సీఎం జగన్‌కు సోము వీర్రాజు లేఖ..
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు మరో లేఖ రాశారు బీజేపీ ఏపీ చీఫ్ సోము వీర్రాజు.. అగ్రి గోల్డ్ బాధితుల సమస్య పరిష్కారంపై తన లేఖలో పేర్కొన్నారు.. అగ్రి గోల్డు బాధితుల పరిష్కారంపై శ్వేత పత్రం ప్రకటించాలని డిమాండ్ చేశారు.. అధికారంలోకి వచ్చిన 6 మాసాల్లో అగ్రిగోల్డు బాధితుల సమస్యలను న్యాయస్థానాల పరిధి నుండి దాటి పరిష్కరిస్తానని ఎన్నికల ముందు హామీ ఇచ్చారు. అయితే, అధికారం వచ్చి మూడున్నరేళ్లు దాటినా ఎందుకు పరిష్కరించలేదు? అని ప్రశ్నించారు. అగ్రి గోల్డు సంస్ధ మదుపు చేసిన కష్టమర్లకు సకాలంలో నగదు చెల్లింపు చేయక పోవడంతో 142 మంది మృతి చెందారని ఆరోపించారు.. ఆనాడు అసెంబ్లీలో అప్పటి ముఖ్యమంత్రి మూడు లక్షలు ఎక్స్ గ్రేషియా చెల్లిస్తానంటే.. ఆనాడు మీరు (వైఎస్ జగన్) 10 లక్షలు ఎక్స్ గ్రేషియా చెల్లిస్తానని చెప్పారని లేఖలో గుర్తుచేశారు. అధికారంలోకి వచ్చిన తరువాత ఒక్క నయా పైసా అయినా ఎక్స్ గ్రేషియా చెల్లించారా..? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రూ. 10 వేలులోపు పరిధి ఉన్న బాండ్లుకు 2019 సంవత్సరంలో రూ. 250 కోట్లు, 2021 ఆగస్టులో రూ. 667 కోట్లు మేరకు మాత్రమే బాండ్లు పరిష్కారం జరిగింది.. అయితే ఆ తర్వాత ఒక్కరికి కూడా బాండ్లు పరిష్కారం కాలేదు అన్నారు సోము వీర్రాజు.. అగ్రి గోల్డు బాధితులు సుమారు 14 లక్షల మంది తమ బాండ్లకు ఎప్పుడు నగదు పరిష్కారం జరుగుతుంది అని ఎదురుచూస్తున్నారు.. విచిత్రమేమంటే అగ్రిగోల్డు సంస్ధ నడుపుతున్న ఇతర సంస్ధలు యధావిధిగా నడుస్తున్నాయి.. వాటి జోలికి ప్రభుత్వం వెళ్లడం లేదని ఆరోపించారు. మరో వైపు అగ్రిగోల్డులో నగదు మదుపు చేసి బాండ్లు తీసుకున్న వారి సమస్యలపై మీ ప్రభుత్వం నోరుమెదపడం లేదు? ఎందుకు? అని లేఖలో నిలదీశారు బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు.
అభిమానులు లేనిదే నాలాంటి కళాకారులు లేరు..
అభిమానులు లేనిదే నాలాంటి కళాకారులు లేరన్నారు నటసింహ, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ.. విజయవాడలో వేగా జ్యూవెలరీ షోరూంను ప్రజ్ఞా జైస్వాల్, వేగా జ్యూవెలరీ సంస్థల ప్రతినిధులు నవీన్ కుమార్, సుధాకర్‌లతో కలిసి ప్రారంభించిన ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వేగా జ్యువెలర్స్ ప్రారంభోత్సవానికి రావడం చాలా సంతోషంగా ఉందన్నారు.. చాలామంది బంగారు షాపు ప్రారంభోత్సవానికి వస్తున్నానంటే రకరకాలుగా మాట్లాడుకున్నారు.. ఆయన నాకేమీ పర్వాలేదు.. తెలుగువారిని ముందుండి నడిపించడంలో నేనెప్పుడూ ముందుంటానని చెప్పుకొచ్చారు.. ఇక, మా ఇంటి పేరుతో ఉన్న నందమూరి రోడ్ లో ఈ షోరూంను ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందన్నారు బాలయ్య. మహిళలకు ఎంతో ఇష్టమైనవి ఆభరణాలు… కమ్మలు, గాజులు, బంగారుపు నగలను భర్తలతో చెప్పి కొనిచ్చుకోండి అంటూ మహిళలకు సూచించిన బాలయ్య.. మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు.. మహిళలు అన్ని రంగాల్లో ముందున్నారు.. మన తెలుగింటి ఆడపడుచులు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ ఉన్న వారందరికీ కూడా నా ప్రత్యేక అభినందనలు అన్నారు.. ఇక, తాజాగా విడుదలైన తన చిత్రం వీర సింహారెడ్డి చిత్రాన్ని ప్రజలందరూ ఆదరించారాన్ని ఆనందం వ్యక్తం చేశారు.. మరోవైపు అన్ స్టాపబుల్ టాక్ షో ని అంతా కలిసి విజయవంతం చేశారని కృతజ్ఞతలు తెలిపారు.. అభిమానులు లేనిదే నాలాంటి కళాకారులు లేరన్న బాలయ్య.. మహిళా దినోత్సవం సందర్భంగా అన్ని రంగాలలో సాధికారత సాధించిన మహిళలందరికీ ఇవే నా శుభాకాంక్షలు అన్నారు. ఇక, బాలయ్య, హీరోయిన్ ప్రజ్ఞా జైస్వాల్ విజయవాడ రావడంతో.. అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.. దీంతో.. నందమూరి రోడ్ సందడిగా మారింది.
ప్యాంట్ లేకుండా పాల్ ప్రసంగం..! ఏమన్నారంటే..?
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్సీ కవిత 48 గంటల్లో అరెస్ట్ కాబోతోందని జోస్యం చెప్పారు. మార్చి 10న కవితను అరెస్ట్ అవుతుందని అన్నారు. కేసీఆర్ పతనానికి ఇది నాంది మాత్రమేనన్నారు. ఎందుకంటే తెలంగాణలో రైతులు, నిరుద్యోగులు, అమరవీరుల కుటుంబాల కన్నీళ్లు అని చాలా మంది కేసీఆర్ కుటుంబానికి తగిలిందని విమర్శించారు. కేసీఆర్ దేవుడిని శత్రువుగా చేసుకున్నారని అన్నారు. నేను చెప్పేది నిజంగా జరుగుతుందని వ్యాఖ్యానించారు. అయితే ఆయన షోషల్ మీడియాలో చేసిన పోస్ట్ సంచలనంగా మారింది. పాల్ కంగారుగా వచ్చి మాట్లాడారో ఏమో తెలియదు కానీ.. పాపం పైన డ్రస్ వేసుకుని కింద ప్యాంట్ మర్చిపోయి డిల్లీ లిక్కర్ స్కామ్ గురించి మాట్లాడారు. ఆత్రుతగా వచ్చి అన్ని వివరించిన పాల్‌కు వీడియె చూస్తూ కిందికి చూడగానే దిమ్మతిరగేలా అయ్యింది. పైన డ్రస్ అయితే వేసుకున్నారు గానీ.. కింద్ర మాత్రం ప్యాంట్ వేసుకోవడం మర్చిపోయారు పాల్. ఇది ఒక ఫ్యాషన్ ఏమో అని కొందరు అంటుంటే.. అమ్మాయిలయితే బాగుంటుంది. అబ్బాయిలతే ఫ్యాషన్ ఏంటి పిచ్చి కాకపోతే అంటూ కామెంట్లు చేస్తున్నారు. అయితే అంతగా ప్యాంట్ మర్చిపోయి వచ్చి ఢిల్లీ లిక్కర్ స్కాం గురించి మాట్లాడాల్సిన అవసరం ఏముందో.. ఏదైమైనా పాల్ మాత్రం ప్యాంట్ అయితే మర్చిపోయారు గానీ.. కవిత మాత్రం 10న అరెస్ట్ అవుతుందని జోస్యం చెప్పడం సంచలనంగా మారింది.
దారుణం.. ఇంట్లోనే 1000 కుక్కల కడుపు మాడ్చి.. చనిపోయేంతవరకు!
దక్షిణ కొరియాలో ఓ ఇంట్లో 1000 కుక్కలు చనిపోవడం కలకలం రేపింది. 60 ఏళ్ల ఓ వ్యక్తి 1000 కుక్కలను ఇంట్లోనే బంధించి ఆకలితో అలమటించేలా చేసిన అవి చనిపోయేంతవరకు అలాగే ఉంచాడు. తమ కుక్క తప్పిపోవడంతో దాన్ని వెతుక్కుంటూ వెళ్లిన యజమాని ఒకరు ఓ ఇంట్లో శునకాలు చనిపోయి ఉండడం చూసి అధికారులకు సమాచారం అందించడంతో ఈ ఘటన వెలుగుచూసింది. నిందితుడిని గ్యాంగి ప్రావిన్స్‌లోని యంగ్‌ప్యోంగ్‌కు చెందిన 60 ఏళ్ల వ్యక్తిగా గుర్తించారు. వెంటనే అతడిని అరెస్టు చేశారు. జంతు వేధింపుల కేసును దర్యాప్తు చేస్తున్న దక్షిణ కొరియా పోలీసులు.. నిందితుడు కుక్కలను తీసుకువెళ్లి చనిపోయే వరకు ఆకలితో ఉంచినట్లు అంగీకరించాడని కొరియా హెరాల్డ్ నివేదించింది. అయితే శునకాల మృతికి తానే కారణమని నిందితుడు అంగీకరించాడు. యజమానులు వదిలేసిన, జీవితకాలం పూర్తయిన శునకాలను సేకరించి వాటి కడుపుమాడ్చి చనిపోయేలా చేసినట్లు వివరించాడు. ఇందుకు గాను ఒక్కో శునకానికి వాటి యజమానులు తనకు రూ.623 ఇచ్చినట్లు వెల్లడించాడు. జంతు హక్కులు ఉల్లంఘించినందుకు ఇతనిపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు అధికారులు. స్థానిక చట్టాల ప్రకారం ఇతనికి మూడేళ్ల వరకు జైలు శిక్ష లేదా రూ.2లక్షల వరకు జరిమానా విధించే అవకాశముంది.
ముంబై తీరంలో ‘ధృవ్’ హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్
ఇండియన్ నేవీకి చెందిన ఓ తేలికపాటి హెలికాప్టర్‌కు తృటిలో ప్రమాదం తప్పింది. ఇండియన్ నేవీ హెలికాప్టర్ ఈరోజు ముంబై తీరంలో అత్యవసరంగా ల్యాండ్ అయింది. అడ్వాన్స్‌డ్ లైట్ హెలికాప్టర్ (ఏఎల్‌హెచ్) రొటీన్ ఫ్లయింగ్ మిషన్‌లో ఉన్నప్పుడు ఈ ఘటన జరిగింది. దీంతో హెలికాప్టర్‌ను ముంబయి తీరంలో అత్యవసరంగా నీటిపై ల్యాండ్ చేసినట్లు పేర్కొన్నారు. ‘ధృవ్’ హెలికాప్టర్‌లోని ముగ్గురు సిబ్బందిని రక్షించినట్లు భారత నావికాదళం తెలిపింది. ఘటన గురించి తెలియగానే రంగంలోకి దిగిన అధికారులు.. పెట్రోలింగ్ ఎయిర్‌క్రాఫ్ట్‌ను పంపించి వారిని కాపాడారు. సాంకేతిక లోపం కారణంగానే ఈ ఘటన చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై అధికారులు దర్యాప్తునకు ఆదేశించారు. అరేబియా సముద్రం మీదుగా వెళ్తున్న సమయంలో సాంకేతిక లోపం కారణంగా హెలికాప్టర్ అకస్మాత్తుగా ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసిందని అధికారులు తెలిపారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు.
న్యూజిలాండ్‌లో బుమ్రా సర్జరీ విజయవంతం.. క్రికెట్ రీఎంట్రీ అప్పుడే..
కొంతకాలంగా వెన్నునొప్పితో బాధపడుతున్న భారత స్టార్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రాకు శస్త్రచికిత్స పూర్తయినట్లు తెలుస్తోంది. శస్త్ర చికిత్స కోసం బుమ్రాను బీసీసీఐ న్యూజిలాండ్‌కు పంపిచింది. జోఫ్రా ఆర్చర్ (ఇంగ్లండ్), షేన్ బాండ్ (న్యూజిలాండ్)కు సర్జరీ చేసిన డాక్టర్ రోవన్ షౌటెన్.. బుమ్రాకు చికిత్స అందించాడు. ఆ సర్జరీ విజయంవంతం అయిందని క్రిక్ బజ్ ఓ నివేదికలో తెలిపింది. అయితే, బుమ్రా పూర్తిగా కోలుకుని మైదానంలోకి వచ్చి మళ్లీ ఆడాలంటే దాదాపు ఆరునెలల సమయం పట్టొచ్చు. దీంతో బుమ్రా డబ్ల్యూటీసీ ఫైనల్, ఆసియా కప్‌లకు దూరం కానున్నాడు. పూర్తి ఫిట్ నెస్ సాధిస్తే అక్టోబర్, నవంబర్‌లో జరిగే వన్డే వరల్డ్ కప్‌లో ఆడే అవకాశం దక్కొచ్చు. న్యూజిలాండ్‌లోని క్రిస్ట్‌చర్చ్ పట్టణంలో బుమ్రాకు శస్త్రచికిత్స జరిగింది. ఈ శస్త్ర చికిత్స విజయవంతమైనట్లు, దీని నుంచి ఆయన కోలుకుంటున్నట్లు క్రిక్ బజ్ వెల్లడించింది. బీసీసీఐ పర్యవేక్షణలోని బుమ్రాకు ఈ శస్త్రచికిత్స జరిగింది. ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్న బుమ్రా పూర్తిగా కోలుకోవడానికి మరి కొంత సమయం పట్టే అవకాశం ఉంది. దీంతో రాబోయే ఐపీఎల్, ఆ తర్వాత జరిగే ఆసియా కప్‌లో కూడా బుమ్రా ఆడే అవకాశం లేదు. గత ఆగస్టులో గాయపడ్డ బుమ్రా అప్పటి నుంచి ఆటకు దూరమయ్యాడు. వెన్ను నొప్పి కారణంగా సెప్టెంబర్‌లో జరిగిన ఆసియా కప్-2022, టీ20 వరల్డ్ కప్, తాజా బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ వంటి కీలక టోర్నీలకు కూడా బుమ్రా దూరమయ్యాడు. త్వరలో ప్రారంభం కానున్న ఐపీఎల్ టోర్నీకి కూడా అందుబాటులో ఉండటం లేదు. ఇది ఐపీఎల్‌లో బుమ్రా ప్రాతినిధ్యం వహిస్తున్న ముంబై ఇండియన్స్ జట్టుకు గట్టి ఎదురుదెబ్బగానే చెప్పాలి. సర్జరీ పూర్తైన బుమ్రా కనీసం 24 వారాలపాటు విశ్రాంతి తీసుకోవాల్సి ఉంది. దీంతో కనీసం సెప్టెంబర్ వరకు అతడు ఆటకు దూరంగా ఉండాలి. ఈ నేపథ్యంలో ఆ తర్వాత స్వదేశంలో ప్రారంభమయ్యే వన్డే వరల్డ్ కప్‌కు మాత్రమే బుమ్రా అందుబాటులోకి వస్తాడు. అంటే ఏడాదికిపైగా బుమ్రా జాతీయ జట్టుకు దూరమవుతున్నాడు.
నా తండ్రి నీచుడు.. అందుకే సిగ్గులేకుండా చెప్పా
ప్రస్తుతం సమాజంలో ఒక మహిళ.. నిజాన్ని నిజాయితీగా చెప్పినా ఆమెపై విమర్శలు గుప్పిస్తున్నారే కానీ సపోర్ట్ ఇచ్చేవారు చాలా తక్కువమంది ఉన్నారు. అది హీరోయిన్లు అయితే మరింత ట్రోల్స్ చేస్తూ ఉంటారు. ఏ విషయంలో అయినా ఒక ఆడది అబద్దాలు చెప్తుందేమో కానీ లైంగిక వేధింపులకు గురయ్యాను అని మాత్రం పొరపాటున కూడా చెప్పదు. ఇక ఇండస్ట్రీలో ఆ విషయం చెప్తే ఎక్కడ తమ కెరీర్ ను నాశనం చేస్తరేమో అన్న భయంతో ఎంత బాధ ఉన్నా బయటికి మాత్రం నవ్వుతూ కనిపిస్తారు. ఇక ఈ మధ్యనే వారు ఆ భయాన్ని వదిలిపెట్టారు. తమను లైంగికంగా వేధించనవారి పేరులు మీడియా ముందుకు చెప్పుకొస్తున్నారు. రెండు రోజుల క్రితం సీనియర్ నటి ఖుష్బూ తాను చిన్నప్పుడు లైంగిక వేధింపులకు గురయ్యినట్లు చెప్పుకొచ్చింది. తన కన్న తండ్రే తనను లైంగికంగా వేధించినట్లు చెప్పుకొచ్చింది. దీంతో ఆమెకు సపోర్ట్ చేయాల్సింది పోయి.. ఆమెపై ట్రోల్స్ చేస్తున్నారు. సిగ్గులేదా..? కన్నతండ్రి ఇలా చేశాడు అని చెప్పి పరువు తీస్తున్నావ్ అంటూ విమర్శిస్తున్నారు. ఇక ఈ విమర్శలపై ఖుష్బూ స్పందించింది. ” నా తండ్రి నీచుడు. అతడి గురించి చెప్పడానికి నేనెందుకు సిగ్గుపడాలి. సిగ్గుపడాల్సింది నేను కాదు అలా నాతో ప్రవర్తించిన వ్యక్తి.. ఈ విషయం చెప్పడం వలన నాలా బాధపడిన వారు ఇప్పుడు బయటికి వచ్చి వారికి జరిగిన చేదు అనుభవాలను ఎంతో ధైర్యంగా చెప్పుకొస్తున్నారు” అని తెలిపింది. ప్రస్తుతం ఖుష్బూ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.