తిరుమల లడ్డు నెయ్యి కేసులో దర్యాప్తు వేగవంతం..
తిరుమల శ్రీవారి లడ్డూ తయారీకి కల్తీ నెయ్యిని వినియోగించారనే అభియోగాలపై నమోదైన కేసులో దర్యాప్తు వేగవంతం అయింది. సుప్రీంకోర్టు నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) సభ్యులు గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి, సీబీఐ డీఐజీ మురళీ రాంబా తిరుపతి సిట్ కార్యాలయానికి చేరుకుని సీబీఐ డైరెక్టర్ నియమించిన కమిటీ సభ్యులతో భేటీ అయ్యారు. బృంద సభ్యుల్లో ఎవరెవరు ఏ ఏ విషయాలు దర్యాప్తు చేయాలో బాధ్యతలు అప్పగించారు. వచ్చే నెల 10వ తేదీలోపు నెల్లూరు ఏసీబీ కోర్టులో రెండో ఛార్జిషీట్ దాఖలు చేసేలా దర్యాప్తు చేయాలని ఆదేశించినట్లు తెలుస్తుంది. ఆ మేరకు నిందితులు, సాక్షుల్లో కొందరికి నోటీసులు జారీ చేసి విచారణకు పిలిచేందుకు సిట్ అధికారులు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే విచారణకు రావాల్సిందిగా టీటీడీ మాజీ చైర్మన్, రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డితో పాటు మాజీ పీఏ అప్పన్నకు నోటీసులు ఇచ్చారు. నెయ్యి సరఫరా చేసిన డెయిరీలు, వాటి నిర్వాహకులు, ముడి సరకులు సమకూర్చిన వ్యాపారులతో పాటు డెయిరీ సిబ్బంది, టీటీడీ ఉద్యోగులు నాగేందర్, శేఖర్ పేర్లను మొదటి ఛార్జిషీట్లో నిందితులుగా తెలిపింది.
జేసీ ప్రభాకర్ రెడ్డి బెదిరిస్తున్నారు.. టీడీపీ నేత సంచలన వ్యాఖ్యలు..
ఒంగోలులోని ఓ స్థలం విషయంలో జేసీ ప్రభాకర్ రెడ్డి ఫోన్ చేసి బెదిరిస్తున్నారు అని టీడీపీ నేత పెద్దిరెడ్డి సూర్యప్రకాష్ రెడ్డి ఆరోపించారు. తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ అయిన నువ్వు ఒంగోలుకు వచ్చి ఏమి పీకుతావు.. ఒంగోలులోని 148 సర్వే నంబరులోని స్థలం విషయంలో తన మనుషులు వస్తారని, వాళ్లకు ఆ స్థలం అప్పగించాలని జేసీ నన్ను బెదిరించాడు.. నీ స్థలంలోకి నా మనుషులు వస్తారు.. నువ్వక్కడ లేకుంటే నీ ఇంటికి వస్తారు.. సెటిల్ చేసుకో.. లేకుంటే నువ్వు ఎక్కడుంటే అక్కడ నుంచే ఎత్తుకు వస్తారు అని హెచ్చరించాడు.. గలీజు మాటలు, బండ బూతులు, మీడియా ముందు చెప్పుకోలేని పదజాలం వాడాడు అని సూర్యప్రకాష్ రెడ్డి పేర్కొన్నారు. ఇక, గడ్డం బాబా మాదిరిగా తాడిపత్రిలో పిచ్చి పిచ్చి చేష్టలు చేస్తున్నారు. ఒక డేరా బాబా మాదిరిగా మారి ప్రజలను తీవ్ర భయభ్రాంతులకు గురి చేస్తున్నాడు అని టీడీపీ నేత పెద్దిరెడ్డి సూర్యప్రకాష్ రెడ్డి తెలిపారు. అనంతపురం జిల్లాలోని తాడిపత్రిలో చేసినట్లు ఫ్యాక్షన్ రాజకీయాలు, బెదిరింపులు ఒంగోలులో చేస్తే చెల్లవు అని సూచించారు. నువ్వూ టీడీపీ నాయకుడివి.. తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ వి.. తాడిపత్రిలో ఉన్న మురుగు సంగతి చూసుకో.. అక్కడ మురుగు కంపుకొడుతోంది.. దానిని కడుక్కోలేని నువ్వు ఒంగోలుకు వచ్చి పీకేది ఏంది అని టీడీపీ నేత సూర్యప్రకాష్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు.
ఉదయాన్నే మొదలు పెట్టిన వరణుడు.. హైదరాబాద్ వాసుల్లారా దయచేసి బయటికి రాకండి!
రెండు తెలుగు రాష్ట్రాల్లో వరుణుడు ఉగ్రరూపం దాల్చాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోస్తా జిల్లాలలో భారీగా వర్షం కురుస్తుండగా తెలంగాణ రాష్ట్రంలో మాత్రం రాష్ట్రం మొత్తం వరుణిడికి దెబ్బకి అతలాకుతలమయ్యింది. ఇక తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరం సంగతి గురించి చెప్పనక్కర్లేదు. కొద్దిపాటి వర్షం పడితేనే జలమయమయ్యే రోడ్లతో ఇబ్బంది పడే నగరవాసులు ఇప్పుడు కుండపోత వర్షం కారణంగా అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. శనివారం రాత్రి భాగ్యనగరంలో భారీ వర్షం కురవగా.. తెల్లవారుజామున కాస్త బ్రేక్ ఇచ్చింది. అయితే, ఉదయం మళ్లీ మరణుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. దీంతో నగరంలోని లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. దీంతో నగరంలోని గాంధీ ఆసుపత్రి, సీతాఫల్ మండి, పార్సిగుట్ట, మెట్టుగూడ, చిలకలగూడ, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, బేగం బజార్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, మెహదీపట్నం, గుడిమల్కాపూర్, టోలిచౌకి, షేక్ పేట్, కూకట్ పల్లి, అమీర్ పెట్ ఇలా నగరంలోని పలు ప్రాంతాలలో రోడ్లన్నీ జలమయమయ్యాయి.
మధురై మీనాక్షి ఆలయంకు బాంబు బెదిరింపు
తమిళనాడులోని మధురై నగరంలో నగరంలో ప్రముఖ మీనాక్షి అమ్మన్ ఆలయంలో శనివారం నాడు తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ కార్యాలయానికి ఈ-మెయిల్ ద్వారా ఆలయంలో బాంబు పెట్టినట్లు బెదిరింపు రావడంతో భద్రతా దళాలు వెంటనే రంగంలోకి దిగాయి. ముఖ్యంగా పరీక్షల సెలవులు, ప్రదోషం రోజు కావడంతో వేలాది మంది భక్తులు ఆలయానికి చేరుకున్న సమయంలో ఈ వార్త కలకలం సృష్టించింది. తమిళనాడులోని మధురై నగరంలో నగరంలో ప్రముఖ మీనాక్షి అమ్మన్ ఆలయంలో శనివారం నాడు తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ కార్యాలయానికి ఈ-మెయిల్ ద్వారా ఆలయంలో బాంబు పెట్టినట్లు బెదిరింపు రావడంతో భద్రతా దళాలు వెంటనే రంగంలోకి దిగాయి. ముఖ్యంగా పరీక్షల సెలవులు, ప్రదోషం రోజు కావడంతో వేలాది మంది భక్తులు ఆలయానికి చేరుకున్న సమయంలో ఈ వార్త కలకలం సృష్టించింది.
మణిపూర్‌లో ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీ రెడీ..
జాతి వ్యతిరేఖ ఘర్షణలతో గత రెండేళ్లుగా మణిపూర్ అట్టుడుకుతోంది. పరిస్థితి చేజారడంతో కేంద్రం రాష్ట్రపతి పాలన విధించింది. అయితే, ఇప్పుడు మళ్లీ బీజేపీ ప్రభుత్వ ఏర్పాటు కోసం ప్రయత్నిస్తోంది. మాజీ సీఎం బిరేన్ సింగ్ సహా మణిపూర్‌కు చెందిన బీజేపీ ఎమ్మెల్యేలు, నాయకులు ప్రభుత్వ ఏర్పాటు గురించి చర్చించడానికి కేంద్ర నాయకత్వాన్ని కలువనున్నారు. ఈ మేరుకు వారంతా ఢిల్లీ బయలుదేరారు. బిరేన్ సింగ్ ఇంఫాల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో విలేకరులతో మాట్లాడుతూ, కేంద్ర నాయకులను కలవడానికి ఒక ప్రతినిధి బృందం ఢిల్లీకి వెళ్తున్నట్లు చెప్పారు. కొత్తగా ప్రజాదరణ పొందిన ప్రభుత్వ ఏర్పాటుకు దోహదపడటానికి, ప్రజలు ఎదుర్కొంటున్న సంక్షోభాన్ని పరిష్కరించేందుకు, కీలకమైన రహదారుల్ని వీలైనంత త్వరగా తెరిచేందుకు కేంద్ర నాయకుల్ని కోరుతామని చెప్పారు. ఇప్పటికే ఆ రాష్ట్ర గవర్నర్ అజయ్ భల్లా ఢిల్లీలో ఉన్నారు. ఆయన కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను కలిశారు.
అమెరికాతో కలిసి పాకిస్తాన్ కొత్త ప్లాన్.. భారత్‌కు కొత్త తలనొప్పి..
అమెరికాకు చాలా సన్నిహితంగా మారుతున్న పాకిస్తాన్, కొత్త పథకానికి తెరతీసింది. అమెరికాతో కలిసి అరేబియా సముద్రంలో ఓడరేవును నిర్మించాలని భావిస్తోంది. పాకిస్తాన్ ఈ ప్రతిపాదనను యూఎస్ ముందు ఉంచింది. బలూచిస్తాన్‌లోని గ్వాదర్ జిల్లాలో పస్ని పట్టణంలో ఈ సివిల్ పోర్టు ఉంటుంది. ఇది ఇరాన్‌లో భారత్ నిర్మిస్తున్న చాబహార్ పోర్టుకు దగ్గరగా ఉంటుంది. పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ సలహాదారు ఈ ఆఫర్ ను అమెరికా ఉన్నతాధికారుల ఉంచారని తెలుస్తోంది. ఈ ప్రతిపాదిత ప్రాజెక్ట్ విలువ 1.2 బిలియన్ డాలర్లుగా ఉంటుందని నివేదికలు పేర్కొన్నాయి. బలూచిస్తాన్‌లోని ఖనిజ సంపదను రవాణా చేయడానికి ఇది సహకరిస్తుందని పాకిస్తాన్ భావిస్తోంది. ఇటీవల, పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఆసిమ్ మునీర్‌లు ట్రంప్‌తో భేటీ అయ్యారు. బలూచిస్తాన్‌లో రేర్ ఎర్త్ ఖనిజాలపై ట్రంప్‌తో చర్చించారు. మునీర్ ఏకంగా ఒక సూట్‌కేస్‌లో రంగు రాళ్లను ట్రంప్‌కు చూపించారు. అరేబియా సముద్రంలో ఒక వేళ ఓడరేవును అమెరికా నిర్మిస్తే ఇది, ఆ ప్రాంతంలో అమెరికా ఉనికికి ఊతమిస్తుంది. ఇక్కడ ఆసక్తికర విషయం ఏంటంటే, ఈ పస్నీ పోర్ట్, చైనా నిర్మిస్తున్న గ్వాదర్ పోర్టుకు కేవలం 100 కి.మీ దూరంలోనే ఉంది. ఇరాన్‌లో భారత్ నిర్మిస్తున్న చాబహార్ పోర్టుకు కేవలం 300 కి.మీ దూరంలో ఉంది.
ఆలస్యమైతే మీకే నష్టం.. హమాస్‌కు ట్రంప్ వార్నింగ్..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శనివారం పాలస్తీనా ఉగ్రవాద సంస్థ హమాస్‌కు హెచ్చరికలు జారీ చేశారు. శాంతి ఒప్పందానికి త్వరగా అంగీకరించాలని, లేకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన వార్నింగ్ ఇచ్చారు. శాంతి ఒప్పందానికి మరింత ఆలస్యమైతే, ఇంకా విధ్వంసం జరగొచ్చని అన్నారు. హమాస్ తక్షణమే స్పందించాలని, లేకపోతే అన్నీ మారిపోతాయని, ఆలస్యం అంగీకారమవ్వదని, గాజా మళ్లీ ప్రమాదంలో పడే అవకాశం ఉందని ట్రంప్ తన ట్రూత్ సోషల్‌లో పోస్ట్ చేశారు. ఇప్పటికే ఇజ్రాయిల్ తాత్కాలికంగా దాడులు నిలిపేసిందని, బందీలను హమాస్ త్వరగా విడుదల చేసి, శాంతి ఒప్పందానికి అవకాశం ఇవ్వాలని చెప్పారు. మరోవైపు, గాజా ప్రభుత్వం శనివారం తెల్లవారుజామున ఇజ్రాయిల్ తమపై దాడి చేసిందని ఆరోపించింది. ఈ దాడిలో 57 మంది మరణించినట్లు చెప్పింది. బందీల విడుదలపై చర్చలు జరిపేందుకు ట్రంప్ కుమారుడు జరెడ్ కుష్నర్, మిడిల్ ఈస్ట్ రాయబారి స్టీవ్ విట్కాఫ్ ఈజిప్ట్ వెళ్లుతున్నట్లు వైట్ హౌజ్ తెలిపింది.
రాధేశ్యామ్ డైరెక్టర్ తో రెబల్ స్టార్ ప్రభాస్ సినిమా?
రెబెల్ స్టార్ ప్రభాస్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఓ వైపు రాజాసాబ్ షూట్ లో పాల్గొంటున్నాడు. తాజాగా సాంగ్స్ షూటింగ్ కోసం యూరప్ వెళ్ళింది యూనిట్. ఈ సినిమా షూటింగ్ చేస్తూనే మరొక క్రేజీ డైరెక్టర్ హనురాఘవపూడి డైరెక్షన్ లో ‘ఫౌజీ’ అనే సినిమా కూడా చేస్తున్నాడు. మైత్రి మూవీస్ నిర్మిస్తున్న ఈ సినిమాలో సరికొత్త ప్రభాస్ ను చూడబోతారు అని యూనిట్ చెప్తోంది. ఈ రెండింటితో పాటు ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో సలార్ 2, నాగఅశ్విన్ డైరెక్షన్ లో కల్కి 2 ఉండనే ఉన్నాయి. అయితే ఇప్పుడు రెబల్ స్టార్ మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని టాక్ వినిపిస్తోంది. ఇది ఇప్పుడు రెబల్ స్టార్ ఫ్యాన్స్ ను భయపెడుతోంది. అందుకు కారణం దర్శకుడు రాధాకృష్ణ కుమార్. జిల్ సినిమాతో డైరెక్టర్ గా మారిన రాధాకృష్ణ ఆ సినిమా మేకింగ్ పరంగా మంచి మార్కులే రాబట్టాడు కానీ సినిమా బీలో యావరేజ్ టాక్ తెచ్చుకుంది. వాస్తవానికి ఈ సినిమా ప్రభాస్ చేయాల్సి ఉంది. కానీ ప్రభాస్ సూచనా మేరకు ఈ సినిమాను గోపిచంద్ హీరోగా తెరకెక్కించాడు. జిల్ వచ్చిన ఐదు సంవత్సరాల తర్వాత రాధేశ్యామ్ అనే పాన్ ఇండియా సినిమాను ప్రభాస్ తో తెరకెక్కించాడు. భారీ అంచనాలు, భారీ బడ్జెట్ పై తెరకెక్కిన ఈ సినిమా భారీ డిజాస్టర్ గా నిలిచింది. రెబల్ స్టార్ ను పెట్టుకుని ఒక్క ఫైట్ కూడా పెట్టకుండా సినిమా తీసిన రాధాకృష్ణపై ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేసారు. ఇక ఇప్పుడు రాధాకృష్ణ మరోసారి రెబల్ స్టార్ కు కథ చెప్పగా అందుకు ప్రభాస్ కు ఒకే చెప్పాడట. ఇప్పడు రాధాకృష్ణతో సినిమా అవసరమా డార్లింగ్ అని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.
నేడు మరోసారి భారత్, పాకిస్తాన్ మ్యాచ్.. అదే సీన్ రిపీట్ అవుతుందా?
2025 మహిళల వన్డే ప్రపంచకప్‌లో భాగంగా అత్యంత ప్రతిష్టాత్మక మ్యాచ్ భారత్, పాకిస్తాన్ మధ్య నేడు (అక్టోబరు 5) కొలంబోలోని ఆర్. ప్రేమదాస స్టేడియంలో తలపడనున్నాయి. తమ ప్రపంచకప్ ప్రచారాన్ని శ్రీలంకపై గెలుపుతో ప్రారంభించిన భారత్, మహిళల వన్డేల్లో తమ వరుసగా 12వ విజయాన్ని నమోదు చేయాలని చూస్తోంది. మరోవైపు, తమ మొదటి మ్యాచ్‌లో బంగ్లాదేశ్ చేతిలో 7 వికెట్ల తేడాతో ఘోరంగా ఓడిపోయిన పాకిస్తాన్‌కు ఇది చాలా ముఖ్యమైన మ్యాచ్. ఈ టోర్నమెంట్ భారత్‌లో జరుగుతున్నప్పటికీ, రాజకీయ ఉద్రిక్తతల కారణంగా 2028 వరకు తటస్థ వేదికల్లో ఆడాలనే రెండు దేశాల మధ్య కుదిరిన ఒప్పందం కారణంగా ఈ మ్యాచ్ కొలంబోలో జరగనుంది. భారత్, పాకిస్తాన్ మహిళల ప్రపంచకప్ 2025 మ్యాచ్ అక్టోబరు 5 (ఆదివారం) న మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమవుతుంది. భారతదేశంలో స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో ప్రత్యక్ష ప్రసారం కానుంది. డిస్నీ+ హాట్‌స్టార్ యాప్, వెబ్‌సైట్‌లో లైవ్ స్ట్రీమింగ్ అందుబాటులో ఉంటుంది. టోర్నమెంట్‌లో ఇది 6వ మ్యాచ్. శ్రీలంక మహిళలపై 59 పరుగుల తేడాతో గెలిచి టోర్నమెంట్‌ను భారత మహిళలు అద్భుతంగా ప్రారంభించారు. 269 పరుగుల లక్ష్యాన్ని భారత్ విజయవంతంగా కాపాడుకుంది. ఇందులో అమన్‌జోత్ కౌర్ 56 బంతుల్లో 57 పరుగులు చేసి అద్భుతంగా రాణించింది.
