ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ కు ఏపీ సీఎం చంద్రబాబు.. పార్టీ నేతలతో కీలక చర్చ..
టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇవాళ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌కు రానున్నారు. ఉదయం 11 గంటలకు పార్టీ నేతలతో కీలక సమావేశం ఏర్పాటు చేసినట్లు సమాచారం. జూబ్లీహిల్స్ నివాసం నుంచి ఎన్టీఆర్ భవన్ కు చంద్రబాబు ర్యాలీగా వెళ్లనున్నారు. తెలంగాణ టీడీపీ నేతలతో చంద్రబాబు సమావేశం కానున్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ రాజీనామా చేయడంతో తాత్కాలిక అధ్యక్షుడిగా బక్కని నర్సింహులు నియమితులయ్యారు. ప్రస్తుతం ఆయన తాత్కాలిక అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. పాతనగరం పురానా పూల్ ప్రాంతానికి చెందిన మరో కీలక నేత అరవింద్ కుమార్ గౌడ్ టీడీపీలో కొనసాగుతున్నారు. మాజీ హోంమంత్రి దేవేందర్ గౌడ్ మేనల్లుడు అరవింద్ కుమార్ గౌడ్ టీడీపీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. ఇంకా చాలా మంది నేతలు టీడీపీలోనే ఉన్నారు. ఇవాళ జరిగే ముఖ్యమైన సమావేశానికి వీరంతా హాజరుకానున్నట్లు సమాచారం. ఈ భేటీలో పార్టీకి కొత్త అధ్యక్షుడిని నియమించే అంశంపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు జిల్లాల వారీగా జిల్లాల వారీగా ఇన్‌చార్జులతో పాటు పార్టీ సభ్యత్వ నమోదుపై కూడా చర్చించనున్నట్లు టీడీపీ వర్గాలు తెలిపాయి. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అంశంపై కూడా చర్చిస్తారని చెబుతున్నారు. గతంలో టీడీపీలో పనిచేసి క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉన్న నేతలు ముందుగా యాక్టివ్ అవుతారనే టాక్ వినిపిస్తోంది.
ఏపీలో ఉచిత ఇసుక పంపిణీకి గ్రీన్ సిగ్నల్.. రేపటి నుంచే అమలు..!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రేపటి (సోమవారం) నుంచి ఉచిత ఇసుక విధానం అమల్లోకి రాబోతుంది. ఇప్పటికే సీఎం చంద్రబాబు ఆదేశాలతో అధికారులు ఈ ఉచిత ఇసుక విధానానికి సంబంధించిన కార్యాచరణను రెడీ చేశారు. ముందుగా రాష్ట్రంలోని అన్ని జిల్లాల నిల్వ కేంద్రాల్లో ఉన్న ఇసుక డంప్‌ల నుంచి ఇసుకను అందిస్తారు. అయితే, ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ఫ్రీగా ఇసుకను అందించాలని నిర్ణయం తీసుకుంది. కాగా, ప్రజల నుంచి కేవలం ఇసుక తవ్వకాల ఖర్చు, సీనరేజ్ మాత్రమే వసూలు చేయాలని పేర్కొనింది. ఉచిత ఇసుక విధానం తీసుకొచ్చిన నేపథ్యంలో అక్రమ తవ్వకాలు, అక్రమ రవాణా జరగకుండా స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో, విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌లు నిఘా ఉంచనున్నాయి. అయితే దగ్గర్లో ఉన్న వాగులు, వంకల నుంచి స్థానికులు ఎడ్ల బండ్లలో ఇసుకను తెచ్చుకునేందుకు ఛాన్స్ కల్పించారు. ఈ మేరకు ఏపీ సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ శనివారం.. అన్ని జిల్లాల కలెక్టర్లకు ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటి వరకు ఉన్న కాంట్రాక్టర్లు, జీసీకేసీ, ప్రతిమ ఇన్‌ఫ్రా పక్కకు తప్పుకున్నట్లు సీఎస్ చెప్పారు. మరోవైపు ఇప్పటికే రాష్ట్రంలో 43 లక్షల టన్నుల ఇసుక నిల్వలు ఉన్నట్లు గనుల శాఖ అధికారులు తెలిపారు. సోమవారం నుంచి ఈ నిల్వలను ప్రజలకు అందిస్తారు. రాబోయే 3 నెలలకు 88 లక్షల టన్నుల ఇసుక అవసరం ఉందన్నారు. సంవత్సరానికి 3. 20 కోట్ల టన్నుల ఇసుకకు డిమాండ్ పెరిగుతుందని అంచనా వేశారు. ఆయా జిల్లాల్లోని ఇసుక రీచ్‌లలో ఎంత ఇసుక అందుబాటులో ఉందో కలెక్టర్లు సోమవారం నుంచి ప్రకటిస్తారు. ఆ ఇసుకను ఎవరి పర్యవేక్షణలో అందజేయాలో ఆయా జిల్లాల్లో కలెక్టర్లు జిల్లా స్థాయి ఇసుక కమిటీలు ఏర్పాటు చేసి సమావేశంలో నిర్ణయిస్తారు.
నేడు పులివెందులలో వైఎస్ జగన్.. ప్రజలతో ముఖాముఖి..!
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇవాళ ( ఆదివారం ) పులివెందుల నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పులివేందులలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉంది. నిన్న మధ్యాహ్నం కడపకు చేరుకున్న వైఎస్ జగన్ కు వైసీపీ పార్టీ నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి నేరుగా రిమ్స్ కు వెళ్లి టీడీపీ కార్యకర్తల దాడిలో గాయపడిన వేంపల్లె గ్రామానికి చెందిన వైసీపీ పార్టీ కార్యకర్తను జగన్ పరామర్శించారు. ఇక, నేడు పులివెందులలో వైఎస్ జగన్ ప్రజలతో ముఖాముఖి భేటీ కానున్నారు. వైఎస్సాఆర్ కాంగ్రెస్ క్యాంప్ కార్యాలయంలో ప్రజల దగ్గర నుంచి వైఎస్ జగన్ నేరుగా వినతులను స్వీకరించనున్నారు. కాగా, జగన్ పులివెందులలో ఉంటారని తెలిసి ఇతర జిల్లాల నుంచి పార్టీ నేతలు, కార్యకర్తలు తరలి భారీగా తరలి వస్తున్నారు. ఈ సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తును సైతం ఏర్పాటు చేశారు. రేపు ఇడుపుల పాయలో దివంగత నేత, మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి సమాధి దగ్గర వైఎస్ జగన్ ప్రత్యేక ప్రార్థనాల్లో పాల్గొననున్నారు.
9వ తరగతి బాలికను హత్య చేసిన సైకో.. మృతురాలి ఇంటికి ఏపీ హోం మినిస్టర్
అనకాపల్లి జిల్లాలోని రాంబిల్లి మండలం పరిధిలోనీ కొప్పు గొండు పాలెంలో దారుణం చోటు చేసుకుంది. తొమ్మిదవ తరగతి చదువుతున్న విద్యార్థినిపై ఓ సైకో కత్తితో దాడి చేసి హత్య చేశాడు. అయితే, కొప్పుగొండు గ్రామంలో జులాయిగా తిరుగుతూ.. బాలికను ప్రేమ పేరుతో వేధించడంతో విషయం సదరు బాలిక తల్లిదండ్రులకు చెప్పింది.. దీంతో విద్యార్థి తల్లిదండ్రులు పోలీసులకు కంప్లైంట్ చేయడంతో.. ఆ సైకో సురేష్ పై ఫోక్సో కేసు పెట్టిన పోలీసులు జైలుకు పంపారు. 20 రోజుల క్రితం బెయిల్ పై బయటకు వచ్చిన సురేష్.. జైలుకు పంపించారని కక్ష మనస్సులో పెట్టుకుని ఈ ఘాతుకానికి సురేష్ పాల్పడ్డారు. నిన్న సాయంత్రం స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన మైనర్ బాలిక.. అప్పటికే రెక్కీ నిర్వహించి ఇంట్లోకి చొరబడిన సురేష్.. తన వెంట తెచ్చుకున్న కత్తితో ఆ తొమ్మిదవ తరగతి విద్యార్థి పీక కోసి పరార్ అయ్యాడు. అయితే, సంఘటన జరిగిన కొప్పుగుండపాలెం గ్రామానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత రాబోతున్నారు. మృతురాలి బంధువులను కలిసి పరామర్శించునున్నారు. విద్యార్థిని దారుణ హత్యకు గురవడంతో గ్రామంలో విషాదఛాయలు చోటు చేసుకున్నాయి. నిందితుడిని తమకు అప్పగించాలంటూ మృతురాలి తల్లిదండ్రులు, బంధువులు డిమాండ్ చేస్తున్నారు. బెయిల్ మీద బయటకు వచ్చిన తర్వాత ప్రాణహాని ఉందని పోలీసులకు ఫిర్యాదు చేసిన పోలీసులు పట్టించుకోలేదని బాధిత కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు సైకో సురేష్ కదలికల మీద నిఘా పెట్టుంటే తమ కూతురు ప్రాణం పోయిండేది కాదు అని విద్యార్థి తల్లిదండ్రులు వాపోతున్నారు. నిందితుడికి తక్షణమే శిక్ష పడకపోతే తాను కత్తితో పొడుకుని చచ్చిపోతాను అని బాలిక తండ్రి హెచ్చరించాడు.
నేడు గోల్కొండ ఎల్లమ్మ తల్లి బోనాలు.. భక్తులకు కోటలోకి ఫ్రీ ఎంట్రీ..
ఆషాఢ మాస బోనాల పండుగకు గ్రేటర్ నగరం కళకళలాడుతోంది. ఆదివారం గోల్కొండ కోటలోని ఎల్లమ్మ తల్లికి తొలి బోనం సమర్పించడంతో ఉత్సవాలు ప్రారంభమవుతాయి. డప్పువాయిద్యాలు, పోతరాజు విన్యాసాలు, శివసత్తుల పూనకాల మధ్య కోలాహలంగా ఊరేగింపు సాగుతుంది. పండుగ జరిగే అన్ని రోజులు భక్తులకు ప్రభుత్వం కోటలోకి ఉచిత ప్రవేశం కల్పించింది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని శాఖల అధికారులు ఏర్పాట్లు చేశారు. జీహెచ్‌ఎంసీ, పోలీస్, హెల్త్, ట్రాఫిక్, ఎలక్ట్రిసిటీ అధికారులు విధుల్లో పాల్గొంటారు. గోల్కొండ కోటలో మొత్తం 20 మొబైల్ టాయిలెట్లు, ఐదు హెల్త్ క్యాంపులు, మూడు అంబులెన్సులు అందుబాటులో ఉంచారు. వృద్ధులు, వికలాంగులకు బ్యాటరీ వాహనాలు ఏర్పాటు చేశారు. గోల్కొండ కోట పరిసర ప్రాంతాల్లో నెల రోజుల పాటు ప్రతి ఆది, గురువారాల్లో ట్రాఫిక్ మళ్లింపు ఉంటుంది. కోటకు వచ్చే భక్తులు రామ్ దేవ్ గూడ మక్కాయ్ దర్వాజా నుంచి వచ్చి రామ్ దేవ్ గూడలో పార్కింగ్ చేయాలని అదనపు కమిషనర్ (ట్రాఫిక్) తెలిపారు. లంగర్ హౌజ్ నుంచి గోల్కొండ కోటకు వచ్చే భక్తులు తమ వాహనాలను ఫతే దర్వాజా వద్ద పార్క్ చేయాలి. 7 టూంబ్స్ వైపు నుంచి వచ్చే వాహనాలను బంజారా దర్వాజ వద్ద ఆపాలని షేక్ పెటనాల సూచించారు. కోటలో మొత్తం 650 మంది పోలీసులు బందోబస్తు నిర్వహించనున్నారు. వీరిలో ఇద్దరు లా అండ్ ఆర్డర్ డీసీపీలు, ట్రాఫిక్ డీసీపీలు, ఏడుగురు ఏసీపీలు, 25 మంది సీఐలు, 55 మంది ఎస్సైలు, కానిస్టేబుళ్లు, హోంగార్డులతో పాటు అశ్విక దళం, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ సిబ్బంది విధుల్లో ఉంటారు.
దలైలామా 89వ జన్మదినాన్ని పురస్కరించుకుని శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోడీ
టిబెట్ ఆధ్యాత్మిక గురువు దలైలామా 89వ జన్మదినాన్ని పురస్కరించుకుని ప్రధాని నరేంద్ర మోడీ శుభాకాంక్షలు తెలిపారు. మోకాలి శస్త్రచికిత్స తర్వాత ఆయన త్వరగా కోలుకోవాలని ప్రధాని మోడీ ఆకాంక్షించారు. మోకాలి శస్త్రచికిత్స నుంచి కోలుకుంటున్న దలైలామా ప్రస్తుతం అమెరికాలో ఉన్నారు. ఆయన తన అధికారిక సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ట్విట్టర్ పోస్ట్‌లో, ‘దలైలామా 89వ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు నా శుభాకాంక్షలు. మోకాలి శస్త్రచికిత్స తర్వాత అతను త్వరగా కోలుకోవాలని, మంచి ఆరోగ్యం, దీర్ఘాయువు కోసం నేను ప్రార్థిస్తున్నాను.’ అంటూ రాసుకొచ్చారు.
దలైలామా ప్రపంచవ్యాప్తంగా అనుచరులను కలిగి ఉన్న ఆధ్యాత్మిక వ్యక్తి. 1959లో టిబెట్‌ను చైనా ఆక్రమించుకున్న తర్వాత అక్కడి నుంచి తప్పించుకుని భారత్‌లో ప్రవాస జీవితం గడుపుతున్నాడు. దలైలామా తన పుట్టినరోజు సందర్భంగా ఒక సందేశాన్ని విడుదల చేసి ప్రజలకు ఆరోగ్యం గురించి తెలియజేశారు. ఇందులో తాను శారీరకంగా ఆరోగ్యంగా ఉన్నానని, బుద్ధ భగవానుడి బోధనల పట్ల తన సేవను కొనసాగించాలని నిర్ణయించుకున్నానని చెప్పారు. ధర్మశాలలోని తన కార్యాలయం విడుదల చేసిన సందేశంలో, ‘నాకు ఇప్పుడు దాదాపు 90 ఏళ్లు, కానీ నా కాళ్ళలో కొద్దిగా అసౌకర్యం తప్ప, నాకు అనారోగ్యంగా అనిపించడం లేదు. మీ ప్రార్థనలకు టిబెట్‌లో, వెలుపల నివసిస్తున్న తోటి టిబెటన్లకు తన పుట్టినరోజున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అని చెప్పారు.
సూరత్‌లో కుప్పకూలిన ఐదంతస్తుల భవనం.. ఏడుకు చేరిన మృతుల సంఖ్య
గుజరాత్‌లోని సూరత్‌లో శనివారం ఘోర ప్రమాదం జరిగింది. ఇక్కడ సచిన్ పాలి గ్రామంలో ఐదంతస్తుల భవనం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో మరణించిన వారి సంఖ్య ఏడుకు చేరింది. పలువురు గాయపడినట్లు సమాచారం. ఘటనపై సమాచారం అందిన వెంటనే పోలీసు బృందం ఘటనా స్థలానికి చేరుకుంది. ఎన్‌డిఆర్‌ఎఫ్, ఎస్‌డిఆర్‌ఎఫ్ బృందాలు సహాయక చర్యల్లో నిమగ్నమై ఉన్నాయని ఓ అధికారి తెలిపారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఈ భవనం చాలా పురాతనమైనదని స్థానికులు తెలిపారు. అయినప్పటికీ 10-15 మంది అక్కడే ఉండిపోయారు. భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. ఆ సమయంలో పెద్ద శబ్దం వచ్చింది, దాని తర్వాత చుట్టూ దుమ్ము మాత్రమే కనిపించింది. స్థానిక ప్రజలు సంఘటనా స్థలానికి పరుగులు తీశారు. ఇల్లు పూర్తిగా దెబ్బతింది. దీంతో ప్రజలు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. అనంతరం ఒక బృందం ఘటనా స్థలానికి చేరుకుంది. కొద్దిసేపటికే ఎన్‌డిఆర్‌ఎఫ్, ఎస్‌డిఆర్‌ఎఫ్ బృందాలు కూడా ఘటనాస్థలికి చేరుకున్నాయి. ఈ ప్రమాదం తర్వాత రెస్క్యూ టీమ్ రాత్రంతా శిధిలాలను తొలగిస్తూనే ఉంది. భవనంలో మరికొంత మంది చిక్కుకుని ఉండొచ్చని ఆందోళన వ్యక్తం చేశారు. ఘటనా స్థలంలో గందరగోళ వాతావరణం నెలకొంది. దీంతో అక్కడ గుమికూడిన జనాన్ని అక్కడి నుంచి అధికారులు తొలగించారు. శాంతి, సహకారం కోసం విజ్ఞప్తి చేశారు. ప్రమాదం గురించి సమీపంలోని వ్యక్తుల నుండి సమాచారం సేకరించినట్లు అధికారి తెలిపారు. క్షతగాత్రులను విచారిస్తున్నారు. మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించనున్నారు. ప్రమాద సమాచారం కుటుంబ సభ్యులకు చేరింది. ఈ ప్రమాదంపై స్థానికులు మాట్లాడుతూ.. సూరత్‌లో ఇలాంటి ఇళ్లు చాలా ఉన్నాయని, ఏళ్ల తరబడి శిథిలావస్థలో ఉన్నాయన్నారు. అలాంటి ఇళ్లు ఎప్పుడైనా కూలిపోవచ్చు. అలాంటి ఇళ్ల జాబితా తయారు చేయాలి. అటువంటి గృహయజమానులు తమ ఇళ్లను ఎప్పటికప్పుడు మరమ్మతులు చేసేలా చూసుకోవాలి. ప్రమాదంపై విచారణ జరుపుతామని ఓ అధికారి తెలిపారు.
ధోని బర్త్డే స్పెషల్.. దేశ వ్యాప్తంగా ధోని సినిమా రీరిలీజ్..
నేడు టీమిండియా మాజీ కెప్టెన్ ఎమ్మెస్ ధోని 43 పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఎంఎస్ ధోని కి సంబంధించిన పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా కొందరు వీరాభిమానులు ధోని పుట్టినరోజు సందర్భంగా వివిధ కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నందిగామ పట్టణంలో ఏకంగా 100 అడుగుల కటౌట్ ఏర్పాటు చేసి మహేంద్రసింగ్ ధోని పై ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు. అంతేకాకుండా అనేక ప్రదేశలలో ధోని ఫ్యాన్స్ కొన్ని కార్యక్రమాలను ఏర్పాటు చేసినట్లు సమాచారం. ఇక నేడు ధోని పుట్టిన రోజు సందర్భంగా ఆయన ఫ్యాన్స్ కు స్పెషల్ గా సెలబ్రేట్ చేసుకునేందుకు అతడిపై చిత్రీకరించిన ” ధోని అన్‌టోల్డ్ స్టోరీ ” సినిమా రీ రిలీజ్ అవుతుంది. ఇందుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక ఇంకా అనేక రాష్ట్రాలలో ఎంపిక చేసిన థియేటర్లలో స్పెషల్ షోస్ వేస్తున్నారు. సినిమా సంబంధించి బుక్ మై షో లలో కూడా టికెట్స్ అందుబాటులో ఉన్నాయి. 2016లో విడుదలైన ఈ సినిమా అఖండ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ధోని సినిమాకు నీరజ్ పాండే దర్శకత్వం వహించారు. ధోని తన చిన్న తనం నుండి జరిగిన సంఘటనలను ఆధారంగా చేసుకుని 2011 వరల్డ్ కప్ గెలిచేదాక అతని లైఫ్ జర్నీ కళ్ళకు కట్టినట్లుగా సినిమాలో చూపించాడు దర్శకుడు. ఈ సినిమాలో ధోని పాత్రలో బాలీవుడ్ స్టార్, దివంగత యాక్టర్ సుశాంత్ సింగ్ రాజ్ పుత్ నటించాడు. ఆయన సరసన కియారా అద్వానీ, దిశ పటానీలు నటించారు.
గోల్డెన్ డకౌట్‌తో మొదలై.. సక్సెస్‌ఫుల్ కెప్టెన్‌గా! అదొక్కటి మాత్రం వెలితి
అతడి రాక భారత క్రికెట్‌కు వెలుగును తీసుకొచ్చింది.. చేజారుతున్న మ్యాచ్‌లు గెలవొచ్చనే ధీమా వచ్చింది.. మొదటి ప్రయత్నంలోనే పొట్టి ప్రపంచకప్ వచ్చింది.. స్వదేశంలోనే కాదు విదేశాల్లోనూ పంజా విసరగలమనే ఆత్మవిశ్వాసం దరిచేరింది.. మైదాంలో అద్భుతాలు మొదలయ్యాయి.. ఎన్నో ఏళ్లుగా ఊరిస్తొన్న వన్డే ప్రపంచకప్ సొంతమైంది.. టెస్ట్ టాప్ ర్యాంక్ దక్కింది.. భారత జట్టులో చోటుదక్కుతుందనే ధీమా యువ ఆటగాళ్లకు వచ్చింది.. బౌలర్లకు పూర్తి స్వేచ్ఛ వచ్చింది.. అతడి గురించి ఇలా చెప్పుకుంటే ఇంకా ఎన్నో ఉన్నాయి. అతడు ఎవరో ఈపాటికే అర్దమైపోయుంటుంది. అతడే ప్రపంచ మోస్ట్ సక్సెస్‌ఫుల్ కెప్టెన్ ఎంఎస్ ధోనీ. నేడు 43వ ఏట అడుపెడుతున్న సందర్భంగా మహీకి ప్రముఖ తెలుగు ఛానెల్ ‘ఎన్టీవీ’ తరఫున ప్రత్యేక జన్మదిన శుభాకాంక్షలు. దేశవాళీల్లో సిక్సులతో దుమ్ములేపిన ఎంఎస్ ధోనీ.. సౌరవ్ గంగూలీ సారథ్యంలో 2004లో బంగ్లాదేశ్‌పై వన్డే అరంగేట్రం చేశాడు. మహీ కెరీర్ గోల్డెన్ డకౌట్‌తో మొదలైనా.. ఆ తర్వాత సునామీ ఇన్నింగ్స్‌లతో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్నాడు. మహీ భారత్ తరఫున 350 వన్డేలు, 90 టెస్ట్‌లు, 98 టీ20ల్లో ఆడాడు. అన్ని ఫార్మాట్లలో కలిపి 17,266 రన్స్ బాదాడు. అంతేకాదు కీపర్‌గా 829 ఔట్లలో పాలుపంచుకొన్నాడు. ఎంఎస్ ధోనీ సారథ్యంలో భారత జట్టు తిరుగులేని శక్తిగా ఎదిగింది. సీనియర్, జూనియర్ ఆటగాళ్లతో ప్రత్యర్థికి కొరకరాని కొయ్యగా మారింది. టెస్టులో నంబర్ వన్ పొజిషన్ చేరుకుంది. ఈ ఘనత సౌరవ్ గంగూలీ, రాహుల్ ద్రవిడ్, అనిల్ కుంబ్లే వంటి దిగ్గజాలకు కూడా సాధ్యం కాలేదు. ఇక పరిమిత ఓవర్లలో బలమైన జట్టుగా మారింది. స్వదేశంలోనే కాదు.. విదేశాల్లోనూ సత్తా చాటగలం అని తన కూల్ కెప్టెన్సీతో నిరూపించాడు.