Site icon NTV Telugu

Top Headlines @9AM : టాప్‌ న్యూస్‌!

Top Headlines@9am

Top Headlines@9am

నేడే ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమం ప్రారంభం.. ఒక్కొక్కరికి రూ. 15 వేలు..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం సంక్షేమం దిశగా మరో అడుగు వేసింది. ఈ సందర్భంగా రాష్ట్రంలోని డ్రైవర్ల సంక్షేమం కోసం ‘ఆటో డ్రైవర్ సేవలో’ పథకానికి శ్రీకారం చుట్టింది. ఏపీలో సొంత ఆటో రిక్షా, మోటార్ క్యాబ్, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లకు ఆర్థికంగా అండగా నిలబడేందుకు కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ పథకాన్ని తీసుకొచ్చింది. ఈ పథకం కింద అర్హులైన డ్రైవర్లకు ఏడాదికి రూ.15 వేల చొప్పున ఆర్ధిక సహాయం అందించనుంది. అయితే, ఈ ఆటో డ్రైవర్ సేవలో పథకాన్ని ఈరోజు ( అక్టోబర్ 4న) ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించనున్నారు. ఇవాళ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ పరిధిలో ఉదయం 11 గంటలకు జరగనున్న ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ తో పాటు ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ హాజరు కానున్నారు. అయితే, 2.90 లక్షల మందికి లబ్ది చేకూరేలా ఏపీ సర్కార్ నిర్ణయించింది. రాష్ట్రంలో సొంత ఆటో, క్యాబ్ లపై ఆధారపడి జీవిస్తున్న వారి కోసం రూపొందించిన ఈ పథకానికి రాష్ట్రవ్యాప్తంగా 2,90,669 మంది లబ్ధిదారులను అర్హులుగా ప్రభుత్వం గుర్తించింది. ఇందుకోసం రూ. 436 కోట్లను కేటాయించింది ప్రభుత్వం. ఇక, ఈ నిధులను నేరుగా డ్రైవర్ల ఖాతాలో జమ చేయనున్నారు. గత ప్రభుత్వం కంటే.. అదనంగా రూ. 5 వేలను చంద్రబాబు సర్కార్ ఇవ్వనుంది. కూటమి ప్రభుత్వం అందిస్తున్న త్రీ వీలర్ ప్యాసింజర్ వాహనాల డ్రైవర్లు 38, 576 మంది, మోటార్ క్యాబ్ డ్రైవర్లు 20, 072 మంది, మ్యాక్సి క్యాబ్ డ్రైవర్లు 6, 400 మంది ఉన్నారు.

తిరుపతికి మరో బాంబు బెదిరింపు ఈ-మెయిల్.. ఇస్కాన్‌లో తనిఖీలు
తిరుపతికి మరో బాంబు బెదిరింపు ఈ-మెయిల్ వచ్చింది. ఇస్కాన్ టెంపుల్ లో బాంబులు పెట్టామని ఆ మెయిల్ లో హెచ్చరించారు. మొత్తం మూడు లొకేషన్లలో IEDలు ఉన్నాయని దుండగులు ఈ మెయిల్‌ ద్వారా వార్నింగ్ ఇచ్చారు. దీంతో అప్రమత్తమన అధికారులు ఉదయం నుంచి బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ తో అత్యవసర తనిఖీలు కొనసాగిస్తున్నారు. తప్పుగా హ్యాండిల్ చేస్తే పేలిపోయే ప్రమాదం ఉందని సూచిస్తూ మరో మెయిల్ కూడా పంపినట్లు సమాచారం. ఆలయాలు, బస్టాండ్, రైల్వే స్టేషన్ దగ్గర క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. కరూర్ తొక్కిసలాట కేసును CBIకి బదిలీ చేయాలని కూడా అదే ఇమెయిల్‌లో డిమాండ్ చేశారు. సైబర్ సెల్ ఈ-మెయిల్ మూలాన్ని గాలిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో బ్లాస్ట్స్ తర్వాత sniper దాడులు జరుగుతాయని అందులో వెల్లడించారు.

హైదరాబాద్లో మళ్లీ హైడ్రా కూల్చివేతలు.. మీడియాను అడ్డుకున్న పోలీసులు..
హైదరాబాద్‌లోని కొండాపూర్ సర్వే నెంబర్ 59లో వద్ద హైడ్రా కూల్చివేతలకు దిగింది. కొండాపూర్‌లోని బిక్షపతి నగర్‌లో ప్రభుత్వ భూమిలో నిర్మించబడిన అక్రమ నిర్మాణాలను హైడ్రా సిబ్బంది తొలగిస్తున్నారు. ఉదయం నుంచి ప్రారంభమైన ఈ కూల్చివేతలు భారీ పోలీస్ బందోబస్త్ నడుమ కొనసాగుతుంది. ఇక, మీడియాను కూడా కూల్చివేతల దగ్గరకు అనుమతించకపోగా, రెండు కిలోమీటర్ల దూరంలోనే స్థానికులను, జర్నలిస్టులను పోలీసులు అడ్డుకున్నారు. సుమారు 25 ఏళ్లుగా ఈ భూమిపై కొనసాగుతున్న వివాదానికి అనుకూలమైన తీర్పును సుప్రీం కోర్టు ఇచ్చింది. ఈ భూమి ప్రభుత్వ ఆస్తిగా తేల్చడంతో.. ఆ తీర్పు ఆధారంగా అధికారులు కబ్జాలను తొలగించి, భూమిని స్వాధీనం చేసుకునే పనిలో పడ్డారు.

ట్రంప్‌పై మోడీ ప్రశంసలు.. కారణమిదే!
అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌పై ప్రధాని మోడీ ప్రశంసలు కురిపించారు. గాజాలో శాంతి స్థాపనకు పురోగతి సాధించారంటూ ట్రంప్‌ను మోడీ అభినందించారు. ఈ మేరకు ఎక్స్‌లో మోడీ పోస్ట్ చేశారు. శాశ్వత, న్యాయమైన శాంతి కోసం చేసే ప్రయత్నాలకు భారతదేశం ఎప్పుడూ గట్టిగా మద్దతు ఇస్తూనే ఉంటుందని పేర్కొన్నారు. ఒకేసారి ఇజ్రాయెల్ బందీలను విడుదల చేస్తామని హమాస్ ప్రకటించడం శాంతి స్థాపనకు కీలకమైన ముందడుగు అని మోడీ తెలిపారు. ఈ మేరకు ట్రంప్ నాయకత్వాన్ని స్వాగతిస్తున్నట్లు చెప్పారు. గాజాలో శాంతి స్థాపనకు ఇటీవల ట్రంప్ 20 పాయింట్ల ప్రణాళికను ముందు పెట్టారు. దీనికి వెంటనే ఇజ్రాయెల్ అంగీకారం తెలిపింది. కానీ హమాస్ స్పందించలేదు. ఇక ట్రంప్ ప్రణాళికను ఆయా దేశాలు కూడా స్వాగతించాయి. అలాగే ప్రధాని మోడీ కూడా స్వాగతిస్తున్నట్లు వెల్లడించారు. అయితే, శాంతి ప్రణాళిను హమాస్ అంగీకరించకపోవడంతో ట్రంప్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఆదివారం సాయంత్రం 6 గంటల లోపు ప్రణాళికను అంగీకరించకపోతే నరకం చూస్తారని హమాస్‌ను ట్రంప్ తీవ్రంగా హెచ్చరించారు. దీంతో హమాస్ దిగొచ్చింది. ట్రంప్ ప్రణాళికలోని కొన్ని అంశాలను అంగీకరిస్తున్నట్లు ప్రకటించింది.

పాక్ “పోకిరి రాజ్యం” : పీఓకే నాయకుడు జమీల్ మక్సూద్
పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (PoK) లో తీవ్ర నిరసనలు జరుగుతున్న నేపథ్యంలో, యునైటెడ్ కాశ్మీర్ పీపుల్స్ నేషనల్ పార్టీ నాయకుడు జమీల్ మక్సూద్ పాకిస్తాన్‌ను “పోకిరి రాజ్యం” అని అభివర్ణిస్తూ, అది పౌరులను అణచివేస్తోందని ఆరోపించారు. జమ్మూ కాశ్మీర్‌తో తిరిగి ఏకం కావాలని PoK ప్రజలు కోరుకుంటున్నారని ఆయన అన్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. జమ్మూ కాశ్మీర్ జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ మూడు రోజుల సమ్మెకు పిలుపునిచ్చినప్పుడు, Pok లో కొనసాగుతున్న నిరసనల సందర్భంగా మరణించిన వారికి సంతాపం తెలిపేందుకు వేలాది మంది ముజఫరాబాద్‌లో గుమిగూడారు. నిరసనకారులు ,భద్రతా దళాల మధ్య జరిగిన ప్రదర్శనలు, ఘర్షణల్లో కనీసం ఆరుగురు పౌరులు, ముగ్గురు పోలీసు సిబ్బంది మరణించారు. శాంతియుత నిరసనకారులపై ఆయుధాలతో ఫెసిలిటేటర్లు కాల్పులు జరిపారని JKJAAC నాయకుడు షాకర్ నవాజ్ మీర్ ఆరోపించారు. 1947 నుండి 25% J&K కోటాతో సహా నెరవేరని వాగ్దానాలను నిరసనకారులు అశాంతికి కారణాలుగా పేర్కొన్నారు.

“కాంతార చాప్టర్ 1 చూసి ఇండియన్ డైరెక్టర్లంతా సిగ్గుపడాలి” – ఆర్జీవీ
‘కాంతార చాప్టర్ 1’ సినిమా విడుదలై ప్రేక్షకుల ప్రశంసలు, భారీ వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. రిషబ్ శెట్టి స్వయంగా దర్శకత్వం వహించి హీరోగా నటించిన ఈ ప్రీక్వెల్‌పై ఇప్పటికే ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా, యష్, జూనియర్ ఎన్టీఆర్ వంటి ప్రముఖులు స్పందించి ప్రశంసలు కురిపించారు. తాజాగా దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కూడా తనదైన శైలిలో రివ్యూ ఇచ్చి రిషబ్ శెట్టి పై ప్రశంసల వర్షం కురిపించాడు. అక్టోబర్ 3న ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ఆర్జీవీ చేసిన పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. “కాంతార ఛాప్టర్ 1 అద్భుతం. రిషబ్ శెట్టి, అతని టీమ్ బీజీఎం, సౌండ్ డిజైన్, సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ డిజైన్, వీఎఫ్ఎక్స్‌లో చూపిన అద్భుతమైన ప్రయత్నం చూసిన తర్వాత.. భారత దేశంలో దర్శకులందరూ సిగ్గుపడాలి. కంటెంట్ ఒక బోనస్ మాత్రమే. కేవలం వారి కష్టానికి ఈ సినిమా బ్లాక్‌బస్టర్‌గా నిలవడానికి అర్హత ఉంది. హోంబలే ఫిల్మ్స్ క్రియేటివ్ టీమ్‌కు ఇచ్చిన స్వేచ్ఛకు హ్యాట్సాఫ్. రిషబ్ శెట్టి, మీరు గొప్ప దర్శకులా లేక గొప్ప నటులా అనే విషయంలో నేను కన్ఫ్యూజ్‌ అవుతున్నాను” అని వర్మ పేర్కొన్నాడు. తన పనికి లభించిన ఈ ప్రశంసలకు రిషబ్ శెట్టి వినయంగా స్పందించాడు. “నేను కేవలం సినిమా లవర్ మాత్రమే సార్. మీ ప్రేమ, మద్దతుకు ధన్యవాదాలు” అని ఆర్జీవీకి రిప్లై ఇచ్చాడు. ‘కాంతార చాప్టర్ 1’ అక్టోబర్ 2న కన్నడతో పాటు తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, బెంగాలీ, ఇంగ్లీష్ సహా పలు భాషల్లో విడుదలైంది. 2022 లో వచ్చిన ‘కాంతార’ కథకు వెయ్యి సంవత్సరాల ముందు రోజుల నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో రిషబ్ శెట్టితో పాటు రుక్మిణి వసంత్, జయరామ్, గుల్షన్ దేవయ్య కీలక పాత్రల్లో నటించారు.

ఉస్తాద్ భగత్ సింగ్ రిలీజ్ డేట్‌పై బిగ్ అప్డేట్ రానుందా?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజాగా నటించిన ఓజి చిత్రం బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ సృష్టించిన సంగతి తెలిసిందే. భారీ వసూళ్లతో రికార్డులు క్రియేట్ చేసిన ఈ సినిమాకి తర్వాత పవన్ నుంచి రాబోతున్న మరొక మాస్ ఎంటర్‌టైనర్ “ఉస్తాద్ భగత్ సింగ్”. ఈ సినిమాకి సంబంధించిన అప్‌డేట్స్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. హరీష్ శంకర్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ పూర్తిస్థాయి మాస్ అవతార్‌లో కనిపించబోతున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ పోస్టర్స్ పవన్ ఎనర్జీని రెట్టింపు చేశాయి. ఇక తాజాగా లభించిన సమాచారం ప్రకారం, ఈ దీపావళి సందర్భంగా మేకర్స్ పెద్ద అప్డేట్ ఇవ్వనున్నారు. అదేంటంటే, సినిమా రిలీజ్ డేట్‌ను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని టాక్. వచ్చే ఏడాది ప్రథమార్థంలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చేలా ప్లాన్ చేస్తున్నట్లు తెలిసింది. ఈ సినిమాలో శ్రీ లీల, రాశి ఖన్నా హీరోయిన్ గా నటిస్తుండగా, సంగీతాన్ని దేవిశ్రీ ప్రసాద్ అందిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పుడు రిలీజ్ డేట్ ఎప్పుడు అనేది పవన్ అభిమానులంతా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.

Exit mobile version