NTV Telugu Site icon

Top Headlines @ 5 PM: టాప్‌ న్యూస్‌

Top Headlines @ 5 Pm

Top Headlines @ 5 Pm

ఊపిరి పోయే వరకు జగన్‌తోనే..
తన ఊపిరి పోయే వరకు సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డితోనే ఉంటానని ప్రకటించారు ఆంధ్రప్రదేశ్‌ ఫిల్మ్‌ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ పోసాని కృష్ణ మురళి.. ఇవాళ ఏపీ ఫిల్మ్‌ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పదవికోసం నేను రాజకీయాల్లోకి రాలేదని, జగన్‌ని దూరం నుంచి చూసి వచ్చానని తెలిపారు.. అయితే, చచ్చే వరకు జగన్‌తోనే ఉంటాను, వైసీపీ జెండామోస్తానని అని ప్రకటించారు పోసానీ కృష్ణ మురళి.. ఇక, తన పాత రోజులను గుర్తుచేసుకున్న పోసాని.. నాగార్జున యూనివర్శిటీకి వెళ్లే వరకు నాకు రాజకీయాలు తెలియవు.. గౌతం రెడ్డి ద్వారానే విద్యార్థి దశ నుండి రాజకీయాల్లోకి వచ్చా.. ఆ తర్వాత నాకు దురద మొదలైందన్నారు. సీఎం జగన్‌ నాకు ఈ పదవి ఇస్తారని నేను రాజకీయాల్లోకి రాలేదు.. నాకు 11 ఏళ్ల నుంచి జగన్‌మోహన్‌రెడ్డి తెలుసు.. నన్ను ఎప్పుడూ పిలుస్తుండేవారు.. కానీ, నేను ఏనాడు ఆయన్ని కలవలేదు.. డుమ్మా కొట్టేవాడినన్నారు. మరోవైపు, సీఎం వైఎస్‌ జగన్‌పై ప్రశంసలు కురిపించారు పోసాని.. వైఎస్‌ జగన్‌ నాకు ఎంతో ఇష్టం.. దూరంగా ఆయన్ని చూస్తూ ఉండేవాడినన్నారు.. ఎందుకంటే.. చాలా మంది కులాల్లో నుంచి, మతాల్లో నుంచి, డబ్బుల్లో నుంచి నాయకులు పుడతా ఉంటారు.. కానీ, జగన్మోహన్‌రెడ్డి జనాల్లో నుండి పుట్టిన నాయకుడిగా అభివర్ణించారు.. అందుకే ఆయన అంటే నాకు ఇష్టం అని వెల్లడించారు.. ఆయన వ్యక్తిత్వం చూశా.. అందుకే ఆయనతో స్నేహం చేశా.. జగన్‌ మోహన్‌రెడ్డి ఈజ్‌ ఏ స్వీటెస్ట్‌, ఈజ్‌ ఏ హాటెస్ట్‌, ఈజ్‌ ఏ హానెస్ట్, ఈజ్‌ ఏ గ్రేటెస్ట్‌ నథింగ్‌ బట్‌ ఎవరెస్ట్‌.. అలాంటి వ్యక్తి కాబట్టే.. ఆయన ఇచ్చిన ఈ పదవి తీసుకున్నాను.. నేను సినీ పరిశ్రమకు ఎంత మంచి చేస్తానో తెలియదు.. కానీ, చెడు మాత్రం చేయను, మోసాలు చేయను, అబద్దాలు చెప్పను.. ఆకాశం నుంచి నేను చుక్కలు దింపుతానని చెప్పను.. కానీ, నేను ఎంత చేయాలి అనుకుంటున్నాను.. జగన్‌ అంత స్వేచ్చనాకు ఇస్తారని చెప్పుకొచ్చారు ఏపీ ఫిల్మ్‌ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ పోసాని కృష్ణ మురళి.

మద్యం విక్రయాల్లో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇక, ఇలా కూడా..
మద్యం విక్రయాల్లో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.. మద్యం లావాదేవీల్లో డిజిటల్‌ పేమెంట్లకు అవకాశం కల్పించేలా నిర్ణయం తీసుకుంది.. డిజిటల్‌ పేమెంట్లను ఇవాళ్టి నుంచి అమల్లోకి తీసుకొచ్చారు.. ఆన్ లైన్ లావాదేవీలను లాంఛనంగా ప్రారంభించారు ఎక్సైజ్ శాఖ స్పెషల్ ఛీఫ్ సెక్రటరీ రజత్ భార్గవ.. తొలుత రాష్ట్రంలోని 11 మద్యం ఔట్ లెట్లల్లో ఆన్ లైన్ లావాదేవీలను అందుబాటులోకి తీసుకొచ్చారు.. మూడు నెలల్లో మిగతా మద్యం దుకాణాల్లో డిజిటల్ లావాదేవీలను అమలుకు చర్యలు తీసుకుంటున్నారు అధికారులు.. మొత్తం ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా 3,708 మద్యం షాపులు.. ఔట్ లెట్స్ ఉండగా.. మొదట 11 మద్యం ఔట్‌లెట్లలోనే ఇది అమల్లోకి వచ్చింది.. ఎస్బీఐ సహకారంతో మద్యం విక్రయాల్లో ఆన్ లైన్ చెల్లింపు తీసుకొచ్చింది ఎక్సైజ్‌ శాఖ.. ఇక, డెబిట్ కార్డులు, యూపీఐ లావాదేవీలకు ఎటువంటి అదనపు ఛార్జీలు ఉండబోవని ప్రభుత్వం స్పష్టం చేసింది.. అయితే, క్రెడిట్‌ కార్డ్ లావాదేవీలకు నిబంధనల ప్రకారం ఛార్జీల వసూలుకు నిర్ణయం తీసుకున్నారు.. మొత్తంగా.. క్యాష్‌లెన్స్‌ లావాదేవీలు కూడా అందుబాటులోకి రావడంతో.. మద్యం ప్రియులకు గుడ్‌న్యూస్‌గా చెప్పవచ్చు. అంటే.. జేబులో క్యాష్‌ లేకున్నా సరే.. కార్డులు ఉన్నా.. మొబైల్‌ ఉన్నా.. లిక్కర్‌ కొనుగోలు చేసుకోవచ్చు.

ఫోన్ ట్యాపింగ్ వివాదంపై మంత్రి కారుమూరి కీలక వ్యాఖ్యలు.. ఆ సర్వే రిపోర్ట్‌ వల్లే..!
నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి చేసిన ఫోన్‌ ట్యాపింగ్‌ ఆరోపణలు ఏపీ రాజకీయాల్లో కలకలం సృష్టించాయి.. అయితే, ఫోన్ ట్యాపింగ్ వివాదంపై కీలక వ్యాఖ్యలు చేశారు మంత్రి కారుమూరి నాగేశ్వరరావు. సర్వేల్లో ఓటమి తప్పదని తెలిపోవడంతో టిక్కెట్లు రావనే పార్టీలు మారుతున్నారని విమర్శించారు. ఫిరాయింపుల మీద లీకులు ఇచ్చి ఇప్పుడు ట్యాపింగ్ ఆరోపణలు చెయ్యడం అంటే వంకాలేనోడు డొంకపట్టుకుని వెళ్లాడటం తప్ప మరొకటి కాదంటూ ఎద్దేవా చేశారు.. పార్టీ వదిలి వెళ్లిపోతా మని లీకులు ఇచ్చి ఆరోపణలు చెయ్యడం చూస్తేనే అర్ధం అవుతోందన్నారు. గెలుపు గుర్రాలకే టికెట్‌ అనేది ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్ రెడ్డి విధానమన్న ఆయన.. టికెట్‌ గ్యారెంటీ లేకపోవడంతోనే ఆరోపణలు చేసి వెళ్లిపోతున్నారని వ్యాఖ్యానించారు. అయితే, సర్వేల్లో ఓటమి తప్పదని తేలిన వాళ్లు పార్టీ వదిలి పోతున్నారని తెలిపారు మంత్రి కారుమూరు.. ఇక, వైసీపీ ప్రభుత్వాన్ని నిలదీస్తామంటున్న యువ నాయకుడు.. ముందు తన తండ్రిని నిలదీయాలి.. అని నారా లోకేష్‌కు సూచించారు.. మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసి చెయ్యాలేని అభివృద్ధి.. మూడున్నరేళ్లలో సీఎం వైఎస్‌ జగన్‌ హయాంలో ఎలా సాధ్యం అయిందో తండ్రిని ప్రశ్నించాలన్నారు. కనీసం వార్డు మెంబర్ గా కూడా గెలవలేని వ్యక్తి.. విమర్శలకు స్పందించే స్థాయి నాది కాదంటూ సెటైర్లు వేశారు మంత్రి కారుమూరి నాగేశ్వరరావు.. కాగా, ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డి ఆరోపణలు.. మంత్రులు, వైసీపీ నేతల కౌంటర్లతో నెల్లూరు రాజకీయం హాట్‌ టాపిక్‌గా మారిన విషయం విదితమే.. ఇక, ఎంపీ ఆదాల ప్రభాకర్‌రెడ్డిని.. నెల్లూరు రూరల్‌ నియోజకవర్గ ఇంచార్జ్‌గా పెట్టి.. కోటంరెడ్డిని సైడ్‌ చేశారు వైసీపీ అధినేత, సీఎం వైఎస్‌ జగన్.

గత బడ్జెట్‌లో ఎంత పెట్టారు, ఎంత ఖర్చు పెట్టారు చెప్పాలి
అసెంబ్లీ సమావేశాల నిర్వాహణపై స్పీకర్ పోచారం అధ్యక్షతన జరిగిన బీఏసీ సమావేశం ముగిసింది. రేపు (శనివారం) గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానం చేపట్టాలని సభ్యులు నిర్ణయించారు. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ తమిళిసై తెలుగులో కాళోజీ మాటలను ప్రస్తావిస్తూ ప్రసంగం మొదలుపెట్టారు. ప్రభుత్వం అందించిన ప్రసంగాన్ని ఆమె యథాతథంగా చదివారు. తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందని ఆమె అన్నారు. దేశ ధాన్యాగారంగా తెలంగాణ ఆవిర్భవిస్తోందని చెప్పారు. సీఎం కేసీఆర్ పరిపాలన దక్షత, ప్రజాప్రతినిధుల కృషితో రాష్ట్రం ముందుకెళ్తోందన్నారు. తెలంగాణ అపూర్వ విజయాలను సాధించిందన్నారు. 24 గంటల విద్యుత్ సరఫరాతో తెలంగాణ విరాజిల్లుతోందని, తాగునీటి సమస్యల కోసం తల్లడిల్లిన పరిస్థితుల నుంచి తెలంగాణ బయటపడిందని తెలిపారు. అయితే.. బీఆర్‌ఎస్‌కు అనుకూలంగా గవర్నర్‌ ప్రసంగంలో మాట్లాడారని, ముమ్మటికి బీజేపీ, బీఆర్‌ఎస్‌ ఒక్కటేనంటూ కాంగ్రెస్‌ నాయకులు ఆందోళన చేపట్టారు. ఈ నేపథ్యంలో బీజేపీ నేత కొండ వివశ్వేశ్వర్‌ రెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వం రాసి ఇచ్చేదే గవర్నర్ చదివిందని, ప్రభుత్వం గవర్నర్ కి ఇచ్చింది అన్ని అబద్ధాలు, తప్పులు అని ఆయన దుయ్యబట్టారు. దళిత బంధు ఇవ్వలేదని, డబల్ బెడ్ రూం లు ఇవ్వలేదని చెప్పిస్తే బాగుండేదన్నారు కొండ విశ్వేశ్వర్‌ రెడ్డి. నా ప్రభుత్వము ధనిక రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశాము అని, దళితులను మోసం చేశామని ప్రసంగంలో ఉంటే బాగుండేదని ఆయన అన్నారు. తెలంగాణ బడ్జెట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఉంటుందని, గత బడ్జెట్ లో ఎంత పెట్టారు, ఎంత ఖర్చు పెట్టారు చెప్పాలన్నారు. కేసీఆర్‌ బడ్జెట్‌లు పెద్ద స్కాం చేశారని, ఆల్కహాల్, పెట్రోల్, డీజిల్ ల మీదనే ఈ ప్రభుత్వము నడుస్తుంది.. అభివృద్ధి అంటే ఇది కాదని కొండ విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. అంతేకాకుండా.. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో భూములు కబ్జా గురవుతున్నాయన్న ఆయన.. సామాన్యులను బెదిరించి భూములు గుంజుకుంటున్నారని ఆరోపించారు. ఏ రాష్ట్రంలో కూడా కుటుంబ పాలన చూడలేదు… వారసత్వ పాలన చూసాము… కానీ ఇక్కడ చూస్తున్నామన్నారు.

‘నేను లాయర్’..సీటుపై కాలు తీయమన్నందుకు యువతి హల్‌చల్
మహారాష్ట్ర ముంబై లోకల్ ట్రైన్‌లో ఓ యువతి హల్‌చల్ చేసింది. ఎదుటి ప్యాసింజర్ సీటుపై కాలుపెట్టిన ఆ లేడీ లాయర్ రుబాబు చేసింది. కాలు తీయమన్నా తీయకుండా కాస్త దురుసుగా ప్రవర్తించింది. తాముు లాయర్లమని, తమ ఇష్టం వచ్చినట్లు ఉంటామని నానా హంగామా చేసింది. తనతో పాటు ఉన్న మరో వ్యక్తితో కలిసి తోటి ప్రయాణికుడిపై వాగ్వాదానికి దిగింది. అంతేకాదు ఈ ఘటనను రికార్డు చేసినందుకు ప్రయాణికుడి మొబైల్‌ను లాక్కునేందుకు ప్రయత్నించింది. ఇందుకు సంబంధించిన వీడియోను సదరు వ్యక్తి సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశాడు. ఈ లాయర్లు లోకల్ ట్రైన్‌లో ప్రయాణికులకు ఇబ్బంది కల్గించారని దానికి క్యాప్షన్‌గా రాసుకొచ్చాడు. ముంబై పోలీస్, రైల్వే శాఖను ట్యాగ్ చేసి ఫిర్యాదు చేశాడు. వీరిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాడు.దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ అయింది. లాయర్ల తీరుపై నెటిజన్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు. లా చదివి ఇలాగేనా ప్రవర్తించేది అని కామెంట్లు చేస్తున్నారు. సామాన్యులంటే గౌరవం లేని వీరిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు.

యాపిల్ చూపు.. భారత్ వైపు.. ఎందుకంటే?
ప్రపంచం ఆర్థికమాంద్యం పరిస్థితులను ఎదుర్కొంటోంది. అమెరికా, యూరోపియన్ మార్కెట్లు ఆశాజనకంగా లేవు. 6 నెలల నుంచి ఏడాది వ్యవధిలో మాంద్యం ఎప్పుడైనా రావచ్చని ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రపంచంలో ఒక్క భారత ఆర్థిక పరిస్థితి మాత్రమే ఆశాజనకంగా ఉంటుందని ఐఎంఎఫ్ తో పాటు పలు ఆర్థిక సంస్థలు వెల్లడిస్తున్నాయి. దీంతో ప్రపంచ దిగ్గజ కంపెనీలు భారత్ వైపు చూస్తున్నాయి. తాజాగా యాపిల్ కంపెనీల కూడా భారత మార్కెట్ తమకు ఆశాజనకంగా ఉంటుందని భావిస్తోంది. భారత మార్కెట్ పై సానుకూల దృక్పథంతో ఉన్నామని సంస్థ సీఈఓ టీమ్ కుక్ వెల్లడించారు. పెట్టుబడులు, రిటైల్, ఆన్ లైన్ మార్గాల్లో భారత్ పై దృష్టి సారించామని.. భారత మార్కెట్ ను ‘‘ఉత్తేజకరమైన మార్కెట్’’గా అభివర్ణించారు. డిసెంబర్ తో ముగిసిన త్రైమాసిక ఫలితాలను యాపిల్ గురువారం ప్రకటించింది. 117.2 బిలియన్ డాలర్ల రెవెన్యూ వచ్చినట్లు వెల్లడించింది. అయితే ఇది 2021 డిసెంబర్ త్రైమాసిక ఫలితాలతో పోలిస్తే 5 శాతం తక్కువ. ఇండియాతో పాటు స్పెయిన్, కెనడా, ఇండోనేషియ, మెక్సికో, టర్కీ, వియత్నాం, బ్రెజిల్ దేశాల్లో రికార్డు స్థాయి రెవెన్యూను నమోదు చేసింది.

ఐఐటీలో చదివిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు తప్పలేదు.. ఉద్యోగం ఉంటే చెప్పాలని పోస్ట్..
ఐఐటీలో చదివి సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ గా పనిచేస్తున్న ఉద్యోగి కూడా తాజా లేఆఫ్స్ నుంచి తప్పించుకోలేకపోయారు. ఐఐటీ గ్రాడ్యుయేట్ అంటే ఏ కంపెనీ అయిన కళ్లకద్దుకుని కొలువు ఇస్తుంది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించడం లేదు. తాజాగా ప్రముఖ ఎడ్ టెక్ సంస్థ బైజూన్ రెండో విడత ఉద్యోగుల తొలగింపులను ప్రకటించింది. దాదాపుగా 1000 మందిని కొలువుల నుంచి తీసిపారేసింది. ఈ లేఆఫ్స్ లో అభిషేక్ ఆశిష్ అనే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ తన ఉద్యోగాన్ని కోల్పోవాల్సి వచ్చింది. ఏడాది కాలంగా బైజూస్ లో పనిచేస్తున్న తనను తీసేసినట్లు వెల్లడించారు. ఐఐటి గ్రాడ్యుయేట్ అయిన అభిషేక్ ఆశిష్ జూన్ 2022 నుండి కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. కంపెనీ ఫ్రెషర్‌లందరినీ తొలగిస్తున్నట్లు కూడా చెబుతున్నారు. అనేక మందితో పాటు కంపెనీ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న నా ఉద్యోగం కూడా బైజూస్ రెండో విడత లేఆఫ్స్ తో ప్రభావితం అయిందని.. వర్క్ ఫోర్స్ ను తగ్గించుకోవాలని నిర్ణయించుకున్నారని.. లింక్డ్‌ఇన్ పోస్ట్‌లో రాశారు. ‘‘ ఏది జరిగిన అది మంచికోపమే జరుగుతుంది’’ అంటూ పోస్ట్ లో రాశారు. జీవితంలో నాకు ఏది రాసి ఉందో అని, కొత్త సవాళ్ల కోసం వెతుకుతున్నానంటూ పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ గా మారింది. ప్రస్తుతం ఆశిష్ కొత్త ఉద్యోగం కోసం చూస్తున్నాని.. అవకాశాలు ఉంటే చెప్పాలని లింక్డ్‌ఇన్‌ లో కోరాడు. నేను పని చేయడానికి సిద్ధంగా ఉన్నానని.. సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్ రంగంలో అవకాశాల కోసం వెతుకుతున్నానని.. ఎవరైనా నియామకం చేస్తుంటే లేదా ఏదైనా ఓపెనింగ్స్ ఉంటే నన్ను రిఫర్ చేయగలరని కోరాడు. లింక్డ్‌ఇన్‌ లో తన రెజ్యూమ్ కూడా పెడుతున్నానని పోస్ట్ లో వెల్లడించారు. బైజూస్ గతేడాది అక్టోబర్ నెలలో 2000 మందిని తొలగించింది. తాజాగా మరో 1000 మంది ఉద్యోగులను ఊడపీకింది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ టెక్ దిగ్గజాలు అయిన మెటా, ట్విట్టర్, గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి సంస్థలు తమ ఉద్యోగులను తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నాయి.

ఇది రివర్స్ స్వీప్ కాదు, రివర్స్ స్లాప్..విహారి సింగిల్ హ్యాండ్ షాట్
హనుమ విహారి..ప్రస్తుతం సోషల్ మీడియాలో హంగామా సృష్టిస్తోన్న పేరు. విహారికి ఆటపట్ల ఉన్న అంకిత భావం అందరికీ తెలిసిందే. ఆ మధ్య ఆస్ట్రేలియా టూర్‌లో ఆసీస్ పేసర్లు విసురుతున్న బుల్లెట్లలాంటి బంతులకు తన శరీరాన్నే అడ్డుగా పెట్టి వీరోచితంగా పోరాడాడు. ఇక తాజాగా రంజీ ట్రోఫీలో మధ్య ప్రదేశ్‌తో జరుగుతోన్న మ్యాచ్‌లో తన ఎడమ చేతి మణికట్టు విరిగినా కూడా ఒంటి చేత్తో ఫైట్ చేయడం చూశాం. తాజాగా అదే మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లోనూ అతడు అలాగే మొండిగా బ్యాటింగ్‌కు దిగాడు. అంతేకాదు ఆ ఒంటిచేత్తోనే మూడు ఫోర్లు కొట్టాడు. అందులో ఒకటి రివర్స్ స్వీప్ కూడా ఉండటం విశేషం. ఈ షాట్ చూసిన టీమిండియా వికెట్ కీపర్ దినేష్ కార్తీక్.. అది రివర్స్ స్వీప్ కాదు రివర్స్ స్లాప్ అంటూ సరదాగా కామెంట్ చేశాడు. అయితే విహారి ఎంత పోరాటం చేసినా ఈ మ్యాచ్‌లో ఆంధ్రా టీమ్ చేజేతులా ఓటమి కొనితెచ్చుకుంది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన ఆంధ్ర తొలి ఇన్నింగ్స్‌లో 379 రన్స్ చేసింది. రికీ భుయ్ (149), కరణ్ షిండే (110) సెంచరీలతో మెరిశారు. అనంతరం ఎంపీని 228 రన్స్‌కే ఆలౌట్ చేసిన ఏపీ మొదటి ఇన్నింగ్స్‌లో 151 రన్స్ ఆధిక్యం సాధించింది. అయితే రెండో ఇన్నింగ్స్‌లో ఆంధ్ర కేవలం 93 పరుగులకే ఆలౌటైంది. అనంతరం 245 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన మధ్యప్రదేశ్ 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదింగి విజయం సాధించింది. యశ్ దూబే (58), రజత్ పటిదార్ (55) హాఫ్ సెంచరీలతో మెరిసి ఎంపీకి విజయాన్ని అందించారు.

కళాతపస్వి విశ్వనాథ్ బయోపిక్..?
మహానటి సావిత్రి బయోపిక్ తరువాత బయోపిక్ ల ట్రెండ్ మరింత జోరు పెంచింది. సినీ, రాజకీయ రంగాల్లో ప్రజలకు మంచి చేసిన, ప్రజలకు స్ఫూర్తినింపిన వారి జీవిత కథలను అందరి ముందుకు తీసుకువస్తున్నారు దర్శకులు. ఇక సావిత్రి బయోపిక్ రిలీజ్ అయినా కొద్దిరోజులకే కళాతపస్వి విశ్వనాథ్ బయోపిక్ రానున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ‘విశ్వ దర్శనం’ టైటిల్ తో జనార్ధన మహర్షి ఈ బయోపిక్ ను ప్రారంభించారు. 2018 లో మొదలైన ఈ సినిమా ఇప్పటివరకు బయటికి వచ్చింది లేదు. అయి బయోపిక్ అర్దాంతరంగా ఆగిపోవడానికి కారణం ఎన్టీఆర్ బయోపిక్ అని చెప్పుకొస్తున్నారు. ఉన్నది లేనట్టుగా.. లేనిది ఉన్నట్టుగా చూపించి ఎన్టీఆర్ బయోపిక్ తీశారని క్రిష్- బాలకృష్ణ ను ఏకిపారేశారు అభిమానులు. ఇక ఈ విమర్శలకు తట్టుకోలేకనే వారు బయోపిక్ ను మధ్యలోనే ఆపేసినట్లు వార్తలు వినిపించాయి. దాదాపు మూడేళ్ళ తరువాత నేడు మరోసారి కళాతపస్వి విశ్వనాథ్ బయోపిక్ హాట్ టాపిక్ గా మారింది. గతరాత్రి కళాతపస్వి విశ్వనాథ్ మృతిచెందిన విషయం తెల్సిందే. గత కొంత కాలంగా వయవృద్దాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయన అపోలోలో చికిత్స తీసుకుంటూ మృతి చెందారు. ఇప్పుడు ఆయన బయోపిక్ ను తీసే దమ్మున్న డైరెక్టర్ ఎవరు అని చర్చ మొదలయ్యింది. ఒకరకంగా చెప్పుకోవాలంటే.. విశ్వదర్శనం పూర్తీ అయ్యి ఉంటే.. తన జీవిత కథను చూసుకొని ఉండేవారు విశ్వనాథ్. ఇప్పుడు ఆ అదృష్టం లేకుండా పోయింది. ఆయన జీవితంలో ఒడిదుడుకులు ఎన్నో.. అంతకుమించిన విజయాలు.. జీవిత సత్యాలు, చాలామందికి గుణపాఠాలు.. ఇలా చెప్పుకొంటూ పోతే విశ్వనాథ్ జీవితమే ఒక పెద్ద పుస్తకం. అందులో అన్ని పేజీలను కాకపోయినా మర్చిపోలేని కొన్ని పేజీలను అయినా ఈ బయోపిక్ లో పెట్టి.. వచ్చే తరానికి బహుమతిగా ఇస్తారని చాలామంది ఆశపడుతున్నారు. మరి కళాతపస్వి విశ్వనాథ్ బయోపిక్ మళ్లీ మొదలుపెడతారా..? ఈసారి ఆ డైరెక్టర్ ఎవరు..? అనేది తెలియాల్సి ఉంది.