NTV Telugu Site icon

Top Headlines @ 5 PM : టాప్‌ న్యూస్‌

Ntv Top Hl 5pm

Ntv Top Hl 5pm

యశోద ఆస్పత్రికి రాకండి.. ప్రజలకు బీఆర్ఎస్ అధినేత విజ్ఞప్తి..
తన ఆరోగ్య పరిస్థితి గురించి తెలుకుసుకొని పరామర్శించడానికి యశోద దవాఖానకు తరలివస్తున్న ప్రజలకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ విజ్ఞప్తి చేసారు. తాను ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నానని.. త్వరలో సాధారణ స్థితికి చేరుకుని మీ నడుమకే వస్తానని.. అప్పడివరకు సంయమనం పాటించి యశోద దవాఖానకు రావొద్దని తనతో పాటు వందలాది మంది పేషెంట్లు హాస్పిటల్ లో ఉన్నందున మన వల్ల వారికి ఇబ్బంది కలగకూడదని ప్రజలను వేడుకున్నారు కేసీఆర్. తన పట్ల అభిమానం చూపుతున్న కోట్లాది ప్రజలకు కృతజ్ఞత తెలుపుతూ గద్గద స్వరంతో చేతులు జోడించి మొక్కారు. తనను చూడడానికి వచ్చి మీరూ ఇబ్బంది పడొద్దు.. హాస్పిటల్ లో ఉన్న పేషెంట్లను ఇబ్బంది పెట్టొద్దని పదే పదే వీడియో ద్వారా విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ప్రజలనుద్దేశించి ప్రత్యేకంగా ఓ వీడియోను విడుదల చేసారు.

ఎంఐఎం ఎమ్మెల్యేలతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎంఐఎం ఎమ్మెల్యేలతో సమావేశం అయ్యారు. ఈ భేటీలో ఆయన పాతబస్తీ అభివృద్ధితో పాటు అక్కడ చేపట్టే సంక్షేమం వంటి కార్యక్రమాలపై చర్చించినట్టు సమాచారం. అలాగే మూసీ అభివృద్ధి పనులపై కూడా రేవంత్ రెడ్డి చర్చించారు. కాగా ముఖ్యమంత్రిగా బాధ్యతలను చేపట్టిన తర్వాత ఆయన తొలిసారి గ్రేటర్ ఎమ్మెల్యేలతో సమావేశం అవ్వడం ప్రాధాన్యతను సంతరించుకుంది. అయితే ఈ సమావేశానికి ముందు ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ మాజీ సీఎం సీఎం కేసీఆర్‌ను పరామర్శించారు. ఇటీవల బాత్‌రూం కాలు జారి పడిపోయిన కేసీఆర్ యశోద ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే. కేసీఆర్‌ను కలిసిన అనంతరం ఎంఐఎం ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డి‌తో భేటీ కావడడం రాజకీయంగా చర్చకు దారి తీస్తోంది. ఇదిలా ఉంటే గ్రేటర్ హైదరాబాద్‌లో కాంగ్రెస్ ఒక్క స్థానం కూడా గెలవలేకపోయింది. బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం పార్టీలకే అన్ని స్థానాలు లభించాయి. దీంతో తొలుత ఎంఐఎం ఎమ్మెల్యేలతో సమావేశం కావడం రాజకీయంగా కూడా చర్చనీయాంశమైంది.

తెలంగాణ ఫలితాలకు మనకు సంబంధం లేదు..
ఏపీలో ఎన్నికల హీట్ మొదలైనట్లు కనిపిస్తుంది. ఇప్పటికే వైసీపీలో కొత్త ఇంఛార్జ్ ల నియామకం వ్యవహారం ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఈ క్రమంలో 11 అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయకర్తల మార్పుపై ఆ పార్టీ సీనియర్ నేత వైవీ సుబ్బారెడ్డి ఎన్టీవీతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఫలితాలకు మనకు సంబంధం లేదు.. మార్పులపై విపక్షాల విమర్శలను పట్టించుకోవాలిసిన అవసరం లేదు అని ఆయన వెల్లడించారు. వైఫల్యం ఒక్కటే ఇంచార్జ్ లు, ఎమ్మెల్యేల మార్పుకు కారణం కాదు అని వైవీ సుబ్బారెడ్డి వ్యాఖ్యనించారు. కొంత మందిపై వ్యతిరేకత ఉన్న మాట వాస్తవమే.. మార్పులు విషయంలో మొహ మాటమే లేదు అని ఆయన తేల్చి చెప్పారు. ఇద్దరు కలిసి పోటీకి వస్తున్నప్పుడు అందుకు తగ్గట్టుగా మార్పులు జరుగుతాయని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. మార్పులు చేయాల్సిన చోట ఖచ్చితంగా ఉంటాం.. చెప్పే చేస్తామని ఆయన పేర్కొన్నారు. ముఖ్యమంత్రి అయినా మంత్రి అయినా ముందు ఎమ్మెల్యే కావాల్సిందే.. కొన్ని సామాజిక వర్గాలకు అవకాశం కల్పించటం కోసం కొన్ని మార్పులు తప్పడం లేదు.. జగన్ మోహన్ రెడ్డిని మరోసారి ముఖ్యమంత్రి చేయాలంటే మార్పులు తప్పవు అని ఆయన వ్యాఖ్యానించారు.

ప్రభుత్వ ఆఫీసులను విశాఖకు తరలించడం లేదు..
విశాఖపట్నంకు ప్రభుత్వ కార్యాలయాలను తరలిస్తూ ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన జీవోను రద్దు చేయాలని కోరుతూ అమరావతి రైతు పరిరక్షణ సమితి నేతలు ఏపీ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ చేసింది. దీంట్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం న్యాయస్థాయంలో అఫిడవిట్ దాఖలు చేసింది. రాజధాని ఆఫీసులను వైజాగ్ కు ప్రస్తుతం తరలించడం లేదని చెప్పింది. ఆఫీసులు తరలిస్తున్నట్లు వస్తున్న ప్రచారం కేవలం అపోహ మాత్రమే అని ఏపీ హైకోర్టుకు సమర్పించిన అఫిడవిట్ లో జగన్ సర్కార్ స్పష్టం చేసింది. కాగా, ఈ పిటిషన్ ను త్రిసభ్య ధర్మాసనం ముందుకు పంపించాలని రిజిస్ట్రీలో ప్రభుత్వ న్యాయవాది అప్లికేషన్ ఇచ్చినట్లు పేర్కొన్నారు. దీంతో కేసు విచారణను వచ్చే సోమవారానికి వాయిదా వేయాలని ప్రభుత్వం తరపు లాయర్ కోరారు. కార్యాలయాల తరలింపుపై ఏపీ సర్కార్ నుంచి స్పష్టత ఇవ్వాలని నిన్న హైకోర్టు న్యాయమూర్తి ఆదేశించారు.. దీంతో కార్యాలయాలను తరలించడం లేదని ఉన్నత న్యాయస్థానానికి నేడు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సమాచారం ఇచ్చింది. అనంతరం కేసు విచారణను వచ్చే సోమవారానికి ఏపీ హైకోర్టు వాయిదా వేస్తున్నట్లు తెలిపింది.

శివరాజ్ చౌహాన్‌కి కన్నీటీ వీడ్కోలు.. సీఎం పదవికి రాజీనామా..
నాలుగు పర్యాయాలు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన శివరాజ్ సింగ్ చౌహాన్ తన సీఎం పదవికి రాజీనామా చేశారు. ఎంపీ సీఎంగా బీజేపీ అధిష్టానం మోహన్ యాదవ్‌ని ప్రకటించడంతో శివరాజ్ సింగ్ పాలనకు తెరపడిండి. ఈ రోజు జరిగిన వీడ్కోలు సమావేశంలో పలువురు మహిళలు ఆయనకు కన్నీటీ వీడ్కోలు పలికారు. వీడ్కోలు సమయంలో శివరాజ్ సింగ్‌ని పట్టుకుని పలువురు మహిళలు కన్నీటి పర్యంతమయ్యారు. సీఎం పదవిని విడిచిపెట్టవద్దని ఆయనను కోరారు. మీరంటే అందరికీ ఇష్టమని, మేం మీకే ఓటేశాం అంటూ మహిళలు వాపోయారు. సీఎం మోహన్ యాదవ్ నాయకత్వంలో బీజేపీ ప్రభుత్వం రాష్ట్రంలో కొనసాగుతున్న ప్రాజెక్టులను పూర్తి చేస్తుందని, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్తుందని అన్నారు.

కాశ్మీర్‌పై డ్రాగన్ కంట్రీ కీలక వ్యాఖ్యలు.. భారత్-పాక్‌లకు సూచన..
కాశ్మీర్ సమస్యపై డ్రాగన్ కంట్రీ చైనా కీలక వ్యాఖ్యలు చేసింది. జమ్మూకాశ్మీర్ స్వయం ప్రతిపత్తిని, ఆర్టికల్ 370ని రద్దును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్లపై సోమవారం సుప్రీంకోర్టు సంచలన తీర్పును వెల్లడించింది. ఆర్టికల్ 370 రద్దుపై కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని ఐదుగురు న్యాయమూర్తులు ధర్మాసనం ఏకగ్రీవంగా సమర్థించింది. అయితే ఈ తీర్పు తర్వాతి రోజే చైనా కామెంట్స్ చేసింది. కాశ్మీర్ సమస్యను భారత్-పాకిస్తాన్ దేశాలు చర్చల ద్వారా, సంప్రదింపుల ద్వారా పరిష్కరించుకోవాలని మంగళవారం సూచించింది. కాశ్మీర్ సమస్యపై చైనా వైఖరి స్పష్టంగా, స్థిరంగా ఉందని చైనా విదేశాంగ మంత్రిత్వశాఖ ప్రతినిధి మావోనింగ్ చెప్పారు.

సలార్ ఫస్ట్ సింగిల్.. సూరీడు వచ్చేది ఎప్పుడంటే.. ?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, శృతి హాసన్ జంటగా కెజిఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం సలార్. ఈ సినిమాను కకెజిఎఫ్ ను నిర్మించిన హోంబాలే ఫిల్మ్స్ నిర్మిస్తోంది. ఇక ఈ చిత్రంలో మలయాళ స్టార్ హీరో పృధ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన ట్రైలర్ ఎంతటి రికార్డులు సృష్టించాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పాన్ ఇండియా లెవెల్లో ఈ సినిమా డిసెంబర్ 22 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ చిత్రంలో రెండు సాంగ్స్ ఉంటాయని, అవి కూడా బ్యాక్ గ్రౌండ్ సాంగ్స్ అని ఇప్పటికే మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండగా.. లిరికల్ సాంగ్స్ ను రిలీజ్ చేస్తూ హైప్ పెంచాలని మేకర్స్ భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సలార్ నుంచి మొదటి సాంగ్ రిలీజ్ కు ముహూర్తం ఖరారు అయ్యింది. సూరీడు అంటూ సాగే ఈ సాంగ్ ను రేపు రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. కెజిఎఫ్ కు సంగీతం అందించిన రవి బసూరే సలార్ కూడా మ్యూజిక్ ను అందిస్తున్నాడు.