NTV Telugu Site icon

Top Headlines @9AM : టాప్‌ న్యూస్‌

Top Headlines @ 9 Am

Top Headlines @ 9 Am

మొదలైన ఖైరతాబాద్ సప్తముఖ గణపతి శోభాయాత్ర..
భాగ్యనగరంలో గణేష్ నిమజ్జన శోభ మొదలైంది. ఇందుకు సంబంధించి అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. అన్ని శాఖల అధికారులు తమ పనిలో నిమగ్నమయ్యారు. రెండున్నర కిలోమీటర్ల మేర భారీ గణనాథుడి శోభాయాత్ర సాగనుంది. ఖైరతాబాద్, సెన్సేషనల్ థియేటర్, రాజ్ దూత హోటల్, టెలిఫోన్ భవన్.. తెలుగు తల్లి ఫ్లైఓవర్, సచివాలయం, ఎన్టీఆర్ మార్గ్ వరకు శోభాయాత్ర కొనసాగనుంది. ఎన్టీఆర్ మార్గ్ 4వ నెంబర్ దగ్గర మహాగణపతి నిమజ్జన ఏర్పాట్లను చేపట్టారు. ఖైరతాబాద్ మహా గణపతి నిమజ్జనం కోసం ప్రత్యేక సూపర్ క్రేన్ ను ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం 2 గంటలలోపు ఖైరతాబాద్ గణేశుడి నిమజ్జనం పూర్తయ్యేలా ప్రణాళికలు సిద్దం చేశారు. ఇక ముఖ్యంగా ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. 700 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. శోభాయాత్ర మార్గంలో 56 సీసీటీవీ కెమెరాల ఏర్పాటు చేశారు. సరికొత్త రికార్డ్ సృష్టించిన ఖైరతాబాద్ గణేశుడి ఆదాయం రూ. కోటి 10 లక్షలు.. హుండీ ద్వారా రూ. 70 లక్షల ఆదాయం ప్రకటనలు, హోర్డింగుల ద్వారా రూ. 40 లక్షల ఆదాయం.. 70 ఏళ్ల సందర్భంగా ఈసారి 70 అడుగుల ఎత్తులో.. 11 రోజుల పాటు ఖైరతాబాద్ గణేశుడు పూజలందుకున్నాడు.

అందరి చూపు బాలాపూర్‌ లడ్డూ వేలం పైనే.. ఈసారి రూ.30 లక్షలు పైమాటే..?

దేశమంతటా మండపాలలో కొలువుదీరిన బొజ్జ గణపయ్యలు గంగమ్మ ఒడిలో చేరేందుకు ఊరేగింపుగా బయలుదేరుతున్నారు. అయితే ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో అందరి దృష్టి భాగ్యనగరంలోని బాలాపూర్ లడ్డూ వేలంపైనే ఉంది. ప్రతి సంవత్సరం వేలంలో రికార్డు ధర పలుకుతోంది. అందుకే భక్తుల గుండెల్లో బంగారంగా నిలిచిన గణనాథుడి లడ్డూ వెలమ పాట కోసం జనాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఊరేగింపు అనంతరం గ్రామ బొడ్రాయి వద్ద లడ్డూ వేలంపాట మొదలు పెట్టనున్నారు. గతేడాది 27 లక్షలు పలికిన బాలాపూర్ లడ్డూలు ఈసారి ఎంత ధర పలుకుతాయోనని ఉత్కంఠ నెలకొంది. వినాయక విగ్రహాల ఎత్తులోనే కాదు.. ఆయన చేతిలో పెట్టే లడ్డూల సైజుల్లోనూ పోటీ పెరిగింది. ఇక ఇప్పుడు అందరి దృష్టి బాలవూరు గణేశుడి విగ్రహం కంటే బాలాపూర్ గణేశుడి చేతిలోని లడ్డూపై పడింది. ఈ ఏడాది వేలం పాటలో లడ్డూ బద్దలు కొడుతుందేమోనని అందరూ ఎదురు చూస్తున్నారు. గత 30 ఏళ్లుగా జరుగుతున్న ఈ లడ్డూ వేలం ఏటా రికార్డులు బద్దలు కొడుతోంది. అందుకే ప్రతి వినాయక చవితి.. వేలం పాటలో బాలాపూర్ లడ్డూ ఎంత అన్నది తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అవుతోంది. బాలాపూర్ లడ్డూను కొనుగోలు చేసేందుకు పలువురు వేలంలో పాల్గొంటారు. లక్షలు చెల్లించినా బాలాపూర్ లడ్డూను సొంతం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. గతేడాది వేలం మొత్తం జమ చేయాలి. అంటే 27 లక్షల ధరకు కొనుగోలు చేసిన వారి పేరు బాలాపూర్ లడ్డూ వేలంలో ఉంటుందన్నమాట. అయితే ఇంతకుముందు ఈ నిబంధన స్థానికేతరులకు మాత్రమే ఉండేది. ఈసారి స్థానికులకు కూడా అదే నిబంధన వర్తింపజేశారు. గ్రామస్తుల నుంచి కూడా తీవ్ర పోటీ ఉన్న నేపథ్యంలో ఈ నిబంధన తీసుకొచ్చినట్లు నిర్వాహకులు తెలిపారు. గతేడాది లడ్డూ కోసం రూ.27 లక్షలు డిపాజిట్ చేసిన వారికే లడ్డూ వేలంలో పాల్గొనేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు. ఈసారి రూ.30 లక్షలకు పైనే పలుకుతుందని నిర్వాహకులు భావిస్తున్నారు.

ఇటు కాంగ్రెస్ ప్రజాపాలన దినోత్సవం.. అటు బీజేపీ విమోచన దినోత్సవం..

సెప్టెంబర్ 17న దేశంలో హైదరాబాద్ రాష్ట్ర విలీన వేడుకలను పురస్కరించుకుని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మంగళవారం అధికారికంగా నిర్వహిస్తున్నారు. అయితే ప్రధాన రాజకీయ పార్టీలన్నీ తమ తమ కార్యాలయాల్లో ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయి. సెప్టెంబర్ 17న తెలంగాణ ప్రజాపాలన దినోత్సవంను పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా పబ్లిక్ గార్డెన్స్ వద్ద సీఎం రేవంత్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు. ఉదయం 9.30 కి జూబ్లీహిల్స్ నివాసం నుండి సీఎం రేవంత్ పబ్లిక్ గార్డెన్స్ బయలుదేరనున్నారు. గన్ పార్క్ లో అమర వీరుల స్థూపం దగ్గర నివాళి అర్పించనున్న సీఎఎం . అనంతరం ఉదయం 10 గంటలకు పబ్లిక్ గార్డెన్స్ లో జాతీయ జెండా ఎగరేయనున్నారు సీఎం. ఈ కార్యక్రమానికి జిల్లాల్లో మంత్రులు, ప్రభుత్వ ప్రతినిధులు జాతీయ జెండాను ఎగురవేయనున్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 17న ‘తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం’ జరుపుకోవాలని నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. దీనిపై ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకుని తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఏడాది తెలంగాణ ప్రజాపరిపాలన దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించనుండగా, మిగిలిన జిల్లాల్లో త్రివర్ణ పతాకాలు ఎగురవేసే వారి వివరాలను పేర్కొంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎ.శాంతికుమారి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. . అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, పట్టణ, గ్రామీణ స్థానిక సంస్థల్లో మూడేండ్ల జెండాను ఎగురవేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

నేడు నియంతృత్వ నిజాం నుంచి తెలంగాణకు విమోచన లభించిన రోజు..
నేడు నియంతృత్వ నిజాం నుంచి తెలంగాణకు విమోచన లభించిన రోజని కేంద్ర మంత్రి, రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి అన్నారు. తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కిషన్ రెడ్డి జాతీయ పతాకం ఎగురవేశారు. అనంతరం మాట్లాడుతూ.. నియంతృత్వ నిజాం నుంచి తెలంగాణకు విమోచన లభించిన రోజన్నారు. వేలాదిమంది తెలంగాణ ప్రజలు విరోచిత పోరాటం చేశారన్నారు. అనేక బలిదానాలు, అనేక త్యాగాల అనంతరం తెలంగాణకు స్వాతంత్య్రం వచ్చిందన్నారు. నిజాం రాజకార్ల మెడలు వంచి తెలంగాణ సాధించడంలో పటేల్ పాత్ర సాహోసపెతమైందన్నారు. గత మూడేళ్ళ నుంచి కేంద్ర ప్రభుత్వం అధికారికంగా తెలంగాణ విమోచన వేడుకలు నిర్వహిస్తుందని అన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు రజాకార్ల వారసత్వమైన మజ్లిస్ పార్టీకి కొమ్ముకాస్తూ, అడుగులకు మడుగులోత్తుతూ తెలంగాణ ప్రజలను మోసం చేశాయన్నారు. తెలంగాణ విమోచన దినోత్సవాలను నిర్వహించకుండా రెండు పార్టీలు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నాయన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ దుర్మార్గమైన రాజకీయాలను తెలంగాణ ప్రజలు తిప్పికొట్టేందుకు సిద్ధం కావాలని పిలుపు నిచ్చారు.

వరదలతో నష్టపోయిన ప్రజలకు అందించే సాయంపై నేడే సీఎం చంద్రబాబు ప్రకటన..
ఏపీలో సంభవించిన భారీ వర్షాలు, వరదల కారణంగా తీవ్రంగా నష్టపోయిన రాష్ట్ర ప్రజలను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం అవుతోంది. ఇప్పటికే మొదలైన నష్టం వివరాల సేకరణ ప్రక్రియ పై సీఎం చంద్రబాబు అధికారులతో రివ్యూ చేసారు. ఎన్యుమరేషన్ పక్కాగా జరగాలని నష్టపోయిన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సాయం చేయాలని ఇదివరకే అధికారులతో సీఎం సమావేశంలో తెలిపారు. ఎన్యుమరేషన్ జరుపుతున్న విధానాన్ని, అలాగే పూర్తి వివరాలు ముఖ్యమంత్రికి అధికారులు తెలియచేసారు. నష్టం అంచనాలు పూర్తి చేసి 17వ తేదీ బాధితులకు సాయం అందిద్దాం అని ముఖ్యమంత్రి సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. సిఎం చంద్రబాబు నాయుడు నేడు (మంగళవారం) 12 గంటలకు సచివాలయానికి చేరుకొని., మొదటగా నూతన ఎక్సైజ్ పాలసీపై రివ్యూ చేస్తారు. ఆ తర్వాత బిసి వెల్ఫేర్, హ్యాండ్లూమ్స్, టెక్స్ టైల్స్ శాఖలపై రివ్యూ చేస్తారు. ఆపై భారీ వర్షాలు, వరదలతో నష్టపోయిన ప్రజలకు అందించే సాయంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సాయంత్రం ప్రకటన చేయనున్నారు.

నేటితో ముగియనున్న మాజీ ఎంపీ నందిగం సురేష్ పోలీస్ కస్టడీ..
టీడీపీ కేంద్ర కార్యాలయం పై జరిగిన దాడిలో ఆరోపణలు ఎదురుకున్న మాజీ ఎంపీ నందిగం సురేష్ పోలీస్ కస్టడీలో ఉన్న సంగతి తెలిసిందే. రెండు రోజులు గుంటూరు జిల్లా జైలులో విచారణ అనంతరం నేడు ఆయన బయటికి రానున్నారు. టీడీపీ పార్టీ కేంద్ర కార్యాలయంపై జరిగిన దాడి కేసులో భాగంగా నందిగం సురేష్‌ను రెండు రోజుల పాటు పోలీసుల విచారణకు న్యాయస్థానం కస్టడీకి పంపింది. ఆయనను విచారణకు సహకరించాలని తెలిపింది. ఇకపోతే దాడి వెనుక ఎవరున్నారనే విషయంపై పోలీసులు విచారణలో నిజానిజాలు తేల్చనున్నారు. ఈ విచారణలో భాగంగా ఎలాంటి లాఠీ చార్జీ చేయడం, దూషించడం, భయపెట్టడం లాంటివి చేయవద్దని కోర్టు తన ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. కోర్టు ఇచ్చిన సమయం ప్రకారం, నేడు మధ్యాహ్నం ఒంటిగంటకు పోలీస్ కస్టడీ ముగియనుంది. మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్లో రెండు రోజులుగా నందిగం సురేష్ ను పోలీసులు విచారించారు. టీడీపీ కేంద్ర కార్యాలయం పై జరిగిన ఈ దాడి, తనకు సంబంధం లేదని, పోలీసులకు మాజీ ఎంపీ నందిగం సురేష్ చెప్పినట్లు సమాచారం. నందిగం సురేష్ స్టేట్మెంట్లను కోర్టు ముందు ఉంచి, మరి కొంతకాలం కస్టడికి కోరే ఆలోచనలో పోలీసులు ఉన్నట్లు తెలుస్తోంది.

నేడు బోట్ల తొలగింపుకు మరోసారి ప్రయత్నం..
వరదల సమయంలో ప్రకాశం బ్యారేజీని ఢీకొట్టిన బోట్లను తొలగించేందుకు H బ్లాక్‌ ఆపరేషన్ ప్రారంభమైన సంగతి తెలిసిందే. నీళ్లలో నుంచి బోట్లను తొలగించేందుకు అధికారులు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. విజయవాడ నగరంలోని ప్రకాశం బ్యారేజ్‌కు అడ్డం పడిన బోట్ల తొలగింపు.. రోజురోజుకి క్లిష్టంగా మారుతోంది. 7 రోజులుగా దశలవారీగా చేసిన ప్రయత్నాలన్నీ విఫలం అవ్వగా ఇవాళ ప్రకాశం బ్యారేజి వద్ద బోట్ల తొలగింపుకు H బ్లాక్ విధానంలో మరోసారి ప్రయత్నం చేయనున్నారు అధికారులు. సోమవారం నాడు నీట మునిగిన బోటు తేలకపోవడంతో నేటికీ వాయిదా వేశారు. ఈ ఆపరేషన్ లో 150 టన్నులు మోయగలిగే 2 భారీ ఇసుక పడవలను వాడుతున్నారు. ఇక 6 నుంచి 7 టన్నుల బరువుండే H బ్లాక్ ఉంది. 10 పుల్లీలు, 10 చైన్ లింక్ లతో మొత్తం 200 టన్నుల లోడ్ సమర్ధంతో చర్యలు చేపడుతున్నారు. మొత్తానికి ఇవాళ బయటకి తేవాలని ధృఢ సంకల్పంతో H బ్లాక్ విధానమే చివరి ప్రయత్నంగా చేయనున్నారు అధికారులు.

నేడే కేజ్రీవాల్ రాజీనామా.. మరి కొత్త సీఎం ఎవరు..?
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఈరోజు సాయంత్రం 4:30 గంటలకు లెఫ్టినెంట్ గవర్నర్ (ఎల్జీ) వినయ్ సక్సేనాతో భేటీ కానున్నారు. సీఎం పదవికి రాజీనామా చేసి కొత్త పేరును సమర్పించనున్నారు. దీనికి ముందు, ఉదయం 11:30 గంటలకు కేజ్రీవాల్ నివాసంలో ఆప్ శాసనసభా పక్ష సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో కొత్త సీఎం పేరు చర్చించి, ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. ఇకపోతే కొత్త సీఎం ఎవరన్న విషయంపై ఇప్పుడు చర్చలు మొదలయ్యాయి. సెప్టెంబర్ 16న కేజ్రీవాల్ రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) సమావేశానికి పిలుపునిచ్చారు. ప్రభుత్వంలోని సీనియర్ నేతలు, కేబినెట్ మంత్రులందరినీ ఇందులో చేర్చారు. కొత్త సీఎంపై కేజ్రీవాల్ వన్ టు వన్ చర్చలు జరిపారు. అతిషి, కైలాష్ గెహ్లాట్, గోపాల్ రాయ్, సునీతా కేజ్రీవాల్‌ లలో ఎవరైనా ఢిల్లీ తదుపరి ముఖ్యమంత్రి కావచ్చని సమాచారం. ఇకపోతే., హర్యానాలో అక్టోబర్ 5న ఓటింగ్ జరగనుంది. రాష్ట్రంలో కాంగ్రెస్‌తో ఆప్‌ పొత్తు పెట్టుకోలేదు. ఇందులో ఆప్ పార్టీ మొత్తం 90 స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టింది. కేజ్రీవాల్ దృష్టి అంతా ఇప్పుడు హర్యానా ఎన్నికల ప్రచారంపైనే ఉంది. అంతేకాదు.. కేజ్రీవాల్ జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ప్రచారం చేయవచ్చు.

వైద్యుల డిమాండ్లకు తలొగ్గిన మమతా బెనర్జీ.. కోల్‌కతా టాప్ కాప్ తొలగింపు..
కోల్‌కతా ట్రైనీ వైద్యురాలి అత్యాచారం, హత్య సంఘటన తర్వాత యావత్ దేశంలో నిరసన, ఆందోలనలు నెలకొన్నాయి. ఇప్పటికీ బెంగాల్ వ్యాప్తంగా డాక్టర్లు నిరసన తెలుపుతూనే ఉన్నారు. ఇదిలా ఉంటే, సోమవారం డాక్టర్లతో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సమావేశం విజయవంతమైంది. ఆరు గంటల పాటు సుదీర్ఘంగా సాగిన ఈ సమావేశంలో డాక్టర్ల డిమాండ్లకు సీఎం తలొగ్గారు. వైద్యులు చేసిన నాలుగు డిమాండ్లలో ప్రభుత్వం ఆమోదించింది. అత్యాచారం-హత్య కేసు విచారణను ఇప్పటికే సీబీఐ చేపట్టింది. ఇది కూడా డిమాండ్లలో ఉంది. కోల్‌కతా పోలీస్ కమిషనర్‌ని తొలగించేందుకు సీఎం ఓకే చెప్పారు. ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలు అమలయ్యే వరకు నిరసన చేపడుతామని వైద్యులు వెల్లడించారు. కోల్‌కతా కమిషనర్‌తో పాటు ఆరోగ్య శాఖలో ఇద్దరు ఉన్నతాధికారుల్ని కూడా తొలగించనున్నట్లు తెలుస్తోంది. జూనియర్‌ వైద్యుల డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని కోల్‌కతా పోలీస్‌ కమిషనర్‌ వినీత్‌ కుమార్‌ గోయల్‌ రాజీనామాకు సిద్ధమని సమావేశంలో చెప్పారు. మంగళవారం సాయంత్రం 4 గంటలకు వినీత్‌ కొత్త సీపీకి బాధ్యతలు అప్పగిస్తారు’’ అని మమతా బెనర్జీ తెలిపారు. వైద్యులు ప్రతిపాదించిన 5 డిమాండ్లకు సీఎం అంగీకరించినట్లు తెలిసింది. ఆందోళన చేస్తున్న జూనియర్ డాక్టర్ల డిమాండ్లను చీఫ్ సెక్రటరీ నేతృత్వంలోని కమిటీ పరిశీలిస్తుందని ఆమె తెలిపారు. నిరసన తెలిపే వైద్యులపై ఎలాంటి శిక్షార్హత చర్యల్ని తీసుకోబోమని మమతా బెనర్జీ చెప్పారు.

జర్మనీలోని కొలోన్ నగరంలో పేలుడు..ఆ ప్రాంతాన్ని సీజ్ చేసిన పోలీసులు
జర్మనీలోని కొలోన్ నగరంలో సోమవారం ఉదయం భారీ పేలుడు సంభవించింది. రుడాల్ఫ్ ప్లాట్జ్, ఎహ్రెన్‌స్ట్రాసే మధ్య హోహెన్‌జోలెర్నింగ్‌లో పేలుడు సంభవించింది. వానిటీ నైట్‌క్లబ్ కూడా దాని ముందు ఉంది. ఘటన జరిగిన వెంటనే పోలీసులు ఆ ప్రాంతమంతా తమ ఆధీనంలోకి తీసుకుని పరిసర ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టారు. ఘటన జరిగిన ప్రాంతానికి దూరంగా ఉండాలని పోలీసులు ప్రజలకు సూచించారు. జర్మనీ ఎక్స్‌ప్రెస్ వార్తాపత్రిక నివేదిక ప్రకారం, ఈ పేలుడు సంఘటన స్థానిక కాలమానం ప్రకారం 05:50 గంటలకు సంభవించింది. పేలుడు తర్వాత మంటలు చెలరేగినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. అయితే అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకునేలోపే మంటలు అదుపులోకి వచ్చాయి. ఈ పేలుడు ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని, ఎవరూ గాయపడలేదని సమాచారం. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఆ ప్రాంతాన్ని సీల్ చేశామని, తదుపరి విచారణ కొనసాగుతోందని తెలిపారు. కొలోన్ పోలీసులు X లో పోస్ట్ చేయడం ద్వారా ప్రజలకు హెచ్చరిక జారీ చేశారు. ఆ ప్రాంత ప్రజలు మరో మార్గంలో వెళ్లాలని, పేలుడు ప్రభావిత ప్రాంతానికి దూరంగా ఉండాలని పోలీసులు సూచించారు. అత్యవసర సేవలకు సంబంధించిన బృందాలు మరియు దర్యాప్తు బృందాలు సంఘటనా స్థలంలో ఉన్నాయి. పరిస్థితిని అంచనా వేయడానికి.. ప్రజల భద్రతను నిర్ధారించడానికి దర్యాప్తు బృందాలు పని చేస్తున్నాయి. ఈ ఘటనపై పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. పేలుడుకు కారణమేమిటో, ఎలా జరిగిందో తెలుసుకోవడానికి సమీపంలో అమర్చిన సీసీటీవీ ఫుటేజీని కూడా పరిశీలిస్తున్నారు.

ఆటిట్యూడ్ స్టార్ పై ట్రోలింగ్ వల్ల చాలా బాధపడ్డాం : ప్రభాకర్
చంద్రహాస్ హీరోగా నటిస్తున్న సినిమా “రామ్ నగర్ బన్నీ”. విస్మయ శ్రీ , రిచా జోషి, అంబికా వాణి, రితూ మంత్ర హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని దివిజ ప్రభాకర్ సమర్పణలో మలయజ ప్రభాకర్, ప్రభాకర్ పొడకండ నిర్మిస్తున్నారు. శ్రీనివాస్ మహత్ (వెలిగొండ శ్రీనివాస్) దర్శకత్వం వహిస్తున్నారు. అక్టోబర్ 4వ తేదీన “రామ్ నగర్ బన్నీ” సినిమా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ రోజు ఈ సినిమా టీజర్ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మా అబ్బాయిని ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నప్పుడు నాకున్న ఫ్యామిలీ ఆడియెన్స్ ను దృష్టిలో పెట్టుకున్నాం. చంద్రహాస్ మొదటి సినిమా సకుటుంబంగా ప్రేక్షకులు చూడాలని అనుకున్నాం. చంద్రహాస్ మీద ట్రోలింగ్స్ వచ్చినప్పుడు మేమంతా బాధపడిన మాట వాస్తవమే. అయితే ఆ ట్రోలింగ్స్ ను చంద్రహాస్ పాజిటివ్ గా తీసుకున్నాడు. తనలో ఏవైనా లోపాలు ఉంటే సరిచేసుకుంటూ తనకు తాను ఎక్సీపిరియన్స్ చేసి ఎదుగుతున్నాడు. రీసెంట్ గా వరద బాధితుల కోసం తన వంతుగా సాయం చేశాడు. ఖమ్మం జిల్లా వెళ్లి నిత్యావసర వస్తువులు అందించాడు. రామ్ నగర్ బన్నీ లాంటి సినిమాను మాకు ఇచ్చిన డైరెక్టర్ శ్రీనివాస్ మహత్ కు థ్యాంక్స్ చెబుతున్నా. నేను ఇండస్ట్రీలో సంపాదించిందిన డబ్బుతో రామ్ నగర్ బన్నీ చేశా. నటుడిగా నా కొడుకులోని ప్యాషన్ చూసే సినిమా నిర్మాణానికి ముందుకొచ్చా. అతను గొప్ప స్థాయికి వెళ్తాడని నమ్మకం ఉంది. అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్నాయి. అయితే ఎక్కడా వల్గారిటీ ఉండదు. కుటుంబ ప్రేక్షకులు ఎలాంటి ఇబ్బంది లేకుండా సినిమా చూసి ఎంజాయ్ చేసేలా ఉంటుంది. అక్టోబర్ 4న థియేటర్స్ కు వెళ్లి మా మూవీ చూడండి’ అని అన్నారు.

దేవర ఓవర్సీస్ లేటెస్ట్ కలెక్షన్స్.. రికార్డులు తిరగరాస్తున్న Jr. NTR
జనతా గ్యారేజ్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్‌ & కొరటాల శివ కాంబోలో వస్తున్న చిత్రం దేవర. ఎన్టీయార్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ అత్యంత భారీ బడ్జెట్ లో నిర్మిస్తున్నారు. జాన్వీ కపూర్, సైఫ్ అలీఖాన్, మలయాళ నటుడు టామ్ చాకో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన సాంగ్స్ సూపర్ హిట్ కాగా, ఇటీవల వచ్చిన దేవర ట్రైలర్ రికార్డు వ్యూస్ రాబడుతూ ప్రేక్షకుల్లో మరింత అంచనాలు పెంచింది. అటు ఒవర్సీస్ ప్రీ సేల్స్ లో దేవర సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఓవర్సీస్ లోని నార్త్ అమెరికాలో ప్రీ సేల్స్ లో అత్యంత వేగంగా 1.75 మిలియన్ కలెక్ట్ చేసిన ఎనీ ఇండియన్ మూవీగా రికార్డు తిరగరాసింది. అదే విధంగా బబుకింగ్స్ పరంగా ఇప్పటి వరకు 45,000 టికెట్స్ రిలీజ్ కు 10 రోజులు ఉండగా ఇంతటి భారీ స్థాయి బుకింగ్స్ సాధించిన సినిమాగా దేవర నిలిచింది. U/A సర్టిఫికెట్ పొందిన ఈ సినిమా 2 గంటల 57 నిమిషాల రన్ టైమ్ తో వస్తోంది. కాగా నేడు చిత్ర యూనిట్ తమిళ ప్రమోషన్స్ ను స్టార్ట్ చేయనుంది. చిత్ర యూనిట్ నేడు చెన్నైలో ఈవెంట్ ను నిర్వహించబోతున్నారు. మరోవైపు ఈ సెప్టెంబరు 27న వరల్డ్ వైడ్ గా భారీ స్థాయిలో రిలీజ్ కానున్న దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఈ నెల 22 న భారీ స్థాయిలో నిర్వహించాలని ప్లాన్ చేసారు కానీ వేదిక ఎక్కడఅనే దానిపై సందిగ్థత నెలకొంది.

Show comments