NTV Telugu Site icon

Top Headlines @ 5 PM: టాప్‌ న్యూస్‌

Top Headlines @ 5 Pm

Top Headlines @ 5 Pm

మరోసారి ఏపీ సీఎం హస్తిన బాట..
ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి మరోసారి హస్తిన వెళ్లనున్నారు.. రేపు ఢిళ్లీ వెళ్లనున్న ఆయన.. ఎల్లుండి వరకు అక్కడే గడపనున్నారు.. ఈ సారి తన పర్యటనలో ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశం కానున్నారు సీఎం జగన్‌.. రేపు సాయంత్రం ఢిల్లీకి బయల్దేరనున్నారు సీఎం.. రేపు సాయంత్రం ఐదున్నర గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరనున్న ఆయన.. ఆరు గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి ఢిల్లీకి బయలుదేరి వెళ్తారు.. ఇక, రాత్రి 8.15 గంటలకు ఢిల్లీకి చేరుకోనున్న సీఎం జగన్… రాత్రి 9.15 నిమిషాలకు 1-జన్ పథ్‌కు చేరుకుని.. రాత్రికి అక్కడే బసచేయనున్నారు. ఎల్లుండి ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశం కాబోతున్నారు ముఖ్యమంత్రి జగన్.. ఎల్లుండి మధ్యాహ్నం 12.30 గంటలకు ప్రధాని మోడీ అపాయింట్‌మెంట్‌ ఖరారైనట్టుగా తెలుస్తోంది.. ఈ సమావేశంలో.. పోలవరం ప్రాజెక్టుకు తుది అంచనాల ఆమోదం, కేంద్రం నుంచి పెండింగ్ నిధుల విడుదల, తెలంగాణ నుంచి విద్యుత్ బకాయిలు, రాష్ట్రానికి సంబంధించిన ఇతర అంశాలను పరిష్కరించాలని ప్రధానిని కోరనున్నారు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి.. కాగా, ఈ నెల మొదటివారంలోనూ ఢిల్లీ వెళ్లిన ఏపీ సీఎం.. ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన జీ20 సదస్సుకు సంబంధించిన సమావేశంలో పాల్గొన్నారు. ఇటీవల ప్రధానితో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌కు హాజరయ్యారు. ఇప్పుడు మంగళవారం సాయంత్రం ఢిల్లీ వెళ్లనున్న ఆయన.. బుధవారం ప్రధాని నరేంద్ర మోడీతో ప్రత్యేకంగా సమావేశం కానుండడంతో.. ప్రాధాన్యత ఏర్పడింది.

ఎమ్మెల్యేల ఎర కేసులో సీబీఐ విచారణకు హైకోర్టు ఆదేశం
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఎమ్మెల్యేల ఎర కేసులో తెలంగాణ హైకోర్టు తాజాగా కీలక తీర్పు ఇచ్చింది. సీబీఐ విచారణకు అనుమతి ఇచ్చింది. సిట్ విచారణను నిలిపివేస్తూ ఆదేశాలు జారీ చేసిన హైకోర్టు.. వెంటనే ఈ కేసును సిట్ నుంచి సీబీఐకి బదిలీ చేయాలని ఆదేశించింది. ఈ కేసు దర్యాప్తు వివరాల్ని సీబీఐకి అందజేయాలని పేర్కొంది. సుదీర్ఘ వాదనలు విన్న తర్వాత.. సిట్ విచారణ సరిగా జరగట్లేదన్న వాదనతో హైకోర్టు ఏకీభవించింది. ఈ నేపథ్యంలోనే ఈ ఎమ్మెల్యేల ఎర కేసు విచారణని సీబీఐకి అప్పగించాల్సిందిగా కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే.. సీబీఐతో విచారణ జరిపించాలని బీజేపీ వేసిన పిటిషన్‌ని మాత్రం న్యాయస్థానం కొట్టివేసింది. నందకుమార్, శ్రీనివాస్‌తో పాటు మరొకరు దాఖలు చేసిన పిటిషన్లకు అనుమతి ఇస్తూ.. ఈ తీర్పుని కోర్టు వెల్లడించింది. అయితే.. హైకోర్టు ఆదేశాలను సిట్ అప్పీల్ చేయబోతోంది.

జెడ్‌పీటీసీ మల్లేశం కేసులో ట్విస్ట్.. అర్థరాత్రి నుంచే ప్లాన్
సోమవారం ఉదయం వాకింగ్‌కు వెళ్లిన చేర్యాల ZPTC మల్లేశంను కొందరు గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసిన విషయం తెలిసిందే. లేటెస్ట్‌గా ఈ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఏడుగురు అనుమానుతుల్ని అదుపులోకి తీసుకున్నారు. ఇటీవల గుజ్జకుంట గ్రామంలో ఓ భూ పంచాయతీ చేసి తీసుకున్న నిర్ణయమే మల్లేశం పాలిట శాపంగా మారిందని పోలీసులు తేల్చారు. ఆ భూ పంచాయతీ జరిగినప్పటి నుంచే ప్రత్యర్థులు మల్లేశంపై పగ పెంచుకున్నారని గ్రామస్థులు చెప్తున్నారు. మల్లేశం హత్య వెనుక గుజ్జకుంట ఉప సర్పంచ్ సత్తయ్య, శ్రీను హస్తం ఉండొచ్చని బంధువులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మల్లేశం హత్యతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో.. గ్రామంలో పోలీసులు మోహరించారు. మరోవైపు.. మల్లేశంను చంపేందుకు అర్థరాత్రి నుంచే ప్రత్యర్థులు ప్లాన్ వేసినట్టు పోలీసులు పసిగట్టారు. ప్రతిరోజూ మల్లేశం వాకింగ్‌కి వెళ్లాడన్న సంగతి తెలిసిన ప్రత్యర్థి.. ఆ సమయంలో ఆయన్ను అంతమొందించేలా పక్కా ప్లాన్ వేసుకున్నట్టు తెలుస్తోంది. హత్య చేసిన ప్రాంతం సమీపంలోనే దుండగులు రాత్రి నుంచి మద్యపానం సేవించినట్టు.. అక్కడ పడున్న బాటిళ్లను చూసి తేల్చారు. ఇక ఉదయం మల్లేశం వాకింగ్ చేసుకుంటూ ఆ ప్రాంతం దగ్గరకు చేరుకోగా.. దుండగులు ఒక్కసారిగా ఆయనపై కత్తులు, గొడ్డళ్లతో దాడి చేశారు. రక్తపు మడుగులో పడి ఉన్న మల్లేశంను స్థానికులు గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. అపస్మారక స్థితిలో ఉన్న మల్లేశంనను తొలుత సిద్ధిపేట ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమించడంతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అయితే.. తీవ్ర రక్తస్రావం కావడంతో అప్పటికే మల్లేశం మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు.

మాస్క్ పెట్టాల్సిందే.. శానిటైజర్ పూసుకోవాల్సిందే.. ప్రజలకు సీఎం వార్నింగ్
ప్రపంచాన్ని మరోమారు కరోనా మహమ్మారి గడగడలాడిస్తోంది. వైరస్ బారిన వారి సంఖ్య భారీగా పెరుగుతున్న నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త సంవత్సర వేడుకలకు నిబంధనలు విధించింది. రాష్ట్రంలో తెల్లవారుజామున ఒంటి గంట వరకు నూతన సంవత్సర వేడుకలు కొనసాగుతాయి. దీనిని దృష్టిలో పెట్టుకుని రెస్టారెంట్లు, పబ్బులు, థియేటర్ హాళ్లు, పాఠశాలలు, కళాశాలలు వంటి మూసి ఉన్న ప్రదేశాల్లో మాస్క్‌లు ధరించడం తప్పనిసరి చేసింది. కోవిద్ గురించి భయాందోళన చెందాల్సిన అవసరం లేదంటూనే.. ఇప్పటి నుంచే తగు జాగ్రత్తలు తీసుకోవాలని కర్ణాటక ఆరోగ్య మంత్రి కే సుధాకర్ ప్రజలకు సూచించారు. గర్భిణీలు, పిల్లలు, వృద్ధులు, ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులు తప్పనిసరిగా బహిరంగ సభలకు దూరంగా ఉండాలని ఆదేశాలు జారీ చేసింది. శుభకార్యక్రమాల్లో పాల్గొనాలంటే ప్రభుత్వం అనుమతించిన సంఖ్య వరకే ఆహ్వానించాలని కోరింది. పాఠశాలల్లో శానిటైజర్ల వాడకం, ముఖానికి మాస్క్‌లు ధరించడం, పూర్తిగా టీకాలు వేయడం తప్పనిసరి చేసింది. సోమవారం సువర్ణ సౌధలో ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై మాట్లాడుతూ.. కోవిడ్ మహమ్మారిపై వ్యాక్సినేషన్‌ను, ఇన్‌ఫ్లుఎంజా లాంటి జబ్బులకు (ఐఎల్‌ఐ) పరీక్షలు నిర్వహించేందుకు సాంకేతిక సలహా కమిటీ సభ్యులను నియమించాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించినట్లు తెలిపారు.

మయాంక్‌ను కెప్టెన్ చేయొద్దు.. చేస్తే తప్పదు భారీ మూల్యం
ఇటీవల జరిగిన ఐపీఎల్ మినీ వేలంలో పంజాబ్ కింగ్స్ మాజీ కెప్టెన్ మయాంక్ అగర్వాల్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ రూ. 8.25 కోట్లకు సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే! ఈ నేపథ్యంలోనే అతడ్ని కెప్టెన్‌గా నియమించాలని ఎస్ఆర్‌హెచ్ యాజమాన్యం నిర్ణయం తీసుకుందని వార్తలు వస్తున్నాయి. కేన్ విలియమ్సన్‌ను రిలీజ్ చేయడంతో ఇప్పుడు ఆ జట్టుకి కెప్టెన్ లేకపోవడం, మయాంక్‌కి ఆల్రెడీ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన అనుభవం ఉండటంతో.. అతడినే కెప్టెన్ చేయాలని ఎస్ఆర్‌హెచ్ ఫిక్స్ అయినట్టు ప్రచారం జరుగుతోంది. అయితే.. అతడ్ని కెప్టెన్ చేయొద్దంటూ తాజాగా మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా బాంబ్ పేల్చాడు. ఒకవేళ అతడ్ని కెప్టెన్ చేస్తే, ఆ ఒత్తిడికి అతడు సరిగ్గా ఆడలేడని అతని అభిప్రాయం. మయాంక్‌ని కాకుండా భువనేశ్వర్ కుమార్‌ని కెప్టెన్ చేస్తే, బాగుంటుందని సూచిస్తున్నాడు. తన యూట్యూబ్ ఛానెల్‌లో ఆకాశ్ చోప్రా మాట్లాడుతూ.. ‘‘మయాంక్ ఒక గొప్ప ఆటగాడు. అతడు చాలా ఆడతాడు. కానీ.. అతడు కెప్టెన్‌గా ఉన్న సీజన్‌లో మాత్రం పరుగులు సాధించలేదు. కెప్టెన్సీ అనే బాధ్యత అతనిపై ఒత్తిడిని పెంచి, పరుగులు చేయనివ్వకుండా చేసింది. కాబట్టి, ఈసారి అతడ్ని కెప్టెన్ చేయొద్దు. ఒకవేళ కెప్టెన్ చేస్తే మాత్రం, అతడు ఆ ఒత్తిడికి పరుగులు చేయలేక, మునుపటిలాగే పేలవ ప్రదర్శనతో నిరాశపరిచే అవకాశం ఉంది. మయాంక్‌కి బదులు భువనేశ్వర్ కుమార్‌ని కెప్టెన్ చేయాలి. మయాంక్ కేవలం ఒక ఆప్షన్ మాత్రమే’’ అంటూ చెప్పుకొచ్చాడు. కాగా.. ఆకాశ్ చోప్రా చెప్పినట్లుగా గత సీజన్‌లో పంజాబ్ కింగ్స్ కెప్టెన్‌గా ఉన్నప్పుడు మయాంక్ పేలవ ప్రదర్శనతో తీవ్రంగా నిరాశపరిచాడు. మరోవైపు.. ఈసారి ఎలాగైనా ట్రోఫీ సాధించాలనే పట్టుదలతో ఉన్న ఎస్ఆర్‌హెచ్ యాజమాన్యం.. ఏరికోరి మరీ మినీ వేలంలో మయాంక్‌తో పాటు హ్యారీ బ్రూక్ (రూ.13.25 కోట్లు), హెన్రిచ్ క్లాసెన్ (రూ.5.25 కోట్లు)లను భారీ రేట్లకు కొనుగోలు చేసింది. మరి, ఈసారి సన్‌రైజర్స్ జట్టు ఎలా రాణిస్తుందో చూడాలి.

నటించకు.. నువ్వు నా నడుము చూసావ్..
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్ గురించి చెప్పాలంటే ఖుషి ముందు ఖుషి తరువాత అని చెప్పాలి. ఆయనకు ఉన్న ఫ్యాన్స్ భక్తులుగా మారడానికి కారణం ఆ సినిమా అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఖుషిలో పవన్ నటన, హావభావాలు, ఎమోషన్స్ ఒకటేమిటి టాలీవుడ్ లో పవన్ ను టాప్ హీరోగా నిలబెట్టిన సినిమా ఖుషి. ఎస్ జె సూర్య దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మరోసారి ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం రీ రిలీజ్ ల ట్రెండ్ నడుస్తున్న విషయం తెల్సిందే. ఇప్పటికే పవన్ తమ్ముడు, జల్సా సినిమాలురీ రిలీజ్ అయ్యి ప్రేక్షకులను మెప్పించాయి. ఇక తాజాగా ఖుషి వంతు. డిసెంబర్ 31 న ఈ సినిమా అభిమానుల ముందుకు రానుంది. దీంతో అప్పుడెప్పుడో రిలీజ్ అయిన ట్రైలర్ ను మరోసారి అభిమానుల కోసం రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఈ ట్రైలర్ నెట్టింట వైరల్ గా మారింది. సిద్దు సిద్దార్థ రాయ్ అంటూ పవన్ డైలాగ్స్.. ఏమే రాజహా అంటూ దేశభక్తిని తెలిపే గీతంతో సహా ట్రైలర్ లో అన్ని పొందుపరిచారు. ఇక ఖుషి అంటే గురొచ్చే నడుము సీన్ అయితే ఎప్పటికి హైలైటే.. నువ్వు నా నడుము చూసావ్ సిద్దు అని భూమిక అనగా.. లేదు.. నేను చూడలేదు అని పవన్ అమాయకమైన హావభావాలు అద్భుతం.. ఇక ఆలీ, పవన్ కామెడీ గురించి అసలు చెప్పనక్కర్లేదు. మణిశర్మ మ్యూజిక్, ఖుషి సాంగ్స్ ను ఎప్పటికీ మర్చిపోలేరు.. ఇక చివర్లో పవన్ ఐకానిక్ డైలాగ్.. నువ్వు గుడంబా సత్తిగారు కావొచ్చు.. తొక్కలో సత్తిగారు కావచ్చు.. బట్ ఐ డోంట్ కేర్.. బికాజ్ ఐయామ్ సిద్దు.. సిద్దార్థ రాయ్.. అంటూ ట్రైలర్ ను ముగించిన విధానం ఆకట్టుకొంటుంది. ఇక ఈ సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. మరి ఈ సినిమా రిలీజ్ రోజున ఫ్యాన్స్ చేసే హహంగామా ఎలా ఉండనుందో చూడాలి.

కొండారెడ్డి బురుజు దగ్గర అల్లూరి సీతారామరాజు షూటింగ్…
సూపర్ స్టార్ మహేశ్ బాబు నటించిన ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ అజయ్ చెప్పిన ‘కొండారెడ్డి బురుజు దగ్గర అల్లూరి సీతారామరాజుని చూసాను’ అనే డైలాగ్ ఘట్టమనేని అభిమానులకి కిక్ ఇచ్చింది. ఇప్పుడు ఇదే కిక్ ని అనుభవించడానికి మెగా అభిమానులు రెడీ అవుతున్నారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘RC 15’ షూటింగ్ కోసం చరణ్, కర్నూల్ వెళ్లనున్నాడు. రేపు కర్నూల్ లోని కొండారెడ్డి బురుజు దగ్గర, బురుజు పరిసర ప్రాంతాల్లో రామ్ చరణ్ కి సంబంధించిన సన్నివేశాలని తెరకెక్కిస్తున్నారు. ఈ విషయం బయటకి రావడంతో కర్నూల్ జిల్లా మెగా అభిమానులు చరణ్ కి గ్రాండ్ వెల్కమ్ చెప్పడానికి రెడీ అవుతున్నారు. ఇదిలా ఉంటే ‘RC 15’ లేటెస్ట్ షెడ్యూల్ రాజమండ్రిలో జరిగింది. ఈ షెడ్యూల్ లో చరణ్, శ్రీకాంత్ ల మధ్య కీలక సన్నివేశాలని షూట్ చేశారు. ఎన్నికల ప్రచారానికి సంబంధించిన సీన్స్ ని చిత్ర యూనిట్ సీక్రెట్ గా షూట్ చేస్తుంటే, లొకేషన్ లో ఉన్న మెగా అభిమానులు ఆనందం ఆపుకోలేక చరణ్ లుక్ తో పాటు, ఫ్లాష్ బ్యాక్ లోనే మెయిన్ పాయింట్ అయిన ఎలక్షన్స్ బ్యాక్ డ్రాప్ ని కూడా లీక్ చేసేశారు. ట్విట్టర్ లో ప్రస్తుతం ‘RC 15’ రాజమండ్రి షెడ్యూల్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. మెగా అభిమానులు ‘RC 15’ సెట్స్ నుంచి చరణ్ లుక్ ని లీక్ చెయ్యడం ఇదే మొదటిసారి కాదు, గతంలో జరిగిన వైజాగ్ షెడ్యూల్ నుంచి కూడా చరణ్ మోడరన్ లుక్ కి సంబంధించిన ఫోటోస్ తో పాటు ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ తో చరణ్ గొడవపడే వీడియోని కూడా లీక్ చేశారు. తమ హీరోని చూడాలి అనుకునే అభిమానం ఎంత ఉన్నా కూడా అది సినిమాకి నష్టం కలిగిస్తుందని తెలుసుకోని మెగా అభిమానులు కర్నూల్ షెడ్యూల్ నుంచి అయినా ‘RC 15’ లీక్స్ చెయ్యకుండా ఉంటారేమో చూడాలి.

ఆమెతో అడివి శేష్ ఎఫైర్.. మరోసారి బట్టబయలు..?
టాలీవుడ్ యంగ్ హీరో అడివి శేష్ వరుస సినిమాలతోనే కాదు వరుస హిట్లతో కూడా బిజీగా మారిపోయాడు. ఇటీవలే హిట్ 2 తో హిట్ అందుకున్న శేష్ ప్రస్తుతం గూఢచారి 2 సినిమామీద ఫోకస్ పెడుతున్నాడు. ఇక టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ లో శేష్ ఒకడు. ఎప్పుడు పెళ్లి గురించి అడిగినా ప్రభాస్ తరువాత అని చెప్పి తప్పించుకుంటూనే ఉంటాడు. అయితే ఎప్పటినుంచో శేష్ అక్కినేని అమ్మాయితో ప్రేమలో ఉన్నాడంటూ వార్తలు గుప్పుమంటున్న విషయం తెల్సిందే. ఆమె ఎవరో కాదు సుప్రియ యార్లగడ్డ.. అదేనండీ అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి అంటూ పవన్ సరసన నటించి మెప్పించిన సుప్రియ. గూఢచారి సినిమాతో సుప్రియ రీ ఎంట్రీ ఇచ్చింది. ఆ సమయంలో శేష్, సుప్రియలు రిలేషన్ లో ఉన్నారంటూ వార్తలు గుప్పుమన్నాయి. ఆ సమయంలో శేష్ స్పందిస్తూ సుప్రియ తనకు మంచి ఫ్రెండ్ అని ఇలాంటి గాసిప్స్ పుట్టించకండని కొద్దిగా ఘాటుగానే స్పదించాడు. ఇక అప్పటితో ఆ రూమర్ ముగిసిపోయింది. తాజాగా శేష్ షేర్ చేసిన ఫోటోతో మరోసారి ఆ రూమర్స్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారాయి. అక్కినేని క్రిస్టమస్ సెలబ్రేషన్స్ లో శేష్ భాగమయ్యాడు. ఎరుపు దుస్తులు ధరించి క్రిస్టమస్ ట్రీ వద్ద సుప్రియ పక్కన నిలబడి శేష్ ఫోజిలిచ్చాడు. దీంతో మరోసారి ఈ వార్త బయటకి వచ్చింది. ఈ ఫొటోలో అక్కినేని కజిన్స్ అందరు ఉన్నారు. సుమంత్, సుశాంత్, అఖిల్ తో పాటు సుప్రియ మరికొందరు కనిపించారు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. ఇక శేష్ కు అక్కినేని, ఘట్టమనేని, మెగా ఫ్యామిలీలతో మంచి అనుబంధం ఉంది. దీంతో వారందరు అప్పుడప్పుడు కలుస్తారు. అందులో తప్పేమి లేదు.. ఇవన్నీ వట్టి పుకార్లు మాత్రమే అని మరికొందరు చెప్పుకొస్తున్నారు. అసలు ఈ రూమర్స్ కు చెక్ పడాలంటే శేష్ పెళ్లి వార్త వినబడాల్సిందే. మరి ఈ ‘గూఢచారి’.. ‘ఎవరు’ ని తీసుకొచ్చి తన భాగస్వామిగా పరిచయం చేస్తాడో చూడాలి.