NTV Telugu Site icon

Top Headlines @5PM : టాప్‌ న్యూస్‌

Top Headlines @ 5 Pm New

Top Headlines @ 5 Pm New

ముఖ్యమంత్రి నివాసంలో సీఎంను కలిసిన బీసీ సంక్షేమ సంఘం నేతలు
హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని బీసీ సంక్షేమ సంఘం నేతలు నేడు ఉదయం కలిశారు. తెలంగాణ‌లో బీసీ సామాజిక‌, ఆర్థిక, కుల స‌ర్వే ప్ర‌క్రియ‌ను త‌క్ష‌ణ‌మే ప్రారంభించాల‌న్న ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తూ హర్షం వ్యక్తం చేసారు బీసీ సంక్షేమ సంఘం నేతలు. ఈ సందర్బంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టివిక్రమార్కకు కృతజ్ఞతలు తెలిపారు బీసీ సంక్షేమ సంఘం నేతలు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యే శ్రీహరి, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి చిరంజీవులు, మరికొంతమంది బీసీ సంక్షేమ సంఘం నేతలు హాజరయ్యారు.

మంత్రి కొండా సురేఖపై పరువు నష్టం దావా వేసిన కేటీఆర్‌!
బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ నాంపల్లి ప్రత్యేక కోర్టులో మంత్రి కొండా సురేఖపై పరువు నష్టం దావా వేశారు. కేటీఆర్‌ తరఫున లాయర్ ఉమామహేశ్వర్‌ రావు ఇందుకు సంబంధించిన పిటిషన్‌ను కోర్టులో దాఖలు చేశారు. బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్ నేతలు బాల్క సుమన్‌, సత్యవతి రాథోడ్‌, తుల ఉమ, దాసోజు శ్రవణ్‌ను సాక్షులుగా పేర్కొన్నారు. తన ప్రతిష్టను దెబ్బతీసేలా మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని నాంపల్లి స్పెషల్‌ మెజిస్ట్రేట్‌ కోర్టును కోరుతూ కేటీఆర్ పిటిషన్ దాఖలు చేశారు. కేటీఆర్‌ పిటిషన్‌పై నాంపల్లి కోర్టులో విచారణ ప్రారంభమైంది. ఇటీవల నిర్వహించిన ఓ మీడియా సమావేశంలో మంత్రి కొండా సురేఖ సినీ రంగంలోని పలువురిని ప్రస్తావిస్తూ.. కేటీఆర్‌పై విమర్శలు చేసిన విషయం తెలిసిందే. అనంతరం మంత్రి క్షమాపణలు చెప్పి.. తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నారు.

తెలంగాణ ఆడపడుచులకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు చెప్పిన ఏపీ డిప్యూటీ సీఎం
ప్రకృతిని పరమేశ్వరి ప్రతిరూపంగా ఆరాధించడం భారతీయ సనాతన ధర్మంలో ఒక గొప్ప ఆచారం అని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. అటువంటి ప్రకృతిలో ఆకృతి తొడిగే పుష్పాలను బతుకమ్మలుగా పూజించడం తెలంగాణ ఆడపడుచుల సంప్రదాయం.. దేవి నవరాత్రులతో ఆరంభమయ్యే బతుకమ్మల పూజలు, ఆటలు నేటి సద్దుల బతుకమ్మతో ముగియనున్న తరుణంలో నా పక్షాన, జనసేన శ్రేణుల పక్షాన భక్తిపూర్వక శుభాకాంక్షలు అని జనసేన అధినేత పేర్కొన్నారు. పులగం, దద్దోజనం, పులిహోర, చిత్రాన్నం, నువ్వుల సద్ది, కొబ్బరి సద్ది ఇలా అనేక రకాలైన సద్దులను చేసి బతుకమ్మకు నైవేథ్యంగా మన ఆడపడుచులు సమర్పించి భక్తులకు ప్రసాదంగా అందచేస్తుంటారని చెప్పుకొచ్చారు. ఈ నైవేథ్యాల తయారీలో ఎన్నో మేలైన ఆహార దినుసులు మేళవించడం వల్ల అవి ఆరోగ్య ప్రదాయినులుగా భక్తులకు మేలు చేస్తున్నాయని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వెల్లడించారు.

చంద్రబాబులా మనం అబద్ధాలు ఆడలేకపోయాం..
చంద్రబాబులా మనం అబద్ధాలు ఆడలేకపోయామని వైసీపీ అధినేత జగన్ ఆరోపించారు. చంద్రబాబు అబద్ధాలతో పోటీ పడలేకపోయాం.. ఒకవేళ అలాంటి అబద్ధాలు చెప్పినా.. ఇవాళ ప్రజల ముందుకు వెళ్లలేని పరిస్థితి ఉండేది.. తెలుగుదేశం కార్యకర్తలు ప్రతి ఇంటికీ వెళ్లలేని పరిస్థితి.. పిల్లలు రూ.15వేలు గురించి అడుగుతారు.. మహిళలు రూ.18వేలు గురించి అడుగుతారు.. పెద్దవాళ్లు రూ.48 వేల గురించి అడుగుతారు అని ఆయన చెప్పుకొచ్చారు. విద్యా, వైద్యరంగాలను ఈ నాలుగు నెలల కాలంలో నాశనం చేశారు.. వ్యవస్థలన్నీ నాశనం అయ్యాయని ఆయన ఆరోపించారు. డోర్‌డెలివరీ పద్ధతిని తీసేశారు.. ఇప్పటికే లక్షన్నర పెన్షన్లు కట్‌.. రెడ్‌బుక్‌ పాలన కొనసాగుతోంది.. ప్రజలను భయపెడుతున్నారు.. తప్పుడు కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. హద్దుల్లేని అవినీతి జరుగుతోంది.. పేకాట క్లబ్బులు ప్రతినియోజకవర్గంలో నడుస్తున్నాయని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ముఖ్యమంత్రిగా ఒమర్ అబ్దుల్లా ఎన్నిక.. నలుగురు స్వతంత్ర ఎమ్మెల్యేల మద్దతు
జమ్మూకాశ్మీర్ ముఖ్యమంత్రిగా ఒమర్ అబ్దుల్లా ఎన్నికయ్యారు. నేషనల్ కాన్ఫరెన్స్ లెజిస్లేచర్ పార్టీ నాయకుడిగా ఒమర్ అబ్దుల్లా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ విజయం సాధించింది. కాంగ్రెస్‌తో జత కలిసి ఎన్నికల బరిలోకి దిగింది. ఫలితాల్లో కూటమినే విజయం సాధించింది. నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు డాక్టర్ ఫరూక్ అబ్దుల్లా పార్టీ నవా-ఇ-సుభా ప్రధాన కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఒమర్ అబ్దుల్లా 49 మంది శాసనసభ్యులతో ప్రభుత్వ ఏర్పాటుకు రెడీ అవుతున్నారు. ఒమర్ అబ్దుల్లాకు నలుగురు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేల కూడా మద్దతు ఇచ్చారు. దీంతో ఎన్సీ బలం మరింత పెరిగింది. జమ్మూకాశ్మీర్‌లో మొత్తం 90 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఎన్నికల్లో నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ 42 సీట్లు సాధించింది. నలుగురు స్వతంత్ర ఎమ్మెల్యేలు కూడా మద్దతు ఇవ్వడంతో ప్రభుత్వం ఏర్పాటుకు కాంగ్రెస్‌తో సంబంధం లేకుండా బలం సరిపోతుంది. ఎన్సీకి అవసరమైన మెజార్టీ లభించింది.

లావోస్ చేరుకున్న ప్రధాని మోడీ.. 2 రోజుల పర్యటన
ప్రధాని మోడీ రెండు రోజుల పర్యటన కోసం లావోస్‌లోని వియంటియాన్ చేరుకున్నారు. ప్రధాని మోడీకి సెరిమోనియల్ గార్డ్ ఆఫ్ హానర్ లభించింది. ఆసియాన్-భారత్, తూర్పు ఆసియా శిఖరాగ్ర సమావేశాల్లో పాల్గొనడానికి ప్రధాని మోడీ గురువారం లావోస్‌కు చేరుకున్నారు. ఆసియాన్ దేశాలతో సంబంధాలను బలోపేతం చేసుకునే లక్ష్యంతో ఈ పర్యటన కొనసాగనుంది. లావోస్‌లో జరగనున్న 21వ ఆసియాన్ భారత్, 19వ తూర్పు ఆసియా సదస్సులో ప్రధాని మోడీ పాల్గొంటారు. లావోస్‌ పర్యటన ఆసియాన్‌ దేశాలతో సంబంధాలను మరింత బలోపేతం చేస్తుందని మోడీ పేర్కొన్నారు. ప్రధాని మోడీకి స్థానిక డబుల్ ట్రీ హోటల్‌లో ప్రవాస భారతీయులు ఘనస్వాగతం పలికారు. చిన్నారులను ఆప్యాయంగా పలకరించి ఆటోగ్రాఫ్‌లు ఇచ్చారు. మోడీకి ఎన్నారైలు జాతీయ జెండాలు, కళాకృతులు అందజేశారు. అనంతరం స్థానిక యువకులతో కలిసి ప్రధాని మోడీ గాయత్రీ మంత్రం సహా వివిధ శ్లోకాలను పఠించారు. బౌద్ధ భిక్షువులతో కలిసి ప్రధాని మోడీ ప్రార్థనలు చేశారు.లావోస్‌ సంస్కృతి, వారసత్వ కట్టడాలు, ప్రాచీన కళల వివరాలతో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్‌ను ప్రధాని తిలకించారు.

పాకిస్తాన్‌లోని సింధ్‌లో భయం గుప్పిట్లో హిందువులు..ఎందుకో తెలుసా ?
పాకిస్థాన్‌లో హిందూ సమాజానికి ఇబ్బందులు పెరుగుతున్నాయి. దక్షిణ సింధ్ ప్రావిన్స్‌లో నివసిస్తున్న హిందూ సమాజానికి చెందిన ప్రజలు భయం నీడలో జీవించవలసి వస్తుంది. అక్కడి హిందూ సమాజానికి చెందిన వారిని బెదిరిస్తున్నారు. అక్కడ జరిగిన దైవదూషణ సంఘటన తరువాత, హిందూ సమాజానికి చెందిన ప్రజలు తీవ్ర పరిణామాలతో బెదిరింపులకు గురవుతున్నారు. బెదిరింపులు వచ్చిన తరువాత, ఈ ప్రావిన్స్‌లోని కొంతమంది తమ ఇళ్లను వదిలి వెళ్లిపోతున్నారు. దక్షిణ సింధ్ ప్రావిన్స్‌లో దైవదూషణ ఘటన జరిగిందని హిందువుల హక్కుల పరిరక్షణ కోసం ఏర్పడిన పాకిస్థాన్ దర్వార్ ఇత్తెహాద్ అనే సంస్థ అధిపతి శివ్ కూచి చెప్పారు. ఆ తర్వాత కొందరు ప్రభావవంతమైన వ్యక్తులు హిందూ సమాజానికి చెందిన వ్యక్తులపై బెదిరింపులు జారీ చేశారు. బెదిరింపులకు పాల్పడిన వారిపై పోలీసులు ఇంతవరకు చర్యలు తీసుకోలేదని, ఎవరినీ అరెస్టు చేయలేదన్నారు. దీంతో హిందూ సమాజం ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. గత నెల, ఎగువ సింధ్‌లోని ఉమర్‌కోట్‌లో హృదయ విదారక సంఘటన జరిగింది. పోలీసులు జరిపిన ఎన్‌కౌంటర్‌లో ఉమర్‌కోట్‌కు చెందిన డాక్టర్ షానవాజ్ కుంభార్ మరణించారు. గత నెలలో వారిపై కూడా కోపంతో ఉన్న గుంపు దురుసుగా ప్రవర్తించింది.

‘‘మోడీ అద్భుతమైన వ్యక్తి’’.. పాకిస్తాన్‌కి ధమ్కీ ఇచ్చిన విషయాన్ని చెప్పిన ట్రంప్..
మరో నెల రోజుల్లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగబోతున్నాయి. రిపబ్లికన్ల తరుపున మాజీ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్, డెమెక్రాట్ల తరుపున ప్రస్తుత వైస్ ప్రెసిడెంట్ కమలా హ్యారిస్ యూఎస్ అధ్యక్ష పీఠం కోసం పోటీ పడుతున్నారు. వీరిద్దరి మధ్య పోరు ఎంతో రసవత్తరంగా ఉంది. ఇదిలా ఉంటే, అమెరికా ఎన్నికల్లో ఇండియా ఫ్యాక్టర్ కీలకంగా ఉంది. అమెరికాలో చాలా మంది భారత సంతతి ప్రజలు ఉన్నారు. వీరి ఓట్లు ఎన్నికల్లో కీలకంగా మారాయి. భాతర సంతతి ప్రజల్ని ఆకట్టుకునేందుకు ఇరు పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. ఇదిలా ఉంటే, ప్రధాని నరేంద్రమోడీని డొనాల్డ్ ట్రంప్ ప్రశంసించారు. 2019లో తాను ప్రెసిడెంట్‌గా ఉన్న సమయంలో హూస్టల్‌లో జరిగిన ‘‘హౌడీ మోడీ’’ సభపై మాట్లాడారు. కమిడియన్స్ ఆండ్రూ షుల్ట్జ్, ఆకాష్ సింగ్‌తో కలిసి ‘‘ఫ్లాగ్రాంట్’’ పోడ్‌కాస్టులో ట్రంప్ పాల్గొన్నారు. ఈ భేటీలో పీఎం మోడీపై ప్రశంసలు కురిపించారు. మోడీ బయటకు శాంతంగా, తండ్రిలా కనిపిస్తారు కానీ, ఆయన కఠినంగా ఉండే మంచి వ్యక్తి అని అభివర్ణించారు.

టెన్నిస్కి గుడ్ బై చెప్పిన రఫెల్ నాదల్..
స్పెయిన్ స్టార్ టెన్నిస్ ఆటగాడు రఫెల్ నాదల్ గురువారం టెన్నిస్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. సుదీర్ఘ కెరీర్‌కు స్పెయిన్ బుల్ గుడ్ బై చెప్పాడు. గాయాలతో వేగలేకే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు నాదల్ ప్రకటించాడు. పురుషుల సింగిల్స్ విభాగంలో నాదల్ 22 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ సాధించాడు. అందులో 14 ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్స్ ఉన్నాయి. రోజ‌ర్ ఫెద‌ర‌ర్, ఆండీ రాడిక్, లీట‌న్ హెవిట్.. వంటి దిగ్గజాలు టెన్నిస్‌ను ఏలుతున్న రోజుల్లో నాద‌ల్ అరంగేట్రం చేసి సత్తా చూపించాడు. రఫెల్ నాదల్ 92 ATP సింగిల్స్ టైటిల్స్ గెలుచుకున్నాడు. ఒక ఒలింపిక్ గోల్డ్ మెడల్ నాదల్ ఖాతాలో ఉంది. సింగిల్స్‌లో కెరీర్ గోల్డెన్ స్లామ్ పూర్తి చేసిన ముగ్గురిలో ఒకడు నాదల్ ఉన్నాడు. నాదల్.. క్లే కోర్టు పై 81 వరుస విజయాలు నమోదు చేసిన ఏకైక ఆటగాడిగా రికార్డ్ సృష్టించాడు. గత నెలలో జరిగిన నాదల్ లావర్ కప్ తర్వాత రిటైర్మెంట్ తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఇది ఒక ప్రొఫెషనల్ ప్లేయర్‌గా అతని చివరి టోర్నమెంట్. పారిస్ ఒలింపిక్స్ తర్వాత.. లావర్ కప్ తన తదుపరి టోర్నమెంట్ అని నాదల్ ధృవీకరించాడు. టూర్‌లో 2024 తన చివరి సంవత్సరం అని నాదల్ గతంలో సూచించాడు. ఈ సీజన్‌లో నాదల్ రికార్డు 12-7గా ఉంది. అతను చివరిసారిగా పారిస్ ఒలింపిక్స్‌లో ఆడాడు. అక్కడ నాదల్ రెండవ రౌండ్‌లో జకోవిచ్ చేతిలో ఓడిపోయాడు.

బాక్సులు బద్దలయ్యే న్యూస్.. ఇక రచ్చ రచ్చే!
ఇప్పుడు నందమూరి బాలకృష్ణ టైం నడుస్తోంది. ఆయన సినిమాలు చేస్తే సూపర్ హిట్ అవుతున్నాయి. షోలు చేస్తే వ్యూయర్ షిప్లు దాసోహం అంటున్నాయి. రాజకీయంగా దిగితే ఆయన సపోర్ట్ చేసే పార్టీ బంపర్ మెజారిటీతో గెలిచింది. ఇక ప్రస్తుతానికి అయన బాబీ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. తన కెరీర్లో 109వ సినిమా కావడంతో ఎన్బీకే 109 అని సంబోధిస్తున్నారు. ఇక ఇప్పుడు బాలకృష్ణ కొత్త ప్రాజెక్ట్ గురించి కొంత షాకింగ్ సమాచారం వెలుగులోకి వస్తోంది. బాలయ్య సూపర్‌హీరో పాత్రలో నటించబోతున్నారని వార్తలు తెర మీదకు వచ్చాయి. ఈ సినిమా ఇండియన్ సినిమా గమనాన్నే మార్చే అవకాశముందని అంటున్నారు. ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన అక్టోబర్ 11న వెలువడనుంది. ఈ సినిమా ఇప్పుడు బాలయ్య అభిమానులు- పరిశ్రమ నిపుణులలో ఆసక్తిని పెంచుతోంది. ఇక ప్రాజెక్ట్ గురించి వివరాలు రహస్యంగా ఉన్నాయి, కానీ బాలయ్యను ప్రేక్షకులకు ఆకట్టుకునే విధంగా చూపించే ప్రయత్నం జరుగుతుందని మాత్రం చెప్పొచ్చు. ఇక ఈ ఊహాగానాలు పెరిగుతున్న క్రమంలో ఆయన అభిమానులు ఈ ఆసక్తికరమైన ప్రాజెక్ట్ గురించి మరింత సమాచారం కోసం ఎదురుచూస్తున్నారు. బాలయ్య సూపర్‌హీరో అంటే ఇక బాక్సులు బద్దలు కావాల్సిందే అని అంటున్నారు. నిజానికి బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా అది కూడా సూపర్ హీరో సినిమా అనే చర్చ జరుగుతోంది. ఇప్పుడు బాలయ్య కూడా సూపర్ హీరో సినిమా చేస్తున్నాడు అనే చర్చ జరగడంతో ఇది కూడా ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో భాగమా అనే చర్చలు కూడా జరుగుతున్నాయి.