NTV Telugu Site icon

Top Headlines @ 9 PM: టాప్‌ న్యూస్‌

Top Headlines

Top Headlines

నూతన పారిశ్రామిక విధానంపై భేటీ.. సీఎం జగన్‌ కీలక ఆదేశాలు
నూతన పారిశ్రామిక అభివృద్ధి విధానంపై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.. నూతన పారిశ్రామిక విధానంపై ఉన్నతాధికారులతో ప్రాథమిక సమావేశం నిర్వహించారు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి.. ఈ సందర్భంగా పారిశ్రామిక విధానంపై పలు కీలక ఆదేశాలు జారీ చేశారు.. పరిశ్రమల స్థాపన మొదలు మార్కెటింగ్‌ వరకు పరిశ్రమలను చేయిపట్టుకుని నడిపించే విధంగా పాలసీ ఉండాలని ఆదేశించిన ఆయన.. మార్కెటింగ్‌ టై అప్‌ విధానంపై దృష్టి సారించాలన్నారు. అంతర్జాతీయంగా మార్కెటింగ్‌ టై అప్‌ చేయగలిగితే ఎంఎస్‌ఎంఈ రంగంలో మరింత మెరుగైన అభివృద్ధి సాధించగలుగుతాం అన్నారు.. ఎంఎస్‌ఎంఈ రంగంలో పోటీ ఎక్కువగా ఉంటుందని.. సరైన మార్కెటింగ్‌ చూపించగలిగితే ఈ రంగంలో పరిశ్రమలు మరింత రాణిస్తాయన్నారు. ఇక, కాన్సెప్ట్‌, కమిషనింగ్‌, మార్కెటింగ్‌ వరకు హేండ్‌ హోల్డింగ్‌గా ఉండాలని స్పష్టం చేశారు సీఎం వైఎస్‌ జగన్‌.. అడ్వైజ్, అసిస్ట్‌ అండ్‌ సపోర్టివ్‌గా ఎంఎస్‌ఎంఈ పాలసీ ఉండాలన్నారు. స్టార్టప్‌ కాన్సెప్ట్‌ను ప్రోత్సహించేందుకు కీలక నిర్ణయం తీసుకున్నారు.. విశాఖపట్నంలో సుమారు 3లక్షల చదరపు అడుగులుతో స్టార్టప్స్‌ కోసం కొత్త భవనాన్ని నిర్మించాలని.. మంచి లొకేషన్‌లో భవనాన్ని నిర్మించాలని సూచించారు.. అదే భవనంలో పరిశ్రమలశాఖ కార్యాయం కూడా ఉండాలి.. స్టార్టప్స్‌కు అధిక ప్రాధాన్యత ఇవ్వాలన్నారు.. పోర్ట్‌ ఆధారిత పరిశ్రమలు కోసం మౌలిక సదుపాయాలు కల్పన దిశగా దృష్టి సారించాలని.. ఈ అంశాల ప్రాతిపదికగా ఇండిస్ట్రియల్ పాలసీలో ప్రతిపాదనలు తయారు చేయాలంటూ సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి.. కాగా, పెట్టుబడులు ఆకర్షించడానికి ప్రయత్నాలు సాగిస్తూనే ఉంది ఏపీ ప్రభుత్వం.. కొత్తగా పరిశ్రమల స్థాపనకు ముందుకు వచ్చేవాళ్లకు ఆఫర్లు కూడా ఇస్తున్న విషయం విదితమే.

ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రకటన.. కాపులపై వైసీపీ చిన్నచూపు..!
ఎమ్మెల్సీ ఎన్నికలకు అభ్యర్థులను ప్రకటించింది వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ.. అయితే, వైసీపీ ప్రభుత్వం ఎమ్మెల్సీ అభ్యర్థుల విషయంలో కాపులపై చిన్న చూపుతో వ్యవహరించిందంటున్నారు మాజీ మంత్రి కాపు సంక్షేమ శాఖ అధ్యక్షుడు చేగుండి హరిరామ జోగయ్య.. శాసనసభ స్థానాలలో రాయలసీమ నుండి బలిజ సామాజిక వర్గానికి చెందిన సుమారు 15 లక్షల మంది ఉన్నప్పటికీ కేవలం ఒకే ఒక స్థానాన్ని కల్పించారని విమర్శించారు.. రాయలసీమకు చెందిన బలిజ కులస్తులను ఒక్కరికి కూడా టీటీడీలో బోర్డులో సభ్యులుగా సైతం స్థానం కల్పించలేదన్న ఆయన.. జనాభా ప్రాతిపదికన ఈ రోజున కేటాయించిన ఎమ్మెల్సీ అభ్యర్థులు 18లో కనీసం ముగ్గురు నైనా కాపు అభ్యర్థులను నియమించాలి ఒకే ఒక్క స్థానం మాత్రమే కేటాయించారంటూ తన లేఖలో పేర్కొన్నారు హరిరామ జోగయ్య.

గన్నవరంలో టెన్షన్‌ టెన్షన్‌.. టీడీపీ ఆఫీసుపై వంశీ వర్గీయుల దాడి..!
మరోసారి గన్నవరం గరంగరంగా మారింది.. కృష్ణా జిల్లా గన్నవరంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.. తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వర్గీయులు దాడి చేశారని చెబుతున్నారు.. అయితే, వల్లభనేని వంశీపై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు బయల్దేరారు టీడీపీ నేతలు.. ఎమ్మెల్యే వ్యతిరేకంగా ఫిర్యాదు చేసేందుకు వెళ్తున్న సమయంలో.. వంశీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.. దీంతో.. టీడీపీ, వంశీ వర్గీయుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.. అది కాస్తా ఘర్షణకు దారి తీసింది.. ఆ తర్వాత.. గన్నవరం నియోజకవర్గం టీడీపీ ఆఫీసుపై వంశీ వర్గీయులు దాడి చేశారు.. ఈ దాడిలో టీడీపీ ఆఫీసు అద్దాలు, ఫర్నీచర్‌ ధ్వంసం అయ్యాయి.. అదే విధంగా ఆఫీసు ముందు పార్క్‌ చేసిన ఓ కారుకు కూడా నిప్పుపెట్టారు. గన్నవరంలో టీడీపీ, ఎమ్మె్ల్యే వంశీ వర్గీయుల మధ్య ఘర్షణ వాతావరణం రెండు, మూడు రోజుల నుంచి కొనసాగుతూనే ఉంది.. తాజాగా, ఎమ్మెల్యే వంశీ చేసిన వ్యాఖ్యలపై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెళ్లారు టీడీపీ నేతలు.. గన్నవరం టీడీపీ కార్యాలయం నుండి జాతీయ రహదారి పై నిరసనగా బయలుదేరి గన్నవరం పోలీస్ స్టేషన్ కి వెళ్లారు.. స్థానిక ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై గన్నవరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసేందుకు వెళ్తున్న టీడీపీ నేతలు.. ఎమ్మెల్యే వంశీ అరాచకాలు నశించాలి అంటూ నినాదాలు చేశారు.. డౌన్ డౌన్ వంశీ అంటూ నినదించారు.. ఈ సమయంలో.. ఎమ్మెల్యే వల్లభనేని వంశీ.. టీడీపీ ఆఫీసు చుట్టూ కారులో తిరిగారని టీడీపీ నేతలు చెబుతున్నారు.. ఇక, టీడీపీ వాళ్లు గన్నవరం పోలీస్ స్టేషన్ దగ్గరకు వెళ్లగానే.. ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వర్గీయులు టీడీపీ ఆఫీసుపై దాడికి పాల్పడ్డారని చెబుతున్నారు.. పెట్రోల్‌ డబ్బాలు, క్రికెట్‌ బ్యాట్లతో విరిచుకుపడి ఆఫీసులో అద్దాలు, ఫర్నిచర్‌ ధ్వంసం చేశారు.. అక్కడే ఉన్న ఓ కారుకు నిప్పుపెట్టారు.. ఈ దాడిలు పలు కార్ల అద్దాలు ధ్వంసం అయినట్టు చెబుతున్నారు. దీంతో, గన్నవరంలో మరోసారి ఉద్రిక్త పరిస్థితితులు నెలకొన్నాయి.

మార్చిలో ‘లహరి’ ఏసీ స్లీపర్ బస్సులు
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్‌టీసీ) రాష్ట్రంలో తొలిసారిగా సోమవారం ఏసీ స్లీపర్ బస్సులను ఆవిష్కరించింది. గతంలో ప్రయాణికుల సౌకర్యార్థం సరికొత్త, అతి విలాసవంతమైన, నాన్-ఏసీ స్లీపర్, సీటర్ కమ్ స్లీపర్ బస్సులను ప్రవేశపెట్టిన సంస్థ ఇప్పుడు ఏసీ స్లీపర్ బస్సులకు అత్యాధునిక సౌకర్యాలను అందించాలని భావిస్తోంది. ప్రైవేట్ ట్రావెల్స్‌ కోసం ప్రత్యేకంగా 16 కొత్త ఏసీ స్లీపర్‌ బస్సులు ‘లహరి’ని మార్చి నుంచి ప్రారంభించనున్నట్లు టీఎస్‌ఆర్‌టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌ ప్రకటించారు. టీఎస్‌ఆర్టీసీ కర్ణాటకలోని బెంగళూరు మరియు హుబ్లీ, ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం మరియు తమిళనాడులోని చెన్నైకి సర్వీసులను నడుపుతుంది. ఈ సందర్భంగా సజ్జనార్ మాట్లాడుతూ.. ఈ బస్సులో ప్రయాణిస్తుంటే అమ్మ ఒడిలో ప్రయాణిస్తున్న అనుభూతి కలుగుతుందన్నారు. ఈ నెలాఖరులోగా 16 ఏసీ స్లీపర్ బస్సులను అందుబాటులోకి తెస్తామని, బెంగళూరు, హుబ్లీ, విజయవాడ, వైజాగ్ తదితర నగరాలకు వెళ్లే ప్రయాణికులకు సేవలందిస్తామని తెలిపారు. త్వరలో 550 ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభిస్తామని సజ్జనార్ తెలిపారు. ఆర్టీసీ బస్సులకు ప్రజల నుంచి రోజురోజుకూ ఆదరణ పెరుగుతోందని, ఈ నేపథ్యంలోనే కొత్త బస్సులను అందుబాటులోకి తెస్తున్నామని చెప్పారు. ఈ ఏడాది చివరి నాటికి టిఎస్‌ఆర్‌టిసి ఆర్థికంగా బలమైన సంస్థగా అవతరిస్తుందని సజ్జనార్ ఆశాభావం వ్యక్తం చేశారు.

రెండు పార్టీలు కలిసి పని చేస్తాయట.. పొత్తులపై బండి సంజయ్‌ కీలక వ్యాఖ్యలు
జహీరాబాద్ వెళ్తున్న తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు సంజయ్ కి పటాన్ చెరు రింగు రోడ్డు దగ్గర పటాన్ చెరు నియోజకవర్గ బీజేపీ నాయకులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా బండి సంజయ్‌ మాట్లాడుతూ.. సింహం సింగిల్ గా వస్తుంది… గుంట నక్కలు గుంపులుగా వస్తాయంటూ కామెంట్స్‌ చేశారు. అంతేకాకుండా.. మేము అభివృద్ధి ఎజెండాతో వెళ్తే బీఆర్ఎస్ మోడీని తిట్టడం, కేంద్ర ప్రభుత్వాన్ని బద్నాం చేయడమే లక్ష్యంగా పెట్టుకుందని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణ రాష్ట్ర సాధనకు సంపూర్ణ మద్దతు ఇచ్చిన పార్టీ బీజేపీ అని ఆయన అన్నారు. 1400 మంది ఉసురు పోసుకున్న పార్టీ బీఆర్ఎస్ అని ఆయన ఆరోపించారు. నియంత పాలనతో కేసీఆర్ డిప్రెషన్ లోకి వెళ్లాడని, ఎప్పుడు ఎన్నికలొచ్చినా బీజేపీ ప్రజల్లోకి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నామన్నారు బండి సంజయ్‌. శివరాత్రి పేరిట పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి హంగూ ఆర్బాటాలు చేసి హిందూ ధర్మాన్ని నాశనం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. తెలంగాణ సెంటిమెంట్ తో కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ పార్టీలు 1400 మంది ఉసురు పోసుకున్నాయని ఆయన ధ్వజమెత్తారు. వచ్చే ఎన్నికల్లో రెండు పార్టీలు కలిసి పని చేస్తాయట.. ఈ విషయం మేం చెప్పలేదు కాంగ్రెస్ ఎంపినే స్వయంగా చెప్పాడు అని ఆయన అన్నారు. గుంట నక్కలే గుంపులుగా వస్తాయి..సింహం సింగిల్ గా వస్తుందని ఆయన వ్యాఖ్యానించారు.

లూడో గేమ్‎తో ఒక్కటయ్యారు.. అధికారులేమో వద్దుపొమ్మన్నారు
ఔను వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు.. దేశాన్ని దాటుకుని వచ్చి అమ్మాయి అబ్బాయిని పెళ్లి చేసుకుంది. తన మతం తెలియకుండా ఉండేందుకు భర్త కోసం తన పేరు కూడా మార్చుకుంది. కానీ అధికారులు వాళ్ల బంధాన్ని వద్దన్నారు. తీసుకెళ్లి ఇంటి దగ్గర వదిలిపెట్టారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఇఖ్రా జీవానీ… ఓ పాకిస్థానీ అమ్మాయి. వయసు 19 ఏళ్లు. ఆన్ లైన్ లో లూడో గేమ్ ఆడుతుండగా, ఉత్తరప్రదేశ్ కు చెందిన ములాయం సింగ్ (26) అనే యువకుడు పరిచయం అయ్యాడు. ఇఖ్రా… కొద్దిరోజుల్లోనే ములాయంతో ప్రేమలో పడింది. అతడి కోసం సరిహద్దులు దాటి వచ్చింది. ఆమెకు వీసా లేకపోవడంతో ములాయం సలహాపై తొలుత నేపాల్ చేరుకుంది. ఖాట్మండులో ములాయం ఆమెను కలుసుకున్నాడు.

బ్రెజిల్‌లో వరద బీభత్సం.. 36 మంది మృతి
ఆకస్మిక వరదలు బ్రెజిల్‌లో బీభత్సం సృష్టిస్తున్నాయి.. ఇప్పటికే ఈ వరదల దాటికి 36మంది ప్రాణాలు కోల్పోయారు. సావో పౌలో రాష్ట్రంలో ఆక‌స్మిక వ‌ర‌ద‌లు సంభ‌వించాయి. దీంతో కొండ‌చ‌రియ‌లు విరిగిప‌డ్డాయి. 36 మంది చనిపోగా డజన్ల సంఖ్యలో జనం గల్లంతయ్యారని అధికారులు తెలిపారు. సావో సెబాస్టియావో పట్టణం నుండి టీవీ, సోషల్ మీడియా ఫుటేజీలు వరదలతో నిండిన రహదారులు, కార్లు పడిపోయిన చెట్లను చూపించాయి. మృతుల సంఖ్య పెరిగే అవ‌కాశాలు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. సావో పాలో నగరానికి ఉత్తరాన ఉన్న తీర ప్రాంతంలో మరో 228 మంది నిరాశ్రయులవగా, 338 మందిని ఖాళీ చేయించారు. తుఫాను బారిన పడిన వారికి సహాయం చేయడానికి రెస్క్యూ సిబ్బంది శ్రమిస్తున్నారు. సావో పాలో రాష్ట్ర గవర్నర్ టార్సిసియో డి ఫ్రీటాస్ వాతావరణం కారణంగా దెబ్బతిన్న తీరం వెంబడి ఉన్న ఐదు పట్టణాల్లో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. అతను రెస్క్యూ ఆపరేషన్ల కోసం 1.5 మిలియన్ డాలర్ల నగదును కేటాయించారు. అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లులా డ సిల్వా ఈ ప్రాంతాన్ని సందర్శించనున్నట్లు ట్విట్టర్‌లో తెలిపారు.

పవన్ తో ఆలీ పోటీ.. స్థాయి చూసుకోవాలిగా
సినీ నటుడు, జనసేన నాయకుడు పృథ్వీరాజ్ నేడు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా ఆయన సోమవారం ఉదయం విఐపీ దర్శనంలో స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించడంతో పాటు మొక్కులు కూడా చెల్లించుకున్నారు. ఈ నేపథ్యంలో పృథ్వీరాజ్ మీడియాతో మాట్లాడుతూ.. ” స్వామివారిని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గురించి వస్తున్న వార్తలు ఖండించిన పృథ్వీరాజ్
పవన్ కళ్యాణ్ దగ్గరికి దూతల పంపించారని అని చెప్పడం అంతా పబ్లిసిటీ స్టంట్ అని అన్నారు. పవన్ కు, కేసీఆర్ డబ్బులు పంపించాడని వస్తున్న వార్తలో నిజం లేదని, కేసీఆర్ గారికి ఏమన్నా డబ్బులు ఏమైనా ఊరికే దొరుకుతున్నాయా, అయినెందుకు పంపిస్తాడు అని ప్రశ్నించారు. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ గురించి పృథ్వీరాజ్ పలు ఆసక్తికరమైన విషయాలను చెప్పుకొచ్చారు.

ఆ రీమేక్ పైనే నాగ్ ఆశలన్నీ.. వర్క్ అవుట్ అయ్యేనా..?
టాలీవుడ్ సీనియర్ హీరోలు.. చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్.. వరుస సినిమాలు, పాన్ ఇండియా సినిమాలు అని దూసుకుపోతుంటే.. అక్కినేని నాగార్జున మాత్రం నెమ్మదిగా అడుగులు వేస్తున్నాడు. ఘోస్ట్ వచ్చి దాదాపు 6 నెలలు గడిచిపోయాయి. ఇప్పటివరకు నాగ్ నుంచి తదుపరి సినిమా ప్రకటన వచ్చింది లేదు. అయితే సినిమాల విషయాలలో ఆచితూచి అడుగులు వేస్తున్న నాగ్ ప్రస్తుతం రచయిత ప్రసన్న కుమార్ బెజవాడను దర్శకుడుగా పరిచయం చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమా మలయాళ మూవీకి రీమేక్ అంట. కథను మాత్రం తీసుకొని తెలుగు నేటివిటీకి తగ్గట్టు మార్పులు చేయనున్నారట. ఇంతకూ ఆ రీమేక్ సినిమా ఏంటి అంటే మలయాళంలో సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న ‘పెరింజు మరియమ్ జోస్’. జోజు జార్జ్ హీరోగా నటించిన ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ నాగ్ బాగా నచ్చడంతో పాటు తెలుగువారు కూడా మెచ్చుకుంటారని నాగ్ ఈ రీమేక్ హక్కులను కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఈ చిత్రంలో నాగ్ తో పాటు మరో కుర్ర హీరోలు కూడా నటిస్తున్నారట. కీలక పాత్రలో అల్లరి నరేష్, మరొక ముఖ్య పాత్రలో రాజ్ తరుణ్ నటిస్తున్నట్లు చెప్తున్నారు. ఇక ఈ విషయం తెలియడంతో ఇప్పటి నుంచే ఈ సినిమాపై అంచనాలు మొదలయ్యాయి. వచ్చే నెల మొదటివారంలో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుందని సమాచారం. మరి ఈ రీమేక్ కోసం నాగ్ మొట్ట మొదటిసారి కుర్ర హీరోలతో జత కడుతున్నాడు. ఈ సినిమాపై నాగ్ ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. మల్టీస్టారర్ అని చెప్పలేం కానీ, ఈ కుర్ర హీరోలు కూడా మంచి సినిమాలు చేసినవారే.. దీంతో వీరి కాంబో అదిరిపోతుందని టాక్. మరి ఈ ఏడాది నాగ్ ఈ రీమేక్ తో ఏమైనా హిట్ అందుకుంటాడేమో చూడాలి.