NTV Telugu Site icon

Top Headlines @ 9 PM: టాప్‌ న్యూస్‌

Top Headlines

Top Headlines

సీఎం జగన్‌ విమానం అత్యవసర ల్యాండింగ్‌
ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది… గన్నవరం విమానాశ్రయం నుంచి ఢిల్లీ పర్యటన కోసం బయల్దేరారు సీఎం వైఎస్‌ జగన్.. అయితే, ఆయన బయల్దేరిన కాసేపటికే విమానంలో సాంకేతిక సమస్యను గుర్తించారు పైలట్.. దీంతో అప్రమత్తమైన పైలట్‌.. తిరిగి గన్నవరం ఎయిర్‌పోర్ట్‌లో విమానాన్ని అత్యవసరం ల్యాండ్‌ చేశారు.. సాయంత్రం 5.03 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్ట్‌ నుంచి టేకాఫ్‌ అయిన విమానం.. తిరిగి సాయంత్రం 5.26 గంటలకు ఎయిర్‌పోర్ట్‌లో అత్యవసరంగా ల్యాండైంది.. దీంతో, గన్నవరం ఎయిర్‌పోర్ట్‌ నుంచి తాడేపల్లిలోని తన నివాసానికి చేరుకున్నారు.. ఇక, సీఎం ప్రయాణిస్తున్న ప్రత్యేక విమానంలో తలెత్తిన సాంకేతిక సమస్యలు ఏంటి? అనేది తెలియాల్సి ఉంది.

మంత్రి ఆర్కే రోజాకు లక్కీ ఛాన్స్‌..! స్పోర్ట్స్ అథారిటీ అఫ్ ఇండియా మెంబర్‌గా నియామకం..
ఆంధ్రప్రదేశ్ పర్యాటక, సాంస్కృతిక క్రీడా, యువజన సర్వీసుల శాఖ మంత్రి ఆర్కే రోజా సెల్వమణినికి అరుదైన అవకాశం దక్కింది… ఐదు రాష్ట్రాల క్రీడా శాఖ మంత్రులకే అవకాశం లభించిన కేంద్రం స్పోర్ట్స్ అథారిటీ అఫ్ ఇండియాలో రోజాకు అవకాశం దక్కింది… ఏపీ మంత్రి ఆర్కే రోజా.. స్పోర్ట్స్ అథారిటీ అఫ్ ఇండియా సభ్యులుగా నిమామకం అయ్యారు. ఈ విషయాన్ని సెక్రటరి జితిన్ నర్వల్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.. మొత్తం 5 రాష్ట్రాల క్రీడా శాఖ మంత్రులకు ఈ అవకాశం లభించిందని.. అందులో ఆర్కే రోజా కూడా ఉన్నారని పేర్కొన్నారు.. దక్షిణ భారతదేశం నుంచి ఆర్కే రోజా సెల్వమణిని స్పోర్ట్స్ అథారిటీ మెంబెర్‌గా ఎంపిక చేసినట్టు వెల్లడించారు.. రోజా తనకు వచ్చిన ఈ అవకాశంపై ఆనందం వ్యక్తం చేశారు.. మరోవైపు.. ఆంద్రప్రదేశ్ ప్రభుత్వ క్రీడా మంత్రిని ఎంపిక చేయడంతో.. రాష్ట్ర క్రీడాకారులకి ఉపయోగపడుతుందని ప్రభుత్వ వర్గాలు, క్రీడా కారులు ఆశిస్తున్నారు… కాగా, వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి కేబినెట్‌ 2లో మంత్రి పదవి దక్కించుకున్న ఆర్కే రోజాకు.. పర్యాటక, సాంస్కృతిక క్రీడా, యువజన సర్వీసుల బాధ్యతలు అప్పగించారు సీఎం.. నిత్యం ఏదో ఒక కార్యక్రమంలో పాల్గొంటున్న మంత్రి.. అవకాశం దొరికినప్పుడల్లా.. విపక్షాలపై ఓ రేంజ్‌లో ఫైర్‌ అవుతున్న విషయం విదితమే.

విషమంగానే ఆరోగ్యం.. తారకరత్న తాజా హెల్త్‌ బులెటిన్‌ విడుదల
నందమూరి తారకరత్న ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉందని ప్రకటించారు వైద్యులు.. తారకరత్న బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా.. ఆయన తాజా ఆరోగ్య పరిస్థితిపై ఆ ఆస్పత్రి వైద్యులు హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేశారు.. తారకరత్న ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉందని పేర్కొన్నారు.. వెంటిలేటర్ తో పాటు ఇతర అత్యాధునిక పరికరాల సపోర్టుతో తారకరత్నకు చికిత్స కొనసాగుతోందని పేర్కొన్నారు. అయితే, ఇప్పటి వరకు తారకరత్నకు ఏక్మో సపోర్టు అందించలేదని తమ ప్రకటనలో స్పష్టం చేశారు.. మరోవైపు.. తారకరత్న ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు కుటుంబ సభ్యులకు తెలియజేస్తున్నట్టు హెల్త్‌ బులెటిన్‌లో పేర్కొన్నారు నారాయణ హృదయాలయ ఆస్పత్రి వైద్యులు.. కాగా, కుప్పంలో నారా లోకేష్‌ పాదయాత్రలో పాల్గొన్న తారకరత్న.. ఒక్కసారిగా కుప్పకూలి స్పృహతప్పిపోయారు.. మొదట కుప్పంలోని ఓ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు.. ఆ తర్వాత బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆస్పత్రికి తరలించిన విషయం తెలిసిందే. ఇక, నందమూరి కుటుంబసభ్యులు ఒక్కొక్కరుగా తారకరత్నను పరామర్శిస్తూ.. ఆయన ఆరోగ్య పరిస్థితిపై వైద్యుల దగ్గర ఆరా తీస్తున్నారు.. ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు కూడా తారకరత్నను పరామర్శించారు.. ఆయన త్వరగా కోలుకుని పూర్తి ఆరోగ్యంతో ఆస్పత్రి నుంచి బయటకు రావాలని నందమూరి ఫ్యాన్స్‌, టీడీపీ శ్రేణులు కోరుకుంటున్నాయి.

విమానంలో సాంకేతిక సమస్యలు.. సీఎం జగన్‌ సీరియస్‌..
ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి తృటిలో పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నారు.. సీఎం ప్రయాణిస్తున్న ప్రత్యేక విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. వెంటనే అప్రమత్తమైన పైలెట్లు విమానాన్ని తిరిగి గన్నవరం ఎయిర్‌పోర్ట్‌లో అత్యవసరంగా ల్యాండ్‌ చేయంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.. ఢిల్లీ పర్యటన కోసం బయల్దేరిన సీఎం వైఎస్‌ జగన్‌ ప్రయాణిస్తున్న ప్రత్యేక విమానం సాయంత్రం 5.03 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్ట్‌ నుంచి టేకాఫ్‌ అయ్యింది.. అయితే, కొద్దిసేపటికే ఆ విమానంలో సాంకేతిక సమస్యలు వచ్చాయి.. దీంతో.. సాయంత్రం 5.27 గంటల ప్రాంతంలో తిరిగి గన్నవరం ఎయిర్‌పోర్ట్‌లో అత్యవసరంగా విమానాన్ని దింపేశారు.. దీంతో, సీఎం జగన్‌ ఎయిర్‌పోర్ట్‌ నుంచి తిరిగి తాడేపల్లిలోని తన నివాసానికి చేరుకున్నారు.. అయితే, ఈ ఘటనపై సీరియస్‌ అయ్యారు సీఎం వైఎస్‌ జగన్‌.. విమానంలో సాంకేతిక సమస్యపై ఆగ్రహం వ్యక్తం చేశారు సీఎం జగన్.. జీఏడీ, సీఎంవో అధికారులపై సీరియస్ అయిన సీఎం.. ముందుగా విమానం కండీషన్ చూసుకోవాల్సిన బాధ్యత లేదా? అంటూ మండిపడ్డారు.. అయితే, అది రెగ్యులర్‌గా వచ్చే విమానం కాదని అధికార వర్గాలు చెబుతున్నాయి.. మరోవైపు విమానంలో సాంకేతిక సమస్యలపై విచారణకు ఆదేశించారు ఉన్నతాధికారులు.. భద్రతా వైఫల్యం, నిర్లక్ష్యం అనే కోణాల్లో విచారణ చేసే అవకాశం కనిపిస్తోంది. ఇక, సీఎం జగన్‌ ఢిల్లీ పర్యటన రీ షెడ్యూల్‌ చేశారు.. ఇవాళ రాత్రికి 9 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్ట్‌ నుంచి ఢిల్లీకి బయల్దేరనున్నారు.. ఢిల్లీలో గ్లోబల్‌ ఇన్వెస్టర్‌ సదస్సు సన్నాహక సమావేశం కోసం ఢిల్లీ వెళ్తున్నారు.. ఇవాళ రాత్రికే ఢిల్లీకి సీఎం వైఎస్‌ జగన్‌ వెళ్లనున్నారు.. రాత్రి 9 గంటలకు ప్రత్యేక విమానంలో గన్నవరం ఎయిర్‌పోర్ట్‌ నుంచి ఢిల్లీకి బయల్దేరి హస్తినకు వెళ్తారు.. సీఎంతో పాటు విమానంలో సీఎస్ జవహర్ రెడ్డి, స్పెషల్ సీఎస్ పూనం మాలకొండయ్య, ఎంపీ మిథున్ రెడ్డి కూడా ఢిల్లీ వెళ్లనున్నారు.. రేపు దౌత్యవేత్తలతో గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ – కర్టెన్ రైజర్ కార్యక్రమం జరగనుంది.. రేపు ఉదయం 10.30 గంటలకు ఢిల్లీలోని లీలా ప్యాలెస్ హోటల్‌కు చేరుకుంటారు సీఎం.. అక్కడ పలు దేశాల దౌత్యవేత్తలతో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ జరుగుతుంది.. ఉదయం నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు ఈ సమావేశం కొనసాగనుంది.. సమావేశం అనంతరం సాయంత్రం 6 గంటలకు ఢిల్లీ ఎయిర్ పోర్ట్ కు చేరుకోనున్న సీఎం జగన్‌.. రేపు రాత్రి 9 గంటల ప్రాంతంలో తిరిగి తాడేపల్లి నివాసం చేరుకుంటారు.

వైసీపీపై ఎమ్మెల్యే కోటంరెడ్డి సంచలన వ్యాఖ్యలు..
సొంత పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి.. సన్నిహితులతో ఆయన మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నెల్లూరు రాజకీయాల్లో హాట్‌టాపిక్‌గా మారిపోయాయి.. వైసీపీ అధిష్టానం కొత్త డ్రామాకు తెరలేపిందని మండిపడ్డ ఆయన.. నా తమ్ముడు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డికి నియోజకవర్గ సమన్వయకర్తగా ఇస్తామని వైసీపీ అధిష్టానం చెబుతోంది.. ప్రస్తుతం రాష్ట్ర సేవా దళ్ అధ్యక్షుడిగా ఉన్న గిరిధర్ రెడ్డి.. వైసీపీ తరఫున పోటీ చేస్తే.. తమ్ముడికి పోటీగా నేను నిలబడను అని స్పష్టం చేశారు.. అంతేకాదు, రాజకీయాలకు గుడ్ బై చెబుతా నంటూ సంచలన ప్రకటన చేశారు.. ఫోన్ ట్యాపింగ్‌ వల్ల నా మనసు కలత చెందిందని ఆవేదన వ్యక్తం చేసిన ఆయన.. ఈ వ్యవహారం నాకు కునుకు లేకుండా చేస్తోంది. అనుమానం ఉన్న చోట కొనసాగడం కష్టమని స్పష్టం చేశారు. మూడు తరాలుగా వైఎస్ కుటుంబానికి విధేయుడిని.. రాజకీయాలు నాకేమీ కొత్త కాదు.. ఎత్తు పల్లాలు ఎరిగిన వాడిని అన్నారు కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి.. నా శ్వాస.. ధ్యాస రాజకీయమే.. అన్ని విషయాలు త్వరలోనే మీడియాకు వివరిస్తానని ప్రకటించారు.. అయితే, వచ్చే ఎన్నికల్లో పార్టీ టికెట్ రాదనే అనుమానంతోనే ఎమ్మెల్ఏ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేసినట్లు ప్రచారం సాగుతోంది.. ఇటీవల సీఎం వైఎస్‌ జగన్ తో సమావేశమయ్యారు కోటంరెడ్డి.. ఈ భేటీ వాడివేడీగా జరిగిందట.. నియోజకవర్గంలో శ్రీధర్ రెడ్డి… ఆయన అనుచరుల అక్రమాలను సీఎం వైఎస్‌ జగన్ ప్రస్తావించినట్లు సమాచారం.. అంతేకాదు, వచ్చే ఎన్నికల్లో టికెట్ రాదనే సంకేతాలతోనే శ్రీధర్ రెడ్డి ఈ హాట్‌ వ్యాఖ్యలు చేస్తున్నట్లు పార్టీ నేతల అభిప్రాయంగా ఉంది. ఇదే సమయంలో హైదరాబాద్ లో టీడీపీ నేత నారా లోకేష్ తో సమావేశమైనట్లు కూడా వైసీపీకి తెలిసిందట.. దీంతో, ఆయన కదలికపై నిఘా ఉంచినట్లు సమాచారం.

రాజ్‌భవన్‌ని రాజకీయాలకు అడ్డాగా మార్చడం మానుకోవాలి
రాజ్యాంగ బద్ధమైన పదవుల్లో ఉన్నవారు రాజకీయాలను మాట్లాడుతున్నారని మండిప్డారు మంత్రి కేటీఆర్. తాజాగా ఆయన మాట్లాడుతూ.. రాజ్ భవన్‌ని రాజకీయాలకు అడ్డాగా మార్చడం మానుకోవాలని హితవు పలికారు. రాజ్ భవన్ లో ప్రధాని ఫోటోలు పెట్టుకుంటున్నారని ఆయన ఆరోపించారు. గవర్నర్ వ్యవస్థ బ్రిటిష్ వాళ్లు పెట్టిందని, గవర్నర్ వ్యవస్థ ఇప్పుడు ఎందుకు అని ఆయన ప్రశ్నించారు. గవర్నర్ ని ఎవరు ఎన్నుకున్నారని రాజకీయలు చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. రాజకీయాల్లో ఉన్నవారికి గవర్నర్ ఇవ్వవద్దని ముఖ్యమంత్రిగా మోడీనే చెప్పారని, బ్రిటిష్ కాలంలో ఉన్న రాజ్ పత్ ను కర్తవ్య పత్ గా మార్చారన్నారు. గవర్నర్ అనే పదవికి బ్రిటిష్ కాలంలో ఉండేదని మంత్రి కేటీఆర్‌ అన్నారు. మోదీ మొన్న గొప్ప స్పీచ్ ఇచ్చారని, బ్రిటీష్ కాలం నాటి బానిస చిహ్నాలు పోవాల‌ని మోదీ అన్నారని గుర్తు చేశారు. గ‌వ‌ర్న‌ర్ వ్య‌వ‌స్థ కూడా బ్రిటీషోళ్లు పెట్టిందేనని, మ‌రి అవి ఎందుకు ఉండాల్నో.. అవి ఎందుకో.. దాని వ‌ల్ల దేశానికి ఏం ఉప‌యోగమో చెప్పాల‌ని కేటీఆర్ డిమాండ్ చేశారు. ప్ర‌ధాన మంత్రి, ముఖ్య‌మంత్రినేమో ప్ర‌జ‌లు ఎన్నుకున్నారు. గ‌వ‌ర్న‌ర్లు ఎవ‌రు ఎన్నుకున్న‌వారు..? అని కేటీఆర్ ప్ర‌శ్నించారు. స‌ర్కారీయా క‌మిష‌న్, ఫూంచ్ క‌మిష‌న్ కూడా చెప్పింది. మేం చెప్పుడు కాదు.. మోదీ కూడా సీఎంగా ఉన్న‌ప్పుడు స్వ‌యంగా చెప్పారు. రాజ‌కీయాల్లో ఉన్న‌వారికి గ‌వ‌ర్న‌ర్ ప‌ద‌వి ఇవ్వొద్ద‌ని మోదీనే చెప్పారు. రెండేండ్ల పాటు రాజకీయాల‌కు దూరంగా ఉంటేనే ఇవ్వాల‌ని మోదీ చెప్పారు. మ‌రి ఇవాళ మోదీ అది పాటిస్తున్నాడా..? ముఖ్య‌మంత్రి మోదీనేమో నీతులు చెబుతాడు. ప్ర‌ధాన‌మంత్రి మోదీనేమో అదే నీతుల‌ను తుంగ‌లో తొక్కుతాడు. ఇవాళ వ్య‌వ‌స్థ అట్లున్న‌ది అని కేటీఆర్ పేర్కొన్నారు.

ఫెల్యూర్ మినిస్టర్ అనుకున్నాం.. ఫేక్ మినిస్టర్ అని తేలిపోయింది
కాంగ్రెస్ విడుదల చేసిన చార్జిషీట్‌పై మంత్రి హరీష్ రావు కామెంట్స్ శోచనీయమన్నారు ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ మహేశ్వర్ రెడ్డి. తాజాగా ఆయన మాట్లాడుతూ.. అబద్ధపు..బూటకపు మాటలు మాట్లాడారు హరీష్ అని ఆయన మండిపడ్డారు. మేము అడిగిన వాటికి సమాధానం చెప్పకుండా.. అనవసర విషయాలు మాట్లాడారని మహేశ్వర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా.. ‘9 ఎండ్లలో ఎన్ని ఆసుపత్రులు కట్టారు.. ఎంత మంది వైద్యులను నియమించారు. ఇవేం చేయకుండా.. ఆసుపత్రుల్లో బెడ్స్ పెరిగాయా..? కాన్పులు ఎలా పెరిగాయి. వైద్యులు కాకుండా… ఎవరు కాన్పులు చేస్తున్నట్లు.. ఇతర రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఏం చేస్తుంది అనేది అక్కడి ప్రజలు అడుగుతారు. ఇక్కడ ప్రజలు మీకు ఓటేశారు.. ఇక్కడి ప్రజలకు సమాధానం చెప్పు. ఫెల్యూర్ మినిస్టర్ అనుకున్నాం కానీ….ఇప్పుడు ఫేక్ మినిస్టర్ అని తేలిపోయింది. ఎక్కడ చర్చకు వస్తారో.. Phcలో చర్చకు వస్తావా..? జిల్లా ఆసుపత్రిలో చర్చకు వస్తావా..? 1200 కోట్లతో సెక్రటేరియట్ కడతారు.. పార్టీ ఆఫీసులు కడతారు కానీ పేదల కోసం ఆసుపత్రి ఒక్కటి కూడా కట్టలేదు. అది బీఆర్‌ఎస్‌ చిత్తశుద్ది. ఫ్యామిలీ ప్లానింగ్ చేస్తే..మహిళలు చనిపోయింది గుర్తు లేదా..! అవార్డులు వచ్చాయి అని చెప్పుకోవడం కాదు. మహిళలు ఆసుపత్రికి రావాలంటే జంకుతున్నారు. నిర్మల్ లో పనికి మాలిన మంత్రి ఉన్నాడు. ఏరియా ఆసుపత్రిలో 22 మంది వైద్యుల పోస్టులు ఖాళీ. కాన్పులు వార్డులో సగం మంది వైద్యులే. సగం మంది వైద్యులతో ఎలాంటి వైద్యం చేస్తారు. వైద్యరంగంలో ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం వైద్య ఆరోగ్య శాఖ పై చర్చకు సిద్ధమా..? తెలియక మాట్లాడినట్టు నిరూపిస్తే.. రాజకీయాల నుండి తప్పుకుంటా. ఆరోగ్య శ్రీ కింద వైద్యం చేసిన ఆసుపత్రులకు 800 కోట్లు బాకీ పడ్డది నిజం కాదా. వైద్యం మానేస్తం అని ఆసుపత్రులు చెప్పింది నిజం కాదా..? చర్చకు సిద్దమేనా హరీష్. 76 శాతం మంది ప్రైవేటు ఆసుపత్రుల కు వైద్యం కోసం వెళ్తున్నారు అంటే ప్రభుత్వ వైద్యం ఎట్లా ఉందో అర్దం చేసుకోవచ్చు. 24 శాతం మంది కూడా మెడిసిన్ కోసం 80 శాతం మంది ప్రైవేట్ మెడికల్ షాపు లకు వెళ్తున్నారు. దాని గురించి ఎందుకు మాట్లాడడు హరీష్. వైద్యుల సంఖ్యని పెంచకముందే… కాన్పులు ఎవరు చేశారు. కాన్పులు వైద్యులు చేశారా.. మంత్రసానులు చేశారా..? 1100 మంది వైద్యుల పోస్టులు ఖాళీ లేవా కేసీఆర్‌..ఆరోగ్య శాఖ మంత్రిని మార్చి సమర్థవంతమైన వ్యక్తిని మంత్రి చేయండి.

గోరక్‌నాథ్ ఆలయంపై దాడి కేసులో ముర్తజాకు మరణశిక్ష
ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రముఖ గోరఖ్‌నాథ్‌ ఆలయంపై దాడి కేసులో నిందితుడు ముర్తజా అబ్బాసీకి మరణశిక్ష పడింది. ఈ ఆలయంలోకి చొరబడి కత్తితో బీభత్సం సృష్టించిన ఘటనలో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) కోర్టు సోమవారం కీలక తీర్పు వెలువరించింది. ఈ కేసులో ముర్తజా అబ్బాసీని దోషిగా తేల్చిన ప్రత్యేక ఎన్‌ఐఏ కోర్టు.. అతడికి మరణశిక్ష విధించింది. దాదాపు తొమ్మిది నెలల క్రితం గతేడాది ఏప్రిల్‌లో గోరఖ్‌నాథ్ ఆలయంలో భద్రతా ఉల్లంఘన ఘటన చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఆ ప్రాంతానికే చెందిన అబ్బాసీ.. కత్తితో వీరంగం సృష్టించి.. ఆలయంలోకి బలవంతంగా ప్రవేశించేందుకు ప్రయత్నించాడు. అడ్డొచ్చిన యూపీ పీఏసీ జవాన్లపై దాడి చేశాడు. నవరాత్రి వేడుకల్లో భాగంగా గుడిలో భక్తులు భారీగా ఉన్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు జవాన్లు గాయపడ్డారు. అనంతరం పారిపోయేందుకు ప్రయత్నిస్తుండగా.. అబ్బాసీని పోలీసులు పట్టుకుని అరెస్టు చేశారు. ఉగ్ర కుట్రలో భాగంగానే అబ్బాసీ ఈ ఘటనకు పాల్పడినట్లు వార్తలు వచ్చాయి. అనంతరం ఈ ఘటనపై ఉగ్రవాద నిరోధక బృందం (ఏటీసీ) దర్యాప్తు చేపట్టింది. విచారణలో అబ్బాసీ నుంచి కీలక విషయాలు బయటికొచ్చాయి. తనకు ఐసిస్‌ ఉగ్రవాద సంస్థతో సంబంధాలున్నట్లు అతడు దర్యాప్తులో అంగీకరించాడు. సుదీర్ఘ విచారణ అనంతరం.. ఈ కేసులో అబ్బాసీని ఎన్‌ఐఏ కోర్టు దోషిగా తేల్చింది. అతడికి మరణశిక్ష విధిస్తూ నేడు తీర్పు వెలువరించింది. అబ్బాసీ.. ఐఐటీ ముంబై నుంచి 2015లో కెమికల్‌ ఇంజినీరింగ్‌ పూర్తి చేశాడు. అనంతరం రెండు ప్రముఖ కంపెనీల్లో ఉద్యోగం కూడా చేశాడు. అయితే 2017 నుంచి అతడు మానసిక పరిస్థితి బాగోలేదని అబ్బాసీ కుటుంబసభ్యులు తెలిపారు.

అక్కడ పెళ్లి చేసుకోకుండానే బిడ్డను కనొచ్చు..కారణం ఏంటంటే?
చైనా దేశంలో బర్త్‌ రేట్‌ నానాటికీ తగ్గుతోంది. జననాల్లో క్షీణత స్ఫష్టంగా కనిపిస్తోంది. దీంతో చైనాలోని సిచువాన్ ప్రావిన్స్ బిడ్డల్ని కనే విషయంలో కొన్ని ఆంక్షల్ని సడలించింది. పెళ్లికాని వారు కూడా చట్టబద్ధంగా పిల్లల్ని కనొచ్చని, వివాహితులు పొందే ప్రయోజనాలు పొందడానికి ఆ ప్రావిన్స్‌ అనుమతించనున్నట్లు ఓ ఇంటర్నేషనల్ మీడియా చెప్పుకొచ్చింది. ఇంతకుముందు ఉన్న నిబంధన ప్రకారం పెళ్లి అయిన వారు మాత్రమే లీగల్‌గా పిల్లలకు జన్మనివ్వడానికి అనుమతి ఉంది. కానీ, ఇప్పుడు ఆ నిబంధన సడలించనున్నారని తెలిపింది. పెళ్లి కాని సింగిల్‌ పర్సన్ పిల్లలు కావాలనుకుంటే ఆ నిబంధన కింద ఫిబ్రవరి 15 నుంచి అనుమతి లభిస్తుంది. అందుకు సిచువాన్ అధికారుల వద్ద రిజిస్టర్‌ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఎంతమంది పిల్లల్ని కనాలనే సంఖ్య విషయంలో కూడా ఎలాంటి పరిమితి ఉండబోదట. దీర్ఘకాలిక, సమతుల్యతతో కూడిన పాపులేషన్ డెవలప్‌మెంట్‌ను ప్రోత్సహించడమే ఈ చర్యల ముఖ్య ఉద్దేశమని సిచువాన్ ఆరోగ్య కమిషన్‌ ఓ ప్రకటనలో తెలిపింది. ఇప్పటివరకూ ఇద్దరు పిల్లలు కావాలనుకున్న పెళ్లైన జంట మాత్రమే కమిషన్ వద్ద రిజిస్టర్ చేసుకునేందుకు అనుమతి ఉంది. కానీ, ఇప్పుడు వారితో పాటు పెళ్లికాని వారికీ ఈ వెసులుబాటు లభించింది. దాదాపు 60ఏళ్ల తర్వాత తొలిసారి చైనా జనాభాలో తగ్గుముఖం కనిపిస్తోంది. మరణాల కంటే జననాల రేటు తక్కువగా ఉండటమే ఇందుకు కారణం. ఓల్డ్ ఏజ్‌ వారి సంఖ్య పెరగడం, జననాల రేటు తగ్గుతున్న నేపథ్యంలో తాజా గణాంకాలు అక్కడి ప్రభుత్వాన్ని ఆందోళనకు గురిచేస్తున్నాయి. దాంతో ఈ తరహా వెసులుబాట్ల వైపు అక్కడి ప్రభుత్వాలు మొగ్గుచూపుతున్నాయి. పెళ్లయిన వారికి ఇచ్చే ప్రయోజనాలను వీరికి అందించేందుకు ముందుకు వస్తున్నాయి.

బ్రదర్.. కొద్దిగా ఓవర్ గా అనిపించలేదా
సాధారణంగా సినిమా తీసిన ప్రతి ఒక్క హీరో తమ సినిమా గురించి గొప్పగా చెప్పుకొస్తారు. తమ సినిమా సూపర్ అని బంపర్ అని.. తమ సినిమా మీద తమకు కాన్ఫిడెంట్ ఉండడం ఓకే.. కానీ ఓవర్ కాన్ఫిడెంట్ మాత్రం మంచిది కాదు అంటున్నారు అభిమానులు. లైగర్ సినిమానే ఉదాహరణగా తీసుకొంటే. విజయ్ దేవరకొండ, పూరి జగన్నాథ్.. ఈ సినిమాకు ఎంతో కాన్ఫిడెంట్ గా చెప్పుకొచ్చారు. బాలీవుడ్ కాదు.. మొత్తం సినీ ఇండస్ట్రీలోనే లైగర్ రికార్డులు సృష్టిస్తుంది అని రచ్చ రచ్చ చేశారు. కానీ, అనుకున్నది ఒక్కటి అయ్యింది ఒక్కటి అనేలా బాక్సాఫీస్ వద్ద లైగర్ బోల్తా పడింది. ఇక పెద్ద సినిమాలు ఎప్పుడు వస్తున్నా అభిమానులు కొద్దిగా భయపడుతూనే ఉన్నారు. ఇక ప్రస్తుతం నాని నటించిన దసరా సినిమాపై కూడా అదే భయాన్ని వ్యక్తం చేస్తున్నారు. అందుకు కారణం.. నేడు దసరా టీజర్ ఈవెంట్ లో నాని చాలా కాన్ఫిడెంట్ గా మాట్లాడడమే. సినిమా చాలా బాగా వచ్చింది అని చెప్పిన నాని మార్చి 30 న ప్రతి ఒక్కరు దసరా గురించే మాట్లాడుకొంటారని చెప్పాడు. ఓడెల శ్రీకాంత్ పేరు గుర్తిండి పోతుందని చెప్పాడు. ఇక ఆ తరువాత.. 2022 లో ఆర్ఆర్ఆర్, కెజిఎఫ్, కాంతారను ఎలా గుర్తుపెట్టుకున్నారో.. 2023లో దసరాను అలాగే గుర్తుపెట్టుకుంటారు అని చెప్పుకొచ్చాడు. పాన్ ఇండియా సినిమాలు అంటే అవే అని.. ఆ సినిమాలలానే దసరా కూడా అంతటి విజయం అందుకుంటుంది అని చెప్పడం బాగానే ఉన్నా.. వాటితో పోలుస్తూ చెప్పడం అంటే కొద్దిగా ఓవర్ గా అనిపిస్తోంది బ్రో అంటూ అభిమానులు చెప్పుకొస్తున్నారు. సినిమా హిట్ అయితేపర్లేదు .. ఒకవేళ ఒక మోస్తరు టాక్ వచ్చినా ట్రోలర్స్ ఏకిపారేస్తారు అని చెప్పుకొస్తున్నారు. మరి నాని కాన్ఫిడెన్స్ ను దసరా నిలబెడుతుందో లేదో చూడాలంటే మార్చి 30 వరకు ఆగాల్సిందే.

అఫిషీయల్.. ‘మాస్టర్’ కాంబో రీపీట్
వరిసు సినిమాతో మరో హిట్ అందుకున్నాడు విజయ్. తెలుగులో ఒక మోస్తరుగా ఆడిన ఈ సినిమా తమిళ్ లో మాత్రం పెద్ద విజయాన్ని అందుకుంది. ఇక ఈ సినిమా విజయంతో జోరు పెంచేసిన విజయ్.. మరో కొత్త సినిమాను అనౌన్స్ చేసేశాడు. మాస్టర్ సినిమాతో తనకు మంచి హిట్ ఇచ్చిన లోకేష్ కనగరాజ్ తో మరో సినిమాను రీపీట్ చేయనున్నాడు. ఇక ఈ విషయం ముందు నుంచి అందరికి తెల్సిందే.. కానీ, అధికారికంగా రాకపోయేసరికి అభిమానులు కొద్దిగా అనుమానం వ్యక్తం చేశారు. ఇక తాజాగా మేకర్స్ అధికారిక ప్రకటన కూడా ఇచ్చేశారు. విక్రమ్ హిట్ తో లోకేష్ పేరు పాన్ ఇండియా రేంజ్ లో మారుమ్రోగిపోయింది. ఈ సినిమా తరువాత అతడికి పెద్ద పెద్ద స్టార్ హీరోలు తమతో సినిమా చేయమని అడిగిన విషయం కూడా తెల్సిందే. అయితే.. లోకేష్ మాత్రం విజయ్ తోనే ఫిక్స్ అయ్యాడు. ఇక ఈ సినిమాను లలిత్ కుమార్ నిర్మిస్తుండగా.. అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు. ఈ విషయాన్నీ లోకేష్ అభిమానులతో పంచుకుంటూ విజయ్ తో ఉన్న ఫోటోను షేర్ చేశాడు. ఇది కూడా పక్కా యాక్షన్ ఎంటర్ టైనర్ అని తెలుస్తోంది. ఇక ఈ సినిమాపై ఇప్పుడే భారీ అంచనాలను పెట్టేసుకున్నారు అభిమానులు. ఇందులో విజయ్ సరసన ఏ హీరోయిన్ నటిస్తోంది అనేది మాత్రం తెలియాల్సి ఉంది. మరి ఆ లక్కీ ఛాన్స్ ఎవరికి వస్తుందో చూడాలి.

Show comments