ఆర్టీసీ బస్సును నడిపిన కొడాలి నాని.. వైరల్‌గా మారిన వీడియో
నేతలు ఏదైనా చేస్తే.. అది వైరల్‌గా మారిపోతోంది.. ఎన్నికల ప్రచార పర్వంలోనే కాదు.. కొత్త పథకాలను ప్రారంభించినప్పుడు.. ఇంకా ఏదైనా కొత్తగా ఓపెన్ చేసినప్పుడు.. తమలోని స్కిల్‌ను బయటపెట్టేస్తుంటారు.. తాజా, మాజీ మంత్రి, గుడివాడ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కొడాలి నాని చేసిన పని ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారిపోయింది.. ప్రతీరోజూ ప్రతిపక్షాలపై తీవ్ర పదజాలంతో విరుచుకుపడే కొడాలి నాని.. ఒక్కసారిగా ఆర్టీసీ డ్రైవర్ అవతారం ఎత్తేశారు.. చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేష్ లాంటి నేతలపై పవర్ పంచ్‌లు విసిరే కొడాలి.. స్టీరింగ్ పట్టారు.. ఇప్పుడా వీడియో వైరల్ అవుతోంది.. ఇంతకీ, కొడాలి నాని ఆర్టీసీ బస్సును ఎందుకు నడపాల్సి వచ్చింది అనే వివరాల్లోకి వెళ్తే.. కృష్ణాజిల్లా గుడివాడ ఆర్టీసీ డిపో పరిధిలో కొత్తగా ఐదు హైర్ బస్సులను ప్రారంభించారు స్థానిక ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొడాలి నాని.. అంతేకాదండోయ్ ఇదే సమయంలో తనలో ఉన్న డ్రైవింగ్ స్కిల్‌ను ప్రదర్శించారు.. నూతనంగా ప్రారంభించిన బస్సును పట్టణ ప్రధాన రహదారుల్లో స్వయంగా నడిపారు.. అయితే, ఆ దృశ్యాలను కెమెరాలో సంబంధించి సోషల్ మీడియాలో వదలడంతో ఇప్పుడు వైరల్‌గా మారిపోయింది.. ఇక, గుడివాడ నుండి బంటుమిల్లి, కైకలూరు మధ్య నూతన సర్వీసులను ప్రారంభించి కొడాలి నాని.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్టాండర్డ్ ఆఫ్ ఇండియా స్కీమ్ కింద దళిత సోదరులు ఏర్పాటు చేస్తున్న బస్సులను ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందన్నారు.. దళిత వర్గాల శ్రేయస్సుకు ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎంతో కృషి చేస్తున్నారని ఈ సందర్భంగా ప్రశంసలు కురిపించారు గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని.
నేడు మల్లన్న సాగర్‌కు పంజాబ్ సీఎం
నేడు సిద్దిపేట జిల్లాలో పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మాన్ పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు రోడ్డు మార్గాన హైదరాబాద్ నుంచి గజ్వేల్ కి బయలుదేరానున్న సీఎం భగవంత్ సింగ్.. ఉదయం 11 గంటలకు కొండపోచమ్మ రిజర్వాయర్ ని, మల్లన్నసాగర్, 11.30 గంటలకు మర్కుక్ పంప్ హౌస్, పాండవుల చెరువును పరిశీలించనున్నారు. పంజాబ్ సీఎంతో కలిసి సీఎం కేసీఆర్ కూడా సిద్దిపేట జిల్లాలో పర్యటిస్తారని సమాచారం. కాళేశ్వరం ప్రాజెక్టు, భూగర్భ జలాల పెరుగుదల, మిషన్ కాకతీయ గురించి పంజాబ్ సీఎం బృందానికి తెలియజేయడం ఈ పర్యటన ముఖ్య ఉద్దేశం. మధ్యాహ్నం పర్యటన ముగించుకుని తిరిగి హైదరాబాద్ బయలుదేరానున్నారు పంజాబ్ సీఎం. ఈ సందర్భంగా.. రాష్ట్రంలో భూగర్భ జలాల పరిరక్షణకు గత కొన్నేళ్లుగా చేపట్టిన చర్యలను పంజాబ్ సీఎం, ఆయన బృందం పరిశీలించనుంది. మిషన్ కాకతీయ కింద చెరువుల పునరుద్ధరణ, చెక్ డ్యాంల నిర్మాణం తదితరాలు, వాటి ఫలితాలను క్షేత్రస్థాయిలో ఈ బృందంలోని అధికారులు అధ్యయనం చేయనున్నారు. పంజాబ్‌లో భూగర్భ జలాల కొరత ఉన్న నేపథ్యంలో రాష్ట్రంలో భూగర్భ జలాల పరిరక్షణ కోసం తీసుకున్న చర్యలను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్, అధికారులు స్వయంగా పరిశీలించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నీటిపారుదల ప్రాజెక్టుల్లో కొన్నింటిని పరిశీలించే అవకాశం ఉంది.
మోడీ అలా చేస్తే.. బీఆర్ఎస్ లో ఒక్కరైనా మిగిలేవారా?
మహేశ్వరం నియోజకవర్గం అమీర్ పేట స్ట్రీట్ కార్నర్ మీటింగ్ లో బండి సంజయ్ ఫైర్… గ్రామాల అభివ్రుద్ధి కోసం, ప్రజా సమస్యలు పరిష్కరానికి నిధులివ్వాలని అడుగుతున్న ప్రజా ప్రతినిధులను బీఆర్ఎస్ లో చేరితేనే నిధులిస్తామంటూ కేసీఆర్ ప్రభుత్వం బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ మండి పడ్డారు. ‘‘రాష్ట్రంలోని పంచాయతీల అభివ్రుద్ధికి నిధులిస్తోంది కేంద్ర ప్రభుత్వమే. మీ లెక్క (బీఆర్ఎస్ నేతలను ఉద్దేశించి) నరేంద్రమోదీ బీజేపీలోనే చేరితేనే పంచాయతీలకు నిధులిస్తామని చెబితే… బీఆర్ఎస్ లో ఒక్కరైనా మిగిలేవారా?’’అంటూ ప్రశ్నించారు. మహేశ్వరం మండలం అమీర్ పేటలో బుధవారం రాత్రి పొద్దుపోయాక నిర్వహించిన స్ట్రీట్ కార్నర్ మీటింగ్ లో బండి సంజయ్ పాల్గొని ప్రసంగించారు. ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మనోహర్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు బొక్క నర్సింహారెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి తూళ్ల వీరేందర్ గౌడ్, కార్యవర్గ సభ్యులు అందెల శ్రీరాములు యాదవ్, ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు కొప్పు భాష, మండలాధ్యక్షులు మాధవాచారి, సర్పంచ్ శ్రీశైలం, నందీశ్వర్, యాదీశ్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా బండి సంజయ్ ఏమన్నారంటే..
త్రిపురలో త్రిముఖ పోరు.. ప్రారంభమైన పోలింగ్
త్రిపుర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ గురువారం కట్టుదిట్టమైన భద్రత మధ్య ప్రారంభమైంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఓటింగ్ సాయంత్రం 4 గంటల వరకు కొనసాగనుంది. ఎన్నికల కమిషన్ ప్రకారం.. 28.14 లక్షల మంది ఓటర్లు, వీరిలో 14,15,233 మంది పురుషులు, 13,99,289 మంది మహిళా ఓటర్లు, 62 మంది థర్డ్ జెండర్ ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. 3,337 పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ జరుగుతోంది. ఎన్నికలకు తగిన భద్రతా ఏర్పాట్లు చేశారు. రాష్ట్రంలో మొత్తం 97 మహిళా పోలీసు స్టేషన్లు ఉన్నాయి. ఇందులో 18-19 ఏళ్ల మధ్య 94,815 మంది ఓటర్లు, 22-29 ఏళ్లలోపు 6,21,505 మంది ఓటర్లు ఉన్నారు. అత్యధికంగా 40-59 ఏళ్ల మధ్య 9,81,089 మంది ఓటర్లు ఉన్నారు. 60 అసెంబ్లీ స్థానాల్లో 259 మంది అభ్యర్థుల భవితవ్యం నేడు ఖరారు కానుంది. ఇన్నాళ్లు బద్ధ ప్రత్యర్థులుగా ఉన్న కాంగ్రెస్, సీపీఎంలు అధికార బీజేపీని ఓడించేందుకు ఎన్నికలకు ముందు పొత్తు కుదుర్చుకోగా, అధికారాన్ని నిలబెట్టుకోవాలని చూస్తున్న బీజేపీ ఇండిజినస్ పీపుల్స్ ఫ్రంట్‌తో కలిసి పోటీ చేయడంతో ముక్కోణపు పోటీ నెలకొంది. త్రిపుర (IPFT) హంగ్ అసెంబ్లీ దృష్టాంతంలో కింగ్‌మేకర్‌గా పరిగణించబడుతున్న టిప్రా మోతా, 2021లో రాజ వంశీయుడు ప్రద్యోత్ కిషోర్ దెబ్బర్మ కొత్త పార్టీని పెట్టి ఈ ఎన్నికల్లో పోటీలో నిలిచారు. . అదే సమయంలో, తృణమూల్ కాంగ్రెస్ కూడా అభ్యర్థులను నిలబెట్టింది. బీజేపీ 55 స్థానాల్లో, దాని మిత్రపక్షమైన ఐపీఎఫ్‌టీ 6 స్థానాల్లో పోటీ చేస్తున్నాయి. కానీ మిత్రపక్షాలు రెండూ గోమతి జిల్లాలోని ఆంపినగర్ నియోజకవర్గంలో అభ్యర్థులను నిలబెట్టాయి. వామపక్షాలు వరుసగా 47, కాంగ్రెస్ 13 స్థానాల్లో పోటీ చేయనున్నాయి. మొత్తం 47 స్థానాల్లో సీపీఎం 43 స్థానాల్లో, ఫార్వర్డ్ బ్లాక్, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (సీపీఐ), రివల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ (ఆర్‌ఎస్‌పీ) ఒక్కో స్థానంలో పోటీ చేయనున్నాయి. సరిహద్దు రాష్ట్రంలోని 60 మంది సభ్యుల అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో 28 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
కర్కశత్వం.. అత్యాచారాలు చేసి, ఇనుప సంకెళ్లతో బంధించి..
‘మాయమైపోతున్నడమ్మా.. మనిషన్నవాడు.. మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు..’ అంటూ సినీగేయ రచయిత ఏ ప్రేరణతో రాశారో తెలియదు తెలియదు కానీ, ప్రస్తుత సమాజంలో కొందరు అమానుషంగా ప్రవర్తిస్తున్నారు. మహిళల పట్ల కనీసం కనికరం లేకుండా ప్రవర్తిస్తున్నారు. కామవాంఛను తీర్చుకోవడం కోసం దిగజారి నేరాలకు పాల్పడుతున్నారు. అనాధాశ్రమం అని పెట్టి అబలలపై నిర్వాహకులు అత్యాచారాలకు పాల్పడిన అత్యంత అమానుషమైన ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. అనాధాశ్రమంలోని మానసిక వికలాంగ, భర్త కోల్పోయిన మహిళలపై వరుసగా అత్యాచారాలు చేసిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. లొంగని మహిళలను సంకెళ్లతో కట్టేసి వారిపైకి కోతులను ఉసిగొల్పి కరిపించారు. ఈ దారుణ ఘటన తమిళనాడు రాష్ట్రం విల్లుపురం జిల్లాలో చోటుచేసుకుంది. గుండల పులియూర్ గ్రామంలో ఉన్న అన్బు జ్యోతి అనాధాశ్రమంలోని మానసిక వికలాంగ మహిళలకు మత్తుమందిచ్చి రాడ్లతో దాడి చేసి నిర్వాహకులు అత్యాచారం చేశారు. ఆశ్రమంలో ఉన్న 142లో పురుషులు109 ఉంటే మహిళల 33 మంది.. వారిలో ప్రస్తుతం 16 మంది మిస్సింగ్ అయినట్లు గుర్తించిన రెవెన్యూ, పోలీసు అధికారులు గుర్తించారు. తనకు మత్తు మందు ఇచ్చి అత్యాచారం చేయడమేకాకుండా, ఇనుప సంకెళ్లతో కట్టేసి కోతులతో కరిపించారని ఒడిశాకు చెందిన మహిళ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసు, రెవెన్యూ అధికారులు విచారణ చేపట్టారు. ఆశ్రమంలోని వారిని అధికారులు ఆసుపత్రికి తరలించారు. అక్రమాలపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన వెలుగులోకి రావడంతో నిందితులను కఠినంగా శిక్షించాలని మానవ హక్కుల సంఘాలు, స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
పసిడి ప్రేమికులకు గుడ్‌న్యూస్.. మరింత పడిపోయిన బంగారం ధర
పసిడి ప్రేమికులకు శుభవార్త చెబుతూ వరుసగా దిగివస్తున్నాయి బంగారం ధరలు.. దేశీయ బులియన్ మార్కెట్‌లో రెండు రోజులుగా పతనమైన బంగారం ధర ఈరోజు కూడా మరింత కిందకు దిగివచ్చింది.. క్రితం రోజు ట్రేడింగ్‌లో పెరిగిన వెండి ధర ఈరోజు స్వల్పంగా తగ్గింది. క్రితం వారం ట్రేడింగ్‌లో బంగారం, వెండి ధరలు హెచ్చుతగ్గులను కొనసాగించాయి. మొత్తంగా ఫిబ్రవరి నెల లావాదేవీల్లో ధరల హెచ్చుతగ్గుల ట్రెండ్ కొనసాగింది. ఈరోజు కిలో వెండి ధర రూ.450 తగ్గింది.. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.52,400 వద్ద కొనసాగుతోంది. 24 క్యారెట్ల బంగారం ధర కూడా ఎటువంటి మార్పు లేకుండా రూ.57,160 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ. 450. తగ్గడంతో రూ.69,950 దగ్గర ట్రేడ్ అవుతోంది. ప్రధాన నగరాల్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ప్రస్తుతం ఇలా ఉన్నాయి.. చెన్నైలో రూ.57,980, ముంబైలో రూ.57,160, ఢిల్లీలో రూ.57,310, కోల్‌కతాలో రూ.57,160, బెంగళూరులో రూ.57,210, హైదరాబాద్‌లో రూ.57,160, కేరళలో రూ.57,160, పూణెలో రూ. 57,160, మంగళూరులో రూ. 57,210, మైసూర్‌లో రూ. 57,210, విజయవాడ, విశాఖపట్నంలో రూ.57,160గా ట్రేట్ అవుతుంది.. ఇక, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం విషయానికి వస్తే.. చెన్నైలో రూ 53,150, ముంబైలో రూ.52,400, ఢిల్లీలో రూ.52,550, కోల్‌కతాలో రూ.52,400, బెంగళూరులో రూ.52,450, హైదరాబాద్‌లో రూ.52,400, కేరళలో రూ.52,400, పూణేలో రూ.52,400, మంగళూరులో రూ. 52,450, మైసూర్‌లో రూ. 52,450, విజయవాడ, విశాఖపట్నంలో 52,400గా పలుకుతోంది. మరోవైపు వెండి ధరల విషయానికి వస్తే.. కిలో వెండి ధర బెంగళూరులో రూ.72,000, మైసూర్‌లో రూ. 72,000, మంగళూరులో రూ.72,000, ముంబైలో రూ.రూ.69,950, చెన్నైలో రూ.72,000, ఢిల్లీలో రూ.69,950., హైదరాబాద్‌లో రూ. 72,000, కోల్‌కతాలో రూ.69,950. విజయవాడ, విశాఖలో రూ.72,000గా పలుకుతోంది.
బ్యాంక్ లాకర్లపై ఆర్బీఐ కొత్త రూల్స్.. ఇక, అన్నీ దాయలేరు.!
బ్యాంక్ లాకర్లపై ఆర్బీఐ కొత్త రూల్స్ తీసుకొచ్చింది.. దొంగతనం, దోపిడీ, అగ్నిప్రమాదం మరియు ఇతర అవాంఛనీయ సంఘటనలను నివారించడానికి ప్రజలు తమ విలువైన వస్తువులను బ్యాంక్ లాకర్లలో ఉంచడానికి ఇష్టపడతారు. ఇందుకోసం వార్షిక అద్దె కూడా చెల్లిస్తున్నారు. ఒక్కసారి ఊహించుకోండి, లాకర్‌ను తెరిచినప్పుడు, అందులో ఉంచిన డబ్బు మొత్తం చెడిపోయినట్లు లేదా దొంగిలించబడినట్లు కనుగొనబడింది.. అయితే, బ్యాంకు కూడా దానికి బాధ్యత వహించడానికి నిరాకరిస్తే ఏమి జరుగుతుంది..? బాధితుడు భవిష్యత్‌పై పెట్టుకున్న ఆశలన్నీ ఆవిరి అవుతుంటాయి.. కానీ, ఇప్పుడు అలా జరగదు. లాకర్‌లో ఏర్పడిన నష్టానికి బ్యాంకులు తమ బాధ్యత నుండి తప్పుకునే అవకాశం లేదని ఆర్బీఐ చెబుతోంది. బ్యాంక్ లాకర్ భద్రతపై చర్యలు తీసుకోవాలని ఆర్బీఐని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఆ తర్వాత రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లాకర్ భద్రతపై కొత్త నిబంధనలను జారీ చేసింది. ఈ ఏడాది జనవరి 1 నుంచి ఆ నిబంధనలు అమల్లోకి వచ్చాయి. కొత్త నిబంధనల ప్రకారం, బ్యాంక్ లాకర్‌లో ఉంచిన కస్టమర్ యొక్క ఏదైనా విలువైన వస్తువులు పోగొట్టుకుంటే బ్యాంక్ మేనేజ్‌మెంట్ బాధ్యత వహిస్తుంది మరియు అతను లాకర్ అద్దెకు 100 రెట్లు వినియోగదారుకు చెల్లించాల్సి ఉంటుంది. కొత్త నిబంధనల ప్రకారం, బ్యాంకులో అగ్నిప్రమాదం, దొంగతనం-దోపిడీ లేదా మరేదైనా కారణాల వల్ల లాకర్‌లో ఉంచిన వస్తువులు దెబ్బతిన్నట్లయితే.. ఇందులో బ్యాంక్ నిర్లక్ష్యంగా ఉందని రుజువు అయినట్టే.. దీనికి బాధ్యత వహిస్తూ సదరు వినియోగదారుడికి పరిహారం చెల్లించవలసి ఉంటుంది. 1 జనవరి 2023 నుండి కొత్త లాకర్ ఒప్పందం అమల్లోకి వచ్చింది.. ఆర్‌బీఐ సూచనల మేరకు బ్యాంకులు ఈ ఏడాది నుంచి కొత్త లాకర్ (ఆర్‌బీఐ కొత్త రూల్స్ ఆన్ బ్యాంక్ లాకర్) ఒప్పందాన్ని కూడా విడుదల చేశాయి. లాకర్ సౌకర్యాన్ని పొందుతున్న వినియోగదారులందరూ మరియు బ్యాంకులు ఈ ఒప్పందంపై సంతకం చేయాల్సి ఉంటుంది.