NTV Telugu Site icon

Top Headlines @ 5 PM: టాప్‌ న్యూస్‌

Top Headlines @ 5 Pm

Top Headlines @ 5 Pm

కోటంరెడ్డిది నమ్మక ద్రోహం..
కోటంరెడ్డి చేసింది నమ్మక ద్రోహం అంటూ మండిపడ్డారు మాజీ మంద్రి పేర్నినాని. సీఎం వైఎస్‌ జగన్ నమ్మి టికెట్ ఇస్తే ఇలా చేయటం తప్పు అని హితవుపలికారు.. ఇక, పక్షులు వలస వెళ్లే కాలం ఇదంటూ ఎద్దేవా చేశారు.. మేం కూడా విచారణ చేయమని అడుగుతాం.. ఏముంది దాంట్లో.. కానీ, లోకేష్ తో టచ్ లో ఉండొచ్చా? అని నిలదీశారు. డిసెంబర్ 27న బుధవారం బెంజ్ కారులో కోటంరెడ్డి.. హైదరాబాద్ వెళ్లి వచ్చాడని అంటున్నారు.. అంతేకాదు.. ఆరోగ్యం బాగోపోతే ఫోన్ చేశారట.. మరి నా ఆరోగ్యం బాగోలేనప్పుడు నాకెందుకు లోకేష్, చంద్రబాబు ఫోన్ చేయలేదు? అని ఎద్దేవా ఏచశారు.. అసలు, నిఖార్సుగా ఉంటే ఫోన్ ట్యాపింగ్ తో భయపడటం ఎందుకు ? అని మండిపడ్డారు. కోటంరెడ్డి నా భక్తుడనే మత్తులో సీఎం వైఎస్‌ జగన్‌ ఉన్నారు.. నిజంగా నిఘా పెట్టి ఉంటే లోకేష్ తో టచ్ లో ఉన్న విషయం ఎప్పుడో తెలిసేది కదా? అని ప్రశ్నించారు మాజీ మంత్రి పేర్నినాని.. ఎమ్మెల్యే పదవి చిన్నదా? రెండు సార్లు ఎమ్మెల్యే చేయటం అంటే చిన్న విషయమా? అని నిలదీశారు. రాజకీయాల్లో సామాజిక, జిల్లా సమీకరణాలు ఉంటాయి.. వాటిని దృష్టిలో పెట్టుకునే పదవుల కేటాయింపులు ఉంటాయన్నారు.. ఇక, రాజశేఖరరెడ్డి కొడుకుగానే వైఎస్‌ జగన్ ను అభిమానించాను.. పదవుల గురించి చూసుకుంటే రాజకీయ అవసరాలు అవుతాయి.. కానీ, అభిమానం అవ్వదని కీలక వ్యాఖ్యలు చేశారు.

టాప్ గేర్‌లో మైనార్టీ సంక్షేమం..
ఆంధ్రప్రదేశ్‌లో మైనార్టీల సంక్షేమం టాప్‌ గేర్‌లో నడుస్తోంది.. మూడున్నరేళ్లలోనే ఆ ఫలితాలు కనిపిస్తున్నాయని తెలిపారు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి.. తాడేపల్లి వేదికగా జరిగిన వైసీపీ ముస్లిం మైనార్టీ సదస్సు నిర్వహించారు.. ముస్లిం మైనార్టీ వ్యవహారాల మంత్రి, డిప్యూటీ సీఎం అంజాద్ బాష , మైనారిటీ వర్గ ఎమ్మెల్యేలు, నేతలు హాజరయ్యారు.. ఈ సందర్భంగా సజ్జల మాట్లాడుతూ.. మైనార్టీలకు అండగా నిలబడి సంక్షేమపాలన అందించిన నేత సీఎం వైఎస్‌ జగన్‌ అన్నారు.. గత ప్రభుత్వాలు చేయలేనంతగా మైనార్టీలకి మేలు చేసిన అంకెలు ఇపుడు కన్పిస్తున్నాయి.. నేరుగా డిబిటి రూపంలో కానీ.. గృహ ‌నిర్మాణరూపంలో కానీ లబ్దిదారులకి నేరుగా మేలు జరిగేలా అమలు చేస్తున్నాం అన్నారు.. కుటుంబ భవిష్యత్ ని తీర్చిదిద్దేలా వైసీపీ సంక్షేమ‌ పథకాలు అమలవుతున్నాయి.. ఈ పథకాలతో రాష్ట్ర స్వరూపమే మారబోతోందన్నారు. ఏ ప్రభుత్వ సహాయం‌చేసినా ఎక్కువ అవసరం ఉంది ముస్లిం.. మైనార్టీలకే.. ఏపీలో టాప్ గేర్ లో మైనార్టీల సంక్షేమం ఉందన్నారు సజ్జల. 4.5 లక్షల మందికి అమ్మ ఒడి, 2.5 లక్షలమంది ఉన్నత విద్య, ఇలా 21 వేల‌కోట్లకి పైబడి మైనార్టీలకి ఈ మూడున్నరేళ్లలో మేలు జరిగిందన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి.. కేవలం డిబిటి ద్వారానే 10771 కోట్లు మైనార్టీలకి ఇచ్చాం.. రాష్ట్రంలో 87 శాతం మందికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వల్ల మేలు జరిగిందన్న ఆయన.. దివంగత సీఎం వైఎస్సార్ తీసుకొచ్చిన 4 శాతం రిజర్వేషన్లతో మైనార్టీలకి ఎంతో మేలు జరుగుతోందన్నారు. వైఎస్సార్ సిపి డిఎన్ ఎ లోనే ఎస్సీ,ఎస్టీ, బిసి, మైనార్టీలున్నారు. కానీ, ఏపీలో సీఎం వైఎస్ జగన్ సంక్షేమ యజ్ఞం ఆగిపోవాలని ప్రతిపక్షాలన్నీ ఏకమై కుట్రలు చేస్తున్నాయని మండిపడ్డారు. కోవిడ్ లాంటి మహమ్మారి వచ్చినా క్యాలండర్ ప్రకారం సంక్షేమ‌ పథకాలని సీఎం అమలు చేస్తూనే ఉన్నారన్న ఆయన.. సీఎం పాలన‌వల్ల రాబోయే అయిదారేళ్లలో మీ బ్రతుకులు మీరే నిర్ణయించుకునే స్ధితికి మారతాయని వెల్లడించారు.

ఫోన్ ట్యాపింగ్ చంద్రబాబు స్కీం..
అధికార వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డి చేసిన ఫోన్‌ ట్యాపింగ్‌ కామెంట్లు ఇప్పుడు నెల్లూరు జిల్లా రాజకీయాల్లో కాకరేపుతున్నాయి.. అయితే, వైసీపీ నేతలు కోటంరెడ్డిపై కౌంటర్‌ ఎటాక్‌కు దిగుతున్నారు.. తాజా పరిణామాలపై స్పందించారు ప్రభుత్వ సలహాదారు. వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి.. తాడేపల్లిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. ఫోన్ ట్యాపింగ్ అనేదే లేనప్పుడు.. ఇంకా విచారణ అవసరం ఏముంటుంది? అని ప్రశ్నించారు. ఫోన్ ట్యాపింగ్ ఆరోపణల వెనుక ఉద్దేశ్యాలు ఎవరివో అందరికీ తెలుసన్న ఆయన.. పార్టీకి సంబంధించిన వివిధ విభాగాలను యాక్టివేట్ చేయటం, పార్టీ నిర్మాణం, ప్రతిపక్షాలు చేస్తున్న విష ప్రచారాన్ని తిప్పి కొట్టడంపై సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి సమీక్షిస్తున్నారని తెలిపారు. ఇక, ఫోన్ ట్యాపింగ్ అంశం చంద్రబాబు స్కీం అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు సజ్జల.. దీనిలో కోటంరెడ్డి లాంటివాళ్లు పాత్రధారులుగా అభివర్ణించారు. రాజకీయంగా టీడీపీ దౌర్భాగ్యకరమైన పరిస్థితిలో ఉంది.. అందుకే, లేని విషయాలను ఉన్నట్లు సృష్టించే ప్రయత్నం చేస్తోందంటూ మండిపడ్డారు. ప్రజలకు సంబంధించి మాట్లాడే అంశాలు లేకపోవడంతోనే టీడీపీ ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు చేస్తోందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు సంబంధించి మేము చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి.. ఇటువంటి చిల్లర అంశాలు పట్టించుకునే టైం మాకు లేదన్నారు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి.

బీజేపీ ఎల్ఐసీ, బ్యాంకుల డబ్బును వాడుకుంటోంది..
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, త్రుణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ బీజేపీపై విరుచుకుపడ్డారు. తీవ్రస్థాయిలో ఆరోపణలు గుప్పించారు. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్(ఎల్ఐసీ), బ్యాంకులలో ప్రజలు డిపాజిట్ చేసిన డబ్బును బీజేపీ తన పార్టీ నాయకులకు లబ్ధి చేకూర్చేందుకు ఉపయోగిస్తోందిని మంగళవారం దీదీ ఆరోపించారు. పుర్బా బర్ధమాన్ జిల్లాలో జరిగిన ఓ కార్యక్రమంలో మమతా బెనర్జీ ఈ వ్యాఖ్యలు చేశారు. కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ షేర్ మార్కెట్ భారీ పతనానికి కారణం అయిందని విమర్శించారు. కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాతే షేర్ మార్కెట్ భారీ పతనానికి గురైందని.. అనేక వేల కోట్ల రూపాయలను పంపింగ్ చేయాలంటూ కొంతమందికి ఫోన్ కాల్స్ వెళ్లాయని ఆమె అన్నారు. 2024 జనరల్ ఎలక్షన్స్ ను దృష్టిలో పెట్టుకుని బీజేపీ ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టిందని విమర్శించారు. కేంద్ర బడ్జెట్ అన్ని అబద్ధాలతో నిండి ఉందని అభివర్ణించారు. ఇదిలా ఉంటే బుల్లెట్ రైలు ప్రాజెక్టు ఆపేందుకు రాహుల్ గాంధీ, శరద్ పవార్, ఉద్ధవ్ ఠాక్రేలు ప్రయత్నించారని.. ఇప్పుడు బుల్లెట్ రైలు పనులు వేగంగా జరుగుతున్నాయని బీజేపీ విమర్శించింది. గతంలో మహారాష్ట్రలో అధికారంలో ఉన్న ఉద్ధవ్ ఠాక్రే సర్కార్ బుల్లెట్ రైలు ప్రాజెక్టు ఆగిపోవడానికి అన్ని ప్రయత్నాలు చేసిందని బీజేపీ ఆరోపించింది. దేశాన్ని పురోగమించకుండా చేసి సీఎంగా ఉద్ధవ్ ఠాక్రే మిగిలిపోతారంటూ మండిపడింది.

నేను అధికారంలో ఉంటే 24 గంటల్లో రష్యా,ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపేవాడిని
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా- ఉక్రెయిన్ యుద్ధంపై కీలక వ్యాఖ్యలు చేశారు. తాను అధికారంలో ఉంటే రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలికే వాడిని అని ట్రంప్ వెల్లడించారు. నేను అధ్యక్షుడిగా ఉంటే మిలియన్ సంవత్సరాల్లో కూడా రష్యా, ఉక్రెయిన్ యుద్ధం జరిగేది కాదని అన్నారు. ఈ భయంకరమైన యుద్ధాన్ని కేవలం 24 గంటల్లో ముగించేందుకు చర్చలు జరపగలనని చెప్పారు. మరోవైపు ఉక్రెయిన్ కు అమెరికా చేస్తున్న సాయాన్ని తప్పు బట్టారు డొనాల్డ్ ట్రంప్. అమెరికా తయారీ అబ్రమ్స్ ట్యాంకులను ఉక్రెయిన్ కు పంపనున్నట్లు అధ్యక్షుడు జో బిడెన్ నిర్ణయం తీసుకోవడాన్ని తప్పుబట్టారు. ఇది రష్యాను రెచ్చగెట్టే చర్య అని సూచించారు. 2022 ఫిబ్రవరిలో ఉక్రెయిన్-రష్యాల మధ్య యుద్ధం ప్రారంభం అయింది. ఈ నెలతో 12 నెలలుగా యుద్ధం కొనసాగుతోంది. అయితే రష్యా చర్చలకు సిద్ధం అని చెబుతున్నప్పటికీ.. తాను ఆక్రమించిన ప్రాంతాల మెలికపెట్టకుంటేనే చర్చలు అని చెబుతోంది. ఇక ఉక్రెయిన్, రష్యాకు అధ్యక్షుడిగా పుతిన్ ఉన్నంత కాలం చర్చల ప్రసక్తే లేదని చెబుతోంది. ఇప్పటికే అమెరికా, ఉక్రెయిన్ దేశానికి భారీ ఎత్తున సైనిక, ఆర్థిక సాయం అందిస్తోంది. తాజాగా జర్మనీతో కలిసి 31 యుద్ధ ట్యాంకులను ఉక్రెయిన్ కు పంపిస్తామని యూఎస్ఏ తెలిపింది.

భారత్-ఆసీస్ చివరి టెస్టుకు మోడీ, ఆస్ట్రేలియా ప్రధాని!
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్-ఆస్ట్రేలియా మధ్య నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ జరగనుంది. ఫిబ్రవరి 9న నాగ్‌పూర్‌తో జరిగే తొలి టెస్టుతో ఈ సిరీస్ ప్రారంభంకానుంది. ఇందుకోసం ఇప్పటికే భారత గడ్డపై అడుగుపెట్టిన ఆసీస్‌ జట్టు.. బెంగళూరులో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ట్రైనింగ్‌ క్యాంప్‌లో ప్రాక్టీస్‌లో మునిగిపోయింది. అదే విధంగా రోహిత్‌ సారథ్యంలోని భారత జట్టు కూడా శుక్రవారం నుంచి తమ ప్రాక్టీస్‌ను ప్రారంభించింది. ఇకపోతే, ఈ సిరీస్‌లో ఆఖరి టెస్టు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరగనుంది. అయితే ఈ మ్యాచ్‌ను భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రత్యక్షంగా వీక్షించున్నట్లు తెలుస్తోంది. మోడీతో పాటు ఆస్ట్రేలియా దేశ ప్రధాని ఆంథోనీ అల్బనీస్ కూడా ఈ మ్యాచ్‌కు హాజరకానున్నట్లు సమాచారం. మార్చి 9 నుంచి అహ్మదాబాద్ టెస్టు ప్రారంభం కానుంది. ఫిబ్రవరి 9న తొలి టెస్ట్ నాగ్‌పూర్‌లో జరగనుండగా ఆస్ట్రేలియా మాత్రం నాలుగు రోజుల సన్నాహక క్యాంప్‌ను బెంగళూరులో ఏర్పాటు చేసుకుంది. దీనికి కారణం ఆ టీమ్ కోచ్ ఆండ్రూ మెక్‌డొనాల్డ్, స్పిన్ కన్సల్టెంట్ డానియల్ వెటోరీ. ఈ ఇద్దరికీ ఐపీఎల్ టీమ్ ఆర్సీబీతో మంచి సంబంధాలు ఉన్నాయి. దీంతో బెంగళూరు దగ్గరలోని ఆలూర్‌లో ఆస్ట్రేలియా ప్రత్యేకంగా తమకు కావాల్సినట్లుగా స్పిన్ పిచ్‌లను ఏర్పాటు చేయించుకొని మరీ ప్రాక్టీస్ చేస్తోంది. ఇండియన్ టీమ్ లోని అశ్విన్, జడేజా, కుల్దీప్, అక్షర్ లాంటి స్పిన్నర్లు.. షమీ, సిరాజ్‌లాంటి పేసర్లను ఎదుర్కోవడానికి తగిన పిచ్‌లపై ఆస్ట్రేలియా ప్రాక్టీస్ చేయాలని నిర్ణయించింది. వీటిలో కాస్త తక్కువ స్పిన్ అయ్యే పిచ్‌లు, బాగా టర్న్ అయ్యే పిచ్‌లు, వేరియబుల్ బౌన్స్ ఉండే పిచ్‌లు ఉన్నాయి. నాగ్‌పూర్, ఢిల్లీ, అహ్మదాబాద్‌లలో స్పిన్ పిచ్‌లే ఎదురవుతాయని ఆస్ట్రేలియా ఇలాంటి పిచ్‌లపై ప్రాక్టీస్ చేస్తోంది.

అందుకే ఒంటి చేత్తో బ్యాటింగ్ చేశా: హనుమ విహారి
టీమిండియా వెటరన్ బ్యాటర్, ఆంధ్ర కెప్టెన్ హనుమ విహారిపై ఫ్యాన్స్ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. రంజీ ట్రోఫీ 2023లో భాగంగా మధ్యప్రదేశ్‌తో జరుగుతున్న క్వార్టర్ ఫైనల్లో విహారి.. విరిగిన మణికట్టుతో బ్యాటింగ్ చేశాడు. రైట్ హ్యాండ్ బ్యాటర్ అయిన విహారి మణికట్టు విరగడంతో లెఫ్టాండ్ బ్యాటింగ్ చేశాడు. దాంతో అతని పోరాట పటిమను అందరూ మెచ్చుకుంటున్నారు. తాజాగా దీనిపై విహారి స్పందించాడు. జట్టులో గెలవాలనే కసిని పెంచడానికే తాను రిస్క్ చేసి బ్యాటింగ్ చేసినట్లు తెలిపాడు. “నా ఎడమ చేతి మణికట్టు విరిగింది. డాక్టర్లు బ్యాటింగ్ చేయవద్దని సూచించారు. మా టీమ్ ఫిజియో కూడా బ్యాటింగ్ చేయడం కుదరదని చెప్పాడు. కానీ వికెట్లు పడిపోతున్నప్పుడు, ఒంటి చేత్తో లెఫ్టాండ్ బ్యాటింగ్ ఎందుకు చేయకూడదు? అనే ఆలోచన వచ్చింది. 10-15 బంతులాడి.. మరో 10 పరుగులు చేసినా గొప్పవిషయమే అనిపించింది. అంతేకాకుండా విజయం కోసం పోరాడాలనే తన ఉద్దేశ్యం టీమ్‌కు అర్థమవుతుందనిపించింది. నేను వదిలేస్తే టీమ్‌లో నిరాశ నెలకొంటుంది. నేను పరుగులు చేయకున్నా.. తొలి బంతికే ఔటైనా.. గాయంతో బ్యాటింగ్‌కు సిద్దమయ్యాననే స్పూర్తి మా ఆటగాళ్లకు కలుగుతోంది. టీమ్ స్పిరిట్ పెంచేందుకు ఓ ఉదహారణగా నిలవాలనే ఈ రిస్క్ చేశాను. ఈ ఫస్ట్ ఇన్నింగ్స్‌తోనే మ్యాచ్ ఫలితం తేలుతుందని అనుకోవడం లేదు. ఇది ఐదు రోజుల గేమ్. ప్రతీ సెషన్ ముఖ్యమే” అని విహారి తెలిపాడు.

బండ్ల గణేష్ ఇన్ డైరెక్ట్ కౌంటర్లు.. ఎవరికో కొంచెం చెప్పండయ్యా
నటుడు, నిర్మాత బండ్ల గణేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నిత్యం ఏదో ఒక వివాదాన్ని నెత్తిమీద వేసుకొనే బండ్ల గణేష్ గత కొన్నిరోజుల నుంచి ట్విట్టర్ లో ఎవరికో ఏదో చెప్పాలని తాపత్రయపడుతున్నట్లు కనిపిస్తున్నాడు. కొన్ని సార్లు తల్లిదండ్రుల మీద ప్రేమ చూపించాలి అంటాడు.. ఇంకొన్నిసార్లు పవన్ దేవుడంటాడు.. ఒకసారి రాజకీయాలలో లేను అంటదు.. ఇంకోసారి రాజకీయాల గురించి మాట్లాడుతూ తన అబిప్రాయమంటాడు. అసలు బండ్లన్న ఎవరికి కౌంటర్ వేద్దామని ఇదంతా చేస్తున్నాడు. తాను బాధపడుతున్నట్లు ఎవరికి ప్రూవ్ చేయాలనుకుంటున్నాడు.. అనేది అభిమానులకే కాదు నెటిజన్లుకు కూడా అర్ధం కాకుండా ఉంది. ఇక తాజాగా బండ్లన్న వేసిన ట్వీట్ మాత్రం ఎవరికో గట్టిగా కౌంటర్ ఇచ్చినట్లే అనిపిస్తోందని అభిమానులు చెప్పుకొస్తున్నారు. “ఎలుక రాతిదైతే పూజిస్తాం.. ప్రాణాలతో ఉంటే తరిమేస్తాం. పాము రాతిదైతే పాలు పోస్తాం.. ప్రాణాలతో ఉంటే కొట్టి చంపేస్తాం. తల్లిదండ్రుల ఫోటోకు దండేసి దండం పెడతాం. ప్రాణాలతో ఉన్నప్పుడు పట్టించుకోము, చనిపోయిన వారికి భుజాలు అందిస్తాం. బ్రతికున్నప్పుడు గేటు దగ్గరకు వస్తె అపాయింట్ మెంట్ కుడా ఇవ్వం. రాయిలో దైవత్వం ఉందనీ తెలుసుకున్నాం.. మనిషిలో మానవత్వం ఉందనీ గుర్తించలేక పోతున్నాం.. జీవంలేని వాటిపై ఉన్న ప్రేమ, భక్తీ.. ప్రాణాలతో ఉన్నప్పుడు ఎందుకు ఉండదో? ఒకసారి ఆలోచించుకోండి..” అంటూ రాసుకొచ్చాడు. అసలు బండ్లన్న ఇప్పుడెందుకు ఈ వేదాంతం చెప్పడం మొదలుపెట్టాడో అర్ధం కావడం లేదని అభిమానులు చెప్పుకొస్తున్నారు. ఇంకొందరు ఒక అగ్ర హీరోను ఉద్దేశించే ఈ మాటలు చెప్పుకొచ్చాడు.. ముఖ్యంగా చనిపోయిన వారికి భుజాలు అందిస్తాం. బ్రతికున్నప్పుడు గేటు దగ్గరకు వస్తె అపాయింట్ మెంట్ కుడా ఇవ్వం అనేది ఆ హీరో కు కౌంటరే అంటూ మాట్లాడుకుంటున్నారు. మరి ఆ హీరో ఎవరో కొంచెం చెప్పండయ్యా అంటూ మిగతావారు అభ్యర్థిస్తున్నారు. ఇంకొందరు ఎందుకు బండ్లన్న నీకు ఇవన్నీ సైలెంట్ గా ఉండక అంటూ సలహాలు ఇస్తున్నారు.