాబ్లెట్ మీ ఇంట్లో ఉంచుకోండి..!
ఇదివరకు కాలంలో గుండెపోటు కేసులు పెద్దవారిలో మాత్రమే కనిపించేవి. కానీ నేటి ఆధునిక జీవితంలో ఇది యువతను కూడా ప్రభావితం చేస్తోంది. భారతదేశంలోని ప్రతి యువకుడు దీని గురించి ఆందోళన చెందుతున్నారు. గుండెపోటు నుంచి తమను తాము రక్షించుకోవడానికి వారి జీవనశైలిలో ఎలాంటి మార్పులు తీసుకురావాలి అనేది ప్రతి యువకుడి మదిలో మెదులుతున్న ఏకైక ప్రశ్నగా మారుతోంది. ఇందులో ప్రధాన కారణం రక్త ప్రసరణ తగ్గడం లేదా నిరోధించడం వల్ల గుండెపోటు కేసులు యువతలో తరచుగా కనిపిస్తాయని వైద్యులు చెబుతున్నారు. గుండెనొప్పి రావడానికి ప్రధాన కారణాలు మనందరికీ తెలిసినవే. పెద్దవారిలోనైనా, యువతలో అయినా.. ఒకేలా ఉంటాయి. తినే ఆహారంపై నియంత్రణ లేకపోవడం, శారీరక వ్యాయామం చేయకపోవడం, ఒత్తిళ్లు, ఆందోళనలు, ధూమపానం, మద్యపానం లాంటి దురలవాట్ల వల్ల గుండెపోటు సంభవించే ప్రమాదం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఇవన్నీ కలిసి మొదట్లో బరువు పెరగడానికి కారణం అవుతాయట. ఆపై మధుమేహం, హైబీపీ, కొలెస్ట్రాల్‌ సమస్యల్ని తెచ్చిపెట్టి చివరికది గుండె రక్తనాళాల్లో బ్లాకుల్ని తెచ్చిపెట్టే కరోనరి ఆటరీ డిసీస్‌కు దారి తీస్తాయట. ఒకవేళ యుక్త వయసులో గుండెపోటు వస్తే తొందరగా గుర్తించలేమట. లక్షణాలు పెద్దగా కనిపించకపోవడంతో ఒక్కసారిగా విరుచుకు పడి ప్రాణాంతంగా మారే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

స్వామి కార్యం.. స్వకార్యం చక్కబెట్టేస్తున్న బన్నీ!
స్వామి కార్యం.. స్వకార్యం ఒక్కసారి పూర్తిచేస్తున్నాడు అల్లు అర్జున్. అసలు విషయం ఏమిటంటే అల్లు అర్జున్ NATA, NATS ఆహ్వానం మేరకు అమెరికా వెళ్లిన సంగతి తెలిసిందే. నార్త్ అమెరికా తెలుగు సొసైటీ, నార్త్ అమెరికా తెలుగు అసోసియేషన్ కార్యక్రమాలు ప్రస్తుతం అమెరికాలో జరుగుతున్న నేపథ్యంలో ఆయనను ఆహ్వానించారు. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ ఈ కార్యక్రమానికి హాజరయ్యాడు. అయితే ప్రస్తుతం అట్లీతో సినిమా చేస్తున్న నేపథ్యంలో మళ్లీ ఎప్పుడు వెకేషన్‌కి టైం దొరుకుతుందో ఏమో తెలియని నేపథ్యంలో తన భార్య, ఇద్దరు పిల్లల్ని కూడా అమెరికా తీసుకువెళ్లాడు. ఈ నేపథ్యంలో అమెరికాలో మీటింగ్ ఉన్న టైంలో పాల్గొంటున్నాడు, లేని టైంలో తన ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తూ వారికి వెకేషన్ ఫీల్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. అలా ఒకే సమయంలో స్వామి కార్యం సౌకర్యం చక్కబెట్టడం చేస్తూ అల్లు అర్జున్ ఫ్యామిలీ గోల్స్ సెట్ చేస్తున్నాడు. ప్రస్తుతానికి ఆయన అట్లీ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో ఇప్పటికే దీపికా పదుకొణె హీరోయిన్‌గా నటిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. సన్ పిక్చర్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో అల్లు అర్జున్ 4 పాత్రలలో కనిపించబోతున్నాడని ప్రచారం జరుగుతోంది.

పెద్ద సినిమాల రిలీజ్ డేట్లు.. అంతా గజిబిజి గందరగోళం
తెలుగు సినీ పరిశ్రమలో ఓ మాదిరి పెద్ద సినిమాలు వచ్చే నెలలో రిలీజ్ కాబోతున్నాయి. ఇక ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి విశ్వంభరా, బాలకృష్ణ అఖండ 2, పవన్ కళ్యాణ్ ఓజీ, ప్రభాస్ రాజా సాబ్ ఈ ఏడాదిలో రిలీజ్ కావలసిన మిగతా పెద్ద సినిమాలు. అయితే ఈ సినిమాల విడుదల తేదీల గురించి రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. నిజానికి విశ్వంభరా ఈ ఏడాది సంక్రాంతికి రిలీజ్ కావాల్సి ఉంది. గేమ్ చేంజర్ కోసం వెనక్కి వెళ్లామని చెబుతున్నా సరే, సీజీలు లేట్ అవడంతో సినిమా వాయిదా పడింది. ప్రజెంట్ సమాచారం మేరకు అది సెప్టెంబర్ 18వ తేదీన రిలీజ్ కావాల్సి ఉంది. ఇక సెప్టెంబర్ 25వ తేదీన పవన్ కళ్యాణ్ ఓజీ సినిమాతో పాటు బాలకృష్ణ అఖండ 2 సినిమా కూడా రిలీజ్ కావాల్సి ఉంది. కానీ అఖండ 2 డిసెంబర్ వాయిదా పడే అవకాశం ఉందనే ప్రచారం అయితే పెద్దగా జరుగుతోంది. అయితే అందులో నిజానిజాలు ఎంత ఉన్నాయో అనేది ఇప్పటికీ చెప్పలేం. ఇక తాజాగా సంక్రాంతికి ప్రభాస్ రాజా సాబ్ వాయిదా పడిందని వార్తలు కూడా వినిపిస్తున్నాయి. నిజానికి ఆ సినిమా కూడా ఎన్నోసార్లు రిలీజ్‌కి సిద్ధమై వాయిదా పడుతూ వస్తోంది. డిసెంబర్ 5వ తేదీన రిలీజ్ చేస్తామని చివరిగా ప్రకటించారు. కానీ ఆ టైంకి రావడం కష్టమేనని కాబట్టి సంక్రాంతికి పుష్ చేశారనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఒక రకంగా ఇదంతా గందరగోళ పరిస్థితి అని చెప్పాలి. నిజానికి ఏ విషయాన్ని నిర్మాణ సంస్థలు అధికారికంగా ప్రకటించలేదు. ప్రస్తుతం జరుగుతున్నదంతా ప్రచారమే కావడంతో, ఆయా నిర్మాణ సంస్థలు ఎప్పుడు అధికారికంగా ప్రకటిస్తే అప్పుడు సినిమా వాయిదా పడిందనుకోవాలి, తప్ప అప్పటివరకు మిగతావన్నీ ఊహాగానాలే.

Exit mobile version