NTV Telugu Site icon

Top Headlines @5PM: టాప్‌ న్యూస్‌

Top Headlines @ 5 Pm

Top Headlines @ 5 Pm

మనీష్ సిసోడియాకు రెండు రోజుల కస్టడీ పొడిగింపు.. 10న బెయిల్‌పై విచారణ

ఢిల్లీ లిక్కర్ కేసులో సీబీఐ ఢిల్లీ మాజీ ఉపముఖ్యమంత్రి మనీస్ సిసోడియాను అరెస్ట్ చేసింది. తాజాగా ఆయనకు కోర్టులో చుక్కెదురు అయింది. రోస్ ఎవెన్యూలోని ప్రత్యేక న్యాయస్థానం మరో రెండు రోజుల పాటు సిసోడియా కస్టడీని పొడగించింది. మరికొన్ని రోజులు కస్టడీకి ఇవ్వాలని సీబీఐ కోర్టును కోరడంతో మార్చి 6 వరకు కస్టడీని పొడగించారు. సీబీఐ మూడు రోజులు కస్టడీకి ఇవ్వాలని కోరగా.. కోర్టు 2 రోజుల కస్టడీ మాత్రమే పొడగించింది. మరోవైపు ఆయన బెయిల్ పిటిషన్ ను ఈ నెల 10న కోర్టు విచారించనుంది. బెయిల్ పిటిషన్ పై సీబీఐని సమాధానం ఇవ్వాలని కోర్టు కోరింది. సిసోడియా భార్య అనారోగ్యంతో ఉన్నారని, రిమాండ్ పొడగింపుకు ఎలాంటి కారణం లేదని సిసోడియా తరుపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. కస్టడీ పొడగించాలన్ని సీబీఐ వాదనను సిసోడియా లాయర్ దయన్ కృష్ణన్ తోసిపుచ్చారు. సిసోడియా నుంచి మిస్ అయిన ఫైల్స్ ను కనుగొనడం కూడా రిమాండ్ పొడగింపుకు కారణం కాదని ఆయన కోర్టుకు వెల్లడించారు.

GIS సదస్సు విజయవంతం.. హర్షం వ్యక్తం చేసిన సీఎం జగన్

గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌ 2023 రెండోరోజు సదస్సులో ముగింపు ఉపన్యాసం చేశారు సీఎం వైయస్‌.జగన్‌. కేంద్ర మంత్రులు, వివిధ దేశాలకు చెందిన రాయబారులు, దౌత్యవేత్తలు, రాష్ట్ర మంత్రివర్గంలోని నా సహచరులు, వ్యాపార ప్రముఖులు మరియు పారిశ్రామిక ప్రతినిధులు, అధికారులందరికీ నమస్సులు. జీఐఎస్‌ విజయవంతం చేసిన అందరికీ ధన్యవాదాలు. విశాఖపట్నంలో జరిగిన ఆంధ్ర ప్రదేశ్‌ గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సదస్సును విజయవంతం చేసిన మీ అందరికీ ధన్యవాదాలు. ఈ సదస్సు ద్వారా వచ్చిన ఆత్మవిశ్వాసం నన్ను ఉప్పొంగేలా చేసింది. రాష్ట్రంలో పెట్టుబడులు మరింత వృద్ధిచెందేందుకు మేం కృతనిశ్చయంతో ఉన్నాం. పారిశ్రామిక వేత్తలు, వ్యాపారస్తులు నిర్వహించే కార్యకలాపాలకు మా నుంచి చక్కటి మద్దతు, సహకారం ఉంటుంది. మీతో మా బంధం చాలా అమూల్యమైనది. రాష్ట్రంలో పారిశ్రామిక రంగానికి మరింత సానుకూల వాతావరణం కల్పించడానికి రెండు రోజులపాటు జరిగిన ఈ సదస్సు అద్భుతంగా ఉపయోగపడుతుంది. అంతేకాదు ఈ దిశగా చేస్తున్న ప్రయత్నాలను రెట్టింపు చేయడానికి ఈ సదస్సు కల్పించిన వాతావరణం ప్రోత్సాహాన్ని ఇస్తుంది. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మూడున్నర సంవత్సరాల్లో ఆర్థిక వ్యవస్థ శర వేగంతో తిరిగి పుంజుకుంది. కోవిడ్‌ మహమ్మారి విస్తరించి, ఆర్థిక వ్యవస్థ అల్లకల్లోలమైన పరిస్థితుల్లో కూడా అనేక రంగాలకు మా ప్రభుత్వం సమయాను కూలంగా ప్రోత్సాహం ఇచ్చింది. సుపరిపాలన, సమర్థవంతమైన విధానాలు ఆర్థిక వ్యవస్థకు రక్షణగా నిలవడమే కాకుండా ద్రవ్యలోటును నియంత్రణలో ఉంచింది. అంతేకాకుండా వ్యాపారాలు ప్రమాదంలో పడకుండా చూసింది. ఇదే సమయంలో పారిశ్రామిక వేత్తలకు, వ్యాపారస్తులకు మరింత సానుకూల వాతావరణాన్ని కల్పించడానికి కోవిడ్‌ సమయంలో అత్యంత జాగరూకతతో వ్యవహరించి ఒక మార్గాన్ని ఏర్పాటు చేశాం. మౌలికసదుపాయాలను బలోపేతం చేయడమే కాకుండా, ఇంటర్నెట్, బ్రాడ్‌ బాండ్‌లను అందుబాటులోకి తీసుకువచ్చి యువతలో నైపుణ్యాలను మరింత బలోపేతం చేశాం.

పొలిటికల్ రౌడీయిజాన్ని భూస్థాపితం చేస్తా

ఎన్టీఆర్ భవన్ సమీపంలోని సీకే కన్వెన్షన్ హాల్ టీడీపీ లీగల్ సెల్ రాష్ట్ర స్థాయి సదస్సు నిర్వహించారు. గత నాలుగేళ్లల్లో టీడీపీ శ్రేణులపై పోలీసులు బనాయించిన అక్రమ కేసులపై చర్చ జరిగింది. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ న్యాయ విభాగం అనుసరించవలసిన విధానాలపై చర్చించారు. ఈ సమావేశానికి హాజరైన చంద్రబాబు బాధిత కుటుంబాలతో మాట్లాడారు. వైసీపీ నేతల దాడుల్లో తాము పడ్డ ఇబ్బందులను.. లీగల్ సెల్ అందించిన సాయాన్ని సదస్సులో వివరించారు బాధిత కుటుంబాల సభ్యులు. రావణున్ని యుద్దంలో ఓడించడానికి రాముడొక్కడే చాలు.కానీ ధర్మ పరిరక్షణ కోసం రాముడు అందరి సాయం తీసుకున్నారు. ఉడుత కూడా ధర్మ పరిరక్షణ కోసం సాయం చేసింది. పొలిటికల్ రౌడీయిజాన్ని భూస్థాపితం చేస్తా. అధికార పార్టీకి సహకరించే పోలీసులను హెచ్చరిస్తున్నా. తప్పుడు పనులకు పోలీసులు సహకరించకూడదు. నాలుగేళ్లల్లో విశాఖలో ఒక్క రూపాయి పెట్టుబడి రాలేదు. విశాఖలో రూ. 40 వేల కోట్లను దోచుకున్నారు. మెడ మీద కత్తి పెట్టి ఆస్తులు రాయించుకున్నారు. పోర్టు.. భూములను బలవంతంగా ఆస్తులు రాయించుకున్నారని మండిపడ్డారు చంద్రబాబు.

తెలంగాణ కాంగ్రెస్ నేతల్ని టెన్షన్ పెడుతున్న ఠాక్రే

మాణిక్ రావు ఠాక్రే తెలంగాణ వ్యవహారాల ఇంచార్జిగా వచ్చినప్పటి నుంచి తెలంగాణ కాంగ్రెస్ లో వివాదాలు కొంత సద్దుమణిగినట్లు కనిపిస్తున్నాయి. మాణిక్ రావ్ మాట ఏఐసీసీ పెద్దల దగ్గర చెల్లుబాటు అవుతుండడంతో టీకాంగ్రెస్ నేతలెవరూ కిమ్మనడం లేదు. దీంతో పార్టీలో వేగం పుంజుకుంది. నాయకుల మధ్య వివాదాలు పూర్తిగా తగ్గనప్పటికి కొంతవరకు అంతా సైలెంట్ అయ్యారు. రేవంత్ రెడ్డి పాదయాత్రకు సీనియర్లు మద్దతివ్వకపోయినా.. అడ్డుకోవడం మాత్రం ఆగింది. ఇటీవల మాణిక్రావు ఠాక్రే ఆయన వరుసగా నియోజకవర్గాలలో పర్యటిస్తున్నారు. ఎక్కడికక్కడ నేతలతో భేటీ అవుతున్నారు. ఇదే సమయంలో ప్రజల నుంచి కూడా ఫీడ్ బ్యాక్ తీసుకుంటున్నారు. ఎవరితో ఏం మాట్లాడినా అంతా రాసుకుంటూ నివేదికలు తయారుచేస్తున్నారు. ఆ రిపోర్టులు ఢిల్లీకి పంపిస్తున్నారు.ఈ క్రమంలోనే ప్రతీ ఇంటికి రాహుల్ గాంధీ సందేశం చేరాలంటూ నేతలకు ఆయన సూచనలు చేశారు. ప్రతీ ఇంటికి హాత్ సే హాత్ జోడో స్టిక్కర్ అంటించాలన్నారు. నరేంద్రమోదీ ప్రభుత్వం.. దేశంలోని ప్రభుత్వ సంస్థలను ఆదానికి కట్టబెడుతోంది దీనిని ప్రజల్లోకి గట్టిగా తీసుకెళ్లాలన్నారు. రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం దారుణంగా వ్యవహరిస్తోందంటూ… ధరణి వల్ల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

స్టూడెంట్స్ కి పాఠాలు చెబుతూ ఆగిన గుండె

ఇటీవల కాలంలో మరుక్షణం ఏం జరుగుతుంది.. ఎవరి గుండె ఎప్పుడు ఆగిపోతుందో చెప్పడం కష్టమవుతోంది. చిన్న పిల్లల నుంచి ముసలి వాళ్ల వరకు గుండెపోటుకు గురవుతున్నారు. రోజురోజుకు గుండెపోటుతో మరణించే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఈ విషయం ప్రస్తుతం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా, స్కూల్లో పిల్లలకు పాఠాలు చెబుతునే ఓ ఉపాధ్యాయుడు తరగతి గదిలోనే ఒక్కసారిగా గుండె పట్టుకుని కుప్పకూలిపోయారు. ఆ తరువాత కొన్ని సెకన్లకే ప్రాణాలు కోల్పోయారు. అలాగే మరోప్రాంతంలో మరో వ్యక్తి ఇంటినుంచి ఎంతో ఉత్సాహంగా బయటకు వచ్చిన కొన్ని నిమిషాలకే గుండె పట్టుకుని కుప్పకూలిపోయిన ప్రాణాలు కోల్పోయారు. ఒకటి ఆంధ్రప్రదేశ్ లోని బాపట్లలో జరిగితే..మరొకటి తెలంగాణలో గుండెపోట్లు ఆందోళన కలిగిస్తున్నాయి. వివరాలు.. బాపట్ల జిల్లాలోని చీరాల మండలం వాకా వారి పాలెం గ్రామం ప్రభుత్వ పాఠశాలలో శనివారం ఇంకొల్లు గ్రామానికి చెందిన వీరి బాబు (45) ఉపాధ్యాయుడుగా విధులు నిర్వహిస్తున్నారు. శనివారం యధావిధిగా విధులకు హాజరైన ఆయన విద్యార్థులకు పాఠాలు చెబుతూ గుండెపోటు రావడంతో కుప్ప కూలి అపస్మారక స్థితిలోకి చేరుకున్నాడు. గమనించిన విద్యార్థులు తోటి ఉపాధ్యాయులకు సమాచారం అందించారు. వారు వెంటనే 108 సిబ్బందిని పిలిచారు. కానీ అప్పటికే టీచర్ చనిపోయినట్లు వారునిర్ధారించారు. తమకు పాఠాలు చెప్పే ఉపాధ్యాయుని మరణాన్ని కళ్లారా చూసిన విద్యార్థులు కన్నీటి పర్యంతరం చెందారు. రోజు కూర్చొని పాఠాలు బోధించే ఉపాధ్యాయుడు అదే కుర్చీలో ప్రాణాలు విడవడాన్ని సహోపాధ్యాయులు జీర్ణించుకోలేకపోతున్నారు.

బాహుబలి 2 రికార్డులు బ్రేక్… షారుఖ్ కింగ్ సైజ్ కంబ్యాక్

2013 తర్వాత హిట్ లేదు, 2018 నుంచి సినిమానే లేదు… ఈ మధ్య వచ్చిన యంగ్ హీరోలు కూడా ఇండస్ట్రీ హిట్స్ ఇస్తున్నారు, ఫేస్ ఆఫ్ ఇండియన్ సినిమాగా పేరు తెచ్చుకున్న అతను మాత్రం సినిమాలే చెయ్యట్లేదు. ఇక అతను పని అయిపొయింది, అవుట్ డేటెడ్ అయిపోయాడు, అతను ఇక ఇండియన్ సూపర్ స్టార్ కాదు… ఇవి పఠాన్ మూవీ రిలీజ్ వరకూ షారుఖ్ ఖాన్ గురించి ఇండియన్ మీడియా రాసిన ఆర్టికల్స్. అంతేనా అయిదేళ్లు సినిమా చెయ్యకపోతే మూడు దశాబ్దాలుగా యునానిమస్ గా టాప్ చైర్ లో కూర్చున్న హీరో పని అయిపోతుందా? అతని చరిత్రని అంత ఈజీగా రైట్ ఆఫ్ చేసేస్తారా? నో వే… షారుఖ్ అనే చాప్టర్ అంత ఈజీగా ముగుసిపోయే కథ కాదు అని నిరూపిస్తూ నెల రోజుల్లో వెయ్యి కోట్లు రాబట్టింది పఠాన్ సినిమా. షారుఖ్ హిట్ కొడితే ఎలా ఉంటుందో నిరూపించిన పఠాన్ సినిమా హిందీ చిత్ర పరిశ్రమలో ఇప్పటివరకూ ఉన్న ప్రతి రికార్డుని బ్రేక్ చేసి షారుఖ్ ఖాన్ టైం అయిపోలేదు, అది చిన్న గ్యాప్ మాత్రమే ఇకపై అసలు సినిమా చూపిస్తాడు అని యాంటి ఫాన్స్ తో కూడా అనిపించింది పఠాన్ సినిమా.

వింటేజ్ బాస్ ని గుర్తు చేస్తున్న ‘గ్యాంగ్ లీడర్’

లవ్, ఫైట్స్, ఫ్రెండ్షిప్, బ్రదర్ సెంటిమెంట్, యాక్షన్, కామెడీ, కమర్షియల్ ఎలిమెంట్స్, సూపర్ సాంగ్స్, గూస్ బంప్స్ తెచ్చే ఎలివేషన్స్… ఇలా మనిషిని కదిలించే అన్ని ఎమోషన్స్ ఒకే సినిమాలో ఉంటే ‘గ్యాంగ్ లీడర్’ అవుతుంది. ఇందులో ఫైట్స్, లవ్, ఎమోషన్, సాంగ్స్, అన్ని పర్ఫెక్ట్ గా బాలన్స్ అయ్యి ఉంటాయి. 1991లో విజయ బాపినీడు దర్శకత్వంలో శ్యామ్ ప్రసాద్ ఆర్ట్స్ పైన నిర్మించిన గ్యాంగ్ లీడర్ సినిమా ప్రాపర్ కమర్షియల్ సినిమా అనే పదానికి కేరాఫ్ అడ్రెస్ లా ఉంటుంది. బిప్పి లహరి ఇచ్చిన సాంగ్స్ ఇప్పటికీ వినిపిస్తూనే ఉంటాయి. విజయశాంతి, చిరుల లవ్ ట్రాక్… మురళి మోహన్-శరత్ కుమార్-చిరంజీవిల మధ్య బ్రదర్ ఎమోషన్ గ్యాంగ్ లీడర్ సినిమాకి ప్రధాన బలంగా నిలిచాయి. ఈ మూవీలో రావు గోపాల్ రావ్ ప్లే చేసిన నెగటివ్ రోల్ కి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే.అప్పట్లో 100 రోజులు 50 కేంద్రాల్లో ఆడిన గ్యాంగ్ లీడర్ మూవీ 100 డేస్ వేడుక జరిగిన సమయంలో తీసిన క్రౌడ్ విజువల్స్ ని “అప్పుల అప్పారావు” సినిమాలో వాడుకున్నారు.

బర్త్ డే పార్టీపై పోలీసుల దాడి.. కేజీకి పైగా గంజాయి సీజ్

ఈమధ్యకాలంలో యువత మత్తుపదార్దాలకు బానిసలుగా మారుతున్నారు. ఎక్కడ అవకాశం వస్తే అక్కడ మత్తు పదార్ధాలు రవాణా చేయడం చేస్తున్నారు. తాజాగా ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో ఓ బర్త్ డే పార్టీలో కలకలం రేగింది.ఏసీపీ హనుమంతరావు కథనం ప్రకారం… శుక్రవారం అర్థరాత్రి శాంతినగర్ లో సందీప్ అనే యువకుడి పుట్టినరోజు వేడుకల సందర్భంగా 10మంది కంటే ఎక్కువ యువకులు ఉన్నారనే సమాచారంతో మా సిబ్బంది తనిఖీకి వెళ్ళారు. పోలీసులను చూడగానే ఈ పుట్టినరోజు వేడుకలకు వచ్చిన విజయవాడకి చెందిన కిషోర్ అనే వ్యక్తి పరారయ్యాడన్నారు. ఈ పుట్టినరోజు వేడుకలను తనిఖీ చేశాం. 12మంది యువకులను, ముగ్గురు యువతులను అదుపులోకి తీసుకుని,సుమారు 1కేజీ పైగా గంజాయిని స్వాధీనం చేసుకున్నాము. ఈ గంజాయి పరారైన విజయవాడకి చెందిన వ్యక్తి కిషోర్ కి చెందినదిగా మావిచారణలో తేలిందన్నారు. అయితే మేం పట్టుకున్న ముగ్గురు యువతులు వంట చేయడానికి వెళ్ళారు.వారికి ఈ పార్టీకి సంబంధం లేదు.విచారించి పంపేశామన్నారు. పరారైన వ్యక్తి దొరికితే గంజాయికి సంబంధించి పూర్తి సమాచారం తెలుస్తుందని ఏసీపీ హనుమంతరావు వివరించారు.