NTV Telugu Site icon

Top Headlines @ 5 PM: టాప్‌ న్యూస్‌

Top Headlines @ 5 Pm

Top Headlines @ 5 Pm

గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌లో విదేశీ పెట్టుబడులు ఒక్కపైసా రాలేదు..!
విశాఖపట్నం వేదికగా గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌(జీఐఎస్) నిర్వహించిన ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం పెద్ద ఎత్తున పెట్టుబడులు రాబట్టింది.. ఈ మేరకు ఆయా సంస్థలతో ఎంవోయూలు కూడా కుదుర్చుకుంది.. అయితే, జీఐఎస్‌పై విపక్షాల నుంచి విమర్శలు తప్పడం లేదు.. ఈ వ్యవహారంపై స్పందించిన బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్‌.. శ్రీ సత్యసాయి జిల్లాలో మీడియాతో మాట్లాడుతూ.. గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మెలో ఒక్క పైసా కూడా విదేశీ పెట్టుబడి రాలేదని ఆరోపించారు.. బటన్‌లు నొక్కినట్లు ఉత్తుత్తి కార్యక్రమాలు చేయడమేంటి..! అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.. ఇక, ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార పార్టీ  టక్కుటమారా విద్యలు ప్రదర్శిస్తోందని మండిపడ్డారు.. ఉపాధ్యాయ, పట్టబద్రుల ఎన్నికల్లో ప్రతి నియోజకవర్గంలో విద్యా అర్హతలు లేని వారిని, టీచర్ ట్రైనింగ్ కానీ వారిని దొంగ ఓట్ల జాబితాలో చేర్చారని విమర్శలు గుప్పించారు బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్‌..

మార్చి, ఏప్రిల్‌లో ప్రభుత్వ పథకాల తేదీలు ఖరారు.. కోడ్‌ ముగియగానే వరుసగా కార్యక్రమాలు
ఎన్ని ఇబ్బందులు ఎదురైనా సంక్షేమ పథకాల విషయంలో ఏ మాత్రం వెనక్కి తగ్గడంలేదు ఆంధ్రప్రదేశ్‌లోని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వం.. అయితే ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ నేపథ్యంలో ప్రభుత్వ కార్యక్రమాల నిర్వహణ, పథకాల అమలుకు బ్రేక్‌ పడింది.. కానీ, ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ ముగియగానే వరుసగా కార్యక్రమాలు నిర్వహించనున్నారు.. మార్చి, ఏప్రిల్‌ నెలల్లో ప్రభుత్వ కార్యక్రమాలు, పథకాల అమలు తేదీలు ఖరారు చేశారు.. సీఎంవో అధికారులతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి సమావేశం అయ్యారు.. అసెంబ్లీ సమావేశాలు, మార్చి, ఏప్రిల్‌ నెలల్లో చేపట్టాల్సిన కార్యక్రమాలు, అమలు చేయాల్సిన పథకాల తేదీలను ఫైనల్‌ చేశారు.. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ కారణంగా పలు కార్యక్రమాలు నిలిచిపోయాయి.. ఎన్నికల కోడ్‌ ముగియనుండడంతో ఈ కార్యక్రమాలు, పథకాల అమలుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.. అయితే, ఎన్నికల కోడ్‌తో సంబంధం లేని కారణంగా మార్చి 10వ తేదీ నుంచి మధ్యాహ్న భోజనంతో పాటు రాగిజావ అమలు ప్రారంభించబోతున్నారు.. ఇక, మార్చి 14వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు నిర్ణయం తీసుకున్నారు.. బీఏసీ సమావేశంలో అసెంబ్లీ సమావేశాల షెడ్యూలు.. ఎన్ని రోజుల పాటు సమావేశాలు నిర్వహించాలనే విషయాన్ని ఖరారు చేయనున్నారు.. ఇక, మార్చి 18వ తేదీన సంపూర్ణ ఫీజురీయింబర్స్‌మెంట్‌ పథకం.. జగనన్న విద్యాదీవెన లబ్ధిదారుల ఖాతాల్లోకి డీబీటీ పద్ధతిలో నగదు జమ చేయనున్నారు. మార్చి 22న ఉగాది రోజున ఉత్తమ సేవలందించిన వాలంటీర్ల పేర్లు ప్రకటించనున్నారు.. వీరికి ఏప్రిల్‌ 10న అవార్డులు, రివార్డులు అందజేయనున్నారు. మార్చి 23న జగనన్నకు చెబుదాం కార్యక్రమం ప్రారంభించనున్నారు. మార్చి 25వ తేదీ నుంచి వైయస్సార్‌ ఆసరా.. ఏప్రిల్‌ 5వ తేదీ వరకు కొనసాగనుంది. మార్చి 31న జగనన్న వసతి దీవెన.. ఏప్రిల్‌ 6న ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్‌ అమలు.. ఏప్రిల్‌ 10న వాలంటీర్లకు సన్మానం.. ఏప్రిల్‌ 18న ఈబీసీ నేస్తం.. ఇలా వరుస కార్యక్రమాలు, పథకాల అమలు చేయనుంది ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం.

మరో గుండె ఆగింది.. కబడ్డీ ఆడుతూ కుప్పకూలిన బీఫార్మసీ విద్యార్థి..
వయస్సుతో సంబంధం లేకుండా.. పిల్లలు, యువకులు, పెద్దవాళ్లు, వృద్ధులు అనే తేడా లేకుండా.. ఈ మధ్య కాలంలో గుండె ఆగిపోయి ఎంతో మంది ప్రాణాలు విడిచారు.. ఆడుతూ కొందరు.. పాడుతూ మరికొందరు.. శుభకార్యంలో ఇంకా కొందరు.. ఇలా ఎక్కడపడితే అక్కడ.. అనే తేడా లేకుండా గుండె పోటుతో కన్నుమూస్తున్నారు.. తాజాగా, ఈ జాబితాలో ఓ బీఫార్మసీ విద్యార్థి చేరాడు.. 19 ఏళ్లకే నూరేళ్లు నిండిపోయాయంటూ.. ఈ లోకాన్ని వదిలేశాడు.. స్నేహితులతో కలిసి సరదాగా కబడ్డీ ఆడుతుండగా.. ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు.. ఆస్పత్రిలో మృత్యువుతోపోరాడి ఓడిపోయాడు. ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ఆ విషాద ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అనంతపురం పట్టణంలోని PVKK కాలేజీలో మొదటి సంవత్సరం బీఫార్మసీ చదువుతున్న తనూజ నాయక్ అనే 19 ఏళ్ల విద్యార్థి.. ఈనెల 1వ తేదీన కాలేజీ గ్రౌండ్‌లో కబడ్డీ ఆడాడు.. సరదాగా స్నేహితులతో కలిసి కబడ్డీ ఆడుతోన్న సమయంలో.. ఉన్నట్టుండి కుప్పకూలి పోయాడు తనూజ నాయక్.. దీంతో, ఆ విద్యార్థిని ఆస్పత్రికి తరలించారు.. బెంగళూరులోని రామయ్య ఆస్పత్రిలో చికిత్స అందించారు.. కానీ, మృత్యువుతో ఆ యువకుడి పోరాటం ఎక్కువరోజులు కొనసాగించలేకపోయాడు.. ఈ రోజు ఉదయం తుది శ్వాస విడిచాడు తనూజ నాయక్‌.. మృతి చెందిన విద్యార్థి స్వస్థలం మడకశిర మండలం ఈ అచ్చంపల్లి తాండాగా చెబుతున్నారు.. చేతికొస్తున్న కొడుకు.. ఇలా మధ్యలోనే ప్రాణాలు వీడడంతో.. ఆ కుటుంబంలో.. ఆ గ్రామంలో విషాదం నెలకొంది. మరోవైపు.. ఎవరికి ఎప్పుడు.. గుండి ఆగిపోతుందో కూడా తెలియని పరిస్థితి ఉందంటా.? అంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

కేసీఆర్‌కు జవాబిచ్చే సంస్కారం లేదు.. కిషన్ రెడ్డి ఫైర్
కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మరోసారి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ధ్వజమెత్తారు. వివిధ ప్రాజెక్టులపై రాష్ట్ర ప్రభుత్వంతో తాము చర్చలు జరుపుతున్నామని, లేఖలు కూడా రాస్తున్నామని అన్నారు. సీఎం కేసీఆర్‌కు తాను పదే పదే ఉత్తరాలు రాస్తున్నానని, అయితే ఏ ఒక్క దానికి కూడా సీఎం నుండి జవాబు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్ని లేఖలు రాసినా.. తెలంగాణకు ప్రధాని మోడీ, కిషన్ రెడ్డి ఏం చేశారని కేసీఆర్, ఆయన కుమారుడు కేటీఆర్ అడుగుతున్నారని మండిపడ్డారు. కేంద్రమంత్రులకు ప్రజాప్రతినిధుల నుండి వచ్చే లేఖలను ప్రాసెస్ చేసేందుకు ఒక ప్రత్యేక వ్యవస్థ ఉంటుందన్నారు. కేసీఆర్‌కు జవాబు ఇచ్చే సంస్కారం లేదు కాబట్టి, కేంద్రప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు కూడా లేదని తేల్చి చెప్పారు. ట్రైబల్ మ్యూజియం కోసం భూమి ఇవ్వాలని కేంద్రం అడిగితే.. ఇప్పటివరకూ ఇవ్వలేదన్నారు. అయితే.. కేంద్రం మాత్రం అందుకు ఇప్పటికే రూ.1 కోటి ఇచ్చిందని పేర్కొన్నారు. అంతకుముందు కూడా.. దేశ ఆర్థిక పరిస్థితిపై చర్చించేందుకు తాను సిద్ధమేనని, కేసీఆర్ ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తానని కిషన్ రెడ్డి సవాల్ విసిరారు. కేంద్రంపై బురదజల్లేందుకు కేసీఆర్ అసెంబ్లీని వాడుకున్నారని.. అసెంబ్లీలో దేశ ఆర్థిక పరిస్థితి గురించి మాట్లాడిన కేసీఆర్, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. దేశ ఆర్థిక పరిస్థితిపై కేసీఆర్‌కు అవగాహన లేదని విమర్శించిన ఆయన.. అసెంబ్లీ సమావేశాల్లో మోదీని ద్వేషించడమే పనిగా పెట్టుకున్నారన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో కూరుకుపోయిందంటూ.. ప్రపంచానికి తప్పుడు సంకేతం ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. గత బడ్జెట్‌లో ఇచ్చిన హామీలను రాష్ట్ర ప్రభుత్వం నెరవేర్చలేదని, ప్రాజెక్టుల పేర్లతో వేలకోట్ల దోపిడీ రాష్ట్రంలో జరుగుతోందని ఆరోపించారు. మరొకొన్ని నెలల్లో కేసీఆర్ సీఎం గద్దె నుంచి దిగిపోతారని, అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాజ్‌భవన్‌లో రాజీనామా లేఖ ఇవ్వకతప్పదని కిషన్ రెడ్డి చెప్పుకొచ్చారు.

అన్ని రంగాల్లోనూ నారీశక్తి.. ఎయిర్‌ఫోర్స్‌ కెప్టెన్‌గా షాలిజా ధామి
సైన్యంలో మహిళలు రాణించడమంటే సామాన్యమైన విషయం కాదు. కానీ ఇప్పుడు అది చిన్నవిషయంగా మారిపోతోంది. ఎందుకంటే మహిళలు ఇప్పుడు త్రివిధ దళాల్లో కీలకపాత్ర పోషిస్తున్నారు. గతంలో వివిధ భారత సైనిక దళాలలో పురుషులు మాత్రమే ముందుండే మహిళలు త్రివిధదళాలలో ఉన్నప్పటికీ ప్రత్యక్ష యుద్ధరంగంలో క్రియాశీలక పాత్రలో ఉండేవారు కాదు. ఇప్పుడు త్రివిధ దళాల్లో తమ శక్తి యుక్తులను నిరూపించుకుంటూ పురుషులకు దీటుగా సత్తా చాటుతున్నారు. షాలిజా ధామి చరిత్ర సృష్టించ‌నుంది. ఎయిర్ ఫోర్స్ ఫ్రంట్ లైన్ కంబాబ్ యూనిట్‌కి మ‌హిళా అధికారిగా రానున్నారు. భార‌త వైమానిక ద‌ళం పాశ్చాత్య సెక్టార్‌లోని ఫ్రంట్ లైన్ కంబాట్ యూనిట్‌కు నాయ‌క‌త్వం వ‌హించ‌నున్నారు. ఈ మేర‌కు గ్రూప్ కెప్టెన్‌గా వ్యవ‌హ‌రించ‌నున్నారు షాలిజా ధామి. ఈ సంద‌ర్భంగా షాలిజా ధామి ఎంపిక మ‌హిళా లోకానికి స్పూర్తిదాయ‌కం కానుంది. ఐఏఎఫ్ చ‌రిత్రలో మొట్ట మొద‌టిసారిగా ఒక మ‌హిళా అధికారికి ఫ్రంట్ లైన్ కంబాట్ యూనిట్‌కు ఎంపిక చేయ‌డం విశేషం. ఆమె అసాధార‌ణ‌మైన ప్రతిభ‌కు, ప‌ట్టుద‌ల‌కు, నిబ‌ద్దత‌కు ద‌క్కిన గౌర‌వం అని చెప్పక త‌ప్పదు. ఈ నెల ప్రారంభంలో సైన్యం మొద‌టిసారిగా క‌మాండ్ పాత్రల‌కు మ‌హిళా అధికారుల‌ను కేటాయించ‌డం ప్రారంభించింది. వీరిలో దాదాపు 50 మంది ఫార్వర్డ్‌తో స‌హా కార్యాచ‌ర‌ణ ప్రాంతాల్లో యూనిట్‌ల‌కు చీఫ్‌లుగా వ్యవ‌హరిస్తారు. ఇది ఉత్తర‌, తూర్పు క‌మాండ్‌ల‌లో జ‌రుగుతుంది. ఇక గ్రూప్ కెప్టెన్ ధామి 2003లో హెలికాప్టర్ పైల‌ట్‌గా నియ‌మితుల‌య్యారు. 2,800 గంట‌ల‌కు పైగా విమానాన్ని న‌డిపిన అనుభ‌వం క‌లిగి ఉన్నారు షాలిజా దామ . క్వాలిఫైడ్ ఫ్లయింగ్ ఇన్‌స్ట్రక్టర్‌గా ఉన్నారు. ఆమె వెస్ట్రన్ సెక్టార్‌లోని హెలికాప్టర్ యూనిట్‌కు ఫ్లైట్ క‌మాండ‌ర్‌గా ప‌ని చేశారు. ఐఏఎఫ్‌లో గ్రూప్ కెప్టెన్ ఆర్మీలో క‌ల్నల్‌తో స‌మానం.

అమెరికా, యూరప్ జోక్యం కోరిన రాహుల్‌.. తీవ్రంగా స్పందించిన బీజేపీ
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బ్రిటన్‌లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా భారత్‌లో ప్రజాస్వామ్యం, పార్లమెంట్ పనితీరుపై బ్రిటన్ ఎంపీలు ఆయనను ప్రశ్నించారు. వీటికి సమాధానంగా భారత్‌లో పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయని రాహుల్‌ గాంధీ వెల్లడించారు. విపక్షాల ప్రశ్నలకు సమాధానం చెప్పేందుకు కేంద్రం సిద్ధంగా లేదంటూ రాహుల్‌ తెలిపారు. భారత్‌లో చోటుచేసుకుంటున్న పరిణామాలపై యూరప్, అమెరికా మౌనంగా ఉండడాన్ని ప్రశ్నించారు. దేశంలో ప్రజాస్వామ్యం రద్దైందని రాహుల్‌ గాంధీ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. దీనిపై అధికార బీజేపీ తీవ్రంగా స్పందించింది. రాహుల్ వ్యాఖ్యలు విదేశీ గడ్డపై భారత్ ను అవమానించడమేనంటూ కాషాయ పార్టీ నేతలు విమర్శలకు దిగారు. రాహుల్ గాంధీ తన ప్రసంగాలలో భారత ప్రజాస్వామ్యం, రాజకీయాలు, పార్లమెంటు, రాజకీయ వ్యవస్థ, న్యాయ వ్యవస్థను అవమానపరిచేలా మాట్లాడారాని బీజేపీ అధికార ప్రతినిధి రవిశంకర్ ప్రసాద్ ఆరోపించారు. “భారతదేశంలో ప్రజాస్వామ్యం రద్దయింది” అని లండన్‌లో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్య.. విదేశీ జోక్యాన్ని కోరుతూ విదేశీ గడ్డపై దేశాన్ని అవమానపరచడమేనని అధికార బీజేపీ ఆరోపించింది. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, సోనియా గాంధీ వివరణ ఇవ్వాలని బీజేపీ డిమాండ్ చేసింది. భారత్‌లో ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు యూరప్, అమెరికా జోక్యం చేసుకోవాలని రాహుల్ కోరుతున్నారని, అది ఏ ప్రభుత్వమైనా మన అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు రవిశంకర్ ప్రసాద్ తెలిపారు. దీనిపై ఖర్గే, సోనియా స్పందించాలన్నారు. నిన్న రాహుల్ చేసిన వ్యాఖ్యలతో భారత్ లో ప్రజాస్వామ్యంపై విదేశాలు సందేహాలు వ్యక్తం చేసే పరిస్ధితులు వచ్చాయని బీజేపీ మండిపడుతోంది.

ఢిల్లీ లిక్కర్‌ స్కాం కేసులో ఏడు రోజుల ఈడీ కస్టడీకి రామచంద్ర పిళ్లై
ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరెస్ట్ అయిన ప్రముఖ వ్యాపారవేత్త అరుణ్ రామచంద్ర పిళ్లై‌ను ఈడీ అధికారులు రౌస్‌ ఎవెన్యూ కోర్టులో హాజరుపర్చారు. ఈ కేసులో ఈడీ వాదనలు వినిపించింది. అరుణ్‌ రామచంద్ర పిళ్లైని ఏడు రోజులు కస్టడీకి ఇవ్వాలని ఈడీ న్యాయస్థానాన్ని కోరింది. ఈ నేపథ్యంలో ఈ నెల 13వరకు ఏడు రోజుల పాటు ఈడీ కస్టడీకి న్యాయస్థానం అనుమతి ఇచ్చింది. పిళ్లై విచారణకు సహకరించడం లేదని ఈడీ న్యాయస్థానానికి తెలిపింది. బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత ప్రతినిధి అంటూ అరుణ్ రామచంద్ర పిళ్ళై అంగీకరించారని… ఆయనను ఏడు రోజుల కస్టడీకి ఇవ్వండి అంటూ ఈడీ కోర్టును కోరింది. కేసు దర్యాప్తుకు సహకరించడం లేదని, మనీ ట్రయల్స్ గుట్టు తేల్చడానికి కస్టడీ అవసరమని, రూ.25కోట్లు నేరుగా ట్రాన్స్ఫర్ చేశారు..అంటూ ఈడీ వాదనలు వినిపించింది. అయితే పిళ్లైను అరెస్ట్‌ చేసేందుకు ఇంత ఆలస్యం ఎందుకు అయ్యిందని ఈడీ అధికారులను న్యాయమూర్తి ప్రశ్నించారు. లావాదేవీలకు సంబంధించిన డాక్యుమెంట్ సాక్ష్యం ఉన్న తర్వాత పదే పదే పిలిచి ఎందుకు ప్రశ్నలు అడుగుతున్నారని… నేరుగా అరెస్ట్ చేయవచ్చు కదా అని న్యాయమూర్తి అడిగారు. ప్రస్తుతం కోర్టులో వాదనలు ముగిశాయి.

మైక్రోసాఫ్ట్‌ సంచలన నిర్ణయం.. కోడింగ్‌తో పనిలేదు..!
టెక్‌ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌ మరో సంచలన నిర్ణయం తీసుకుంది.. మైక్రోసాఫ్ట్ చాట్‌జిపిటి వెనుక ఉన్న ఏఐ సాంకేతికతను పవర్ ప్లాట్‌ఫారమ్ అని పిలవబడే దాని ప్రసిద్ధ సాధనాలతో అనుసంధానించింది. మైక్రోసాఫ్ట్ తన సెర్చ్ ఇంజన్ బింగ్‌తో ఏఐని ఏకీకృతం చేయాలని నిర్ణయించుకున్న వారాల తర్వాత ఇది వస్తుంది. కొత్త డెవలప్‌మెంట్ పవర్ ప్లాట్‌ఫారమ్ వినియోగదారులను తక్కువ అనుభవం లేదా కోడింగ్ అనుభవం లేకుండా అప్లికేషన్‌లను అభివృద్ధి చేయడానికి అనుమతిస్తుంది. అంటే.. కోడింగ్‌తో పనిలేకుండా యాప్స్‌ను తయారు చేసేలా కొత్త టూల్‌ను విడుదల చేయనుంది. మైక్రోసాఫ్ట్‌ తన సొంత సెర్చ్‌ ఇంజిన్‌ ‘బింగ్‌’లో ఏఐ చాట్‌జీపీటీతో పాటు మరో ఏఐ టూల్‌ ‘పవర్‌ ప్లాట్‌ఫామ్‌’ను ఇంటిగ్రేట్‌ చేయనుంది. ఒక్కసారి ఈ టూల్‌ అందుబాటులోకి వస్తే.. ఏమాత్రం కోడింగ్‌ అవసరం లేకుండా వివిధ రకాలైన అప్లికేషన్లను డెవలప్‌ చేయొచ్చని తెలిపింది. ఆఫీస్‌లో ఆటోమెషిన్‌ సాయంతో చేసే పనులన్నీ ఈ టూల్‌తో చేసుకోవచ్చు. డేటాను విశ్లేషించడం (analyze), ఈమెయిల్‌ క్యాంపెయిన్‌, చాట్‌బోట్స్‌ తయారీ, వీక్లీ వర్క్‌ రిపోర్ట్స్‌ , కస్టమర్లు అడిగిన ప్రశ్నలకు సమ్మరీ తయారు చేసుకోవచ్చని మైక్రోసాఫ్ట్‌ ప్రతినిధులు చెబుతున్నారు.. మైక్రోసాఫ్ట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ సత్య నాదెళ్ల మార్చి 16న ఏఐతో ఉత్పాదకతను తిరిగి ఆవిష్కరించడం గురించి చర్చించడానికి ఒక ఈవెంట్‌ను నిర్వహించనున్నారు. కంపెనీ తన ప్రసిద్ధ విండోస్‌ ఆపరేటింగ్ సిస్టమ్ మరియు సెర్చ్‌ ఇంజిన్‌ ‘బింగ్‌’కోసం ఏఐ నవీకరణలను ప్రకటించినప్పటికీ, వర్డ్ మరియు ఎక్సెల్‌లను కలిగి ఉన్న దాని ఆఫీస్ ఉత్పాదకత సూట్ కోసం ఇది ఇంకా చేయలేదు. మైక్రోసాఫ్ట్ వ్యాపార ధోరణులపై ఇటీవలి సర్వేను ఉదహరించింది, దాదాపు 10 మంది కార్మికులలో 9 మంది తమ ఉద్యోగాలలో పునరావృతమయ్యే పనులను తగ్గించడానికి ఏఐని ఉపయోగించాలని ఆశిస్తున్నారని పేర్కొంది. సాఫ్ట్‌వేర్ దిగ్గజం డైనమిక్స్ 365 కోపైలట్‌తో, సంస్థలు తమ కార్మికులకు సేల్స్‌, సేవ, మార్కెటింగ్, కార్యకలాపాలు మరియు సరఫరా చైన్‌ కోసం రూపొందించిన ఏఐ సాధనాలను అందజేస్తాయని పేర్కొంది. మైక్రోసాఫ్ట్ క్లెయిమ్ చేస్తూ చివరికి ఏఐ ప్రతి ఒక్కరూ తమ ఉద్యోగాల్లోని ఉత్తమ భాగాలపై ఎక్కువ సమయాన్ని వెచ్చించడానికి అనుమతిస్తుంది.

వర్మ అసలు గురువు కన్నుమూత!
ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మేనమామ మురళీ రాజు మంతెన మంగళవారం ఉదయం అనారోగ్యంతో మృతి చెందారు. ఆంధ్రప్రదేశ్ భీమవరంకు చెందిన మురళీ రాజు గతంలో సినిమా సంబంధ వ్యాపారాలను చేశారు. ఆయన స్వయంగా ‘కార్తీక్’ అనే సినిమాను తెరకెక్కించారు. ఆయన కుమారుడు మధు మంతెన తెలుగు, తమిళ, హిందీ భాషల్లో పలు చిత్రాలను నిర్మించారు. మురళీ రాజు మరణవార్త తెలియగానే అల్లు అరవింద్, అల్లు అర్జున్, నిర్మాత బన్నీ వాసు తదితరులు మధురానగర్ లోని మురళి రాజు నివాసానికి వెళ్లి నివాళులు అర్పించారు. ముంబై నుండి ఆమీర్ ఖాన్ సైతం హైదరాబాద్ వచ్చి నివాళులు అర్పించినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. ఇదిలా ఉంటే… రామ్ గోపాల్ వర్మ దర్శకత్వ శాఖలో ఎక్కడా పనిచేయలేదని చాలామంది అనుకుంటారు. కానీ చిన్నప్పటి నుండి సినిమా రంగంతో వర్మకు సంబంధం ఉంది. ఆయన తండ్రి కృష్ణంరాజు సౌండ్ ఇంజనీయర్. ఎక్కువగా అక్కినేని నాగేశ్వరరావు చిత్రాలకు పనిచేశారు. అలానే రామ్ గోపాల్ వర్మలోని సినిమాపై ఆసక్తిని తొలుత కనిపెట్టి, ప్రోత్సహించిన వ్యక్తి ఆయన మేనమామ మంతెన మురళీ రాజే. స్వయాన వర్మ తల్లి సోదరుడైన మురళీరాజు… ప్రపంచ సినిమాను అధ్యయనం చేశారు. ఆయనకు బాగా నచ్చిన చిత్రం మార్లన్ బ్రాండో నటించిన ‘గాడ్ ఫాదర్’. ఈ సినిమాపై ఆయన పలు కోణాల్లో విశ్లేషణలు చేసేవారు. ఆ ప్రభావం రామ్ గోపాల్ వర్మపై పడింది. అందుకే వర్మ తొలి చిత్రాలను పరిశీలిస్తే… ‘గాడ్ ఫాదర్’ ఛాయలు వాటిల్లో కనిపిస్తూనే ఉంటాయి. వర్మ ఇంజనీరింగ్ చదువును అర్థాంతరంగా వదిలివేస్తే… అతనిలో ఓ దర్శకుడు దాగున్నాడని ఇంట్లో వాళ్ళకు నచ్చచెప్పి, అన్నపూర్ణ స్టూడియోస్ లో తొలుత షూటింగ్స్ అబ్జర్వ్ చేయమని ఉపదేశించింది మురళీ రాజే. ఆ తర్వాత ఇంగ్లీష్ చిత్రం ‘సౌండ్ ఆఫ్ మ్యూజిక్’ స్ఫూర్తితో రూపొందిన ‘రావుగారిల్లు’ చిత్రానికి దర్శకుడు తరణీరావు వద్ద కో-డైరెక్టర్ గా వర్మ పనిచేశాడు. అలానే ఏయన్నార్ హీరోగా రూపొందిన ‘సంగీత సమ్రాట్’కు దర్శకుడు సింగీతం శ్రీనివాసరావుకు అసోసియేట్ గా ఉన్నాడు. ఆ తర్వాతే వర్మ ‘శివ’ చిత్రం స్క్రిప్ట్ తయారు చేసుకుని దర్శకుడు కావాలన్న తన అభిలాషతో ప్రయత్నాలు మొదలు పెట్టాడు. ఈ తతంగం అంతటి వెనుక తన మేనమామ మురళీ రాజు ప్రభావం ఉందని రామ్ గోపాల్ వర్మ ఓ ఇంటర్వ్యూలో వర్మ స్వయంగా తెలిపాడు. మురళీ రాజుకు ఇద్దరు పిల్లలు. కొడుకు మధు. నిర్మాతగా కొనసాగుతున్నాడు.

ఏయ్.. ఏయ్.. ఎన్నాళ్లకు ఎన్నాళ్లకు కెమెరా కంటికి చిక్కారు
డైరెక్టర్ పూరి జగన్నాథ్- నటి, నిర్మాత ఛార్మీ మధ్య స్నేహ బంధాన్ని మించి ఇంకేదో ఉందని టాలీవుడ్ టాక్. ఛార్మీ వలనే.. పూరి, తన భార్య పిల్లలను పక్కన పెట్టాడని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తూనే ఉంటాయి. ఇక అంతేకాకుండా పూరితో రిలేషన్ వలనే ఛార్మీ ఇంకా పెళ్లి చేసుకోకుండా ఉండిపోయిందని కూడా రూమర్స్ పుట్టుకొచ్చాయి. ఇక ఇవన్నీ వదిలేస్తే.. ప్రస్తుతం వారిద్దరూ బిజినెస్ పార్ట్నర్స్. పూరి కనెక్ట్స్ బ్యానర్ ను ఇద్దరు దగ్గర ఉండి నడిపిస్తున్నారు. ఇక గతేడాది రిలీజ్ అయిన లైగర్ సినిమాను తెరకెక్కించి చేతులు కాల్చుకున్నారు. ఆ తరువాత లైగర్ సినిమా పెట్టుబడుల్లో విదేశీ పెట్టుబడులు ఉన్నాయన్న ఆరోపణలు ఎదుర్కొన్నారు. దానికోసం ఈ జంటను ఈడీ విచారించింది. ఇక అప్పటి నుంచి ఈ జంట బయట ఎక్కడా కనిపించింది లేదు. లైగర్ ప్లాప్ తరువాత ఛార్మీ.. సోషల్ మీడియాకు కూడా టాటా చెప్పేసింది. దీంతో వారిద్దరూ ఇప్పుడు ఏం చేస్తున్నారు అనేది తెలియదు. ఇక చాన్నాళ్ల తరువాత ఈ జంట కెమెరా కంటికి చిక్కారు. నేటి ఉదయం పూరి- ఛార్మీ ముంబై ఎయిర్ పోర్టులో దర్శనమిచ్చారు. ఇంత గ్యాప్ తరువాత ఈ జంట కనిపించేసరికి ఫొటోగ్రాఫర్లు తమ కెమెరాలకు పనిచెప్పారు. ఇక పూరి కొత్త సినిమా కోసం ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. మరి ఈసారి ఏ హీరోతో వచ్చి పూరి బౌన్స్ బ్యాక్ అవుతాడో చూడాలి.