రాష్ట్రంపై రూ. 10 లక్షల కోట్ల అప్పు ఉంది..
చిత్తూరు జిల్లా జీడి నెల్లూరు బీసీ కాలనీలో ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పాల్గొన్నారు. స్వయంగా పెన్షన్లను పంపిణీ చేశారు. దీనిలో భాగంగా కల్లు గీత కార్మికునికి ముఖ్యమంత్రి చంద్రబాబు పెన్షన్ అందజేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడా ఇంత పెద్ద ఎత్తున పెన్షన్లు ఇవ్వడం లేదు. గత ప్రభుత్వం పెన్షన్లను రూ. 3 వేలు చేసింది.. మేము వచ్చి రాగానే పింఛన్లను రూ. 4 వేలకు పెంచామని సీఎం అన్నారు. గడిచిన ఐదేళ్లు ప్రజలు అనేక బాధలు పడ్డారు.. మా ప్రభుత్వం అప్పు కోసం ప్రయత్నిస్తే.. ఏపీకి రుణాలు ఇచ్చే పరిస్థితి లేదంటున్నారని అన్నారు. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పులకుప్పగా మార్చిందని సీఎం చంద్రబాబు మండిపడ్డారు. మేము ఆర్థిక క్రమ శిక్షణ పాటిస్తున్నాం.. ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటున్నాం.. ఒకటో తేదీనే పెన్షన్లు ఇస్తున్నాం.. ఈ ఏడాది రూ. 3 లక్షల కోట్ల బడ్జెట్ ప్రవేశ పెట్టామని తెలిపారు. రాష్ట్రంపై రూ. 10 లక్షల కోట్ల అప్పు ఉందని వెల్లడించారు. ఒక వైపు అప్పులకు వడ్డీ కడుతూనే.. ప్రజా సంక్షేమం, అభివృద్ధి కొనసాగించాల్సిన అవసరం ఉందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
తప్పులు చేసిన వారిపైనే ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది..
నెల్లూరులో వివిద శాఖల అధికారులతో మంత్రి నారాయణ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వ హయాంలో టీడీపీ నేతలపై కక్ష సాధింపుతో వ్యవహరించారు.. అందులో నేను కూడా బాధితుడినే అన్నారు. కానీ, ఇప్పుడు తప్పులు చేసిన వారిపైనే ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది చెప్పారు. గతంలో మాదిరిగా అర్ధరాత్రి అరెస్టులు చేయడం లేదన్నారు. రాష్ర్ట అభివృద్ధికి శాంతి భద్రతలు ఎంతో ముఖ్యం.. దానిపైనే ప్రభుత్వం దృష్టి పెట్టింది.. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అన్నింటినీ అమలు చేస్తామని తేల్చి చెప్పారు. కొన్ని రోజులు ఆగితే అన్నే వస్తాయి.. తల్లికి వందనం పథకం కూడా అమలు చేస్తారు.. ప్రతిపక్ష హోదా లేని వాళ్ళు మాట్లాడుతున్నారు అంటూ మంత్రి నారాయణ విమర్శలు గుప్పించారు.
పోసాని కృష్ణ మురళికి అస్వస్థత.. కడప రిమ్స్ కి తరలింపు !
సినీ నటుడు, వైసిపి హయాంలో ఏపీ ఎఫ్డిసి చైర్మన్గా పనిచేసిన పోసాని కృష్ణమురళిని ఆంధ్ర ప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేసి తీసుకువెళ్లిన సంగతి తెలిసిందే. కులాలు, వర్గాలపై గత ఏడాది పోసాని కృష్ణ మురళి చేసిన వ్యాఖ్యల మీద ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా ఓబులవారిపల్లె పోలీసులు కేసు నమోదు చేసి తాజాగా ఆయనను అరెస్ట్ చేశారు. ఆయనను అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు కోర్టులో హాజరు పరిస్తే కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఈ నేపథ్యంలోనే రాజంపేట సబ్ జైల్లో మార్చి 12వ తేదీ వరకు పోసాని కృష్ణమురళి రిమాండ్ ఖైదీగా ఉండాల్సి ఉంది. అయితే రాజంపేట సబ్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న పోసానికి స్వల్ప అస్వస్థత ఏర్పడినట్లుగా తెలుస్తోంది. నిజానికి గతం నుంచి గుండెకి సంబంధించిన జబ్బుతో పోసాని కృష్ణ మురళి బాధపడుతున్నారు. నిన్న పోసాని కృష్ణ మురళి విరోచనాలకు గురవడంతో ఆయనను రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లారు పోలీసులు. పోసాని కృష్ణ మురళికి అక్కడి వైద్యులు ఈసీజీ పరీక్షలు నిర్వహించారు. ఈసీజీ పరీక్షలలో ఆయన ఆరోగ్యంలో స్వల్ప తేడా ఉన్నట్లుగా గుర్తించారు వైద్యులు. మెరుగైన వైద్యం కోసం కడప రిమ్స్ కి తరలించారు పోలీసులు.
బీజేపీని బ్లాక్‌మెయిల్ చేసినంత మాత్రాన రేవంత్ రెడ్డి మీద వ్యతిరేకత పోదు..
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గత వారం రోజులుగా సీఎం రేవంత్ రెడ్డి బీజేపీపై.. వ్యక్తిగతంగా తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. వాస్తవాలకు విరుద్ధంగా బాధ్యతారహితంగా మాట్లాడుతున్నారు.. అవగాహన, అనుభవ రాహిత్యంతో, అసహంతో మాట్లాడుతున్నారని ఆరోపించారు. తాను కేంద్ర మంత్రిగా చేసిన పనులు ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియ చేస్తున్నానని.. కేంద్ర పథకాల్ని తెలంగాణలో అమలు చేస్తున్నామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం సహకారం లేక పోవడంతో కొన్ని అమలు చేయలేక పోయామని పేర్కొ్న్నారు. 14 నెలల్లో ఇచ్చిన హామీలు అమలు చేయలేక తన మీద దాడి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు, ఆయన పైన అసంతృప్తి.. ఆయన మాటల్లో స్పష్టంగా కనిపిస్తుందని కిషన్ రెడ్డి తెలిపారు.
త్వరలో ఉపఎన్నికలు వస్తాయి.. కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో పలువురు కార్యకర్తలు పార్టీలో చేరారు. ఈ సందర్బంగా వారికి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలో ఉప ఎన్నికలు వస్తాయని అన్నారు. కార్తీక్ రెడ్డి అసెంబ్లీకి ఎమ్మెల్యేగా వస్తారని తెలిపారు. కేసీఆర్ దళం గులాబీ వనంలోకి వస్తున్న అందరికీ స్వాగతం అని పేర్కొన్నారు. నిన్న కాంగ్రెస్ మీటింగ్ లో మూడు ఆణిముత్యాల మాటలు చెప్పారు.. మంచి మైక్‌లో చెప్పాలి చెడు చెవిలో చెప్పాలి అన్నారు.. మంచి చెప్పడానికి నువ్వు చేసిన ఒక్క మంచి పని లేదని కేటీఆర్ విమర్శించారు. రేవంత్ రెడ్డి చేసిన చెడు చెబితే.. చెవిలో రక్తాలు కారుతాయని అన్నారు. కొత్తగా వచ్చిన ఇంచార్జి మీనాక్షి తన బ్యాగ్ మోయొద్దు అని చెప్పింది.. నీ పక్కన కూర్చున్న రేవంత్ రెడ్డినే బ్యాగ్‌లు మోసి పైకి వచ్చాడని కేటీఆర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎక్కడ చూసినా రేవంత్ రెడ్డిని బండ బూతులు తిడుతున్నారు.. రైతు బంధు ఎవరికీ పడడం లేదు అని తిడుతున్నారని అన్నారు.
5 మృతదేహాల వెలికి తీత?.. మూడింటి కోసం ముమ్మర గాలింపు..
ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో జరిగిన ప్రమాదంలో ఎనిమిది మంది కార్మికులు దుర్మరణం పాలైన విషయం విదితమే. మృతదేహాలను బయటకు తీసుకొచ్చేందుకు శతవిధాలుగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. సాయంత్రంలోపు మృతదేహాలను వెలికి తీసేందుకు ముమ్మర ప్రయాత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే 5 మృతదేహాలను బయటకు తీసినట్లు తెలుస్తోంది. మరో మూడు మృతదేహాల కోసం రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగుతున్నాయి. ఇప్పటికే జాతీయ భూభౌతిక పరిశోధన సంస్థ (ఎన్‌జీఆర్‌ఐ) శాస్త్రవేత్తలు లోపలికి వెళ్లి.. జీపీఐ మిషన్, ఆక్వాయి ద్వారా భూమిలోపల మృతదేహాలను ఉన్నట్లు గుర్తించి మార్కింగ్ వేశారు. నేడు ఆ ప్రదేశానికి చేరుకున్న రెస్క్యూ టీం అక్కడున్న బురదను తొలగించింది. అనంతరం లోపల ఉన్న అయిదు మృతదేహాలను వెలికి తీసినట్లు తెలుస్తోంది. ఘటనా స్థలంలోనే పోస్టుమార్టం నిర్వహించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. గాంధీ, ఉస్మానియాకు చెందిన మెడికల్ టీం సాయంత్రం వరకు ఇక్కడికి వస్తుంది.
ప్రపంచం భారత్ వైపు చూస్తోంది.. ఎన్‌ఎక్స్‌టీ కాన్‌క్లేవ్‌లో మోడీ వ్యాఖ్య
ప్రపంచ ప్రజలు భారత్ వైపు చూస్తున్నారని ప్రధాని మోడీ అన్నారు. ఢిల్లీలో నిర్వహించిన ఎన్‌ఎక్స్‌టీ కాన్‌క్లేవ్‌లో మోడీ పాల్గొని ప్రసంగించారు. భారత్ గురించి చాలా సానుకూల వార్తలు వెలువడుతున్నాయని చెప్పారు. ప్రపంచం మొత్తం భారత్ గురించి ఆసక్తిగా గమనిస్తోందని వ్యాఖ్యానించారు. ప్రపంచ దేశాల ప్రజలు భారత్‌కు రావాలని కోరుకుంటున్నారని పేర్కొన్నారు. ప్రపంచ కర్మాగారంగా భారత్ రూపొందుతోందని స్పష్టం చేశారు. ఇన్నేళ్లు భారతదేశం శ్రామిక శక్తిగా చెప్పుకునేవారని.. ప్రస్తుతం ప్రపంచ శక్తిగా మార్పు చెందిందని తెలిపారు. దేశంలో లభించే సూపర్‌ఫుడ్‌లైన మఖానా, మిల్లెట్‌లు, ఆయుష్ ఉత్పత్తులు… మనం పాటించే యోగా, ధ్యానం వంటి వాటిని విదేశీయులు మనలను చూసి ఆచరిస్తున్నారన్నారు. ఎన్డీఏ ప్రభుత్వానికి ప్రజలు మూడోసారి పట్టం కట్టడం తమపై ఉన్న విశ్వాసాన్ని తెలియజేస్తోందని సంతోషం వ్యక్తంచేశారు. భారత్ అభివృద్ధిలో ముందడుగు వేస్తూ అనేక ప్రపంచవ్యాప్త కార్యక్రమాలకు నాయకత్వం వహిస్తోందని అన్నారు.
వ్యూహం మార్చిన ప్రశాంత్ కిషోర్.. తమిళనాడులో విజయ్‌కు సాధ్యమేనా?
వచ్చే ఏడాదే తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకోసం అధికార-ప్రతిపక్ష పార్టీలు సన్నద్ధమవుతున్నాయి. ఇక టీవీకే పార్టీ అధినేత, నటుడు విజయ్ కూడా కదనరంగంలోకి దిగాడు. ఇటీవల టీవీకే పార్టీ రెండో ఆవిర్భావ వేడుకలు కూడా ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్, విజయ్ పాల్గొని భవిష్యత్ కార్యాచరణ ప్రకటించారు. అయితే విజయ్‌కు ప్రశాంత్ కిషోర్ పలు కీలక సూచనలు చేసినట్లు ప్రచారం జరిగింది. అన్నాడీఎంకేతో పొత్తు పెట్టుకోవాలని.. ఎడప్పాడి పళనిస్వామి ముఖ్యమంత్రిగా.. డిప్యూటీ సీఎంగా విజయ్ ఉండాలని సలహా ఇచ్చినట్లుగా వార్తలు చక్కర్లు కొట్టాయి. ఏపీలో పవన్‌కల్యాణ్.. ఈ మాదిరిగానే అధికారంలోకి వచ్చారని సూచించినట్లుగా వార్తలు వినిపించాయి.
సెమీస్‌కు ముందు ఆస్ట్రేలియాకు షాక్..
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 సెమీ-ఫైనల్స్ కు ముందు ఆస్ట్రేలియా జట్టుకు షాక్ తగిలింది. ఆస్ట్రేలియా ఓపెనర్ మాథ్యూ షార్ట్ గాయపడ్డాడు. ఈ క్రమంలో అతను సెమీ-ఫైనల్స్‌కు దూరం కానున్నాడు. గత మ్యాచ్‌లో మాథ్యూ షార్ట్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ఇబ్బంది పడుతున్నట్లు కనిపించాడు. మ్యాచ్ తర్వాత కెప్టెన్ స్టీవ్ స్మిత్ క్లారిటీ ఇచ్చాడు. అతను పూర్తిగా ఫిట్‌గా లేడని చెప్పాడు. ఈ క్రమంలో ట్రావిస్ హెడ్‌కు జోడీగా మరో కొత్త ఓపెనర్ రానున్నాడు. ఆఫ్ఘనిస్తాన్ ఇన్నింగ్స్ చివరిలో షార్ట్ గాయపడ్డాడు. అతను ట్రావిస్ హెడ్‌తో కలిసి ఇన్నింగ్స్ ప్రారంభించినప్పటికీ.. వికెట్ల మధ్య పరుగెత్తడానికి ఇబ్బంది పడుతూ కనిపించాడు. ఈ క్రమంలో అతను ఎక్కువగా బౌండరీలు కొట్టడానికే ప్రయత్నించాడు. కానీ కేవలం 15 బంతుల్లో 20 పరుగులు చేసి ఔటయ్యాడు. కాగా.. యువ ఓపెనర్ జాక్ ఫ్రేజర్ మెక్‌గుర్క్.. షార్ట్ స్థానంలో ట్రావిస్ హెడ్‌తో ఓపెనింగ్ దిగే అవకాశం ఉంది. మరోవైపు.. ఆరోన్ హార్డీ కూడా బెంచ్‌లో ఉన్నాడు. అతనికైనా ఓపెనింగ్ దిగే అవకాశం ఉంది. కాగా.. నిన్న ఆఫ్గానిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో వర్షం కారణంగా రద్దు అవడంతో ఆస్ట్రేలియా సెమీస్‌కు వెళ్లింది.