కాసేపట్లో అమరావతి ప్రాంతంలో సీఎం చంద్రబాబు ఇంటి నిర్మాణానికి శంకుస్థాపన..
కాసేపట్లో అమరావతి రాజధాని ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి ఇంటికి శంకుస్థాపన జరగనుంది. ఇవాళ (ఏప్రిల్ 9న) భూమి పూజ చేయనున్నారు. సచివాలయం వెనుక E9 రహదారి పక్కనే ఇంటి నిర్మాణం చేపట్టనున్నారు. సీఎం చంద్రబాబు కుటుంబానికి వెలగపూడి గ్రామస్థులు పట్టువస్త్రాలు అందించనున్నారు. రాజధాని కోర్ ఏరియాలో సీఎం చంద్రబాబు నివాసం నిర్మాణం జరగనుంది. నందమూరి, నారా కుటుంబాల సమక్షంలో ఇంటికి శంకుస్థాపన కార్యక్రమం కొనసాగనుంది. 5 ఎకరాల స్థలంలో సీఎం నివాసం.. పక్కనే కాన్ఫెరెన్సు హాల్ నిర్మాణం కూడా నిర్మిస్తున్నారు. ఏడాదిన్నర సమయంలో నిర్మాణం పూర్తి అయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నారు.
ఊడదీయడానికి యూనిఫాం అరటితొక్క కాదు
శ్రీ సత్యసాయి జిల్లాలోని రాప్తాడు నియోజక వర్గంలోని రామగిరిలో టీడీపీ నేతల దాడిలో మణించిన వైసీపీ కార్యకర్త లింగమయ్య కుటుంబ సభ్యులను మంగళవారం నాడు మాజీ సీఎం వైఎస్ జగన్ పరామర్శించారు. ఈ సందర్భంగా జగన్ పోలీసులపై చేసిన వ్యాఖ్యలకు రామగిరి ఎస్ఐ సుధాకర్ యాదవ్ కౌంటర్ ఇచ్చారు. జగన్ అంటూ సంబోందించారు ఎస్ఐ. పోలీసులను బట్టలు ఊడదీసి కొడత అంటున్నావ్.. యూనిఫాం నువ్వు ఇస్తే వేసుకున్నది కాదు.. కష్టపడి చదివి సాధించింది.. నువ్వెవడో వచ్చి ఊడదీస్తా అంటే ఊడదీయడానికి అరటి తొక్క కాదు అంటూ మండిపడ్డారు. నిజాయితీగా ఉంటాం.. నిజాయితీగా చస్తాం.. అంతే తప్ప అడ్డమైన దారులు తొక్కం అని తెలిపాడు. జాగ్రత్తగా మాట్లాడు అంటూ వైఎస్ జగన్ కు రామగిరి ఎస్ఐ సుధాకర్ యాదవ్ హెచ్చరించాడు.
మొయినాబాద్‌లో ముజ్రా పార్టీ భగ్నం.. ఏడుగురు అమ్మాయిలతో..!
రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ముజ్రా పార్టీని ఎస్ఓటీ పోలీసులు భగ్నం చేశారు. ఫామ్‌హౌస్‌లో అర్ద నగ్నంగా నృత్యాలు చేస్తున్న అమ్మాయిలు, అబ్బాయిలను అరెస్ట్ చేశారు. డ్రగ్స్‌తో పాటు పెద్ద మొత్తంలో మద్యంను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ముజ్రా పార్టీ నిర్వహించిన నిర్వాహకుడిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. వివరాలు ఇలా ఉన్నాయి.. మొయినాబాద్ మండలం ఏతబర్ పల్లి గ్రామ శివారులోని హాలీడే ఫామ్‌హౌస్‌లో పుట్టినరోజు వేడుకల పేరుతో కొందరు యువకులు ముజ్రా పార్టీ చేసుకున్నారు. పార్టీ కోసం నిర్వాహకుడు ముంబై నుంచి యువతులను రప్పించాడు. పార్టీలో అమ్మాయిలు, అబ్బాయిలు కలిసి గంజాయి, హుక్కా పీలుస్తూ ఈ లోకాన్నే మైమరచిపోయారు. ముజ్రా పార్టీ జరుగుతుందన్న సమాచారంతో ఎస్‌వోటీ పోలీసులు హాలీడే ఫామ్‌హౌస్‌పై దాడులు చేశారు.
నేటితో ముగియనున్న ఏఐసీసీ సమావేశాలు.. కీలక తీర్మానాలు చేసే ఛాన్స్!
గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జరుగుతున్న ఏఐసీసీ సమావేశాలు బుధవారంతో ముగియనున్నాయి. మంగళవారం పలు కీలక అంశాలపై చర్చించి తీర్మానం చేశారు. నేటి సమావేశం ఉదయం 9 గంటలకు ప్రారంభమై.. సాయంత్రం 5 గంటల వరకు జరగనున్నాయి. నిన్న జరిగిన విస్తృతస్థాయి సీడబ్ల్యూసీ సమావేశంలో పలు అంశాలపై సభ్యుల నుంచి అభిప్రాయాలు తీసుకున్నారు. దీనికి అనుగుణంగా నేడు తీర్మానాలు చేయనున్నారు.
చైనాకు ట్రంప్ బిగ్ షాక్.. 104 శాతానికి సుంకాలు పెంపు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన అధిక సుంకాలతో ఇప్పటికే ప్రపంచ మార్కెట్లు కుదేల్ అయిపోతున్నాయి. వ్యవస్థలన్నీ అతలాకుతలం అయిపోతున్నాయి. ఏం చేయాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు. ఇలా ప్రపంచ దేశాలన్నీ తీవ్ర సతమతం అవుతున్నాయి. ఇలాంటి సమయంలో ట్రంప్ మరోసారి చైనాకు బిగ్ షాకిచ్చారు. ఇక, ట్రంప్ సుంకాలు ప్రకటించగానే.. చైనా మాత్రం అమెరికాపై ఎదురుదాడికి దిగింది. అమెరికా నుంచి దిగుమతి అయ్యే వాటిపై అదనంగా 34 శాతం సుంకాలను పెంచేసింది. ఈ వ్యవహారంపై ట్రంప్ స్పందిస్తూ.. చైనా భయపడిందని.. తక్షణమే సుంకాలను తగ్గించకపోతే.. ప్రతిదాడి తప్పదని ట్రంప్ హెచ్చరించారు. అన్నట్టుగానే ట్రంప్ భారీగా సుంకాలు పెంచేశారు. ఏకంగా 104 శాతం టారిఫ్‌లు పెంచేశారు. పెంచిన టారిఫ్‌లు వెంటనే అమల్లోకి వస్తాయని వైట్‌హౌస్ ప్రకటించింది. ఈ దెబ్బతో ప్రపంచ మార్కెట్లు అల్లకల్లోలం కావడం ఖాయమని నిపుణులు చెబుతున్నారు.
మార్క్ శంకర్‌ను చూసేందుకు సింగపూర్ కు మెగాస్టార్
ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ సింగపూర్ లో చదువుకుంటున్న స్కూల్లో చోటుచేసుకున్న అగ్ని ప్రమాదంలో గాయపడిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో మార్క్ శంకర్ కు చేతులు, కాళ్ళకు గాయాలయ్యాయి. అదే విధంగా ఊపిరితిత్తుల్లోకి పొగ వెళ్లిపోవడంతో ఇబ్బందులకు లోనయ్యాడు. మార్క్ శంకర్ ను ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. ప్రస్తుతం మార్క్ శంకర్ ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్టు తెలుస్తోంది. కాగా పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ గాయపడిన విషయం తెలియగానే ఆయన అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి మరియు వదిన సురేఖ తక్షణమే సింగపూర్‌కి బయల్దేరారు. శంకర్ ఆరోగ్య పరిస్థితిని సమీక్షించేందుకు మరియు మద్దతు అందించేందుకు సింగపూర్ కు పయనమయ్యారు. మార్క్ శంకర్‌కు అవసరమైన మెరుగైన వైద్యం అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఆయన ఆరోగ్యంపై అధికారిక సమాచారం త్వరలో వెలువడనుంది. అలాగే మార్క్ శంకర్ తండ్రి పవన్ కళ్యాణ్ గత రాత్రి ప్రత్యేక విమానంలో సింగపూర్ బయలుదేరారు.
సినీ నటుడు సప్తగిరి ప్రసాద్ కి మాతృ వియోగం..
టాలీవుడ్ కమెడియన్ సప్తగిరి ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. తాజా సమాచారం ప్రకారం అతని తల్లి చిట్టెమ్మ గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో చికిత్స పొందుతూ మంగళవారం బెంగళూరులో తుదిశ్వాస విడిచారు, నేడు బుధవారం తిరుపతి లోని పద్మావతి పురం ఎదురుగా ఉన్న శ్రీనివాసపురంలో చిట్టెమ్మ అంత్యక్రియలు జరగనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. నేడు తిరుపతికి చిట్టెమ్మ భౌతికకాయాన్నికీ నివాళులర్పించడానికి సినీ ప్రముఖులు రానున్నారు.. ఇప్పటికే తన కామెడీ టైమింగ్ తో మంచి గుర్తింపు సంపాదించుకున్న సప్తగిరి ప్రస్తుతం హీరోగా కూడా సినిమాలు చేస్తున్నాడు.. ఎక్స్‌ప్రెస్, సప్తగిరి ఎల్‌ఎల్‌బీ చిత్రాల్లో హీరోగా నటించగా. రీసెంట్ గా ‘పెళ్లి కాని ప్రసాద్’ అంటూ మరో చిత్రంలో లీడ్ రోల్ చేశాడు.
ఐపీఎల్ హిస్టరీలో ఎంఎస్ ధోనీ అరుదైన ఘనత.. ఇప్పట్లో బద్దలయ్యే అవకాశమే లేదు!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) హిస్టరీలో చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ అరుదైన ఘనత సొంతం చేసుకున్నాడు. ఐపీఎల్‌లో 150వ క్యాచ్‌ను అందుకున్న మొదటి వికెట్ కీపర్‌గా ధోనీ రికార్డుల్లోకెక్కాడు. ఐపీఎల్ 2025లో భాగంగా మంగళవారం ముల్లాన్‌పూర్ వేదికగా పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రవిచంద్రన్ అశ్విన్ బౌలింగ్‌లో నేహల్ వధేరా క్యాచ్‌ను అందుకోవడంతో మహీ ఖాతాలో ఈ రికార్డు చేరింది. ప్రస్తుతం ఐపీఎల్‌లో ఈ రికార్డుకు చేరువలో మరెవరూ కూడా లేరు. మొత్తంగా 43 ఏళ్ల ఎంఎస్ ధోనీ ఐపీఎల్‌లో 154 క్యాచ్‌లు అందుకున్నాడు. అందులో నాలుగు క్యాచ్‌లు ఫీల్డర్‌గా అందుకోగా.. 150 క్యాచ్‌లు కీపర్‌గా పట్టుకున్నాడు. ఈ జాబితాలో మహీ తర్వాతి స్ధానంలో మాజీ క్రికెటర్ దినేష్ కార్తీక్ (137) ఉన్నాడు. వృద్దిమాన్ సాహా (87), రిషబ్ పంత్ (76), క్వింటన్ డికాక్ (66) తర్వాతి స్థానాల్లో ఉన్నారు. ధోనీకి దరిదాపుల్లో ఉన్న దినేష్ కార్తీక్ ఇప్పటికే రిటైర్ అయ్యాడు కాబట్టి.. మహీ రికార్డు ఇప్పట్లో బద్దలయ్యే అవకాశమే లేదు.