NTV Telugu Site icon

Top Headlines @ 5 PM: టాప్‌ న్యూస్‌

Top Headlines @ 5 Pm

Top Headlines @ 5 Pm

పెట్టుబడులతో రండీ.. ఏపీ మిగతా రాష్ట్రాల కంటే భిన్నమైనది
ఆంధ్రప్రదేశ్‌ పెట్టుబడులకు అత్యంత అనుకూలమైన రాష్ట్రం.. ఏపీలో పెట్టుబడులకు ఉన్న అనుకూలతలు మిగిలిన రాష్ట్రాల కంటే భిన్నమైనవి.. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు రండి.. మా వంతు సహకారం అందిస్తాం అని ప్రకటించారు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి.. విశాఖపట్నంలో మార్చి 3,4 తేదీల్లో గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సదస్సు సందర్భంగా ఢిల్లీలోని లీలా ప్యాలెస్‌ హోటల్‌లో నిర్వహించిన సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు.. ఈ సమావేశంలో వివిధ దేశాల దౌత్యాధికారులు, కంపెనీల ప్రతినిధులు, కేంద్ర ప్రభుత్వ అధికారులు, ఏపీ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.. ఇక, సీఎం జగన్‌ మాట్లాడుతూ.. దౌత్యాధికారులకు, కాన్సుల్‌ జనరల్స్‌కు, రాయబారులుకు, నా మంత్రివర్గ సహచరులకు, కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారులకు, వివిధ కంపెనీల ప్రతినిధులకు, ఇతర ఆహ్వానితులకు స్వాగతం మరియు అభినందనలు తెలియజేస్తున్నాను అన్నారు.. 11.43 శాతం జీఎస్‌డీపీతో ఆంధ్రప్రదేశ్‌ దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రంగా అగ్రగామిగా నిలిచింది. ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో కూడా గడిచిన మూడేళ్లుగా ఏపీ దేశంలోనే నంబర్‌వన్‌ స్ధానంలో నిల్చింది. పరిశ్రమల స్ధాపనకు మేం చేస్తున్న కృషితో పాటు పారిశ్రామిక వేత్తలు ఇచ్చిన ఫీడ్‌ బ్యాక్‌తోనే మేం గత మూడేళ్లుగా ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో నెంబర్‌వన్‌ స్ధానంలో స్ధిరంగా కొనసాగుతున్నాం. దీని ద్వారా పరిశ్రమల స్ధాపనకు, పారిశ్రామిక వేత్తలకు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం ఎంత అనుకూలంగా ఉందన్నది స్పష్టమవుతోందని తెలియజేశారు. ఏపీకి 974 కిలోమీటర్ల సుదీర్ఘమైన తీర ప్రాంతం ఉంది. నాలుగు ప్రాంతాల్లో 6 పోర్టులు ఇప్పుడు రాష్ట్రంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. వీటకి అదనంగా మరో నాలుగు పోర్టులను నిర్మిస్తున్నాం. 6 విమానాశ్రయాలు కూడా ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వ సహకారంతో మూడు పారిశ్రామిక కారిడార్లను కూడా నిర్మిస్తున్నాం. దేశంలో 11 పారిశ్రామిక కారిడార్లు ఏర్పాటవుతుంటే అందులో ఏపీలోనే మూడు కారిడార్లును అభివృద్ధి చేస్తున్నాం. రాష్ట్రంలో జరుగుతున్న పారిశ్రామిక అభివృద్ధికి, పారిశ్రామిక వేత్తలకు ఏ స్ధాయిలో ప్రోత్సాహం ఇస్తున్నామన్నదానికి నిదర్శనంగా వివరించారు.

విశాఖ రాజధానిపై సీఎం కీలక వ్యాఖ్యలు..
ఏపీ రాజధానిపై కీలక వ్యాఖ్యలు చేశారు సీఎం వైఎస్‌ జగన్‌.. విశాఖపట్నం త్వరలో కార్యనిర్వాహక రాజధాని కాబోతుంది. విశాఖలో పెట్టుబడులకు మిమ్నల్ని ఆహ్వానిస్తున్నాం. రానున్న కొద్ది నెలల్లో నేను కూడా విశాఖకు షిప్ట్‌ అవుతున్నాను. గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌ను విశాఖలో మార్చి 3,4 తేదీలలో నిర్వహించబోతున్నాం. నేను మీ అందరినీ వ్యక్తిగతంగా ఆ సమ్మిట్‌కు హాజరు కావాలని ఆహ్వానిస్తున్నాను. సదస్సుకు హాజరు కావడంతో పాటు ఇక్కడ పెట్టుబడులకు కూడా ముందుకు రావాలి. మీతో పాటు మీ సహచరులను ఇతర కంపెనీ ప్రతినిధులను కూడా ఆ సదస్సుకు తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్‌లో పరిశ్రమలు స్ధాపన, వ్యాపారం ఎంత సులభతరమో చూపించాలని విజ్ఞప్తి చేశారు.. మరొక్కసారి మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు.. మనందరం మరొక్కసారి విశాఖపట్నంలో సమావేశమవుదాం అన్నారు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి.

విశాఖ రాజధాని.. సీఎం ప్రకటన వెనుక అనేక కారణాలు..
సీఎం జగన్‌ వ్యాఖ్యలపై స్పందించిన టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్… సీఎం జగన్ విశాఖ రాజధాని ప్రకటన వెనుక అనేక కారణాలు ఉన్నాయన్నారు.. వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ వేగం పెంచడంతో ఉన్నఫలంగా సీఎం విశాఖ రాజధాని ప్రకటన చేశారని ఆరోపించారు.. హత్య జరిగిన రోజు ఎంపీ వైఎస్‌ అవినాష్ రెడ్డి సెల్ ఫోన్‌లో ఎవరెవరితో మాట్లాడిన అంశం కీలకంగా మారిందన్నారు.. అయితే, ఆ కాల్ డేటా వివరా‌లు వెలుగులోకి రాకుండా ప్రజల దృష్టిని మరల్చేందుకే సీఎం వైఎస్‌ జగన్‌.. విశాఖ రాజధాని ప్రకటన చేశారని ఆరోపించారు టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్.. ఏపీ రాజధాని అమరావతి అని హైకోర్టు స్పష్టం చేసిందని గుర్తుచేసిన ఆయన.. ఈ తీర్పుపై ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో వేసిన అప్పీల్ పెండింగ్‌లోనే ఉందన్నారు.. ఇలాంటి సమయంలో సీఎం జగన్‌ ప్రకటన హైకోర్టు దిక్కరణే అవుతుందన్నారు పయ్యావుల కేశవ్‌. కాగా, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో.. ఏపీ ప్రభుత్వం అమరావతిని రాజధానిగా ప్రకటించిన విషయం విదితమే.. కానీ, ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన సీఎం జగన్‌.. రాష్ట్రంలో మూడు రాజధానుల ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.. అందులో భాగంగానే విశాఖ కేంద్రంగా పరిపాలన రాజధాని ఏర్పాటు చేసేందుకు సిద్ధం అయ్యారు.

ఏపీ రాజధానిపై క్లారిటీ ఇచ్చిన బీజేపీ.. మా విధానం అదే..!
అమరావతే ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర రాజధాని..‌ ఇది భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకత్వం కోరుకుంటుందని స్పష్టం చేశారు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు.. విజయనగరంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. విశాఖపట్నమే పరిపాలన రాజధాని అంటూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి చేసిన కామెంట్లపై స్పందించారు.. అమరావతి కేంద్రంగా రాజధాని నిర్మాణానికి రూ.2,500 కోట్లు కేంద్రం ఇచ్చింది.. అలాగే, నాలుగువేల కోట్లు అప్పు కూడా ఇప్పించాం అన్నారు.. ఇక, అనంతపురం నుంచి విజయవాడకు హైవే నిర్మాణం కోసం పూనుకున్నాం.. కానీ, మూడు రాజధానులు అభివృద్ధికి దోహదం కాదని స్పష్టం చేశారు.. అమరావతి రాజధానిగా ఉండాలి.. విశాఖను అభివృద్ధి చేయాలి.. ఇదే మా అభిప్రాయం అన్నారు సోము వీర్రాజు.. ఆసియాకి విశాఖ స్ట్రాటజికల్ పాయింట్. ఇక్కడ పోర్టు నుంచే అనేక ప్రాంతాలకు రవాణా సాగుతోందని తెలిపారు. కాగా, ఆంధ్రప్రదేశ్‌ పరిపాలన రాజధానిపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి కీలక ప్రకటన చేశారు.. రాబోయే రోజుల్లో విశాఖపట్నం రాజధాని కాబోతుంది.. త్వరలో నేను కూడా విశాఖపట్నం షిఫ్ట్ అవుతున్నాను అంటూ ఢిల్లీ వేదికగా జరిగిన దౌత్య వేత్తల సమావేశంలో స్పష్టం చేశారు.. విశాఖపట్నంలో జరిగే అంతర్జాతీయ పెట్టుబడుల సదస్సుకు మిమ్మల్ని అందరిని ఆహ్వానిస్తున్నా అంటూ సీఎం వైఎస్‌ జగన్‌ వ్యాఖ్యానించిన విషయం విదితమే.

బీఆర్ఎస్ నేతలు రాష్ట్రపతి ప్రసంగం బహిష్కరించడం సిగ్గుచేటు
పార్లమెంట్ బడ్జెట్‌ సమావేశాలు నేడు ప్రారంభమయ్యాయి. ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించి బడ్జెట్‌ సమావేశాలను ప్రారంభించారు. అనంతరం కేంద్రం ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్‌ బడ్జెట్‌ సర్వేను ప్రవేశపెట్టారు. ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టిన అనంతరం లోక్‌సభను రేపటికి (ఫిబ్రవరి 1వ తేదీ)కి వాయిదా వేశారు. అయితే.. ఈ సందర్భంగా తెలంగాణ బీజేపీ చీఫ్‌, ఎంపీ బండి సంజయ్‌ పార్లమెంట్‌ అవరణలో మాట్లాడుతూ… బీఆర్ఎస్ నేతలు రాష్ట్రపతి ప్రసంగం బహిష్కరించడం సిగ్గుచేటని మండిపడ్డారు. రాష్ట్రపతి రాజకీయ నాయకురాలు కాదు, రాష్ట్రపతి ప్రసంగం విన్న తర్వాత ఎవరు కూడా బహిష్కరించారన్నారు. రాష్టప్రతి ప్రసంగం ధన్యవాదా తీర్మానం సమయంలో బీఆర్‌ఎస్‌ చెప్పొచ్చున్నారు. మోడీ అనేక సందర్భంలో చెప్పారు, పార్లమెంట్‌లో మంచి వాతావరణం కల్పిద్దామని, కేసీఆర్‌కి ద్వేషం మహిళలంటే, ఆదివాసులు, మైనారిటీ అంటే కేసీఆర్‌కు ద్వేషమని ఆయన విమర్శించారు. మొదటి ప్రభుత్వంలో మహిళ నేత లేదు, మహిళ కమిషన్ లేదని, మహిళ గవర్నర్‌ను అవమానిస్తారని ఆయన ధ్వజమెత్తారు. హైకోర్టులో కేసీఆర్‌ కేసు ఎందుకు వేశారో, తెలియక జనాలు నవ్వుతున్నారని ఆయన ఎద్దేవా చేశారు. కేసీఆర్‌ను ముంచడానికి సలహాలు ఇస్తున్నారని, అది తెలంగాణకు మంచిదేనన్నారు. మహిళలు అంటే ముఖ్యమంత్రికి ద్వేషమని, దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానని చేయలేదు, దళితులు అంటే ద్వేషమని, బీఆర్ఎస్ ఎంపీలు సంచలనం కొరకు రాష్ట్రపతి ప్రసంగం బహిష్కరించారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

హైదరాబాదులో మరో గ్లోబల్ క్యాపబిలిటీ కేంద్రం
అంతర్జాతీయ పెట్టుబడుల గమ్యస్థానంగా తెలంగాణ తన సత్తాను చాటుకుంటోంది. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు మరో సంస్థ ముందుకు వచ్చింది. హైదరాబాదులో మరో గ్లోబల్ క్యాపబిలిటీ కేంద్రం ఏర్పాటు కానుంది. హైదరాబాదులో తన గ్లోబల్ క్యాపబిలిటీ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు లైఫ్ సైన్సెస్ దిగ్గజ కంపెనీ శాండోస్ (Sandoz) ప్రకటించింది. అయితే.. మొత్తం 1800 మంది ఉద్యోగులు ఈ కేంద్రంలో పని చేయనున్నట్లు కంపెనీ తెలిపింది. జీనోమ్ వ్యాలీలో అత్యాధునిక రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ లేబరేటరీని ఏర్పాటు చేయనున్నట్లు కంపెనీ పేర్కొంది. ఈ నేపథ్యంలో.. గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ ఏర్పాటు చేస్తున్న కంపెనీకి ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. లైఫ్ సైన్సెస్ రంగం తమ ప్రభుత్వానికి ప్రాధాన్యత రంగం అని, ఈ రంగం అభివృద్ధికి అనేక కార్యక్రమాలు చేపడుతున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. హైదరాబాద్ ఫార్మాసిటీలో తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాలని కంపెనీకి మంత్రి కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. ఇదిలా ఉంటే.. ఇటీవల తెలంగాణ రాష్ట్ర ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి కేటీఆర్ దావోస్ పర్యటన సంద‌ర్భంగా.. 4 రోజుల్లో 52 వాణిజ్య, 6 రౌండ్ టేబుల్ స‌మావేశాలు, 2 ప్యానెల్ చ‌ర్చ‌లు జ‌రిగిన‌ట్లు కేటీఆర్ తెలిపారు. దావోస్ ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా తెలంగాణ‌కు రూ. 21 వేల కోట్ల పెట్టుబ‌డులు వ‌చ్చాయ‌ని కేటీఆర్ ప్ర‌క‌టించారు. సాఫ్ట్‌వేర్ దిగ్గ‌జ సంస్థ మైక్రోసాఫ్ట్ రూ. 16 వేల కోట్ల పెట్టుబ‌డితో హైద‌రాబాద్‌లో మ‌రో 3 డాటా సెంట‌ర్ల‌ను ఏర్పాటు చేయ‌నున్న‌ట్లు దావోస్ వేదిక‌గా ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. గ్లోబ‌ల్ మ‌ల్టీ బ్రాండ్ రెస్టారెంట్ కంపెనీ ఇన్‌స్పైర్ బ్రాండ్స్ హైద‌రాబాద్‌లో త‌మ స‌పోర్ట్ సెంట‌ర్‌ను ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చిన విష‌యం తెలిసిందే.

అత్యాచార కేసులో ఆశారాం బాపునకు జీవిత ఖైదు
అనేక లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న బాబా ఆశారాం బాపు కేసుపై కీలక తీర్పు వెలువరించింది గుజరాత్ గాంధీనగర్ సెషన్స్ కోర్టు. మోటేరా ఆశ్రమంలో ఉన్నప్పుడు ఆశారాం బాపు, ఆయన కుమారుడు తనపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడినట్లు ఆరోపించింది సూరత్‌కు చెందిన ఓ మహిళా భక్తురాలు. పదేళ్ల కిందట బాధితురాలు చేసిన కంప్లయింట్‌పై తాజాగా కోర్టు తీర్చునిచ్చింది. ఈ కేసులో ఆయనను దోషిగా నిర్ధారిస్తూ జీవిత ఖైదు విధించింది. ఇదే కేసులో నిందితులైన ఆశారాం కుమారుడు నారాయణ్‌ సాయి, భార్య లక్ష్మి, కుమార్తె భారతి, నలుగురు మహిళా అనుచరులను మాత్రం నిర్దోషులుగా ప్రకటించింది కోర్టు. మరో అత్యాచారం కేసులో దోషిగా తేలిన ఆశారాం బాపు ప్రస్తుతం రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌ జైలులో ఉన్నారు. ఆశారాం బాపు గతంలో అధ్యాత్మిక గురువుగా ఎందరో శిష్యులను సంపాదించుకున్నారు. దేశ విదేశాల్లో కేంద్రాలను స్థాపించారు. చివరకు ఇలా కటకటాలపాలయ్యారు. ఆశారాంను కోర్టు దోషిగా నిర్ధారించడంతో ఆయనకు గరిష్ఠంగా జీవిత ఖైదు.. లేనిపక్షంలో కనీసం 10 ఏళ్ల జైలు శిక్ష విధించాల్సి ఉంది. అయితే జోధ్‌పూర్‌లో ఇలాంటి మరో కేసులో ఆయన ఇప్పటికే దోషిగా తేలారని, అందుకే నేరాలు చేయడం అలవాటైన వ్యక్తి అని వాదనలు ముగిసిన తర్వాత లాయర్ కోడెకర్ కోర్టు వెలుపల మీడియాతో అన్నారు. ఆశారాంను సాధారణ నేరస్థుడిగా పరిగణించి కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. శిష్యురాలిగా ఉన్న యువతిని మొతెరాలోని తన ఆశ్రమంలో బంధించి ఆమెపై అత్యాచారం చేసినందుకుగానూ కఠిన శిక్ష విధించాలని కోర్టును కోరినట్లు చెప్పారు. బాధితురాలికి నష్టపరిహారం చెల్లించడంతో పాటు ఆశారాం బాపూనకు భారీ జరిమానా విధించాలని ప్రాసిక్యూటర్ అన్నారు. జైలులో ఉన్న దేవుడికి పదేళ్ల జైలు శిక్ష విధించడానికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదని డిఫెన్స్ లాయర్ అన్నారు.

లతాజీని కలవకపోవడం బాధగా ఉంది: కోహ్లీ ఇంటర్వ్యూ వైరల్
టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీకి సంబంధించిన ఓ ఇంటర్వ్యూ సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ఈ ఇంటర్వ్యూను కోహ్లీ ట్విట్టర్‌లో షేర్ చేయగా అందులోని ఇంట్రస్టింగ్ విషయాలు వైరల్‌గా మారాయి. ఇందులో అవతలి వ్యక్తి అడిగిన ఆసక్తికరమైన ప్రశ్నలకు కోహ్లీ అంతకంటే ఆసక్తికరమైన సమాధానాలు ఇచ్చాడు. ఈ ఇంటర్వ్యూలోనే లెజెండరీ సింగర్ లతా మంగేష్కర్‌ను కలవలేకపోయానన్న బాధ తనకు ఉన్నట్లు కోహ్లీ చెప్పాడు.”చరిత్రలో నిలిచిపోయిన ఏ మహిళతో మీరు డిన్నర్‌కు వెళ్లాలని అనుకుంటారు” అన్న ప్రశ్నపై విరాట్ స్పందిస్తూ.. “లతాజీ కలిసే అవకాశం నాకు ఎప్పుడూ రాలేదు. ఆమెతో కలిసి మాట్లాడి, ఆమె జీవితం గురించి, ఆమె ప్రయాణం గురించి మరింత తెలుసుకునే అవకాశం వచ్చి ఉంటే బాగుండేది” అని చెప్పుకొచ్చాడు. ఇక ఇదే ఇంటర్వ్యూలో లెజెండరీ బాక్సర్ మహ్మద్ అలీని కూడా విరాట్ గుర్తు చేసుకున్నాడు. “ఒకవేళ ఓ దీవిలో మీరు మీ కుటుంబ సభ్యులు కాకుండా ఎవరితో కలిసి ఓ దీవిలో చిక్కుకుపోవాలని అనుకుంటారు” అని ప్రశ్నించగా.. మహ్మద్ అలీ అని విరాట్ సమాధానమిచ్చాడు. ఈ అమెరికన్ బాక్సర్‌కు ఆల్ టైమ్ గ్రేటెస్ట్ హెవీ వెయిట్ బాక్సర్‌గా పేరుంది. తనకు అత్యంత సంతోషకరమైన ప్లేస్ తన ఇల్లే అని కూడా ఈ సందర్భంగా విరాట్ చెప్పాడు. తన జీవితంలో ప్రయత్నించిన అత్యంత విచిత్రమైన డైట్ ఏది అని అడిగితే.. తనకు 24 ఏళ్ల వయసు వచ్చే వరకూ తిన్నదంతా అదే అని, తాను ప్రపంచంలోని జంక్ ఫుడ్ మొత్తం తినేవాడినని కోహ్లీ చెప్పాడు. ప్లాంకింగ్‌లో తన రికార్డు టైమ్ మూడున్నర నిమిషాలని కూడా కోహ్లీ తెలిపాడు. కోహ్లీ ఫిట్‌నెస్ ఏ స్థాయిలో ఉంటుందో తన ప్లాంకింగ్ టైమ్‌ను బట్టి అర్థం చేసుకోవచ్చు. ఈ ఇంటర్వ్యూలో ఇది తొలి పార్ట్ మాత్రమే. రెండో ఎపిసోడ్ కూడా రానుందని వీడియో చివర్లో వెల్లడించారు. ప్రస్తుతం న్యూజిలాండ్ టీ20 సిరీస్ నుంచి విశ్రాంతి తీసుకున్న కోహ్లీ.. రిషికేష్‌లోని ఓ ఆశ్రమంలో ఉన్నాడు. ఆస్ట్రేలియాతో ఫిబ్రవరి 9 నుంచి ప్రారంభం కాబోయే నాలుగు టెస్టుల సిరీస్ కోసం త్వరలోనే అతడు టీమిండియాతో చేరనున్నాడు.

రాజశేఖర్ కూతురితో సింగర్ రాహుల్ సిప్లిగంజ్ పెళ్లి..?
చాలా గ్యాప్ తరువాత కృష్ణవంశీ.. రంగమార్తాండ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ జంటగా నటిస్తుండగా.. కుర్ర జంటగా సింగర్ రాహుల్ సిప్లిగంజ్, శివాత్మిక రాజశేఖర్ నటిస్తున్నారు. ఈ సినిమాను ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దుతున్నాడు కృష్ణవంశీ. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, సాంగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా ఈ చిత్రంలో పెళ్లి సీన్ కు సంబంధించిన స్టిల్స్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. స్టిల్స్ చూస్తుంటే నిన్నే పెళ్లాడతా కుటుంబం గుర్తుకు రాకమానదు. సింగర్ రాహుల్ సిప్లిగంజ్ వరుడిగా.. శివాత్మిక వధువుగా ఎంతో ముద్దుగా కనిపించగా.. కుటుంబ పెద్దలుగా ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ.. వధూవరులకు అన్న వదినలుగా అనసూయ, ఆదర్శ్.. ఇక కుటుంబానికి పెద్దగా బ్రహ్మానందం ఉన్నట్లు కనిపించారు. ప్రకాష్ రాజ్ ఒడిలో పెళ్లి కూతురుగా మారిన శివాత్మిక కూర్చోగా.. మిగతావారందరు నవ్వులు చిందిస్తూ కనిపించారు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇకపోతే ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకొంటుంది. ఈ సినియూమకు ఇళయరాజా సంగీతం అందించారు. ఇక ఇప్పటివరకు ఈ సినిమా రిలీజ్ డేట్ ను ప్రకటించలేదు.. కానీ, ఈ ఏడాది మాత్రం కచ్చితంగా రంగమార్తాండ ఎంట్రీ ఉండనుందని చెప్పొచ్చు. మరి ఈ సినిమాతో కృష్ణవంశీ మునుపటి రేంజ్ ను అందుకుంటాడో లేదో చూడాలి.

‘మాస్టర్’ కోసం అధీరా ను దింపేసిన లోకేష్
ఈ ఏడాదిలో సినిమా లవర్స్ కు పండగే పండగ.. స్టార్ హీరోల సినిమాలన్నీ సెట్స్ మీదకు వెళ్లిపోవడమే కాదు రిలీజ్ డేట్స్ కూడా ప్రకటించేశాయి. ఇంకేంటి ఒకదాని తరువాత ఒకటి రిలీజ్లు మాత్రమే ఉన్నాయి. ఈ ఏడాది అభిమానులందరూ ఎదురుచూస్తున్న సినిమాలు చాలా ఉన్నాయి. ఇక తాజాగా వాటిలో ఇంకొకటి వచ్చి చేరింది. అదే దళపతి67. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్, స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కాంబోలో ఈ సినిమా తెరకెక్కుతోంది. గతేడాది విక్రమ్ తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు లోకేష్. విక్రమ్ లో ముగ్గురు హీరోలు.. చివర్లో సూర్య ఎంట్రీ.. 2022 లో హై స్టార్ క్యాస్టింగ్ మూవీస్ లో విక్రమ్ కూడా నిలిచింది. ఇక అదే పద్దతిని లోకేష్ కంటిన్యూ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా కోసం కూడా పెద్ద పెద్ద స్టార్స్ నే రంగంలోకి దింపుతున్నాడు. నిన్నటికి నిన్ననే ఈ చిత్రాన్ని అధికారికంగా ప్రకటించాడో లేదో.. అప్పుడే విజయ్ కు పోటీగా విలన్ కూడా దించేశాడు. కెజిఎఫ్ 2 చిత్రం ద్వారా అధీరా గా మారిపోయాడు బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్. ఈ సినిమా అతడికి ఎంత పేరు తెచ్చిపెట్టింది అంటే.. ఇప్పటివరకు సంజయ్ పేరును గుర్తుంచుకున్న అభిమానులు ఆ సినిమా తరువాత అధీరా అని పిలుస్తున్నారు. ఇక సంజయ్ సైతం సౌత్ సినిమాల్లో చేయడం తనకు ఇష్టమని చెప్పి అభిమానుల మనసులను దోచేశాడు. ఇక అధీరా నటనకు ముగ్దుడైన లోకేష్.. విజయ్ కు విలన్ గా సెట్ చేసేసాడు. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా తెలిపారు. ఇక ఈ సినిమా గురించి సంజయ్ చెప్పుకొస్తూ.. ” నేను ఎప్పుడైతే దళపతి67 కథను ఒక్క లైన్ విన్నానో.. అప్పుడే ఈ సినిమా చేయడానికి ఎంతగానో ఎదురుచూస్తున్నాను. ఈ జర్నీలో పాలుపంచుకోవడం నాకు చాలా థ్రిల్లింగ్ గా ఉంది” అంటూ చెప్పుకొచ్చాడు. ఇక ఈ చిత్రంలో ప్రియా ఆనంద్ కూడా ఒక కీలక పాత్రలో నటిస్తోంది. మరి ఈ సినిమాతో వీరు ఎలాంటి విజయాన్ని అందుకుంటారో చూడాలి.

Show comments