NTV Telugu Site icon

Top Headlines @ 5 PM: టాప్‌ న్యూస్‌

Top Headlines @ 5 Pm

Top Headlines @ 5 Pm

ఎమ్మెల్సీ ఎన్నికలకు.. వైసీపీ అభ్యర్థులు వీరే
ఆంధ్రప్రదేశ్‌లో ఎమ్మెల్సీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోన్న నేపథ్యంలో.. అధికార వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ తన అభ్యర్థులను ప్రకటించింది.. అభ్యర్థుల ఎంపికపై సుదీర్ఘ కసరత్తు చేశారు వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి.. సామాజిక సమీకరణకు అధిక ప్రాధాన్యం ఇచ్చినట్టు స్పష్టంగా కనిపిస్తోంది.. మరోపారి బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు ప్రాధాన్యత ఇచ్చారు సీఎం జగన్‌.. మొత్తంగా.. ఏపీలో స్థానిక, ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులు, గవర్నర్‌ కోటాలో అభ్యర్థుల పేర్లను ప్రకటిచింది వైసీపీ..18 ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థుల పేర్లను వైసీపీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి ఇవాళ ప్రకటించారు.. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థులు.. నత్తు రామారావు- శ్రీకాకుళం, లోకల్‌ కోటా (బీసీ, యాదవ), కుడుపూడి సూర్యనారాయణ- తూర్పు గోదావరి, లోకల్‌ కోటా (బీసీ-శెట్టి బలిజ), వంకా రవీంద్రనాథ్‌ – పశ్చిమ గోదావరి,‍ లోకల్‌ ​కోటా (పారిశ్రామికవేత్త), కవురు శ్రీనివాస్‌ – ప.గోదావరి, లోకల్‌ కోటా( బీసీ-శెట్టి బలిజ), మేరుగ మురళి – నెల్లూరు, లోకల్‌ కోటా (ఎస్సీ-మాల), డాక్టర్‌ సిపాయి సుబ్రహ్మణ్యం-చిత్తూరు, లోకల్‌ కోటా, రామసుబ్బారెడ్డి – కడప, లోకల్‌ కోటా (ఓసీ-రెడ్డి), డాక్టర్‌ మధుసూదన్‌ – కర్నూలు, లోకల్‌ కోటా (బీసీ-బోయ), ఎస్‌. మంగమ్మ- అనంతపురం, లోకల్‌ కోటా( బీసీ-బోయ).. మరోవైపు.. ఎమ్మెల్యే కోటా అభ్యర్థుల విషానికి వెళ్తే.. పెనుమత్స సూర్యనారాయణ- విజయనగరం, ఎమ్మెల్యే కోటా( క్షత్రియ సామాజిక వర్గం) , పోతుల సునీత- ప్రకాశం, ఎమ్మెల్యే కోటా (బీసీ- పద్మశాలి) , కోలా గురువులు-విశాఖ, ఎమ్మెల్యే కోటా (ఫిషరీస్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌), బొమ్మి ఇ‍జ్రాయిల్‌.. తూర్పు గోదావరి, ఎమ్మెల్యే కోటా ( ఎస్సీ-మాదిగ), జయమంగళ వెంకటరమణ- ప. గోదావరి, లోకల్‌ కోటా (వడ్డీల సామాజిక వర్గం), ఏసు రత్నం- గుంటూరు, ఎమ్మెల్యే కోటా ( బీసీ-వడ్డెర), మర్రి రాజశేఖర్‌- గుంటూరు, ఎమ్మెల్యే కోటా ( కమ్మ), ఇక, గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల విషయానికి వస్తే.. కుంభా రవి- అల్లూరి జిల్లా, (ఎస్టీ), కర్రి పద్మశ్రీ- కాకినాడ, (బీసీ)గా నిర్ణయించింది వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధిష్టానం.

స్మార్ట్ విద్యుత్ మీటర్లుతో ఎన్నో ఉపయోగాలు.. ఆందోళన వద్దు..
స్మార్ట్ విద్యుత్ మీటర్లుతో చాలా ఉపయోగాలు ఉన్నాయని.. అనవసరమైన ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు ఆంధ్రప్రదేశ్‌ విద్యుత్ నియంత్రణ మండలి చైర్మన్ జస్టిస్ సీ.వీ.నాగార్జున రెడ్డి.. తిరుపతి ఏపీఎస్పీడీసీఎల్ కార్యాలయంలో 18వ రాష్ట్రస్థాయి సలహా కమిటీ సమావేశం జరిగింది.. ఆ సమావేశంలో పాల్గొన్న ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వ్యవసాయ విద్యుత్ మీటర్లతో డబ్బులు వసూలు చేస్తామనే ప్రచారం అపోహ మాత్రమేనని కొట్టిపారేశారు.. ఉచిత విద్యుత్ మీటర్ల విషయంలో రైతులకు ఎలాంటి ఆందోళన అవసరంలేదన్నారు.. 30 ఏళ్లకు సరిపడా ఉచిత విద్యుత్ అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు.. ఉచిత విద్యుత్ అందించేందుకు సిక్కిం నుండి 7వేల మెగా వాట్ల సోలార్ పవర్ ను ప్రభుత్వం కొనుగోలు చేసిందని.. ప్రతి యూనిట్ కు అకౌంటబిలిటీ కోసమే విద్యుత్ మీటర్లు ఏర్పాటు చేస్తున్నామని ప్రభుత్వం స్పష్టంగా ఉంది గుర్తుచేశారు.. అసలు, స్మార్ట్ విద్యుత్ మీటర్లతో చాలా ఉపయోగాలు ఉన్నాయని తెలిపారు.. 200 యూనిట్లకు పైగా వినియోగించే వారికి త్వరలో ప్రీపెయిడ్ మీటర్లు అందుబాటులో ఉంచుతామని వెల్లడించారు ఆంధ్రప్రదేశ్‌ విద్యుత్ నియంత్రణ మండలి చైర్మన్ జస్టిస్ సీ.వీ.నాగార్జున రెడ్డి.

అమర రాజా బ్యాటరీస్ కాలుష్యం.. స్టే ఎత్తివేసిన సుప్రీంకోర్టు..
అమర రాజా బ్యాటరీస్ కాలుష్యం వ్యవహారంలో విచారణ చేపట్టిన అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు.. ఈ రోజు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్‌ కాలుష్య నియంత్రణ మండలి షోకాజ్ నోటీసులపై గతంలో ఇచ్చిన స్టే ఎత్తివేసింది సుప్రీంకోర్టు.. అమర రాజా బ్యాటరీస్ తీవ్ర కాలుష్యం వెదజల్లుతోందని.. పరిసర ప్రాంతాల జలాల్లో లెడ్ కంటెంట్ పెరిగిందని గతంలో నోటీసులు ఇచ్చింది ఏపీ కాలుష్య నియంత్రణ మండలి.. 34 సార్లు నోటీసులు ఇచ్చి రాజకీయ కారణాలతో తమను వేధిస్తున్నారని అమర్ రాజా తరఫున వాదించారు సీనియర్ న్యాయవాది ముకుల్ రోహిత్గి.. అయితే, రాజకీయ కారణాలు ఏవైనప్పటికీ చట్టప్రకారం ముందుకు పోవాల్సిందేనని స్పష్టం చేసింది సుప్రీంకోర్టు.. షోకాజ్ నోటీస్ పై చట్ట ప్రకారం పబ్లిక్ హియరింగ్ నిర్వహించి.. చట్ట ప్రకారం నిర్ణయం తీసుకోవాలని పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు (సీసీబీ)కి ఆదేశాలు జారీ చేసింది సుప్రీంకోర్టు.. అయితే, పీసీబీఐ ఆదేశాలపై అభ్యంతరాలు ఉంటే హైకోర్టు వెళ్లాలని సుప్రీంకోర్టు సూచించింది.

పోలీసులు కేసీఆర్ మోచేతుల నీళ్లు తాగుతుండ్రు
పోలీసు వ్యవస్థ దిగజారిపోయిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ మండిపడ్డారు. బీఆర్ఎస్– బీజేపీ ఘర్షణనలో జైలుకు వెళ్లి వచ్చిన బీజేపీ కార్యకర్తలను సోమవారం బండి సంజయ్‌ సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోలీసులకు కొట్టే అధికారం ఎవరిచ్చారని ప్రశ్నించారు. గూండాలకు గన్ లైసెన్సు ఇస్తారా? అని నిలదీశారు బండి సంజయ్‌. ఈటల కాన్వాయ్‌పై రాళ్లతో దాడి చేసింది బీఆర్ఎస్ కార్యకర్తలైతే తమ కార్యకర్తలపై కేసులు పెట్టారని ధ్వజమెత్తారు బండి సంజయ్‌. పోలీసు వ్యవస్థ దిగజారిపోయిందని, పోలీసులు కేసీఆర్ మోచేతుల నీళ్లు తాగుతుండ్రని బండి సంజయ్‌ ఆరోపించారు. ఈనెల 5న బీఆర్ఎస్ గూండాలు తమ కార్యకర్తలపై దాడి చేశారని ఆరోపించారు బండి సంజయ్‌. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో మూర్ఖత్వపు బీఆర్ఎస్ ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఈటల విజయం సాధించారని బండి సంజయ్‌ గుర్తు చేశారు. ఇప్పటికీ ఈప్రాంతంలో ఈటలకు ప్రోటోకాల్ పాటించడం లేదన్నారు బండి సంజయ్‌.

రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి పోలీస్ స్టేషన్‌లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి
రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి పోలీస్ స్టేషన్ లో సీసీ కెమెరా లు ఏర్పాటు చేయాలన్నారు కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి. సోమవారం జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్‌లో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే హై కోర్టు అనుమతి ఉన్న షర్మిల పాదయాత్రను అడ్డుకోవడంలో పోలీసుల అతి చర్యను తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు. అంతేకాకుండా.. మెదక్ ఖదీర్ ఖాన్ కేసులో థర్డ్ డిగ్రీ ప్రయోగించడం మానవ హక్కుల ఉల్లంఘనే అని ఆయన మండిపడ్డారు. పోలీసుల సస్పెండ్ అనేది ఖదీర్ మృతికి ఒక ఆధారమని, తక్షణమే సిట్టింగ్ జడ్జితో హై కోర్టులో విచారణ చేపట్టాలని ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు. మృతుని కుటుంబానికి ప్రభుత్వం 50 లక్షల ఆర్థిక సాయం అందించాలని, పోలీసులు సమాజానికి జవాబు దారులని ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి వ్యాఖ్యానించారు. జగిత్యాల నర్సింగాపూర్‌లో ఆత్మహత్య చేసుకున్న రైతు విషయంలో పోలీస్ డిపార్ట్ మెంట్ ఎందుకు నిర్లక్యం చేస్తోందని ఆయన ప్రశ్నించారు. నిందితుడు న్యాయవాది వృత్తిలో ఉన్నాడు సభ్య సమాజం దీనిని తీవ్రంగా పరిగణిస్తుందన్నారు. ఇప్పటి వరకు నిందుతున్ని అదుపులోకి తీసుకోలేదని ఆయన ఆరోపించారు. చట్టపరంగా విచారణ లేదని, పోలీసులు సమాజంలో నిక్షప్త పాతంగా వ్యవహరించాలని ఆయన కోరారు. పోలీసులు నిందితున్ని చుట్టంలా చూస్తున్నారని ఆయన మండిపడ్డారు.

అరుదైన ‘ఒంటి కన్ను నాగుపాము’..
కర్ణాటకలో అరుదైన ఒంటి కన్ను నాగుపాము తారపడింది. కార్వార్ తాలూకాలోని కద్రాలో అత్యంత అరుదైన ఒంటికన్ను (ఒక్క కన్ను) నాగుపాము కనిపించింది. దీంతో అధికారులు దాన్ని సురక్షితంగా అడవిలోకి విడిచిపెట్టారు. కార్వార్ తాలూకా మల్లాపూర్‌లోని లక్ష్మీనగర్‌లోని ఆకాషా ఎన్‌.చౌగ్లే ఇంటి సమీపంలో 4.5 అడుగుల పొడవున్న నాగు పాము కనిపించింది. దీంతో స్థానికులు కద్రా అటవీ డివిజన్‌ ​​ఫారెస్ట్‌ వాచర్‌ బిలాల్‌ షేక్‌కు ఫోన్‌ చేశారు. వెంటనే సంఘటనా స్థలానికి వెళ్లి మండల అటవీ అధికారి లోకేష్ పటానాకర్ ఆధ్వర్యంలో నాగు పామును సురక్షితంగా రక్షించి అటవీ ప్రాంతంలో వదిలేశారు. చౌగ్లే ఇంటి దగ్గర రక్షించిన నాగుపాము ఒక కన్ను కోల్పోయింది. సాధారణంగా ఇలాంటి ఒంటికన్ను నాగుపాము కనిపించడం చాలా అరుదు. ఈ నాగుపాముకు కంటిగుడ్డు మాత్రమే ఉంటుంది. కొన్ని సందర్భాల్లో, ముంగిసతో పోట్లాడినప్పుడు పాములు ఒక కన్ను కోల్పోవచ్చు. కొన్ని సందర్భాల్లో ఎలుకలు కుట్టడం వల్ల కూడా ఇలా జరుగుతుందని జీవవైవిధ్య పరిశోధకుడు మోజునాథ్ ఎస్ .నాయక్ చెబుతున్నారు. ఒక కంటి చూపు కోల్పోవడం పాముల జీవితాన్ని ఏమాత్రం ప్రభావితం చేయదు.

డీజే పెడతావా.. నీ పెళ్లి, నేను చేయను పో
పెళ్లి వేడుకను పండుగలా చేసుకోవాలని చాలా మంది కలలు కంటారు. జీవితకాలం గుర్తుండి పోయేలా ఉండాలని ప్లాన్ చేసుకుంటారు. ఎవరికున్న తాహత్తులో వారి విహహాన్ని అట్టహాసంగా జరుపుకుంటారు. ఈ క్రమంలోనే పెళ్లికి వచ్చిన అతిథుల దగ్గరనుంచి..వేడుక ముగిసి ఊరేగింపు వరకు ఫర్ ఫెక్ట్ గా జరగాలని కోరుకుంటారు. ఈ క్రమంలోనే ప్రతి పెళ్లి ఊరేగింపులోనూ నేడు డీజే, డ్యాన్స్ కామన్ అయిపోయింది. ఈ తతంగంపై కొందరు సంప్రదాయవాదులు మండిపడుతున్నారు. సంప్రదాయబద్ధంగా జరగాల్సిన వివాహాల్ని ట్రెండ్ పేరుతో చెడగొడుతున్నారని కొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి వాటిని నియంత్రించాలని కొంతమంది కోరుతున్నారు. ఈ క్రమంలోనే మధ్య ప్రదేశ్ రాష్ట్రంలో ఓ పెళ్లి వేడుకలో ఓ మత గురువు పెళ్లికి డీజే పెట్టినందుకు పెళ్లిని జరిపించనని అసహనం వ్యక్తం చేస్తూ లేచి వెళ్లిపోయాడు. అంతే కాకుండా డీజే ఏర్పాటు చేసిన వరుడి కుటుంబ సభ్యులపై కోపడ్డాడు. ఈ ఘటన ఇటీవల మధ్యప్రదేశ్‌లోని చతార్‌పూర్‌లో జరిగింది. అక్కడి ఒక ముస్లిం కుటుంబానికి సంబంధించిన పెళ్లి వేడుక జరిపించేందుకు మత గురువు హాజరయ్యాడు. ఒక పక్క పెళ్లి జరుగుతుంటే, మరో పక్క డీజే, డ్యాన్స్‌లు కూడా వరుడి కుటుంబ సభ్యులు నిర్వహించారు. దీనిపై మత గురువు అసహనం వ్యక్తం చేశారు. ‘‘మన సమాజంలో ఇలాంటి అనవసరమైన వాటిపై నిషేధం ఉంది. ముఖ్యంగా పెళ్లి వేడుకల్లో డీజేలు పెట్టడం, డ్యాన్సులు చేయడం సరికాదు. ఈ సమాజంలో అందరూ సమానమే. ముస్లిం సమాజంలో డ్యాన్స్‌లు చేయడం, డీజేలు పెట్టడం నిషేధం. ముస్లిం సమాజానికి చెందిన చాలా మందితో చర్చించి గతంలోనే ఈ నిర్ణయం తీసుకున్నాం. ఇలాంటివి సరికాదు’’ అని ఆయన వ్యాఖ్యానించారు. మత పెద్ద వ్యాఖ్యల నేపథ్యంలో పెళ్లి కొడుకు కుటుంబ సభ్యులు మత పెద్దకు క్షమాపణలు చెప్పారు. డీజే, డాన్స్‌లు ఆపేయించారు. దీంతో మత పెద్ద తిరిగి తన పెళ్లి తంతు నిర్వహించాడు.

శింబుతో లవ్ అఫైర్.. పెళ్లి తరువాత నోరు విప్పిన దేశముదురు బ్యూటీ
దేశముదురు సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన బబ్లీ బ్యూటీ హన్సిక ఈ మధ్యనే సోహైల్ ను పెళ్ళాడి వైవాహిక బంధంలోకి అడుగుపెట్టింది. తన స్నేహితురాలి భర్తనే ఏరికోరి వివాహం చేసుకున్న ఈ ముద్దుగుమ్మ వారి విడాకులకు తాను కారణం కాదని చెప్పి విమర్శలకు చెక్ పెట్టింది. తన పెళ్లి విషయాలను పంచుకుంటూ హన్సిక లవ్ షాదీ డ్రామా పేరుతో ఒక సిరీస్ నే నడిపించేస్తోంది. ఇందులో తన ఇష్టాలు, అపోహలు, కెరీర్ లో ఎదుర్కున్న అనుమానాలు, అవమానాలు అన్నింటిని పూసగుచ్చినట్లు చెప్పుకొచ్చింది. వయస్సు పెరగడానికి ఇంజక్షన్స్ తీసుకోలేదని బల్లగుద్ది చెప్పిన హన్సిక మొట్ట మొదటిసారి తన మొదటి లవ్ స్టోరీ గురించి బ్రేకప్ గురించి నోరు విప్పింది. కోలీవుడ్ స్టార్ హీరో శింబుతో హన్సిక ప్రేమాయణం గురించి ప్రత్యేకంగా ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. వీరి ఘాటైన ప్రేమ ఫొటోలతో సహా బయటపడింది. ఇక కొన్ని కారణాల వలన ఈ జంట విడిపోయారు. బ్రేకప్ తరువాత హన్సిక, శింబుతో కలిసి నటించింది కానీ, ఏనాడు వారి బ్రేకప్ గురించి నోరు విప్పింది లేదు. ఇక తాజాగా ఈఇంటర్వ్యూలో శింబుతో బ్రేకప్ గురించి మాట్లాడింది. “నేను ప్రేమను నమ్ముతాను.. కానీ ఒక శృంగార పురుషుడిని అయితే కాదు. ఒకసారి బ్రేకప్ అయ్యాకా.. మరొక వ్యక్తిని నమ్మడానికి నాకు ఎనిమిదేళ్లు పట్టింది. నేను అంత ఈజీగా ఎవరితోనూ ఎమోషన్స్ పంచుకోను. నా గత ప్రేమ్ జీవితం ఎంతో విచిత్రంగా నడిచింది. దాని నుంచి బయటపడడానికి నాకు ఎనిమిదేళ్లు పట్టింది. నాకు నచ్చిన వ్యక్తిని, నాతో కలకాలం ఉండే వ్యక్తితో ఆ ఎమోషన్స్ పంచుకొని జీవించడానికి ఆ టైమ్ తీసుకున్నా మంచి నిర్ణయమే తీసుకున్నాను అని అనుకుంటున్నాను.నా పాట రిలేషన్స్ గురించి ఇంతకన్నా ఎక్కువ మాట్లాడను. అదంతా ముగిసిపోయిన జీవితం” అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.

అశ్రునయనాల మధ్య తారకరత్న అంత్యక్రియలు పూర్తి
నందమూరి తారకరత్న అంత్యక్రియలు ముగిశాయి. ఫిల్మ్‌ ఛాంబర్‌ నుంచి మహాప్రస్థానం వరకు తారకరత్న అంతిమయాత్ర జరిగింది. జూబ్లీహిల్స్‌ మహాప్రస్థానంలో తారకరత్న పార్థివ దేహానికి సినీ, రాజకీయ ప్రముఖులు నివాళులు అర్పించారు. అనంతరం మహా ప్రస్థానంలో ఆయన పార్థివదేహానికి ఆయన తండ్రి మోహన్ కృష్ణ తలకొరివి పెట్టారు. తారకరత్నకు ఒక కుమారుడు.. అతని వయస్సు మూడేళ్లు. కుమారుడు చిన్నవాడు కావడంతో తారకరత్న అంత్యక్రియలు ఆయన తండ్రినే నిర్వహించారు. నందమూరి అభిమానులు, నందమూరి కుటుంబంతో పాటు పలువురు ప్రముఖులు సైతం ఈ అంత్యక్రియల్లో పాల్గొన్నారు. 25 రోజుల క్రితం నారా లోకేష్ పాదయాత్రలో గుండెపోటుతో కుప్పకూలిపోయాడు తారకరత్న. అలా హాస్పిటల్ లోపలి వెళ్లిన ఆయన మళ్లీ తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయాడు. దాదాపు 23 రోజులు మృత్యువుతో పోరాడి ఓడిపోయాడు. తారకరత్న కోలుకొని బయటికి రావాలని అభిమానులు దేవుడ్ని ప్రార్దించిన విషయం తెల్సిందే. అయినా దేవుడు వారి ప్రార్థనలను వినలేదు.. అతి చిన్న వయస్సులోనే తారకరత్నను మృత్యువు కబళించింది. ఇక తారకరత్నకు గుండెపోటు వచ్చిన దగ్గరనుంచి.. అంత్యక్రియలు నిర్వహించేవరకు అన్ని తానే అయ్యి చూసుకుంటున్నాడు బాలకృష్ణ. తన అన్న మోహన్ కృష్ణ పక్కనే ఉండి.. తారకరత్నకు అంత్యక్రియలు నిర్వహించారు.