NTV Telugu Site icon

Top Headlines @ 5 PM: టాప్‌ న్యూస్‌

Top Headlines @ 5 Pm

Top Headlines @ 5 Pm

చంద్రబాబు, పవన్ కల్యాణ్‌ ఇద్దరూ ఒక్కటే.. పేర్లే వేర్వేరు
చంద్రబాబు, పవన్ కల్యాణ్‌ పేర్లే వేర్వేరు.. కానీ, మనుషులు ఇద్దరు ఒక్కటేనని ఆరోపించారు మంత్రి విడదల రజినీ…. రాష్ట్రంలో ఎమర్జెన్సీ పరిస్థితులు ఉన్నాయనేది వాళ్లు కలిసి చేస్తున్న దుష్ప్రచారమని తిప్పికొట్టిన ఆమె.. కందుకూరు, గుంటూరులో ప్రాణాలు కోల్పోయిన బాధితులను పరామర్శించ కుండా.. పవన్, చంద్రబాబు ఒకరిని ఒకరు పరామర్శ చేసుకోవడం విడ్డూరంగా ఉందని ఫైర్ అయ్యారు. ఇక, రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీలు నిర్మాణం చేసి తీరుతాం.. ఆ దిశగా చిన్నచిన్న సమస్యలు ఉన్నా అధిగమిస్తామని ప్రకటించారు మంత్రి విడదల రజినీ.. ఆరోగ్య శ్రీ పథకం చంద్రబాబు పాలనలో అనారోగ్యం పాలైందన్న ఆరోపించారు.. 2030 నాటికి కేన్సర్ వైద్యం కోసం ఆంధ్రప్రదేశ్‌ నుంచి ఒక్క పేషేంట్ కూడా బయట రాష్ట్రాలకు వెళ్లకూడదనేది ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి నిర్ధేశంగా చెప్పుకొచ్చారు.. మన్యం ప్రాంతంలో సికిల్ సెల్ ఎనీమియా టెస్టుల కోసం స్పెషల్ డ్రైవ్ నిర్వహించనున్నట్టు ప్రకటించారు.. ఫ్యామిలీ పీజీషియన్ వ్యవస్థను సమర్ధవంతంగా నిర్వహిస్తున్నామని ఈ సందర్భంగా వెల్లడించారు మంత్రి విడదల రజినీ..

బీఆర్‌ఎస్‌ అంటే భస్మాసుర సమితి
టీపీసీసీ చీఫ్ రేవంత్‌ రెడ్డి మరోసారి సీఎం కేసీఆర్‌పై నిప్పులు చెరిగారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మొక్క చనిపోతే సర్పంచ్‌ని సస్పెండ్ చేస్తానని సీఎం అంటున్నాడని, మూసిలో 30 మంది కొట్టుకుపోయారు.. సీఎంని ఏం చేయాలి.. మహేశ్వరంలో ఇళ్లలోకి నీళ్లు వచ్చి ఉన్నాయి.. మల్కాజిగిరిలో మూసిలో చిన్న పిల్లలు కొట్టుకుని పోయారు.. సీఎంని ఏం చేయాలి మరి అంటూ ఆయన మండిపడ్డారు. అంతేకాకుండా.. మున్సిపల్ శాఖ మంత్రి చేతకాని తనం బయట పడిందని, తండ్రి.. కొడుకులను ట్యాంక్ బండ్ దగ్గర ఉరి వేసినా తప్పు లేదంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగులకు జీతమే ఇవ్వడం లేదని, ఉద్యోగుల జీతాల కోసమే 3 వేల కోట్లు అప్పు చేశారు కేసీఆర్ అని ఆయన ఆరోపించారు. బీఆర్‌ఎస్‌ అంటే భస్మాసుర సమితి అని ఆయన వ్యాఖ్యానించారు. అధిక తెలివితో తన నెత్తిన తాను చేయి పెట్టుకున్నాడని, కేసీఆర్ కూడా అలాగే తయారు అయ్యారంటూ ఆయన విమర్శలు గుప్పించారు. తాను సచ్చిపోతు… సర్పంచులని కూడా సంపకు కేసీఆర్ అని ఆయన హితవు పలికారు. కేసీఆర్‌ని పొలిమేర్ల నుండి తరమండని ఆయన అన్నారు. సర్పంచుల హక్కులు కలరాసే చట్టాలు రద్దు చేస్తామని, కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కేసీఆర్ తెచ్చిన చట్టం రద్దు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. నిధులు ఇస్తామని, సర్పంచులు తిరగపడండంటూ ఆయన వ్యాఖ్యలు చేశారు. సర్పంచులు తలుచుకుంటే కేసీఆర్‌ని బొంద పెట్టొచ్చు.. ఇల్లు ఇల్లు తిరిగి ప్రజలకు కేసీఆర్ గురించి చెప్పండని, సర్పంచులు ఆత్మగౌరవంగా ఉండాలి అంటే… కేసీఆర్ ప్రభుత్వం పోవాలి అని ఆయన అన్నారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వకపోతే.. కేసీఆర్ ఉద్యోగం ఉడటం ఖాయమని ఆయన వ్యాఖ్యానించారు.

సంక్రాంతి వేళ చార్జీల మోత..! ప్రత్యేక నిఘా
సంక్రంతి పండుల సమయంలో ఈ ఏడాది కూడా ప్రైవేట్‌ ట్రావెల్స్‌ చార్జీలను భారీ పెంచే అవకాశం ఉండడంతో.. అప్రమత్తం అయ్యారు రవాణాశాఖ అధికారులు.. దీనిపై ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన జేటీసీ వెంకటేశ్వరరావు.. సంక్రాంతికి ప్రతేడాది చేస్తున్న విధంగానే ఈసారి కూడా ప్రైవేట్ ట్రావెల్స్ ఛార్జీలు పెంచే అవకాశం ఉంటుందని.. దీనిపై రవాణ శాఖ ప్రత్యేక డ్రైవ్ ఉంటుందని తెలిపారు.. పండుగ దినాలను ఆసరా తీసుకుని ఛార్జీలు పెంచే అవకాశం ఉంటుంది.. దీనికి చెక్‌ పెట్టేందుకు బార్డర్ చెక్ పోస్టుల్లో నిఘా పెడతామని వెల్లడించారు. ప్రైవేట్‌ ట్రావెల్స్‌ ఆగడాలకు చెక్‌ పెట్టేందుకు చెక్ పోస్టుల్లో ప్రత్యేక సిబ్బందిని పెడతామని తెలిపారు జేటీసీ వెంకటేశ్వరరావు. నిఘా బృందాలను ఏర్పాటు చేసుకుంటున్నాం. స్టాపేజ్ ఉన్న బస్సులను తిప్పుతారు.. ఫిట్నెస్ లేని బస్సులు.. టాక్స్‌లు కట్టని బస్సులు తిరిగే అవకాశం ఉంటుందని.. నిబంధనలు ఉల్లంఘిస్తే వాహనాలను సీజ్‌ చేస్తామని హెచ్చరించారు. పాసింజర్లకు ఇబ్బంది లేకుండా తనిఖీలు చేస్తాం.. సేఫ్టీ లేని బస్సుల్లో ప్రయాణం చేయవద్దని పాసింజర్లకు విజ్ఞప్తి చేశారు. ఇవాళ నుంచే రవాణా శాఖ తనిఖీల డ్రైవ్ చేపట్టనున్నట్టు ప్రకటించారు జేటీసీ వెంకటేశ్వరరావు.

విద్యార్థులతో కలిసి సీఎం స్టెప్పులు.. ఆయన భార్య కూడా ఆగలేకపోయింది..
అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ పాఠశాల విద్యార్థులతో కలిసి ఒక కార్యక్రమంలో సాంప్రదాయ జానపద నృత్యాన్ని ప్రదర్శించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ముఖ్యమంత్రి తన డ్యాన్స్ వీడియోను కూడా పంచుకున్నారు.. ఝుమూర్‌ ప్రదర్శనను చూస్తూ ఉండలేకపోయా అంటూ తన ఉత్సాహాన్ని చెప్పకనే చెప్పుకొచ్చారు సీఎం.. హతింగా టీఈ మోడల్‌ స్కూల్‌ విద్యార్థులు.. సీఎం స్వగృహంలో ఆదివారం సాయంత్రం పలు నృత్య ప్రదర్శనలు ఇచ్చారు. ముందుగా అస్సాం టీ తోటల్లో పని చేసే వాళ్ల సంప్రదాయ నృత్యం ‘ఝూమూర్‌’ ప్రదర్శన ఇచ్చారు.. ఇక, విద్యార్థుల నృత్యాన్ని చూసి ఆగలేకపోయిన ఆయన.. వాళ్లతో కలిసి డ్యాన్స్‌లు చేశారు. విద్యార్థులను ఉత్సాహపరిచే ఉద్దేశంతో స్టేజ్‌ ఎక్కిన సీఎం హిమంత శర్మ.. వారితో కలిసి కాలు కదిపారు.. స్టెప్పులేశారు. సీఎం స్టెప్పులను చూసి.. మరికొందరు విద్యార్థినిలు స్టేజ్‌పై చేరుకున్నారు.. ఇక, అక్కడే ఉన్న సీఎం భార్య రింకీ భూయాన్‌ శర్మ కూడా వాళ్లతో కలిసి కాలు కదిపారు.. ఈ కార్యక్రమానికి జానపద సంగీత వాయిద్యకారులు పద్మశ్రీ దులాల్‌ మాన్‌కీ, ప్రముఖ సింగర్‌ గీతాంజలి దాస్‌ సైతం హాజరై ప్రదర్శన ఇచ్చారు. సీఎం షేర్‌ చేసిన ఆ వీడియోలో.. సీఎం శర్మ మరియు అతని భార్య రినికి భుయాన్ శర్మ ఇద్దరూ పాఠశాల పిల్లలతో కలిసి డ్యాన్స్ చేస్తూ ఉల్లాసపరుస్తున్నట్లు గమనించవచ్చు.. సీఎం సాయంత్రం నుండి అనేక ఫోటోలు మరియు వీడియోలను సోషల్ మీడియాలో షేర్‌ చేస్తూ వచ్చారు.. “సూటియాలోని హటింగా టీఈ మోడల్ స్కూల్ విద్యార్థినులు, నా భార్యతో కలిసి నా నివాసంలో విద్యార్థులతో ముఖాముఖి.. వారికి ఆతిథ్యం ఇవ్వడం ఆనందంగా ఉంది. ప్రతిభావంతులైన విద్యార్థులు ఝుమూర్, తుసు నృత్యం, జానపద పాటలు పాడటం, జ్యోతి సంగీతం, పారాయణం చేయడం ద్వారా ఈ సాయంత్రం చిరస్మరణీయంగా మారింది.. అంటూ ట్విట్టర్‌లో రాసుకొచ్చారు హిమంత బిస్వా శర్మ.

గుట్కా యూనిట్‌ ఏర్పాటుకు దావూద్ ఇబ్రహీంకు సాయం.. వ్యాపారికి జైలు శిక్ష
పాక్‌లో గుట్కా యూనిట్‌ను ఏర్పాటు చేసేందుకు మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీంకు సహకరించిన వ్యాపారికి ముంబైలోని ప్రత్యేక కోర్టు జైలు శిక్ష విధించింది. కరాచీలో గుట్కా యూనిట్‌ను ఏర్పాటు చేసేందుకు దావూద్ ఇబ్రహీం ఆ వ్యక్తి సహాయాన్ని కోరాడు. ఈ కేసులో గుట్కా తయారీదారు జేఎం జోషితో పాటు మరో ఇద్దరికి 10 సంవత్సరాల జైలు శిక్ష విధిస్తూ ముంబైలోని ప్రత్యేక కోర్టు సోమవారం తీర్పు చెప్పింది. జేఎం జోషి, జమీరుద్దీన్ అన్సారీ, ఫరూఖ్ మన్సూరిలను మహారాష్ట్ర కంట్రోల్ ఆఫ్ ఆర్గనైజ్డ్ క్రైమ్ యాక్ట్ (MCOCA), ఇండియన్ పీనల్ కోడ్ నిబంధనల ప్రకారం ప్రత్యేక న్యాయమూర్తి బీడీ షెల్కే దోషులుగా నిర్ధారించారు. ప్రాసిక్యూషన్ ప్రకారం జోషి, సహ నిందితుడు రసిక్లాల్ ధరివాల్ మధ్య ఆర్థిక వివాదం ఉంది. ఈ వివాదాన్ని పరిష్కరించడానికి ఇద్దరూ ఇబ్రహీం సహాయం కోరారు. వివాదాన్ని పరిష్కరించినందుకు ప్రతిఫలంగా, ఇబ్రహీం 2002లో కరాచీలో గుట్కా యూనిట్‌ను ఏర్పాటు చేయడానికి వారి సహాయాన్ని కోరాడు. ఈ కేసు విచారణ సమయంలో ధరివాల్ ప్రాణాలు కోల్పోయాడు. ఇబ్రహీం ఈ కేసులో వాంటెడ్ నిందితుడిగా ఉన్నాడు.

టీమిండియాకు భారీ షాక్.. స్టార్ ఆటగాడు ఔట్?
శ్రీలంకతో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ఆడేందుకు సిద్ధమవుతున్న టీమిండియాకు తాజాగా భారీ షాక్ తగిలింది. కొంతకాలం నుంచి జట్టుకి దూరంగా ఉంటున్న జస్‌ప్రీత్ బుమ్రా.. ఈ వన్డే సిరీస్‌కి గాను జట్టులో అడుగుపెట్టినట్టే పెట్టి, ఆ వెంటనే దూరమయ్యాడు. పూర్తి స్థాయి ఫిట్‌నెస్ సాధించకపోవడం వల్లే.. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా అతడ్ని జట్టు నుంచి తప్పించినట్టు తెలుస్తోంది. దీంతో బుమ్రా నేషనల్ క్రికెట్ అకాడమీ(ఎన్‌సీఏ)లోనే ఉండిపోయాడు. అయితే.. బుమ్రాని తప్పించడానికి ఫిట్‌నెస్ కారణం కాదని, వేరే కారణాలున్నాయని తెలుస్తోంది. భవిష్యత్తులో టీమిండియా కొన్ని కీలక సిరీస్‌లు ఆడేందుకు రెడీ అవుతోంది. వాటిల్లో ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్, అలాగే వన్డే వరల్డ్‌కప్ ఎంతో ముఖ్యమైనవి. అప్పుడు జట్టులో బుమ్రా లాంటి కీలక ఆటగాడు తప్పకుండా ఉండాలి. కాబట్టి.. ఆలోపు అతడు మరోసారి గాయాలబారిన పడకుండా ఉండాలనే ఉద్దేశంతో, అతడ్ని ఉద్దేశపూర్వకంగానే ఈ శ్రీలంక వన్డే సిరీస్‌కు దూరం పెట్టినట్లు తెలుస్తోంది. ఒక రకంగా బీసీసీఐ మంచి నిర్ణయమే తీసుకుందని చెప్పుకోవచ్చు. కాగా.. లంకతో జరిగిన టీ20 సిరీస్‌ను భారత్ కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. సీనియర్లైన రోహిత్‌ శర్మ, కేఎల్‌ రాహుల్‌, విరాట్‌ కోహ్లి లేకుండా యువ ఆటగాళ్లతో బరిలోకి దిగిన టీమిండియా.. 2-1 తేడాతో టీ20 సిరీస్‌ని కైవసం చేసుకుంది. తొలి రెండు మ్యాచుల్లో ఇరు జట్లు చెరో విజయం సాధించగా.. మూడో మ్యాచ్ అత్యంత కీలకంగా మారింది. ఈ మూడో మ్యాచ్‌లో సూర్యకుమార్ యాదవ్ సెంచరీతో ఆకాశమే హద్దుగా చెలరేగడం, బౌలర్లు సైతం మాయ చేయడంతో.. 91 పరుగుల తేడాతో భారత్ విజయం సాధించగలిగింది. దీంతో, సిరీస్ భారత్ కైవసం అయ్యింది. ఇదే జోరులో వన్డే సిరీస్‌ని కూడా చేజిక్కించుకోవాలని భారత్ భావిస్తోంది. రేపు తొలి వన్డే మ్యాచ్ గౌహాతిలో జరగనుండగా.. మిగిలిన రెండు మ్యాచెస్ గురువారం (కోల్‌కతా), ఆదివారం (త్రివేండ్రం) జరగనున్నాయి. లంకతో వన్డేలకు భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుబ్మన్ గిల్, విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్, హార్ధిక్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్, యుజ్వేంద్ర చహల్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, ఉమ్రాన్ మాలిక్, అర్ష్‌దీప్ సింగ్

గూఢచారి గురి ఎప్పటికి తప్పదు..
టాలీవుడ్ కుర్ర హీరో అడివి శేష్ వరుస విజయాలను అందుకొని స్టార్ హీరో రేసులోకి దూసుకొస్తున్నాడు. గతేడాది హిట్ 2 తో హిట్ అందుకున్న ఈ హీరో తాజాగా తన సినిమాకు సీక్వెల్ ను మొదలుపెట్టేశాడు. 2018 లో గూఢచారి సినిమాతో మంచి హిట్ ను అందుకున్నాడు అడివి శేష్. శశికిరణ్ తిక్కా దర్శకత్వం వహించిన ఆ చిత్రానికి శేష్ కథను అందించాడు. గూఢచారి సినిమాలు మరుగున పడిపోతున్న సమయంలో ఈ సినిమా ఒక పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసిందనే చెప్పాలి. ఇక ఈ సినిమాకు సీక్వెల్ ను అప్పుడే ప్రకటించిన శేష్ ఎట్టకేలకు జీ2 ను పట్టాలెక్కించాడు. అయితే ఈసారి చాలానే మార్పులు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈ సినిమాకు కొత్త డైరెక్టర్ యాడ్ అయ్యాడు. శశి కిరణ్ తిక్కా ప్లేస్ లో “మేజర్” ఎడిటర్ వినయ్ కుమార్ సిరిగినీడి వచ్చాడు. అతడికి ఇదే మొదటి చిత్రం కావడం విశేషం. ఇకపోతే కాశ్మీర్ ఫైల్స్, కార్తికేయ 2 మరియు మేజర్ వంటి ఆల్ ఇండియా హిట్‌లను అందించిన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ మరియు ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్‌లపై ప్రముఖ నిర్మాతలు టిజి విశ్వ ప్రసాద్ మరియు అభిషేక్ అగర్వాల్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఇక తాజాగా నేడు ఈ సినిమా ఫస్ట్ లుక్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. మొదటి పార్ట్ లో కథ మొత్తం ఇండియాలో జరుగగా.. సెకండ్ పార్ట్ లో కథ మొత్తం అంతర్జాతీయంగా జరగనున్నట్లు తెలుస్తోంది. ఈ పోస్టర్ లో ఫార్మల్ దుస్తులలో స్లిక్ అండ్ స్టైలిష్ లుక్‌లో ఉన్న శేష్ ఎత్తైన భవనం నుంచి కిందపడుతున్నా గూఢచారి గురి మాత్రం తప్పకుండా పైన క్రిమినల్స్ పైకి బుల్లెట్స్ ను వదులుతూ కనిపించాడు. ఈ పోస్టర్ లో అడివి శేష్ ఎంతో స్టైలిష్ గా కనిపిస్తున్నాడు. ఈ ఏడాదిలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనున్నట్లు మేకర్స్ తెలిపారు. ప్రీ-విజన్ విషయానికి వస్తే, శేష్ భారతదేశం నుండి ఆల్ప్స్ పర్వతాల వరకు వెళ్ళే గూఢచారి యొక్క చివరి విజువల్స్ గా చూపించారు. జీ2 అక్కడి నుంచే ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. మరి ఈ సినిమాతో శేష్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

సమంత ఆధ్యాత్మిక జపం
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గత కొంతకాలంగా కండరాల రుగ్మతతో బాధపడుతున్నారు. దీంతో దాని నుంచి బయటపడటానికి ఆధ్యాత్మిక బాట పట్టారు. నిజానికి సమంత తండ్రి జోసెఫ్ ప్రభు తెలుగు వ్యక్తి కాగా.. తల్లి నినెట్ ప్రభు మలయాళీ. తనకు ఇద్దరు అన్నలు జోనాథన్, డేవిడ్‌. తమిళనాడులో పుట్టి పెరిగిన సమంత తమిళియన్‌ అనే చెప్పుకుంటుంది. క్రిస్టియన్‌గా జన్మించినప్పటికీ కొంతకాలంగా సద్గురు జగ్గీ వాసుదేవ్ ఫాలోవర్ గా ఉంటోంది. ఇక సమంత ఇటీవల పూర్తి ఆధ్యాత్మికంగా మారిపోయింది. అంతే కాదు జపమాల పట్టుకుని జపం కూడా చేస్తోంది. సోషల్ మీడియాలో పూర్తి స్థాయిలో యాక్టివ్ గా ఉండే సమంత తన ఇన్‌స్టాలో జపమాలతో ఉన్న పిక్ షేర్ చేసింది. ఫిబ్రవరి 17న గ్రాండ్ రిలీజ్‌కి సిద్ధమవుతున్న ఆమె రాబోయే చిత్రం ‘శాకుంతలం’ ప్రచారంలో భాగంగా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొంది సమంత. చాలా కాలం తర్వాత సమంత పాల్గొన్న పబ్లిక్ ఫంక్షన్ ఇది. ‘శాకుంతలం’ గుణశేఖర్ రచన, దర్శకత్వంతో తెరకెక్కిన పౌరాణిక చిత్రం. దీనిని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ అధినేత దిల్ రాజు తో కలసి గుణ టీమ్‌వర్క్స్‌పై నీలిమ గుణ నిర్మించారు. ఇందులో సమంత టైటిల్ రోల్‌ శకుంతలగాను, దేవ్ మోహన్ దుష్యంతుడుగా, మోహన్ బాబు దుర్వాసమునిగా నటించగా గౌతమి, అదితి బాలన్, అనన్య నాగళ్ల ఇతర సహాయక పాత్రల్లో కనిపించనున్నారు. మరి మయోసిటిస్ నుంచి కోలుకుని ‘శాకుంతలం’తో సమంత మళ్ళీ టాలీవుడ్ లో బిజీ అవుతుందేమో చూద్దాం.