NTV Telugu Site icon

Top Headlines @9AM : టాప్‌ న్యూస్‌

Top Headlines@9am

Top Headlines@9am

విజయవాడను వీడని వాన ముప్పు.. నగరవాసుల్లో ఆందోళన..!
విజయవాడను వాన ముప్పు వీడటం లేదు.. దీంతో రాత్రి నుంచి ఓ మోస్తారు వర్షం ప్రారంభం కావటంతో నగరవాసుల్లో ఆందోళన మొదలైంది. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడే అవకాశం ఉంది. దీంతో ఎప్పటికప్పుడు వరద ప్రభావిత ప్రాంతాలలో పర్యటించిన సీఎం చంద్రబాబు అధికారులకు దిశానిర్ధేశం చేశారు. నిన్నటి నుంచి వరద ప్రభావిత ప్రాంతాలలోని నిరాశ్రయులకు ఆహారం, మంచినీళ్లను ప్రభుత్వం సరఫరా చేస్తుంది. బుడమేరు ఉదృతి తగ్గటంతో సింగ్ నగర్ వైపు నుంచి నగరానికి భారీగా శివారు కాలనీల ప్రజలు తరలి వచ్చారు. ముంపు ప్రాంతాల నుంచి బయటకు తెచ్చేందుకు ప్రైవేట్ బోట్ల నిర్వాహకులు భారీగా వసూళ్లు చేశారంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శివారు ప్రాంతాలకు ఆహారం కూడా సక్రమంగా పంపిణీ కాలేదంటూ కన్నీటి పర్యంతమైతున్నారు.

వరదల్లో రెండు రోజుల్లో 12 మృతదేహాలను గుర్తించిన అధికారులు
బెజవాడ నగరం మూడు రోజులుగా వరద ముంపులో ఉంది. వరద తగ్గినా కాలనీల నుంచి ఇంకా బయటకు వెళ్ళని నీరు.. 8 అడుగుల నుంచి 3 అడుగులకు బుడమేరు వరద ఉదృతి చేరింది. ఇళ్లలో చిక్కుకున్న వారు రాత్రి నుంచే ఇళ్ళ నుంచి బయటకు వస్తున్న పరిస్థితి ఏర్పాడింది. గత మూడు రోజులుగా విద్యుత్ సరఫరా లేని పరిస్థితి కొనసాగుతుంది. ముంపు ప్రాంతాల్లో చివర వరకు తాగు నీరు, ఫుడ్, పాలు అందలేదు.. తిండి దొరక్క ముంపు ప్రాంతాల్లోని బాధితులు అల్లాడుతున్నారు. ఇక, పునరావాస కేంద్రాలకు 75 వేల మంది ప్రజలు వెళ్లారు. అయితే, వరదల్లో గత 2 రోజుల్లో 12 మృతదేహాలను ఎన్టీఆర్ జిల్లాలో అధికారులు గుర్తించారు. ఇక, వేల సంఖ్యలో గల్లంతైన ద్విచక్ర వాహనాలు, కొట్టుకుపోయి నీట మునిగిన కార్లు.. ప్రభుత్వ సాయం ఇంకా అందని వాళ్ళు ఇంకా వేలల్లో ఉంటారని ప్రభుత్వం అంచనా వేసింది. నగరాన్ని ముంచిన బుడమేరుకు పడిన 3 గండ్లు పూడ్చి వేతకు మరో రెండు రోజుల సమయం పట్టే అవకాశం ఉంది.

విజయవాడలో వాహనాల కోసం యజమానుల వెతుకులాట..
విజయవాడలో భారీ వర్షాలు, వరదలతో నగరంలో పెద్ద ఎత్తున వెహికిల్స్ కొట్టుకుపోయాయి. దీంతో వాహనాల కోసం యజమానుల వెతుకుతున్నారు. కిలో మీటర్ల దూరం పాటు వరదలో వాహనాలు కొట్టుకుపోయాయి. వరద తగ్గడంతో రోడ్లపై బయట పడుతున్న వెహికిల్స్.. బైక్ లే కాకుండా కార్లు కూడా కొట్టుకుపోవడంతో వాటి కోసం యజమానుల గాలింపు చర్యలు ప్రారంభించారు. చిట్టనగర్, సితార సెంటర్ ప్రాంతాల్లో కాలువల్లో బైక్ లు, కార్లు, ఆటోలు తేలుతు దర్శనమిస్తున్నాయి. ఇక, వేలాది వాహనాలు వరద నీటిలో చిక్కుకోపోవటంతో వరద బాధితులు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. అయితే వీరందరికీ ప్రభుత్వం అండగా నిలబడటానికి సిద్ధమయింది. వరదల్లో పూర్తిగా పోయినటువంటి వాహనాలను అన్నిటికీ కూడా ఆయా ఇన్సూరెన్స్ కంపెనీలతో మాట్లాడి బాధితులకు పరిహారాన్ని ఇప్పించే లాగా కూడా చర్యలు తీసుకోవడానికి ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆ దిశగా సీఎం చంద్రబాబు సైతం ఆదేశాలు జారీ చేశారు. త్వరలోనే ఆయా ఇన్సూరెన్స్ కంపెనీలతో సమావేశమై సత్వరమే వాహనాలకు సంబంధించిన యజమానులకు పరిహారం చెల్లించాలని కోరబోతున్నారు.

తెలంగాణలో స్వైన్‌ ఫ్లూ కలకలం..
తెలంగాణలో ఓ వైపు భారీ వర్షాలు కురుస్తుండగా, మరోవైపు విష జ్వరాలు విజృంభిస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా నగరవాసులనే కాదు గ్రామాలు సైతం విష జ్వరాలతో అల్లాడుతున్నాయి. అయితే ఏళ్ల తరబడి ఒక్క కేసు కూడా నమోదు కాకపోవడంతో స్వైన్ ఫ్లూ మరోసారి కలకలం సృష్టించింది. రాష్ట్రంలో నాలుగు కేసులు నమోదు కావడంతో అధికారులు ఒక్కసారిగా అప్రమత్తమయ్యారు. నాలుగు కేసులు నమోదైనట్లు హైదరాబాద్‌లోని నారాయణగూడలోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ ధృవీకరించింది. మాదాపూర్‌లో ఉంటున్న పశ్చిమ బెంగాల్‌కు చెందిన యువకుడు (23) తీవ్రమైన దగ్గు, ఇతర లక్షణాలతో ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లగా, వారు అనుమానం వచ్చి నమూనాలను నారాయణగూడ ఐపిఎంకు పంపారు. IPM స్వైన్ ఫ్లూని నిర్ధారించింది. టోలీచౌకికి చెందిన వృద్ధుడు (69), నిజామాబాద్‌ జిల్లా పిట్లం మండలానికి చెందిన వ్యక్తి (45), హైదర్‌నగర్‌ డివిజన్‌కు చెందిన మహిళ (51)కి స్వైన్‌ఫ్లూ సోకినట్లు గుర్తించారు. నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి చికిత్స నిమిత్తం వచ్చిన జార్ఖండ్‌కు చెందిన వృద్ధురాలు(68)కి కూడా స్వైన్ ఫ్లూ సోకినట్లు తేలింది.

నాలుగో రోజు జలదిగ్బంధంలోనే ఏడు పాయల ఆలయం..
నాలుగు రోజులుగా భారీ వర్షాలు కురుస్తుండటంతో మెదక్ జిల్లాలో ఏడు పాయల ఆలయం జలదిగ్బంధంలో చిక్కుకుంది. ఆలయం వద్ద మంజీరా వరద ఉగ్రరూపం దాల్చి గర్భగుడిలోనికి ప్రవేశించింది. అమ్మవారి ఆలయాన్ని చుట్టుముట్టిన మంజీరా ఏడు పాయలు. గర్భగుడి మూసేయడంతో రాజగోపురంలో ఉత్సవ విగ్రహానికి అమ్మవారు పూజలు అందుకుంటుంది. మంజీరా బ్యారేజ్ గేట్లు ఓపెన్ చేయడంతో ఏ క్షణాన అయిన భారీ వరద వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే అమ్మవారి ఆలయం చుట్టూ మంజీరా నది ఉగ్రరూపం దాల్చింది. మంజీరా ఏడు పాయలుగా చీలిపోయి ఆలయం ఎదుట పరవళ్లు తొక్కుతుంది. వరద ఉధృతి తగ్గిన తర్వాత యధావిధిగా భక్తులకు దర్శనం కల్పిస్తామని ఆలయ అధికారులు తెలిపారు. ఇక.. మంజీరాకు నక్క వాగు వరద చేరడంతో వనదుర్గ ప్రాజెక్టుకు భారీగా వరదనీరు వచ్చి చేరింది. ప్రాజెక్టు నుంచి 13 వేల క్యూసెక్కుల నీటిని అధికారులు దిగువకు విడుదల చేశారు. వరదల కారణంగా మంజీరాలో మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని సూచించారు. అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులు వనదుర్గ ప్రాజెక్టు వైపు వెళ్లకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. వర్షాలు తగ్గేంత వరకు ఎవరు ఆలయం వద్దకు రావద్దని పోలీసులు సూచించారు.

కోర్టు వెలుపల ఆర్‌జి కెఎఆర్ మాజీ ప్రిన్సిపాల్ కు చెంపదెబ్బ.. దొంగ దొంగ అంటూ నినాదాలు
కోల్‌కతాలోని ఆర్‌జి కర్ మెడికల్ కాలేజీ మాజీ ప్రిన్సిపాల్‌ను సిబిఐ సోమవారం అరెస్టు చేసింది. ఆ తర్వాత ఘోష్‌ను మంగళవారం అలీపూర్ కోర్టులో హాజరుపరిచారు. ఈ సమయంలో ప్రజలు ఆయనకు వ్యతిరేకంగా నిరసనలు చేపట్టారు. ఇంతలో ఒక నిరసనకారుడు సందీప్ ఘోష్‌ను చెప్పుతో కొట్టాడు. దీంతో పాటు చోర్-చోర్ అంటూ నినాదాలు చేశారు. సందీప్ ఘోష్‌ను అలీపూర్ కోర్టుకు తీసుకెళ్లిన ఆ సమయంలో పలువురు న్యాయవాదులు నిరసనకు దిగారు. సందీప్ ఘోష్‌ను కోర్టు వెలుపల ఉరితీయాలని పలువురు డిమాండ్ చేశారు. అప్పట్లో కోర్టు ఆవరణలో సెక్యూరిటీ గార్డుల సంఖ్య తక్కువగా ఉండేది. సందీప్ ఘోష్‌ను కోర్టుకు తరలించేందుకు సెక్యూరిటీ గార్డులు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. ప్రస్తుత పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని, రద్దీని నియంత్రించడానికి మరింత బలగాలను పిలిచారు. దీంతో సందీప్‌ను కట్టుదిట్టమైన భద్రత మధ్య కోర్టు ప్రాంగణం నుంచి బయటకు తీసుకొచ్చారు. అక్కడ ఆందోళనకారుల గుంపు గుమిగూడింది. అతన్ని బయటకు తీసుకెళ్తుండగా, ఒక నిరసనకారుడు సందీప్‌ను చెంపదెబ్బ కొట్టాడు.

ఫ్రాన్స్‌లో వలస బోటు మునిగి 13 మంది మృతి.. చాలా మంది సురక్షితం
ఉత్తర ఫ్రాన్స్ తీరంలో పడవ బోల్తా పడిన ఘటనలో కనీసం 13 మంది వలసదారులు మరణించారు. ఓ బోటులో 50 మందికి పైగా ఉన్న ఇంగ్లీష్ ఛానల్‌లో ఈ ఘటన జరిగింది. స్థానిక అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ పడవ బ్రిటన్ వైపు వెళుతుండగా ఒక్కసారిగా మునిగిపోవడంతో ప్రజలంతా నీటిలో పడిపోయారు. పడవ అడుగుభాగం పగిలిపోవడంతో అది మునిగిపోయిందని ఫ్రెంచ్ సముద్ర అధికారులు తెలిపారు. “దురదృష్టవశాత్తూ, పడవ అడుగు భాగం విడిపోయింది” అని లే పోర్టెల్ మేయర్ ఒలివర్ బార్బరిన్ అన్నారు. ఈ ప్రమాదంలో కనీసం 13 మంది మరణించినట్లు వారు ధృవీకరించారు. రెస్క్యూ టీమ్ చాలా మందిని నీటి నుండి రక్షించింది. వారిలో చాలా మంది పరిస్థితి విషమంగా ఉంది. వెంటనే వైద్యుల బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులకు చికిత్స అందించారు. ఈ ఏడాది ఇంగ్లిష్ ఛానెల్‌లో వలసదారుల మరణాల సంఖ్య పెరుగుతోంది. ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్ ప్రకారం.. ఈ సంవత్సరం బ్రిటన్ చేరుకోవడానికి ప్రయత్నించి కనీసం 30 మంది వలసదారులు మరణించారు లేదా తప్పిపోయారు. ఈ సంఘటన ఈ సంవత్సరం ఇంగ్లీష్ ఛానెల్‌లో జరిగిన అత్యంత ఘోరమైన వలస ప్రమాదంగా పరిగణించబడుతుంది. ఫ్రాన్స్ అంతర్గత వ్యవహారాల మంత్రి గెరాల్డ్ డర్మానిన్ ఈ ఘటనను అత్యంత భయంకరమైనదిగా అభివర్ణించారు. గత వారం, ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్, బ్రిటిష్ ప్రధాన మంత్రి కైర్ స్టార్మర్ వలసదారుల అక్రమ రవాణా మార్గాలను తొలగించడానికి సహకారాన్ని పెంచడం గురించి చర్చించారు.

దేవర ‘రన్ టైమ్’ అన్ని గంటలంటే కాస్త కష్టమే సుమీ..
జూనియర్ ఎన్టీయార్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో వస్తోన్న చిత్రం దేవర. అత్యంత భారీ బడ్జెట్ పై తెరకెక్కుతున్న ఈ చిత్రం పాన్ ఇండియా భాషలలో రూపొందుతోంది. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. దేవర గ్లిమ్స్ రిలీజ్ చేసిన నాటి నుండి అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. ఇటీవల రిలీజ్ చేసిన చుట్టమల్లే సెకండ్ సాంగ్ 100 మిలియన్స్ పైగా వ్యూస్ రాబట్టి ఆ అంచనాలు ఇంకాస్త పెంచింది. ప్రస్తుతం షూటింగ్ ముగించుకున్న దేవర సెప్టెంబరు 27 న అత్యంత భారీ స్థాయిలో వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది. కాగా ఈ చిత్రం రన్ టైమ్ తారక్ అభిమానులను కాస్త ఆందోళననకు గురి చేస్తోంది. దేవర మొత్తంగా 3 గంటల 10 నిమిషాల రన్ టైమ్ తో రానుంది. అంత నిడివి అంటే కాస్తంత ఇబ్బందే అని చెప్పక తప్పదు. భారతీయుడు – 2, అంటే.. సుందరానికి, టైగర్ నాగేశ్వరరావు వంటి సినిమాలు దాదాపు 3 గంటల వ్యవధితో వచ్చి ఫ్లాప్ గా మిగిలాయి. స్క్రీన్ ప్లే తో మ్యాజిక్ చేస్తూ సినిమాను నడిపితే తప్ప కొంచం అటు ఇటు అయిన ఆడియన్స్ తిప్పికొడతారు. అదే ఇప్పుడు ఎన్టీయార్ ఫ్యాన్స్ ను కలవరపెడుతుంది. కానీ దేవర ఇంకా  సెన్సార్ జరగలేదని అది అయ్యకే ఫైనల్ రన్ టైమ్ లాక్ చేస్తారని యూనిట్ సభ్యుల టాక్. మరోవైపు ఈ చిత్రాన్ని రెండు తెలుగు రాష్ట్రాల్లో  సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మాత సూర్యదేవర నాగవంశీ కొనుగోలు చేసారు. అటు ఆంధ్ర ఇటు తెలంగాణాలో తెల్లవారు జామున 1:00 గంటలకు ప్రీమియర్స్ వేసేలా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.

‘మురారి’ని మడత పెట్టిన ‘గబ్బర్ సింగ్’.. డే -1ఎన్ని కోట్లంటే..?
టాలీవుడ్ లో ప్రస్తుతం రీరిలీజ్ ట్రెండ్ భారీ స్థాయిలో జరుగుతుంది. డైరెక్ట్ రిలీజ్ సినిమాల కంటే ఎక్కువగా రీరిలీజ్ సినిమాలు కలెక్షన్స్ రాబడుతున్నాయి. పవన్‌ కల్యాణ్‌ హీరోగా హరీశ్‌ శంకర్‌ దర్శకత్వంలో వచ్చిన చిత్రం గబ్బర్‌ సింగ్‌’. 2012లో విడుదలైన ఈ సినిమా పవన్‌ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచి కలెక్షన్ల వర్షం కురిపించింది. తాజాగా ఈ చిత్రం మరోసారి పవన్‌ పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబర్‌ 2న ‘గబ్బర్ సింగ్‌’ రీ-రిలీజ్‌ చేశారు మేకర్స్. ఇటీవల మహేశ్ బాబు పుట్టిన రోజు సందర్భంగా మురారి, మెగాస్టార్ బర్త్ డే కానుకగా ఇంద్ర రీరిలీజ్ అయి రికార్డులు క్రియేట్ చేసాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం హోదాలో, మొదటి సారి ఎమ్మెల్యేగా గెలవడంతో పవర్ స్టార్ ఫ్యాన్స్ గబ్బర్ సింగ్ రీరిలీజ్ ను భారీ స్థాయిలో ప్లాన్ చేశారు. కేవలం అడ్వాన్సు బుకింగ్స్ కలెక్షన్స్ 4 కోట్ల రూపాయల కొల్లగొట్టిన గబ్బర్ సింగ్ ప్రీమియర్స్, మొదటి రోజు కలిపి మొత్తం రూ. 8.02 కోట్లు రాబట్టి పవర్ స్టార్ సూపర్ స్టార్ మహేష్ బాబు మురారి రీరిలీజ్ డే – 1 (రూ .5.41Cr)ను  బద్దలు కొట్టి ఆల్ టైమ్ రికార్డు క్రియేట్ చేసింది. ఫైనల్ రన్ లో గబ్బర్ సింగ్ ఎవరు బీట్ చేయలేని రికార్డ్స్ నమోదు చేస్తాడని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. గబ్బర్ సింగ్ రిలిజ్ అయి దాదాపు 12 ఏళ్ళు కావొచ్చినా కూడా ఇప్పటికీ పవర్ స్టార్ క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదని రీరిలీజ్ లో సాధించిన కలెక్షన్స్ చుస్తే అర్ధమవుతోంది.

దేశం గర్విస్తోంది.. పారాలింపిక్ విజేతలతో ప్రధాని మోదీ..
ప్రస్తుతం ప్యారిస్ లో జరుగుతున్న పారా పారాలింపిక్స్ 2024 క్రీడలలో భారతీయ ఆటగాళ్లు అదరగొడుతున్నారు. మంగళవారం నాటికి మొత్తం 20 మెడల్స్ తో టేబుల్ లిస్టులో 19వ స్థానంలో ఇండియా కొనసాగుతోంది. ఇందులో మూడు స్వర్ణ పతకాలు, ఏడో రజత పతకాలు, 10 కాంస్య పతకాలను సాధించారు క్రీడాకారులు. ఇకపోతే ప్రస్తుతం భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సింగపూర్, బ్రూనై దేశాలలో మూడు రోజుల పర్యటనలో భాగంగా పర్యటిస్తున్నారు. మంగళవారం నాడు బ్రూనై యువరాజు ప్రధాని మోడీకి ఘన స్వాగతం పలికారు. అక్కడ కార్యక్రమం ముగిసిన తర్వాత ప్రస్తుతం ప్యారిస్ లో జరుగుతున్న పారాలింపిక్ క్రీడలలో అద్భుత విజయం సాధించిన ఆటగాళ్లకు నరేంద్ర మోడీ ఫోన్ లో మాట్లాడి వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. పతకాలు గెలిచిన ఆటగాళ్లతో ప్రధాని మోడీ ఫోన్లో మాట్లాడిన సమాచారాన్ని ప్రధాని స్వయంగా తన ఇంస్టాగ్రామ్లో పోస్ట్ చేశారు. యోగేష్ కథునియా, సుమిత్ ఆంటిల్, శీతల్ దేవి, రాకేష్ కుమార్‌ క్రీడాకారుల అందరితో ఆయన మాట్లాడి వారిని అభినందించారు. ఇందులో భాగంగా ప్రధాని మాట్లాడుతూ.. భారతదేశం తన క్రీడాకారులను చూసి గర్విస్తోంది అంటూ కొనియాడారు. యోగేష్ తో ప్రధాని మాట్లాడుతూ.. అతని తల్లి పరిస్థితి గురించి ఆయన సమాచారాన్ని తెలుసుకొని.. ఆమె గర్భాశయ వ్యాధిపై కూడా అప్డేట్ తెలుసుకున్నారు. ఈ సందర్భంగా యోగేష్ మాట్లాడుతూ.. మీరు బ్రూనై లో ఉన్న గాని తమ గురించి ఆరా తీస్తున్నందుకు ఎంతో సంతోషంగా ఉందని అందుకు ధన్యవాదాలు అంటూ తెలిపాడు. దానికి ప్రధాని మాట్లాడుతూ.. తాను ప్రపంచంలో ఎక్కడ ఉన్నా సరే భారతదేశంలోనే తన ఆలోచనలు ఉంటాయని తెలిపారు.

టోక్యో రికార్డు బ్రేక్.. పారాలింపిక్స్‌లో నేటి భారత్ షెడ్యూల్ ఇదే!
పారిస్‌ పారాలింపిక్స్‌లో భారత అథ్లెట్లు దుమ్మలేపుతున్నారు. ఇపటివరకు భారత్ ఖాతాలో 20 పతకాలు చేరాయి. ఇందులో మూడు స్వర్ణాలు, ఏడు రజతాలు, 10 కాంస్య పతకాలు ఉన్నాయి. పారాలింపిక్స్‌లో భారత్‌కు ఇదే అత్యుత్తమ ప్రదర్శన. ఇదివరకు 2020 టోక్యో పారాలింపిక్స్‌లో భారత్ అత్యధిక పతకాలను (19-ఐదు స్వర్ణాలు, ఎనిమిది రజతాలు, ఆరు కాంస్యాలు) గెలుచుకుంది. ఆ రికార్డు ఇప్పుడు బ్రేక్ అయింది. నేడు కీలక పోటీలు ఉన్న నేపథ్యంలో మరిన్ని మెడల్స్ రానున్నాయి.