అన్నయ్య షో కి డుమ్మా బాలయ్య షో కి జమ్మ.. పవన్ పై అంబటి సెటైర్లు
ఏపీ రాజకీయాలు రోజురోజుకు రసవత్తరంగా సాగుతున్నాయి. ముఖ్యంగా వైసీపీ, జనసేన మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. పవన్ ఏది చేసినా వైసీపీ నేత అంబటి రాంబాబు సెటైర్లు వేయడం.. ఆ సెటైర్లకు పవన్ కౌంటర్లు వేయడం నిరంతరాయంగా కొనసాగుతూనే ఉంది. ఇక తాజాగా మరోసారి పవన్ పై అంబటి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. పవన్ రాజకీయ నాయుకుడిగా ఎంత శ్రమిస్తున్నాడో నటుడిగా కూడా తనవంతు కృషి చేస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే మొదటిసారి నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ షోకు గెస్ట్ గా వెళ్లారు. నేడు అన్నపూర్ణ స్టూడియోస్ లో ఈ ఎపిసోడ్ షూట్ మొదలయ్యింది. పవన్ ఫ్యాన్స్ హంగామా మధ్య పవన్ ను బాలయ్య ఆలింగనం చేసుకొని లోపలి తీసుకెళ్లారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇక ఈ షో కు పవన్ వెళ్లడంపై అంబటి ట్విట్టర్ వేదికగా సెటైర్లు వేశారు. “అన్నయ్య షో కి డుమ్మా.. బాలయ్య షో కి జమ్మ. రక్తసంబంధం కన్నా.. ప్యాకేజీ బంధమే గొప్పదా ?”అంటూ రాసుకొచ్చారు. పవన్ ఇప్పటివరకు ఏ షోకు వెళ్ళింది లేదు.. చివరకు చిరంజీవి హోస్ట్ గా వ్యవహరించిన మీ ఎవరు కోటీశ్వరుడుకు కూడా పవన్ రాలేదు. ఇక చిరు ప్రీ రిలీజ్ ఈవెంట్ లకు కూడా ఈ మధ్య పవన్ హాజరు కావడం లేదు. కానీ, ఇప్పుడు మాత్రం బాలయ్య పిలవగానే వచ్చాడు అని అంబటి చెప్పుకొచ్చారు. అయితే పవన్ ఫ్యాన్స్ మాత్రం అంబటిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అల్లు అరవింద్ ఒప్పించడం వలనే పవన్ వచ్చారని, త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా పక్కనే ఉండడంతో ఇది కేవలం సినిమాకు సంబంధించిందే తప్ప రాజకీయాలకు సంబంధించింది కాదని చెప్పుకొస్తున్నారు.
టీఎస్‌ఆర్టీసీ 2022 రౌండప్..
టీఎస్ ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ 2022 ఆర్టీసీ రౌండప్ వెల్లడించారు. కార్పొరేషన్ లో 11 రీజియన్‌లలో 99 డిపోలు, 364 ఆర్టీసి బస్ స్టాండ్స్ ఉన్నాయని, రోజు 31 లక్షల 82 వేల కిలోమీటర్ల మేర బస్సులు రాష్ట్ర వ్యాప్తంగా నడుస్తున్నాయన్నారు. 45 లక్షల మంది ప్రయాణికులు ఆర్టీసినీ ఆదరిస్తున్నారని, 44వేల 448 మంది ఉద్యోగులు ఆర్టీసీలో పనిచేస్తున్నారని ఆయన వివరించారు. దాని ద్వారా కొంత నష్టాలు తగ్గుముఖం పట్టాయని, ప్రస్తుతం ఆర్టీసి నష్టం ఈ ఏడాది జనవరి 2022 నుండి డిసెంబర్ 2022 వరకు 650 కోట్లు ఉందని ఆయన వెల్లడించారు. 30 మంది కలిసి ఒక బస్సు బుక్ చేసుకునే సదుపాయం కలిపించామని ఆయన తెలిపారు. 1000 స్పెషల్ తిరుమల దర్శనం ఎంట్రీస్ చేశామని, తిరుమల దర్శనం కోసం డిసెంబర్ వరకు 24,672 టికెట్ల బుకింగ్ చేశారన్నారు. సంక్రాంతి, దసరా ప్రత్యేక బస్సులు ఏర్పాటు తో ప్రయాణికుల పండగ కష్టాలు తప్పాయని, పాత బస్సులు తీసివేసి 760 బస్సులు కొత్తవి ఏర్పాటు చేశామన్నారు. మొన్న 50 బస్సులు ప్రారంభించామని, 3,360 ఎలక్ట్రిక్ బస్సులు కూడా ప్రపోజల్ పెట్టామని ఆయన వివరించారు. రాబోయే రోజుల్లో ఇవి అందుబాటులో ఉంటాయని, యూపీఐ, క్యూర్ కోడ్ చెల్లింపులు కూడా అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. బస్సుల లోకేషన్ టైమింగ్ కోసం ప్రత్యేక సదుపాయం కూడా తీసుకొచ్చామని, పార్సిల్ ఆర్టీసి కార్గో ద్వారా పంపిస్తే ఒక్కరోజు లోనే కస్టమర్ లకు చేరుతున్నాయన్నారు. ఆర్టీసి బస్ స్టాండ్స్ లో 3 సీటర్స్ చైర్స్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. అనంతరం ఆర్టీసీ ఎండీ సజ్జనార్ మాట్లాడుతూ.. 2020లో ఆర్టీసి పరిస్థితి దారుణంగా ఉందని, కోవిడ్‌తో పాటు, సమ్మె ప్రభావంతో కొంత ఇబ్బందుల్లోకి ఆర్టీసి వెళ్ళిందన్నారు. ప్రయాణికులు ఎక్కితేనే ఆర్టీసికి ఆదాయమని, కానీ కరోనా తో సుమారు 2000 కోట్ల నష్టం వచ్చిందని ఆయన వెల్లడించారు. గత ఏడాది నుండి ఇప్పటి వరకు 16 శాతం మేర కిలోమీటర్ల బస్సులు తిరిగాయి (గ్రోత్) అన్నారు.
నాసల్ వ్యాక్సిన్ ధర ప్రకటించిన భారత్ బయోటెక్
ప్రముఖ సంస్థ భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కరోనా నాసల్ వ్యాక్సిన్ ధరను నిర్ణయించింది. ప్రైవేట్ ఆస్పత్రిలో ఒక డోస్ ధర రూ.800గా నిర్ణయించింది. ప్రభుత్వ ఆస్పత్రిలో నాసల్ వ్యాక్సిన్ ధర రూ.325గా నిర్ణయించినట్లు తెలుస్తోంది. రెండు రోజుల క్రితమే భారత్ బయోటెక్ నాసల్ టీకాను కేంద్రం ఆమోదించింది. దీనిని కొవిన్ యాప్‌లో చేర్చారు. కొవిన్ యాప్ ద్వారా వ్యాక్సినేషన్ కేంద్రంలో స్లాట్ బుక్ చేసుకోవచ్చు. భారత్ బయోటెక్ నాసల్ టీకాను ప్రభుత్వ రంగంలో ఉచితంగా ఇచ్చే విషయంపై స్పష్టత లేదు. ఈ నాసల్ టీకాను 18 ఏళ్లు నిండిన వారు బూస్టర్ డోస్‌గా, అత్యవసర పరిస్థితుల్లో తీసుకునేందుకు డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా ఆమోదం తెలిపింది. ఈ టీకా వైరస్‌లు మన శరీరంలోకి ప్రవేశించే మార్గంలోనే అడ్డుకునేలా ఇది చేస్తుంది. దీనిని ప్రికాషనరీ డోస్‌గా ఆమోదించారని జాతీయ సాంకేతిక సలహా మండలి ఛైర్మన్ ఎన్కే అరోరా వెల్లడించారు.
బంగ్లా అంతర్గత వ్యవహారాల్లో అమెరికా జోక్యం.. రాయబారి పర్యటనపై రష్యా మండిపాటు
బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్‌పీ) నాయకుడి కుటుంబాన్ని కలవడానికి అమెరికా రాయబారి షాహీన్‌బాగ్‌ను సందర్శించడం బంగ్లాదేశ్ అంతర్గత వ్యవహారాలలో జోక్యం చేసుకునే ప్రయత్నమని రష్యా పేర్కొంది. బంగ్లాదేశ్‌లోని రష్యా రాయబార కార్యాలయం ప్రకటనను విడుదల చేసింది. అమెరికా రాయబారి దేశీయ అంతర్గత వ్యవహారాలను ప్రభావితం చేసేందుకు పట్టుదలతో ప్రయత్నిస్తున్నారని రష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి మరియా జఖారోవా విలేఖరుల సమావేశంలో తెలిపారు. అమెరికా రాయబారి బంగ్లా హక్కుల గురించి పట్టించుకునే సాకుతో అక్కడ దాక్కున్నారని జఖారోవా వెల్లడించారు. గతంలో డిసెంబర్ 14న అమెరికా రాయబారి పీటర్ హాస్ సుమారు దశాబ్దం క్రితం అదృశ్యమైన బీఎన్‌పీ నాయకుడు సజేదుల్ ఇస్లాం నివాసాన్ని సందర్శించారు. ఆయన నివాసం నుంచి బయటకు రాగానే కొందరు వ్యక్తులు దాడి చేసేందుకు ప్రయత్నించారు. ఆయన తన భద్రతా సిబ్బంది సాయంతో అక్కడి నుంచి సురక్షితంగా బయటపడగలిగారు. అనంతరం అమెరికా రాయబార్ పీటర్ బంగ్లాదేశ్ విదేశాంగ మంత్రి ఏకే అబ్దుల్ మోమెన్‌తో అత్యవసర సమావేశం నిర్వహించి తన పర్యటన వివరాలు ఎలా లీక్ అయ్యాయని ప్రశ్నించారు.
జనవరిలో బ్యాంకు సెలవుల వివరాలు..
2022 ఏడాదికి బైబై చెప్పే సమయం వచ్చేసింది.. ఈ వారం ముగింపులోనే కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాం.. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం, వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు.. 2023లోని సెలవులకు సంబంధించిన తేదీల వివరాలు ప్రకటించాయి.. మరోవైపు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కూడా 2023 జనవరిలో బ్యాంకు సెలవులకు సంబంధించిన క్యాలండర్‌ను విడుదల చేసింది. నిత్యం బ్యాంకుల చుట్టూ తిరిగేవారు.. బ్యాంకు లావాదేవీల్లో ఉండేవారు అప్రమత్తం కావాల్సిన సమయం వచ్చేసింది.. ఈ క్యాలండర్ ఆధారంగా మీ పనులను సిద్ధం చేసుకుంటే మంచిది.. 2022 ముగింపుకు వస్తున్నందున 2023లో కొత్త సంవత్సరం ఎదురుచూస్తుంది. జనవరి 2023 నెలలో, బ్యాంకులు ఎప్పుడు మూసివేయబడతాయో తెలుసుకోవడం కస్టమర్‌లకు ముఖ్యం, తద్వారా వారు తమ బ్యాంకింగ్ కార్యకలాపాలను ప్లాన్ చేసుకోవచ్చు. జనవరి 2023లో అనేక ప్రాంతీయ పండుగలు, జాతీయ కార్యక్రమాలు, అలాగే రాష్ట్ర మరియు సమాఖ్య ప్రభుత్వ సెలవులు షెడ్యూల్ చేయబడ్డాయి. ఈ రోజుల్లో ఏ బ్యాంకులలోనూ (పబ్లిక్ లేదా ప్రైవేట్) ఆఫ్‌లైన్ ఆర్థిక లావాదేవీలు అనుమతించబడవు. ఫలితంగా, మీ బ్యాంకింగ్ కార్యకలాపాలను ప్లాన్ చేసేటప్పుడు మీరు ఈ రోజులను పరిగణనలోకి తీసుకోవాలి.. 2023 జనవరిలో మొత్తం 11 రోజుల పాటు బ్యాంకు సెలవుల్ని ప్రకటించింది ఆర్బీఐ.. సెలవు దినాల్లో బ్యాంకుల్లో అత్యవసర పనులుంటే వాటిని వెంటనే పూర్తి చేయాలని, లేదంటే మరో రోజుకు వాయిదా వేసుకోవాలని సూచించింది.. ఈ 11 సెలవుల్లో ఆదివారాలు, రెండో శనివారం, నాల్గో శనివారంతో పాటు ఆయా రాష్ట్రాల్లో పండగలకు అనుగుణంగా బ్యాంకులు పనిచేయనున్నాయి.. జనవరి 1న ఆదివారం, జనవరి 8న ఆదివారం, జనవరి 14న రెండో శనివారం, జనవరి 15న ఆదివారం, జనవరి 22న ఆదివారం, జనవరి 26న గణతంత్ర దినోత్సవం, జనవరి 28న నాల్గో శనివారం, జనవరి 29న ఆదివారం సెలవులుగా ఉన్నాయి.
గృహ విక్రయాల్లో కొత్త రికార్డు..
భారతదేశంలోని టాప్ 7 నగరాలు 2022లో దాదాపు 3.65 లక్షల యూనిట్ల గృహ విక్రయాలను నమోదు చేశాయి.. ఇన్‌పుట్ ఖర్చులు పెరగడం మరియు కోవిడ్ తర్వాత డిమాండ్ పునరాగమనం కారణంగా ఇళ్ల ధరలు 4-7 శాతం వరకు పెరిగాయని అన్‌రాక్ పేర్కొంది. అనరాక్ ప్రకారం, గృహాల విక్రయాలు ఏడు ప్రధాన నగరాల్లో దాదాపు 3.65 లక్షల యూనిట్లకు ఈ సంవత్సరం ఆల్-టైమ్ గరిష్ట స్థాయికి చేరుకున్నాయి, ఇది 2014 నాటి గరిష్ట స్థాయిని అధిగమించింది. ఇన్‌పుట్ ఖర్చులు పెరగడం మరియు కోవిడ్ తర్వాత డిమాండ్ పునరాగమనం కారణంగా నివాస ప్రాపర్టీల ధ బమయరలు 4-7 శాతం వరకు పెరిగాయని పేర్కొంది. భారతదేశంలోని టాప్ రెసిడెన్షియల్ ప్రైమరీ (ఫ్రెష్ సేల్) మార్కెట్‌ల డిమాండ్-సప్లై డేటాను విడుదల చేస్తూ ప్రాపర్టీ కన్సల్టెంట్ అనరాక్ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఏడు నగరాల్లో 2021లో 2,36,500 యూనిట్ల నుంచి హౌసింగ్ అమ్మకాలు ఈ ఏడాది 54 శాతం పెరిగి 3,64,900 యూనిట్లకు పెరిగాయని పేర్కొన్నారు.. ఢిల్లీ-ఎన్‌సీఆర్, ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ (MMR), చెన్నై, కోల్‌కతా, బెంగళూరు, హైదరాబాద్ మరియు పూణె టాప్‌లో ఉన్నాయి.
2014లో టాప్ 7 నగరాల్లో 3.43 లక్షల యూనిట్లు విక్రయం రికార్డు కాగా.. ఇప్పుడు ఆ రికార్డును బ్రేక్ చేసింది 2022.. ముంబై మార్కెట్ 2022లో అత్యధికంగా 1,09,700 యూనిట్ల అమ్మకాలను సాధించింది, తర్వాత ఎన్‌సీఆర్ 63,700 యూనిట్లకు చేరుకుంది. డేటా ప్రకారం, ఢిల్లీ-ఎన్‌సిఆర్‌లో గృహాల విక్రయాలు 2022లో 59 శాతం పెరిగి 63,712 యూనిట్లకు చేరాయి, అంతకుముందు సంవత్సరంలో 40,053 యూనిట్లుగా ఉన్నాయి. మహారాష్ట్రలో, ఎంఎంఆర్ మార్కెట్ 2021 క్యాలెండర్ ఇయర్‌లో 76,396 యూనిట్ల నుండి ఈ సంవత్సరం 44 శాతం పెరిగి 1,09,733 యూనిట్లకు చేరుకుంది, అయితే పూణేలో 35,975 యూనిట్ల నుండి 57,146 యూనిట్లకు 59 శాతం పెరుగుదల కనిపించింది. బెంగళూరులో గృహాల విక్రయాలు 2021లో 33,084 యూనిట్ల నుంచి ఈ ఏడాది 50 శాతం పెరిగి 49,478 యూనిట్లకు చేరుకున్నాయి. హైదరాబాద్‌లో గత ఏడాది 25,406 యూనిట్ల నుంచి 2022లో రెసిడెన్షియల్ ప్రాపర్టీల విక్రయాలు 87 శాతం పెరిగి 47,487 యూనిట్లకు చేరుకున్నాయి. చెన్నైలో నివాస గృహాల విక్రయాలు 29 శాతం పెరిగి 12,525 యూనిట్ల నుంచి 16,097 యూనిట్లు విక్రయించారు.. కోల్‌కతా మార్కెట్‌లో గతేడాది 13,077 యూనిట్ల విక్రయాలు ఉండగా, ఈ ఏడాది 62 శాతం పెరిగి 21,220 యూనిట్లకు చేరుకున్నాయి. టాప్ ఏడు నగరాల్లోని కొత్త లాంచ్‌లు 2021లో 2,36,700 యూనిట్ల నుంచి 2022లో 3,57,600 యూనిట్లకు 51 శాతం వృద్ధిని సాధించాయని అనరాక్ పేర్కొంది. సంవత్సరంలో మొత్తం కొత్త లాంచ్‌లలో దాదాపు 54 శాతం వాటా కలిగిఉన్నాయి. అనరాక్ గ్రూప్ ఛైర్మన్ మాట్లాడుతూ, పెరుగుతున్న ప్రాపర్టీ ధరలు, వడ్డీ రేట్ల పెంపు మరియు భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు మొదలైన వాటితో సహా అన్ని ఎదురుగాలులు ఉన్నప్పటికీ రెసిడెన్షియల్ రియల్ ఎస్టేట్‌కు 2022 అద్భుతమైన సంవత్సరంగా అభివర్ణించారు. 2022 ద్వితీయార్థంలో ఆస్తి వ్యయాలు మరియు వడ్డీ రేట్ల పెరుగుదల ఇళ్ల అమ్మకాలపై ప్రతీకూల ప్రభావాన్ని చూపుతుందని విస్తృతంగా అంచనా వేయబడినప్పటికీ, అక్టోబర్-డిసెంబర్ మధ్యకాలంలో 92,160 యూనిట్లు విక్రయించడం విశేషంగా చెప్పుకోవాలి.. అయితే, టాప్ 7 నగరాల్లో డిసెంబర్ త్రైమాసికంలో 23- అన్‌సోల్డ్ ఇన్వెంటరీ 1 శాతం క్షీణించి 6,30,953 యూనిట్లకు చేరుకుంది.
రకుల్ ఇంట విషాదం.. 16 ఏళ్ల బంధం ముగిసిపోయిందంటూ పోస్ట్
ప్రస్తుతం సమాజంలో మనుషులు.. పక్క మనుషుల మీదకంటే జంతువుల మీదనే ప్రేమను చూపిస్తున్నారు. అందులో కూడా తప్పు లేదు. మనుషులు ఎప్పుడు ఎలా ఉంటారో తెలియదు..కానీ జంతువులు ఎప్పుడు ఒకేలా ఉంటాయి. ముఖ్యంగా డాగ్స్ విశ్వాసానికి మారుపేరు. ప్రస్తుతం జనాలు వాటిని డాగ్స్ కూడా చూడడంలేదు.. తమ బిడ్డలను ఎంత ప్రేమగా చూసుకుంటున్నారో.. వాటిని కూడా అంతే ప్రేమతో చూసుకుంటున్నారు. ఇక సెలబ్రటీల గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సామ్ నుంచి చరణ్ వరకు నిత్యం పెట్స్ తోనే కనిపిస్తూ ఉంటారు. ఇక తాజాగా హీరోయిన్ రకుల్ ప్రీత్ ఇంట విషాదం చోటుచేసుకొంది. 16 ఏళ్ళ నుంచి తన సొంత తమ్ముడిగా పెంచుకుంటున్న డాగ్ మృతి చెందింది. దీంతో ఆమె ఎంతో ఎమోషనల్ కు గురి అయ్యింది. ఆ డాగ్ ను ఆమె ఎంత మిస్ అవుతుందో తెలుపుతూ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. “బ్లోసమ్ .. 16 ఏళ్ల క్రితం నువ్వు మా ఇంటికి వచ్చావ్.. నీతో పాటే నేను పెరిగాను.. ఇన్నిరోజులు ఎంతో సంతోషంగా జీవితాన్ని గడిపావ్.. అంతే సంతోషంగా కన్నుమూశావ్.. నేనెప్పుడూ మిస్ అవుతాను. నీ ఆత్మకు శాంతి చేకూరాలి.. నువ్ ఎక్కడున్నా బాగుండాలి” అంటూ పోస్ట్ చేసింది. ఇక ఈ పోస్ట్ పై పెట్ లవర్స్ తమదైన రీతిలో రకుల్ ను ఓదారుస్తున్నారు. తమ పెట్ పోతే ఎంత బాధగా ఉంటుందో తెలుపుతూ రకుల్ ను ధైర్యంగా ఉండాలంటూ కోరుతున్నారు.
‘వారిసు’, ‘తునివు’ ట్రైలర్స్ వస్తున్నాయి…
1990 నుంచి జరుగుతున్న తల అజిత్, దళపతి విజయ్ ల మధ్య బాక్సాఫీస్ వార్ జరుగుతూనే ఉంది. ప్రస్తుతం కోలీవుడ్ లో టాప్ హీరోస్ గా చలామణీ అవుతున్న ఈ ఇద్దరి హీరోల అభిమానుల మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనే అంత వైరం ఉంది. ఆన్ లైన్, ఆఫ్ లైన్ అనే తేడా లేకుండా మా హీరో గొప్ప అంటే కాదు మా హీరో గొప్ప అంటూ యుద్ధానికి దిగే విజయ్, అజిత్ ఫాన్స్ మరోసారి గ్రౌండ్ లెవల్ వార్ కి రెడీ అయ్యారు. అజిత్ నటిస్తున్న ‘తునివు’, విజయ్ నటిస్తున్న ‘వారిసు’ సినిమాలు 2023 సంక్రాంతి బరిలో నిలుస్తున్నాయి. రెండు భారి సినిమాలు ఒక్క రోజు గ్యాప్ లో థియేటర్స్ లోకి వస్తుండడంతో ఏ సినిమాకి ఎన్ని థియేటర్స్ ఇస్తున్నారు అనే దగ్గర నుంచి మొదలైన ఈ ‘రిలీజ్ వార్’లో రోజులు గడుస్తున్న కొద్ది హీట్ పెరుగుతోంది. మేకర్స్ కూడా వారిసు, తునివు సినిమాలని అగ్రెసివ్ గా ప్రమోట్ చేస్తున్నారు. బ్యాక్ టు బ్యాక్ పోస్టర్స్ ని, సాంగ్స్ ని రిలీజ్ చేస్తూ సినిమాలపై అంచనాలు పెంచుతున్నారు. వారిసు నుంచి ఒక సాంగ్ రిలీజ్ అయితే తునివు నుంచి కూడా ఒక సాంగ్ రిలీజ్ చేస్తున్నారు, ఇలా కాంపిటీటివ్ గా సాగుతున్న రెండు సినిమాల ప్రమోషన్స్ ఇప్పుడు ట్రైలర్ రిలీజ్ దగ్గర వచ్చి ఆగాయి. తునివు ట్రైలర్ కోసం అజిత్ ఫాన్స్ వెయిట్ చేస్తుంటే, వారిసు ట్రైలర్ కోసం విజయ్ ఫాన్స్ వెయిట్ చేస్తున్నారు. ఇద్దరు హీరోల ఫాన్స్ వెయిటింగ్ కి ఎండ్ కార్డ్ వేస్తూ న్యూ ఇయర్ సంధర్భంగా రెండు సినిమాల ట్రైలర్స్ బయటకి రాబోతున్నాయి. వీటిలో అజిత్ ‘తునివు’ డిసెంబర్ 31న బయటకి వస్తుండగా, విజయ్ ‘వారిసు’ ట్రైలర్ జనవరి 2న రిలీజ్ కానుంది. ఈ రెండు సినిమాల ట్రైలర్స్ యుట్యూబ్ ని షేక్ చేస్తాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పుడున్న బాక్సాఫీస్ ట్రెండ్ ప్రకారం రెండు సినిమాలు హిట్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. ఒకటి ఫ్యామిలీ డ్రామా కాగా మరొకటి యాక్షన్ ఎంటర్టైనర్ జానర్ లో రూపొందింది. సో ఏ జానర్ సినిమాని చూడడానికి ఆ జానర్ అభిమానులు ఎప్పుడూ రెడీగా ఉంటారు. వేరు వేరు జానర్స్ లో తెరకెక్కాయి కాబట్టి సినిమాలో విషయంలో ఉంటే రెండు సినిమాలు హిట్ అవుతాయి.