NTV Telugu Site icon

Top Headlines @9PM : టాప్‌ న్యూస్‌

Top Headlines

Top Headlines

సుప్రీంకోర్టు తీర్పుపై స్పందించిన పవన్‌.. కీలక వ్యాఖ్యలు
తిరుమల లడ్డూ వివాదం కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై స్పందించిన జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్‌ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు.. తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి మహాప్రసాదం లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వినియోగంపై ఐదుగురు సభ్యులతో స్వతంత్ర సిట్ ఏర్పాటు చేయాలని.. సుప్రీంకోర్టు ఆదేశించడాన్ని స్వాగతిస్తున్నాం అన్నారు.. సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా సీబీఐ నుంచి ఇద్దరు, ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇద్దరు పోలీసు అధికారులు, ఎఫ్.ఎస్.ఎస్.ఏ.ఐ. నుంచి ఒక సీనియర్ అధికారి సభ్యులుగా ఉండే.. ఆ స్వతంత్ర సిట్ విచారణ ద్వారా సత్యం వెలుగు చూస్తుందన్నారు.. తిరుమల శ్రీవారి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వినియోగం విషయం వెల్లడైనప్పటి నుంచి సనాతన ధర్మాన్ని విశ్వసించే ప్రతి ఒక్కరూ ఆందోళనతో ఉన్నారని పేర్కొన్నారు పవన్‌ కల్యాణ్‌.. ఇక, గత పాలకులు నియమించిన టీటీడీ బోర్డుల హయాంలో లడ్డూ ప్రసాదం కావచ్చు, స్వామివారికి చేసే కైంకర్యాలు కావచ్చు, అన్న ప్రసాదం కావచ్చు.. అన్నింటిలోనూ నాణ్యత ప్రమాణాలు లోపించాయనే భక్తులు ఆవేదనను పరిగణనలోకి తీసుకోవాలన్నారు పవన్‌ కల్యాణ్‌.

వైఎస్సార్‌ జిల్లా పేరు మార్చండి.. సీఎంకు మంత్రి సత్యకుమార్‌ లేఖ..
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. గత ప్రభుత్వ హయాంలో పెట్టిన పలు ప్రభుత్వ పథకాల పేర్లను మార్చుతూ నిర్ణయం తీసుకున్నారు.. అయితే, ఇప్పుడు వైఎస్‌ఆర్‌ కడప జిల్లా పేరు తెరపైకి వచ్చింది.. నేడు వైయస్సార్ జిల్లాగా చలామణిలో ఉన్న కడప జిల్లాను వైయస్సార్ కడప జిల్లాగా గెజిట్ మార్పులు చేయాలంటూ సీఎం చంద్రబాబు నాయుడుకు లేఖ రాశారు మంత్రి సత్యకుమార్‌ యాదవ్.. “రాయలసీమలోని కడప జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం దేవుని కడప. ఆదిమధ్యాంతరహితుడైన శ్రీనివాసుడు వెలసియున్న గొప్ప పుణ్యక్షేత్రం. ఈ ఆలయంలో శ్రీవారు శ్రీలక్ష్మీ వెంకటేశ్వర స్వామిగా అవతరించి ఉన్నారు. ప్రధానంగా ఈ ఆలయం హనుమత్ క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. పూర్వం ఈ ప్రాంతమంతా రాక్షస నిలయంగా ఉండేది. రాక్షసాంతకుడైన హనుమంతుడు ఈ ప్రాంత వాసులకు దానవ పీడ తొలగించడానికి మశ్స్యావతారంగా ఆవిర్భవించాడని ప్రసిద్ధి అంటూ లేఖలో పేర్కొన్నారు సత్యకుమార్‌..

2036 ఒలింపిక్స్ను దృష్టిలో ఉంచుకుని పాలసీ సిద్ధం చేయాలి..
ప్రభుత్వ స్పోర్ట్స్ పాలసీపై ముఖ్యమంత్రి సీరేవంత్‌రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గచ్చిబౌలి స్టేడియంలో యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. యంగ్ ఇండియా అకాడమీ ఏర్పాటుతో పాటు హైదరాబాద్ లో ఉన్న అన్ని ప్రధాన స్టేడియాలను ఒకే హబ్ గా తీర్చిదిద్దాలి అని సూచించారు. ఇక, స్కిల్ యూనివర్సిటీ బోర్డు తరహాలో స్పోర్ట్స్ బోర్డు ఏర్పాటు చేయాలని చెప్పారు. క్రీడల్లో పతకాలు సాధించే క్రీడాకారులకు ఇచ్చే ప్రోత్సాహకాల పైన అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలి అని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. 2036 ఒలింపిక్స్ ను దృష్టిలో ఉంచుకుని పాలసీ సిద్ధం చేయాలి అని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.

మరో 20 లక్షల మందికి త్వరలోనే రుణమాఫీ..
రుణమాఫీ గురించి పట్టించుకోని పార్టీలు ప్రస్తుతం మాట్లాడుతున్నాయని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. రైతన్నల ఆదరణతో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది.. కష్టమైనా ఒక పథకాన్ని ఆపైన సరే రుణమాఫీ, రైతు భరోసా, రైతు బీమాను అమలు చేస్తాం.. అన్ని సబ్సిడీ పథకాలను మళ్లీ పునరుద్ధరిస్తాం.. ఖచ్చితంగా రెండు లక్షల వరకు రుణమాఫీ చేసి తీరుతాం అననారు. ఏ ఒక్క రైతు కూడా అధైర్య పడవద్దు అని కోరారు. అలాగే, రైతులకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ.. 25 వేల కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేశాం.. మరో 25 వేల కోట్లు రైతుల ఖాతాలోకి రావాల్సినవి ఉన్నాయి.. మరో 20 లక్షల మంది రైతులకు త్వరలో రైతు రుణ మాఫీ డబ్బులు జమ చేస్తామని ఆయన చెప్పుకొచ్చారు. రుణ మాఫీ పూర్తి చేసి రైతు భరోసా ప్రారంభిస్తామని తుమ్మల నాగేశ్వర రావు వెల్లడించారు.

భారత్‌కు మాల్దీవుల అధ్యక్షుడు.. 5 రోజులు ముయిజ్జు పర్యటన
మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జు భారత్‌ పర్యటనకు వస్తున్నారు. ద్వైపాక్షిక సంబంధాల కోసం ఆయన ఇండియాలో తొలి పర్యటన చేయబోతున్నారు. జూన్‌లో ప్రధాని మోడీ ప్రమాణస్వీకారానికి వచ్చి వెళ్లిపోయారు. ఇప్పుడు ద్వైపాక్షిక సంబంధాల కోసం భారత్‌లో పర్యటించబోతున్నారు. అక్టోబర్ 6 నుంచి 10 వరకు ఇండియాలో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా భారత్‌లోని పలు ప్రాంతాలను సందర్శించనున్నారు. ప్రధాని మోడీ లక్షద్వీప్ పర్యటన తర్వాత మాల్దీవుల మంత్రులు ఇష్టానుసారంగా నోరుపారేసుకున్నారు. అప్పటి నుంచి ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు తెగిపోయాయి. అంతేకాకుండా భారతీయులు మాల్దీవులు వెళ్లకూడదని నిర్ణయం తీసుకున్నారు. అప్పటినుంచి మాల్దీవుల పర్యాటకం తీవ్రంగా దెబ్బతింటూ వస్తుంది. అంతేకాకుండా ముయిజ్జు.. చైనాకు అనుకూలంగా వ్యవహరించడం కూడా భారతీయులకు రుచించలేదు. దీంతో మాల్దీవుల పరిస్థితి దారుణంగా తయారైంది. ఇక గత్యంతరం లేక ముయిజ్జు భారత్‌తో సంబంధాలు పెంచుకునేందుకు తహతహలాడుతున్నారు. దాదాపు ఐదు రోజుల పర్యటన కోసం ముయిజ్జు భారత్‌కు వస్తున్నారు. ఈ పర్యటనలో ప్రాముఖ్యంగా ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించనున్నారు.

ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్.. 36 మంది మావోయిస్టుల హతం..
ఛత్తీస్‌గఢ్ మరోసారి కాల్పులతో దద్దరిల్లింది. రాష్ట్రంలోని నారాయణపూర్-దంతెవాడ సరిహద్దుల్లోని మాడ్ ఏరియాలో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. దాదాపుగా 36 మంది మావోయిస్టులు హతమయ్యారు. భారీ ఎత్తున పేలుడు పదార్థాలు, ఆటోమేటిక్ గన్స్ స్వాధీనం చేసుకున్నారు. ఈ ఎన్‌కౌంటర్‌తో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. యాంటీ నక్సల్ ఆపరేషన్ నిర్వహిస్తున్న సమయంలో భద్రతా బలగాలకు, మావోయిస్టులకు మధ్య భీకర ఎన్‌కౌంటర్ జరిగింది. మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటి వరకు భద్రతా బలగాలకు ఎలాంటి నష్టం వాటిల్లలేదని సమాచారం. ఇటీవల కాలంలో ఇంత పెద్ద సంఖ్యలో మావోయిస్టులు మరణించిన దాఖలాలు లేవు. జిల్లా రిజర్వ్ గార్డ్ (DRG) మరియు స్పెషల్ టాస్క్ ఫోర్స్ (STF) నిన్న మావోయిస్ట్ వ్యతిరేక ఆపరేషన్ ప్రారంభించాయి. ఈ రోజు మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో ఇరు వర్గాల మధ్య ఎన్‌కౌంటర్ ప్రారంభమైంది. ఇప్పటికీ కాల్పులు జరుగుతూనే ఉన్నట్లు సమచారం.

ఇరాన్ చమురు, గ్యాస్ కేంద్రాలపై ఇజ్రాయెల్ దాడి చేయొచ్చంటూ వార్తా కథనాలు
ఇరాన్‌పై దాడులకు ఇజ్రాయెల్ సిద్ధపడుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవల ఇరాన్ 180 బాలిస్టిక్ క్షిపణులను ఇజ్రాయెల్‌పై ప్రయోగించింది. గగనతలంలోనే క్షిపణులను ఇజ్రాయెల్ పేల్చేసింది. కొన్ని మాత్రం టెల్‌అవీవ్, జెరూసలేం సమీపంలో పడ్డాయి. అయితే ప్రాణనష్టం జరగలేదు. అయితే అప్పటి నుంచి ఇజ్రాయెల్ ప్రతీకారంతో రగిలిపోతుంది. అవకాశం ఎదురుచూస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇరాన్ చమురు, గ్యాస్ ఉత్పత్తి కేంద్రాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు చేయొచ్చని మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. ఇదిలా ఉంటే గురువారం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కూడా ఇరాన్ చమురు కేంద్రాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు చేయొచ్చని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం అంతర్జాతీయ మీడియాలో కూడా ఇవే కథనాలు వెలువడుతున్నాయి. హిజ్బుల్లా అంతమే లక్ష్యంగా ఇజ్రాయెల్ ముందుకు వెళ్తోంది. ఇప్పటికే ముఖ్యమైన నాయకులను లేపేసింది. హిజ్బుల్లా అధినేత హసన్ నస్రల్లా మరణం తర్వాత పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారాయి. లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులు కొనసాగిస్తూనే ఉంది.

‘దేవర 2’ అప్పుడేనా?
వాస్తవానికైతే.. దేవర సినిమాకు మొదటి రోజు వచ్చిన టాక్‌తో సినిమా ఆడదని అనుకున్నారు. అదే జరిగితే.. దేవర 2 రావడం కష్టం అని కూడా అన్నారు. కానీ కట్ చేస్తే.. ఆడియెన్స్‌కి స్లో పాయిజన్‌లగా ఎక్కేసింది దేవర. ప్రస్తుతం థియేటర్లో ఒక్క సినిమా కూడా లేకపోవడం.. ఆరేళ్ల తర్వాత ఎన్టీఆర్ నుంచి సోలోగా వచ్చిన సినమా.. ఆర్ఆర్ఆర్ తర్వాత గ్లోబల్ క్రేజ్‌తో వచ్చిన సినిమా అవడంతో.. ఫస్ట్ డే దుమ్ముదులిపేసింది దేవర పార్ట్ 1. బాక్సాఫీస్ వద్ద ఏకంగా 172 కోట్ల గ్రాస్ వసూలు చేసి.. ఇండియాలో హైయెస్ట్ ఓపెనింగ్స్ రాబట్టిన సినిమాల పరంగా టాప్ టెన్‌లో నిలిచింది. మూడు రోజుల్లో 304 కోట్లు, ఐదు రోజుల్లో 396, వారంలో 405 కోట్లు కొల్లగొట్టింది దేవర. మొత్తంగా ఫస్ట్ వీక్‌లోనే 400 క్లబ్‌లో దేవర ఎంటర్ అయింది. మరి దేవర 1 హిట్ అయింది కదా.. పార్ట్ 2 ఎప్పుడు ఉంటుంది? అసలు ఉంటుందా? అని ఎన్టీఆర్ అభిమానులు చర్చించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో.. ‘దేవర 2’ ఇప్పట్లో కష్టమే అని తెలుస్తోంది. ఈ సినిమా కోసం తారక్, కొరటాల ఇద్దరూ కూడా కాస్త గ్యాప్ తీసుకోవాలని అనుకుంటున్నారట.

ఉప్పల్‌లో భారత్-బంగ్లా టీ20 మ్యాచ్.. రేపటి నుంచి టిక్కెట్లు విక్రయం
భారత్-బంగ్లాదేశ్ మధ్య మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ జరుగనుంది. మొదటిది గ్వాలియర్, రెండో టీ 20 న్యూ ఢిల్లీ, మూడో టీ20 హైదరాబాద్‌లో జరుగనుంది. చాలా రోజుల తర్వాత.. ఉప్పల్ స్టేడియంలో అంతర్జాతీయ మ్యాచ్ జరుగనుంది. ఇదిలా ఉంటే.. హైదరాబాద్‌లో జరుగనున్న టీ20 మ్యాచ్ కోసం టిక్కెట్ల విక్రయం జరుగనుంది. రేపటి నుంచి భారత్-బంగ్లా టీ20 టిక్కెట్లు విక్రయం జరుపనున్నట్లు హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్ మోహన్ రావు తెలిపారు. ఉప్పల్ వేదికగా ఈనెల 12న భారత్ – బంగ్లాదేశ్ 3వ టీ20 మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ టికెట్లు రేపు మద్యాహ్నం 12:30 నిమిషాల నుంచి పేటీఎం, ఇన్ సైడర్ వెబ్ సైట్ /యాప్‌లో విక్రయించనున్నారు. టిక్కెట్ల ప్రారంభ ధర రూ.750, గరిష్ఠ ధర రూ.15 వేలు ఉంది. ఈనెల 8 నుంచి 12 తేదీ వరకు, జింఖానా స్టేడియంలో ఆన్ లైన్‌లో బుక్ చేసిన టిక్కెట్లను రిడంషన్ చేసుకోవాలి. Redemption Timings: 11AM to 7PM.. ప్రభుత్వ గుర్తింపు గల ఏదైనా ఐడీ కార్డు, ఆన్‌లైన్ బుకింగ్ ప్రింట్ చూపించి టిక్కెట్లు తీసుకోవచ్చు.. ఆఫ్ లైన్ కౌంటర్లలో టిక్కెట్లు విక్రయించడం లేదని హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్ మోహన్ రావు తెలిపారు.

Show comments