NTV Telugu Site icon

Top Headlines @ 5 PM: టాప్‌ న్యూస్‌

Top Headlines @ 5 Pm

Top Headlines @ 5 Pm

తంత్రాలు అయిన కుతంత్రాలైన బీజేపీకే సాధ్యం
ఇవాళ ఉభయసభల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ జరగతుంది. ఈ సందర్భంగా తెలంగాణ అసెంబ్లీలో ఆర్ధిక శాఖ మంత్రి హరీష్ రావు బుధవారం నాడు ప్రసంగించారు. ఆయన మాట్లాడుతూ… 5,375 కోట్లు ఇవ్వాలని ఫైనాన్స్ కమిషన్ చెప్పినా కేంద్రం తెలంగాణకు నిధులు ఇవ్వలేదని ఆయన ఆరోపించారు. ఫైనాన్స్ కమిషన్ చెప్పినా పట్టించుకోని ఏకైక ప్రభుత్వం మోడీ సర్కార్ అని ఆయన మండిపడ్డారు. సెస్‌ల రూపంలో కేంద్రం వసూలు చేస్తుందని, అప్పుల విషయంలో కేంద్రంది ఏపీకి ఒక నీతి.. తెలంగాణకు ఒక నీతి అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం నుంచి హక్కుగా రావాల్సిన నిధులు కూడా ఇవ్వడం లేదని, వివిధ రూపాల్లో కేంద్రం నుంచి ఒక లక్ష 25 వేల కోట్ల రూపాయలు పైగా రావాలని ఆయన వెల్లడించారు. ఈటల రాజేందర్ మా దగ్గర ఉన్నపుడు బాగానే ఉండే…ఆ పార్టీలోకి పోయినకా ఏమైందో ఏమో ? మా దగ్గర ఉన్నపుడు జన్ కి బాత్ వినే ఈటల.. ఇప్పుడు మన్ కి బాత్ వింటున్నాడు… అదే సమస్య.. కాషాయ పార్టీ లో చేరిన తర్వాత ఏం కషాయం తాపించారో అని అంటూ సెటైర్లు వేశారు హరీష్‌ రావు. అంతేకాకుండా.. కేసీఆర్‌ ఫామ్ హౌస్ కి రండి చూపిస్తా.. ఫామ్ హౌస్ లో తాంత్రిక పూజలు చేస్తారని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని ఆయన ధ్వజమెత్తారు. ఫామ్ హౌస్‌లో కపిల గోవుకు కేసీఆర్ పూజలు చేస్తారని, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో యూనివర్సిటీలో తాంత్రిక, చేతబడి కోర్సులు పెట్టారని, తంత్రాలు అయిన కుతంత్రాలైన బీజేపీకే సాధ్యమని హరీష్ రావు అన్నారు. కాంగ్రెస్, బీజేపీ నేతలు కవులు అయ్యారని క అంటే కనపడదు.. వి అంటే వినపడదు అంటూ హరీష్‌ రావు ఎద్దేవా చేశారు. నీతి అయోగ్ ప్రశంసించినా రాష్ట్రంలో విపక్షాలకు కనపడదు…వినపడదని ఆయన వ్యాఖ్యానించారు.

మామూలు భార్యలు కాదు.. బ్యాంకులో 50 వేలు పడగానే ప్రియులతో లేచిపోయారు..
ఉత్తర్ ప్రదేశ్ లో ఆశ్చర్యకరమైన ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన మొదటి విడత డబ్బులు పడగానే, భర్తలను వదిలేసి ప్రియులతో పరారయ్యారు భార్యలు. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ లోని బారాబంకీ జిల్లాలో చోటు చేసుకుంది. ప్రస్తుతం తమ భార్యలకు రెండో విడత డబ్బులు నిలిపివేయాలని సంబంధిత అధికారులను భర్తలు వేడుకుంటున్నారు. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద కేంద్ర ప్రభుత్వం ఇళ్లు లేని వారికి రూ. 3 లక్షలను అందిస్తోంది. బారాబంకీలో 40 మంది లబ్ధిదారులను గుర్తించి ఆర్థిక సాయం చేశారు. ఇదిలా ఉంటే మొదటి విడత డబ్బులు చెల్లించి ఏడాది గడిచినా.. ఇంకా ఇళ్లు నిర్మాణ పనులు మొదలుకాకపోవడంతో అధికారులు భర్తలకు నోటీసులు జారీ చేశారు. దీంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. రూ. 50,000 బ్యాంకు అకౌంట్లలో పడగానే వాటిని పట్టుకుని తమ భార్యలు ప్రియులతో ఉడాయించారని చెప్పారు. రెండో విడత డబ్బులు వేయొద్దని అధికారులను భర్తలు కోరారు.

ప్రపంచం అంతా భారత్ వైపు చూస్తోంది.. కొందరు దేశ విజయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు.
పార్లమెంట్ లో రాష్ట్రపతి ప్రసంగంపై ప్రధాని మోదీ కీలక ఉపన్యాసం చేశారు. రాష్ట్రపతి దేశంలోని మహిళలు, సోదరీమణులకు స్ఫూర్తిదాయకం అని కొనియాడారు. రాష్ట్రపతి దేశంలో గిరిజనులు ఉన్నతిని పెంచారని అన్నారు. 100 ఏళ్లకు ఒకసారి వచ్చే మహమ్మారి, యుద్దం లాంటి పరిస్థితులను భారత్ తట్టుకుందని మోదీ అన్నారు. ఎన్నికల కంటే దేశంలోని 140 కోట్ల ప్రజల సామర్థ్యం, శక్తి గొప్పదని అన్నారు. సమర్థవంతంగా భారత్ సంక్షోభాల నుంచి బయటపడిందని, ప్రపంచంలో ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఆవిర్భవించిందని అన్నారు. ప్రపంచం అంతా భారత్ వైపు ఎంతో ఆశగా ఎదురుచూస్తోందని అన్నారు. భారతదేశంలో స్థిరమైన ప్రభుత్వం ఉందని, రాజకీయ అస్థిరత లేదని, పైగా నిర్ణయాలు తీసుకునే ప్రభుత్వం ఉందని చెప్పారు. విమర్శలను పట్టించుకోం అని.. సమయానుకూలంగా దేశానికి ఏం కావాలో అది చేసుకుంటూ పోతాం అని ప్రధాని స్పష్టం చేశారు. దేశంలో అవినీతిని నిర్మూలించాం. భారత్‌ ఈ క్షణం కోసం చాలా ఏళ్లుగా ఎదురుచూసిందని.. కోవిడ్‌ను భారత్‌ సమర్థవంతంగా ఎదుర్కొంది.. చాలా దేశాలను నిరుద్యోగం, ద్రవ్యోల్బణం వేధిస్తున్నాయి.. ప్రపంచంలో 5వ ఆర్థిక శక్తిగా భారత్‌ ఆవిర్భవించింది.. ఇది దేశం గర్వించదగిన విషయం అని అన్నారు. దేశవ్యాప్తంగా అందరికీ ఉచితంగా కరోనా వ్యాక్సిన్ అందించామని.. 150 దేశాలకు వ్యాక్సిన్లు పంపిణీ చేశామని ప్రధాని సభలో ప్రకటించారు. డిజిటల్ ఇండియాను చూసి ప్రపంచదేశాలు ఆశ్చర్యపోతున్నాయని.. వ్యాక్సిన్ సర్టిఫికేట్స్ కూడా క్షణాల్లో వచ్చేస్తున్నాయని.. కానీ కొందరు మాత్రం నిరాశతో ఉన్నారని విమర్శించారు. దేశంలో 90 వేల స్టార్టప్స్‌ పనిచేస్తున్నాయి, మొబైళ్ల తయారీలో దేశం రెంస్థానంలో ఉంది, ఇంధనం వినియోగంలో భారత్‌ మూడో స్థానంలో ఉందని తెలిపారు.

విమానంలో ల్యాప్‌టాప్‌కు మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్..
అమెరికాలో ఓ విమానం గాలిలో ఉండ సమయంలో హఠాత్తుగా ఓ ల్యాప్ టాప్ పేలింది. ల్యాప్ టాప్ బ్యాటరీలో మంటలు చెలరేగాయి. దీంతో విమానాన్ని తిరిగి ఎమర్జెన్సీ ల్యాండిగ్ చేయాల్సి వచ్చింది. ఈ ఘటన మంగళవారం చోటు చేసుకుంది. శాన్ డియాగో నుంచి నెవార్క్ బయలుదేరిని యునైటెడ్ ఎయిర్ లైన్స్ లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో నలుగురు సిబ్బందికి గాయాలు అయ్యాయి. ల్యాప్ టాప్ లో మంటలు మొత్తం క్యాబిన్ కు వ్యాపించాయి. దీంతో విమానాన్ని తిరిగి శాన్ డియాగో ల్యాండ్ అయింది. ప్రస్తుతం గాయపడిన నలుగురు సిబ్బందిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. యునైడెట్ ఎయిర్ లైన్స్ విమానం 2664 స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 7:30 గంటలకు శాన్ డియాగో అంతర్జాతీయ విమానాశ్రయానికి సురక్షితంగా తిరిగి వచ్చిందని ప్రయాణికుడు తీసుకెళ్తున్న ల్యాప్ టాప్ బ్యాటరీ ప్యాక్ లో మంటలు రావడంతోనే ప్రమాదం జరిగినట్లు యునైటెడ్ ఎయిర్‌లైన్స్ ప్రతినిధి చార్లెస్ హోబర్ట్ వెల్లడించారు. ఫ్లైట్ టేకాఫ్ అయిన కొద్ది సమయానికే ఈ సంఘటన జరిగింది. ప్రమాదం జరిగిన వెంటనే తిరిగి శాన్ డియాగోలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు పైలెట్లు.

రవిశాస్త్రి ఫైనల్ ఎలెవన్ ఇదే..ఓపెనర్లుగా వీరే!
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా తొలి టెస్టు గురవారం (ఫిబ్రవరి 9) నాగ్‌పూర్ వేదికగా ప్రారంభంకానుంది. ఇప్పటికే ఇరుజట్లు ప్రాక్టీస్‌లో చెమటోడ్చాయి. భారత గడ్డపై టెస్టు సిరీస్ గెలవాలన్న పట్టుదలతో ఆస్ట్రేలియా ఉండగా.. ఈ సిరీస్ గెలిచి ఛాంపియన్ షిప్ ఫైనల్లో అడుగుపెట్టాలని రోహిత్ సేన భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే రెండు టీమ్స్‌ టెస్టులో ఆడబోయే ఫైనల్ ఎలెవన్‌పై దృష్టిపెట్టాయి. 11మంది గెలుపు గుర్రాల కోసం అన్వేషిస్తున్నాయి. ఈ క్రమంలోనే పలువురు మాజీలు కూడా టీమిండియా పైనల్ ఎలెవన్‌పై వారి మాట చెప్పారు. టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రి కూడా జట్టు ఇలా ఉంటే బాగుంటుంది అంటూ ఓ టీమ్‌ను ప్రకటించాడు. ఇందులో ఓపెనర్లుగా రోహిత్‌తో పాటు గిల్‌కు చోటిచ్చాడు. బౌలింగ్ విభాగంలో ముగ్గురు స్పిన్నర్లు జడేజా, అశ్విన్, కుల్దీప్‌లను తీసుకోవాలని సూచించాడు. పేసర్లుగా సిరాజ్, షమీకి ప్లేస్ ఇచ్చాడు. ఇక వికెట్ కీపర్లుగా జట్టులో ఉన్న తెలుగోడు కేఎస్ భరత్‌తో పాటు ఇషాన్ కిషన్‌లో ఎవరో ఒకరిని తీసుకోవాలని చెప్పాడు. ఇకపోతే. టీమిండియా వెటరన్ వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ కూడా తన పైనల్ ఎలెవన్ ప్రకటించాడు. కానీ ఇతడి తుది జట్టులో గిల్, కుల్దీప్‌కు చోటు దక్కకపోవడం గమనార్హం. రోహిత్‌, రాహుల్‌లను డీకే ఓపెనర్లుగా ఎంచుకోగా.. మూడు, నాలుగు స్థానాలకు పుజారా, కోహ్లీలను ఎంపిక చేశాడు. ఐదో స్థానంలో శుభ్‌మన్‌ గిల్‌కు బదులుగా సూర్యకుమార్‌ యాదవ్‌ని తీసుకున్నాడు. ఆరో బ్యాటర్‌గా ఇషాన్‌ కిషన్‌కు బదులు కేఎస్ భరత్ వైపు మొగ్గుచూపాడు. పిచ్‌ స్పిన్‌ అనుకూలంగా ఉంటుందని భావించి ముగ్గురు స్పిన్నర్లకు తన తుది జట్టులో అవకాశం కల్పించాడు డీకే. జడేజా, అక్షర్‌ పటేల్, రవిచంద్రన్ అశ్విన్‌లను ఎంచుకుని కుల్దీప్ యాదవ్‌ను పక్కన పెట్టాడు. సిరాజ్‌, షమీలను పేసర్లుగా తీసుకున్నాడు.

తుది జట్టు కూర్పుపై కెప్టెన్ రోహిత్ ఏమన్నాడంటే!
ఆస్ట్రేలియాతో జరగబోయే టెస్టు సిరీస్‌లో భాగంగా టీమిండియా తుది జట్టులో ఎవరుంటారనేది ఆసక్తికరంగా మారింది. రిషభ్ పంత్‌, శ్రేయస్ అయ్యర్ గాయాలపాలవ్వడం, శుభ్‌మన్ గిల్, సూర్యకుమార్ మంచి ఫామ్‌లో ఉండటంతో ఫైనల్‌ ఎలెవన్‌లో ఎవరికి చోటివ్వాలనే దానిపై మేనేజ్‌మెంట్ దీర్ఘాలోచనలో పడింది. ఈ నేపథ్యంలోనే తొలి టెస్టులో ఆడే తుదిజట్టుపై టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించాడు. పంత్ లేకపోవడం పెద్ద లోటే అయినా ఆ స్థానాన్ని భర్తీ చేసే ప్లేయర్లు టీమ్‌లో ఉన్నారన్నాడు. “రిషభ్ పంత్ ఈ సిరీస్‌లో లేకపోవడం మాకు తీరని లోటే. అయితే అతని రోల్‌ను భర్తీ చేయగల ప్లేయర్లు జట్టులో ఉన్నారు. శుభ్‌మన్ గిల్ సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. భారీ సెంచరీలు చేశాడు. మరోవైపు సూర్యకుమార్ యాదవ్ ఎలా ఆడుతాడో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ ఇద్దరిలో ఎవరిని తుది జట్టులోకి తీసుకోవాలనేది ఇంకా నిర్ణయించలేదు. మ్యాచ్ రోజే తుది జట్టు ఎంపికైన నిర్ణయం తీసుకుంటాం. జట్టులో ఉన్న నలుగురు స్పిన్నర్లు కూడా క్వాలిటీ స్పిన్నర్లే. అశ్విన్, జడేజా చాలా మ్యాచ్‌లు కలిసి ఆడారు. కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్ అవకాశం వచ్చినప్పుడల్లా సద్వినియోగం చేసుకున్నారు. వీరిలో ఎవరికి అవకాశం ఇవ్వాలనే విషయంపై మాకు క్లారిటీ ఉంది. టెస్టు క్రికెట్ టైమ్ అయిపోయిందని, సుదీర్ఘ ఫార్మాట్‌కు ఆదరణ తగ్గుతుందని చాలా మంది అంటున్నారు. అయితే నాగ్‌పూర్ టెస్టు మొదటి రోజు మ్యాచ్‌కే 40 వేల టికెట్లు అమ్ముడుపోయాయి. ఇది టెస్టు క్రికెట్‌కి ఉన్న క్రేజ్” అని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు.

అక్కడ రూ. 15 కోట్లతో ప్లాట్ కొన్న సామ్.. హైదరాబాద్ కు దూరమవుతుందా..?
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. ఇటీవలే మయోసైటిస్ వ్యాధి నుంచి కోలుకున్న ఈ భామ కెరీర్ మీద ఫోకస్ పెట్టింది. ఇక ఈ మధ్యనే షూటింగ్స్ లో పాల్గొనడం మొదలుపెట్టింది. అక్కినేని ఇంటి కోడలిగా ప్రేమించిన చైతన్యను పెళ్ళాడి ఎన్నో ఆశలతో వైవాహిక బంధంలోకి అడుగుపెట్టిన సామ్ నాలుగేళ్లకే భర్త నుంచి విడిపోయి ఒంటరిగా మిగిలింది. ఇక ఆ జ్ఞాపకాలనుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్న సామ్ ముంబైకు మకాం మారుస్తుందని వార్తలు వస్తున్నాయి. సామ్ విడాకులు తీసుకున్నప్పుడు కూడా ఈ రూమర్స్ వచ్చాయి. అయితే అప్పుడు సామ్ హైదరాబాద్ తన సొంత ఇల్లు వంటిదని, ఇక్కడ నుంచి కదిలేది లేదని చెప్పుకొచ్చింది. దీంతో అప్పట్లో ఈ రూమర్స్ కు చెక్ పడింది. ఇక ఇప్పుడు మరోసారి ఆ రూమర్స్ గుప్పుమన్నాయి. ప్రస్తుతం సామ్ ఫోకస్ అంతా బాలీవుడ్ ప్రాజెక్ట్ లపై పెట్టిందని, ప్రతిసారి హైదరాబాద్ టూ ముంబై తిరగడం కష్టంగా ఉండడంతో అక్కడే ఆమె ఒక ట్రిపుల్ బెడ్ రూమ్ ప్లాట్ ను కొనుగోలు చేసినట్లు సమాచారం అందుతోంది. ఆ ప్లాట్ విలువ రూ. 15 కోట్లని టాక్. మంచి విలాసవంతమైన రూమ్స్ తో సకల సౌకర్యాలతో ఉన్న ఈ ఇంటిని సామ్ తన టేస్ట్ కు తగ్గట్టు డిజైన్ చేయించుకుందట. త్వరలోనే హైదరాబాద్ నుంచి ముంబైకు మకాం మార్చే పనిలో ఉందని తెలుస్తోంది. ఈ వార్తలో నిజం ఎంత అనేది తెలియదు కనై, ఈ విషయం తెలియడంతో అభిమానులు మాత్రం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సామ్.. మమ్మల్ని వదిలి వెళ్ళిపోతావా..? అంటూ కామెంట్స్ పెడుతున్నారు. మరి ఈ విషయమై సామ్ ఏమైనా స్పందిస్తుందోమో చూడాలి.

ఆయన ఏం చేసినా సెన్సేషన్ అవుతోంది…
సోషల్ మీడియాలో ట్రెండ్ చెయ్యాలి అంటే ఒక అప్డేట్ ఉండాలి, లేదా ఒక అఫీషియల్ అనౌన్స్మెంట్ ఉండాలి. ఈ రెండు లేకున్నా కేవలం స్పెక్యులేషణ్ తో మాత్రమే సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది అంటే అజిత్ కుమార్ కి మాత్రమే సాధ్యం. అజిత్ కుమార్ అకా AK అనే ట్యాగ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవ్వని రోజు ఉండదు, అంతలా ‘తల’ ఫాన్స్ ట్విట్టర్ లో ట్రెండ్ చేస్తూ ఉంటారు. తాజాగా అజిత్ ఫాన్స్ చేస్తున్న ట్రెండ్ ‘AK 62’. ఇటివలే తునివు సినిమాతో కెరీర్ బిగ్గెస్ట్ హిట్ కొట్టాడు అజిత్. కోలీవుడ్ నుంచి ఓవర్సీస్ వరకూ అన్ని సెంటర్స్ లో తునివు సాలిడ్ కలెక్షన్స్ ని రాబట్టింది. ఈ మూవీ అయిపోగానే అజిత్ తన నెక్స్ట్ సినిమాని ఎవరితో చెయ్యబోతున్నాడు అనే డిస్కషన్ స్టార్ట్ అయిపొయింది. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ లో అజిత్ నెక్స్ట్ సినిమా చేస్తున్నాడు. AK 62 అనే వర్కింగ్ టైటిల్ తో సెట్స్ పైకి వెళ్లాల్సిన ఈ మూవీని విజ్ఞేశ్ శివన్ డైరెక్ట్ చెయ్యాల్సి ఉంది. త్వరలో అఫీషియల్ అనౌన్స్మెంట్ బయటకి వస్తుంది అనుకుంటున్న టైంలో విజ్ఞేశ్ శివన్ ‘AK 62’ నుంచి తప్పుకున్నాడని సమాచారం. విజ్ఞేశ్ శివన్ ప్లేస్ లో ‘తడం’ సినిమాని తెరకెక్కించిన ‘మగిళ్ తిరుమేణి’ రేస్ లోకి వచ్చాడు. ఇప్పటికే అజిత్ కి కథని కూడా ఒప్పించి, దర్శకుడు లైన్ క్లియర్ చేసుకున్నాడనే టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తోంది. విజ్ఞేశ్ శివన్, మగిళ్ తిరుమేణిల్లో అజిత్ ఎవరితో సినిమా చేస్తున్నాడు అనే కన్ఫర్మేషన్ త్వరలో బయటకి రానుంది. మోస్ట్లీ AK 62 అప్డేట్ ఈ వీక్ లోనే బయటకి రానుంది.