నేడు కర్నూలు జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన..
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈరోజు (మార్చ్ 22) కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు.. ఉదయం 9.05 గంటలకు గన్నవరం ఎయిర్ పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో బయల్దేరి ఉదయం 9.45 గంటలకు కర్నూలు ఎయిర్ పోర్ట్ చేరుకోనున్నారు పవన్.. ఇక, కర్నూలు ఎయిర్ పోర్ట్ నుంచి రోడ్డు మార్గంలో బయల్దేరి పూడిచెర్ల చేరుకోనున్నారు పవన్.. పూడిచెర్లలో ఫారం పాండ్స్ నిర్మాణానికి భూమి పూజ చేయనున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. అయితే, ఓర్వకల్లు మండలం పూడిచర్లలో రైతు సూర రాజన్న పొలంలో ఫారం పాండ్‌కు భూమి పూజ చేయనున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. అనంతరం బహిరంగ సభలో పాల్గొననున్నారు.. ఇక, పవన్ పర్యటనకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని గురువారం రోజు కలెక్టర్ రంజిత్ బాషా అధికారులను ఆదేశించారు. ఎస్పీ విక్రాంత్ పాటిల్‌తో కలిసి భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు కలెక్టర్. ఈ సందర్భంగా బందోబస్తు ఏర్పాట్లు, భద్రత గురించి ఎస్పీతో చర్చించారు. సుమారు సభకు 4వేల మంది వరకు హాజరు కానున్నారని, అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. కాగా, పూడిచర్లలో ఆ కార్యక్రమం ముగిసిన తర్వాత కర్నూలు ఎయిర్ పోర్టు చేరుకొని అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు బయల్దేరి వెళ్లనున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.
గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో పార్కులు నిర్వీర్యమయ్యాయి..
నెల్లూరు నియోజకవర్గ పరిధిలోని పలు ప్రాంతాల్లో మంత్రి నారాయణ పర్యటించారు. ఈ సందర్భంగా వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ఇక, ఆయన మాట్లాడుతూ.. పనుల్లో అలసత్వం వహిస్తే సహించం.. నిర్దేశిత సమయంలో పనులు పూర్తి చేయాలి.. ప్రతీ లే అవుట్ లో పార్కుకు స్థలం వదలాలి.. 2014లో మంత్రిగా ఉన్నప్పుడే పార్కుల అభివృద్ధిని యజ్ఞంలా చేపట్టాము.. గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో పార్కులు నిర్వీర్యమయ్యాయి.. ఇప్పుడు అన్ని సౌకర్యాలతో పార్కులను సిద్ధం చేస్తున్నాము.. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, వాటర్ పైపులైన్ పనులు త్వరలోనే పూర్తి చేస్తాం.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ప్రజా వేదికను నిర్ధాక్షిణ్యంగా కూల్చేశారు అని మండిపడ్డారు. ప్రజల సొమ్ముతో కట్టిన నిర్మాణాన్ని కొట్టేశారు.. ఐదేళ్లు దుర్మార్గపు పాలన సాగించారు.. ఖజానా ఖాళీ చేసి వెళ్లారు.. రూ. 10 లక్షల కోట్లు అప్పు మిగిల్చి వెళ్లారు.. సీఎం చంద్రబాబు చొరవతో నిధులు సమకూర్చి అభివృద్ధి చేస్తున్నామని మంత్రి నారాయణ పేర్కొన్నారు.
కోర్టు బెయిల్ ఇచ్చినా బయటకు రావడం డౌటేనా..?
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ,మంత్రి నారా లోకేష్ తో పాటు సినీ పరిశ్రమమీద పోసాని చేసిన వ్యాఖ్యలపై ఫిబ్రవరి 26న అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పీఎస్ లో నమోదైన కేసులో హైదరాబాద్ వెళ్లి పోసానిని అరెస్ట్ చేసారు పోలిసులు. ఓ వైపు ఈ కేసు వ్యవహారం నడుస్తుండగానే రాష్ట్రవ్యాప్తంగా పోసానిపై పలు ప్రాంతాల్లో కేసులు నమోదయ్యాయి. దీంతో కొద్దికాలంగా పోసాని జైల్లోనే ఉన్నారు. తాజాగా పోసానిపై నమోదైన సీఐడీ కేసులో బెయిల్ లభించింది. దీంతో పోసాని విడుదలకు మార్గం సుగమం అయినట్టు అయ్యింది. కానీ గుంటూరు జైలు నుంచి సినీ నటుడు పోసాని కృష్ణమురళి విడుదల అవుతారా లేదా అని టెన్షన్ నెలకొంది. సీఎం చంద్రబాబు ఫొటోల మార్ఫింగ్, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పై దుర్భాషలాడినట్లు అభియోగాలు ఎదుర్కొంటున్న పోసాని. సీఐడీ పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేయటంతో కర్నూలు జైలు నుంచి పీటీ వారంట్ పై గుంటూరుకు తరలించారు. గుంటూరు కోర్టు రిమాండ్ విధించటంతో అప్పటి నుంచి జిల్లా జైల్లోఉన్నారు పోసాని. అనారోగ్య కారణాలతో బెయిల్ ఇవ్వవలసిందిగా పిటిషన్ దాఖలు చేసిన పోసానికి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది కోర్టు.
శంషాబాద్ ఎయిర్ పోర్టులో ప్రయాణికుల ఆందోళన
శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రయాణికులు ఆందోళనకు దిగారు. బెంగళూరు వెళ్లవలసిన ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ విమానం ఇంకా రాకపోవడంతో ప్రయాణికులు ఆందోళన చేపట్టారు. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్లవలసిన 150 మంది ప్రయాణికులు ఫ్లైట్ ఆలస్యం కావడంతో అధికారులపై మండిపడ్డారు. ప్రయాణికులకు అధికారులకు మధ్య స్వల్ప వాగ్వివాదం చోటుచేసుకుంది. శ్రీనగర్ నుంచి ఫ్లైట్ రాకముందే బోర్డింగ్ ఎందుకు ఇచ్చారని గొడవపడ్డారు. ఫ్లైట్ ఆలస్యానికి సంబంధించిన సమాచారం ఇవ్వకుండా గంటల తరబడి వెయిట్ చేయించడం ఎందుకని అధికారులను ప్రశ్నిస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
అల్వాల్ లో బాలికల మిస్సింగ్ కేసులో ట్విస్ట్… ఓయో రూంకి తీసుకెళ్ళి..
సోషల్ మీడియా కారణంగా జరుగుతున్న దారుణాలు అన్నీ ఇన్నీ కావు. పరిచయాలు పెంచుకుని ఆ తర్వాత వంచిస్తూ మోసాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి ఘటనలు రోజురోజుకు ఎక్కువైపోతున్నాయి. ఇదేతరహాలో ఇన్స్టా గ్రామ్ లో బాలికలను పరిచయం చేసుకుని.. ట్రాప్ చేసి అత్యాచారానికి ఒడిగట్టారు ఇద్దరు యువకులు. ఇటీవల అల్వాల్ పరిధిలో ఇద్దరు బాలికలు మిస్ అయిన విషయం తెలిసిందే. తమ కూతుర్లు కనిపించడం లేదంటూ తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. బాలికల మిస్సింగ్ కేసులో బిగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది. ఇన్ స్టా గ్రామ్ లో మచ్చ బొల్లారంకి చెందిన ఇద్దరు బాలికలతో పరిచయం పెంచుకున్నారు ఇద్దరు యువకులు. ఆ తర్వాత వారిని ట్రాప్ చేశారు. గత 5 నెలల నుంచి బాలికలతో చాట్ చేస్తున్నారు. పరిచయం ముసుగులో దారుణానికి ఒడిగట్టారు. బాలికలకు మాయమాటలు చెప్పి ఓయో రూం కి తీసుకెళ్ళారు. అక్కడ ఇద్దరు యువకులు బాలికలపై అత్యాచారానికి పాల్పడ్డారు. యువకులు దమ్మాయిగూడ కు చెందిన ఆకుల సాత్విక్, ఈసీఐఎల్ కి చెందిన కర్నాటి మోహన్ చంద్ గా పోలీసులు గుర్తించారు. ఓయో రూమ్ లో ఉన్నట్లు గుర్తించిన పోలీసులు బాలికలను రక్షించారు. ఓయో లాడ్జి నిర్వహకుడిపైనా కేసు నమోదు చేశారు. బాలికలపై అత్యాచారానికి పాల్పడిన యువకులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
డీలిమిటేషన్‌పై స్టాలిన్ నేతృత్వంలో నేడు దక్షిణాది సీఎంల భేటీ
డీలిమిటేషన్‌పై దక్షిణాది రాష్ట్రాలు సమర శంఖారావాన్ని పూరించాయి. ఇప్పటికే ఢిల్లీ వేదికగా తమిళనాడు డీఎంకే ఎంపీలు పోరాటం చేస్తున్నారు. పార్లమెంట్ ఉభయ సభల్లో ఆందోళనలు, నిరసనలు తెలుపుతున్నారు. తాజాగా తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ నేతృత్వంలో కీలక సమావేశం జరగబోతుంది. శనివారం తమిళనాడు వేదికగా దక్షిణాది రాష్ట్రాల అఖిలపక్ష సమావేశం జరగనుంది. చెన్నైలోని గిండి సమీపంలో ఐటీసీ ఛోళా హోటల్‌లో ఉదయం 10 గంటలకు సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి పలు రాష్ట్రాల సీఎంలతో పాటు ఆయా పార్టీల కీలక నేతలు హాజరుకానున్నారు. ఈ సమావేశానికి రాజకీయ ప్రాధాన్యత లేదని.. కేవలం దక్షిణాది ఉనికి కోసమే నేతలందరూ రావాలని సీఎం స్టాలిన్ పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో తమిళనాడు, ఏపీ, తెలంగాణ, కర్నాటక, కేరళ, పంజాబ్, ఒడిశా రాష్ట్రాలకు సంబంధించిన నేతలంతా హాజరుకానున్నారు. తెలంగాణ కాంగ్రెస్ నుంచి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, పీసీసీ చీఫ్ మహేశ్‌గౌడ్, టీఆర్ఎస్ తరపున కేటీఆర్, మాజీ ఎంపీ వినోద్, రాజ్యసభ ఎంపీలు హాజరుకానున్నారు. ఇక కేరళ నుంచి ముఖ్యమంత్రి విజయన్, పంజాబ్ నుంచి ముఖ్యమంత్రి భగవంత్ మాన్, కర్ణాటక నుంచి డిప్యూటీ సీఎం డీకే.శివకుమార్ పాల్గొననున్నారు. ఇక తమిళనాడు అసెంబ్లీలోనూ.. అఖిలపక్ష సమావేశంలోనూ ఇప్పటికే స్టాలిన్ డీలిమిటేషన్‌కు వ్యతిరేకంగా తీర్మానం చేశారు.
విద్యార్థులకు భారత్ కీలక సూచన.. యూఎస్ చట్టాలు పాటించాలని విజ్ఞప్తి
అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చాక అక్రమ వలసలపై ఉక్కుపాదం మోపుతున్నారు. ఇక ఎలాంటి అనుమానాలు వచ్చినా.. దేశం నుంచి బహిష్కరణ వేటు వేస్తున్నారు. తాజాగా భారతీయ పరిశోధకుడు బాదర్ ఖాన్ సురిని అమెరికా బహిష్కరణ వేటు వేసింది. అలాగే మరొక విద్యార్థిని రంజిని శ్రీనివాసన్‌ను కూడా బహిష్కరించింది. హమాస్‌కు మద్దతు ఇచ్చారన్న నేపథ్యంలో ఈ ఇద్దరి విద్యార్థులను అమెరికా బహిష్కరించింది. తాజా పరిణామాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తం అయింది. భారతీయ విద్యార్థులు అమెరికా చట్టాలకు అనుగుణంగా ఉండాలని కోరింది. ఇక బహిష్కరణకు గురైన బాదర్ ఖాన్ సూరి, రంజిని శ్రీనివాసన్.. సహాయం కోసం అమెరికాలోని భారత రాయబార కార్యాలయాలను సంప్రదించలేదని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తినప్పుడు అమెరికాలోని రాయబార కార్యాలయాల ద్వారా భారత విద్యార్థులకు సహాయం చేస్తామని విదేశాంగ మంత్రిత్వ శాఖ హామీ ఇచ్చింది.
మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయితే ఏంటి పరిస్థితి..?
2025 ఐపీఎల్ సీజన్ ఈరోజు నుంచి ప్రారంభం కానుంది. మొదటి మ్యాచ్ కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) మధ్య జరగనుంది. ఐపీఎల్ ప్రారంభ మ్యాచ్ కోసం అభిమానులు ఎంతో ఉత్సాహంగా ఉన్నప్పటికీ.. వాతావరణం మార్పుల వల్ల ఫ్యాన్స్ ఆందోళనలో ఉన్నారు. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ మైదానంలో జరుగనున్న ఈ మ్యాచ్‌కు వర్షం ముప్పు ఉంది. ప్రస్తుతం కోల్‌కతాలో ఆరెంజ్ అలర్ట్ అమలులో ఉంది. అక్యూవెదర్ నివేదిక ప్రకారం.. ఈ రోజు కోల్‌కతాలో వర్షం పడే అవకాశం 90% ఉందని పేర్కొంది. దీని వల్ల మ్యాచ్ రద్దు అయ్యే పరిస్థితులు ఎక్కువగా ఉన్నాయి. ఐపీఎల్‌లో ప్లేఆఫ్‌లు, ఫైనల్‌లకు మాత్రమే రిజర్వ్ డే ఉంది. గ్రూప్ మ్యాచ్‌లకు ఎలాంటి రిజర్వ్ డే లేదు. ఈ క్రమంలో.. మొదటి మ్యాచ్ వర్షం వల్ల రద్దయితే రెండు జట్లకు చెరో 2 పాయింట్లు ఇవ్వనున్నారు. ఐపీఎల్ నియమాల ప్రకారం.. వర్షం కారణంగా మ్యాచ్ రద్దయితే, ఆటను 60 నిమిషాల వరకు పొడిగించేందుకు ప్రయత్నిస్తారు. మ్యాచ్ ఫలితం కోసం కనీసం 5 ఓవర్ల మ్యాచ్ నిర్వహించేందుకు ప్రయత్నిస్తారు. 5-5 ఓవర్ల మ్యాచ్‌ను జరిగించడానికి కట్-ఆఫ్ సమయం IST కాలమానం ప్రకారం రాత్రి 10:56 గంటలు, ఆట మరుసటి రోజు ఉదయం 12:06 గంటల వరకు వేచి చూస్తారు. అప్పుడు కూడా మ్యాచ్ నిర్వహణ సాధ్యపడకపోతే ఇరు జట్లకు పాయింట్లు ఇస్తారు.
ఇలాంటి కాన్సెప్ట్‌తో ఒక సినిమా రావడం నా లైఫ్‌లో చూడలేదు : కీరవాణి
సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకదీరుడు రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మూవీ కోసం ప్రేక్షకులు ఎంతగా ఎదురుచూస్తున్నారో తెలిసిందే. ఇక ఈ సినిమా గురించి విశేషాలు బయటకు రాకుండా జక్కన్న చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కానీ ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా వృధా ప్రయత్నమే అని రీసెంట్‌గా షూటింగ్ వీడియో లీక్ అయ్యినప్పుడే అర్థం అయ్యింది. ఈ వీడియో లీక్ అయ్యిన తర్వాత రాజమౌళి తన షూటింగ్ పరిసరాల్లో సెక్యూరిటీని పెంచేశాడట. ఒడిశాలో మొదటి షెడ్యూల్‌ని పటిష్టమైన భద్రత మధ్యలోనే ముగించారట. ఇదంతా పక్కన పెడితే ఈ సినిమా గురించి పలు ఆసక్తికరమైన విశేషాలను ఆ చిత్ర సంగీత దర్శకుడు, ఆస్కార్ అవార్డు గ్రహీత కీరవాణి చెప్పుకొచ్చాడు.. ‘నా టూర్ MMK’ పేరుతో ఈనెల 22న కీరవాణి కాన్సెర్ట్ నిర్వహించబోతున్నాడు. దీనికి సంబంధించిన ప్రొమోషన్స్‌లో భాగంగా ఆయన ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో మహేష్, రాజమౌళి మూవీ గురించి చెప్పుకొచ్చాడు. ఆయన మాట్లాడుతూ.. ‘ఇప్పటి వరకు నా సినీ జీవితంలో ఇలాంటి కాన్సెప్ట్‌తో ఒక సినిమా రావడం చూడలేదు. ఈ మూవీ జానర్ మాత్రమే అడ్వెంచర్ కాదు, నాకు సంగీతం అందించడం కూడా అడ్వెంచర్ తో కూడుకున్న పని అని చెప్పాలి. చాలా కష్టమైన ప్రయాణం ఇది. కానీ నా మీద పెట్టిన నమ్మకాని నిలబెట్టుకోవాలి. అందుకోసమె సరికొత్త సౌండ్స్‌ని ఈ జానర్ కోసం సృష్టించబోతున్న. ఇది నేను ఛాలెంజ్‌గా తీసుకున్నాను’ అంటూ చెప్పుకొచ్చాడు. ఆయన మాట్లాడిన ఈ మాటలు మూవీ పై మరింత ఆసక్తిని పెంచేశాయి. దీని బట్టి రాజమౌళి ఏమి ప్లాన్ చేసి ఉంటాడో అని అభిమానులు సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు.