NTV Telugu Site icon

Top Headlines @9AM : టాప్‌ న్యూస్‌

Top Headlines @ 9 Am

Top Headlines @ 9 Am

నేడు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సీఎల్పీ సమావేశం..
సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కాంగ్రెస్ శాసనసభా పక్ష సమావేశం జరగనుంది. ఇవాళ సాయంత్రం 4 గంటలకు హైదరాబాద్‌లోని ట్రైడెంట్‌ హోటల్‌లో జరిగే సమావేశానికి మంత్రులు, కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరుకానున్నారు. రేవంత్ రెడ్డి స్థానంలో టీపీసీసీ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ ను నియమించిన తర్వాత తొలిసారిగా జరిగే ఈ సమావేశంలో పార్టీ, ప్రభుత్వం మధ్య సమన్వయంపై చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది. అలాగే రానున్న స్థానిక సంస్థల ఎన్నికలపై కూడా ఈ సమావేశంలో చర్చించనున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా సంక్షేమ పథకాల అమలు తీరుపై సమావేశంలో సమీక్షించనున్నట్లు తెలుస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బూత్ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించనున్నారు. మండల స్థాయి నుంచి కొత్త కమిటీల నియామకం, స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు, ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడం, వివిధ స్థాయిల్లో పార్టీ ముఖ్య నేతల మధ్య సమన్వయం ఏర్పరచడం వంటి అంశాలు చర్చకు రానున్నాయి.

మూసీ పరివాహక ప్రాంతంలో కూల్చివేతలు.. నేటి నుంచి షురూ..
హైదరాబాద్‌ నగరంలో అక్రమ కట్టడాల కూల్చివేతలే లక్ష్యంగా హైడ్రా దూసుకెళ్తోంది. ఇప్పటికే పలుచోట్ల అక్రమ నిర్మాణాలను హైడ్రా కూల్చివేసింది. ఇవాళ ఉదయం నుంచి కూకట్ పల్లిలోని నల్లచెరువు ఆక్రమించి చేపట్టిన నిర్మాణాలను హైడ్రా కూల్చివేయనున్నారు. తెల్లవారుజామునే హైడ్రా సిబ్బంది చేరుకున్నారు. భారీ బందోబస్తు నడుమను కూల్చివేతలకు సిద్దమైంది. ఇవాళ మూసీ పరీవాహక ప్రాంతంలో నేటి నుంచి కూల్చివేతలు జరుగనున్నాయి. మూసీ ఆక్రమణలపై తెలంగాణ ప్రభుత్వం ఫోకస్‌ పెట్టింది. మూసీని ఆక్రమించి ఉన్న నిర్మాణాల తొలగింపు బాధ్యత హైడ్రాకు అప్పగించింది. మూసీ పరీవాహక నిర్వాసితులకు డబుల్‌ బెడ్రూమ్‌ ఇళ్లను ప్రభుత్వం కేటాయించనుంది. ఇప్పటికే మూసీ ఆక్రమణలపై సర్వే నిర్వహించారు అధికారులు. మూసీ నదిలో 12 వేల ఆక్రమణలు ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది. మూసీ నది ప్రక్షాళనలో 55 కిలో మీటర్ల మేర అభివృద్ధి చేయాలని ప్రభుత్వ నిర్ణయింది. కోకాపేటలో అక్రమ కట్టడాలను కూల్చివేస్తోంది. కోకాపేటలో అక్రమ నిర్మాణాలపై హైడ్రా దృష్టిసారించింది. సర్వే నంబర్‌ 147లో ప్రభుత్వ భూములను కబ్జా చేసి అక్రమంగా నిర్మాణాలు చేపట్టారు. దీంతో, ప్రభుత్వ నిర్మించిన అక్రమ కట్టడాలను కూల్చివేసేందుకు హైడ్రా అధికారులు శనివారం తెల్లవారుజామునే అక్కడికి వెళ్లారు. కోకాపేటలో పోలీసుల భారీ బందోబస్తు మధ్య కూల్చివేతల కార్యక్రమం కొనసాగుతోంది.

నేడు సీఎం చంద్రబాబుతో టీటీడీ అధికారుల భేటీ..
తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ఇవాళ (ఆదివారం) ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడితో సమావేశం కానున్నారు. తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వ్యవహారంపై ఈవో శ్యామలరావు సీఎంకు నివేదిక అందించనున్నారు. ఆగమ సలహా మండలి సూచనలను ఆయనకు వివరించనున్నారు. రిపోర్ట్ అందిన తర్వాత ఈ వ్యవహారంపై ఏపీ సర్కార్ చర్యలు తీసుకోనుంది. టీటీడీ ప్రాథమిక రిపోర్టు ఇప్పటికే ప్రభుత్వానికి అందింది. దీంతో పాటు తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు నేడు సీఎం చంద్రబాబుని టీటీడీ ఆహ్వానించనుంది. ఆ తర్వాత శ్రీవారి ఆలయంలో ప్రాయశ్చిత్త నివేదిక ఇవ్వనున్నారు టీటీడీ ఈవో.. సీఎం చంద్రబాబు సూచనతో అధికారిక ప్రకటన విడుదల చేసే అవకాశం ఉంది.

నేటి నుంచి డిప్యూటీ సీఎం పవన్ 11 రోజుల పాటు ప్రాయశ్చిత్త దీక్ష..
తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి ఉపయోగించడంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ రియాక్ట్ అయ్యారు. కలియుగ ప్రత్యక్షదైవం శ్రీ వెంకటేశ్వర స్వామికి జరిగిన ఈ ఘోర అపచారానికి సనాతన ధర్మాన్ని ప్రతి ఒక్కరూ ప్రాయశ్చిత్తం చేసుకోవాల్సిందేనని తెలిపారు. ‘‘అమృతతుల్యంగా.. పరమ పవిత్రంగా భావించే తిరుమల లడ్డూ ప్రసాదాన్ని- గత పాలకులు వికృత పోకడల ఫలితంగా అపవిత్రమైంది అని ఆయన చెప్పుకొచ్చారు. జంతు కొవ్వుతో మాలిన్యమైంది.. విశృంఖల మనస్కులే ఇలాంటి పాపానికి ఒడిగట్టగలరు అంటూ ధ్వజమెత్తారు. ఈ పాపాన్ని ఆదిలోనే పసిగట్టలేకపోవడం హిందూ సమాజానికి కళంకం అని పవన్ కళ్యాణ్ వెల్లడించారు. అందులో భాగంగా నేటి (ఆదివారం) నుంచి నేను ప్రాయశ్చిత్త దీక్ష చేయబోతున్నట్లు డిప్యూటీ సీఎం పవన్ తెలిపారు. శ్రీ దశావతార వేంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రాయశ్చిత్త దీక్ష చేపడుతున్నారు.

దేశంలోని ఎనిమిది హైకోర్టులకు కొత్త న్యాయమూర్తులు.. నోటిఫికేషన్ జారీ
దేశంలోని 8 హైకోర్టుల్లో ప్రధాన న్యాయమూర్తుల నియామకానికి సుప్రీంకోర్టు కొలీజియం శనివారం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ క్రమంలో ఢిల్లీ, జార్ఖండ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, లడఖ్, మధ్యప్రదేశ్, కేరళ, మేఘాలయ, మద్రాస్ హైకోర్టులకు ప్రధాన న్యాయమూర్తుల పేర్లను కొలీజియం సిఫార్సు చేసింది. దీనికి సంబంధించి, న్యాయ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. భారత రాజ్యాంగం అందించిన అధికారాలను ఉపయోగించి, రాష్ట్రపతి కింది హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులను నియమించడం… బదిలీ చేయడం సంతోషంగా ఉందన్నారు. ఢిల్లీ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ మన్మోహన్‌ను ప్రధాన న్యాయమూర్తిగా నియమించినట్లు కూడా ఆయన చెప్పారు. మరోవైపు హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ రాజీవ్ శక్ధర్ నియమితులయ్యారు.

మణిపూర్‌లో ఆర్మీ, పోలీసులు సెర్చ్ ఆపరేషన్ .. భారీ మొత్తంలో అక్రమ ఆయుధాలు స్వాధీనం
మణిపూర్‌లోని చురాచంద్‌పూర్ జిల్లాలో భారీ మొత్తంలో మందుగుండు సామాగ్రి, రాకెట్‌ల వంటి ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు పోలీసులు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. సముల్మలన్‌లో సెర్చ్ ఆపరేషన్‌లో మందుగుండు సామాగ్రి, రాకెట్ లాంటి ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్లు ప్రకటన పేర్కొంది. ఇండియన్ ఆర్మీ, మణిపూర్ పోలీసులు సంయుక్త ఆపరేషన్ ద్వారా సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. 21 సెప్టెంబర్ 2024న భారత సైన్యం, మణిపూర్ పోలీసులు నిర్వహించిన రెండు విజయవంతమైన జాయింట్ ఆపరేషన్‌లలో, చురచంద్‌పూర్ జిల్లా, తౌబాల్, ఇంఫాల్ తూర్పు జిల్లాల సరిహద్దు ప్రాంతాలలో సోదాలు జరిగాయి. మొదటి ఆపరేషన్‌లో, చురచంద్‌పూర్ జిల్లాలోని థాంగ్‌జింగ్ రిడ్జ్‌లోని దట్టమైన అటవీ ఎగువ ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. రెండు 9 ఎంఎం పిస్టల్స్, రెండు పిస్టల్ మ్యాగజైన్లు, ఒక సింగిల్ బ్యారెల్ రైఫిల్, రెండు స్థానికంగా తయారు చేసిన రాకెట్లు, ఒక లాంగ్ రేంజ్ మోర్టార్, రెండు మీడియం రేంజ్ మోర్టార్లు, నాలుగు మోర్టార్ బాంబులు, 9 ఎంఎం మందుగుండు సామగ్రి, 6.2 కిలోల గ్రేడ్ II పేలుడు పదార్థాలు వస్తువులు స్వాధీనం చేసుకున్నారు.

మరోసారి చతికిలపడ్డ ఇంగ్లాండ్.. రెండో వన్డేలోనూ ఆస్ట్రేలియా విజయం..
మిచెల్ మార్ష్ సారథ్యంలోని ఆస్ట్రేలియ క్రికెట్ జట్టు, ఐదు మ్యాచ్‌ల రెండో మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌ను 68 పరుగుల తేడాతో ఓడించి సిరీస్‌లో వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. వన్డేల్లో ఆస్ట్రేలియాకు ఇది వరుసగా 14వ విజయం. లీడ్స్ వేదికగా జరుగుతున్న రెండో వన్డేలో 271 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ జట్టు 40.2 ఓవర్లలో 202 పరుగులకే కుప్పకూలింది. జేమీ స్మిత్‌ మినహా మరే ఇతర ఇంగ్లండ్‌ బ్యాట్స్‌మెన్‌ కూడా పిచ్‌పై ఎక్కువసేపు నిలువలేకపోయారు. ఈ మ్యాచ్‌లో విజయంతో ఆస్ట్రేలియా సిరీస్‌లో 2-0 ఆధిక్యంలో నిలిచింది. ఆస్ట్రేలియా తరఫున మిచెల్ స్టార్క్ అత్యధికంగా 3 వికెట్లు పడగొట్టాడు. జోష్ హేజిల్‌వుడ్, గ్లెన్ మాక్స్‌వెల్, ఆరోన్ హార్డీల ఖాతాలో చెరో 2 వికెట్లు తీసుకున్నారు. ఆడమ్ జంపాకు ఒక వికెట్ దక్కింది. జామీ స్మిత్ 49 పరుగుల ఇన్నింగ్స్‌తో పాటు, బెన్ డకెట్ 32 పరుగుల ఇన్నింగ్స్ ఆడగా, ఆదిల్ రషీద్ 27 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. ఇంగ్లండ్ జట్టు ఆరంభం నుంచి చివరి వరకు నిర్ణీత వ్యవధిలో వికెట్లు కోల్పోతూనే ఉంది. దీంతో మ్యాచ్ వారి చేతుల్లోంచి జారిపోయింది.

కల్కి – 2 టైటిల్, కథ, కథనానికి సంబంధించి కీలక విషయాలు..
రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన లేటేస్ట్ హిట్ కల్కి 2898AD. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా వరల్డ్ వైడ్ గా సంచలనాలు నమోదు చేసింది. అశ్వద్ధామ పాత్రలో అమితాబ్ అభినయానికి బాలీవుడ్ జేజేలు పలికింది. భైరవగా ప్రభాస్ మెప్పించాడు. ఇక క్లైమాక్స్ లో వచ్చే కర్ణుడు పాత్రలో ప్రభాస్ అభినయానికి ప్రేక్షకులు ఊగిపోయారు. కానీ కర్ణుడిగా ప్రభాస్ కొద్దిసేపు మాత్రమే కనిపించాడు అని అసంతృప్తి ఫ్యాన్స్ లో ఎక్కువగా ఉంది. కర్ణుడి పరాక్రమం కల్కి – 2 లో చూడండి అని దర్శకుడు చెప్పి మొదటి పార్ట్ ముగించాడు. Kalki2898AD రెండవ భాగం ఎప్పుడు వస్తుందా అని ఆడియన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. తాజాగా కల్కి -2 కు సంబంధించి కీలక అప్ డేట్ యూనిట్ వర్గాల ద్వారా అందుతోంది. కల్కి -2 ను “Karna3102BC” అనే పేరుతో తీసుకురానున్నారు మేకర్స్. అమితాబ్ బచ్చన్, ప్రభాస్ పాత్రలైన అశ్వత్థామ కర్ణుడి చుట్టూ కథ తిరుగుగుతుందని తెలుస్తోంది. ఇక్కడ గమనించదగ్గ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, పార్ట్ – 2 కథా నేపథ్యం AD నుండి BC కి మారుతుంది, అంటే కథనం భవిష్యత్తు నుండి గతానికి వెళుతుంది. కల్కి -2 కథ కాలాన్ని వెనక్కి తీసుకువెళుతుంది. ఫ్లాష్‌బ్యాక్‌లతో పాటు, కమల్‌హాసన్ పాత్ర మహాభారత యుద్ధం తర్వాత నిజంగా ఏమి జరిగిందో మరింత వివరంగా  తెరకెక్కించబోతున్నాడు దర్శకుడు నాగి.  కర్ణుడు, అర్జునుడు మధ్య యుద్ధ సన్నివేశాల్ని భారీ స్థాయిలో ఉండబోతున్నాయి. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో షూటింగ్ ప్రారంభించి, 2028 నాటికి సినిమాను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.