NTV Telugu Site icon

Top Headlines @ 9 AM: టాప్‌ న్యూస్‌

Top Headlines @ 9 Am

Top Headlines @ 9 Am

నేడు ప్రీతి స్వగ్రామం గిర్నితండాలో అంత్యక్రియలు
వరంగల్‌లో ఆత్మహత్యాయత్నం చేసిన కేఎంసీ పీ.జీ వైద్య విద్యార్ధిని ప్రీతి మృతి చెందింది. మెడికల్ విద్యార్థిని డాక్టర్ డి ప్రీతి ఆదివారం మృతి చెందినట్లు నిజాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్) వైద్యులు ప్రకటించారు. ఈ మేరకు నిమ్స్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ సత్యన్‌రాయణ విడుదల చేసిన బులెటిన్‌లో, “మల్లిపుల్‌ విభాగాల నిపుణులైన వైద్యుల బృందం నిరంతర ప్రయత్నాలు చేసినప్పటికీ, డాక్టర్ ప్రీతిని రక్షించలేకపోయారు. ఫిబ్రవరి 26, 2023 రాత్రి 9.10 గంటలకు మరణించినట్లు ప్రకటించారు.” కాగా, గాంధీ ఆసుపత్రిలో ప్రీతి మృతదేహానికి పోస్టుమార్టం జరిగింది. అనంతరం గాంధీ నుంచి వరంగల్‌కు ప్రీతి మృతదేహం తరలించారు. పోలీసు భద్రత మధ్య ప్రీతి మృతదేహం వరంగల్‌కు తరలించారు పోలీసులు. అయితే.. నేడు ప్రీతి స్వగ్రామం గిర్నితండాలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

అన్నదాతలకు గుడ్‏న్యూస్.. నేడే అకౌంట్లోకి డబ్బులు
అన్నదాతల ఖాతాల్లోకి రూ.16,800 కోట్ల రూపాయల నిధులు వచ్చి చేరనున్నాయి. పీఎం కిసాన్‌ యోజనలో భాగంగా ప్రధాని ఈ నిధులను విడుదల చేయనున్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ నేడు రబీ పంటల కోసం ప్రధానమంత్రి-కిసాన్ పథకం కింద 8 కోట్ల మంది అర్హులైన రైతులకు రూ.16,800 కోట్ల విలువైన 13వ విడత ఆర్థిక ప్రయోజనాలను విడుదల చేయనున్నారు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కింద అర్హులైన రైతులకు ప్రతి నాలుగు నెలలకు రూ.2,000 చొప్పున మూడు సమాన వాయిదాలలో సంవత్సరానికి రూ.6,000 ఆర్థిక ప్రయోజనం అందించబడుతుంది. ఈ నిధి నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు బదిలీ చేయబడుతుంది. ఈ పథకం ఫిబ్రవరి 2019లో ప్రారంభించబడింది కానీ డిసెంబర్ 2018 నుంచే అమలులోకి వచ్చింది. కర్ణాటకలోని బెలగావిలో జరిగే కార్యక్రమంలో ప్రధాని 13వ విడతను విడుదల చేస్తారని ఆదివారం ఒక అధికారిక ప్రకటన తెలిపింది.పీఎం కిసాన్, జల్ జీవన్ మిషన్ లబ్ధిదారులతో కూడిన లక్ష మందికి పైగా హాజరయ్యే అవకాశం ఉంది. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌, వ్యవసాయ శాఖ కార్యదర్శి మనోజ్‌ అహుజా కూడా హాజరుకానున్నారు. పీఎం కిసాన్‌ పథకం కింద 11వ, 12వ విడతలు మే, అక్టోబర్ 2022లో విడుదల చేయబడ్డాయి. ఇప్పటివరకు ఈ పథకంలో 11 కోట్ల మందికి పైగా రైతులకు రూ.2.25 లక్షల కోట్ల నిధులను పంపిణీ చేసినట్లు పేర్కొన్నారు.

మేఘాలయ, నాగాలాండ్ అసెంబ్లీ ఎన్నికల పోరు.. ప్రారంభమైన పోలింగ్
హై-వోల్టేజ్ ప్రచారాల తర్వాత, రెండు కీలక ఈశాన్య రాష్ట్రాలైన మేఘాలయ, నాగాలాండ్‌లలో ఎన్నికల పోరు తుదిదశకు చేరుకుంది. ఎందుకంటే ఓటర్లు అభ్యర్థుల భవితవ్యాన్ని సోమవారం నిర్ణయిస్తారు. రెండు రాష్ట్రాల్లోనూ ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 4 గంటల వరకు కొనసాగనుంది. మేఘాలయలో 10.99 లక్షల మంది మహిళలు, 10.68 లక్షల మంది పురుషులతో సహా 21 లక్షల (21,75,236) మంది ఓటర్లు 369 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని నిర్ణయిస్తారు. రాష్ట్రంలో దాదాపు 81,000 మంది మొదటి సారి ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. రాష్ట్రంలోని 59 అసెంబ్లీ నియోజకవర్గాల్లోని 3,419 పోలింగ్‌ కేంద్రాల్లో పోలింగ్‌ జరగనుంది. మేఘాలయలోని 60 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 36 ఖాసీ, జైంతియా హిల్స్ ప్రాంతంలో ఉండగా, 24 గారో హిల్స్ ప్రాంతంలో ఉన్నాయి. 60 నియోజకవర్గాలకు గానూ 369 మంది అభ్యర్థులు బరిలో ఉండగా 36 మంది మహిళలు ఉన్నారు. మొత్తం అభ్యర్థుల్లో 44 మంది స్వతంత్రులుగా పోటీ చేస్తున్నారు. తిరిగి అధికారంలోకి రావాలని అధికార నేషనల్ పీపుల్స్ పార్టీ (NPP) చూస్తోంది. 60 స్థానాలున్న మేఘాలయ శాసనసభ ప్రస్తుత పదవీకాలం మార్చి 15తో ముగియనుంది. రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు మెజారిటీ 31. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో అధికార నేషనల్ పీపుల్స్ పార్టీ (ఎన్‌పీపీ)కి 19 సీట్లు, కాంగ్రెస్‌కు 21 సీట్లు, భారతీయ జనతా పార్టీ (బీజేపీ) రెండు సీట్లు గెలుచుకోగలిగింది. యునైటెడ్ డెమోక్రటిక్ పార్టీ (యూడీపీ) ఆరు స్థానాలను కైవసం చేసుకుంది.కాంగ్రెస్ అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ యూడీపీ, బీజేపీ ఇతర ప్రాంతీయ పార్టీల మద్దతుతో ఎన్‌పీపీ నేతృత్వంలోని మేఘాలయ డెమోక్రటిక్ అలయన్స్ (MDA) ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.

మానవపుర్రె కోసం స్మశానంలో తవ్వకాలు.. ఇద్దరు అరెస్ట్
టెక్నాలజీ ఎంతగా అభివృద్ధి చెందినా పాత ఆనవాళ్ళు, మూఢాచారాలు మాత్రం మానడంలేదు. ఎక్కడో చోట క్షుద్రపూజలు, చేతబడుల ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. తాంత్రికుడి సలహా మేరకు స్మశాన వాటిక నుండి మానవ దేహాన్ని వెలికి తీయడానికి ప్రయత్నించినందుకు ఇద్దరు వ్యక్తులను ఆదివారం ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. గోపాల్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అరుహాబాద్ గ్రామంలో స్మశాన వాటికను తవ్వుతుండగా గ్రామస్థులు నిందితులను పట్టుకున్నారు. నిందితుల్లో ఒకరు తన కుమార్తె అనారోగ్యంతో ఉండడంతో తాంత్రికుడి వద్దకు వెళ్లాడు. దుష్ట ఆత్మ నుండి బయటపడటానికి కర్మల కోసం మానవ పుర్రెను ఏర్పాటు చేయమని తాంత్రికుడు అడిగాడు. ఆ వ్యక్తి స్నేహితుడి సహాయం తీసుకున్నాడని, సుమారు 11 రోజుల క్రితం తమ గ్రామంలోని స్మశానవాటికలో ఒక వ్యక్తిని ఖననం చేసినట్లు తెలియడంతో, వారు శనివారం రాత్రి అక్కడికి చేరుకుని భూమిని తవ్వడం ప్రారంభించారని పోలీసులు తెలిపారు. ఇద్దరు వ్యక్తులను గ్రామస్థులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నట్లు సబ్ డివిజనల్ పోలీసు అధికారి శశాంక శేఖర్ బ్యూరా తెలి

ఆలయంలో ఆచారాలను నిర్వహించేందుకు రోబోటిక్ ఏనుగు.. తొలిసారిగా..
కేరళలో మొట్టమొదటిసారిగా ఆచారాలను నిర్వహించేందుకు యాంత్రికమైన ఏనుగును ఓ ఆలయంలోని దేవునికి అంకితం చేశారు. ఆ రోబోటిక్ ఏనుగును రోజువారీ ఆచారాలను నిర్వహించడం కోసం వినియోగించనున్నారు. కేరళలో గల త్రిసూర్‌లోని శ్రీకృష్ణ ఆల‌యంలో రోబో ఏనుగును ఏర్పాటు చేశారు. అయితే ఈ ఏనుగు అచ్చం నిజం ఏనుగులాగే ఉంటుంది. కేరళలో ఇలాంటి రోబో ఏనుగును కలిగివున్న ఆలయం ఇదొక్కటే కావడం గమనార్హం. ఈ రోబో ఏనుగుకు ‘ఇరింజదపల్లి రామన్’ అని నామకరణం చేశారు. ఇనుప చట్రానికి రబ్బరు తొడుగు వేసి ఈ ఏనుగును రూపొందించారు. దీని బరువు 800 కిలోలు. జంతు హక్కుల ఉద్యమ సంస్థ ‘పెటా’కు చెందిన కొందరు ఈ రోబోటిక్ ఏనుగును ఆలయానికి బహూకరించారు. ఆలయ వంశపారంపర్య అర్చకుడు రాజ్ కుమార్ నంబూద్రి ఈ రోబో ఏనుగు గురించి చెబుతూ, ఇది నిజం ఏనుగులాగే తొండం ఊపుతుందని, చెవులను కదుల్చుతుందని వివరించారు. మావటి ఓ బటన్ నొక్కితే తొండంతో నీళ్లు విరజిమ్ముతుందని వెల్లడించారు. ఇలాంటి పనులు చేసేందుకు ఈ ఏనుగు లోపల కొన్ని ఎలక్ట్రిక్ మోటార్లు అమర్చారు. దీనిపై ఆలయ అధికారులు స్పందిస్తూ, సాధారణ ఏనుగులను పోషించడం చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం అని, వాటితో కొన్నిరకాల ఇబ్బందులు కూడా ఉన్నాయని వివరించారు. ఏనుగులను హింసించడాన్ని నిరోధించే క్రమంలో, ఈ రోబో ఏనుగు ఒక వినూత్న ముందడుగుగా భావిస్తున్నామని తెలిపారు. ఇతర దేవాలయాలు కూడా ఇదే బాటలో నడవాలని కోరుకుంటున్నట్టు పేర్కొన్నారు.

సుబ్బరాజు… తరగని తపన!
తనదైన అభినయంతో జనాన్ని ఆకట్టుకుంటున్న సుబ్బరాజు పాదం బంగారం అంటూ ఉంటారు సినీజనం. పరికించి చూస్తే అది నిజమే అనిపిస్తుంది. టాలీవుడ్ లో టాపు లేపిన బ్లాక్ బస్టర్స్ లో సుబ్బరాజు నటించారు. మహేశ్ బాబు ‘పోకిరి’ చెరిగిపోని చరిత్ర సృష్టించింది. ఇక రాజమౌళి ‘బాహుబలి’ సిరీస్ రికార్డుల గురించి చెప్పక్కర్లేదు. మళ్ళీ టాలీవుడ్ కు ఓ ఊపు తీసుకు వచ్చిన చిత్రంగా బాలకృష్ణ ‘అఖండ’ నిలచింది. ఈ యేడాది సంక్రాంతి విన్నర్ గా చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’ జేజేలు అందుకుంది. ఈ చిత్రాలన్నిటా సుబ్బరాజు నటించారు. ఈ కోణంలోనే ఆయన సన్నిహితులు ‘మా వాడు గోల్డెన్ లెగ్’ అంటూ ఉంటారు. అయితే సుబ్బరాజు మాత్రం ఇవేవీ పట్టించుకోరు. తనకు లభించిన పాత్రలో పరకాయ ప్రవేశం చేయాలని, వైవిధ్యం ప్రదర్శించాలనీ తపిస్తూ ఉంటారు. ఏ తరహా పాత్రనైనా పోషించి మెప్పించాలన్నదే సుబ్బరాజు తాపత్రయం! సుబ్బరాజు 1977 ఫిబ్రవరి 27న పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో జన్మించారు. సుబ్బరాజు మేథ్స్ లో డిగ్రీ పట్టా పొంది కంప్యూటర్ కోర్సు చేశాక, హైదరాబాద్ ‘డెల్’ కంప్యూటర్స్ లో కొంతకాలం పనిచేశారు. సుబ్బరాజు చిత్రసీమ ప్రవేశం చిత్రంగానే జరిగింది. ‘డెల్’లో పనిచేస్తున్న రోజుల్లో దర్శకుడు కృష్ణవంశీ అసిస్టెంట్ ఒకరు సుబ్బరాజు వద్దకు వచ్చి, తమ డైరెక్టర్ పర్సనల్ కంప్యూటర్ పాడయిందని, బాగు చేయమని కోరాడు. అలా కృష్ణవంశీ ఆఫీసుకు వెళ్ళిన సుబ్బరాజుకు అనుకోకుండా ‘ఖడ్గం’ చిత్రంలో ఓ చిన్న పాత్ర పోషించే అవకాశం లభించింది. ఆ సినిమా తరువాత పూరి జగన్నాథ్ ‘అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి’లో హీరోతో బాక్సింగ్ రింగ్ లో తలపడే ప్రత్యర్థి పాత్ర పోషించారు. ఈ సినిమా సుబ్బరాజుకు మంచి మార్కులు సంపాదించి పెట్టింది. వరుసగా “శ్రీ ఆంజనేయం, నేనున్నాను, ఆర్య, సాంబ” చిత్రాలలో గుర్తింపు ఉన్న పాత్రల్లో కనిపించి మెప్పించారు. ఆ తరువాత పలు అవకాశాలు సుబ్బరాజును పలకరించాయి. పూరి జగన్నాథ్ తరువాత హీరో రవితేజ కూడా సుబ్బరాజును బాగా ప్రోత్సహించారు. తన దరికి చేరిన ప్రతీపాత్రకు న్యాయం చేసేందుకు ప్రయత్నించారు సుబ్బరాజు. మాతృభాష తెలుగులోనే కాదు, తమిళ, మళయాళ, కన్నడ, హిందీ చిత్రాల్లోనూ సుబ్బరాజు నటించి అలరించారు. రాబోయే చిత్రాల్లోనూ విలక్షణమైన పాత్రల్లో కనిపించనున్నారు సుబ్బరాజు.